[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]
కుందుర్తి కవితా వైభవం
అభ్యుదయ కవుల్లో వచన కవితా పరిణామానికి దోహదం చేసిన వారిలో, శ్రీ కుందుర్తి ఆంజనేయులు గారు మొదటి వరుసలో నిలుస్తారు. వచన కవితని ఒక ఉద్యమంలా భావించి, ఆ రూపాన్ని సుసంపన్నం చేయడంలో నిర్విరామ కృషి చేసిన వారిలో అగ్రేసరులు – శ్రీ కుందుర్తి. కుందుర్తి ‘ఫ్రీ వర్స్ ఫ్రంట్’ సాహిత్య చరిత్రలో ఆయన సాగించిన ఉద్యమానికి అక్షరోదాహరణం.
‘పాతకాలం పద్యమైతే..
వర్తమానం వచన గేయం’
అన్న పంక్తులు, ఆయనకి వచన కవిత మీద ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తాయి. కేవలం వచన కవితా రూపాన్ని ఒక ఉద్యమంగా భావించడం అతివాదమనీ, వస్తు సంబంధంలేని ఉద్యమం ఉండకూడదనీ, కుందుర్తిని కొందరు విమర్శించారు. అయితే, ఆయన నూటికి నూరు పాళ్ళు అభ్యుదయ భావాల్ని అంగీకరించిన తర్వాతే ఆ భావాల్ని వెలువరించడానికి తగిన ప్రజారూపాల్లో వచన కవితకి పట్టం కట్టడం జరిగింది.
మొదటి వరుసలోని అభ్యుదయ కవుల్లో, శ్రీ కుందుర్తిలో ఒక విశిష్టమైన లక్షణం ఉంది. తన కళ్ళముందు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో భావనా ధోరణలు తుఫానులా వీస్తుంటే, ఆయన తన అభిప్రాయాల్ని మార్చుకోలేదు. తన సిద్ధాంతాలూ, తన కవితా ప్రయోజనమూ, వాటికీ తన వ్యక్తిత్వానికీ ఉన్న సమన్వయం అపశ్రుతి పొందకుండా స్థైర్యాన్ని ప్రదర్శించారు.
1944లో కందుర్తి అంజనేయులుగారు – ఏల్చూరి సుబ్రహ్మణ్యం, బెల్లంకొండ రామదాసులతో కలిసి మొట్టమొదటి కవితా సంకలనం – నయగారా ప్రకటించారు. ఈ ముగ్గురూ నయగారా కవులుగా ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందారు. అంజనేయులు సమగ్ర రచనలు 1974 లో ప్రచురించబడినవి.
కుందుర్తి వచన కవిత – ఆధునిక కవితా ప్రస్థానంలో సామాన్యునికి అంకితమైన భాషా కుటీరం. ఆయన ‘ఫ్రీ వర్స్ ఫ్రంట్’ – సాహిత్య చరిత్రలో ఆయన సాగించిన ఉద్యమానికి అక్షరోదాహరణం.
కుందుర్తి ప్రతిభా పాటవాలను మనకు ఈ పుస్తకంలో పరిచయం చేసినవారు శ్రీ అద్దేపల్లి రామమోహన రావు గారు.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.
శ్రీ పత్రి అశ్వనీ కుమార్ గారి నివాసం నవీ ముంబై, మహారాష్ట్ర.
విద్యాభ్యాసం అంతా విజయవాడ లోనే జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పుచ్చుకుని, ఉద్యోగార్ధం హైదరాబాద్ వచ్చిన తర్వాత యువభారతి సంస్థతో (1982) నలభై ఏళ్ళ అనుబంధం.
వృత్తిరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో Finance & Accounts లో Senior Management Team లో పనిచేసి 2016 లో పదవీ విరమణ చేసినా, ప్రవృత్తి మాత్రం – సంగీత సాహిత్యాలే. ప్రస్తుతం ఒక Youtube Channel కి Voice Over artiste గా, స్వరమాధురి సంగీత సంస్థకు అధ్యక్షునిగా వారి విశ్రాంత జీవితాన్ని బిజీ గా, ఆనందంగా గడుపుతున్నారు.