[జె.డి. వరలక్ష్మి గారు రచించిన ‘క్షోభ నుండి శాంతిస్వరం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
“పెళ్ళాం కాటికి పోయినాక ఒక్కడివే ఇక్కడుండి చెయ్యి కాల్చుకుంటూ తినేకంటే కొడుకు కోడలు కాడికి పోరాదురా అంజిగా?” అడిగాడు అంజయ్య అన్న రత్తయ్య.
“ఆ.. ఏటి పోయేది ఆ పెద్ద కర్మనాడు చూడలేదేటి కోడలు మొఖం బిగదీసుకుపెట్టుకుని ముసేనంచాటలు చేతిలో ఎట్టి మా మొఖాలకేసి చూడకుండా అత్తగారి ఫోటోకాడ దీపమెట్టడానికి బరబరా తడిచీరెని ఈడ్చుకుంటూ పోయింది. అక్కడున్న అందరం కొడుకు కోడలు కాడికి పోరా అంటుంటే నలుగురు అదే మాట అనేసరికి ఏదో మాటవరసకి ఇంటికిరా మామ అన్నదే గాని మనసెమ్మటా పలికిందా ఆ పిల్లా! చూడ్డానికి ఎంత అమాయకంగా ఉంటాదో నేలసుంచులాగా” ఆపకుండా తన అభిప్రాయాన్ని చెప్పుకుంటూ పోతుంది నాగమ్మ.
మొక్కజొన్నచేలో ఈ రోజు ఊసులాడుకోవడానికి, ఆడిపోసుకోవడానికి అంజికోడలు మల్లి దొరికింది వాళ్ళకి.
“అబ్బా అదేం లేదులేక్కా.. నాకే నా ఇంటిదాని జ్ఞాపకాలు, ఈ ఊరు, పొలంపనులు వదిలి పోలేక రానంటినని” నెమ్మదిగా సమాధానమిచ్చాడు అంజి.
“ఓయబ్బో! కోడల్ని మాట పడనివ్వడు అంజిగాడు” మూతి తిప్పుకుంది నాగమ్మ.
అంజయ్య ముఖంలో నవ్వులు మాయమై చాలా కాలం కావస్తుంది. భార్య ఎటువంటిదైనా ఆమె లేని లోటు మాత్రం అంజయ్యకు బాగా తెలుస్తుంది. ఇంట్లో దీపం పెట్టేదిక్కు కరువై ఇల్లు దయ్యాల కొంపలా కనపడేసరికి ఎక్కువ సేపు బయటే మసులుతున్నాడాయన. పలకరింపుల రూపంలో దెప్పిపొడుపులు సాగుతూనే ఉన్నాయి. రాత్రి పగలు చూడకుండా పొలం పనులు, తాపీ పనులు ఏదోకటి దొరకబుచ్చుకొని భార్య జ్ఞాపకాలకు అందకుండా కాలం గడుపుతున్నాడు. ఓనాడు వడదెబ్బ తగిలి ఒళ్ళు అలసిపోయి నాలుగు రోజులు మంచం పట్టాడు. విషయం తెలిసి పక్క ఊరిలోనే ఉండే కొడుకు రంగడు భార్య మల్లిని వెంటేసుకొని ఉన్నపలంగా వచ్చిపడ్డాడు. రావడంతోనే మామ పరిస్థితిని చూసి వంటగదిలోకి పోయి అల్లం, కరివేపాకు, కొత్తిమీర చితకొట్టి దంచి లోటాడు మజ్జిగను మామ చేతిలో పెట్టింది. ఇల్లు మొత్తం సర్ది వంటచేసింది. చీరకొంగుతో పట్టిన చెమటను తుడుచుకుంటూ “మామా ఎప్పుడొస్తావో ఏమో నాకక్కడ నీ కొడుకు పనికిపోతుంటే ఒకత్తినే ఉండటానికి గుండె దడైతుంది” అంది మల్లి.
మల్లి ఎప్పుడూ శాంతంగానే ఉండేది. తన మనసుని తూట్లుపొడిచిన మాటలు వినపడిన కాడినుండి కోపంతో వ్యక్తిత్వాన్ని కాపాడుకొని మూగబోయిన స్త్రీ ఆమె.
“మల్లీ.. నా మనసు కుదిరినప్పుడు వస్తాలేవే. మీ అత్త ఎలాగూ లేదు ఇప్పటికైనా ఈడ ఉండిపోరాదే” అడిగాడు అంజయ్య.
“లేదు మామా నేను నీ ఇంటికాడ ఉండడానికి నాకు బుద్ధి పుట్టతాలేదాయే నా ఒల్ల కాదు. నీకురాబుద్ధి అయినప్పుడే మన ఇంటికి వచ్చేయ్.. తినడానికి చేసి పెట్టినా.. కాసింత ఎంగిలిపడి నడుం వాల్చు” అని చెప్పి పైకి లేచింది మల్లి.
“మల్లీ మా అయ్య అంతలా అడుగుతుంటే నువ్వేందే మాట కాదంటావ్, ఉండు” అని గద్దించాడు రంగడు.
“నువ్వు ఈ రెండుదినాలు మీ అయ్య కాడ ఉండి కంటికి రెప్పలా కానుకో, నేను కాలినడకన పోతాండ” అని చెంపలను చేరుతున్న కన్నీళ్లను దిగమింగుకొని అత్తగారిల్లుని కళ్ళల్లో నింపుకొని గుమ్మం దాటింది మల్లి.
ఇప్పుడా గడపకు ఆమె పసుపు రాయడంలేదు, తులసికోటకు ముగ్గులూ అద్దడం లేదు. కళ కోల్పోయి ఉంది ఆ గుమ్మం. జాజులు, పారిజాతాలు నిద్రోయాయి. దొడ్డి మొత్తం గడ్డిదుబ్బులు లేచాయి. అంజయ్యకు మల్లి వెళ్ళిన కాడినుండి ఇల్లు మరలా దయ్యాల దిబ్బలాగే తోచింది.
ఏదోకటి చేసి అయ్యని ఇంటికి తీసుకుపోవాలనుకున్నాడు రంగడు.
మగత నిద్రలో ఆరు సంవత్సరాల వెనక్కి వెళ్ళాయి అంజయ్య ఆలోచనలు.
***
“పెళ్లయ్యి రెండేళ్లు గడిచినా ఇంకా కడుపు లేదు, కాకరకాయా లేదు.. ఆ నాగమ్మ కొడుక్కి గుమ్మడికాయ లాంటి మనవడు పుట్టేడు. నాకే యోగము లేదాయె” ముక్కుచీదుకుంది అంజయ్య భార్యసత్తెమ్మ.
ఇలాంటి మాటలు వింటూ అలవాటైపోయిందేమో జాకెట్టు కుట్టు మీద కుట్టు వేసుకుంటుంది మల్లి.
“ఇదిగో నాకిదే నచ్చదు నేను ఇంతగా బాధపడుతున్నా ఆ మిషను కుట్టడం ఆపవే” అరిచింది సత్తెమ్మ.
ఇంటి పనులన్నీ చక్కబెట్టగా మిగిలిన కాస్తాకూస్తా కాలాన్ని మిషను కుట్టుకు వాడుకుంటుంది మల్లి.
“వచ్చే ఏటికి నా చేతిలో మనవడో, మనవరాలో లేకపోవాలా రంగడికి ఇంకో పెళ్లి చేసి నిన్ను బయటకు నెట్టేస్తాను ముదనష్టపుదానా” ఉక్రోషంగా అంది సత్తెమ్మ.
మల్లి కళ్ళలో సన్నని నీటిజీర.. అదనపు కట్నం, ఆడపడుచు సాధింపులు, తల్లి దండ్రుల మరణ విషాదం ముగిసిపోయాక ఇప్పుడు ఈ మాట గుచ్చింది మల్లిని. పొలం పనులకు పోయిన అంజయ్య వస్తేనే గాని ఈ మాటల తూటాలు ఆగవని ఆమెకు తెలుసు. నెమ్మదిగా లేచి బయటకు వచ్చి తడికల వైపు చూసింది మామ జాడకోసం.
“ఏందే మీ మామ రాకకోసం చూస్తున్నావా సందేలదాకా పని ఒప్పుకున్నాడు ఏడు గంటలేల అవుతాది” అని కస్సుమంది సత్తెమ్మ. గడియారం ముళ్ళు రెండు గంటలు చూపెడుతుంటే తిట్ల వరదలో కొట్టుకుపోయే శరణార్దిలా నిస్సహాయంగా చూస్తుండిపోయింది మల్లి.
ఇంతలో “బిడ్డా మల్లీ.. కూసెంత ఈ ఉత్తరంముక్క సదివిపెట్టు బుల్లీ.. నీ మరిదికాడి నుండి అందింది” అని కాగితాన్ని చేతిలో పెట్టింది చంటమ్మ.
“కూర్చో అక్కా.. సోమిగాడు ఉత్తరమేశాడా? అయ్యో రంగడు ఊర్లో లేడే లేకుంటే వాడే చదివేటోడు” కోడలి వైపు అసహనంగా చూస్తూ అన్నది సత్తెమ్మ.
“అయితేనేమే సత్తే.. నీ కోడలు సదువుద్దిగందా, నువ్వు సదువు బిడ్డా. నీకు కనకంబరాలు మాల కట్టెడతాను” అంది చంటమ్మ.
ఉత్తరం అంతా చదివి సారాంశాన్ని రెండు ముక్కల్లో.. తాపీపని చేస్తూ సోమడు డాబామీద నుండి జారిపడినాడట ఎడమకాలు విరిగినాదని పెద్దాసుపత్రిలో చేర్చినారట.. అని చెప్పి, “కొంత సొమ్ములు ఉంటే పట్టుకు రమ్మని రాసాడు బాప్పా” వివరించింది మల్లి.
“అయ్యో కొడుకా ఎంత కష్టమొచ్చి పడిందిరా నీకు.. ఏమే సత్తే.. వేళకి నీ బావ లేడే కొన్ని పైసలుంటే చేబదులు సర్దరాదే వచ్చినాక చేతిలో పెడతా” అని అభ్యర్థించింది చంటమ్మ.
“అయ్యో అక్కా నాకెక్కడికెల్లి వస్తాయే ఒక్క పైసా లేదాయె” చేతులు తిప్పుతూ మొఖం చాటేసింది సత్తెమ్మ.
“బిడ్డా మల్లీ నీకాడేమన్నా ఉంటే విదల్చవే నీ మరిదికాడికి పోయొస్తా” అంది ఎర్రబడ్డ మొఖంతో.
క్షణం ఆలోచించకుండా మిషనుకుట్టి దాచిన ఐదువందలని చంటమ్మ చేతిలో పెట్టింది మల్లి.
“నా బంగారమే! నా బంగారు తల్లే.. పదికాలాలు పిల్లల కోడిపెట్టలా బతుకుతావే బిడ్డా” దీవించి పరుగందుకుంది చంటమ్మ.
తన కళ్ళెదురుగానే సొమ్ములు ఇచ్చి దీవెనలు అందుకున్న మల్లిని చూసి ఎక్కడాలేని కోపం వచ్చిపడింది సత్తెమ్మ ఒంట్లోకి.
“నీకెక్కడివి అన్ని పైసలు?” అడిగింది కోడల్ని.
“బాప్పా అవి నా కష్టం. మిషనుకుట్టు డబ్బులు ఆరునెలల నుండి పక్కనెట్టా” అంది.
“ఇరవై, ముప్పై రూపాయల జాకెట్టు సొమ్ములు కూడబెడితే ఇంత డబ్బైనాదా లేకుంటే మేమంతా పనిలోకి పోయినాక..” అనాలనుకున్న మాటను నోటిలోనే ఆపేసింది సత్తెమ్మ.
“బాప్పా! మతుండే మాట్లాడుతున్నావా!” కోపాన్ని, అవమానాన్ని దిగమింగుకుంటూ గొంతును సరిచేసుకుంది మల్లి.
“అవునే మతిప్పుడే పుట్టినాదే నంగనాచి.. సోమడికి అనగానే పరిగెత్తి సొమ్ములు తెచ్చావటే ఏటే నీ యవ్వారం?” గొంతుపెంచి వీదికెక్కింది.
“ఇట్టాంటి ఏసాలు బాగా మరిగి కడుపులో నలుసుని రానిత్తాలేదే నువ్వు” విచక్షణ మరిచిపోయి మల్లి జుట్టుపట్టుకుని రోడ్డుమీదకి ఈడ్చుకుపోయింది.
అత్త చేస్తున్న పనికి బిత్తరపోయింది ఆ అమ్మాయి. వీధిలో అందరూ గుమగుడిపోయి సత్తెమ్మ మాటలను ముక్కున వేలేసుకొని వింటున్నారేగానీ ఒక్కరు కూడా ఇదేం పనని ఆవిడని ఆపలేదు.
“పోవే ఎవడి దగ్గరికి పోతావో పో.. నా ఇంట్లో అడుగు పెట్టావో కాటికి సాగనంపేత్తా” అని మూర్ఖత్వపు రాక్షసి ఆవహించినట్లు వెరెత్తిపోయింది సత్తెమ్మ.
మల్లికి పెళ్ళై వచ్చిన దగ్గరినుండి కొడుకు, భర్త ప్రవర్తన ఆమెతో ఉన్నతంగా ఉండడంతో చూసి తట్టుకోలేక ఈర్ష్యను కడుపులోదాచుకుంది సత్తెమ్మ. ఇప్పుడు దానికితోడు ఆమె చేయని సాయం మల్లి చేయడం అవమానంగా భావించి మల్లి మంచితనాన్ని జీర్ణించుకోలేకపోవడం సత్తెమ్మ మానసిక దౌర్భల్యం. ఎంత అణిగిమణిగి ఉన్నా వ్యక్తిత్వం మీద నింద వేసేసరికి తట్టుకోలేకపోయింది మల్లి. మొదటిసారి అత్తగారింట్లో కోపాన్ని ప్రదర్శించింది.
“ఏ పాపం ఎరుగని నన్ను నా మొగుడు, మామలేని ఏళలో బజారు దాన్నని నలుగురిలో నిలబెట్టావు. ఇంటి పరువును వీదికీడ్చి ఏం సాధిస్తావు నువ్వు?నేను పోతే నీ కొడుక్కి ఇంకో పెళ్లి చేయాలని దుర్బుద్ధి నీ బుర్రలో పుట్టింది. దీనికోసమేగా ఇంతకు తెగించావు.. నీ కొంపలో ఉండి చాకిరీచేసి మాటలుపడే దానికన్నా బయటకి పోయి అడుక్కుతినడం గౌరవం నాకు. నా మొగుడు, మామ వచ్చాక వారికి విషయం చెప్పి పొలిమేర దాటతాను. ఇప్పుడే పోతే చూడనిది చూసినట్టు నప్పించే రకానివి నువ్వు” అని మట్టిరోడ్డు మధ్యలో ఊడిన జడను ముడపకుండా కాళ్లు మడిచి కూర్చుంది.
“గుడిసె వదిలి పొమ్మంటే దరిద్ర దేవతలా చతికిలపడ్డావేమే?” అంటూ కొట్టడానికి ముందుకు వచ్చిన సత్తెమ్మను అప్పుడే ఊరి నుండి వస్తున్న రంగడు అడ్డుకున్నాడు.
ఎవరెళ్ళి చెప్పారో పొలంకాడి నుండి అడ్డదారిన పరిగెత్తుకొచ్చాడు అంజయ్య.
“బిడ్డా మల్లీ.. ఏందే ఇది?” ఆశ్చర్యంగా అడిగాడు అంజయ్య.
జరిగింది చెప్పి బోరుమంది.
“ఎవరూ లేని దాన్ననేగా ఇంత నింద మోపినాది నా మీద?” గుండెల్లో బాధని వెళ్ళగక్కింది మల్లి.
“సత్తెమ్మా ఏంది ఇది? బుర్రలోకి పురుగు దొర్లినాదా? ఇంగితం లేకుండా ఇట్లాంటి మాటలు అంటావా ఇంటి కోడల్ని పట్టుకుని? జుట్టు అట్టుకుంటావా.. ఇంత కానిపని జేస్తావా నువ్వు?” అని చెయ్యత్తాడు అంజయ్య.
“అమ్మో అమ్మో నా మొగుడితోనే నన్ను కొట్టబెడతాంది చూడుండ్రే” శోకాలు తీసింది సత్తెమ్మ.
“ఆగు మామా.. నేను పోతున్నా గౌరవం, మర్యాద లేని కొంపలో నేను ఉండలేను. నా బతుకు నేను బతుకుతా లేకుంటే బాయిలో దూకుతా” చీర కొంగును నడుం చుట్టూ బిగించింది.
“బిడ్డా నువ్వంత సదువు చదువుకుంటివి గదనే, ఇదేం మాటే?” వాపోయాడు అంజయ్య.
“గొడ్డుమోతు బర్రెని కొనితెచ్చినట్టు దీన్నితీసుకొచ్చి నా బిడ్డకి కట్టబెట్టినావ్ పోతానంటాంది గదా పట్టుకుని వేలాడతావా పోనియ్.. నాలుగు దినాల్లో నా కొడుక్కి మల్లా పెళ్లి జేస్తాను” అంజయ్యని కసురుకుంది సత్తెమ్మ. మాట పూర్తయిన మరుక్షణం అంజయ్య చేతివేళ్ళ గుర్తులు సత్తెమ్మ చెంపమీద తేలిపోయాయి.
“అయ్యా మీరిద్దరూ గొడవపడకండి. దానికి తోడు నేనుపోతా. దాని కోపంలో అర్థం ఉంది” అన్నాడు రంగడు. చావో బతుకో ఏడోకాడ దానితోనే బతుకుతానన్నాడు.
కొడుకు వెళ్తాననగానే “నా ఇంటి మగాళ్ళిద్దరికీ మందు పెట్టిందిరా ఇది” అని మళ్లీ శోకాలు తీసి శాపనార్థాలు పెట్టింది సత్తెమ్మ. మల్లి భుజంమీద చెయ్యి వేసి ముందుకు కదిలాడు రంగడు.
“ఒసేయ్ మల్లీ..నేను సచ్చి స్వర్గానికి పోయినా నా ఇంట్లోకి నిన్ను రానీయనే..ఇద్దరూ కలిసి ఏట్లోకి దూకండి ఇకమీద నా గుమ్మం తొక్కొద్దు” అంటూ వెళ్ళిపోయే వారిద్దరి చెవుల్లో ఇనుప గుణపంతో పోటేసినంత గట్టిగా అరిచి చెప్పింది సత్తెమ్మ.
***
అయ్యా కొద్దిగా ఎంగిలిపడమని లేపుతున్న కొడుకు మాటలకు వర్తమానం లోకి వచ్చాడు అంజయ్య.
కాలం ముందుకు సాగిపోతూ రుతువులను మార్చేసింది.
సూర్యుడు అస్తమించే సాయంత్రం పొద్దు మల్లి గుడిసెలో దీపం ఒత్తిని చీకటి కనపడని వెలుగుకోసం పెద్దది చేసింది. వాకిలి తడికలు మెల్లగా తీసిన చప్పుడయింది.
“బిడ్డా మల్లీ..” అంజయ్య పిలుపు వినబడిందామెకు.
పక్కనే రంగడు బట్టల సంచులు పట్టుకుని నవ్వుతూ నిలబడ్డాడు. మల్లి కళ్ళల్లో ఆనందం పొంగుకొచ్చింది.
“మామా ఉండు.” అక్కడే ఉండమంటూ హడావిడిగా పరుగున వెళ్లి హారతి పళ్లెం పట్టుకొచ్చి తండ్రి సమానుడైన మామకు హారతిచ్చి గుడిసెలోకి ఆహ్వానించింది. ఆ హారతి వెలుగులో ఇన్నాళ్లు ఆ కుటుంబం అనుభవించిన క్షోభ మాయమై చల్లగాలిలో శాంతి స్వరం కమ్మని రాగాన్ని ఆలపించింది.
అంజి చేతిలో ఉన్న ఉయ్యాలబుట్టలో ఐదు మూరల కనకాంబరాల మాల స్వచ్ఛంగా నవ్వులను విరబూసిందక్కడ.
