[శ్రీ రాజ మోహన్ ఇవటూరి గారు రచించిన ‘కొసమెరుపు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
రోడ్డు మీద నిల్చుని టాక్సీకోసం ఎదురుచూస్తున్నాడు దిలీప్. మూడు టాక్సీలు క్యాన్సల్ చేసాక ఇది నాలుగవది. బుకింగులో ఉన్న టాక్సీ నెంబరుతో దూరంగా ఒక నల్ల కారు కనిపించగానే ‘హమ్మయ్య.’ అనుకుని ఆ టాక్సీకి ఎదురెళ్లి చేయి చూపించాడు.
డ్రైవింగ్ సీటులో కూర్చున్న అందమైన యువతిని చూసి ఆశ్చర్యపోయాడు. టాక్సీ నడిపే చోట అమ్మాయిని ఊహించని దిలీప్ తత్తరపడుతుంటే ఇదంతా మామూలే అన్నట్టు ఆమె ముందువైపు డోర్ తెరిచి “కూర్చోండి. నా పేరు హేమ.” అంది.
కారు కదిలాక “అమ్మాయి టాక్సీ నడపటం మొదటి సారి చూస్తున్నానండి.” అన్నాడతను.
“నడపకూడదంటారా?” నవ్వింది.
“ఛాఛా. అలాంటిదేమీ లేదండి. స్త్రీలు చెయ్యలేనిదేముంది? అరబ్బు దేశాలలో అయితే ట్రక్కులే నడుపుతున్నారు. ఇక్కడ నేనెప్పుడూ చూడలేదు కదా అని ఆశ్చర్యపోయాను.”
“అవసరం అన్నీ నేర్పిస్తుంది.” అందామె ముక్తసరిగా.
“నిజమేనండి. కానీ ఇది కూడా ఒక వృత్తే కదా! డిగ్నిటీ అఫ్ లేబర్ అని అందరూ అంటారు. అయినా కొన్ని పనులు అందరికీ నామోషీగా ఉండేవి. ఇప్పుడైతే నా టీంలోనే చాలా మంది ప్రోగ్రామర్లు జొమాటోలలో, ఓలాలలో పార్ట్ టైం చేసి నెలకు ఏభై వేల వరకూ అదనంగా సంపాదిస్తున్నారు.” నవ్వాడతను.
“మీ పని పాడవ్వనంత కాలం, కష్టపడి ఇంకొంచెం సంపాదించుకుంటే తప్పేముందండి. కానీ ఈ సంపాదనలో ఖర్చులు కూడా ఉంటాయి.”
“అవును! పెట్రోలు, రిపేర్ ఖర్చులు ఉంటాయి. నేను చెప్పేది ఆ ఖర్చులు మినహాయించుకున్నాకే.”
“నాకయితే స్వంత బండి కూడా కాకపోవటం వలన ఖర్చులు ఎక్కువ. సంపాదనలో నలభై శాతం కారు యజమానికి ఇవ్వాలి. చిన్న చిన్న రిపేర్ల ఖర్చు నాదే.”
“ఇదేదో దారుణమైన ఒప్పందంలా ఉంది. ఎలా ఒప్పుకున్నారు?”
ఆమె ఏమీ జవాబు చెప్పకపోతే ఆమెకి ఈ చర్చ ఇష్టం లేదని అర్ధం చేసుకుంటూ ”కొంచెం త్వరగా తీసుకుపోతారా? నాకు క్లాసులు మొదలయిపోతాయేమో.” అన్నాడు.
‘ఉద్యోగం చేస్తున్నవాడికి క్లాసులేమిటి’ అనుకున్నా నాకెందుకులే అని సద్దుకుని “ట్రాఫిక్ ప్రకారమే వెళ్ళగలమండి. అర్జెంటు పనులుంటే మీరు ముందే తయారవ్వాలి. అతివేగం మనిద్దరికీ ప్రమాదమే.” అంది.
“అదీ నిజమే. కానీ నేను త్వరగానే బయలుదేరాను. కానీ మీకు ముందు ముగ్గురు కెప్టెన్లు కాన్సల్ చేశారు.” అన్నాడతను గిల్టీగా.
“సర్లెండి. నా ప్రయత్నం చేస్తాను.” అంటూ కొంచెం వేగం పెంచిందామె.
అరగంటలో సరిగ్గా ఇన్‌స్టిట్యూట్ గేటు ముందు టాక్సీ ఆగింది. “మీ డ్రైవింగ్ సూపరండీ. అయిదు నిముషాలు ముందే గుమ్మం దగ్గర దింపారు. అలా అని ఎక్కడా రాష్ డ్రైవింగ్ లేదు.” అని టాక్సీలోంచి దిగుతూ ఒక పెద్ద చాకోబార్ ఆమెకి ఇచ్చాడు. ఆమె ఆశ్చర్యపోతూ వద్దని చెప్పేలోపల “సమయానికి చేర్చినందుకు నా కానుక.” అని గేటు వైపు నడిచాడు.
“నేనే మగ కెప్టెనయితే గిఫ్టులు ఇచ్చేవాడా? ఈ మగాళ్ళూ..” అని నిట్టూర్చి ఆమె టాక్సీని నడిపించింది.
***
రెండు రోజుల తర్వాత అదే చోట పికప్పుకి వెళ్ళింది హేమ.
“అరె! మళ్ళీ మీరే రావటం బావుంది. మీరు డ్రైవింగ్ బాగా చేస్తారు.” అంటూ టాక్సీ ఎక్కాడు దిలీప్.
ఈ రకం పొగడ్తలు, ప్రేమపూర్వకమైన సంభాషణలు ఆమెకి మామూలే. ఇంటి ఓనర్ విపరీతంగా సానుభూతి చూపిస్తూ అద్దె లేటైనా పరవాలేదు వేరేరకంగా సద్దుకోవచ్చు అంటాడు. ఎదురింటి కుర్రాడు తనకి డ్రైవింగులో సాయం చేస్తానని ఎంతో చిత్తశుద్ధితో చేయూత ఇవ్వాలని ప్రయత్నిస్తాడు. కారు యజమాని ఎందుకింత కష్టం హాయిగా పెళ్లి చేసుకో అని ఎంతో జాలితో రెండర్ధాలతో మాట్లాడతాడు. అన్నింటికీ వెనక ఆలోచనలు ఆమెకి తెలుసు. ఆడదానికి ఇలాంటివన్నీ ఎదుర్కునే వరం దేవుడే ప్రసాదిస్తాడు.
అందుకే చిన్న నవ్వు నవ్వి “ఈ అరగంట ప్రయాణానికి కెప్టెన్ ఎవరైనా ఏముందిలెండి.” అంది.
“అందరు కెప్టెనులూ మీలా ఎలా ఉంటారు?” అని నవ్వాడతను.
“కస్టమర్లు కూడా అందరూ మీలా ఉండరు లెండి.” అంది ఆమె కూడా.
“ఇది తిట్టా పొగడ్తా?” అని నవ్వేసాడు. టాక్సీ దిగే ముందు మళ్ళీ గిఫ్ట్ ఇచ్చాడు. ఆమె వద్దనేలోపు వడివడిగా వెళ్ళిపోయాడు.
ఆమె నిట్టూర్చి ముందుకు కదిలింది.
***
“రోజూ మీరే తీసుకుపోవచ్చు కదా.” అన్నాడు ఒకరోజు. ”నాకు రోజంతా కలిపి మూడు నాలుగు చోట్లకి వెళ్లే పని ఉంటుంది. ప్రతిసారీ టాక్సీ బుక్ చేసుకోవటం ఆ హంగామా అంతా ఇబ్బందిగా ఉందండి.అదే మీరే రోజూ వస్తే హాయిగా ఉంటుంది.”
“రోజుకి నాకు చాలా ఎక్కువ రైడ్స్ వస్తాయి. అవన్నీ ఎలా వదులుకుంటాం?” అంది.
“మీరు రోజూ ఎంత సంపాదిస్తారో చెప్పండి. నేనే ఇస్తా. ప్లీజ్! మీరు వస్తే టాక్సీ టెన్షన్ లేకుండా నేను పని చేసుకోవచ్చు” అన్నాడు.
ఆమె సంశయిస్తూ “ఆలోచించి చెప్తాను.” అంది. అతను రెట్టించలేదు.
అతను ప్రతిసారీ ఇలా బహుమతులివ్వటం, నువ్వే కెప్టెనుగా రావాలి అని పదేపదే అడగటం ఆమెకి చాలా ఇబ్బందిగా ఉంది. తప్పనిసరిగా టాక్సీ నడుపుతోంది. వచ్చే సంపాదనలో చాలా భాగం యజమానికి, టాక్సీ అద్దెలకీ పోయాక మిగిలే ఆ కాస్త డబ్బులతో తల్లి, తనూ, తమ్ముడూ బ్రతుకుతున్నారు. ఇప్పుడు ఈ గోలేమిటి? అని చికాకు పడింది.
“మళ్ళీ ఇతనితో రైడ్ వచ్చినా రెజెక్టు చేసేస్తే మంచిది.” అనుకుంది.
***
మళ్ళీ రైడ్ అతని దగ్గరికే వచ్చింది. ఇంట్లో అవసరాల ముందు ఆమె ఆవేశం తగ్గిపోవటం వలన రైడ్ యాక్సెప్ట్ చేసింది. పైగా అక్కడే మరో కస్టమరుని డ్రాప్ చేస్తోంది మరి.
“మీరు వద్దనుకున్నా మనం అప్పుడప్పుడు కలుస్తున్నాం. ఈసారి ఇంకెవరినో ఇక్కడే డ్రాప్ చేసినట్టున్నారు” అన్నాడు నవ్వుతూ.
అవునన్నట్టు తలాడించి ఊరుకుంది. ఆమెకు ఎన్నో కారణాల వలన చికాకుగా ఉంది. అతనేం అర్ధం చేసుకున్నాడో గానీ మళ్ళీ మాట్లాడలేదు.
వెళ్తున్న దారిలో “ఇక్కడ ఒకసారి ఆపండి” అన్నాడు. అదొక పెద్ద ఫార్మా కంపెనీలా ఉంది. అతను లోపలికెళ్ళి కొంత సేపటి తర్వాత ఒక ప్యాకెట్టుతో వచ్చాడు.
గమ్యం చేరాక దిగుతూ ఆ పాకెట్ ఆమెకి ఇస్తూ “ఇది ఉంచుకోండి. లోపల పెప్పర్ స్ప్రే బాటిల్స్ పది ఉంటాయి. ఒక్కొక్కటీ బలమైన ఆయుధం. ఎవరు హద్దులు మీటినా మీకు అండగా ఉంటుంది.” అన్నాడు.
ఆమె నిర్ఘాంతపోయింది. తను డ్రాప్ చేసిన కస్టమర్ కొంచెం మొరటుగా మాట్లాడటం, ఆమె లేటుగా తీసుకొచ్చిందని కోపంగా ఆమె జబ్బ పట్టుకుని లాగటం అతను గమనించాడన్న మాట. ఆ సంఘటన గమనించినా ప్రస్తావించకుండా ఎంతో సున్నితంగా ప్రవర్తించిన అతని సంస్కారానికి మొదటి సారి అతనిపై గౌరవం కలిగింది.
“ఇవి ఎందుకు ఇచ్చారో నాకు తెలుసండీ. థాంక్స్.” అని మనస్ఫూర్తిగా అంది.
“థాంక్స్ ఎందుకండీ. తరుచుగా కలుసుకుంటున్నాం. ఒకరికొకరు కుదిరిన సాయం చేసుకుంటాం. ఆ ఫ్యాక్టరీ ఓనర్ నా మిత్రుడే. అందుకే వాడినడిగి తీసుకున్నా.” అన్నాడు.
అతనికి నిశ్శబ్దంగా ఉండటం ఇష్టం ఉండదు కాబోలు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఒకసారి అతని వైపు ఓరగా చూసింది. ఆరడుగుల పొడుగు. చక్కగా దువ్విన ఒత్తైన జుట్టు. నున్నగా గీసిన గడ్డంతో అందంగానే ఉన్నాడు.
“ఏమిటండీ ఆలోచిస్తున్నారు?” అని అతను అంటుంటే ఆలోచనల్లోంచి బైట పడింది.
“ఏమీ లేదు. మీరేదో ఉద్యోగంలో పెద్ద పదవిలోనే ఉన్నారు కదా. ఈ క్లాసులేమిటి?” అంది.
“అదా!” అని నవ్వేసాడు. “ఎవరి కష్టాలు వాళ్ళవండి. నాకు సివిల్ సర్వీసెస్ చెయ్యాలని ఉంది. కానీ ఇంట్లో ఇష్టం లేదు. వ్యాపారం చూసుకోమంటారు. అందుకని ఇలా రోజూ పొద్దున్నే ఈ క్లాసులకు వెళ్లి తర్వాత ఆఫీసుకి వెళ్తున్నాను. సరైన సహకారం లేకపోతే ఇలాంటివి సాధించటం కష్టం.” అన్నాడు.
ఆమె నవ్వేసి “మా అమ్మకేమో చదివించాలని ఉన్నా మాకు కుదరదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సమస్య” అంది.
“అయ్యో. మీరెందుకు చదువుకోవటం లేదు?”
“నాన్న చనిపోయాక నేను చదువు ఆపి పనిలో చేరవలసి వచ్చింది. తమ్ముడింకా చిన్నవాడు.”
“అయితే వినండి. నా దినచర్య ఇది. హోటలు నుంచి చాప్టర్. అక్కడ రెండు గంటలు, తర్వాత ఆఫీసుకి వెళ్తాను. సాయంత్రం ఆఫీస్ నుంచి హోటల్లో దింపేస్తే చాలు. మీరు రోజూ నాకే పనిచేస్తే ఖాళీ టైమంతా హాయిగా చదువుకోవచ్చు.” అన్నాడు.
ఆమె ఇంకా ఆలోచనలో ఉంటే “ఇది ఇద్దరికీ బావుండే ఒప్పందమండి. నా రోజువారీ కదలికలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకు ఒక వాహనం కావాలి. మీరయితే చక్కగా తీసుకువెళ్తున్నారు కనుక మిమ్మల్ని అడుగుతున్నాను. మీకేమో చదువుకోవటానికి అనువుగా ఉంటుంది.” అన్నాడు.
లోలోపల ఇలా జరిగితే బావుంటుందని అనుకుంటూ “మా వాళ్ళని కనుక్కుంటాను.” అంది.
తర్వాత కూడా కొన్ని సార్లు ఆమె టాక్సీలో అతను ఎక్కటం జరిగింది. ప్రతిసారీ మాటలు కలుపుతూనే ఉంటాడు. ఆమె కూడా పట్టు సడలించి అతనితో సరదాగా మాట్లాడటం మొదలెట్టింది.
***
ఆరోజు కూడా దిలీప్‌తో రైడ్ వచ్చింది.
కానీ ఆమెకి చికాగ్గా ఉంది. ఫోనులో కారు ఓనర్ చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. డబ్బులు సరిపోవంటాడు. వేరే ఏర్పాటు చెప్పాను కదా ఎందుకు ఒప్పుకోవు అని పరోక్షంగా ఆమెకి వేరే సూచనలు ఇస్తున్నాడు.
దిలీప్ ఆమె పరిస్థితి గమనించి మౌనంగా ఉన్నాడు.
టాక్సీ దిగుతున్నపుడు మాత్రం ఆమె చేతిలో ఒక బాక్స్ పెట్టాడు. అది బ్లూ టూత్. చిన్నగా అధునాతనంగా ఉంది. చెవి వెనక పెట్టుకుంటే ఎవరికీ కనిపించదు.
“ఇదెందుకు?”
“కారులో కాల్స్ తీసుకునేటపుడు మిగతావారికి వినపడకుండా మాట్లాడుకోవచ్చు.” అన్నాడు ఎటో చూస్తూ. ఆమెకి అర్ధమయింది. కారులో ఉన్న బ్లూ టూత్ స్పీకర్ లోంచి మాటాడితే ఇబ్బందికరమైన సంభాషణలు అందరికీ వినపడుతున్నాయి. విషయం అర్ధం చేసుకుని ఆమె నొచ్చుకుండా ప్రవర్తిస్తున్న అతని సంస్కారాన్ని చూసి ఆమెకి కళ్ళలో నీళ్లు తిరిగాయి.
వెంటనే తమాయించుకుని “ఎందుకండీ ఇన్ని గిఫ్టులు ఇస్తారు? మేము గిఫ్టులు తీసుకోకూడదు.” అంది మొహమాటంగా.
“కెప్టెన్లు తీసుకోకూడదు. కానీ స్నేహితులు కానుకలు ఇచ్చి పుచ్చుకోవచ్చు.” వాతావరణాన్ని తేలిక చేస్తూ అన్నాడతను.
“ఇచ్చి పుచ్చుకోవటమెక్కడ జరుగుతోంది? మీరే ఇస్తున్నారు.”
“మనం మంచి మిత్రులం అని మీరు ఒప్పుకుంటే మొన్న మీరు తెచ్చుకున్న టిఫిన్ లాంటివి నాకు కూడా తీసుకురావచ్చు. ఆరోజు ఘుమఘుమలకి నోరూరిపోయింది. కానీ అప్పటికింకా మొహమాటం ఉంది కదా.”
ఆమె ఘల్లుమని నవ్వేసి “అమ్మ చేసిందండి. ఈ సారి తెస్తాను.” అంది.
“అమ్మ వంట ఎప్పుడూ అమృతమే.” అన్నాడు. సాయంత్రం హోటలుకి వెళ్తున్నపుడు మధ్యలో ఆమె ఇంటి దగ్గర ఆగి వాళ్ళని పలకరించాడు. తల్లి చేసిన వంటని మెచ్చుకున్నాడు.
ఆ రోజు అతను కలలోకి వచ్చాడు. అప్పటినుంచి వస్తూనే ఉన్నాడు.
***
మర్నాడు కంపెనీ నుంచి కాల్ వచ్చింది. “దిలీప్ అనే కస్టమరుకి పూర్తి రోజు ఒక కెప్టెన్ కావాలట. అతను నీ కోసం ప్రత్యేకంగా అడిగాడు. ఈరోజు సాయంత్రం వరకూ అక్కడే డ్యూటీ.” అన్నాడు.
ఆమె “సరే” అంది. కానీ మనసులో చాలా సంతోషించింది.
ఆమెని చూడగానే ”మీరు ఎంత విదిలించుకుందామన్నా మీకు నా గోల తప్పటం లేదండి” అని నవ్వుతూ టాక్సీ ఎక్కాడు.
“మీరు నేనే కావాలని చెప్పారట!” అంది ఏమీ తెలియనట్టు.
“నిజాయితీగా చెప్తున్నానండి. రోజంతా టాక్సీ ఉంచుకునే సర్వీస్ ఉందా అని వాళ్ళని ఫోన్లో అడిగాను. ఎందుకుండదూ? మీ దృష్టిలో ఎవరైనా కెప్టెన్ ఉంటే ఎంచుకొమ్మన్నారు. వెంటనే మీ పేరు చెప్పేసాను.” అన్నాడు.
ఆమె పకపకమని నవ్వింది.
“ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా మీకు చదువు ఇష్టం కనుక మీ అమ్మగారు అడ్డు చెప్పటంలేదు కదా. ఇప్పుడు దొరికే ఖాళీ సమయంలో హాయిగా చదువుకోండి.” అన్నాడు.
అప్పుడు ఇంకొంచెం వివరంగా అతని వ్యక్తిగత విషయాలు చెప్పాడు.
“మీలా కాకుండా నా సమస్య వేరు. ఐఏఎస్ చెయ్యాలని నేననుకుంటుంటే నాన్న ఆయనకున్న వ్యాపారాల్లో ఒక గ్రూప్ చూసుకోమంటాడు. గొడవ చేసి ఇంట్లోంచి వచ్చేసి ఈ ఉద్యోగంలో చేరాను. ఇక్కడేమో మిడిమిడిజ్ఞానంతో విసిగించే సీనియర్లతో నరకం అనుభవిస్తున్నాను. అయినా నా చదువుకి డబ్బులు నేనే సంపాదించాలి కనుక పళ్ళ బిగువున భరిస్తున్నాను.” అన్నాడు.
అతని తండ్రి వ్యాపారాల గురించి విని ఆశ్చర్యపోయింది. ‘పెద్ద బిజినెస్ మాగ్నెట్ కొడుకా ఇతను?’ అనుకుంది.
తర్వాత రోజునుంచి కేవలం అతని రైడ్స్ కోసమే ఆమె టాక్సీని కేటాయించటం వలన ఆమెకి తెరిపిగా ఉంది. అతనితో ఉన్నంత సేపూ ఇంకా బావుంటోంది.
ఒకరోజు అడిగింది. “మీ పరీక్షలు ఎప్పుడు?”
“పరీక్షలు ఎప్పుడో రాసేసానండి. ఇంటర్వ్యూ కూడా బాగానే చేసాను. ఫలితం రావాలి. ఎందుకైనా మంచిదని క్లాసుల్లో చేరాను.” అన్నాడతను.
“మీరు తప్పకుండా విజయం సాధిస్తారు” అందామె.
“మీ మాటే వేదవాక్కయ్యి అదే జరిగితే నా సమస్య తీరిపోతుంది. అప్పుడే మీ సమస్య కూడా తీరిపోయే నిర్ణయం తీసుకుంటాను. దయచేసి కాదనకూడదు.” అన్నాడతను.
అతనేం చెప్పాలనుకుంటున్నాడో ఆమె ఊహించింది. మనసంతా మేఘాలలో తేలిపోతోంది. కానీ తెలియనట్టే నటిస్తూ “మీ నిర్ణయం ఏమిటో తెలియకుండా నేను కాదంటానో లేదో ఎలా చెప్తాను?” అంది నవ్వుతూ.
అతను బిక్కమొహం వేసి “అది మీకు కూడా మంచిదనే నా నమ్మకం.” అన్నాడు. ఆమె నవ్వుకుంది.
***
ఆరోజు రానే వచ్చింది. దూరం నుంచే నవ్వుకుంటూ వస్తున్న అతను కనిపించాడు. “హేమ గారూ! ఈరోజు ఎక్కడికీ వెళ్ళక్కరలేదు. నేను ఐఏఎస్ క్లియర్ చేసానండి. యురేకా!!!” అని చుట్టూ ఎంతో మంది ఉన్నా పట్టించుకోకుండా గట్టిగా అరిచాడు.
“ఈ పిచ్చి ఉద్యోగంగానీ, నాన్న వ్యాపారంగానీ ఇంక అవసరం లేదండీ.” అన్నాడు.
‘అంటే రేపటి నుంచి ఇతన్ని చూడనన్న మాట!’ విచారంతో ఆమె గుండె బరువెక్కింది.
ఆమె ఇవే ఆలోచనలతో ఉండగా “మీకు ముందే చెప్పాను కదా. ఈరోజు నా మాట కాదనకూడదు.” అన్నాడతను.
ఆమె వెంటనే తలెత్తి చూసింది. ‘ఇక్కడే చెప్తాడా? ఎలా చెప్తాడు?’ ఆమె గుండెలు వేగంగా కొట్టుకున్నాయి.
అతను జేబులోంచి ఒక తాళాల గుత్తి తీసి ఆమె చేతిలో పెట్టాడు. “ఇవి మీ కారు తాళాలు. మీరు టాక్సీ నడుపుతూ స్పీకర్ ఫోనులో మాట్లాడేటపుడు తప్పని తెలిసినా మీ మాటలు విన్నాను. మీ కారు ఓనర్, ఇంటి యజమానులతో మీరు అనుభవించే నరకం తెలిసింది. అందుకని కొంచెం చొరవ తీసుకున్నాను. ఒక స్నేహితుడిగా ఇస్తున్న ఈ కానుక దయచేసి తీసుకోండి.” అన్నాడు ఆమె వైపు చూడకుండా.
ఆమె నిర్ఘాంతపోయింది. ఆమె మనసులో కట్టుకున్న మేడలన్నీ కూలిపోయాయి. తనలో ఆశలు రేపి ఇప్పుడు నాకు కారు దానం చేస్తాడా? అలాంటపుడు నాతో ఎందుకంత చనువుగా ఉన్నాడు? ఇంటికి ఎందుకు వచ్చాడు? ఈ కారు నేను ఎందుకు తీసుకోవాలి? ఆమె మనసు రగిలిపోతోంది.
“మీరే మగవారయితే నేను గిఫ్టులు ఇవ్వకముందే టిప్ అడిగి ఉండేవారు. నా పరపతి తెలిసిన రోజే ఏదో ఒక సాయం అడిగి ఉండేవారు. కానీ మీ సంస్కారం అలాంటిది. కానీ నేనెందుకు ఊరుకుంటాను? నా వంతుగా మీ సమస్య కొంతైనా సద్దుకునేలా ఈ కారు బుక్ చేసాను. అప్పులు తీర్చేయండి. చదువు పూర్తిగానే నా దగ్గరికి రండి. మీకు తగిన ఉద్యోగం ఏర్పాటు చేస్తాను…” అతనుచెప్పుకుపోతున్నాడు.
ఆవేశంతో ఊగిపోతున్న ఆమె అంతరాత్మ నిద్ర లేచింది.
“గాలిలో మేడలు కట్టుకున్నది నువ్వు. ఇప్పుడు కిందికి వాస్తవంలోకి దిగిరా.”
“చదువు ఆపి కుటుంబంకోసం ఇబ్బందికరమైన వృత్తిలో చేరి సమస్యలతో పోరాడుతున్న ఒక స్త్రీని మాత్రమే అతను చూసాడు. అతని సంస్కారం గొప్పది కనుక తను ఒక చిన్న ఉద్యోగి అనే విషయం జ్ఞాపకం రాని విధంగా ప్రవర్తిస్తూ కుదిరిన చోట దన్నుగా నిలబడ్డాడు. అతనిలో తప్పు పట్టటం ఎలా సాధ్యం? అతని స్థానంలో నేనే ఉండి ఇలాగే ఇలాంటి సాయం చేసాక ఆ మగాడు నాలాగే ఆశించి ఉంటే ఎంత చీదరించి ఉండేదాన్ని?” ఆలోచనలతో ఆమె మనసు నెమ్మదిగా వాస్తవానికి దగ్గరవుతోంది.
ఆమె మౌనం వేరేగా అర్థం చేసుకుని,
“ప్లీజ్. మీకిష్టం లేకపోతే అప్పుగా అనుకుని ఉద్యోగంలో చేరాక నెమ్మదిగా తీర్చండి.” అన్నాడు.
అప్పుడు మౌనం వీడి “మీరు చేసిన సాయం ఎప్పటికీ తీర్చుకోలేనిదండి. కానీ ఈ కారు విషయంలో మాత్రం నోటు రాసుకుందాం.” అంది.
“నిజానికి మీరు ఇప్పటివరకూ నేరుగా చేసినదానికన్నా పెద్ద సహాయం చేసారు. నన్ను వాస్తవంలోకి తీసుకువచ్చారు” ఈ మాటలు మాత్రం మనసులో అనుకుంది.
రాజమోహన్ ఇవటూరి స్వస్థలం విశాఖపట్నం. ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. టెక్ మహీంద్రాలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసి, 2021 నుంచి సొంత సంస్థను నడుపుతున్నారు. 1994 నుంచి కథలు రాస్తున్నారు. మొదటి కథ ‘ఓ తమ్ముడి కథ’.. రచనలో ప్రచురితమయింది. ఇప్పటివరకూ యాభైకి పైగా కథలు రాశారు. తిక్క శంకరయ్య కథ, విమర్శకుల ప్రశంసలు పొందడంతోపాటు ‘మిసిమి’ పత్రికలో అచ్చయ్యింది. ఆరాధన (రచన), అవ్వగారు (సహరి), వారసత్వం (ముల్కనూర్ గ్రంధాలయం), చక్ర భ్రమణం (కథా మంజరి), క్రూరమైన వాస్తవం (ఉష పత్రిక), అమ్మ ప్రేమ (వారణాశి సాహితీ వారధి 2024),జీవితం నిత్య నూతనం (కథా మంజరి), యుగ ధర్మం (వెల్చేరు కళా వేదిక), బొమ్మా బొరుసు (పుణ్యమూర్తుల స్మారక కథల పోటీ 2025), ప్రవాస భారతం (రవళి – డా. అమృతవల్లి ఉగాది కథల పోటీ 2026), గోరంత సాయం (తెలుగు తల్లి-కెనడా డే పోటీలు 2026) కథలకి బహుమతులు దక్కాయి. “జీవితం నిత్య నూతనం” కథ కన్నడ భాషలో అనువదింప బడినది. వీరి తండ్రి జ్యేష్ఠ పేరిట ఏర్పాటుచేసిన ‘జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్’ ఆధ్వర్యంలో 1990 నుంచి ఏటా ఉత్తమ కథ, ఉత్తమ కథా సంకలనాలకు పురస్కారాలు అందించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఔత్సాహిక రచయితల ఎన్నో పుస్తకాలను ప్రచురించారు.
రాజమోహన్ రాసిన చాలా కథలు స్వీయానుభవం ఆధారంగా రాసినవే.
శ్రీయుతులు గురజాడ, జ్యేష్ఠ, ముళ్లమూడి, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, డాక్టర్ కేశవరెడ్డి, ఇంద్రగంటి జానకి బాల, యండమూరి రచనలని అభిమానిస్తారు. కొత్త తరం రచయితలు రవీంద్ర కంభంపాటి, చాగంటి ప్రసాద్, పెమ్మరాజు విజయకుమార్, వేణు మరీదు, సైయ్యద్ గఫార్, హుమాయూన్ సంఘీర్, కైకాల సుమలత గార్ల రచనలు ఇష్టపడతారు.
సహజ నటుడు చంద్ర మోహన్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గార్లకి వీరాభిమాని.
