[డా. ఎమ్ సుగుణ రావు రచించిన ‘లెక్కల్లో మనిషి!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో నిర్వాహకుల ప్రత్యేక బహుమతి గెల్చుకున్న కథ.]
ఆ గదిలో అందరి ముందు దోషిలా కూర్చున్నాడు వివేకానంద.
ఉదయం పది దాటింది. శీతాకాలపు ఉదయం. వాతావరణం చల్లగా ఉంది. అయితే ఆ గదిలోని వాతావరణం మాత్రం వేడిగా ఉంది. ఆ ఎంక్వయిరీ కమిటీలో ప్రిన్సిపాల్‌తో పాటు ముగ్గురు లెక్చరర్లు కూడా ఉన్నారు. దాదాపు గంటనుండి ప్రిన్సిపాల్ రూములో అతడి మీద ఎంక్వయిరీ నడుస్తోంది. అయినా అతను చెప్పిందే చెబుతున్నాడు. ప్రిన్సిపాల్‌కు విసుగొచ్చింది.
“చూడు వివేకానందా! నువ్వు ఒక విద్యార్థిని కొట్టావు. ఇది కార్పోరేట్ కాలేజీ. విద్యార్థుల తల్లిదండ్రులు కట్టే ఫీజుల మీదే మనం కాలేజీ నడుపుతున్నాం. ఆ అబ్బాయిని నువ్వు కొట్టడంతో విద్యార్థులంతా యాజిటేషన్ మొదలుపెట్టారు. నువ్వెందుకు కొట్టావో, ఆ కారణాలేంటో ఇందాకటినుండి నిన్ను ప్రశిస్తున్నా నువ్వు చెప్పడం లేదు. ఇప్పుడైనా చెబుతావా?” అన్నాడు ప్రిన్సిపాల్, కొంచెం కోపంగానే.
వివేకానంద ఆ మాటలకు, ప్రిన్సిపాల్ వంక తలెత్తి చూసి, “సార్! ఆ అబ్బాయిని కొట్టడం తప్పే. అందుకు మీరు నాకు ఏ శిక్ష విధించినా భరిస్తాను” అన్నాడు.
“అది సరే, కానీ ఎందుకు కొట్టావో మాకు తెలియాలి కదా. నీతో దెబ్బలుతిన్న అబ్బాయి చెప్పడం లేదు. నువ్వు కూడా మౌనంగా ఉన్నావు” అన్నాడు.
ప్రిన్సిపాల్ ఎదురుగా కూర్చున్న లెక్చరర్, “వివేకానందా! నువ్వు తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నావు” అన్నాడు.
“ఏం చేసాను సార్?” అన్నాడు వివేకానంద.
“గత నెలలో మన కాలేజీలో పేరెంట్ లెక్చరర్ సమావేశం జరిగింది కదా.. మన విద్యార్థుల చేత తల్లిదండ్రుల పాదాలు, లెక్చరర్ పాదాలకు మ్రొక్కించాం. ఆ సమయంలో నువ్వు మేము చేసిన పనికి విమర్శించావు. ఇలా నీకు కాలేజ్ మేనేజ్‌మెంట్ మీద భయమూ, భక్తీ లేకుండా పోయింది” అన్నాడు.
ఆ మాటలకు వివేకానంద, “సారీ సార్.. ఆ సమయంలో మిమ్మల్ని బాధపెట్టి వుంటే క్షమించండి. అయితే పిల్లల చేత తల్లిదండ్రులకు, లెక్చరర్లకు పాదాభివందనం చేసినప్పుడు అది స్వచ్ఛందంగా జరగలేదు. కొందరు విద్యార్థులు ఇబ్బందిపడటం గమనించాను. ఇలాంటి కార్యక్రమం విద్యార్థులపై బలవంతంగా విధేయతను రుద్దే ప్రయత్నంగా నాకు అనిపించింది. పిల్లలను ‘గౌరవం’ పేరుతో తల వంచేట్టు చేసే బదులు నిలబడి మాట్లాడే శక్తిని కలిగించడం ఎక్కువ అవసరం.
ప్రఖ్యాత తత్త్వవేత్త ‘పాలో ప్రేయర’ చెప్పినట్టు విద్యార్థి ఒక ఖాళీ పాత్ర కాదు; లెక్చరర్లు వారిలో జ్ఞానాన్ని నింపే అధికారం కలిగినవారూ కాదు. పిల్లల్ని ప్రశ్నించడం, వారిలో ఆత్మవిశ్వాసం పెంచడం.. ఇదీ మనం చేయాల్సింది. వారు తల వంచే బదులు తలెత్తి ధైర్యంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి” చెప్పడం ముగించాడు వివేకానంద.
ఆ మాటలకు కాలేజీ ప్రిన్సిపాల్‌తో పాటు ఆ గదిలో ఉన్న మిగతా లెక్చరర్లు కూడా వివేకానంద వంక అభినందనపూర్వకంగా చూసారు. అతడిని ప్రశ్నించిన లెక్చరర్ మాత్రం కోపంగా మొహంపెట్టి, “పిల్లల్ని కొట్టొద్దు అని నువ్వు పదే పదే చెబుతావు. అయినా నువ్వు ఇప్పుడే చేసిందేమిటి?” అన్నాడు, గట్టిగా అరుస్తూ.
వివేకానంద ఆయన వంక సూటిగా చూసి, చెప్పడం మొదలుపెట్టాడు.
“పిల్లలు అబద్ధాలు చెప్పినా, దూమపానం వంటివి చేసినా తల్లిదండ్రులు తిట్టడం, కొట్టడం చేస్తారు. అయితే పిల్లల్ని కొట్టేముందు కూడా వారిని శిక్షించే అర్హత ఉందా, లేదా అనే విషయం కూడా వాళ్లు ఆలోచించాలి. పిల్లలు అభివృద్ధి నిరోధకశక్తులుగా మారుతున్నారు. వారి పసితనం కసితనం అవుతోంది. అంటే పిల్లలకు, తల్లిదండ్రులకు, పిల్లలకు, సమాజానికి మధ్య ఉన్న లింకు తెగిపోయిందని అర్థం చేసుకోవాలి. పిల్లల్లోని మానవతావిలువలను ఉత్తేజితం చేయాలి. వారిని సమాజానికి పనికొచ్చే వనరులుగా తీర్చిదిద్దాలి. ఇదంతా ప్రేమతో జరగాలి, ఆవేశంతో కాదు. దండనతో కాదు” అన్నాడు వివేకానంద.
“ఇన్ని కబుర్లు చెబుతున్నవాడివి ఆ అబ్బాయిని ఎందుకు కొట్టావు? పైగా చెప్పుతో కొట్టావట” అన్నాడు ప్రిన్సిపాల్, పైనుంచి క్రిందివరకు వివేకానందను పరిశీలనగా చూసి.
వివేకానంద చాలా సాధారణంగా ఉంటాడు. ఈ కాలపు కుర్రవాళ్ల మాదిరిగా అధునాతన వేషధారణ లేదు. ఉతికిన చొక్కా, ప్యాంటు.. ఒక్కోసారి ఇస్త్రీ కూడా ఉండదు. బాత్‌రూమ్‌లో వేసుకొనే చెప్పులు. అతను ఎమ్మెస్సీ చదివాడు. లెక్కలు ప్రధాన విషయం. ఆ తర్వాత బిఇడి చేసాడు. బాగా పేద కుటుంబం నుండి వచ్చాడు. తండ్రి లేడు. తల్లి ఇళ్లల్లో పాచిపనులు చేస్తుందట. ఇదంతా అతను చెప్పలేదు. ఎవరి ద్వారానో తెలుసుకున్నాడు. వివేకానంద లెక్కలు బాగా చెబుతాడనే పేరు వచ్చేసింది. పిల్లలకు సరళంగా, చాలా సరదాగా పాఠాలు బోధిస్తాడు. కానీ ఏం లాభం? అతడిని ప్రేమించిన విద్యార్థులే ఇప్పుడు తిరగబడ్డారు. అతడిని ఉద్యోగంలోంచి తీసేయమని ఉద్యమాలు మొదలుపెట్టారు.
వివేకానందతో దెబ్బలుతిన్న అబ్బాయి తల్లి సైకియాట్రిస్టు. తండ్రి పేరుమోసిన కాంట్రాక్టరు. ఆ దెబ్బలుతిన్న అబ్బాయి పేరు చరణ్. బాగా చదువుతాడు. ఐఐటిలో ర్యాంకు కోసం పోటీ పడుతున్నాడు. అతనికి ఐఐటి సీటు తప్పనిసరిగా వస్తుందని రూఢీ అయిపోయింది. కారణం – తాము నిర్వహించే అన్ని పరీక్షల్లోనూ మంచి ర్యాంకులతో దూసుకెళ్తున్నాడు. అలాంటి ఉత్తమ విద్యార్థిని కొట్టడంతో వివేకానంద వార్తల్లోని వ్యక్తిగా నిలిచిపోయాడు. అయితే ఎందుకు కొట్టాడో, ఏమిటో మాత్రం నోరు విప్పడం లేదు. ఇతనంటే తనకు సదభిప్రాయం కూడా ఉంది. ఇలాంటి లెక్చరర్‌ని కాలేజీ నుండి బయటికి పంపడం కూడా ఇష్టం లేదు.
ఇతనికి బయట ఏ కాలేజీలోనైనా ఉద్యోగం దొరక్కపోదు.
ఆలోచనల్లోంచి బయటకొచ్చి, తన మిగతా కమిటీ సభ్యుల వంక ఏం చేద్దామన్నట్టు చూసాడు.
“ఇతడిని బయట కూర్చోబెట్టండి. మనం మాట్లాడుకున్న తర్వాత మళ్లీ పిలుద్దాం” చెప్పాడు ఒక లెక్చరర్.
వివేకానంద బయటికి వెళ్లిన తర్వాత వివేకానందను కోపంగా ప్రశ్నించిన లెక్చరర్ “ఇతగాడిని మనం బయటికి పంపడమే ఉత్తమం! ఇతనికి చాలా యారగన్సీ ఉంది. ఎవరినీ లెక్కచేయని మనిషి” అన్నాడు.
ఆ మాటలకు ప్రిన్సిపాల్ “అది లెక్కచేయకపోవడం కాదు. దాన్ని ఆత్మవిశ్వాసం అంటారు. అతను ఈ కాలేజీలో చేరింది లగాయితు అందరిపట్ల గౌరవంగానే ఉన్నాడు కదా!” అన్నాడు ప్రిన్సిపాల్.
ఆ మాటలకు ఆ లెక్చరర్, “లేనిపోని విషయాలలో కూడా తల దూరుస్తాడు. ఆ మధ్య ఒక గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయుల బృందం వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం విద్యా శాఖ కార్యదర్శిగారితో మాట్లాడ్డం కోసం ఇతన్ని తీసుకెళ్లారు” అన్నాడు ఆ లెక్చరర్.
ప్రిన్సిపాల్ ఆ మాటలకు, “అది వివేకానంద తప్పు కాదు కదా! ఇతడిని తమ సమస్యల గురించి ఆ గవర్నమెంట్ స్కూళ్లకు సంబంధించిన కార్యదర్శితో మాట్లాడడానికి తీసుకెళ్లారు. ఇతను ఆ స్కూల్లో చదువుకున్నాడట. సమస్యను ప్రజెంట్ చేయడంలో, ఆ సమస్య పరిష్కరించే దిశగా ఆలోచన చేయడంలో ఇతను ప్రజ్ఞను వారు గుర్తించారు. అందుకే తీసుకెళ్లారు.
తను చదివిన స్కూలు గురువులు అడగడంతో ఇతను కాదనలేక వెళ్లాడు. ఆ విషయంలో నా అనుమతి కూడా తీసుకున్నాడు. చక్కటి మెమొరాండం సమర్పించాడు. చాలా మంచి డాక్యుమెంట్ అది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎందుకు సరిగ్గా పాఠాలు చెప్పలేకపోతున్నారు? ప్రైవేట్ స్కూళ్లతో పోలిస్తే ఫలితాలు కూడా తక్కువగా ఉన్నాయి. కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు వివేకానంద మంచి జవాబులతో సహేతుకమైన ఒక డాక్యుమెంట్ సమర్పించాడు.
ప్రభుత్వ పాఠశాల, హైస్కూలు టీచర్లను ప్రభుత్వం బోధనతో పాటు వేరే పనులకు ఉపయోగిస్తుంది. జనాభా లెక్కలు, ఎలక్షన్ డ్యూటీలు, పశుగణన, ఇంకా వ్యాధులు ప్రబలినప్పుడు ముందుజాగ్రత్త చర్యలు.. ఈ పనులు చాలా ఎలిమెంటరీ, హైస్కూలల్లో టీచర్లకు చెబుతున్నారు. అలాగే చాలా పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి సమానమైన రీతిలో ఉపాధ్యాయుల నియామకం లేదు. పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు.
కొన్ని సందర్భాల్లో విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందడం లేదు. అలాగే చాలా పాఠశాల భవనాలు సరైన స్థితిలో లేవు. కొన్ని భవనాలు బాగా పాడైపోయాయి. ఇలాంటి విషయాలతో వివేకానంద ఒక దూరదృష్టితో, సూక్ష్మపరిశీలనతో పత్రం సమర్పించాడు. ఆ పత్రం చూసి వారు కలిసిన విద్యా శాఖ కార్యదర్శి కూడా వివేకానందను విద్యా సంస్కరణల కమిటీలో సభ్యునిగా నామినేట్ చేసాడు” అన్నాడు ప్రిన్సిపాల్.
ఆయన ఇలా మాట్లాడుతూ వుండగానే కాలేజీ కరస్పాండెంట్ గారినుండి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే ఆయన కోప్పడుతూ `
“అసలేం జరుగుతోంది? ఒకవైపు వివేకానందను కాలేజీనుంచి తొలగించమని యాజిటేషన్ జరుగుతూ వుంటే మరికొంతమంది విద్యార్థులు ఆయన్ని ఉంచాలంటూ నా దగ్గరకు ఒక మెమొరాండమ్ తీసుకొచ్చారు. అలాగే దెబ్బలుతిన్న విద్యార్థి చరణ్ తల్లిగారు, పేరుమోసిన సైకియాట్రిస్ట్ డాక్టర్ కమల గారు కూడా మన కాలేజీకి వచ్చారు. వివేకానందను కలవాలనుకుంటున్నారు. వెంటనే వారితో వివేకానంద కలిసే ఏర్పాట్లు చేయండి. ఈ సమస్య తక్షణమే పరిష్కారం కావాలి” చెప్పాడు కరస్పాండెంట్.
“అలాగే సార్.. అదే పనిమీద ఉన్నాం” అంటూ ఫోన్ పెట్టేసాడు ప్రిన్సిపాల్.
ప్రిన్సిపాల్ మిగతా సభ్యుల వైపు తిరిగి, “ఏం చేద్దాం?” అన్నాడు.
“వివేకానందను పంపించేస్తే సమస్య వదిలిపోతుంది సార్. లేనిపోని తలనొప్పులు ఎందుకు?” అన్నారు, అతని ఎదురుగా కూర్చున్న కమిటీ సభ్యులు ఏకకంఠంతో.
“సరే.. మెజారిటీ ఒపీనియన్ ప్రకారం వివేకానందను కాలేజీనుంచి టెర్మినేట్ చేయమని ఆర్డర్లు తయారుచేయిద్దాం” అన్నాడు ప్రిన్సిపాల్.
మిగతా సభ్యులు “ఓకే సార్..” అంటూ ప్రిన్సిపాల్‌కు నమస్కారం చేసి ఆ గదిలోంచి బయటికి నడిచారు.
అప్పటికి మధ్యాహ్నం ఒంటిగంట దాటడంతో తన లంచ్‌బ్రేక్ కోసం ఇంటికి బయలుదేరాడు ప్రిన్సిపాల్.
***
మధ్యాహ్నం రెండు తర్వాత తిరిగి కాలేజీకి వచ్చిన ప్రిన్సిపాల్‌కు అప్పటికే తనకోసం వెయిట్ చేస్తోన్న వివేకానంద తన గది బయట కనిపించాడు. తన టేబులు మీద అతని టెర్మినేషన్ ఆర్డర్స్ టైప్ చేసిన ఉత్తరం అటెండర్ తెచ్చిపెట్టి వెళ్లాడు. ఆ కాగితం ఒకసారి చదివి, సంతకం చేసి, బయట నిల్చున్న వివేకానందను లోపలికి పిలిచాడు. అతన్ని తన ఎదురుగా కూర్చోమని చెప్పి చెప్పడం మొదలుపెట్టాడు.
“నువ్వు ఏ తప్పూ చేయలేదని నాకు క్షుణ్ణంగా తెలుసు. నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తోంది. రెండువేల సంవత్సరాల క్రితం జీసస్ క్రైస్ట్‌ని శిలువ వేయమని అప్పటి మతాధికారులు, సైనికులు, కొంతమంది యూదులు కూడా ఆనాటి న్యాయాధికారి పొంతుపిలాతు మీద ఒత్తిడి తెచ్చారు. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక నిరపరాధిని, ఒక నిర్దోషిని శిక్షిస్తున్నామనే బాధ కలుగుతోంది. ఇప్పుడు మిగతా సభ్యులెవరూ లేరు. ఇప్పటికైనా చెప్పండి. మీరు ఎందుకు ఆ అబ్బాయిని కొట్టారో?” అన్నాడు ప్రిన్సిపాల్.
ఆ మాటలకు వివేకానంద తలెత్తి చూసి, “క్షమించండి సార్! నేనేమీ చెప్పలేను” అన్నాడు.
“సరే.. మీరు వెళ్లవచ్చు. ఆల్ ది బెస్ట్..” అని, “నేనిప్పుడు చెప్పడం భావ్యం కాదు. ఎందుకంటే మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తూ ఉత్తర్వులు ఇచ్చాను. అయినప్పటికీ మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను” చెప్పాడు ప్రిన్సిపాల్.
“థాంక్యూ సార్..” అంటూ వివేకానంద లేచి నిలబడి, ఆ గదిలోంచి కదలబోయేంతలో ఎవరో వచ్చిన చప్పుడు వినిపించింది. ప్రిన్సిపాల్ తలెత్తి చూసేసరికి దాదాపు నలభైఐదేళ్లు వయసు ఉన్న ఒక మహిళ గబగబా లోపలికి రావడం గమనించాడు.
“సారీ సార్.. మిమ్మల్ని కలవడంకోసం చాలాసేపటినుండి బయట వెయిట్ చేస్తున్నాను. అటెండర్ కాసేపు వేచిచూడమన్నా నేను ఆగలేక వచ్చేసాను. దయచేసి క్షమించండి” అంది. అలా అంటూ ఆమె తన పక్కనే నిల్చున్న వివేకానంద వైపు చూసి, “మీరేనా వివేకానంద?” అంది.
“అవును మేడమ్..” అన్నాడు, రెండు చేతులూ జోడించి.
“ఇక మీరు వెళ్లవచ్చు” అన్నాడు ప్రిన్సిపాల్, వివేకానందతో.
“దయచేసి మీరు కూడా కాసేపు కూర్చుంటారా?” అంది ఆమె, వివేకానంద వైపు చూస్తూ.
ప్రిన్సిపాల్ వివేకానంద మొహంలోని ఇబ్బంది గమనించి, “ఆయన్ని పంపేద్దాంలెండి మేడమ్. మనం మాట్లాడుకుందాం. ఆయనకు టెర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చేసాం” అన్నాడు.
ఆ మాటలు ఆమె ఒక్కక్షణం ఆలోచనలో పడి, “దయచేసి ఒక ఐదు నిమిషాలు కూర్చోగలరా?” అంది వివేకానందతో.
“అలాగే మేడమ్” అన్నాడు, ఆమె ప్రక్కనే కూర్చుంటూ.
ఆమె ప్రిన్సిపాల్ వైపు చూస్తూ, “నేను ఒక విషయం తెలుసుకుందామని వచ్చాను. మా అబ్బాయిని ఎందుకు కొట్టాడో వివేకానంద నోటిద్వారా విందామని వచ్చాను. దయచేసి చెప్పండి బాబూ! మా అబ్బాయిని ఎందుకు కొట్టారో” అంది ఆవిడ.
వివేకానంద సమాధానం చెప్పకుండా మౌనం వహించాడు.
ఆ గదిలో చాలాసేపు మౌనం రాజ్యమేలింది. మంచులా గడ్డకట్టిన ఆ మౌనాన్ని బద్దలుకొడుతూ ప్రిన్సిపాల్ చెప్పడం ప్రారంభించాడు. “మేడం.. వివేకానంద కథ ముగిసిపోయింది మా కాలేజీలో. ఇంక ఆయన్ని వదిలేయండి” అన్నాడు.
ఆ మాటలకు ఆమె వెంటనే “కథ ఇప్పుడే మొదలయింది. ఈయన్ని వదిలేది లేదు. ఈయన మా అబ్బాయిని ఎందుకు కొట్టాడో ఈయన చెప్పడంలేదు. కానీ ఆ విషయం నాకు తెలుసు” అంది.
ఆమె అలా అనగానే ప్రిన్సిపాల్ షాక్ తిన్నట్టు చూసాడు. వివేకానంద మొహంలో ఏ భావమూ లేదు. డాక్టర్ కమల చెప్పడం మొదలుపెట్టింది.
“మా అబ్బాయిని కొట్టినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అలా కొట్టడమే కాదు, ఆయన మా అబ్బాయికి ఇంకో శిక్ష కూడా వేసాడు. క్లాసులో మా అబ్బాయితో మాట్లాడ్డం మానేసాడు. కొట్టడంకన్నా అది భయంకరమైన శిక్షే! మాస్టారు మాట్లాడకపోవడంతో మిగతా పిల్లలు మావాడితో మాట్లాడ్డం మానేసారు. క్లాసులో మంచి ర్యాంకర్! రేపు ఐఐటి కాలేజీలో సీటు పొందేందుకు అన్నివిధాలా అర్హత కలిగినవాడు మా అబ్బాయి. అయినా మా అబ్బాయిని కొట్టాడు. ఎందుకు అంత తెలివైన అబ్బాయిని కొట్టాల్సి వచ్చింది. ‘ఈ మాస్టారిదే తప్పు’ అంటూ ఈ కాలేజీ విద్యార్థులు కూడా యాజిటేషన్ చేసారు.
అయితే మా ఆబ్బాయికి విలువైన చదువు ఇస్తున్నామనుకున్నాం. కానీ, నేను నా ఉద్యోగంలోనూ, మావారు వ్యాపారంలోనూ పడిపోయి ఒక్కగానొక్క మా కొడుక్కి విలువలతో కూడిన జీవితం ఇవ్వలేకపోయామని అర్థమయింది. మాస్టారుతో పాటు తన సహచరులు మాట్లాడ్డంలేదని మా అబ్బాయి కుమిలిపోయాడు. రోజూ ఒక్కడే ఒంటరిగా ఏడుస్తున్నాడు. సైకియాట్రిస్టునైన నేను మా అబ్బాయిని కౌన్సిలింగ్ చేసాను. వాడిద్వారా వివేకానంద మాస్టారు వాడిని ఎందుకు కొట్టారో అర్థమయింది. అప్పుడే నాకు అనిపించింది ‘ఈయన లెక్కలు బాగా చెప్పే మాస్టారే కాదు, లెక్కించదగ్గ మాస్టారు. అలాగే లెక్కల్లో మనిషి’ అని అర్థమయింది.
‘పుస్తకాలు వీధుల్లోనూ, చెప్పులు అద్దాల అంగళ్లల్లోనూ అమ్మే రోజులు వచ్చిననాడు జనం కళ్లు తెరవడానికి జ్ఞానంకంటే చెప్పులే అవసరం’ అన్నాడు ఒక మహానుభావుడు. అంటే.. కుక్క కాటుకు చెప్పుదెబ్బ. చెప్పుదెబ్బ కొట్టిందెవరో? కాటు వేసిన కుక్క ఎవరో? మీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. మాస్టారు తప్పు చేయలేదు. తప్పు చేసింది మా అబ్బాయే! తను ర్యాంకర్. చదువులోని టెన్షన్ తట్టుకోవడంకోసం డ్రగ్స్‌ని ఆశ్రయించాడు. ఆ మత్తులో ఒక అమ్మాయిని కరవబోయాడు. అప్పుడు మాస్టారు అడ్డుకొని చెప్పుతో మావాడిని కొట్టారు అది చూసిన మాస్టారు. ‘కుక్క కాటుకు చెప్పుదెబ్బ..’ కరెక్టే కదా సార్!
అయితే ఈ విషయం వివేకానంద గారు మనం ఎంత అడుగుతున్నా చెప్పలేకపోవడానికి కారణం.. మావాడు కాటు వేయబోయిన అమ్మాయి ఎవరో ప్రపంచానికి తెలుస్తుంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లు ఎక్కువవుతున్నాయి. బాధపడ్డ ఆ అమ్మాయి మరింత అవమానానికి గురవుతుంది. అందుకే మా అబ్బాయికి సరైన శిక్షవేసి ఆ అమ్మాయిని రక్షించాడు. అలాగే మా అబ్బాయి కూడా రక్షింపబడ్డాడు. ఇలాంటి ఉత్తముడికి శిక్షవేసి మనందరం పాపం చేస్తున్నాం. బాబూ.. నన్ను క్షమించు” అంటూ ఆవిడ గబుక్కున క్రిందకి వంగి వివేకానంద పాదాలను ముట్టుకోబోయింది.
“అయ్యో.. వద్దు మేడమ్” అంటూ ప్రక్కకు జరిగాడు.
ఆమె చెప్పడం కొనసాగించింది, “మా అబ్బాయి కెరియర్ కూడా పాడవుతుందని వాడు చేయబోయిన తప్పు గురించి లోకానికి చెప్పలేదు. ఈ విధంగా ఇద్దరు పసివాళ్లను ఈయన కాపాడాడు. ఈయనపై ఇచ్చిన కంప్లయింట్లను నేను విత్‌డ్రా చేసుకుంటున్నాను. ఈయనను కాలేజీలో ఉంచమని ప్రాధేయపడుతూ నేను రాసిన ఉత్తరం” అంటూ, తన బ్యాగ్‌లోని కవర్‌ను ప్రిన్సిపాల్‌కు అందించింది.
ప్రిన్సిపాల్ వివేకానంద చేతిలో ఉన్న టెర్మినేషన్ ఆర్డర్స్‌ను తీసుకొని, దాన్ని చింపి బుట్టలో వేసి, ఒక్కసారిగా వివేకానందను హత్తుకున్నాడు.
బయట ‘వివేకానంద గారికి జై.. వారిని టెర్మినేట్ చేయడానికి వీలు లేదు. జిందాబాద్.. జిందాబాద్.. వివేకానంద జిందాబాద్..’ అంటూ నినాదాలు వినిపించాయి.
ఆ గదిలో ప్రిన్సిపాల్‌తో పాటు వివేకానంద, డాక్టర్ కమల ఇద్దరూ కిటికీలోంచి ప్రిన్సిపాల్ రూము వైపు వస్తోన్న విద్యార్థులను చూసారు.
వారికి నాయకత్వం వహిస్తున్న విద్యార్థిని చూసి, ప్రిన్సిపాల్‌తో పాటు ఆ ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
ఆ విద్యార్థి పేరు చరణ్. వివేకానంద చెప్పుతో కొట్టిన వ్యక్తి!
