Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కులక్షయం – వంశ వినాశనం

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘కులక్షయం – వంశ వినాశనం’ అనే రచనని అందిస్తున్నాము.]

భగవద్గీత 1వ అధ్యాయం (సాంఖ్య యోగం) 40వ శ్లోకం:

అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః।
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః॥

ఒకరి వంశంలో అధర్మం ప్రబలితే ఆ వంశం మొత్తం నాశనమవుతుంది. ముఖ్యంగా ఇంటి వంశాచారాలను కాపాడవలసిన కుల స్త్రీలు చెడిపోతారు. అటువంటి కుల స్త్రీ పతనం వలన ఆ వంశంలో అవాంఛనీయ సంతతి కూడా వృద్ధి చెంది ఒకనాటికి ఆ వంశం మొత్తం నాశనమైపోతుంది. కుల క్షయము కావడం వలన కుల ధర్మాలు నశించిపోతాయి. కుల ధర్మాలు నశించడం వల్ల మిగిలిన వారిని, అధర్మము పట్టి పీడిస్తుంది. ఎందువల్లనంటే యుద్ధం తర్వాత మిగిలిన వారు కేవలం పిల్లలు స్త్రీలే కదా అని పై శ్లోకానికి అర్ధం.

వర్ణ సంకరము వల్ల, బలాత్కారం వల్ల పాపపు సంతానము పుడుతుంది. శరీరం యొక్క భావనలు ఎలా ఉంటే అటువంటి భావనలు కలిగినటువంటి ఆత్మలనే శరీరము ఆకర్షిస్తుంది. అటువంటి సంతానము వల్ల అధర్మము మరింత పెరుగుతుంది. కులాచారం ప్రకారము మన పితృదేవతలకు పిండము పెట్టేవారు కూడా ఉండరు. అందువల్ల పితృదేవతలు నీచ స్థానానికి పడిపోతారు. అందువల్ల ఈ కుల ధర్మము నష్టం కాకుండా మర్యాద భ్రష్టు పట్టకుండా కాపాడమని అర్జునుడు శ్రీకృష్ణభగవానుని వేడుకున్నాడు.

మనకు పెద్దలు విధించిన సదాచారాలను, విద్యుక్త ధర్మాలను విస్మరించి, పాశ్చాత్య పోకడలకు తెగబడి వాటిని అనుసరిస్తూ పోతే చివరకు ఆ వంశానికి ఎటువంటి గతి పడుతుందో మహాభారత కాలమందే (ద్వాపర యుగం) భగవంతుడు మానవాళికి అర్జునుడి మనస్సులో సందేహాత్మక ధోరణికి ప్రవేశపెట్టడం ద్వారా తెలియజేశాడు.

మన ఆచారాలు సంప్రదాయాలు మన పూర్వీకులు చాలా గొప్ప గొప్ప ఆచార వ్యవహారాలను మనకోసం తయారుచేసారు. అయితే భౌతికత పెరుగుతున్న నేటి కాలంలో మనం మన యొక్క అతివాదంతో అన్నింటిని ఒకే గాటిన కట్టేస్తున్నారు. అన్ని ఆచార వ్యవహారాలకు త్రిలోదకాలిస్తున్నాం. ఉదాహరణకు ఇప్పుడు ప్రపంచం మొత్తం మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అనుసరించే పనిలో ఉన్నారు. మన పెద్దలు అలవాటు చేసిన అతి ముఖ్యమైన సంస్కారం నమస్కారం. మనం ఎవరినైన కలిసినప్పుడు మొదట నమస్కరించి పలకరిస్తాం. కానీ మన అలవాట్లు అన్ని మారిపోయి షేక్‌హ్యాండ్ వచ్చింది, మన ఎదురుగా ఉన్న వారికి రెండు చేతుల‌తో న‌మ‌స్క‌రిస్తే మ‌నం వారిని ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటామ‌ట‌. ఎలాగంటే రెండు చేతుల‌ను జోడించిన‌ప్పుడు చేతి వేళ్ల‌న్నీ క‌లిసిపోయి ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి మ‌న జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయ‌ట‌. దీంతోపాటు మెద‌డు ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌.

మను-స్మృతిలో ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ (3.56) – ‘ఎక్కడెక్కడైతే స్త్రీలు పవిత్రమైన, పరిశుద్ధమైన నడవడికతో ఉంటారో, మరియు ఆ యొక్క పవిత్రతకు వారు మిగతా సమాజం చే పూజింపబడుతారో, అక్కడ దేవతలు హర్షిస్తారు’ – అని స్పష్టంగా వుంది. కానీ పాశ్చాత్య నాగరికతా వ్యామోహంలో స్త్రీలు నీతిబాహ్యమైన ప్రవర్తనతో ఉన్నప్పుడు, బాధ్యతారహితమైన పురుషులు తమ జారత్వానికి, దాన్ని అదునుగా తీసుకొనుటం వలన అవాంఛిత సంతానం కలుగుతారని చెప్పబడింది. అయితే మనుస్మృతి కాలంలో కాస్త ఛాందస భావాలు వుండవచ్చు. అదే శ్లోకాన్ని స్త్రీలతో పాటు పురుషులకు, ఇంటి పెద్దలకు, పిల్లలకు కూదా సమానంగా వర్తింపజేయాలి. ఒక అంశంలో స్త్రీ లేదా పురుషుడు ఎవరైనా తమకు విధింపబడిన ఆచార వ్యవహారాలను విస్మరిస్తే ఆ వంశం అధోగతి పాలవడం తధ్యం.

నేటి కాలమాన పరిస్థితుల్లో జనులు సులభంగా పెడదారి పట్టేందుకు అవకాశం వుంది. కాబట్టి కుటుంబ పెద్దలు తమ కుటుంబంలో అందరూ కూడా సత్ప్రవర్తన కలిగి వుండాలా చూసుకోవాల్సిన బాధ్యత వుంది. అందరూ కొంత సమయం ధర్మ కార్యాలకు కేటాయించేలా చూడాలి.

Exit mobile version