[యం. ధరిత్రీ దేవి గారు రచించిన ‘కృషీవలునికి ప్రణమిల్లుదాం..’ అనే కవితని అందిస్తున్నాము.]
నింగిని మేఘం కరిగిందీ
చినుకై నేలను రాలింది
ఎండిన బీడు తడిసింది
పంటకు సై అంటు పిలిచింది
పదరా పదరా రైతన్నా
పరుగున కదలర ఓరన్నా
నాగలి పట్టర నాగన్నా
నాట్లు వేద్దాం రారన్నా
పదరా.. పదరా.. పదరా.. ॥నింగిని॥
హలం భుజం పైకెత్తాడు
కాడెద్దులతో కదిలాడు
కాయకష్టం చేశాడు
కలలకు ఊపిరి పోశాడు
గింజలు పొలాన చల్లాడు
అదిగో మొలకల సందడి చూడు..
ఇదిగో రైతన్న కన్నుల దివ్వెలు
ఇల్లాలి మోమున విరిసే నవ్వులు
ఇదిగో.. ఇదిగో.. ఇదిగో.. ॥నింగిని॥
పైరగాలుల పలకరింపులు
పచ్చదనాల సింగారాలు
అమ్మలక్కలా ఆటలు పాటలు
కూలీల నడుమ అచ్చట్లు ముచ్చట్లు
సద్దిమూటల సరదాల సందళ్లు
కోతకు వచ్చిన పసిడిపంటలు
కళ్లాలనిండా ధాన్యం రాశులు
కళకళలాడుతు పల్లెల లోగిళ్ళు
అదిగో.. అదిగో.. అదిగో.. ॥నింగిని॥
జేబుల నిండుగ కాసులు ఉన్నా
బ్యాంకుల బండెడు కోట్లు ఉన్నా
పండించు రైతన్న లేకున్నా
అంగట్లో సరుకులు వచ్చేదెట్లా
అందరి కడుపులు నిండేదెట్లా
కావాలంటే వెచ్చాలు మనకు
రావాలి రావాలి మన రైతన్నలు
లేకుంటే బాబూ తప్పవు అగచాట్లు
వినండి.. వినండి.. వినండీ.. ॥నింగిని॥
మట్టిని నమ్మిన మట్టిమనుషులు
పుడమితల్లికీ ముద్దులబిడ్డలు
ఆరుగాలము శ్రమించు జీవులు
నేలతల్లినీ వదలని ప్రాణులు
అన్నదాతలూ వారే లేకుంటే..
లోకాన కరువే.. కనరాదు మెతుకే..
కడుపులు నింపే కృషీవలునికీ
కరములు జోడించి ప్రణమిల్లుదాము
రారండి.. రారండి.. రారండీ.. ॥నింగిని॥
యం. ధరిత్రీ దేవి విశ్రాంత అధ్యాపకురాలు. వీరి కవితలు, కథలు, వ్యాసాలు కొన్ని ప్రింట్ పత్రికల్లో, అంతర్జాల పత్రికల్లో ప్రచురింపబడినవి.
