[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘కోరికల గుర్రం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
కోరికల గుర్రం పరిగెడుతోంది
కళ్ళెం వేసినా ఆగదు!
సొంతం అనుకుంటే
ఎంతో హాయి
కానీ అది ఆసాంతం
అది నిలిచేనా
ఇవాళ మనదైనది
రేపటికి ఇంకెవరిదో కదా
పగటి వెలుగులు చిమ్మే
సూరీడు సాయంత్ర సమయాన
కానరాడు కదా
చల్లని జాబిలి కూడా
వేకువ జామున
వెల వెల పోవలసిందే కదా
తళ తళలు ఎపుడూ
మోసం చేస్తూనే వుంటాయి
అందమైనది అంటే
అందనిదీ అని కూడా అర్థం
ఒక వేళ అందినా
ఏదో రోజు
చేజారడం ఖాయం
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.