[వజ్జీరు ప్రదీప్ గారి ‘లాస్ట్ పేజీ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
కథా రచయితనైన నేను ముగింపు కోసం లాస్ట్ పేజీ పట్టుకుని కుస్తీ పడుతున్నాను. ఎందుకో ముగింపు కథలో ఒదగడంలేదు. చాలా ప్రయత్నాలు చేశాను. గది నిండా రాసిపడేసిన కాగితాలు చిందర వందరగా పడి ఉన్నాయి. మనసు ఎందుకో అల్లకల్లోలంగా వుంది.
నేను గదికి గడియపెట్టి పక్కనే వున్న బొమ్మల వేప చెట్టు కిందకు వెళ్ళి నిలుచున్నాను. కుమార్ పల్లిలో బొమ్మల వేపచెట్టు ఫేమస్. అక్కడే ఉన్న చిన్న పాన్ షాప్‌లో సిగరెట్ తీసుకుని వెలిగించాను. అందులో ఉన్న పెద్దమ్మ సాయంత్రం సమయంలో మిర్చీ బజ్జీలు చేసి అమ్మేది. చుట్టుపక్కల జనం వచ్చి తీసుకెళ్ళేవారు, మా బ్యాచిలర్స్‌కి ఈవినింగ్ అదే ఫుడ్.
తాపీగా సిగరేట్ తాగుతూ చెట్టు చుట్టు ఉన్న బొమ్మలను పరిశీలిస్తున్నాను.
ఎవరో చిన్నపాప పరుగెత్తుకుంటు వచ్చింది.
“అవ్వా, మా ఇంటికి చుట్టాలచ్చారు. కేజి టమాటలు ఇయ్యమంది మా అమ్మ” అంది.
షాపులోని పెద్దమ్మ టమాటాలు త్రాసులో వేసి పాప తెచ్చిన సంచిలో వేసిచ్చింది. పాప వెనకాలే ఓ బుడ్డోడు ఆటోను దాటుకుని షాప్ వద్దకు వచ్చిండు.
ఆటో అతను బుడ్డోడిపై కేకలేస్తూ వెళ్ళిపోయిండు.
“అక్కా” అంటు చేయిపట్టి గుంజుతున్నాడు బుడ్డోడు. పాప చేతులున్న పదిరూపాయలు పెద్దమ్మకు ఇచ్చింది.
“పైసల్ లేవురా ఇగ జూడు” పాప బుడ్డోడిని కోపడుతు రెండు చేతులను చూపిస్తు అంది.
“అక్కా.. అ.. క్కా..” వాడు రెండు కాళ్ళు నేలకు కొడుతు దుమ్ములో కూర్చున్నాడు.
“అమ్మ దగ్గరి పైసలు నాన్న ఎత్తుకపాయే మనకు పైసలెట్లత్తైరా” పాప కండ్లలో చిన్న కన్నీటి ధార నా కంట పడింది.
“బాబు ఇలారా” అనగానే బుడ్డోడు బెదిరిపోయి చూస్తున్నాడు.
“పాపా, నువ్వైనా రావమ్మ”
పాప నాలుగు అడుగులు ముందుకేసి ఆగింది.
“ఎందుకు రావాలి?” నన్ను పరీశీలించి చూస్తు అంది.
నేనే మెల్లగా బుడ్డోడడిగిన రసగుల్లాలు, కొన్ని చాక్లేట్స్, విజిల్ తీసుకుని దగ్గరకెళ్ళి ఇచ్చాను.
బుడ్డోడు నవ్వుతు దగ్గరకచ్చి చేయిచాపిండు.
“నాని వద్దురా, అమ్మ కొడుతది” పాప వాడిని బెదిరిస్తుంది.
బుడ్డోడు మొఖం అదోలా పెట్టిండు.
“ఏం కాదు తీసుకోనాని అమ్మ ఏమనదు” అంటు వాడి చేతిలో పెట్టాను.
వాడు వెంటనే తీసుకుని విజిల్ నోట్లో పెట్టుకుని గట్టిగా ఊది నవ్వాడు. ఇప్పుడు సైగ చేయంగనే దగ్గరకచ్చిండు. చాక్లేట్స్ ఇవ్వగానే చొక్క జేబులో వేసుకున్నాడు.
“వద్దు అంకుల్ ఏదైన ఊరికే తీసుకోవటం తప్పు.”
“ఎవరన్నారు?”
“అమ్మ చెప్పింది” అమాయకంగా అంది పాప.
“మీరు స్కూలుకు వెళ్ళలేదా?”
“లేదు. రాత్రి మా నాన్న అమ్మను కొట్టి డబ్బులు తీసుకపోయిండు”
“మీ అమ్మ, నాన్న ఏం జేస్తరు?”
“అమ్మ బట్టల షాపులో పని చేస్తుంది, నాన్న అప్పుడప్పుడు డ్రైవింగ్‌కి వెళ్తాడు” పిల్లలు భయంగా చెబుతున్నారు.
“మీ ఇల్లేది?”
“అదే మా ఇల్లు” పాప వేలితో అటుగా చూపించింది.
రేకుల షెడ్డు కనిపించింది, అదేనేమో!
నిన్న బాగా పరిచయమున్న వ్యక్తిలా వున్నావిడ ఆ ఇంట్లోనే కనిపించింది.
ఎవరై వుంటారు? ఒకవేళ నేను ఊహించినట్లు ఆమె అవుతుందా? లేక ఆ రూపంతో మరెవరైనా అయి వుండవచ్చునా? ఈ లోకంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటరంట! అది నిజమేనా సందిగ్ధావస్థలో మనసు. నా మనో నేత్రంపై వెలిసిన ఛాయారూపం ఎక్కడైన కనిపించకపోతుందా అన్న ఆశ.
చెట్టుపై రామచిలుకల గుంపు వాలింది. అవి కిచకిచమంటుంటే పైకి చుశాను.ఒకదానినొకటి పోటీపడుతూ ఆడుకుంటున్నట్టు ఓ కొమ్మ నుండి మరో కొమ్మపైకి ఎగురుతుంటే చూడముచ్చటగా వుంది. పక్కనేవున్న ఉడుత వాటిని చూస్తు మొదలు నుండి పైకి పైనుండి కిందకు పరుగెడుతుంది.
“నాయన ఇంకేమన్న తీసుకుంటావా? నేను షాప్ మూసి ఇంటికిబోయి కాస్త ఎంగిలిపడస్తాను” షాప్ పెద్దమ్మ అనగానే నేను జేబులోని పర్సు చూసుకున్నాను.
“డబ్బుల కోసం వెతుకుతున్నావా అయ్యా? ఎక్కడికి పోతై? మనిషి మీద మనిషికి నమ్మకం వుండాలే, ఆ పిల్లలను చూశావా? ఎంత ముద్దుగున్నారో వాల్ల అమ్మ ఎవరినో ప్రేమించిందటా, కులం తక్కువోడిని ప్రేమిస్తావా? అని ఓ తాగుబోతుకిచ్చి కట్టబెట్టిండట వాళ్ళ నాన్న, వాడు బతుకడు వీళ్ళను బతకనీయడు. రోజు లొల్లే బాబు, పిల్ల దెబ్బలు తినితిని బండబారిపోయింది. ఆ దేవుడు ఆ పిల్లరాత ఎట్లారాసిండో ఏమో” పెద్దావిడ చేతులను ఆకాశం దిక్కు చూపిస్తూ అంది.
నాకు ఒక్కసారి గతం కండ్ల ముందు మెదిలింది,
మనిషి ప్రపంచమంతా తిరిగే స్థాయికి ఎదిగిన, ఆకాశంలో చందమామను అందుకోగలిగిన, ఇంకా ఈ కులం కట్టుబాట్లు తెగుతలేవు కదా!.
“అయ్యో! పాపం అసలు ఆమెది ఏ ఊరు అమ్మా” తానెవరో కచ్చితంగా తెలుసుకోవాలనే అడిగాను.
“నాకు తెలియదు బాబు అప్పుడప్పుడు ఉప్పుకో – పప్పుకో వస్తది.”
“సరే రెండు సిగరేట్లు ఇవ్వు” అంటుండగానే జేబులో ఫోన్ మోగింది. నేను ఫోన్ ఎత్తి పెద్దమ్మ ఇచ్చిన సిగరెట్‌లను జేబులో పెట్టుకుని మాట్లాడుతు గది వైపు నడిచాను.
ఇంతకు ఫోన్ చేసింది ఎవరో చెప్పలేదు కదూ, అరవింద్. కాలేజిలో నా క్లాస్‌మేట్. ‘యూనివర్సిటీ ఆడిటోరియం వద్ద వున్నాను త్వరగా రమ్మం’టు ఫోన్ చేశాడు. నేను కొద్దిసేపు ఆలోచించి గదికి లాక్ వేశాను.
జేబులో ఫోన్ మళ్ళీ మోగడంతో సెల్ తీసాను
“హలో.. మురారి, ప్రోగ్రాంకి నేను వస్తున్నాను, గుడిబండల దగ్గర వేట్ చేస్తున్నాను” బైక్ స్టార్ట్ చేయగానే మమత కాల్ చేసి చెప్పింది.
నేను మమతను ఎక్కించుకుని ఆడిటోరియం వద్దకు వెళ్ళాను. హాల్లో కార్యక్రమం జరుగుతుంది, కొంత మంది ముఖ పరిచయం ఉన్నవారితో పాటు చాలా మంది కొత్తవారున్నారు.
ఒక్కొక్కరు వారి వారిని పరిచయం చేసుకుంటు మాట్లాడుతున్నారు. వారి కష్టాలు, ప్రచురించిన పుస్తకాలు వాటిని మార్కెట్లోకి తీసుకపోవడానికి పడుతున్న ఇబ్బందులు ప్రస్తుతం టివి, సెల్ ఫోన్స్ ద్వారా పుస్తకాలపై ఆసక్తి తగ్గిన యువత అనేక అంశాలపై వివరించి చెబుతున్నారు.
చెట్టు కింది పెద్దమ్మ చెప్పిన అమ్మాయి నేను అనుకుంటున్న అమ్మాయి ఒకరేనా పదే పదే గుర్తుకు రావటంతో మనసెందుకో కకావికలం అయింది.
“ఒరేయ్ కాసేపు నీ ఆలోచనలను పక్కకు పెట్టి అక్కడ చెప్పే సబ్జక్టు విను, కాస్తైన నీకు ఉపయోగపడుతుంది” మమత సీరియస్‌గా తలపై మొట్టికాయ కొట్టి అంది. దాంతో నేను మళ్ళీ సభా సమావేశంలోకి వచ్చాను.
“శోకం నుండి శ్లోకం పుడుతుందంటే ఇదేనేమో! ఒక్కొక్కరి ఆలోచనలు, భావాలు వింటుంటే రచయిత అనే వాడికి ఇన్ని కష్టాలుంటాయా? మనసు ఎంత మథనపడితే అక్షరం పుడుతుంది? నేటి వర్తమాన పరిస్థితులను రేపటి తరానికి తెలియజేయడమే గదా రచయిత చేసే పని, రచయితకు స్వేచ్ఛ వుండాలి, రచయితకు సరైన గుర్తింపు, ప్రోత్సహం, గౌరవం ఉంటే భవిష్యత్తులో ఎంతో మంది రచయితలు పుడతారు.” అక్కడున్న అందరిని ఉద్దేశించి స్టేజిపై పెద్దాయన చెబుతు భావోద్వేగానికి గురై చెబుతుంటే నా మనసు కూడా ఆర్ద్రతతో చలించింది.
గ్రౌండ్‌లో కొన్ని పుస్తకాల షాపులను ఏర్పాటు చేశారు. అందులో కొందరు పాత రచయితలవి, కొందరు కొత్త రచయితల బుక్స్ వున్నాయి.
నేను, మమత, అరవింద్ ముగ్గురం కొన్ని వేరు వేరు పుస్తకాలను తీసుకున్నాము. ఒకరి దగ్గరవి ఒకరం ఆ తరువాత ఎక్సేంజ్ చేసుకోవచ్చు గదా అనుకున్నాం.
“రిషి వస్తానన్నాడు రాలేదు, వాడికి ఫోన్ చేయి” అన్నాడు అరవింద్.
“హలో ఏమైంది మామా, ప్రోగ్రామ్ కాడికి రాలేదు? “ వాడికి కాల్ చేసి అడిగాను.
“నేను కీర్తి స్తూపం కాడికి వచ్చేసరికి ఏదో ర్యాలీ ఎదురైంది. ఎవరో నాయకుడు వస్తున్నాడని చాలా సేపు ట్రాఫిక్ ఆపారు, ముందుకు రాలేక, వెనక్కి తిరిగి పోలేక ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాను రా” రిషి పడ్డ బాధను చెప్పిండు.
మేం పుస్తకాలను వాటిని రాసిన రచయితల గురించి, టైటిల్స్ గురించి చర్చించుకుంటు భయటకు వచ్చాము.
చౌరస్తాకు వచ్చాక మమత లేడిస్ ఎంపోరియంకు వెళ్తానంది.
“ముగ్గురం కాఫీ తాగి వెళ్ధాం” అన్నాడు అరవింద్.
“నాకు కాఫీ వద్దు అరవింద్. అసలే మ్యారేజస్ సీజన్. ఎంబ్రైడరి చేయాల్సిన బ్లౌజులు చాలా ఉన్నాయి”
“జస్ట్ ఓన్లీ టెన్ మినిట్స్” రిక్వెస్టుగా అన్నాడు అరవింద్.
“అయితే ఐస్‌క్రీమ్ తిందామా?”
“సరే నీ ఇష్టం” హ్యాండ్ బ్యాగును సరిచేసుకుంటు అంది.
ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేశాక జేబులో ఉన్న పేపర్ తీసి వారితో కథలోని లాస్ట్ పేజీ గురించి డిస్కస్ చేశాను.
“కథ తీసుకున్న విధానం బాగుంది “నవ్వుతు చెప్పిండు అరవింద్.
“అవును కథలో ముగింపేది బాబు? ముగింపులేని కథ రాయడమేంటి?” నవ్వుతు అంది మమత.
“నిజమే! ముగింపు లేని కథ ఎక్కడైనా వుంటుందా? ఎక్కడా వుండదు. కొన్ని ఆనందంగాను, కొన్ని విషాదంగాను ఏది ఏమైన ముగింపు తప్పనిసరి వుంటుంది, మనిషికైనా, కథకైనా అందరికి తెలిసిన విషయమే అదే ఆలోచిస్తున్నాను” అన్నాను.
“బ్రో.. ఒక్కసారి రూమ్ దగ్గరకెళ్ళాక ప్రశాంతంగా ఆలోచించు నీ చుట్టు పక్కలే ఈ కథకు ముగింపు దొరకవచ్చు” అన్నాడు అరవింద్.
‘అరవింద్ అన్నది కూడా నిజమే! తాను చెప్పినట్లు నా చుట్టుపక్కలే ఈ కథకు ముగింపు దొరకవచ్చేమో!’ మనసులో అనుకున్నాను.
ఐస్‌క్రీమ్ రాగానే చాలా కబుర్లు చెప్పుకున్నాం. ఈలోగా అరవింద్ టేబుల్ పై వున్న స్కానర్‌కు డబ్బులు ఫోన్ పే చేశాడు.
“బిల్ నేను కట్టేదాన్ని కదా అరవింద్” మమత కోపంగా అంది.
“దానిదేముంది నువ్వేం ఫీల్ అవ్వకు, మరోసారి నువ్వే కడుతున్నావు సరేనా” బుజ్జగించినట్లు అన్నాడు.
ముగ్గురం భయటకు వచ్చాకా అరవింద్ టైలర్ స్ట్రీట్ నుండి కొత్తూర్ జెండా వైపు మాకు బై చెప్పి వెళ్ళిండు. మమత దగ్గరే గదా నడుచుకుంటు వెళ్థానంది. నేనే డ్రాప్ చేస్తానని చెబితే లేడిస్ ఎంపోరియంలకు వెళ్ళి లేస్, చెమ్కీలు తనకు కావలిసినవి తీసుకుంది. తరువాత వాళ్ళ ఇంటి వద్ద డ్రాప్ చేసి నేను మళ్ళీ బొమ్మల వేప చెట్టుకాడికి వచ్చాను.
షాప్ పెద్దమ్మ గరం గరం బజ్జీలు వేస్తుంది. నేను ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి పక్కనున్న బేంచిపై కూర్చున్నాను.
“ధా.. న్య.. లక్ష్మీ..”
సడెన్‌గా తనను చూడగానే ఆశ్చర్యం వేసింది. నా మస్తిష్కం మందగించింది, ధాన్యా.. గట్టిగా అరవాలి అనుకుంటున్నాను, గొంతు పెకిలి మాట బయటకు రాలేదు.
వాళ్ళ నాన్న వ్యవసాయం మీదున్న మక్కువతో ఆమెకు ధాన్యలక్ష్మి అనే పేరు పెట్టాడు. ఈ పేరు మావైపు చాలా అరుదుగానే వుంటుంది. ఊరిలో చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం. అలాంటి తను ఇలా వుండటమేంటి? నేను ఆ రేకుల ఇంట్లో గమనించింది ధాన్యనేనా. మెదడు మెల్లగా నన్ను అలర్ట్ చేస్తుంది.
“ఉదయం పిల్లలకు నువ్ రసగుల్ల, చాక్లేట్స్ కొనిచ్చావే ఆమె పిల్లలే బాబు వాళ్ళు” అంది షాపు పెద్దమ్మ.
నేను లేచి నిలబడి వీస్తుపోయాను, ధాన్య ఏంటి ఇలా వుండటం ఏంటి. వాళ్ళ నాన్న ఊర్లో చాల పెద్ద రైతు. అలాంటిది ఒక తాగుబోతు వాడికిచ్చి పెండ్లి చేయడటమేంటి? నేను ఆలోచించేలోపే తాను వెళ్ళిపోతుంది.
“ధాన్యా” గొంతు సవరించుకుని నేను గట్టిగా పిలిచాను. అప్పటికే నన్ను అక్కడ గమనించిందేమో గబ గబ కొంగును మొఖంకు అడ్డుపెట్టుకుని వెళ్థుంది.
నేను పరుగెత్తుకుంటు వెళ్ళి ధాన్యను ఆపాను.
“ప్లీజ్ మురారి, వీధిలో అందరు చూస్తున్నారు, నన్ను వెళ్ళనివ్వు” బతిమిలాడుతు అంది.
“ధాన్యా నువ్వేంటి ఇలా వుండటం ఏంటి?”
“అదంతా ఓ కథ. నేను మళ్ళీ కలిసినప్పుడు చెబుతాను”
“ఆ.. కథే నాకిప్పుడు కావాలి, నువ్వు చెప్పేవరకు నేను వెళ్ళను” కరాకండిగా అన్నాను.
“మా ఆయన వచ్చే టైం అయింది. మళ్ళీ ఏదో సంబంధం అంటగట్టి రెండు మూడు రోజులు నాన రభసజేస్తాడు” భయంగా అంది.
“నీకేం కాదు నేనున్నాను” భరోసా ఇస్తూ అన్నాను.
“గతంలో ఇలానే అన్నావు. నీ దారి నువ్ చూసుకోని పోయినవ్” చెంపలమీది నుండి జారే కన్నీళ్ళను తుడుచుకుంటు అంది.
ఆ మాట సూటిగా నా గుండెకు తాకింది.
“అసలేం జరిగింది?” నేను గట్టిగా అడిగాను.
“సరే ఆ చెట్టు దగ్గరే కూర్చుందాం పద” ప్లేస్ చూపిస్తు అంది ధాన్యలక్ష్మి.
ఇద్దరం బొమ్మల వేపచెట్టు కింద కూర్చున్నాము.
“మురారి నువ్వేంటి ఇక్కడ?”
“అదిగో ఆ లాక్ వేసివున్నదే నా గది. ఇంతకు ముందు బాలసముద్రంలో వుండేవాడిని. అక్కడ నుండి ఈ మధ్యే ఇక్కడకు షిప్ట్ అయ్యాను”
“ఆ పిల్ల నీకు ముందే తెలుసా?” బజ్జీలు వేస్తు అడిగింది పెద్దమ్మ.
నేను ఏం చెప్పాలో అర్థం కాక తెలిసి తెలియనట్టు తల ఆడించాను.
తనకెందుకులే అనుకుందేమో పెద్దమ్మ తన పనిలో తాను మునిగి పోయింది.
“పీజీ కంప్లీట్ అయిందా?” ధాన్య నుదిటిపై పడ్డ హేయిర్ సవరించుకుంటు అంది.
“లేదు. ముందు నీ విషయం చెప్పు. ఎలా వుండే దానివి ఇప్పుడు ఇలా ఎందుకయ్యావు?”
“నీకు తెలియదా? రచయితవు కదా ఊర్లో అందరి జీవితాలను పరిశీలించేవాడివి నాకేమైందో తెలియదా? చిన్నప్పుడు స్కూల్లో ఆటలో నేను ఓడిపోతే చూడలేక నన్ను గెలిపించావు, ఇంటర్ కాలేజీలో ప్రాబ్లమస్తే నువ్వే సాల్వు చేశావు, ప్రతీసారి స్నేహితుడిగా నీకు నేనున్నానన్నావు, ఆ తరువాత ఊరంత మనపేర్లను కోడై కూసింది, ఆ తర్వాత నువ్ ఊరు దాటావు, నా తలరాత మారింది” కోపంతో రగిలే నిప్పుకణికల్లా వున్నాయి ఆమె కండ్లు.
“తెలిసినంక ఎందుకు అడుగుతాను” సమాధానం కోసం చూస్తు అన్నాను.
“కాలం చాలా గొప్పది మురారి, ఎవరిని ఎలా ఎక్కడ వుంచాలో దానికి బాగా తెలుసు. అందుకే నేమో నన్ను ఇదిగో ఇక్కడ ఇలా ఉంచింది”
“అసలేమైంది?”
“ఈ లోకంలో మానవ సంబంధలన్ని డబ్బు సంబంధాలుగా మారిపోయాయి, ధనవంతులు మాత్రమే మనుషులు అనుకునే మా నాన్న పెంపకంలో పెరిగేసరికి అదే పొగరు నాకు అబ్బింది. ఆ పొగరు అణచడానికే దేవుడు నాకీ శిక్ష వేశాడేమో!”
“అలా ఎందుకనుకుంటావు?”
“ఇంకేమనుకోను”
“అసలు అతని ఎలా చేసుకున్నావు ?”
“జీవితంలో మనం ఒకటనుకుంటాము, జరిగేది వేరే రకంగా వుంటుంది, మన విషయంలో కూడా అదే జరుగింది కదా!” బాధగా అంది.
“ఊరు ఏమనుకున్నా మనం ఏంటో మనకు తెలుసు కదా ధాన్యా!”
అరచేతులు చూసుకుంటు మెల్లగా..
“మనం చూసే దృష్టి వేరు, ప్రపంచం చూసే దృష్టి వేరు. అది మన విషయమే కాదు ఎవరిదైనా అంతే. కానీ నువ్ సడెన్‌గా మాయమవడంతో ఊరంతా మా నాన్న బెదిరించడంతోనే నువ్ వెళ్ళావనుకుంది” అంది.
“ఆ విషయం నేను ఎప్పుడో ఎక్సెపెక్ట్ చేశాను”
“ఊరంతా మన విషయం మరిచిపోయేలోపు నా జీవితం మరో మలుపు తిరిగింది, నేను మహేశ్ అనే అతన్ని ఇష్టపడ్డానని అమ్మ, నాన్న ఇంట్లో బంధించి నన్ను చావబాదారు, కులం తక్కువ వాడని అతన్ని ఏదో కేసులో ఇరికించి జైలుకు పంపాడు నాన్న. ఆ నోట ఈ నోట విషయం ఊరంత పొక్కడంతో నన్ను చేసుకోడానికి ఎవరు ముందుకు రాలేదు. బెంగతో నాన్నకు పక్షవాతం వచ్చింది. దూరపు బంధువు ఎవరో ఈ సంబంధం తీసుకవచ్చిండు, ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో నా జీవితం ఇదిగో ఇలా గడుస్తుంది.”
“ఇంతకు అతనేం చేస్తాడు?”
“డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఎంతో కొంత ఉన్న ఆస్తి కరిగేదాక తాగుడు, జూదం జెల్సాలతో గడిపిండు. అప్పుడప్పుడు ఎవరికైన కారు డ్రైవర్ కావల్సినప్పుడు వెళ్థాడు. కాలిగా వుంటే నన్ను పీక్కతింటాండు”
“అయామ్ సారి ధాన్యా. నేను ఇక్కడికచ్చి స్టడీ టెన్షన్లో పడి ఎవరిని పెద్దగా పట్టించుకోలేదు, అప్పుడప్పుడు కాల్ చేసే మన ఫ్రెండ్స్ కూడా ఎవరు నీ గురించి చెప్పలేదు” బాధగా అన్నాను.
“అక్కడ నిల్చున్న వాళ్ళు మనల్నే చూస్తున్నారు.” భయపడుతు అంది.
నిజమే ఎప్పుడు ఖాలీగా తిరిగే జల్సా బ్యాచ్ ఒకటి మా వైపే చెవులు రిక్కించి వింటున్నారు.
“నా గురించి ఎందుకుతీయి మురారి” వాళ్ళను కనిపెడుతు చిన్నగా అంది.
“నీ గురించి కాక ఎవరి గురించి ఆలోచించమంటావు, నా గురించి నీకు బాగా తెలుసు అందరం బాగుండాలి అందులో మనముండాలి అన్నదే నాకు తెలిసిన సిద్దాంతం. నువ్ కలలు కన్న జీవితం ఇది కాదు గదా?”
“కాకపోవచ్చు మురారి ఈ భూమ్మిద పుట్టిన ప్రతీవాళ్ళం కలలుగంటాము, అన్నీ నెరవేరితే ఇక ఆ దేవుడెందుకు” ప్రవచనం చెబుతున్నట్టుగా అంది.
“నిజమే! కాని నీ జీవితాన్ని మార్చుకునే శక్తి నీకు ఉన్నప్పుడు ఇలా కాకుండా వేరేలా బతకచ్చు గదా”
“ఎలా?”
“దేవుడు మనకు ఒకదారి ముసుకపోతే మరో దారికి తలుపులు తెరుస్తాడంటా. చిన్నప్పుడు నాకు ప్రాబ్లమ్ వస్తే నువ్వు చెప్పిన డైలాగే ఇది”
“ఊ.. అయితే”
“నీకు కంప్యూటర్ వర్క్ వచ్చు. ఎక్కడైన కాలేజిలో పనిచేయవచ్చు. పై చదువులకు ఎగ్సామ్ ఫీజును నేను కడుతాను. నువ్ బాగా చదువుకో నీ జీవితం మారుతుంది” అన్నాను.
“సానుభూతి చూపిస్తున్నావా మురారి?” కోపంతో ఆమె చెక్కిల్లు ఎర్రబడ్డాయి.
“ధాన్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నేను నీ ఫ్రెండ్‌ని” ఓదారుస్తు అన్నాను.
“నా మొగడు అనుమానపు పిశాచి, పైగా తాగుబోతు ఎవరితో మాట్లాడిన రంకు అంటగడతాడు. తను చూసిన పనికే వెళ్ళాలి, తను చెప్పిందే వినాలి, నాకు ప్రతీక్షణం ఒక గండంలా గడుస్తుంది. అలాంటప్పుడు నేనేం చేయగలను”నిస్సహాయంగా చూస్తూ అంది.
“ఇప్పుడు స్త్రీలు తల్చుకుంటే ఏ పనినైనా సులువుగా చేయగలరు, అందుకే మీ ఇద్దరికి ఒకే చోట జాబ్ ఉంటే ఎప్పుడు ఎదురెదురుగా వుంటారు. ఏ గొడవలు రావు, కాలం మళ్ళీ తిరిగిరాదు, మనిషికి ఉన్నది ఒకటే జీవితం దానిని మనకు అనుకూలంగా మలుచుకోవాలి, ఇంట్లో ఎవరో ఒకరు తగ్గితే ఏ గొడవలు వుండవు. ఇక్కడే తెలిసిన మిత్రుడి ఆఫీస్ వుంది. ఇద్దరకి అక్కడే పనిలో పెడతాను ధాన్యా” అర్థిస్తు అన్నాను.
అర్థం అయిందో కాలేదో ఆ ముఖంలో ఏభావము నాకు కనిపించలేదు.
పిల్లలు పరుగెత్తుకుంటు వచ్చి వాళ్ళ అమ్మ ఒడిలో కూర్చున్నారు.
“పెద్దమ్మా” అని కేక వేయగానే బజ్జీలు పేపర్లో చుట్టి ఇచ్చింది.
పిల్లలు వద్దంటు తిరస్కరించారు, ధాన్యనే “తీసుకోండి” అనగానే తీసుకున్నారు.
“నేను అన్న విషయం గురించి ఏం ఆలోచిస్తున్నావు?”
“నువ్ ఎవరని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి?”
“నిజమే అసలే అనుమానపు పిశాచన్నావు కదు”
“అందుకే సాధ్యం కాని విషయాన్ని తలకెత్తుకోకు. దేవుడు నా బతుకిలాగే గడవాలని రాసిండేమో” లేచి నిల్చుండి చీర కొంగు దుల్పింది.
“మన పుట్టుక – మన మరణం మనకు తెలియకుండానే జరిగిపోయేవి, కనీసం ఈ ఉన్న జీవితాన్నైనా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేసుకోవాలి, నేనే అతన్ని పరిచయం చేసుకుంటాను. అతని మార్చి చూపిస్తాను, ప్లీజ్ చిన్న ప్రయత్నం చేద్దాం” ఆమె జీవితం తీర్చిదిద్ధాలని అన్నాను.
“సరే మానవ ప్రయత్నం చేద్దాం, నేను వెళ్తాను ఆయన వచ్చే టైం అయింది, నేను మళ్ళీ కలుస్తాను” లేచి పిల్లలను తీసుకుని ముందుకు కదిలింది ధాన్యలక్ష్మి.
నేను మౌన మునినై చూస్తుండగా ఆమె నా కథ లాస్ట్ పేజీలో కొసమెరుపై నా మనసులో ముగింపులేని స్నేహవాక్యమై నిలిచింది.
