Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

లేడీస్ ఫస్ట్

[డా. మైలవరపు లలితకుమారి గారు రచించిన ‘లేడీస్ ఫస్ట్’ అనే కథని అందిస్తున్నాము.]

కథ ఇప్పటిది కాదు. దాదాపు ఒక ఇరవై అయిదు ముప్ఫై సంవత్సరాల కిందటిది. అప్పటికే పట్నంలో అక్కడక్కడా ఆడపిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. కాని పల్లెలలో మాత్రం ఇంకా మొదలు కాలేదు. రామాపురం ఒక మారుమూల ఒక చిన్న పల్లెటూరు. అక్కడ చదువుకున్న తెలివైన మేనకోడలు సీత, చదువులేని అమాయకురాలైన అత్త రుక్మిణమ్మ – ఇద్దరు కలిసి ఓ ఉదయం సమయంలో వడ్లు దంపుతున్నారు.

“సువ్వీ! సువ్వన్నలారా! సువ్వీ!
సువ్వన్నలారా! మా అన్నలారా!
పొద్దున్నే రాముడు పొలమెల్లినాడు
సువ్వీ! సువ్వన్నలారా!”

అంటూ రాగయుక్తంగా పాడుతూ సీత వయ్యారంగా వడ్లు దంపుతున్నది.

“అదేమిటి తల్లీ! అంత సోగ్గా పోటేస్తే ఆ ధాన్యం పొట్టు ఎలా ఊడేను. ఏం తింటాము. కాస్త బలంగా దంచవే” అన్నది రుక్మిణమ్మ.

“ఏమోనమ్మా! ఎంత బలంగా దంచినా ఏదో ఒక వంక పెట్టకుండా ఉండవు కదా! నాకు ఇంతకంటే బాగా చేతకాదు” అన్నది సీత.

“బాగుందే! రేపు పట్టణంలో మారాజు గాడితో కాపురం పెట్టాక ఎలాగే? ఇలాగే పని పాటలు చేస్తే ఎలాగా?”

“సరేలే! రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదన్నట్లు పట్నం వెళ్లినా ఈ పోట్లతో నాకేం పని. పట్నంలో దర్జాగా బియ్యం కొనుక్కొని తింటాం. హాయిగా ఉద్యోగం చేసుకుంటాం” అన్నది సీత.

రుక్మిణమ్మ బుగ్గలు నొక్కుకుంటూ “అయ్యో! అయ్యో! ఏం మాట్లాడుతున్నావే. ఉద్యోగం చేస్తావా? మా ఇంటా వంటా లేని పని అది. అందుకే ఆడదానికి చదువులు వద్దన్నాను. మీ నాన్న నా మాట వినలేదు.”

“అది కాదత్తా, బావతో సమానంగా చదువుకున్నానా, నీకేం తెలుసత్తా లేడీస్ కోటాలో బావ కన్నా నాకే ముందు ఉద్యోగం వస్తుంది తెలుసా!”

“హవ్వ! హవ్వ! అదేం మాటే. మగవాడి కన్నా ముందు ఉద్యోగం సంపాదించి, మగరాయుళ్లా బయట తిరుగుతానంటావు. ఇదెక్కడి చోద్యమే తల్లీ?”

“కాకపోతే పొద్దున్నే లేచి నీలాగా కళాపు చల్లటం, ఈ వడ్లు దంచడం నావల్ల కాదమ్మా! ఇలా కనక నా దుంప తెంపితే నా ఎత్తు ధనం పోసినా నేను ఈ పెళ్లి చేసుకోను అని మా నాన్నతో చెబుతాను.”

“సరి సరి మరి బావనే ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టావు కదే.”

“ఇప్పుడు మాత్రం కాదన్నానా ఏంటి? ఇప్పటికీ బావనే ప్రేమిస్తున్నాను కానీ నీతో వేగలేక అలా అన్నాను.”

“అమ్మ! అమ్మ! ఎంత మాట అన్నావే? నన్ను ఏదో కాలేజీలో చదువుకుంటున్నావు, కుదురుగా ఉన్నావని మీ అమ్మానాన్న చెబితే కామోలు అనుకున్నాను. నువ్వూ ఇంతేనన్నమాట.”

“సరే నేను చెడిపోయానని తెలుసుకున్నవుగా.”

“మరే ముంజేతి కంకణానికి అద్దం ఎందుకు. కనిపిస్తూనే ఉందిగా!”

“ఏం కనబడుతున్నదేమిటి?” అంది సీత.

“ఏమిటి బావతో సమానంగా చదివాను అంటావు. ఉద్యోగం చేస్తానంటావు. అందుకే నాకు ఈ ఇంగ్లీష్ చదవులంటే ఒళ్ళు మంట.”

ఇంతలో పని చేసే రత్తి “అమ్మాయిగారూ! అమ్మాయిగారూ!” అంటూ కేక వేసింది.

“ఆఁ, ఏం కావాలే? అలా ఇంటినపడి అరుస్తున్నావు?” అంది రుక్మిణమ్మ.

“ఏం లేదమ్మా! అబ్బాయిగారు కాఫీ కావాలని అడుగుతున్నారమ్మా. అమ్మాయి గారికి చెబుదామని పిలుస్తున్నాను.”

“ఇప్పుడేం కాఫీ? ఉదయం 9 గంటలు అయింది కాఫీ లేదు, ఏమీ లేదు” అన్నది.

“పోనీలే అత్తా! కాసిని కాఫీనే కదా బావ అడిగింది” అని సీత లోపలికి వెళ్ళింది.

ఇంతలో వీధిలో నుంచి “రాజుబాబూ! రాజుబాబూ!” అని గావు కేకలు పెట్టుకుంటూ సూరయ్య ప్రవేశించాడు.

“వదినా, రాజు ఏడి? మా అబ్బాయి టెలిగ్రాం రాసాడు. అది చదివించుకుందామని వచ్చాను” అన్నాడు సూరయ్య.

“రాజు లోపల ఉన్నాడు సూరయ్య బాబు. ఏమిటి ఆ కంగారు?”

“ఏం లేదు వదినా ఏదో టెలిగ్రాం వచ్చింది. ఏం పాడు కబురు వచ్చిందో ఏమో మరి ఒకసారి రాజు చేత చదివించుకుందామని వచ్చాను.”

“ఉండు కేకేస్తాను” అంటూ రాజుని పిలిచిన రుక్మిణమ్మ,

“ఔను నాకు తెలియక అడుగుతాను, నీ కొడుకు కూడా ఏదో ఇంగ్లీష్ చదువు చదివాడంటావు కదా! వాడి చేత చదివించుకోక పోయావా?” అంది.

“సరే ఆయనే ఉంటే అన్న సామెతగా ఉన్నది నువ్వు చెప్పేది. వాడు ఉద్యోగం కోసం చెన్నపట్నం వెళ్ళాడు” అంటూ, ‘ఇంతకీ ఈ రాజు ఏమి అయ్యాడు చెప్మా. ఎంత పిలిచినా లోపలి నుంచి రాడేమిటి’ అనుకున్నాడు సూరయ్య.

“అయితే మీ వాడ్ని నౌకరీ కోసం పట్నం పంపావా? మా రాజు కూడా వెళతానంటే ఒక్కగానొక్కొడు కదా! అందుకని నేనే వాడిని వద్దన్నాను. వాడిని ఒప్పించేసరికి నా తల ప్రాణం తోకకి వచ్చింది.”

“అదేమిటి వదినా! నీ కోడలేమో ఉద్యోగం చేస్తానంటున్నది కదా!”

“ఆ దాని మొహం ఏదో చిన్నతనంలే. అలానే అంటూ ఉంటుంది.”

ఇంతలో వాకిట్లో నుంచి పోస్ట్‌మాన్ కేక వినపడింది. “అమ్మగారు రాజుబాబు గారు ఉన్నారా? ఏదో రిజిస్టర్ కవర్ వచ్చింది” అన్నాడు.

“ఆ ఆ ఉన్నాడు నాయనా! పిలుస్తానుండు” అంటూ, “రాజూ! రాజూ!” అని కొడుకుని పిలిచింది రుక్మిణమ్మ.

“ఏంటమ్మా! ఇందాకటి నుంచి పిలుస్తున్నావు?” అన్నాడు రాజు.

“రాజు బాబూ! ఇదిగో ఇదేమిటో చూడు బాబూ! కాస్త ఈ టెలిగ్రాం చదివి పెట్టవా?” అంది రుక్మిణమ్మ.

“నీ కోడలు చేత చదివించుకోకపొయ్యావా!” అన్నాడు రాజు.

“అది నీకు కాఫీ చెయ్యటానికి వెళ్ళిందిలే.”

“సెండ్ 50 రుపీస్ అర్జెంట్. అంతే. ఏమీ లేదు నీ కొడుకు ఒక 50 రూపాయలు వెంటనే పంపమన్నాడు” అన్నాడు సూరయ్యతో.

తరువాత పోస్ట్‌మాన్‌ వైపు తిరిగి, “ఆ సుబ్బన్న ఏవి ఆ ఉత్తరాలు?” అన్నాడు రాజు.

“ఇదిగోండి బాబు” అన్నాడు సుబ్బన్న.

“సీతమ్మ ఎవరు బాబు? మీ కేరాఫ్‍తో ఉత్తరం వచ్చింది?” అడిగాడు

“సుబ్బన్నా! నేనే ఇంకెవరు. ఏది ఆ ఉత్తరం, ఇదుగో బావా కాఫీ” అంది సీత.

చివరకు అనుకొన్నట్టే అయ్యింది.

“ఏంటి సీతా! నీకు ఉత్తరం వచ్చింది? కలికాలం మహత్యం కాకపోతే. సరే ఇంతకీ నీకు వచ్చిన ఉత్తరం మాటేమిటి?” అంది రుక్మిణమ్మ.

“ఇంతకీ నీకు వచ్చిన ఉత్తరం మాటేమిటి?” అన్నాడు రాజు.

“బావా నీకు ఒక గుడ్ న్యూస్. దీంట్లో ఏముందో చెప్పుకో చూద్దాం” అంది సీత.

“ఆ ఏముంది మీ నాన్న వస్తున్నారనో, లేదా మన పెళ్లికి ముహూర్తం పెట్టారనో, అదీ కాకపోతే నీకు కాలేజీలో ఏ ఫ్రెండు రాసిన ఉత్తరమో అయిఉంటుంది అంతేకదా!”

“అదేం కాదు బావా! నీ ఊహలన్నీ అబద్ధమే. ఇది నన్ను ఉద్యోగంలో చేరమని పంపిన ఆర్డరు. చూశావా అత్తా బావకన్నా నాకే ముందు ఉద్యోగం వస్తుంది అన్నానా! ‘లేడీస్ ఫస్ట్’ అని నేను చెప్పలేదు. నువ్వే నా మాట నమ్మలేదు కదా!”

“అయ్యో ఎంత ఘోరమైన వార్త విన్నాను. ఏం పిల్లలో కలికాలం. కలికాలం. పిదప కాలం. పిదప బుధ్ధులు. పెద్దలు, పెద్దవాళ్ల మాట ఏమైనా వింటారా? ఏమన్నానా?”

“ఏమోయ్ సీతా! మొత్తానికి ప్రతి దాంట్లో ఫస్ట్ ఫస్ట్ అనే దానివి. నీ లేడీస్ ఫస్ట్ అనే పదాన్ని ఇక్కడ కూడా నిలబెట్టుకున్నావు కదా!” అన్నాడు రాజు.

“అదేం కాదు బావా! నేను ఏం చేసినా నీ కోసమే కదా!” అన్నది సీత.

“పోనీలే అయిందేదో అయింది. ఇక ఇప్పుడైనా నేను తొందరపడకపోతే రేపు పెళ్లి విషయంలో కూడా నువ్వే ఫస్ట్ అంటావేమో? పద పద రిజిస్టర్ ఆఫీస్‍కి పోయి పెళ్ళి చేసుకుందాం!” అని చేయి బట్టి సీతను బయటికి తీసుకెళ్ళబోయాడు రాజు.

“ఒరేయ్ ఆగండిరా! మీ ఇష్టప్రకారమే చేస్తాం, త్వరగా ఇంటికి రండి” అంది రుక్మిణమ్మ.

Exit mobile version