[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన ‘కూచిమంచి తిమ్మకవి వేసిన అచ్చతెలుగు త్రోవ’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
అచ్చతెలుగు అనే తలపు పుట్టక ముందు, తెలుగులో ప్రాకృతం, సంస్కృతం మాటలతో చుట్టరికం కలిగిన నుడుల వాడకమే ఎక్కువగా ఉండేది. సంస్కృతం ప్రాకృతాల నుండి తనదంటూ ఏ వెలుగూ లేని కొన్ని మాటలు (ప్రత్యయాలు ) పుట్టాయి. సంస్కృతంతో సమానమైన తత్సమాలు, సంస్కృత ప్రాకృతాల నుండి ఏర్పడిన తద్భవాలుఎక్కువగా వాడకంలో ఉండేవి. సంస్కృత ప్రాకృతాల నుండి ఏర్పడిన తద్భవాల్ని వికృతి అన్నారు.
ఇప్పటికి వెయ్యేళ్లనాడు.. నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు “జానుతెలుగు”, “తేటతెలుగు”, “దేశి” అనే మాటలు వాడారు. పరాయి మాటలను జోడిస్తూనే తెలుగును మరింత సొంపుగా, వినసొంపుగా నడిపించాలనేది వారికి ఆనాడు పట్టింపు.
జానుతెనుగు, తేటతెలుగు అనే మాటలు వినుకలిగాను వినసొంపుగానూ ఉన్నాయి గానీ, వాటికి ‘ఇదీ’ అనే ఒక తీరూతెన్నూ కనిపించవు. అందువలన నన్నెచోడ, సోమనాథులకు ముందున్న వ్రాత నేర్పరుల వ్రాత తీరుకీ, వీళ్ళవ్రాత తీరుకీ పెద్దతేడా కనపించదు. కాకపోతే తూకం వేస్తే తెలుగంటే మక్కువ కొద్దీ ఎక్కువ తెలుగుమాటలు తూగుతాయి.
అచ్చతెలుగు అంటే ప్రాకృతం, సంస్కృతం, ఇంకా ఇతర పరాయి నుడులేవీ కలవనిది తేటతెలుగు. దీన్ని‘దేశి’ అనే కూడా చాన్నాళ్లు పిలిచారు.
“అచ్చతెనుగు” అనే మాటని మొదటగా వాడినవాడు కేతన. ఆయన లెక్కన సంస్కృతంతో చుట్టరికం ఉన్న 1.తత్సమాలు, 2. తద్భవాలు, తెలుగుతో చుట్టరికం ఉన్న 3. అచ్చతెనుగులు, 4. దేశ్యాలు, 5. గ్రామ్యాలు ఇలా 5 రకాల మాటలు తెలుగులో ఉన్నాయన్నాడు. జానుతెలుగున వ్రాస్తామన్న వాళ్లు సంస్కృతం లేకుండా వ్రాయాలన్న ఒట్టు పెట్టుకోక పోవటాన జానుతెనుగు ఒక పెద్ద కదలిక (ఉద్యమం) కాకుండా పోయింది! కొందరు నుడికారులు దేశ్యోద్భవం, అన్యదేశ్యం, ఆంధ్రదేశోద్భవం అంటూ రకరకాల సంస్కృతం పేర్లే పెట్టి మరింత చిక్కుముడి వేసి, తెలుగు మాటలకు ఒక ఐపు, ఆనవాలు లేకుండా చేశారు. దాంతో అచ్చంగా తెలుగులో వ్రాయాలనే ‘కట్టు’ ‘ఒట్టు’ పెట్టుకున్నవాళ్లు కరువయ్యారు.
అప్పకవి ఒక్కడే.. “ఆంధ్ర దేశ్యంబులు రెండు తెరంగులయ్యె భువి/ శుద్ధాంధ్రంబులు, అన్యదేశజాంధ్రంబులు..” మన మాటలు – పరాయి మాటలు అని రెండే రకాల మాటలు తెలుగున వాడకాన ఉన్నాయని తేల్చాడు. మనం మాట్లాడుకుంటున్న అచ్చతెలుగు కదలైనకు ఇది చాలా కీలకం కూడా!
పరాయి మాటలు వద్దనుకుంటే అచ్చతెనుగున వ్రాయటం ఒక్కటే గతి.. అని ఆనవాలు పెట్టుకోవాలి.
చిన్నయసూరి ఆ త్రోవనే వెళ్లి, సంస్కృత సమాసాలు తప్ప మిగిలినదంతా అచ్చతెలుగేనన్నాడు. “త్రిలింగదేశ వ్యవహార సిద్ధంబగు భాష” అంటూ, అచ్చతెలుగుకి ఎల్లలు చెప్తూ, తెలుగు నేలకు చెందిన మాటలన్నీ అచ్చతెలుగే నని నొక్కి చెప్పాడు. సూరిగారు చెప్పిన అచ్చతెలుగులో పల్లెపలుకులు (గ్రామ్యాలు) ఊరిపలుకులు(మాండలికాలు) కూడా కలిసి ఉన్నాయి.
దీన్ని బట్టి మనం మాట్లాడే మాటల్లో సంస్కృత ప్రాకృతాల్లోంచి, అరబీ, పారసీ, పోర్చుగీసుల్లోంచి వచ్చి చేరి కలిసిపోయిన మాటలు పోగా మిగిలినవన్నీ అచ్చతెలుగు మాటలే! కానీ, ఈ మిగిలిన తెలుగు మాటలు ఎన్ని..? అనేదే తేల్చాల్సి ఉంది.
వెనకటి వ్రాయితలు అచ్చతెనుగు అంటే ఇదే అని గట్టిగా గీత గీయలేదు. అచ్చతెలుగు కోసం కొత్త మాటని కల్పిస్తే అది ఎంతవరకూ తెలుస్తుందో ననే అరమరిక వలన తత్సమాలు వికృతి నుడులూ అప్పుడప్పుడూ తొంగి చూసేవి.
మన మిన్కులన్నీ (శాస్త్రాలు) సంస్కృతంలోనే ఉన్నాయి కాబట్టి మిన్కునుడులు( సాంకేతికపదాలు) కూడా సంస్కృతం లోనే ఉంటాయి. వాటిని తెనుగున మార్చటానికి తేలిక మాట దొరకటం అంత తేలిక కాదు. అలాంటప్పుడు అందరికీ తెలిసిన సంస్కృతం మాటనే వాడకతప్పదు. “ఒనరంబేరులు బిరుదులు తెలుగు సేయ/ బోలదని మున్ను పెద్దలు పూని త్రోవయిడిరి; గావున నంగూరుపు మిదియు నట్టు.” అని కూచిమంచి తిమ్మకవి- “పేర్లు, బిరుదుల్ని తెలుగు చేయబోవటం లే”దని ముందే చెప్పుకున్నాడు. కొరవి గోపరాజు, పొన్నకంటి తెలగన్న నడిచినదారే ఇది!!
కావ్యము, రచన, వర్ణము, విభక్తి లాంటి వ్రాయికట్టు (వ్యాకరణ సూత్రాలు)కు చెందిన మాటల్ని వాడకుండా తప్పించుకో లేనప్పప్పుడు మారుమాట లేకుండా వాడేయటమే ఎన్నదగిన పని.. అనే కూచిమంచి తిమ్మకవి త్రోవ సరయినదే! కానీ, ఈ వాడకం మితిమీరకుండా ఉండాలి. వీలైనంత వరకూ మన త్రోవన మనం నడవటమే మేలు. కావ్యం అనటానికి బదులు కబ్బం అనటం వలన తెలుగుకు ఒరిగేది ఏమీ ఉండదు, ఆ మాటకొస్తే కబ్బం అనే కన్నా కావ్యం అంటేనే మందికి తెలుస్తుంది కూడా! కాబట్టి, అచ్చతెనుగు వాడకానికి కూడా ఒక కొలది (పరిమితి)ని మనం పెట్టుకోగలగాలి.
ఇదంతా ఎదన పెట్టుకుని కూచిమంచి తిమ్మకవి వ్రాసిన అచ్చతెలుగు రామాయణాన్ని (ప్రబంధకావ్యం) చదవాల్సిఉంటుంది.
అచ్చతెలుగు రామాయణం
తెలుగులోదాదాపు అన్ని రకాల వ్రాత రీతుల్లోనూ రామకథని తెలుగు వ్రాయితలు కమ్మగా అల్లారు. అచ్చతెనుగులో రామాయణాన్ని ప్రబంధంగా తొలిసారిగా రచించినవాడు కూచిమంచి తిమ్మకవి. ఆయన వ్రాసినది అచ్చతెలుగునే అయినా, వ్రాసిన తీరు అల్లసాని పెద్దన, రామరాజభూషణుడు లాంటి వారి నడకను తలపిస్తుంది
“పగలు సేయుచు వేడిమి మిగుల
జగము గాచు జమునబ్బమున్నీటం గలిసెననియో,
తొగ వెలందుక నగియె; నమ్మగున్
పెంపుగని సయింపక తమ్మి మొగంబు మొగిచె.”
అయోధ్యాకాండం మొదట్లోనే రామకథను చెప్పకుండా చెప్తూ ఈ పద్యాన్ని కూచిమంచి తిమ్మకవి వ్రాశాడు. ప్రొద్దు గ్రుంకటాన్ని అల్లి బొమ్మకట్టే చూపిస్తూనే, లోపల రామాయణమంతటినీ మోసుకొస్తోన్న మోత (ధ్వని) ఇందులో కనిపిస్తుంది!
పగలంతా తన వేడితో నేలను వేడెక్కించిన సూర్యుడు చివరకు జమునబ్బ నీటిలో (యమునానది తండ్రి – సముద్రం) మునిగి పోయాడని తొగవెలందుక (కలువపువ్వు) నవ్విందట! దాని ముఖంలో నవ్వుని చూసి తట్టుకోలేక తామరపువ్వు ముఖం మాడ్చుకుందట.. సూర్యుడి కుదురుకు చెందిన వాడైన దశరధుడు ఏడుపు అనే కడలిలో మునిగిపోతుంటే, తన కొడుకు ఏలిక కానున్నాడని కైకేయి పొంగిపోవటం, అది కౌసల్య ఎదను గట్టిగా తాకటం లోనారసిస్తే ఇందులో కనిపిస్తాయి!
పేర్లు తెలుగు చేయనంటూనే తిమ్మనగారు కప్పుకుత్తుకవాడు (నీలకంఠుడు), గిత్తత్తత్తడివాడు (వృషభవాహనుడు), వెంట్రుక యడుగులవాడు (రోమపాదుడు), మొగిలిత్రోవ (ఆకాశవీధి), వలిగుబ్బలి రాచ కూతురు (హిమవంతుడి కూతురు-హైమవతి), పది యరదముల దొరకొడుకు (దశరథుడి కొడుకు రాముడు) ఇలా మాటలు పుట్టించే పని లెక్కించ తగినంతగా చేశాడు. ఇవి కొందరికి బుడిబుడివి (కృతకం)గా కన్పించవచ్చుగాని, తెలుగులో ఒక మాటను పుట్టించుకునే పనిని తక్కువ చేసి చూడకూడదు.
భక్తి, ముక్తి అనే సంస్కృతం మాటలకు సమానమైన తెలుగు మాటలు ఉండవు. అవి ఉడివోని మిన్కులకు(వేదాలకు) చెందిన నుడులు కాబట్టి, వాటిని ఉన్నవి ఉన్నట్టు వాడుకోవటం మంచిది. లేదా, బత్తి ముత్తి అంటూ కూర్చుకోవాల్సి ఉంటుంది. పుడమి చెలి యల్లువాడు (భూదేవికి చెలుడైన విష్ణువు) అంటే రాముడని! ఇవి పేర్లను తెలుగు చేయటంకాదు.. వాటిని తెరకు (వివరణ)గా వ్రాయడం!
“మొలక నవ్వులవాఁడు తలుకారు తొలుకారు
బలు కార్మొగులఁగేరు సౌలుఁపువాఁడు
నిడుద చేతులవాఁడు నిద్దంపు టద్దంపు
సుద్దంపు నెఱి చెక్కు జోటివాఁడు
వెడఁద కన్నులవాఁడు విప్పారి యొప్పారు
గొప్ప నెన్నుదురుచే నొప్పువాఁడు
వఱపు పేరెదవాఁడు పరువంపు గరువంపు
నెలవోని నెమ్మోము గలుగువాఁడు
కేల సింగాణి విదాగి గ్రాలువాఁడు
కుఱుచ మెడ వాఁడు సోగ పెన్నెఱుల వాఁడు
వలఁతి యగువాఁడు ముజ్జగంబులును వలచు
సోయగమువాఁడు సువ్యెనీ రాయఁడింతి. (సుందర. 83)”
ఇలా తెరకువ(వివరణాత్మకం)గా వ్రాసినవెన్నో ఈ అచ్చతెలుగు రామాయణంలో ఉన్నాయి.
“కడ యొడయలఁ దఱిమెడు నం/జుడు దిండులు మిమ్ము మనుపఁ జూతురె పోరం
గుడి మింగెడు వానికి లో/నడరెడు వేల్పుట్రవడియ మగుఁగద తలంపన్”
“మీ వానరులే పోరుకి వస్తే ‘కడ ఒడయలు’ (దిక్పాలకుల్నే) తరిమేయగలిగిన మా నంజుడుతిండులు (రాక్షసులు) మిమ్మల్ని తినేస్తారు. గుడిని మింగేవాడికి గుళ్లో దేవుడు ఉట్రవడియమే” అంటాడు హనుమతో రావణుడు. సుందరకాండలోని పద్యం ఇది. ఉట్రవడియం అంటే, ‘ఒకదినుసు వడియము’ అని కొందరు, “A rich dish, a kind of pilao of rice and spices” పలావు లాంటి ఖరీదైన వంటకం- అని బ్రౌను వ్రాశారు. “అవతలివాడి సొమ్ము ఉట్రవడియంగా చప్పరించేశాడు”, “ఉన్నపళంగా ఉట్రవడియంలా రమ్మంటే ఎలా?” ఇలాంటి మాటలు మంది వాడుకలో ఉన్నాయి. ఉట్రవడియం అంటే ఉత్త వడియం లేదా పిండి వడియం కావచ్చు.
“తెలుఁగునకు మున్ను లక్షణంబులు మహాక
వీశ్వరులు పెక్కు రచియించి యిడి, రింకేల
కూర్చవలె? –నన్నఁ బ్రౌఢిమ కొఱకు నాక
తెలిసిన తెరంగు నొక కొంత తేటపఱుతు”
అంటూ కూచిమంచి తిమ్మన సర్వలక్షణ సార సంగ్రహము ముందుమాటల్లో అనేక నుడికట్టు పొత్తాలు (వ్యాకరణ గ్రంథాలు) ఉండగా ఇప్పుడీ పొత్తం దేనికని తానే అడిగి తానే ఇలా ఒప్పుకోలు చెప్పుకున్నాడిందులో! వ్రాతలోనూ నుడి ఎరుకల్లోనూ దిట్టతనాన్ని (ప్రౌఢిమ) పెంచుకోవటానికి పై అంతస్తునవున్నవారికోసం వ్రాస్తున్నానన్నాడు.
“..ఎల్ల వారికిఁ/దెలిసెడి యాపలుకు లచ్చతెనుం గనంబరంగున్” అని కేతన చెప్పిన మాటలతో తిమ్మనగారికి ఒప్పుదల ఉంది. విన్నకోట పెద్దన గారు చెప్పినట్టు “శ్రేయములై, బహుదేశా/నేయములై చక్కఁదనము నెఱదనములు నై/ యా యా నెలవులఁ జెవులకుఁ/దీయము లగు పలుకులెల్ల దేశ్యము లయ్యెన్” అనేది అచ్చతెలుగుకు అచ్చమైన కట్టడ (లక్షణం)గా చెప్పుకోవాలి. తలమిన్నగా ఉన్న మాట, అన్ని తావులవారికి నెయ్యము(ఇష్టము) కలిగేదిగా ఉన్న పలుకు వినసొంపుగాను, నెరతనం(నేర్పు) మెరిసేలాగానూ ఉన్న నూడి అన్ని వైపులా ఉండేవారికి చెవులకింపుగా ఉండే తెలుగు మాటలన్నీ అచ్చతెలుగులే అన్నాడాయన.
అలాంటి తెలుగుని మనం ఇప్పుడు వ్రాయలేమా? ఒక చిన్న నూకు (యత్నము)ను తెద్దాం. మనం వ్రాస్తున్నకొద్దీ మంది చెవులను తాకి ఇంపై సొంపై అలరారుతాయి.
అచ్చతెలుగున వ్రాయాలంటే సంస్కృతాన్ని ఈసడించటంగానూ, వేల్పులను తిట్టడంగానూ కొందరు అపోహ పడాల్సిన పని లేదు. అమ్మనుడిని మనం కాపాడుకోవాలనే కదలిక(ఉద్యమం)లో ఇది ఒక ‘పాలు’ అంతే!
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
