[బాలబాలికల కోసం ‘క్రొత్త మందుల్ని కనిపెట్టిన డా. ఎల్లాప్రగడ సుబ్బారావు’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
ప్రియనేస్తాలూ! ఉష్ణప్రాంతాల్లో వచ్చే రోగాలు నయం చేయడానికి నడుంకట్టి, స్ప్రూ, ఫైలేరియా, క్షయ మరియు బాక్టీరియా, వైరస్ ల వల్ల వచ్చే వ్యాధులకు మందులను కనుగొన్న మహనీయుడెవరో తెలుసా? ఆంధ్రదేశంలో పుట్టి పెరిగి, అమెరికాకు వెళ్ళి పరిశోధనలు సాగించి, ఆంధ్రదేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన శాస్త్రవేత్త ‘ఎల్లాప్రగడ సుబ్బారావు’. ఆ మహానుభావుని గురించి తెలుసుకుందాం.
ఎల్లాప్రగడ సుబ్బారావు 1895 జనవరి 12న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జన్మించాడు. తండ్రిపేరు జగన్నాథం. తల్లి పేరు వెంకమ్మ. 1911లో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఫెయిలవడం వల్ల సుబ్బారావును రాజమండ్రి పంపారు. అక్కడ చిలకమర్తి లక్ష్మీనరసింహం, కందుకూరి వీరేశలింగం గార్ల శిష్యరికం లభించింది. 1913లో తండ్రి మరణించినప్పటికీ తల్లి ప్రోత్సాహంతో సుబ్బారావు చదువును కొనసాగించాడు. 1919 మే 10వ తేదీన సుబ్బారావు వివాహం శేషగిరితో జరిగింది.
గాంధీజీ సహాయ నిరాకరణోద్యమంతో ప్రభావితుడైన సుబ్బారావు విదేశీ దుస్తుల్నిబహిష్కరించాడు. ఖద్దరు ధరించి కాలేజీకి వెళ్ళి ఆంగ్లేయుడైన ప్రొఫెసర్ కోపానికి కారణమైనాడు. వారం రోజుల వ్యవధిలో సుబ్బారావుగారి ఇరువురు సోదరులు ‘స్ప్రూ’ వ్యాధితో మరణించటం వలన ఎలాగైనా ఆ వ్యాధికి మందును కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. అప్పట్లో భారతీయులంతా పై చదువుల కోసం బ్రిటన్ వెళ్ళేవాళ్లు. కానీ బ్రిటీషర్లంటే ఇష్టం లేకపోవడంవల్ల సుబ్బారావు 1923లో అమెరికా వెళ్ళాడు.
1924లో తొలిసారిగా సుబ్బారావుగారి పేరు ప్రపంచానికి తెలిసింది. డాక్టర్ ఫిస్కే సాయంతో శరీర కణాల్లోని భాస్వరాన్ని సరిగ్గా, తేలిగ్గా నిర్ధారణ చేసే ‘ర్యాపిడ్ కెలోరిమెట్రిక్ మెథడ్’ను ఆవిష్కరించారు. దీనినే ‘ఫిస్కే సుబ్బారావు పద్ధతి’ అంటారు. జీవరాశి భౌతిక ప్రక్రియలను నిర్ణయించేది ‘ఎడినోసిన్ ట్రై ఫాస్పేటు’ అనీ అదే కండరాల శక్తికి మూల పదార్థమనీ కనుక్కోవటంతో, అప్పటివరకు ఉన్న శాస్త్రవేత్తల పరిశోధనలు తప్పని తేలింది. 1930లో సుబ్బారావు హార్వర్డు మెడికల్ కాలేజీ నుండి పి.హెచ్.డి. పట్టా పొందాడు.
డాక్టర్ రిచర్డ్ స్ట్రాంగ్ ఆహ్వానం మేరకు ఆంధ్రదేశం నుండి అమెరికా వెళ్ళిన సుబ్బారావు అక్కడి ‘లెడర్లీ’ పరిశోధనా సంస్థలో రీసెర్చి డైరెక్టరుగా నియమితులయ్యారు. ఫోలిక్ యాసిడ్, హెట్రాజెన్, ఐసోనెక్స్, మెథాట్రెక్సేట్, విటమిన్ బి-12, ఆరియోమైసిన్, టెట్రాసైక్లిన్ వంటి మందుల్ని అవిరళ పరిశోధనానంతరం సుబ్బారావు ఆవిష్కరించాడు. తన జీవిత కాలమంతటినీ మానవవాళి శ్రేయస్సుకోసం క్రొత్త మందుల్ని కనిపెట్టడంలోనే గడిపిన మహనీయుడు సుబ్బారావు.
1948వ సంవత్సరం ఆగష్టు8వ తేదీన ఎలాప్రగడ సుబ్బారావు న్యూయార్క్‌లో కన్నుమూశాడు. న్యూయార్క్ లోని ‘లెడర్లీ’ సంస్థ తమ పరిశోధనాశాలకు ‘డాక్టర్ వై. సుబ్బారావు మెమోరియల్ లాబరేటరీస్’ అని పేరు పెట్టి తన కృతజ్ఞతను చాటుకుంది. ఇంతేకాక కొన్ని యాంటీ బయాటిక్‌లకు ‘సుబ్బామైసిన్’, ‘సుబ్బరోమైసిన్’ అని పేర్లు కూడా పెట్టారు. ‘టెట్రాసైక్లిన్’, ‘ఆరియోమైసిన్’ వంటి మందుల్నికనుగొన్న ఈ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి లభించలేదు.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
