Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

క్షణభంగురం

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘క్షణభంగురం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నీటి బుడగ పగిలితే
నీటికా  నష్టం?
కాకపోతే..
బుడగలో దాగిన వాయువుకి
విముక్తి లభిస్తుందంతే..!

అయినా..
విశ్వవ్యాప్తమైన వాయువుని
తనలో క్షణమైనా బంధించి
తనకో ఆకృతిని
ఏర్పరచుకుంటోంది
తన జీవితం  క్షణభంగురమని
తెలిసినా..

అమూల్యమైన జీవితాన్ని
అనంతమైన కాలాన్ని
ముందుంచుకుని
వ్యర్థ ప్రేలాపనలతో
కాలాన్ని కరిగించే కంటే..

నిద్రాణమై ఉన్న మేధను
నిద్ర లేపి పదుగురికి
మార్గం చూపేలా
నీలోని వ్యక్తిత్వానికి
రూపాన్నిచ్చుకో..

లేకపోతే..

క్షణభంగురమైన
ప్రాణవాయువు ఏ క్షణానైనా
నిన్ను వీడిపోతే
కాదెవరికి నష్టం..
నీటి బుడగలో వాయువులా
విశ్వంలో కలుస్తుందంతే..!

ఇందుకా.. ఈ జీవితం?
కానే కాదు..

కలలకు రెక్కలు తొడిగి
అవరోధాలను అధిగమించి
మేధకు పదును పెట్టి
నీ ప్రత్యేకతను
విశ్వవ్యాప్తం చేయాలంటే..
క్షణభంగురమైనా
నీటి బుడగలా జీవించు..

నీ చిరునామాను
చిరస్మరణీయం చేసుకో..!

Exit mobile version