Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

లోకల్ క్లాసిక్స్ – 34: మానవ హక్కుల మర్యాద

‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా వెట్రిమారన్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘విసారనై’ని విశ్లేషిస్తున్నారు సికిందర్.

‘విసారనై’ (తమిళం)

మిళ ఆర్ట్ సినిమా ఆస్కార్ అవార్డులకి కూడా ఎంపిక అవచ్చు. నామినేట్ కాకపోవడం వేరే విషయం. గత యాభై ఏళ్లుగా ‘దైవ మగన్’, ‘నాయగన్’, ‘అంజలి’, ‘దేవర్ మగన్’, ‘కురుతి పూయల్’, ‘జీన్స్’, ‘హేరామ్’ మొదలైన ఏడు తమిళ సినిమాలు ఆస్కార్ అవార్డులకి విదేశీ చిత్రాల కేటగిరీలో మన దేశం తరపున ఎంపికయ్యాయి. ఇవన్నీ కమర్షియల్ సినిమాలే. ఇలా కాకుండా తాజాగా 2016 లో ‘విసారనై’ ఆస్కార్‌కి ఎంపికైన తొలి తమిళ ఆర్ట్ సినిమా అయింది. దర్శకుడు వెట్రిమారన్ ఈ ఘనత సాధించాడు.

2015లో స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ వాస్తవిక కథా చిత్రం మానవ హక్కుల దుస్థితిని దృశ్యీకరిస్తుంది. మానవ హక్కుల మీద అనేక సినిమాలు వివిధ భాషల్లో వచ్చి వుంటాయి. కానీ ఇంత పచ్చిగా రావడం ఇదే. దీనికి స్ఫూర్తి నిచ్చినవాడు ఒక ఆటోడ్రైవర్. పత్రికలు కూడా రాయని ఈ మానవ హక్కుల ఉల్లంఘనని సినిమా విడుదలాయ్యాక పట్టించుకున్నాయి. తమిళనాటే కాదు, జాతీయ మీడియాలు సైతం దీనికి బ్రహ్మరథం పడుతూ ప్రపంచ దృష్టికి తెచ్చాయి. ఇంతకీ ఏమిటీ దీని కథ? ఎందుకు ఇది గమనంలోకి తీసుకోవాల్సిన తమిళ సినిమా? ఒకసారి చూద్దాం…

కథ

గుంటూరులో పాండి, మురుగన్, అఫ్జల్, కుమార్ అనే తమిళనాడు నుంచి వలస వచ్చిన నల్గురు కూలీలు పనులు చేసుకు బతుకుతూంటారు. పార్కులో మకాం వుంటారు. ఓ రాత్రి పోలీసులు దోపిడీ కేసులో నల్గుర్నీ నిర్బంధించి కొడతారు. తాము దొంగలం కాదని ఎంత చెప్పినా పోలీసులు నమ్మరు. ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వరరావు (అజయ్ ఘోష్)కి పై అధికారుల వొత్తిడి వుంటుంది. ఓ ప్రముఖుడి ఇంట్లో కోటి రూపాయల మేరకు ఆభరణాలు, నగదు దోపిడీ అయిన కేసులో దొంగల్ని పట్టుకోలేక పోవడం ఇబ్బందిగా వుంటుంది. ఈ నల్గరు కూలీల్ని కేసులో ఇరికించి కోర్టుకి అప్పగించేసి చేతులు దులుపుకుందామనుకుంటాడు.

ఇంటరాగేషన్‌లో ఎన్నిదారుణ చిత్ర హింసలకి గురిచేసినా చెయ్యని నేరాన్నిఒప్పుకోరు నల్గురూ. ఇన్‌స్పెక్టర్ ఒక పన్నాగంతో ఒప్పుకునేలా చేసి కోర్టుకి తీసుకు పోతాడు. అక్కడ జడ్జి ముందు ఆ నల్గురూ అడ్డం తిరిగి, తమని హింసించి బలవంతంగా ఒప్పించారని చెప్పేస్తారు. వాళ్ళ తమిళం అర్థం గాక తమిళం తెలిసిన వారిని పిలవమంటాడు జడ్జి. ఆ సమయంలో చెన్నై నుంచి సీక్రెట్ ఆపరేషన్ మీద వచ్చిన ఇన్‌స్పెక్టర్ ముత్తు వేలు (సముద్రకని) కోర్టు దగ్గరే వుంటాడు. అతను వచ్చి వాళ్ళు చెప్పింది జడ్జికి ఇంగ్లీషులో చెప్తాడు. వీళ్ళు తనకి తెలిసిన వాళ్లేనని, అమాయకులనీ కూడా చెప్పేసరికి, జడ్జి వాళ్ళని విడిచిపెట్టేసి, ఎదురు మాట్లాడిన ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర రావుని కోర్టు ముగిసేవరకూ తన పక్కన నించోవాలని శిక్ష వేస్తాడు.

 

కోర్టు బయట కూలీలు ఇన్‌స్పెక్టర్ ముత్తువేలుకి దండాలు పెట్టుకుంటారు. ఒక పనుంది చేస్తారాని అడుగుతాడు. చేస్తామంటారు. వాళ్ళ చేత ఒక ఛార్టెడ్ ఎక్కౌంటెంట్ కేకే (కిషోర్)ని కిడ్నాప్ చేయించి వాళ్ళతో చెన్నై బయల్దేరతాడు ముత్తువేలు.

ఛార్టెర్డ్ ఎక్కౌంటెంట్ కేకేని ఎందుకు కిడ్నాప్ చేశాడు ముత్తువేలు? చెన్నైలో జరుగుతున్న రాజకీయ కుట్రేమిటి? ఆ ప్రతిపక్ష కుట్రని చెన్నై పోలీసు ఉన్నతాధికారులు భగ్నం చేయాలని పాల్పడిన నేరాలేమిటి? ఇందులో ఛార్టెడ్ ఎక్కౌంటెంట్ కేకే పాత్రేమిటి? నల్గురు కూలీల్లో ఒకడు గుంటూరులోనే దిగిపోయాక మిగతా ముగ్గురూ ఏమయ్యారు? ముత్తువేలు ఏమయ్యాడు? చేసిన నేరాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు ఇంకెన్ని నేరాలు చేశారు- లాకప్ డెత్, ఎన్‌కౌంటర్లు సహా? …ఇదీ మిగతా కథ

ఎలావుంది కథ

కోయంబత్తూరుకి చెందిన ఆటో డ్రైవర్ ఎం. చంద్రకుమార్ రాసిన ‘లాకప్’ అన్న నవల ఈ కథ కాధారం. 1983లో గుంటూరులో హోటల్ పని చేసుకుంటున్న చంద్రకుమార్ సహా మరో ముగ్గురు తమిళుల్ని పోలీసులు దొంగతనం కేసులో ఇరికించి, పదిహేను రోజులపాటు తీవ్రంగా హింసించి, జైలు పాల్జేసిన దుర్భర జీవితాన్ని అతను నవలగా రాశాడు. బాగా ప్రాచుర్యం పొందిన ఈ నవల ఇంగ్లీషులో అనువాదమై అమెజాన్ లో అమ్మకానికుంది. దర్శకుడు వెట్రిమారన్‌ని ఈ నవల కదిలించడంతో ‘విసారనై’ పేరుతో తెరకెక్కించాడు. ఇది మూడు జాతీయ అవార్డులు పొందడమే గాక ఆస్కారుకి ఎంపికయింది. వెనీస్‌లో జరిగిన 72 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇటాలియా’ అవార్డు పొందింది. దీనికి దర్శకుడితో కలిసి చంద్రకుమార్ హాజరయ్యాడు.

చంద్రకుమార్ ఇప్పటికీ కోయంబత్తూరులో ఆటో నడుపుతాడు. భార్య, ఫోటోగ్రఫీలో పీజీ చేసిన కూతురూ వున్నారు. ప్యాసింజర్లు లేనప్పుడు ఆటోలోనే కూర్చుని రాస్తాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు కూడా సమయం వృధా చేయకుండా రాస్తాడు, ప్రూఫ్ రీడింగ్ చేస్తాడు, ఎడిటింగ్ చేస్తాడు. రాత్రి పూట ఇంటిదగ్గర పూర్తిగా రాయడం, చదవడంలో నిమగ్నమవుతాడు.

‘లాకప్’ తర్వాత ‘లాకప్ 2’ రాశాడు. భూగోళాన్ని అమెరికా నరకంలా మార్చేసిందని ఓ పుస్తకం రాశాడు. సామ్రాజ్యవాదమూ – టెర్రరిజం చరిత్రల మీద ఇంకోటి రాశాడు. స్త్రీల సమస్యల మీద మరోటి రాశాడు. ఇలా ఆరు పుస్తకాలు రాశాడు. మొదటి రచన ‘లాకప్’కి ‘మానవ హక్కుల ఉత్తమ డాక్యుమెంట్’ అవార్డుని మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి వీఆర్ కృష్ణ అయ్యర్ చేతుల మీదుగా అందుకున్నాడు.

వెట్రిమారన్ దీన్ని తెరకెక్కించినప్పుడు గుంటూరులో జరిగిన వాస్తవ కథని చెన్నైలో కాల్పనిక కథతో జత చేశాడు. గుంటూరులో జరిగిన వాస్తవ కథని కూడా సినిమా కనుకూలంగా మార్చాడు. చంద్రకుమార్‌తో బాటు మరో ముగ్గురు ఆరునెలలు జైలు శిక్ష అనుభవించడం వాస్తవం. సినిమాకి కోర్టు రిమాండ్ అప్పుడే నల్గుర్నీ విడుదల చేసి చెన్నై ఇన్‌స్పెక్టర్‌తో ఛార్టర్డ్ ఎక్కౌంటెంట్ కిడ్నాప్ కథ సృష్టించాడు. ఇక్కడ్నించీ అంతా కల్పనే. ఈ మొత్తం కథని దేశంలో ఇంకే సినిమా చూపించనంత హింసతో పోలీసు అకృత్యాల్ని చూపించాడు. ఇందుకే ఆస్కార్ నామినేషన్‌కి నోచుకోకుండా ఎంపిక దగ్గరే ఆగిపోయింది. అయితే వాస్తవంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనని ప్రజలకి తెలియని దాని మౌలిక స్థాయిలో చూపించక పోతే, ప్రత్యక్ష బాధితుడు చంద్రకుమార్‌కి అన్యాయం చేసినట్టే. ఈ కథలో జరిగినట్టు ఎవరికైనా జరగవచ్చన్న హెచ్చరిక ఇందులో ప్రధానంగా వుంది.

నటులు కాదు పాత్రలు

ఇందులో నటులు కనిపించరు. పాత్రలే కన్పిస్తాయి. పాత్రలు కూడా సినిమా పాత్రల్లా కాకుండా బయట మనం చూసే మనుషుల్లా వుంటాయి. పచ్చి వాస్తవికత అనే జానర్‌లో ఈ సినిమా తీసినప్పుడు పాత్రలే కాదు, స్థలాలూ, వాటి నేపథ్యాలూ, కోర్టు, పోలీసు వ్యవహారాలూ వగైరా సమస్తం ఆ జానర్ మర్యాదకి కట్టుబడి వుంటాయి. సంభాషణాలూ దృశ్యాలూ, ప్రవర్తనలూ అసభ్యంగా వుండవు. అసలైన పోలీసు హింస ఎలా వుంటుందో ప్రేక్షకులు తెర మీద అనుభవించడానికి ఏకసూత్రతతో హింసే ప్రధానంగా వుంటుంది. హింస నుంచి దృష్టి మళ్లించే వేరే కామెడీలూ, అశ్లీలం, అసభ్యతలూ జాడ కనిపించవు. గుండెలు జలదరించే హింస. ఈ హింసించే పోలీసు పాత్రలు కింది స్థాయి పోలీసులే. వీళ్ళు సినిమా ఫైటర్లు. వీళ్ళకి ఎక్కడ ఎలా తీవ్రంగా కొడుతున్నట్టు నటించాలో ఆ టెక్నిక్ బాగా తెలిసి వుంటుంది. నటులు ఈ పని చేస్తే పొరపాటున ప్రాణాలు పోవచ్చు.

చెన్నై వెళ్ళే ముందు వరకూ సగభాగం సినిమా అమాయకులు నల్గురూ పోలీస్ స్టేషన్లో పదే పదే చిత్రహింసలకి గురయ్యే దృశ్యాలతో భీకరంగా వుంటుంది. ఈ పాత్రలు నటించిన దినేష్ రవి, మురుగ దాస్, రత్న సామి, ప్రధీష్ రాజ్‌లు ప్రేక్షకుల గొంతులు తడారిపోయేలా నటిస్తారు. దీనికి పరాకాష్టగా తాటిమట్ట పట్టుకుని క్రూర స్వభావమున్న ఇన్‌స్పెక్టర్ పాత్రలో అజయ్ ఘోష్ దిగుతాడు.

చెన్నై వెళ్ళాక చివరి దృశ్యాల్లో అక్కడ పోలీస్ స్టేషన్లో చావు తప్పించుకుని పారిపోయే ప్రయత్నాలతో మరోసారి మిగిలిన ముగ్గురు కూలీలైన దినేష్ రవి, మురుగ దాస్, రత్నసామిలు ఉద్విగ్నంగా నటిస్తారు. చెన్నై పోలీస్ స్టేషన్లో చార్టర్డ్ ఎక్కౌంటెంట్ కేకే ఇంటరాగేషన్, చిత్రహింస, చావు ఇంకోసారి గగుర్పాటు కల్గించే దృశ్యాలు. ఈ పాత్రలో మొదట బేపర్వాగా వుండే కిషోర్, క్రమంగా హింసకి గురై కొయ్యబారిన శవమై వేలాడే ఘట్టం అత్యంత భయానకమైనది. ఈ ఆత్మహత్యని పకడ్బందీగా సృష్టిస్తారు పోలీసులు. కూలీల పట్ల సానుభూతితో వుంటూ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసే ఇన్‌స్పెక్టర్ ముత్తువేలు పాత్రలో సముద్రకని అతి ప్రతిభావంత నటన ప్రదర్శిస్తాడు. ఈ నటనకి ఉత్తమ నటుడి జాతీయ అవార్డు లభించింది. అయితే గుంటూరుకీ చెన్నైకీ మధ్య లింకు దృశ్యంలో పాత్ర చిత్రణలే దెబ్బతిన్నాయి. ఇన్‌స్పెక్టర్ ముత్తువేలు కోర్టులో ఈ నల్గురూ అమా యకులని విడిపించాక, చెయ్యని నేరానికి వొళ్ళు హూనం చేసుకున్న వాళ్ళని వదిలెయ్యక, కిడ్నాప్ అనే నేరం ఎందుకు చేయించాడు? అలా అమాయకులుగా విడుదలైన వాళ్ళు కూడా తమని విడిపించిన ముత్తువేలు కోసం కిడ్నాపర్స్‌గా నేరాల వైపు ఎందుకు అడుగులేశారు? ముత్తువేలు ముందుగానే వీళ్ళ మీద ఆలోచన చేసి, జడ్జీకి అబద్ధం చెప్పి విడిపించాడా? ముత్తువేలైనా ఈ నల్గురైనా పాజిటివ్ పాత్రలుగా ఇలా జస్టీఫై కావు. ఈ మలుపు చెన్నై కథకి మూలం. కానీ మలుపులోనే జస్టీఫికేషన్ లేకపోతే చెన్నై కథకి అర్థమేముంటుంది. గుంటూరు ఇన్‌స్పెక్టర్ చెప్పినట్టు వినివుంటే చెయ్యని నేరానికి జైల్లోనైనా ప్రాణాలతో వుండే వాళ్ళు. ఇన్‌స్పెక్టర్ ముత్తువేలు రుణం తీర్చుకోవాలని నేరం వైపు ప్రాణాలే కోల్పోయారు.

స్థూలంగా పోలీసు మరో ముఖం మరో సారి విప్పి చూపించే వాస్తవికం ఇది. అయితే దేశంలో ఎవరూ ప్రయత్నించని పచ్చి వాస్తవికం. దీనికి మొత్తం మూడు జాతీయ అవార్డులు లభించాయి. ఆలస్యంగా 2019 ఫిబ్రవరిలో ఇది తెలుగులో డబ్ అయింది.

 

Exit mobile version