రెండు గంటల్ ఫిష్షు పడదామా?
Chapter 31 ಕನಸುಗಳನ್ನು ಕಾಣಲು ನೀ ಮಲಗಿದರೇ.. ನಿನ್ನ ಕನಸುಗಳು ಕೂಡ ಮಲಗೇ ಇರುತ್ತವೆ..
Kanasugalannu kanalu ni malagidare.. Ninna kanasugalu kuda malage iruttave
కి-సే (ఎవడు మమ్మీ, ఈడు?)!
సరే! సరే! విషయంలోకి వచ్చేద్దాం. కి-సే ఒక కమేడియన్. పెద్దగా పేరు ప్రఖ్యాతులుండవు. మన జబర్దస్త్ గేంగుకున్న పాప్యులారిటీ లేదు. ఏదో ఒక ప్రోగ్రామ్‌లో తన మానాన తాను కామెడీ చేసుకుంటూ ఆ చానల్ వాళ్ళు పడేస్తున్న నాలుగు చిల్లర రాళ్ళతో పొట్టపోసుకుంటుంటాడు. ఒకానొక సందర్భంలో విధి కాటేస్తుంది (లేకపోతే కథ నడవద్దూ). దాంతో ఉన్న ఆధారం కూడా పోవటంతో ఉంటున్న రూమ్‌కు అద్దె కట్టలేడు. కొన్నాళ్ళు చూశాక వెళ్ళగొట్టేస్తారు ఓనర్లు.
ఇక ఏమి చెయ్యాలో తెలియక కొరియన్ తట్టాబుట్టా పట్టేసుకుని ఇంటికి చేరతాడు కి-సే. ఇంటికి అంటే హోమ్ టౌన్ అని. అక్కడికెళ్ళాక తన మీద పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్నాయని తెలుస్తుంది. పైగా 15 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో గడిపాడు (కొరియన్లకు ఈ 15 అంటే fascination ఏంటో మరి). ఒక పెద్ద సంస్థకు బాస్‌గా మారాల్సి వస్తుంది. ఆ బాధ్యతలను, ఇతర బరువులను నెత్తినేసుకుని అతను పడే పాట్లు, మధ్యలో హీరోయిన్‌తో రొమాన్సు, విలనీయులతో సంఘర్షణ, ఎట్సెటరాదులమధ్య ఇది మన వారసుడొచ్చాడు కథలా ఉందే అనిపిస్తుండగా..
దాదాపు అదే కథ అని మనకు కన్ఫమ్ చేసే క్లైమాక్టిక్ ట్విస్టు.
బోలెడు కామెడీ, కడివెడు కన్నీరు, గుప్పెడు యాక్షన్, చిటికెడు త్రిల్ ఫేక్టర్, టీస్పూను మోతాదులో వైలెన్స్, ఉండీలేనట్లున్న క్రింజ్ (cringe).
ఇవన్నీ కలిపి చేసిన మసాలా వంటకం లాంటి సినిమా. మొన్న 2022 అక్టోబర్ 5న విడుదలైంది. భూమి బద్దలు కొట్టే కొత్త కథ కాదు. అసలెప్పుడూ చూడని narration style కూడా కాదు.
కాకపోతే, ముందు నుంచి చెప్పుకుంటున్నట్లు కొరియన్లు సినిమా తీయటంలో పెట్టే శ్రద్ధాసక్తులు, సినిమాను ఎలా తీయాలో అలాగే తీసే విధానం వల్ల చూస్తున్నంత సేపూ భలే మంచి సినిమా చూస్తున్న అనుభూతి కలిగిస్తుంది. అందుకే Autumn సమయంలో వచ్చిన వాసంత సమీరం అని పొగుడుతున్నారు. సినిమా అయితే మాంఛి రిపీట్ వేల్యూ ఉన్నది.
తన తల్లి మరణం తర్వాత తండ్రి బారి నుంచీ తప్పించుకునే ప్రయత్నంలో పెద్ద గొయ్యిలో పడటం, తన తండ్రి మరణానికి కారణమైన వ్యక్తిని గురించి తెలుసుకోవటం, మొదట ఒక సామాన్య కమేడియన్‌గా పెద్ద నగరంలో పడే కష్టాలు.. ఇవన్నీ మనను కథానాయకుడి పాత్రకు చేరువ చేస్తాయి.
కి-సే పాత్రలో Song Sae-byeok జీవించాడు. సెంటిమెంట్ కామెడీ సినిమాలకు బాగా పేరుపడ్డ సాంగ్ సే-బియోక్ తనకు అలవాటైన పాత్రలో అదరగొట్టాడు. ఇతనిదే 2015 లో వచ్చిన A Girl At My Door మరో మంచి సినిమా ఈ తరహా జాన్రాలో. ఇవి కాక మరికొన్ని యాక్షన్, త్రిల్లర్లలో సహాయక పాత్రలు పోషించాడు సాంగ్. వాటిలో ప్రముఖమైనవి Mother (2009), Seven Years of Night.
ఇంతకీ ఈ సినిమా పేరు చెప్పలేదు కదూ!
COME BACK HOME.
ఇంకో నాలుగైదు నెలలలో Netflix లో రావచ్చు. గుర్తుపెట్టుకుని చూడండి. తెలిసిన కథను సస్పెన్స్‌తో గెస్ చేయలేని సన్నివేశాల కూర్పుతో ఎలా చెప్పవచ్చో చెప్తుంది. ఏం గుర్తు పెట్టుకుంటాంలే అనుకుంటే ఏ నాని తోనో, మరో కుర్ర హీరోతోనే మనవాళ్ళు ఫ్రీమేక్ చేసే అవకాశాలు కొట్టిపడేయలేం.
అది కామెడీ అయినా, యాక్షన్ అయినా, థ్రిల్లర్ అయినా, సైఫై (Sci-fi) అయినా, ఇతరేతర హై కాన్సెప్ట్ అయినా, మనిషి అటెన్షన్‌ను ఏది ఎక్కువ సేపు పట్టి ఉంచుతుందో కొరియన్ filmmakers కు తెలుసు.
కరంట్ ఎఫైర్ల నుంచీ మళ్ళీ గతంలోకి వెళ్దాం.
Peppermint Candy తో నాకు కొరియన్ సినిమా పరిచయమైంది. విప్లవ్ కే (హితుడు సినిమాకు నంది అవార్డు అందుకున్నాడు + ప్రస్తుతం తెలుగు సినిమా దర్శకుడు) సలహా కామా సహాయంతో Oldboy గురించి తెల్సుకుని, నా కొరియానం మొదలు పెట్టిన రోజులవి.
Peppermint Candy సరే! Oldboy (దాని మీదుగా Sympathy for Mr. Vengeance, Sympathy for Lady Vengeance) కోసం వెతుకులాటలో City of Violence గురించి తెలుసుకున్నాను. వీటి గురించి మరింత వెతుకులాటలో ఉండగా ఒకానొక ఫోరమ్‌లో ఒక కుర్రాడు మొదలెట్టిన డిస్కషన్ నన్ను బాగా ఆకర్షించింది. హాలీవుడ్ కూడా అసూయ పడే స్థాయిలో కొరియన్లు తీసిన యాక్షన్ థ్రిల్లర్.
అంత గొప్ప సినిమా ఏముందబ్బా! నిజంగానే అంత ఉంటే కనీసం ఎక్కడోక్కడ గట్టి డిస్కషనే జరిగేది. కనీసం చూచాయగా అయినా ఆ సినిమా పేరు వినే వాళ్ళం కదా అనుకున్నాను.
ఎందుకంటే ఎక్కడో న్యూజీల్యాండ్‌లో తీసిన బ్రెయిన్ డెడ్, హెవెన్లీ క్రీచర్స్ లాంటి సంచలన సినిమాలు మరీ తీసిన రోజుల్లో కాకపోయినా, మేము నిక్కర్లేసుకుని తిరుగుతూ, ఎవరూ దింపాల్సిన అవసరం లేకుండా స్కూల్‌కు వెళ్ళగలిగే రోజులలో పోస్టర్ల రూపంలో అయినా తెలిసింది కదా. ఈ రెండూ లార్డ్ ఆఫ్ ద రింగ్స్, కింగ్ కాంగ్, ద హాబిట్ సినిమాలతో జేమ్స్ కేమరాన్ స్థాయిలో (visual extravaganza) పేరు తెచ్చుకున్న Sir Peter Jackson తన తొలి రోజుల్లో తీసిన పల్ప్ క్లాసిక్స్ ఇవి.
నాకు 2009 కాలానికి సినిమా మీద ఉన్న half-baked knowledge వల్ల ఈ సినిమా గురించి అలా అనుకున్నా, ఆ కొరియన్ ఫోరమ్‌లో చెప్పిన సినిమా నన్ను ఆకర్షించింది. పైగా Big Budget Action Thriller of Hollywood style అన్నది నన్ను వదలాలా.
వెంటనే నా కొరియానంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తున్న మిత్రుడిని అడిగాను. నాలుగు వారాలకు ఆ డీవీడీ అందింది. చూశాను. స్టన్ అయ్యాను.
SPOILER: సినిమా అయితే హాలీవుడ్‌ను మించి లేదు. Production values పరంగా.
Ends!
కానీ, హాలీవుడ్ సినిమాల్లో సాధారణంగా మిస్ అవుతున్న అంశం ఉంది. అదే genuine human emotions.
Hollywood సినిమాలలో హీరోలకు stakes అనేవి సాధారణంగా ఒక ఫార్ములా ప్రకారం ఉంటాయి. అవి కూడా సాధారణంగా single layered or at most two layered. ఎంతో గొప్ప క్లాసిక్స్‌గా ముద్ర పడిన సినిమాల్లో కూడా మల్టీలేయర్ stakes, emotional core ఉండవు.
ఈ మల్టీ-లేయర్ ఎమోషనల్ కోర్, multiple stakes ప్రధానాయుధంగా చేసుకుని వచ్చిన ఈ కొరియన్ సినిమా
SHIRI!
1999లో విడుదలైన ఈ సినిమాను అప్పటి భారీ బజట్ కొరియన్ సినిమాలకంటే 10 నుంచీ 12 రెట్ల అధిక బజట్ పెట్టి తీశారు. అంతకు మునుపు కొరియాలో అత్యధిక టికెట్లు తెగిన సినిమా టైటానిక్.
ఏ దేశ సినిమా చరిత్రలో అయినా ఒక విదేశీ సినిమాకు ఆ distinction ఉన్నదంటే ఆ దేశ సినిమా స్థాయి, మార్కెట్ ఎలాంటివో తెలుస్తుంది.
కానీ, కొందరు రిస్క్ చేశారు. చేస్తారు కూడా. లేనిదే వేవ్‌లు పుట్టవు కదా.
అందుకే Ayn అమ్మమ్మ అంటుంది కదా…
Throughout the history there were men who took first steps down new roads, not armed with weapons but their own vision.
అని. The Fountainhead లో కథానాయకుడి క్లైమాక్టిక్ స్పీచ్ లో.
అలా దర్శకుడు Kang Jae-gyu ఒక కల కన్నాడు.
ఇప్పుడు ఈ చాప్టర్ (31) పేరు చూడండి.
చూశారా? కన్నడలో ఉంది.
అది నాకు అత్యంత ఆప్తుడైన కన్నడ మిత్రుడు చెప్పిన మాట.
ఒకసారి (2017చివరి రోజులలో అనుకుంటా) అప్పడప్పుడే Paytm వినియోగంలోకి వస్తున్న టైమది. మా చిన్న టౌన్లలో. ఒకరోజు పొద్దున్నే ఫోన్ కాల్. ఒకటికి నాలుగు మిస్డ్ కాల్స్. ఏదైనా అర్జంట్ పనా? ఎవరై ఉంటారబ్బా అని కాల్ రిటన్ చేశాను. ఎవరో కన్నడలో హడావిడిగా మాట్లాడుతున్నారు. ఏతావాతా అర్థమయ్యింది ఏమిటంటే ఏదో పాల కేంద్రం. డబ్బులు ఇవ్వాలి.
నాకేం సంబంధం? ఏడ్నుంచీ అప్పా? అని అడిగితే మైసూరు. బాబూ మీ మైసూరులో మావూరు మూడో వంతు ఉండదు. ఊరోళ్ళం. పొద్దున్నే ఈ మేళమేంటి? నేను నీ దగ్గర పద్దు పెట్టటమేమిటి అని అడిగాను.
వాడేమో కన్నడలో పోట్లాట. నాకేమో తెలుగు కూడా రాదాయే? ఏదో బట్లరింగ్లీషులో మేనేజ్ చేస్తున్నాను. కాల్ కట్ చేసి ఇక లిఫ్ట్ చేయలా. మధ్యాహ్నం వరకూ ఫోన్ స్విచాఫ్ చేసి ఉంచాను. ఎటూ మిస్డ్ కాల్ ఎలర్ట్స్ వస్తాయి కనుక. తర్వాత ఆన్ చేస్తే ఒక ఎసెమెస్.
సారాంశం… పొద్దున పాల కేంద్రంలో ఆ నెల పాల డబ్బులు కట్టటంలో పొరబాటున ఒక అంకె ఏదో తప్పు పడి ఆ డబ్బులు నాకు వచ్చాయని. ఆయనేదే హడావుడిలో ఉండి నా నంబర్ ఇచ్చి నువ్వే మాట్లాడుకో అన్నాననీ, నాకు ఇబ్బంది ఏమన్నా కలిగిందా అని.
నాకు ఫస్ట్ డేట్ నాడు మహేశ్ బాబు స్పైడర్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ఏం చెప్పాలి? ఏం మాట్లాడాలి? మైండ్‌లో కలుగుతున్న ఫీలింగ్ ఎవడ్రా నువ్వు? వదిలేసెళ్ళిందే కాక ఏమన్నా ఇబ్బంది కలిగిందా ట!
Longman నుంచీ Merriam-Webster వరకూ Oxford మీదుగా అన్ని dictionary లు తిరగేసి, ఒక గంట అనర్గళంగా మాట్లాడేందుకు తగ్గ Angry Speech ఇంగ్లీషులో, అమరం నుంచీ ఆంధ్రభారతి వరకూ తెలుగు నిఘంటువులు తిరగేసి తెలుగులోనూ (పొరబాటున ఆ వ్యక్తి మన తెలుగూఫైతే అనే అనుమానంతో) రాసుకుని, ఫోన్ చేస్తే అవతల నుంచీ చాలా సౌమ్యమైన స్వరం.
నేను హలో అని కూడా అనకుండానే, తన గురించి క్లుప్తంగా పరిచయం చేసుకుని, పొద్దున అలా చేయటానికి కారణం చెప్పి, షాప్ వాడికి మళ్ళా నేనే కట్టేశానని చెప్పారు. ఆ పైన పదే పదే నాకు కలిగిన ఇబ్బందికి సారీ కూడా చెప్పారు. వీలుంటే ఎమౌంట్ రిటన్ కొట్టమని అడిగారు.
నేను కూడా ఎవరో పెద్దాయన, పైగా వివరం చెప్పారు. నిజంగానే హడావుడి మేటర్ కనుక పెద్దగా పొడిగించక, నాకు పేటిఎమ్ పెద్దగా అలవాటు లేదు. నా తిప్పలు నేను పడతాను. మీ ఎకౌంట్ వివరాలు ఇస్తే ఎమౌంట్ పంపిస్తాను అన్నాను.
అలా ముగిసింది. ఆయన పేరు అవీ విచిత్రంగా ఉన్నాయి. ఏదో మామూలుగా ఫేస్బుక్ లో సెర్చ్ చేస్తే వారి వివరాలు తెలిశాయి. అప్పటికి రిటైరైనా, చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి (లేకపోతే డబ్బుల సంగతి నువ్వే చూసుకో అంటే షాప్ వాడు ఊరుకోడు). పైగా చాలా మర్యాదస్థుడు అని అర్థమైంది.
ఆ తర్వాత 2018 ఏప్రిల్‌లో ఉద్యోగ విధిలో భాగంగా మైసూరు వెళ్ళినప్పుడు సరదాగా కాల్ చేశా. ఏమంటారో? అసలు గుర్తుంటుందో లేదో అనుకుంటూనే. ఫోన్ రింగ్ అయింది కానీ, కాల్ ఎటెండ్ కాలేదు. కాసేపటికి కాల్ రిటన్ చేశారు. సరదాగానే చేశాను అని చెప్పినా ఇంటికి ఆహ్వానించి ఆదరంగా చూశారు. ఆయన లైబ్రరీ అవీ చూపారు. వచ్చినప్పుడు కలుస్తుండమని కూడా అన్నారు.
అలా మొదలైన స్నేహం బాగానే సాగుతోంది. ఆయన ద్వారా కన్నడ సాహిత్యం, సినిమా (రాజ్ కుమార్, పీబీ శ్రీనివాస్ అభిమాని) గురించి చాలా విశేషాలు తెలిశాయి. వాళ్ళ అబ్బాయి మార్వెల్‌లో పనిచేస్తున్నారట. ఆ విషయం చెప్తూ చెప్పిన మాటలు.. ఈ అధ్యాయం (31) టైటిలు.
నాకు అర్థం తెలుసు. మీరు కూడా ప్రయత్నించండి.
అలా కలలు కంటూ నిద్ర పోకుండా, ఆ కలలు నిజం చేసుకునేందుకు తపన పడి, పోరాడి, అవకాశం చేజిక్కించుకుని మరీ దర్శకుడు కాంగ్ జే-గ్యు తీసిన సినిమా షిరీ. కొరియన్ ప్రకారం నిజానికి Swiri అనాలట.
విదేశీ మార్కెట్లలో షిరీ అనీ, స్వదేశంలో స్విరీ అనే టైటిల్ తో రిలీజైన ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నా కొరియన్ మిత్రుడు ఈమధ్య చెప్పిన వివరాల ప్రకారం ఈ సినిమా చూడని కొరియన్ ఉండకపోవచ్చట.
ఎప్పటిలాగే నేను అడిగిన ప్రశ్న: ఇప్పుడే పుట్టిన శిశువులు కూడానా?
You should be into your mid-thirties now, your sense of humour didn’t wane. Surprising considering the current situations. Wish I too have such mind duckingly lighter vein lifestyle అన్నాడు.
నా లోపలేం జరుగుతోందో ఆయనకేం తెలుసు. Anyway… కొరియన్లకు ఈ సినిమా అంటే పిచ్చ ఇష్టం.
ఇంతకీ షిరీ అంటే కొరియా ద్వీపకల్పం మంచినీటి కాల్వలలో (స్వచ్ఛమైన నదులలో) మాత్రమే దొరికే ఒకరకమైన చేప ట!
ఈ సినిమాలో ఒక పాత్ర ఈ చేపల గురించి చెప్తూ: “వీటిని చూడు. ఉత్తర కొరియాలో మొదలైన నదులు దక్షిణ కొరియాలో పారుతున్నాయి. ఇక్కడి కాల్వలు అటూ వెళుతున్నాయి. ఈ నీరు చూస్తే ఏ దేశం నుంచీ వచ్చిందో ఎవరు చెప్పగలరు? ఈ చేపలకు మాత్రం తెలుసు కనుకనా? ఎంత స్వేచ్ఛగా మన భూభాగాలలో తిరుగుతున్నాయి. మనం మనుషులమైనా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా అని కొట్టుకు చస్తున్నాం.”
అంటుంది. ఇటు సింధూ నది, అటు గంగా బ్రహ్మపుత్రా గుర్తొచ్చాయి.
కొరియా సినిమాలో ఇప్పటి Superstar.. మన చోయ్ మిన్-సిక్, కొరియన్ సినిమా క్రమంగా ఆర్థిక సంస్కరణల తరువాత రివైవ్ అవుతన్న కాలానికి, కొరియన్ వేవ్ మొదలు కావటానికి మధ్య వారధి లాంటి కాలంలో superstar గా వెలుగొందిన Han Suk-kyu ప్రధాన పాత్రలు.
Choi Min-sik gained a huge fan following post this film just like Yash Gowda after KGF. హన్ సుక్-క్యు అయితే జస్టలా తెర మీద కనిపించి చెయ్యి ఊపితే చాలు మిలియన్లు కుమ్మరించేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు. అంత స్టార్డమ్.
కొరియన్ అమెరికన్, Lost అనే సీరీస్ ద్వారా బాగా పేరు తెచ్చుకున్న Yunjin Kim anti-heroine గా అదరగొట్టింది.
అప్పుడప్పుడే ఎదుగుతున్న నటుడు, ప్రస్తుత superstar (చోయ్ అంత కాదు) అయిన Song Kang-ho (Snowpiercer, Parasite) ఈ సినిమాలో ఒక సహాయ పాత్రలో మెరిసాడు. చోయ్, హన్ లాంటి వాళ్ళు theatre background నుంచీ వస్తే, ఇతను మాత్రం నటనలో ఏ రకమైన శిక్షణా తీసుకోకుండానే వచ్చి స్టార్ అయ్యాడు.
షిరీ కథా కమానిషూ వచ్చే వారం.
Chapter 31 Epilogue
పైన చెప్పిన Paytm సంఘటన నిజంగానే జరిగింది. ఇలాంటి సంఘటనలు ఆధారంగా చేసుకుని మూడు గొప్ప కొరియన్ సినిమాలు వచ్చాయి.
నిజ జీవిత సంఘటనలే చాలా కొరియన్ సినిమాలకు సరుకు. వాటికి హై కాన్సెప్ట్ కలిపి సినిమాలుగా తీస్తారు.
దసరా ముగిసింది. చిరంజీవి గాడ్‌ఫాదర్‌తో మమ అనిపించుకున్నాడు. కన్నడ సినిమా కాంతారా అదిరిపోయింది. చూసే అవకాశం వస్తే చూసేయండి.
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ? 🙂
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య