[శ్రీ మరువాడ దుర్గా ప్రసాద్ గారు రచించిన ‘కొత్త మలుపు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
‘నేటితో సత్యవతి దిన వారాలు కార్యక్రమం కూడా ముగిసిపోయింది. సత్యవతి తను ఎంతో ఇష్టంగా సర్దుకున్న సామాన్లు, బీరువాలోని చీరలు, నగలు, ముఖ్యంగా ఆ కర్రబీరువాలో దాచుకున్న పుస్తకాలు, ఉత్తరాలు… ఇవన్నీ కేవలం వస్తువులు కావు, ఆమె జీవిత ప్రయాణానికి సాక్ష్యాలు. ప్రతి వస్తువు వెనుక ఆమె స్పర్శ, ఒక కథ, ఒక జ్ఞాపకం దాగి ఉన్నాయి. ఆ వస్తువులను చూసినప్పుడు విరక్తి భావం, జీవితం ఇంతే కదా అనే నీటుర్పు మిగిలిపోయింది. అయితే, ఆమె భౌతికంగా లేకపోయినా, ఆమె దాచుకున్న ఆ పుస్తకాలు, ఉత్తరాల ద్వారా ఆమె ఆలోచనలు, జ్ఞాపకాలు ఎప్పుడు నాతోనే ఉంటాయి ఉంటాయి.’
భార్య దూరమయ్యాక రాఘవరావు జీవితం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ ఇల్లంతా ఆమె జ్ఞాపకాలే. గోడకు ఉన్న ఫోటో వైపో, లేదా ఖాళీగా ఉన్న ఆ కుర్చీ వైపో చూస్తూ ఆయన శూన్యంలోకి మునిగిపోవడం నిత్యకృత్యమైంది. మనసంతా ఏదో తెలియని వెలితి, గుండెల్లో చెప్పలేనంత భారం.ఆమెతో గడిపిన నలభై ఏళ్ల జీవితం, కలిసి నవ్విన క్షణాలు, చిన్న చిన్న గొడవలు, ఒకరికొకరు తోడుగా నిలిచిన రోజులు ఒక సినిమా రీలులా కళ్లముందు తిరుగుతున్నాయి.
‘ఇకపై నాకెవరున్నారు? ఉదయం లేవగానే పలకరించే మనిషి లేదు, రాత్రికి క్షేమంగా పడుకున్నానా అని అడిగే దిక్కు లేదు’ అనే ఒంటరితనం ఆయనను లోపల నుంచి తొలిచేస్తుంది. పిల్లలు తమ తమ జీవితాల్లో బిజీగా ఉండిపోవచ్చు. ‘ఈ మిగిలిన జీవితాన్ని ఒంటరిగా ఎలా వెళ్లదీయాలి?’ అనే ప్రశ్న వేధిస్తున్నాది. ప్రతి ఒక్కరూ సత్యవతి అదృష్టవంతురాలు, పునిస్త్రీగా పోయింది అంటూ పొగుడుతున్నారు. ఎవరికీ అదృష్టం ఎవరికీ దురదృష్టం. కలిసి రాలేదు, కలిసి పోలేము.
ఎంతగా ఆలోచించినా మనసు కుదుట పడటం లేదు. జీవితంలో మార్పు అనేది ఎంత సహజమో, దాన్ని అంగీకరించడం అంతే కష్టం. పిల్లలు పెరిగి పెద్దయ్యాక చదువులు, ఉద్యోగాలు, వారి స్వంత కుటుంబాల కోసం తమ దారిన తాము వెళ్ళిపోవడం అనేది సృష్టి నియమం. కానీ, ఒకప్పుడు ఇల్లంతా అల్లరి చేసిన పిల్లలు దూరమవుతుంటే, ఆ శూన్యాన్ని భరించడం తల్లిదండ్రులకు ఎంతో మానసిక వేదనను మిగులుస్తుంది.
ఇంతట్లో పెద్ద కోడలు కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. శూన్యం నుండి వాస్తవానికి వచ్చాడు రాఘవరావు.
“నాన్నా.. ఎల్లుండి నేనూ, నా భార్య తిరిగి అమెరికా వెళ్లిపోతాము. ఇక తమ్ముడు వాళ్ళు రేపూ కెనడా వెళ్లిపోతారు!” అన్నాడు మోహన.
“పనిమనిషి, పాల వాళ్ళు మిగతా వాళ్లందరికీ కూడా రమన్ని చెప్పాను” అంది కోడలు.
“సరే అవన్నీ నేనూ చూసుకుంటానూ. మీకూ మి అమ్మవి, కావలసిన వస్తువులు తీసుకోండి” అన్నాడు రాఘవరావు.
“సరే చూసుకొని నేనూ మి చిన్న కోడలు తీసుకుంటాము” అన్నది పెద్ద కోడలు.
కొడుకులు, కోడళ్ళు నలుగురు గదిలో మాట్లాడుకుంటున్నారు.
“ఇప్పుడు నాన్నగారి పరిస్థితి ఏమిటి, ఎన్ని రోజులు ఒకళ్ళే ఉంటారు?” అన్నాడు మోహన.
“మోంట్రీయల్, కెనడాలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. చలి తట్టుకోలేరు. అందుకు అయనని మాతో తీసుకొని వెళ్లే ప్రసక్తే లేదు” అన్నది చిన్న కోడలు.
“మేమూ మాత్రం చికాగో ఎలాగ తీసుకొని వెళ్ళగలము. అక్కడ కూడా చలి బాగా ఉంటుంది. మా ఇద్దరికీ ఉద్యోగాలు, పిల్లలు వాళ్ల జీవితాల్లో బాగా బిజీ. మాకూ కూడా కుదరదు” అన్నది పెద్దకోడలు.
పెద్దకోడలు అన్న మాటలకు ఆ గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. మోహన ముఖం ఆవేదనతో నల్లబడింది. కన్నతండ్రిని ఇద్దరు కొడుకులూ, కోడళ్లూ ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటుంటే, హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని ఉన్న ఆ వృద్ధుడి కళ్లల్లోంచి నీళ్లు నిశ్శబ్దంగా కారిపోతున్నాయి. ఆయనకు చెవులు కాస్త మందగించినా, వాళ్ల మనసులు మాత్రం పూర్తిగా అర్థమయ్యాయి.
మోహన భార్య వైపు తిరిగి, “మరి నాన్నగారిని ఇలాగే వదిలేద్దామా? ఆయనకు వయసు పైబడింది. ఒక్కరే ఎలా ఉండగలరు?” అన్నాడు ఆవేదనగా.
చిన్నకోడలు పెదవి విరిచి, “నేనేం చేయను? కెనడాలో మైనస్ డిగ్రీల చలి ఉంటుంది. ఆయన ఆరోగ్యం సహకరించదు. ఒకవేళ వచ్చినా, అక్కడ మేమిద్దరం ఆఫీసులకి వెళ్తే ఇంట్లో ఒంటరిగా ఉండి ఆయన మరింత కుంగిపోతారు. ఇక్కడైతే చుట్టుపక్కల నలుగురు ఉంటారు” అని సమర్థించుకుంది.
“అవును, మేము మాత్రం చికాగోలో ఏం సుఖపడుతున్నాం? పిల్లల స్కూళ్లు, మాకు షిఫ్టులు.. ఆయన బాధ్యత మేము తీసుకోలేము. కావాలంటే ఇద్దరం కలిసి నెలకు కొంత డబ్బు పంపిస్తాము, ఇక్కడే ఏదైనా మంచి ఓల్డేజ్ హోమ్ చూసి చేర్పించేద్దాం” అంది పెద్దకోడలు చాలా తేలికగా.
డబ్బుతో బంధాన్ని కొనవచ్చనే ఆమె మాటలు మోహన గుండెను కలచివేశాయి. ఆస్తి పంపకాలప్పుడు తండ్రి సంపాదనను సమానంగా పంచుకున్న చేతులు, ఇప్పుడు ఆ తండ్రి బాధ్యతను పంచుకోవడానికి మాత్రం వెనకాడుతున్నాయి.
నెమ్మదిగా సోఫాలోంచి లేచిన రాఘవరావు గారు వాళ్ల వైపు నడుచుకుంటూ వచ్చాడు. వణుకుతున్న చేతులతో మోహన భుజంపై చేయి వేసి, “వద్దురా మోహనా… నన్ను ఎక్కడికీ తీసుకెళ్లొద్దు. నాకెవరి డబ్బు వద్దు. ఈ ఇల్లే నాకు సర్వస్వం. మీ అమ్మ జ్ఞాపకాలు ఉన్న ఈ ఇంట్లోనే నా చివరి శ్వాస విడుస్తాను. మీరు హాయిగా మీ దేశాలకు వెళ్ళిపోండి” అన్నారు. ఆయన గొంతులో కోపం లేదు, కేవలం నిస్సహాయత మాత్రమే ఉంది.
ఇంతట్లో ఫోను మోగింది. ఫోను రాఘవరావే తీసాడు. “హలో హీరోగారు, ఏమిటి సత్యవతి వెళ్లిపోయింది ఆని దిగులు పడుతున్నారా??. నేనూ మీ సెకండ హీరోయిన్ మాధవి ఒకర్తి ఉంది ఆని మర్చిపోయారా??” అనేసరికి రాఘవరావుకి ప్రాణం లేచి వచ్చింది. “అబ్బే సెకండ హీరోయిన్ మాధవిని ఎలాగ మరిచిపోతాను. ఇంతకీ ఎప్పుడు రాక నన్నూ చూడటానికి?” అన్నాడు రాఘవ రావు.
“నలభై అయిదేళ్లుగా మిమ్మల్ని, మీ ఫ్రెండ్ గోపాలరావు గారిని చూస్తున్నే ఉన్నాను. కాలేజీ రోజులనుండి, ఉద్యోగాల వరకు, ఆ పైన జీవితంలో ఒడిదడుకులు మధ్య కాస్త విరామం చెప్పాను స్నేహానికి. పూర్తిగా వదిలలేదు.” చెప్పింది మాధవి.
మాధవి గొంతు వినగానే రాఘవరావు ముఖంలో ఒక్కసారిగా వెలుగు వచ్చింది. కొడుకులు, కోడళ్ల మాటల మధ్య నలిగిపోయి, భార్య సత్యవతి లేని ఒంటరితనం తనను మింగేస్తున్న తరుణంలో.. నలభై ఐదేళ్ల క్రితం నాటి స్నేహితురాలి పిలుపు ఆయనకు ఒక అమృతధారలా అనిపించింది.
“అవును మాధవీ.. కాలేజీ రోజుల్లో నువ్వు, నేను, గోపాలం.. ఎంత అల్లరి చేసేవాళ్లం! ఉద్యోగాలు, పెళ్లిళ్లు, కుటుంబ బాధ్యతల్లో పడి అసలు ఒకరికొకరం దూరమైపోయాం. నువ్వు మమ్మల్ని ఇంకా గుర్తుపెట్టుకున్నావంటే నాకెంతో సంతోషంగా ఉంది” అన్నాడు రాఘవరావు, కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగానే గొంతులో ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ.
ఫోన్లో మాధవి నవ్వింది. “మిమ్మల్ని ఎలా మరుస్తాను రాఘవా? సత్యవతి, ఇంకా నా భర్త గోపాలం మనల్ని వదిలేసారు. మీ పిల్లలందరూ ఇక్కడే ఉన్నారని విన్నాను. వాళ్ల గోడవల మధ్య నువ్వు నలిగిపోతున్నావని కూడా అర్థమవుతోంది. జీవితం ఎవరి గురించి ఆగిపోదు. నేనూ ప్రస్తుతం సీనియర సిటిజన్స్ హోమ్‌లో ఉంటున్నాను. ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ మనలాంటి వాళ్లే. రోజూ రొటీన్ లైఫ్ నుండి కాస్త బయటకు రావాలి.”
మాధవి మాటలు వింటుంటే రాఘవరావుకు ఒక కొత్త సత్యం బోధపడింది. గోపాలం కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడనే వార్త ఆయనను కాస్త కలచివేసినా, మాధవి చెప్పిన జీవిత తత్వం ఆయన గుండెకు బలాన్నిచ్చింది.
“జీవితం ఎవరి గురించీ ఆగిపోదు రాఘవా.. మనం పిల్లల బాధ్యతలన్నీ తీర్చేశాం. ఇప్పుడు మన కోసం మనం బ్రతకాల్సిన సమయం వచ్చింది” అంది మాధవి అవతలి వైపు నుండి ఎంతో ధీమాగా.
“నిజమే మాధవీ.. సత్యవతి వెళ్ళిపోయాక నా జీవితం శూన్యం అనుకున్నాను. పిల్లలు వాళ్ల జీవితాల్లో బిజీ అయిపోయారు. నా బాధ్యత ఎవరికి భారం కాకూడదని అనుకుంటున్నాను. నువ్వు ఉంటున్న ఆ హోమ్ వివరాలు నాకు చెప్పు, నేనూ నీలాగే ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెడతాను” అన్నాడు రాఘవరావు, ఆయన గొంతులో ఇందాకటి నిస్సహాయత స్థానంలో ఒక స్పష్టమైన నిర్ణయం కనిపించింది.
ఫోన్ పెట్టేసి రాఘవరావు వెనక్కి తిరిగేసరికి, గదిలో ఉన్న వాళ్లందరూ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. కెనడాలో చలి గురించి మాట్లాడిన చిన్న కోడలు, చికాగో చలి గురించి మాట్లాడిన పెద్దకోడలు.. అందరూ తండ్రి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
రాఘవరావు నిటారుగా నిలబడి కొడుకులతో అన్నాడు, “నా కోడళ్ళు ఇద్దరూ చెప్పింది నిజమే, అక్కడ వాతావరణం, మీ బిజీ జీవితాలు నాకు సెట్ కావు. అలాగని ఈ ఇంట్లో ఒంటరిగా ఉండి నేను కుంగిపోదల్చుకోలేదు. నా పాత స్నేహితురాలు మాధవి ఉంటున్న సీనియర్ సిటిజన్స్ హోమ్‌కే నేను వెళ్తున్నాను. అక్కడ నా వయసు వాళ్ళు, నా పాత స్నేహితులు ఉంటారు. నా శేష జీవితాన్ని నేను ఆనందంగా గడుపుతాను.”
ఆ మాటలకు కొడుకులు ఇద్దరి మనసులు బరువెక్కాయి. తండ్రిని తాము సరిగ్గా చూసుకోలేకపోయామనే నేరభావన వాళ్లలో మొదలైంది. వెంటనే రాఘవరావు కలగ చేసుకొని “నాకు ఎవరి మీద కోపం లేదు. నా సేవింగ్స్ నాకున్నాయి. నా పెన్షన్ నాకొస్తుంది. ఇక ఇల్లు అంటారా, అది ఎప్పుడో మీ ఇద్దరికీ రాసేసాను. ఇక మీ ఇష్టం అది మీరూ ఉంచుకుంటారో అమ్ముకుంటారో” అన్నాడు.
రాఘవరావు అన్న ఆ మాటలకు హాల్లో ఉన్నవాళ్లందరి నోళ్లూ మూతపడ్డాయి. ఆస్తి కోసం, బాధ్యతల కోసం కొట్టుకుంటున్న కొడుకులు, కోడళ్ల ముఖాలు ఒక్కసారిగా చిన్నబోయాయి. ఆయన ముఖంలో ఎలాంటి ఆవేశం లేదు, కేవలం ఒక ప్రశాంతమైన చిరునవ్వు మాత్రమే ఉంది.
రాఘవరావు మోహన భుజం తట్టి, “లేదురా మోహనా, నువ్వు నా మీద చూపించిన ప్రేమే నాకు చాలు. కానీ మాధవి చెప్పింది నిజం. నా జీవితం ఎవరి గురించో, దేని కోసమో ఆగిపోకూడదు. నా శేష జీవితాన్ని నా వయసు వాళ్లతో, నాతో సమానంగా ఆలోచించే స్నేహితులతో ఆనందంగా గడపాలనుకుంటున్నాను. నా సొంత డబ్బుతో, నా స్వశక్తితో నేను బ్రతకగలను. మీరెవరూ నా గురించి బెంగపడక్కర్లేదు” అని తేల్చి చెప్పాడు.
మరుసటి రోజు ఉదయమే మాధవి కారులో రాఘవరావు ఇంటి ముందుకు వచ్చింది. రాఘవరావు తన చిన్న సూట్‌కేస్ సర్దుకుని, వెనక్కి తిరిగి చూడకుండా, ముఖంలో ఒక కొత్త ఉత్సాహంతో కారు వైపు నడిచారు. కొడుకులు, కోడళ్లు గేటు దగ్గరే నిలబడి ఆయన వెళ్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు.
కారు సీనియర్ సిటిజన్స్ హోమ్ వైపు దూసుకెళ్తోంది. కిటికీలోంచి బయట ప్రపంచాన్ని చూస్తున్న రాఘవరావుకు, సత్యవతి జ్ఞాపకాలు గుండెల్లో ఉన్నా.. రాబోయే శేష జీవితంపై ఒక కొత్త ఆశ, స్వేచ్ఛ కనిపించాయి.
