[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘కొత్త కేలండర్’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మళ్ళీ గోడ మీదకు
కొత్త కేలండర్ కొత్త అందాలతో
నూతనంగా వచ్చి చేరింది
మూడువందల అరవైరోజులు
గడిచిపోయాయి
కాలచక్రవేగం కనబడదు
నిన్నటి దాకా అంతా నేనేనంటూ
గోడన గర్వంగా ఎగిరిన
పాత కేలండర్
గతం తాలూకు
మంచి చెడుల నీలినీడలను
తనలోనే దాచుకుంటూ
పండగలు పబ్బాలు
తెలియజెబుతూ
క్షణం కనపడకపోతే
కాలం ఆగిపోయినట్లు భావించే
మనిషి ఆలోచనల నుంచి
నేడు చెత్తలోకి చేరింది
ఇప్పుడు కొత్తది వచ్చి
గొప్పగా ఎగురుతోంది
ఈ మనిషికి ఎప్పుడూ
కొత్తదనం కావాలి
ఇవ్వాళ గోడపై అగ్రాన ఉన్నానని
ఎగిరిపడవాకు
రేపు నీ గతి ఇంతేలే
నెలలు రోజులు గడిచి
స్వార్థం పెరిగిపోయి
కొత్త కొత్త ఆలోచనలతో
విచక్షణ మరచిపోయి
మనసులో ఏమున్నా
ముఖాన చిరునవ్వు పులుముకుని
పదిమంది కోసం నటిస్తూ
తమ ప్రయోజనాల కోసం
నటిస్తూ ఒకరి కొకరు
హ్యపా న్యూ ఇయర్ అంటూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలుపుకుంటూ
చేయి చేయి కలుపుతున్నారు
ఇదే నేటి మానవతత్వం.