Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొత్త దీవెన

[ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్ గారు రచించిన ‘కొత్త దీవెన’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

దివ్య ఉండేది రామాపురం అనే పల్లెటూరులో. తండ్రి ప్రవీణ్ చదువుకున్నా, తన తండ్రి చేసిన వ్యవసాయాన్నే నమ్ముకుని, భార్యా, కూతుళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా రామాపురంలోనే ఉండిపోయాడు. పల్లెటూరు అవడం వలన పర్యావరణం చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. పాలు, పెరుగు, నెయ్యి లాంటివి ప్రవీణ్‌కి ఉన్న పాడి వల్ల రుచికరంగానూ, పుష్టికరంగాను ఉండేవి. ప్రస్తుతం దివ్య ఆరోగ్యకరమైన యవ్వనంలోకి అడుగు పెట్టింది. రామాపురంలో ఏదో పేరుకి ఒక స్కూల్ ఉంది కానీ పెద్ద చెప్పుకోతగ్గది కాదు. అందుకని దివ్య చిన్నప్పటి నుంచి చదువు, పక్కనే ఉన్న పట్టణంలో సాగింది.

దివ్య చాలా అందంగా ఉంటుంది. తెల్లని మేని ఛాయ, బాగా కిందకి జాలువారిన జడ, తీర్చిదిద్దినట్టు ఉన్న కను ముక్కు తీరు, కవులు వర్ణించే చక్కని అవయవ పొందిక, పిడికిలిలో ఇమిడిపోతుందా అనిపించే నడుము, లోతైన నాభి,చక్కని జఘన సౌందర్యం, ముద్దొచ్చే పాదాలతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బాపు బొమ్మకు సజీవ శిల్పంలా అనిపిస్తుంది. రవివర్మ అద్భుత చిత్ర సృష్టికి, శ్రీనాథుని వంటి కవుల వర్ణనలకు ప్రతి రూపంగా నిలుస్తుంది.

దివ్య కాలేజీ బ్యూటీ అనే పేరు తెచ్చుకుంది. ఎంతమందో తోటి విద్యార్థులు, ఆమెని పెళ్ళి చేసుకోవాలని ఉవ్విళ్ళురుతుండేవారు. కొంతమంది సూర్యుని చుట్టూ గ్రహాల్లా, దివ్య చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు.

దివ్య స్నేహితురాళ్ళు “నువ్వు స్వయంవరం ఏర్పాటు చేసుకోవాలే” అని వేళాకోళం చేసేవారు.

దానికి దివ్య “నాకేమీ స్వయంవరం అక్కర్లేదు. నన్ను వలచినవాడు, నాకు కావలిసినవాడు, నన్ను వెతుక్కుంటూ వస్తాడు” అంటూ ఉండేది నవ్వుతూ.

ఇప్పుడు దివ్య ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఒక సాఫ్ట్‌వేర్ కంపనీలో పని చేస్తోంది. నిజం చెప్పాలంటే అందమైన, తెలివైన, చురుకైన పెళ్ళికూతురు. తను కలలు కన్న రాజకుమారుడి కోసం ఎదురు చూడడంలేదు. తనను ప్రేమించి, అభిమానించి, అర్థం చేసుకునే వ్యక్తి కోసం నిరీక్షిస్తోంది.

దివ్య తల్లి ధన్యకి, క్రమశిక్షణ ముఖ్యం. తన కూతురి పట్ల కూడా అది అమలులో పెట్టేది. ఆ విషయంలో తల్లీ, కూతుళ్ళ మధ్య చిన్న చిన్న ఘర్షణలు తలెత్తేవి.

ప్రవీణ్‌కి కూతురు దివ్య అంటే చాలా ముద్దు, గారం. కనుక కూతురు మీద ఈగ వాలనివ్వడు. దివ్య అమ్మమ్మ శారదకి మనమరాలు అంటే ఆమెకి అమితమైన ఇష్టం, అపేక్ష.

దివ్యకి “తల్లీ నువ్వు ఎటువంటి అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావు? నేను రైతుని, పల్లెటూరివాడిని అయినా నువ్వు పట్నంలో చదువుకున్న పిల్లవి. నీకూ ఇష్టాయిస్టాలు ఉంటాయి కదా!?” అని కూతురిని అడిగాడు ప్రవీణ్. పెళ్ళిచూపులు ఏర్పాటు చేసే ముందు ఆమె అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాడు.

“నాన్నా నీ ఇష్టం. నువ్వు కచ్చితంగా నాకు తగిన వాడినే తీసుకు వస్తావని నమ్మకం నాకుంది. అయినా అడిగావు కనుక చెపుతున్నాను. మా పెళ్ళి చూపులు ఇక్కడ ఇంట్లో, అమ్మలక్కల మధ్య కాకుండా, ఎక్కడన్నా హోటల్లో పెడితే మేమిద్దరం మనసు విప్పి మాట్లాడుకోగలం.” అంది దివ్య తండ్రి ముఖంలోకి చూస్తూ. ప్రవీణ్, ధన్య ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

“అదేం చోద్యమే పిల్లా. ఎవడితోనన్నా కలిసి తిరుగుతున్నాను. పెళ్ళి చేసుకుంటాను అంటే అదొక అందం. అలాంటిది ఏమీ లేదంటున్నావు. మరి హాయిగా పెళ్ళిచూపులు పెట్టుకుని.. కావలిస్తే అప్పుడే మీరిద్దరూ మాట్లాడుకోవచ్చుకదా!? ఈ రోజుల్లో అందరూ చేస్తున్న పనే కదా? ఇలా హోటళ్ళమ్మట తిరుగుతూ ఉంటే రేపు నిన్ను ఎవడు పెళ్ళి చేసుకుంటాడే!?” అంది అప్పుడే అక్కడకు వచ్చిన దివ్య అమ్మమ్మ శారద బుగ్గలు నొక్కుకుంటూ.

“నేనేమీ హోటళ్ళ చుట్టూ తిరగడంలేదు అమ్మమ్మా. హోటల్లో ఏదైనా తింటూ, తాగుతూ మాట్లాడుకుంటాం.”

“దివ్యా దానికి ఇష్టపడే అబ్బాయి దొరకాలిగదా!?” తన సందేహం వెలుబుచ్చింది ధన్య.

“ఇష్టపడ్డ వాళ్ళే వస్తారు.” అంది దివ్య.

ధన్య ఏదో అనబోతుంటే ప్రవీణ్ భార్యని చేతితోనే వారించాడు. అతని కళ్ళల్లో ఎరుపు స్పష్టంగా కనపడింది ధన్యకి.

“దివ్యా నువ్వు ఒక్కగానొక్క సంతానం అని ఆడింది ఆట, పాడింది పాటగా నడిచింది. మనది ఎంతో గౌరవమైన కుటుంబం. మనం ఈ పల్లెలో కట్టుబాట్లకి తలవంచక తప్పదు. నీకు ఇష్టమైన వాడిని, నిన్ను మెచ్చిన వాడిని చేసుకో. కాదనను. పెళ్ళిచూపులు మనింట్లోనే, సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి.” అని గంభీరంగా చెప్పి, ఎవరి వైపు తిరిగి చూడకుండా బయటకి నడిచాడు ప్రవీణ్.

తండ్రి ఎప్పుడూ అంత గంభీరంగా ఉండడం చూడని దివ్య మరి మాట్లాడేందుకు సాహసించలేదు. ‘నిజమే తను ఎంత చదువుకున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, తను పుట్టి పెరిగింది, తల్లిదండ్రులు ఉంటున్నది పల్లెటూరే! మరి అక్కడి నియమాలు గౌరవించాల్సిన విధి తనకుంది’ అనుకుంది దివ్య.

***

దివ్య పెళ్ళిచూపుల రోజు ఉదయంనుంచే ప్రవీణ్, ధన్య తెగ హడావిడి పడిపోసాగారు.

పెళ్ళి చూపులకి, కనీసం ఎటువంటి ఆహ్వానం లేకుండా చుట్టాలు, బంధువులు, బిలబిలమంటూ వచ్చేసారు. “మా దివ్యమ్మ పెళ్ళి చూపులకి ఒకళ్ళు పిలిచేదేమిటి” అన్నారు వాళ్ళు. మగ పెళ్ళివారు రెండు కార్లలో తరలి వచ్చారు. పెళ్ళి కొడుకు తల్లిదండ్రులు, అక్కగారు, మేనమామ, ఎవరో దూరపు బంధువు వచ్చారు. అక్కడి జరుగుతున్నది పూర్వకాలం తెలుగు సినిమాలలో పెళ్ళి చూపులు సన్నివేశం గుర్తుకు తెచ్చింది.

పూర్వకాలం పద్ధతిలోనే, పెళ్ళి కూతురిని, పెద్ద ముత్తైదువ తీసుకు వచ్చి కూర్చోబెట్టింది.

పెళ్ళి కొడుకు విద్యుత్ ఒక జాతీయ బ్యాంకులో పెద్ద హోదాలో ఉన్నాడు. ఆరంకెల జీతం. కారు. తండ్రి పెద్ద బిజినెస్ మాగ్నెట్. తల్లి కూడా చదువుకున్నదే. మంచి సంప్రదాయమైన కుటుంబం. ప్రవీణ్‌కి, ధన్యకి అన్నీ నచ్చాయి. అలాగే అబ్బాయి తల్లిదండ్రులని, ప్రవీణ్ కుటుంబం, పద్ధతులు ఆకట్టుకున్నాయి.

దివ్య, విద్యుత్ ఒకరికి ఒకరు నచ్చారు. ఇరువైపులా పెద్దలు అన్ని విషయాలు మాట్లాడుకుని, తాంబూలాలు పుచ్చుకున్నారు. విద్యుత్ తోనే దివ్య పెళ్ళి కుదిరిపోయింది.

పెళ్ళికి ముహూర్తం కూడా అప్పుడే నిర్ణయించుకోవడం అయ్యింది. దివ్య ఎన్నో కలలు కన్న, అనుకున్న, పెళ్ళి రోజు రానే వచ్చింది.

ప్రవీణ్ తన స్తోమతకి తగ్గట్టుగా అంగరంగ వైభవంగా పెళ్ళి చేసాడు. పెళ్ళికి దాదాపు అయిదు వందలమంది వచ్చారు. అందరికీ పుర్వకాల పద్ధతిలో, ఆకులు వేసి, వడ్డించారు. వచ్చినవాళ్ళందరూ హయిగా కడుపు నిండా తెలుగు భోజనం చేసారు.

అతిథులు నూతన వధూవరులను ఆశీర్వదించి బహుమతులు అందచేసారు. తమ ఆశీర్వచనాలు పలికారు. అందరి తరువాత ఆశీర్వదించడానికి, దివ్య అమ్మమ్మ శారద వచ్చింది.

పెళ్ళికొడుకు నెత్తి మీద అక్షతలు వేసి “దీర్ఘాయురస్తు. సకల అభీష్ట సిద్ధిరస్తు. ఉన్నతోద్యోగ ప్ర్రాప్తిరస్తు.” అని దీవించింది.

తన మనమరాలిని “దీర్ఘాయురస్తు. దీర్ఘసుమంగళీభవ. శీఘ్రమే నులకమంచ శయన ప్రాప్తిరస్తూ” అని దీవిస్తూ నవ్వింది శారద.

అక్కడే ఉన్న దివ్య స్నేహితురాళ్ళు పక పకా నవ్వసాగారు.

“ఏమిటి అమ్మమ్మగారు ఆ దీవెన!? ఏదో కొత్తగా ఉందే!?” అని అడిగారు.

“పెళ్ళికాని పిల్లలు మీకు చెప్పినా అర్థం కాదు. మీ పెళ్ళిళ్ళకి నన్ను పిలవండి, అప్పుడు మీకు చక్కగా వివరిస్తాను” అంది శారద తను కూడా పక పకా నవ్వుతూ.

ఆ తరువాత దివ్య అమ్మమ్మ శారదతో దివ్య స్నేహితురాళ్ళు పెద్ద భేటీ వేశారు. అసలు నులక మంచం ఏమిటి అని ఆరా తీశారు. శారద ఆ మంచం ఏ పదార్ధంతో తయారు చేస్తారో, ఆ పదార్ధం గురించి వివరించించింది. మంచం మీద నవారు నీటికి, వివిధ స్రావాలకి తడిసి పాడవదనీ, అది బాలెంతరాలికి, నవజాత శిశువుకి చాలా ఉపయోగం అని తెలిపింది ఆవిడ. ఆ మంచం పైన పడుకుంటే బాలింతరాలికి నడుం నెప్పిలాంటివి అసలు రావని చెప్పింది. ఇప్పటి ఫాషన్ మంచాల వల్ల బాలెంతరాలికి అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది శారద. ఆవిడ చెప్పిన విషయాలకి మౌనంగా తలలూపారు దివ్య స్నేహితురాళ్ళు.

“ఆరోగ్యం, ఆనందం, తొణికిసలాడే పల్లెటూర్లే దేశానికి పట్టుగొమ్మలు. ఇక్కడి ఆచారవ్యవహారాలే మన సంస్కృతికి మూలాధారాలు. మా చిన్నతనంలోనే కాక ఇప్పటికీ అంతే. మీ తరం వాళ్ళు పల్లెల్లో ఉండే మాధుర్యాన్ని, ఆహ్లాదాన్ని,ఆనందాన్ని కోల్పోతున్నారు” అంది శారద బాధగా.

“అవును అమ్మమ్మగారు” అన్నారు దివ్య స్నేహితురాళ్ళు.

ఆ రాత్రే శోభనం దివ్యకి ఏర్పాటు చేసారు. అన్ని ఏర్పాట్లు దివ్య అమ్మమ్మ శారద ఆధ్వర్యంలో జరిగాయి. దంపతుల తాంబూలాలు శాస్త్రయోక్తంగా జరిగాయి. బంతాట, ఇతర సరదాలు వధూవరులకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆనందం, ఉత్సాహం కలిగించాయి

దంపతులు గదిలోకి వెళ్ళే ముందు, ధన్య నవ్వుతూ, దివ్యకి పాల గ్లాసు అందించింది.

అక్కడే ఉన్న శారద “మనమరాలు పిల్లా!! పాలు అంటే ఈ రోజుల్లో దొరికే నీళ్ళ పాలు కావు. అచ్చం గుమ్మ పాలు. మనమడు అవి తాగి ఆదరగొట్టేస్తాడు! జాగ్రత్త !” అంది ముసిముసిగా నవ్వుతూ. ధన్య తన తల్లి నవ్వుతో శృతి కలిపింది. అప్పడికే విద్యుత్ ఆత్రంగా దివ్య కోసం ఎదురు చూస్తున్నాడు.

దివ్యని “జాగ్రత్త “అని గదిలోకి పంపించి తలుపులు మూసింది ధన్య.

శోభనం జరిగే గది అలంకరణ నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఉంది. గదంతా ఎన్నో రకాల సువాసన వెదజల్లే దేశవాళీ పూలతో అలంకరించి ఉంది. అందులో కొన్ని అడివి జాతి పువ్వులు కూడా ఉండడం విశేషం. వివిధ సువాసనల గుబాళింపు మత్తు ఎక్కిస్తోంది. మంచం అందంగా అలంకరించబడి, నూతన దంపతులను ఆహ్వానిస్తోంది. ఎన్నో రకాల స్వీట్లు, పళ్ళు అక్కడ ప్లేట్లలో టేబుల్ మీద ఉంచపడ్డాయి. మంద్రస్థాయిలో శృంగారం రెచ్చగొట్టే సంగీతం వినిపిస్తోంది.

దివ్య గదిలోకి అడుగు పెట్టగానే గట్టిగా కౌగిలించుకున్నాడు విద్యుత్.

“ఉండు.. ఉండు.. పాలు ఒలికిపోతాయి” అంది దివ్య.

దివ్య మాటలు పట్టించుకోకుండా విద్యుత్ దివ్యని గట్టిగా తన బాహు బంధాల్లో బిగించాడు.

“మరీ కంగారు” అంది దివ్య, ప్రేమగా కసురుకుని, పాల గ్లాసు విద్యుత్‌కి అందిస్తూ. అతను గ్లాసులో సగం పాలు తాగి, గ్లాసు దివ్య నోటికి అందించాడు. దివ్య, విద్యుత్‌ని, ఓరగా చూస్తూ పాలు తాగసాగింది.

“తొందరగా తాగు బాగా ఆలస్యం అయిపోయింది” అన్నాడు విద్యుత్, దివ్యని మరింత గట్టిగా కౌగిలించుకుంటూ.

“అబ్బా!! ఊపిరి ఆడడం లేదు. ప్రేమతో చంపెయ్యడం అంటే ఇదే కాబోలు.” అంది దివ్య విద్యుత్‌ని తమకంగా అల్లుకుంటూ. ఏసీ చల్లదనం పెరిగింది. “అబ్బ చలి” అంది దివ్య విద్యుత్‌ని గట్టిగా పెనవేసుకుంటూ. విద్యుత్, దివ్యల ఆవేశం, కోరిక, తారాస్థాయిని తాకాయి. వాళ్ళ మధ్య గాలి కూడా చొరబడలేకపోయింది.

క్రమంగా వాళ్ళిద్దరూ శారీరకంగా ఒకటయ్యారు. ఆ కలయిక వాళ్ళకు మధురమైన స్మృతులు, శారీరక సుఖాలు అందించింది. వాళ్ళిద్దరూ ఆ రాత్రంతా పరిశ్లేషంలోనే ఉండిపోయారు. ఆకాశంలో ప్రత్యూష ప్రవేశం జరిగింది.

***

మరునాడు ఉదయమే “ఇప్పుడైనా చెప్పు అమ్మమ్మా నీ దీవెవనకు అర్థం” అంది దివ్య శారదతో.

“పిచ్చి పిల్లా నిన్న శోభనంలో, నువ్వు, నా మనవుడు చేసిన నిర్వాకానికి, పది నెలల్లో పండంటి బిడ్డను కంటావు కదా..” అని ఏదో చెప్పబోయిన శారద నోరు మూసేసింది దివ్య.

“నీకు ముసలితనం వచ్చిన కొద్దీ సిగ్గు లేకుండా పోతోంది” అని కసురుకుంది దివ్య.

“బావుందే పిల్లా. రాత్రంతా మీరిద్దరూ, ఒకళ్ళను ఒకళ్ళు పెనవేసుకుని, తైతక్కలాడితే తప్పు లేదు గాని. నేను అంటే తప్పు వచ్చిందా!? ఇంతకీ నువ్వు పురిటికి వచ్చినప్పుడు నీకు, నీ బిడ్డకి ఆరోగ్యంగాను, సుఖంగాను ఉంటుంది. మంచి నులక మంచం తయారు చేయిస్తాను.” అంది శారద నవ్వుతూ.

“నులక మంచమా!!??.. అదేమిటి!!??” అని అడిగింది దివ్య.

శారద మరొక్కసారి పూర్వ కాలపు నులక మంచం గురించి, అది తల్లి, బిడ్డలకు ఎంత సౌకర్యంగా ఉంటుందో, అంతా వివరించింది. అది తల్లికి, శిశువుకి ఎంత ఆరోగ్యమో, అలాగే ఎంత సౌకర్యవంతంగా, హయిగా ఉంటుందో తెలియచెప్పింది. దివ్య తల్లి ధన్వి చిన్నప్పుడు పురుళ్ళకి నులక మంచమే వాడానని చెప్పింది. ఆ వారసత్వంగా వచ్చిన మంచమే దివ్య కోసం ఎదురు చూస్తోందని చెప్పింది శారద.

“కొత్త కోడె జంట కొన్నాళ్ళ వరకు నిద్రపోకూడదు. మీ అమ్మ వాడిన నులక మంచం శుభ్రంగా బాగు చేయించి ఉంచుతాను. శీఘ్రమే నులకమంచ శయనం సిద్ధిరస్తు. అది నా కోరికే పిల్లా” అంటూ మరొక్కసారి మనమరాలిని దీవించింది శారద.

“నిన్నూ” అంటూ ఆప్యాయంగా తన అమ్మమ్మని కౌగిలించుకుంది దివ్య. ఏడాదిలో వారసత్వంగా వచ్చిన నులక మంచం దివ్య ఉపయోగించింది.

Exit mobile version