Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కృత్రిమమేధ – సాహిత్య సృజన

[శ్రీమతి వి. బి. సౌమ్య వ్రాసిన ‘కృత్రిమమేధ – సాహిత్య సృజన?’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

కంప్యూటర్ ప్రోగ్రాముతో సృజనాత్మక అంశాల సృష్టి అన్నది కనీసం ఒక ఐదారు దశాబ్దాలబట్టి కంప్యూటర్ సైన్స్, సంబంధిత రంగాల మధ్య కంప్యుటేషనల్ క్రియేటివిటీ అన్న పేరు కింద పరిశోధనలు జరుగుతున్న అంశం. అది మనకి  అవసరమా? దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇలాంటివి సమర్థనీయమా? ఇలాంటి ప్రశ్నలని అటు పెడితే – ఆంగ్లం లో చిన్న చిన్న కథలు మొదలుకుని చైనీస్ భాష ఛందస్సు ప్రకారం కవిత్వ సృజన దాకా రకరకాల భాషలు, సాహిత్య ప్రక్రియలలో ఇలాంటి ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి (ఉంటాయి కూడా).  2022 చివర్లో వచ్చిన చాట్ జీపీటీ అనేక సాంకేతిక, నసాంకేతిక రంగాలని ఒక ఊపు ఊపినట్లే ఈ కంప్యూటర్ తో సాహితీ సృజన అన్న రంగంలో కూడా అనేక కొత్త పద్ధతులని తెచ్చింది. ఈ వ్యాసం ఉద్దేశ్యం ప్రస్తుతపు సాంకేతికత సృజనాత్మక సాహిత్య సృష్టికి ఎలా ఉపకరించగలదు? అన్న విషయం పై నా అనుభవాలు, ఆలోచనలు పంచుకోవడం. [ఈ అంశం పై గతంలో కూడా నా బ్లాగులోనూ, ఇతర చోట్లా రాశాను/మాట్లాడాను. రెండు లంకెలు మాత్రం వ్యాసం చివర్లో ఇస్తున్నాను.]

ముందుగా ఒక పెద్దసైజు చిన్న గమనిక: ఇక్కడ సృజన అంటే అనువాదం కూడా కలుపుకుని. రచన గానీ, అనువాదం గానీ ప్రధానంగా సృజనాత్మకమైన ప్రక్రియలు అని నేను నమ్ముతాను. అనువాదం లో సృజన ఏముంది? అనేవారు ఉండవచ్చు. వారిది అనుభవరాహిత్యం వల్ల ఉండే అమాయకత్వం గానీ, అహంకారం వల్ల వచ్చిన చిన్నచూపు గానీ అయి ఉండవచ్చని నా అభిప్రాయం. కాస్తో కూస్తో సృజనాత్మక సాహిత్యం అనువాదం చేసిన వారికీ, విస్తారంగా అనువాదాలని చదివేవారికీ – ఇద్దరికీ అనువాదం అంటే పదాలకి పదాలు వెదుక్కొని పెట్టేయడం కాదు అని అర్థమవుతుంది. అసలు వార్తాపత్రికలలో అనువాదం కూడా ముక్కస్య ముక్క దించితే చదవడంలో మంచి ప్రవాహాం లాంటి అనుభవం ఉండదు, దానికి కూడా అనువాదం చేయడంలో ప్రతిభ ఉండాలి. అనువాదం మీదే దృష్టి పెట్టే డిప్లొమా/డిగ్రీ కోర్సులు ఉండేవి అందుకే. పీహెచ్దీ స్థాయిలో కూడా సాహిత్యాన్ని ఒక అంశంగా అధ్యయనం చేసినట్లే సాహిత్య/ఇతర అనువాదం అన్న అంశాల మీద అధ్యయనం చేస్తారు. అందువల్ల నేను రాస్తున్నది అనువాదాన్ని చేర్చే.

ఇక అసలు విషయంలోకి వెళ్తాను.

కృతిమ మేధ సహాయంతో సాహిత్య సృజనలో నా అనుభవం

గత రెండు మూడేళ్ళలో నేను చిన్న చిన్న కథలని చాట్జీపీటీ, జెమినీ ల సహాయంతో సృష్టించడానికి ప్రయత్నించాను. ఒకసారి మాత్రమే నాబ్లాగు, వ్యక్తిగత సంభాషణలు, మా అమ్మాయికి చెప్పే పిట్టకథలని దాటి మరొకచోట అలాంటి కథని బయటపెట్టాను. చాలావరకు ఇంగ్లీషులోనే కానీ అప్పుడప్పుడు తెలుగు కూడా ప్రయత్నించాను. ఏఐ సృష్టించిన బొమ్మలను వాడి చెకుముకి పత్రికకి కొన్ని వ్యాసాలూ రాసాను. అయితే ఇటీవలి కాలంలో బాగా వాడింది మాత్రం ఛందోబద్దంగా పద్యం రాయడానికి, తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువదిస్తున్నపుడు వాక్య నిర్మాణంలో సూచనలకి.

ముందుగా ఛందోబద్ద పద్యసృష్టి విషయం: తెలుగు రాష్ట్రాలలో తెలుగు ముఖ్య భాషగా చదివిన అందరికీ హై స్కూల్ స్థాయిలో ఛందస్సు గురించి ఒక ప్రాధమిక అవగాహన ఉంటుంది. నాకు అంతకుమించిన అవగాహన లేదు. అప్పట్నుంచీ ఆ అంశం మీద కుతూహలం మాత్రం ఉంది. అందువల్ల విజ్ఞులు ఈ అంశం పైన రాసేవి, ఈ అంశాన్ని సాంకేతికత తో జోడిస్తూ వచ్చిన ఛందం వంటి సాఫ్ట్‌వేర్ ఉపకరణాల గురించి తెలుసుకుంటూ ఉంటాను. గత ఏడాది కాలంలో కృత్రిమ మేధ నమూనాల తెలుగు కొంత మెరుగు పడడంతో ఈ పద్యరచనకి అవి ఉపకరిస్తాయా? పరిశీలించాలని అనిపించింది. పూర్తి వివరాలిక్కడ రాయలేను కానీ కొన్ని నేను అందించిన వివరాలకి అనుగుణంగా జెమినీ సృష్టించిన పద్యాలని ఇక్కడ ఉదాహరణకి ఇస్తున్నాను.

“భారపు మంచు తగ్గుచును భానుని కాంతులు పెర్గుచున్
ధారలు గట్టి నీరములు ధారణి జేరెను మెల్లగన్
భూ రుహముల్ చిగిర్చినవి భూమికి అందము గూర్చుచున్
సారపు వాసంత మిదియె సత్యము వచ్చెను వేడుకల్.”

“తరులవి చిన్ని మొగ్గలను దాల్చెను పత్రము లీనగన్
ఝరములు పాఱసాగె నిల శ్రాంతిగ పక్షులు చేరెడిన్
అరుణుని కాంతి హెచ్చినది యౌర, చలిన్ బడదోలుచున్
చిరునగ వీనులొత్తినటు శ్రీకరమైన వసంతముల్.”

రెండూ కెనడాలో వసంతాగమనం గురించే. మొదటిది ఉత్పలమాలకి, రెండవది చంపకమాలకి దగ్గర్లో ఉన్నాయి కానీ పలు దోషాలు ఉన్నాయి. అయితే, కొంతవరకూ కవితాత్మకంగానే అనిపించాయి నాకు. వీటిని ఎడిట్ చేసుకునే స్థాయి జ్ఞానం నాకు లేదు కనుక మరేదైనా కొంచెం తేలికగా ఉన్నది చూద్దామని తేటగీతి లో ఒక పద్యాన్ని సృష్టించమని అడిగాను నేనిచ్చిన అంశంపైన. ఈసారి అది ఇచ్చిన దాన్ని నేను కొద్దిపాటి మార్పులతో తేటగీతి నియమాలకు తగినట్లు మార్చుకోగలిగాను (ఛందం సాఫ్ట్‌వేర్ సాయంతో సరిచూసాను).

“మదిని భావములుప్పొంగి మాటలేక
అరుపు, కూతల హోరులో నరుడు వెదికె
శబ్దములకూడి ఇంపుగ శాన చేసె
అవియె పదములై భాషగ అడరెనిలను”

అలాగే ఏఐ సహాయంతో ఛందో బద్ద పద్యరచన లో మొదటి అడుగు వేయగలిగాను. ప్రస్తుతానికి అక్కడే ఆపాను కానీ ఓపికని బట్టి, ఆసక్తిని బట్టి ఇంకా ఈ దిశలో చాలా చేయవచ్చు అనిపించింది. పద్యరచనపై పూర్తిగా అనుభవం లేకుండా ఏఐ వాడుతున్నపుడు అది చూపిస్తున్నదానిలో ఏది తప్పు-ఒప్పు తెలిసే అంత జ్ఞానం ఉండి (లేదా ఎలా తెలుసుకోవాలో తెలిసి ఉండి), కావలసిన అంశం గురించి వివరంగా ఇచ్చి, మంచి ఉపమానాలు అవీ చెప్పగల సృజనాత్మకత ఉండి, పద్యరచన మాత్రం కష్టంగా ఉన్న పక్షంలో ఒక మొదటి అడుగు అంటూ వేయడానికి ఇప్పటి సాంకేతికత ఉపకరించవచ్చు అని అనుకుంటున్నాను. అందువల్ల కృత్రిమ మేధని ఛందస్సుతో పద్యరచన చేయడాన్ని నేర్పడానికి పరికరంలా వాడడాన్ని గురించి మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నాను (అసలీ పద్యాలూ అవీ ఎవడిక్కావాలండి? అనేవాళ్ళకి ఈ భాగం వర్తించదు. హౌ టు మేక్ క్లాసికల్ పోయెట్రీ కూల్ అగైన్? అని ప్రశ్నించుకునేవారి కోసం, నాకు పద్య రచన నేర్చుకోవాలని ఉంది కానీ నేర్పేవారు దగ్గర శిష్యరికం చేసే అవకాశం లేదు అనుకునేవారి కోసం ఇది).

ఇక అనువాదం విషయం: “కందం రాసినవాడే కవి. పందిని కొట్టినవాడే బంటు” – ఈ వాక్యం తీసుకుందాం. ఏ కథ నవలో మీరు ఆంగ్లంలోకి అనువాదం చేస్తూ ఉన్నప్పుడు  ఈ వాక్యం తారసపడితే ఏమి చేస్తారు? ఎలా అనువదిస్తారు? కందం అన్న దాన్ని అలాగే వదిలేద్దాం అనుకుందాము. జెమినీ ని “translate this into English, assuming we are doing a literary translation and these sentences occur in a short story or a novel, as a part of some dialogue?” అంటూ అడిగితే నాకు మూడు అనువాదాలని చూపించింది:

  1. “Only he who writes a Kandam is a poet. Only he who slays a wild boar is a warrior.”
  2. “A true poet proves his mettle by writing a Kandam; a true warrior proves his by slaying a boar.”
  3.  “You’re not a poet until you’ve written a Kandam. You’re not a warrior until you’ve killed a boar.”

ఇలా కాకుండా ఊరికే అనువాదం చేసెయ్యి అని అడిగితే ఇది ఇచ్చింది: Only one who can write a Kandam is a true poet. Only one who can kill a wild boar is a true warrior.

వీటిలో మనకి ఈ వాక్యాలు వచ్చే సందర్భం బట్టి 2,3 బాగున్నట్లు అనిపించింది నాకు. ఇది ఉదాహరణ కోసం తీసుకున్నాను కానీ నేను ఇటీవల ఎండపల్లి భారతి కథలని ఆంగ్లంలోకి అనువదించినపుడు తరుచుగా ఇలా మధ్యలో ఒక తెలుగు పదం వాడి ఆంగ్ల వాక్యం కూరుస్తున్నపుడు ఎలా రాస్తే బాగుంటుంది అని నాలుగైదు రకాల వాక్యాలని చూడ్డానికి, లేదంటే ఏదన్నా పదానికి ఆంగ్లంలో సరైన వాడుక చూసి తెలుగు పదానికి దానికి పోలిక తెలుసుకోవడానికి, ఇలాంటి ప్రశ్నలకి వాడాను. మొత్తంగా కథ గానీ, పేరా గానీ ఇచ్చి చూడలేదు కానీ అలా చేసినవారివి చదివాను. ప్రస్తుతానికి నా అభిప్రాయం ఇప్పటి సాంకేతికత స్థాయి ఇలాంటి సలహాలు సూచనలకి పనికివచ్చినంతగా పూర్తిస్థాయిలో రచనా బాధ్యతలు అప్పజెప్పడానికి పనికిరాదని.

ఈ రెండు వాడుకల్లోనూ ఒక ముఖ్యమైన తేడా ఉంది. అనువాదం చేయడంలో నాకు అనుభవం ఉంది. ఛందస్సు విషయంలో చాలా ప్రాథమిక స్థాయి అవగాహన తప్ప అనుభవం లేదు. కానీ ఏఐ రెండింటిలోనూ నాకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను.

చదువరిగా నా  అనుభవం: ఇప్పటిదాకా ఏఐ సహాయం తో రాశానని రచయిత చెప్పగా నేను ఒకటిన్నర నవలలు చదివాను ఆంగ్లంలో. రెంటిలోనూ ఏఐ రాసిన ఆనవాళ్లు తేలికగానే దొరికాయి. ఇది నేను ఎడిటింగ్ లోపంగానే భావిస్తాను. అయితే, భాష, పదజాలం ఎంపిక మాత్రం గొప్పగా ఉన్నట్లు అనిపించింది. ఎడిటింగ్ అవసరం ఒక మంచి రచయిత రాసిన రచనకంటే ఏఐ సహాయంతో రాసిన రచనకి మరింత ఎక్కువగా అవసరం అనిపించింది. కృత్రిమ మేధ సహాయం ఈ ఎడిటింగ్ విషయంలో కూడా తీసుకోవచ్చు. గతంలో ఒక ఆంగ్ల రచయిత కేవలం ఆరు డాలర్లతో తాను ఏఐ ఎడిటర్ ని వాడటం గురించి పోస్టు రాయగా చూసాను 2023 ప్రాంతంలో. కానీ ఇక్కడ కూడా కృత్రిమ మేధ కి స్వయంచాలకత్వం ఇవ్వడం కాకుండా రచయిత (లేదా సంపాదకుడు) చేతిలో పగ్గాలు ఉంటేనే ఫలితం బాగుంటుంది అని నా అనుకోలు.  కాబట్టి పూర్తిగా కృత్రిమమేధతోనే రాయిస్తే పోలా? అని ఎవరైనా అంటే పూర్తిగా చదువుకోడం కూడా వాటికే వదిలేస్తే పోలా? అన్నది నా సమాధానం.  ఏఐ తో అనువాదం చేయించేయవచ్చు అన్న అభిప్రాయం నేను రచయితలూ, ప్రచురణ కర్తల దగ్గర ప్రయివేటు సంభాషణల్లోనూ, సోషల్ మీడియా పోస్టుల లోనూ విన్నాను. ఇందులో ఒకరు ఏకంగా ఇంకా అనువాదకుల అవసరం లేదని కూడా అన్నారు. ఇది మీరు నమ్మితే నిజంగా అలా చేసి ఏదన్నా ఎడిటింగ్ ప్రాసెస్ ఉన్న పత్రికకి పంపి వాళ్ళు ఆ అనువాదాన్ని స్వీకరిస్తారో లేదో, లేదంటే పుస్తకంగా వేస్తే ఆదరణ ఉంటుందో లేదో  చూడమని నా సలహా.

వెరసి నా అభిప్రాయం: మనిషి కోసం మనిషి చేసే సృజనలో ఏఐ పాత్ర మనిషి సృజనని మరింత సమర్థవంతంగా చదువరికి అందజేయడంలో ఉండాలి కానీ మనిషి బదులు ఏఐ సృజించడంలో కాదు. ఆ సహాయకారి పాత్రని మనం వాడడాన్ని పట్టి ప్రస్తుతపు సాంకేతికత సమర్థవంతంగా చేయగలదు. ఇప్పటికీ ఆంగ్లంతో పోలిస్తే భారతీయ భాషల్లో నైపుణ్యం తక్కువగా ఉన్నప్పటికీ సాంస్కృతిక జ్ఞానం బాగానే ఉంది. కనుక మన సంస్కృతీ, ఆలోచనా విధానానికి అనుగుణంగా సలహాలు, సూచనలు తెప్పించుకోవచ్చు. అయితే ప్రతి సూచననూ జాగ్రత్తగా చూసి నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి. ఇది రచయితని తక్కువ చేయడం కాదు. అనువాదకుల అవసరాన్ని తొలగించడం కాదు. సంపాదకుల ప్రస్తావన లేకుండా పని కానివ్వడం కాదు. ఈ ముగ్గురికీ ఎవరికీ తగిన చేయూత వారికి ఇవ్వడం. అదీ ఏఐ చేయగలిగేది. ఏఐ చేత అది చేయించుకోవడంలో మన తెలివి పాత్ర కూడా ఉందనుకోండి.

చివరగా రెండు మాటలు: నేను వృత్తి రీత్యా కృత్రిమ మేధ  పరిశోధకురాలిని. కృత్రిమ మేధకి మానవ భాషలు నేర్పడం, వచ్చో రాదో బేరీజు చేయడానికి కొత్త పద్ధతులని అధ్యయనం చేయడం నా దైనందిన వృత్తి జీవితంలో భాగం. సాహిత్య సృజన మీద ఆసక్తి, కొంచెం ప్రవేశం ఉండడం వలన రెండింటినీ కలిపే అంశం కనుక ఈ అంశం మీద కొంచెం ఎక్కువ ఆసక్తి. అంతకుమించి ఏఐ వచ్చి రచయితలని నిర్మూలించాలనో, ఏఐ రచనలని అందరూ ఆదరించాలనో నేను అనను. అదే విధంగా స్వయంగా రాయడం చేతకాని వల్లే ఏఐ వాడతారు  అన్న ఈసడింపుని కానీ, అంతగా కథ కావాల్సి వస్తే ఏ రచయితనో అడగొచ్చు కదా? ఏఐ ని ఎందుకు? అని చిన్నచూపుతో మాట్లాడడాన్ని కానీ నేను మర్యాదకరమైన ప్రవర్తనగా భావించను. అది ఒకవిధమైన అభద్రతాభావం అని అనుకుంటాను. స్వస్తి.

[ఇదే అంశం మీద గతంలో రెండు సార్లు రాసాను – ఒకసారి హర్షణీయం పోడ్కాస్ట్ వారితో సంభాషణ తరువాత, ఒకటి 2023 కెనడా సాహితీ సదస్సులో ప్రసంగించిన తరువాతా. ఇది మూడో విడత. 2025 ఎడిషన్. ఇటీవల బాలా బుక్స్ అధినేత ఉషాప్రత్యూష సంబంధిత అంశం మీద చర్చించడానికి వెళ్లేముందు కొన్ని ఆలోచనలు ఇచ్చి పుచ్చుకున్నాము. ఆ సందర్భంలో ఈ పాత పోస్టులని గురించి చెప్పాను. తరువాత ఒకట్రెండు సోషల్ మీడియా పోస్టులు చూసాక బహుశా తాజా అభిపాయలతో మరొక వ్యాసం రాయాలేమో అనిపించి ఇది రాసాను. అందుకు వీరందరికీ కృతజ్ఞతలు.]

Exit mobile version