[డా. గాదిరాజు మధుసూదన రాజు గారు రచించిన ‘కుళ్ళు మనిషి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
‘వామ్మో! కుళ్ళు మనిషి! దరిద్రుడు! ఎందుకబ్బా వీడు వచ్చాడు’ అనుకుంటూ అసహ్యం నిండిన మనస్సుతో అనుమానంగా, హాస్పిటల్ గది ముందు తచ్చాడుతున్న సుందర్ రావు వైపు చూశాడు కుబేర మూర్తి.
***
పగలు.. రాత్రి.. తేడా తెలియటం లేదు. నర్సులు షిఫ్టులు మారుతున్నారు. ప్రతి నర్సూ ఒక టాబ్లెటో ఇంజక్షనో ఇస్తోంది బాధ్యతగా.
డాక్టర్‍లు కూడా అంతే.. షిఫ్ట్‌లు మారుతూన్నారు. మారిన ప్రతి డాక్టర్ ”ఎలా ఉంది బావుందా?” అంటూ అడుగుతూ ఉన్నాడు శాంతంగా.
రోజుకోసారి స్పెషలిస్ట్ డాక్టర్ గారు వచ్చి కేస్ షీట్ చూసి.. ““ఏం భయం లేదు. తగ్గిపోతుంది. అనవసర భయాలు పెట్టుకోకండి.” అంటూ ఉంటాడు.
హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా అప్పుడు అప్పుడు వచ్చి.. “మీ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. మీ అమ్మాయి కూడా ఫోన్ చేసింది. మీరంటే మీ వాళ్ళకి ఎంత ప్రేమ అంటే.. అబ్బో! చాలా చాలా.. రోజుకు కనీసం నాలుగు సార్లు ఫోన్ చేసి మీ ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ ఉంటారు” అంటూ ఉంటాడు.
ఏదో మాయదారి గుండె నొప్పి భయపెట్టటంతో.. జబ్బుతో హాస్పిటల్‍లో చేరాడు రిటైర్డ్ ఆఫీసర్ కుబేర మూర్తి.
కళ్ళు తెరుచుకుని ఉన్నప్పుడు మాత్రం.. కాలక్షేపం కోసం ఎదురుగా కనిపిస్తున్న టీవీలో కనిపిస్తూ ఉన్న తతంగం చూస్తూ ఉంటాడు, అంత కన్నా మంచి ఆప్షన్ లేదు మరి.
***
సుందర్ గురించి ఆలోచించటం మొదలు పెట్టాడు కుబేర మూర్తి.
వాడు తన బాల్య మిత్రుడే, తన తోటి ఉద్యోగి కూడా. అప్పుడు బాగానే పలకరించే వాడు.
పదేళ్ల క్రితం..
జిల్లా అధికారిగా ప్రమోషన్ వచ్చింది.
అప్పటినుండి దూరంగా ఉంటున్నాడు సుందర్.
ఓర్వలేని తనం!
కుళ్ళు!
తనకు నాలాగా ప్రమోషన్ రాలేదు అనీ కుళ్ళు! అటువంటి వాణ్ణి దూరంగానే ఉంచడమే మంచిది. అందరూ తోటి ఉద్యోగులే. అయినా.. అభిమానిస్తూ, చుట్టూ ఉంటారు.
ఆఫీస్‌కి వచ్చి పోతూ ఉంటారు. ఏమి చేయమన్నా చేస్తారు.
గోవర్ధన్ అయితే ఇంకా మంచి మనిషి.. ఆవునెయ్యి తెచ్చి ఇచ్చాడు అతను.
“అయిపోయిందా చెప్పండి సార్ మళ్ళీ తెచ్చిస్తా” అంటూ చేతులు కట్టుకుని నవ్వుతూ పలకరిస్తూ ఉంటాడు.
ప్రమోషన్ వచ్చిన సందర్భంగా.. ఏర్పాటు చేసిన సభలో సహోద్యోగులు ఎందరో మాట్లాడారు. గిఫ్ట్‌లు ఇచ్చారు.
కానీ సుందర్ రావు మాత్రం.. ఉత్తి చేతులతో వచ్చి కంగ్రాట్స్ అని ఒక మాట చెప్పి, బిర్యానీ తిని వెళ్ళి పోయాడు. వేస్ట్ ఫెలో.
కూతురు పెళ్ళిరోజు కూడా వచ్చి, అక్షింతలు వేసి వెళ్ళాడు అంతే!
“స్నేహం విలువ తెలియని వాణ్ణి, తోటి స్నేహితుడు ఎదుగుతుంటే ఓర్వలేని వాణ్ణి ఊరికే వదిలేయటం కూడా తప్పే సార్, మీ పవర్‌తో సుందరం గాణ్ణి తొక్కేయండి, మీ పవర్ ఏమిటో చూపించండి” అంటూ కసిగా బాగా రెచ్చగొట్టాడు గోవర్ధన్.
అయినా ఆ మాటల్ని అస్సలు పట్టించుకోలేదు, తాను మంచి వాడు కాబట్టి అనుకున్నాడు.
రిటైర్ అయ్యాక కూడా ఒక రోజు నవ్వుతూ నమస్కారం పెడుతూ పార్కులో ప్రేమగా పలకరించడానికి దగ్గరికి వస్తున్న సుందర రావుని చూడగానే ఆశ్చర్యం వేసింది
రిటైర్‌మెంట్ డబ్బు వచ్చిందన్న విషయం గుర్తుకు వచ్చింది.
‘ఆ డబ్బు రానంత వరకూ సుందర్.. నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు, ఆ డబ్బు కోసం అప్పుకోసం వస్తూ ఉండవచ్చు. దరిద్రపు యదవకి ఇన్నాళ్ళకి తన అవసరం వచ్చినట్లుంది’ అన్న ఆలోచన మదిలో మెదిలింది.
అయినా అలాంటి మనో భావాల్ని బయట పడనీయలేదు.
“బావున్నావా మూర్తీ!” అంటూ వచ్చాడు సుందర్.
“నేను నీకే జిల్లా స్థాయి ఆఫీసర్‌గా రిటైర్ అయ్యాను. నీకు కనీసం డివిజన్ స్థాయిలో కూడా ప్రమోషన్ రాలేదు కదా. బాగానేవున్నాను సుందర్” అంటూ ఉంటే..
“పిల్లలు బావున్నారా” అన్నాడు మళ్ళీ.
“వాళ్లకేం కొదువ హాయిగా ఉన్నారు. గ్రీన్ కార్డు హోల్డర్లు, అమెరికాలో ఉన్నారు. ఆ విషయం నీకు తెలుసుకదా!” అంటున్నప్పుడు, జవాబులో కొంచెం గర్వం తొణికిసలాడింది సహజ సిద్ధంగానే తనకి.
‘రిటైర్డ్ కాక ముందు ఇలా ఆఫీస్‍కి వచ్చి ఉంటే.. ఇలా తనను సార్ అనకుండా పేరుతో పిలిచి, ఏకవచనంతో మాట్లాడితే.. అక్కడ ఉన్న వీడి తోటి ఉద్యోగులే గడ్డిపెట్టేవారు ఈ సుందర్ గాడికి. అందుకేనేమో రాలేదు’ అనుకుంటూ మౌనం వహించడం గుర్తుకు వచ్చింది.
“నాకు ప్రమోషన్ ఇంకా రాలేదు. వస్తుందన్న ఆశలేదు” అన్నాడు సుందర్
“కుళ్ళుబోతువి కదా అందుకే దేవుడు కరుణించలేదు.” అనాలని అనిపించింది.
ప్రమోషన్ వచ్చాక తనను గౌరవంగా “సార్” అని పలకరించడానికి ఒక్కసారైనా ఆఫీసుకి రాలేదన్న బాధను మనసులోనే అణచుకొని తన్ను తాను, సముదాయించుకున్న క్షణం గుర్తుకు వచ్చింది.
“రిటైర్‌మెంట్ డబ్బు అంతా వచ్చిందా మూర్తీ?” అంటున్న సుందర్ ముఖంలోకి అదోలా చూస్తూ
“ఊ..” అంటూ తల ఊపాడు
‘ఇక.. ఉన్నవీ లేనివీ కష్టాలు చెబుతాడు. ఆనక అప్పు అడుగుతాడు’ అనుకున్నాడు తను.
“రిటైర్‌మెంట్ సమయానికి నీ బాధ్యతలు అన్నీ తీర్చుకున్నావు. అదృష్టవంతుడివి నీవు” అంటూ మాటలు పొడిగించబోయాడు సుందర్.
చాలాసేపు మాట్లాడుతూ ఉంటే మొహమాటానికి పోయి, అప్పో, అప్పుకు ష్యూరిటీయో ఇచ్చి,ఇరుక్కు పోవాల్సివస్తుందేమో, అనుకుంటూ ముందు జాగ్రత్త భాగంగా.. ఎవరో చెప్పిన గతానుభవాల్ని జ్ఞప్తికి తెచ్చుకొని,బెంచీ మీద నుంచి లేచాడు తను.
“సరేలే సుందర్! మా ‘రిచ్ హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ’లో రెసిడెన్షియల్ సొసైటీ మీటింగ్ ఉంది. ఈ రోజు కొంచెం పని ఉంది వెళుతున్నా” అంటూ.. తప్పించుకోవటం గుర్తుకు వచ్చింది కుబేర మూర్తికి.
ఇన్నేళ్ల తర్వాత.. కనిపిస్తూ ఉన్నాడు సుందర్ కుబేర మూర్తికి.
“మూర్తీ! గుడ్ మార్నింగ్. నమస్తే. విష్ యూ ఫాస్ట్ రికవరీ అండ్ హ్యాపీ లైఫ్” అంటూ నవ్వుతూ వచ్చి, తన వెంట తెచ్చిన పళ్ళ బుట్టను బెడ్ ప్రక్కన పెట్టాడు సుందర రావు.
‘అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు సుందర్ గాడు, అదే నవ్వు ముఖం! అదే సెంటిమెంటల్ మార్కు పలకరింపు! మాటల్లో పెట్టి మొహమాట పెట్టి ఏదో లబ్ధి పొందేందుకే పథకం వేసుకొని వచ్చి ఉంటాడు. అప్పటిలా తప్పించుకొని పోయే అవకాశం కూడా లేదు నాకు. ఇరుక్కు పోయా’ అనుకుంటూ “థ్యాంక్ యూ” అన్నట్టు చూశాడు కుబేర మూర్తి.
వినిపించలేదు, కనీసం పెదవుల కదలిక కూడా కనిపించలేదు సుందర్‌కి.
అయినా.. పాతికేళ్ల పాత స్నేహితుడు కాబట్టి.. తాను పరామర్శకి రావటం పట్ల, కుబేర మూర్తికి మనసులో అయిష్టం ఉన్నట్లు పసిగట్టాడు సుందరం.
“ఈ రోజు మా అక్కయ్యను అదే మీ ఆవిడ గారిని మీ కోసం హాస్పిటల్‌కి నేనే రావద్దన్నాను” అన్న సుందర్ మాట మాత్రం.. కుబేర మూర్తికి కోపం తెప్పించింది.
“మూర్తీ! నీవంటే నాకు ప్రాణం. నీకు ఆరోగ్యం బాగాలేదు అని నిన్ననే తెలిసింది. నా శ్రీమతి, అదే నీ చెల్లెలిని తీసుకొని మీ ఇంటికి వచ్చాను. ప్రస్తుతం అది మీ ఇంట్లోనే ఉంది.” అంటున్న మాటలు వినబడగానే ‘తిష్ట వేయటం అయిపోయిందన్న మాట’ అనుకున్నాడు కుబేర మూర్తి.
“గోవర్ధన్ చెప్పాడు నీవు నామీద చాలా కోపంగా ఉన్నావని” అని అంటున్న సుందర్ రావు పై కోపం వచ్చింది తనకు.
“స్నేహితుడు అంటే వాడే.. వాడి పేరు పలికే అర్హత కూడా నీకు లేదు.” అన్నాడు చిన్నగా.
“సారీ రా మూర్తీ! నన్ను క్షమించు. ఇప్పుడు నీవు కోపం తెచ్చుకోకూడదు. నీ ఆరోగ్యం ముఖ్యం. మనశ్శాంతిగా ఉండు. నేను వెళతానులే” అంటూ కన్నీళ్లు పెట్టుకుని తలనిమిరాడు సుందర్.
అంతే.. ఇంత వరకు పరవాలేదు. కానీ.. ఇక మీదట..
ఈ కుళ్ళు మనిషి సుందర్ గాడు తన నిస్సహాయతను అవకాశంగా చేసుకొని ఎలా రెచ్చిపోతాడో ఏమో అనుకుంటూ భయపడ్డాడు కుబేర మూర్తి.
***
గోవర్ధన్ స్వార్థపూరితమైన వ్యవహారాల తీరు మాయా జాలం చేసి సుందర రావు, కుబేర మూర్తుల మధ్య అగాధం సృష్టించింది. గోవర్ధన్‍ని కుబేర మూర్తికి ఇష్టమైన వ్యక్తిగా నిలిపింది.
గోవర్ధన్ ఎవరో కాదు. ఒకప్పుడు సుందర్ లాగే అతను కూడా మూర్తికి సహోద్యోగి. మూర్తికి జిల్లా ఆఫీసర్‍గా ప్రమోషన్ వచ్చాక, సబార్డినేట్‍గా ఉంటూనే, ఒక పాత స్నేహితునిగా బాగా చనువు పెంచుకొన్నాడు, మాయ మాటలు చెబుతూ, జిల్లా ఆఫీసర్ స్థాయిలో ఉన్న కుబేర మూర్తి అధికారాన్ని, పరపతిని ఉపయోగించుకొని బాగా లాభపడ్డాడు.
కుబేర మూర్తికి అంతో ఇంతో చెడ్డపేరు కూడా రావటానికి కారకుడయ్యాడు. మూర్తి సహాయంతో ప్రమోషన్ కూడా పొంది తానూ త్వరలో రిటైర్ కాబోతున్నాడు.
మూర్తికి హార్ట్ ప్రాబ్లం వచ్చినట్లు హాస్పిటల్‍లో ఇబ్బంది పడుతున్నట్లు, వాడికి ఎప్పుడో తెలుసు. ఇదే ఊరిలో ప్రక్క వీధిలోనే ఉన్నాడు అతను, అయినా ఇంతవరకూ చూడటానికి కూడా రాలేదు.
ఈ విషయాలు అన్నీ సుందర రావుకి తెలుసు.
“నీ ఫ్రెండ్ కుబేర మూర్తి గుర్తున్నాడు కదా, జిల్లా ఆఫీసర్ అయ్యాక తన చుట్టూ వినయంగా తిరుగులేదని నీ మీద పగబట్టి జిల్లా బార్డర్‌కి ట్రాన్స్ఫర్ చేశాడు కదా! ఇప్పుడు రిటైర్ అయి ఒంటరిగా సిటీలో ఉంటున్నాడు. పలకరించే దిక్కులేదు యదవకి. హార్ట్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్‌లో చేరాడు.” అంటూ ఫోన్ చేసి ఆ గోవర్ధన్ చెప్పడంతోనే క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే సిటీకి వచ్చాడు సుందర రావు, అదీ తన భార్యతో పాటుగా.
అప్పటికే కుబేర మూర్తి గారి శ్రీమతి గారి ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. బిపి, షుగర్‌లు బాగా పెరిగిపోయాయి, కీళ్ల నొప్పులు ఎక్కువ కావటంతో, కాలు బెణకడంతో నడవలేని స్థితిలో ఇబ్బంది పడుతూ ఉంది.
ఈ విషయాలేవీ కుబేర మూర్తికి తెలియవు పాపం!
***
తన తల నిమురుతూ..
కన్నీళ్లు పెట్టుకుంటున్న సుందర రావు వంక కొంచెం రాజీ పడినట్లుగా సానుకూలంగా చూసాడు కుబేర మూర్తి.
అంతలోనే..
“అన్నయ్యా!” అంటూ ఏడుస్తూ గదిలోకి వచ్చింది కుబేర మూర్తి చెల్లెలు సావిత్రి.
ఆమెను చూడగానే కొండంత ధైర్యం, సముద్రమంత సంతోషం పొంగింది కుబేర మూర్తి ముఖంలో.
పదేళ్ళ క్రితం కుబేర మూర్తి కూతురు పెళ్ళిలో.. ఏదో చిన్న విషయంలో అలిగి దూరం అయ్యింది సావిత్రి.
అన్నా చెల్లెళ్ళను కలిపేందుకు, వాళ్ళు కలుసుకునేందుకు ఇదే మంచి సమయం అని ఆమెకు ఫోన్ చేసి రప్పించాడు సుందర రావు.
ఈ విషయం కూడా కుబేర మూర్తికి తెలియదు.
జిల్లా స్థాయి అధికారిగా ఉన్నా కుబేర మూర్తిని తనకు ఉద్యోగంలో ఆ మేలు ఈ మేలు చేయమని అడిగి ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు సుందర రావు.
స్నేహాన్ని సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని ఇబ్బంది పెట్టి.. అడ్డదారిలో, అక్రమ మార్గాల్లో వెసులుబాట్లు, లాభాలు, బదిలీలు పొందటం సుందర రావుకి ఇష్టం లేదు.
‘అలా ఏదైనా మేలు చేయటం వలన, మేలు చేసిన వ్యక్తికి చెడ్డ పేరు వస్తే.. తెలిసి తెలిసీ చెడ్డపేరు వచ్చేలా పనులు చేయించుకున్న వాడు మంచి స్నేహితుడు ఎట్లా అవుతాడు? అస్సలు స్నేహితుడే కాడు. స్నేహితుడు అంటే స్నేహితుని మేలు కోరేవాడు. స్నేహాన్ని పెట్టుబడిగా పెట్టి మేలు పొందేవాడు కాదు’ అని గట్టిగా నమ్ముతాడు సుందర్ రావు.
కుబేర మూర్తికి, ఆయన సతీమణికీ హాస్పిటల్‍లో తోడుగా.. కంటికి రెప్పలా వారిని కాపాడుకుంటూ, అమెరికా నుండి వాళ్ళ కొడుకూ, కూతురూ వచ్చే దాకా.. సుందర రావు తన శ్రీమతితో పాటు అక్కడే ఉన్నాడు.
వాళ్ళు రాగానే.. అందరికీ గుడ్ బై చెప్పి తన ఇల్లు చేరుకునేందుకు.. పల్లెకు బయలుదేరాడు సుందర రావు తన శ్రీమతితో పాటు తృప్తిగా.
(స్నేహితునిగా తన బాధ్యత నెరవేర్చగలిగినందుకు కృతజ్ఞతలు, గుర్తింపు మరేమీ ఆశించలేదు. ‘కుళ్ళు మనిషి’ అంటూ కుబేర మూర్తి మనస్సులో ఈ లోకం వేసిన ముద్ర అలాగే ఉందో చెరిగి పోయిందో అని కూడా ఆలోచించలేదు.)
