[జాలాది రత్నసుధీర్ గారి ‘కుమార్తెకు ప్రేమతో – నాన్న’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ఉత్తరాల రూపంలో వెలువడిన రచనలని లేఖాసాహిత్యమని పేర్కొనడం కద్దు.
భారతీయ సాహిత్యంలో లేఖాసాహిత్యం తనదైన పాత్ర పోషించింది. ప్రాచీన కవుల కావ్యాలలో హంసల ద్వారానో, మేఘాల ద్వారా సందేశాలు/లేఖలు పంపుకున్న దశ నుంచి, ఆధునిక సాహిత్యంలో పోస్ట్‌కార్డులు/ఇన్‍ల్యాండ్ కవర్స్/ఎన్వెలప్స్‌లో ఉత్తరాలు రాసి, పోస్ట్‌మ్యాన్‌లను కూడా పాత్రలుగా మలచిన రచనలు ఉన్నాయి.
మిత్రులకో, కుటుంబ సభ్యులకో, అభిమానులకో రాసిన ఉత్తరాల ద్వారా కొందరు సాహిత్యంలో నిలిచిపోయారు. ఆయా లేఖలు ఎన్నో విషయాలపై అవగాహనని కల్పించేవి, సందేహాలు తీర్చేవి, మార్గదర్శనం చేసేవి. ఉత్తరాల ప్రయోజనాన్ని బాగా వెల్లడించిన రచనల్లో భారత తొలి ప్రధాని పండిత్ జవహర్‍లాల్ నెహ్రూ – తన కుమార్తె ఇందిరా గాంధీకి రాసిన ఉత్తరాల సంకలనం – ‘Letters from a Father to His Daughter’ ప్రసిద్ధమైనది. ఈ పుస్తకం ద్వారా మానవ చరిత్రను, నేచురల్ హిస్టరీని కుమార్తెకు పరిచయం చేశారు నెహ్రూ. దీన్ని ప్రముఖ హిందీ రచయిత మున్షీ ప్రేమ్‍చంద్ ‘పితా కే పత్ర్ పుత్రీ కే నామ్’ పేరుతో హిందీలోకి అనువదించారు. కాటూరి వేంకటేశ్వరరావు గారు ఈ ఉత్తరాలని ‘చిరంజీవి ఇందిరకు’ (నెహ్రూ లేఖలు) అనే పేరుతో తెలుగులోకి అనువదించారు.
ప్రపంచ ప్రముఖులు నెహ్రూకు రాసినవీ, నెహ్రూ వారికి రాసిన ఉత్తరాలను ‘నెహ్రూ లేఖలు’ (1960) పేరిట అనువదించి అందించారు విజయవాడకు చెందిన ఆదర్శ గ్రంథమండలి వారు.
తెలుగులో చలం ఉత్తరాలు, ‘ప్రేమలేఖలు’, సంజీవ్‌దేవ్ ఉత్తరాలు, కనుపర్తి వరలక్ష్మమ్మ గారి ‘శారద లేఖలు’, త్రిపురనేని గోపీచంద్ గారి ‘పోస్ట్ చేయని ఉత్తరాలు’, ‘ఉభయకుశలోపరి’, బోయి భీమన్న గారి ‘జానపదుని జాబులు’ వంటివి ప్రసిద్ధమైనవి. అబ్బూరి ఛాయాదేవిగారు ‘లేఖాసాహిత్యం’ అనే పుస్తకం రాశారు.
పూర్తిగా ఉత్తరాలతోనే కథలు వ్రాసిన కథకులున్నారు. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి ‘దూరం’ నవల ఉత్తరాలతోనే సాగుతుంది. ఇలా ఉత్తరాలు/లేఖలు – భారతీయ/తెలుగు సాహిత్యంలో కీలకపాత్ర పోషించాయి.
తెలుగులో లేఖాసాహిత్యానికి మరో చేర్పు శ్రీ జాలాది రత్నసుధీర్ వ్రాసిన ‘కుమార్తెకు ప్రేమతో – నాన్న’. కుమార్తెకు ప్రేమనీ, విజ్ఞానాన్ని పంచిన తండ్రి లేఖలివి.
~
పురుషోత్తమరావు ఓ కాలేజీలో లెక్చరర్. ఆయన శ్రీమతి శశికళ గృహిణి. ఈ దంపతులకి మానసి, సాహసి అనే ఇద్దరు కూతుళ్ళు, కౌశిక్ అనే కొడుకు ఉంటారు. పెద్ద కూతురు మానసికి రెండేళ్ళ క్రితం పెళ్ళయింది. వివాహమయ్యింది. కౌశిక్ ఇంజనీరింగ్ చదువుతుంటాడు. ఉత్తమ వ్యక్తిత్వం, ఉన్నత భావాల కలబోత పురుషోత్తమరావు. కళాశాలలో మంచి అధ్యాపకుడు, ఇంట్లో మంచి భర్త, మంచి నాన్న.
సాహసి చిన్నప్పటి నుండి చదువులోనూ, ఆటపాటలలో చాలా యాక్టివ్. ఐండియన్ పోలీస్ సర్వీస్‌కి ఎంపికవడం ఆమె లక్ష్యం. స్వశక్తి మీద ఎంతో విశ్వాసం ఉన్న సాహసికి, స్వీయ ప్రేరణ ఓ ఉపకరణం.
అనుకున్నట్టుగానే, బాగా చదివి, యు.పి.ఎస్.సి. పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధించి ఐ.పి.ఎస్.కు ఎంపికవుతుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరి లోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కి – శిక్షణకు వెళ్తుంది.
సాహసి ఇంటికి దూరంగా ఉండటం అదే తొలిసారి కావడంతో, తండ్రి ఆమె మీద బెంగపడతారు. రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నా ఆయనకు తృప్తి ఉండదు. లాప్‌టాప్ వాడటం, ఈమెయిల్ పంపడం ఆయనకు పూర్తిగా అలవాటు కాలేదు. సాహసి ఈమెయిల్స్ పంపితే, కౌశిక్ వాటిని ప్రింట్ తీసి నాన్నకి ఇస్తూంటాడు. సాహసి పంపే ఈమెయిల్స్‌కి జవాబులుగా, పురుషోత్తమరావు ఆమెకు ఉత్తరాలు వ్రాసి పోస్టులో పంపుతుంటారు.
ఆయన కాలేజి పక్కనే పోస్ట్ ఆఫీసు ఉంటుంది. క్లాసు లేనప్పుడు స్టాఫ్ రూమ్‌లో కూర్చోని ఉత్తరాలు రాసి, ఇంటికెళ్లేటప్పుడు వాటిని పోస్ట్ చేస్తుంటారు.
ఈ ఉత్తరాలలో ఆయన తమ కుటుంబ వివరాలు, కొన్ని సమస్యలు, వాటి పరిష్కారాలు ప్రస్తావిస్తారు. ప్రధానంగా, తాను వివిధ దినపత్రికలలో చదివిన విశేషమైన వార్తలు, లేదా ఇతర మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చిన ముఖ్యమైన అంశాలను ప్రేరణాత్మకంగా కూతురికి ఉత్తరాలలో వివరిస్తారు.
కూతురిని ఒక్కోసారి తన స్కూటర్ వెనుక కూర్చుని బడికి వెళ్ళిన చిన్నపిల్లగా, కొన్నిసార్లు పెళ్ళికి ఎదిగిన యువతిగా తలచుకుంటూంటారు. సాహసి ఓ పోలీసు ఉన్నతాధికారి అని గర్విస్తారు. ప్రతి ఉత్తరంలో కుమార్తె పట్ల అమితమైన ప్రేమ గోచరిస్తుంది. ఆ ఉత్తరాల సమాహారమే ఈ పుస్తకం.
~
“నీవు లేని ఇల్లు ఓ నిశ్శబ్ద ప్రపంచలా మారిపోయింది. కనీసం శని, ఆదివారాల్లోనయినా నీవు ఇంటికి రాగలిగితే ఎంత బాగుంటుంది అనుకుంటాను, వెంటనే ముస్సోరికీ, మన ఊరికి మధ్య దూరం గుర్తుకువస్తుంది” అంటారు మొదటి ఉత్తరంలో. ఈ ఉత్తరంలో అతి పిన్న వయసులో నోబెల్ ప్రైజ్ పొందిన మలాలా యూసఫ్‌జాయ్ గురించి, పదవ తరగతి పరీక్షలు వ్రాయడానికి గుర్రం మీద వెళ్ళిన కేరళ బాలిక సి.ఎ. కృష్ణ గురించి, ఈక్వేస్ట్రియన్ పోటీలలో దేశానికి స్వర్ణపతకం అందించిన దివ్యకృతి సింగ్ గురించి ప్రస్తావిస్తారాయన. వీరి విజయాల వెనుక వాళ్ళ తండ్రుల ప్రోత్సాహం ఎంత ఉన్నదీ వివరిస్తారు.
రెండవ ఉత్తరంలో సాహసి – మగవారి పట్ల పెంచుకుంటున్న ద్వేషాన్ని గ్రహించి, అందుకు కారణాలను విశ్లేషించి, తప్పని చెప్తారాయన. తమిళనాడులోని మోజెస్ అనే కానిస్టేబుల్ భార్య రాధిక – రిపబ్లిక్ డే పెరేడ్‌కి భర్తతో కలిసి వెళ్ళినప్పుడు – ఎస్.పి., ఆ పై అధికారులు అందుకునే గౌరవ వందనాన్ని చూస్తుంది. అది ఆమెకు ప్రేరణ కల్పించి, తాను కూడా అలా గౌరవ వందనం స్వీకరించే స్థాయికి ఎదగాలనుకుంటుంది. భర్త ప్రోత్సాహంతో, చదువుకుని, నాల్గవ ప్రయత్నం యుపిఎస్‌సి పరీక్షల్లో విజయం సాధించి, ఐపిఎస్ అవుతుంది. ఈ ఉదంతాన్నీ; తానెన్నో శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కున్నా, వాటిని అధిగమించి తనలా మరే ఆడపిల్ల బాధపడకుడదని బాలికలకు, యువతులకు తైక్వాండో శిక్షణనిచ్చి బతుకు పట్ల భరోసా కల్పించిన పూనమ్ రాయ్ గురించి వివరిస్తూ, కూతురికి మార్గదర్శనం చేస్తారాయన.
మూడవ ఉత్తరంలో పెద్ద కూతురు మానసి సంసారంలో ఎందుకు ఇరుకుగా ఫీల్ అవుతోందో విశ్లేషిస్తారు. టెన్నిస్ క్రీడాకారిణి సోఫియా కెనిన్, బాక్సర్ నీతూ, బాక్సర్ నిఖత్ జరీన్ సాధించిన విజయాలను తెలిపి, ఆ విజయాల వెనుక ప్రేరణగా నిలిచిన వారి తండ్రుల గురించి వెల్లడిస్తారు.
ప్రతీ తండ్రీ కూతురికి కానుకగా ఇవ్వాల్సిన 14 ఆభరణాల వంటి అంశాలను 4వ ఉత్తరంలో చెప్తారు. పోలీస్ యూనిఫామ్‍లో ఒకరికొకరు ఎదురై సెల్యూట్ చేసుకున్న తండ్రీ కూతుర్ల గురించి ఈ లేఖలో ప్రస్తావించారు.
క్రిందటి ఉత్తరంలో తండ్రి ప్రస్తావించిన కూతుళ్ళకి ఇవ్వాల్సిన 14 ఆభరణాలకు బదులుగా కూతుర్లు తండ్రికి ఏమివ్వాలని సాహసి అడిగితే, 5వ ఉత్తరంలో జవాబిస్తారు పురుషోత్తమరావు. కరోనా సమయంలో మోకాలి గాయంతో బాధపడుతున్న తండ్రిని వెనక కూర్చోబెట్టుకుని హర్యానాలోని గుర్‍గావ్ నుంచి బీహార్ లోని సిర్‍హళ్ళికి 1200 కిలోమీటర్లు సైకిల్‍పై తీసుకువెళ్ళిన జ్యోతికుమారి గురించి, ఆమె మనోబలం గురించి, కిరణ్ బేడీ గురించి, తండ్రులకి తమ లివర్ దానం చేసి, బతికించుకున్న కుమార్తెల గురించి ప్రస్తావించారు.
6వ లేఖలో పెద్ద కుమార్తె మానసికి ఉద్యోగం రావడం, ఆమె పట్ల భర్త వైఖరి మారటం చెప్తారు. కూతుళ్ళు తమ తండ్రి నుంచి ఏం కోరుకుంటున్నారనే సర్వేలో వెల్లడయిన 15 అంశాలను తెలియజేస్తారు. పురుషుడి ఆలోచనలు అధోపాతాళాకిని దిగజారిపోతున్నా, స్త్రీలు తమ కలల ఆకాశం వైపు దూసుకుపోతున్నారంటూ, తొలి మహిళా పైలట్ ప్రేమ్ మాధుర్ గురించి, ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ గురించి, ఆమె తండ్రి సంజయ్ శర్మ గురించి వివరిస్తారు.
“ఆమె కళ్ళు తెరిచినప్పటి నుండి.. అతను కళ్ళుమూసే వరకూ శాశ్వత రక్షకుడిగా ఉండాలి” అంటూ కూతురి పట్ల తండ్రి బాధ్యతని 7వ ఉత్తరం గుర్తు చేస్తుంది. తండ్రికి లివర్ డొనేట్ చేయడానికి అడ్డొచ్చిన ఒక చట్టాన్ని కోర్టులో సవాలు చేసి, న్యాయపోరాటంలో విజయం సాధించి, తండ్రికి కాలేయ దానం చేసి బతికించుకున్న కూతురు దేవనంద గురించి; పోలియో బారిన పడిన కూతురికి అండగా నిల్చి, ఆమెకి ఆలంబన అయిన తండ్రి ముజ్జి వెంకటేశ్వరరావు గురించి ఈ ఉత్తరంలో చెప్తారు.
8వ ఉత్తరంలో ఇంటర్మీడియట్‍లో కాలేజ్ లైఫ్‍లోకి ప్రవేశించే అమ్మాయిలకి వారి తల్లిదండ్రులకు ఉపయుక్తమైన 15 సూచనలను చేస్తారు పురుషోత్తమరావు. వాటిని సాహసితో పంచుకుని, మరిన్ని సూచనలు చేయమని అడుగుతారు. కుమార్తెల ఆలోచనలని, నమ్మకాలని గౌరవిస్తూ, మన గౌరవం నిలబెట్టుకోవాలని పేరెంట్స్‌కి సూచిస్తారు, ఎందుకంటే, వాళ్ళ ఆలోచనలు, నమ్మకాలు ఎంతో కొంత మన నుంచి వచ్చినవే అని అంటారు.
9వ ఉత్తరంలో – సాహసి అడిగిన”నాన్నా, నాకు కాబోయే భర్తలో ఎటువంటి లక్షణాలు ఉండాలి?” అన్న ప్రశ్నకు జవాబుగా తండ్రి చెప్పిన 10 పాయింట్స్ అందరికీ వర్తిస్తాయి. కుమార్తెలకు పెళ్ళి సంబంధాలు చూస్తున్న తల్లిదండ్రులు తప్పనిసరిగా ఆలోచించవాల్సినవి ఈ పది అంశాలు. ఈ ఉత్తరంలో సుధా మూర్తి గురించి, శ్రీశ్రీ కుమార్తె జస్టిస్ మాలా గురించి, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ డా. సి. రంగరాజన్ కుమార్తె డా. రాధ గురించి వివరిస్తారీ ఉత్తరంలో.
10వ ఉత్తరంలో సాహసికి పెళ్ళి కుదరడం, కౌశిక్ బాధ్యతాయుత ప్రవర్తనని అలవర్చుకోడం, మానసి కాపురం కుదుటపడం, సాహసి అమ్మ ఆరోగ్యం పుంజుకోవడం ప్రస్తావిస్తారు. జీవితంలో చీకట్లు చెదిరిపోయి వెన్నెల కురుస్తోందంటూ ముగిస్తారు.
~
“ప్రతి ఇంటా, ప్రతి దశలో ఉండాల్సిన పుస్తకమిది. ఈ పుస్తకాన్ని ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి కూతురు, ప్రతి కొడుకు, ప్రతి భర్త చదవాలి. అంటే మన ఇంట ఉండవలసిన పుస్తకమిది. ప్రతి ఇల్లు అనురాగాల పొదరిల్లుగా పరిఢవిల్లడానికి ఉపకరించే ప్రేమైక ఉత్తరాల మాలిక ఈ పుస్తకం.” అని తన ముందుమాటలో వ్యాఖ్యానించారు గుడిపాటి. పుస్తకం చదివిన పాఠకులు ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారు.
***
రచన: జాలాది రత్నసుధీర్
పేజీలు: 130
వెల: ₹ 150
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
జాలాది రత్నసుధీర్
ఫోన్: 9849418009
ఆన్‌లైన్‌లో
https://www.amazon.in/dp/B0DT64NTNV
~
జాలాది రత్నసుధీర్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ
https://sanchika.com/special-interview-with-mr-jaladi-ratna-sudheer/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.