Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

లోహ మరీచిక

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో సైన్స్ ఫిక్షన్ విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘లోహ మరీచిక’. రచన పి. దినకర్ రెడ్డి.]

“మేడం! ఇది ఒక్కటే మిగిలింది హెన్రీ కావిల్ రూపంతో. ఈ ఆండ్రాయిడ్ రోబోట్ సిరీస్ మళ్ళీ మార్కెట్లోకి రావడానికి టైం పడుతుంది. ‘AI for Mankind’ అనే సదస్సులోని ఒక స్టాల్లో ఉన్న వ్యక్తి మేఘకు చెప్పసాగాడు. అతను తన పక్కనే ఉన్న రోబోట్ ని పరిచయం చేసాడు మేఘకు.

మేఘ ఆ ఆండ్రాయిడ్ రోబోట్‌ని కొనుక్కుంది. “హెన్రీ, నువ్వు కారు నడుపుతావా?” అని అడిగింది మేఘ.

“ఓ..నేను మనుషులు చేసే అన్ని పనులూ చేయగలను. మీరు నా ప్రైమరీ యూజర్, మిమ్మల్ని సంతోషంగా ఉంచడం కోసం నేను ఏమైనా చేస్తాను” అన్నాడు హెన్రీ.

టెక్నాలజీ, మనుషుల సంపాదన స్థాయి విపరీతంగా పెరిగిపోవడంతో చాలా మంది ఆండ్రాయిడ్ రోబోట్స్‌ను పనుల్లో పెట్టుకుంటున్నారు. వృద్ధులు తమను చూసుకోవడానికి, బిల్డింగ్ పనులు చేసే చోట, మురుగు కాల్వలు శుభ్రం చేయడానికీ, ఇలా చాలా పనులు రోబోట్స్ చేస్తున్నాయి. ఈ ఆండ్రాయిడ్ రోబోట్స్ అచ్చుం మనిషి లాగానే ప్రవర్తిస్తాయి. అవి కేవలం మెకానికల్ భాగాలు మాత్రమే కాకుండా, మానవ శరీరానికి ఉన్నట్టే రక్త మాంసాలు ఉన్నట్టే డిజైన్ చేయబడి ఉంటాయి. చేయాల్సిన పనులను బట్టి వాటిలో ఉంచిన చిప్‍కి ప్రోగ్రాం చేయబడి ఉంటుంది. మేఘకు తన ఆఫీసులో జరిగిన ఈ డిస్కషన్ గుర్తుకు వచ్చి, ‘మనుషులం ఏమైపోతామో, రేప్పొద్దున మా ఉద్యోగాలు కూడా ఇవే చేస్తాయి’ అని అనుకుని హెన్రీ వైపు చూసి నవ్వింది. అతను కన్నులు ఆర్పి “నేనూ నవ్వొచ్చా?” అని అడిగాడు. తప్పకుండా అందామె. అతను నవ్వుతూ కార్ స్టార్ట్ చేసాడు. ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు.

“నువ్వు కింద గదిలో ఉండొచ్చు. నేను పైన గదిలో ఉంటాను” అంది మేఘ.

“మీరు ఇప్పుడు కింద గదిలో ఉండడం మంచిది. నేను హాల్లో ఉంటాను. నాకు ఛార్జింగ్, ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే చాలు. నాకు వేరే స్థలం అవసరం లేదు” అని హెన్రీ అన్నాడు.

“నువ్వేం అంటున్నావో నాకు అర్థం కాలేదు” అంది మేఘ.

“నేను కారులో ఉన్న మెడికల్ రిపోర్ట్స్ అన్నీ స్కాన్ చేశాను. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ కాబట్టి కింద గదిలో ఉండడం మంచిది” అన్నాడతను.

మేఘ ఒక్కసారి షాక్ కు గురై అంతలోనే సర్దుకుని, “ఇంపెస్సివ్, హెన్రీ నువ్వు నన్ను మేఘ అనే పిలవొచ్చు” అంది.

“నేను మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఉండడానికి, మీ పాస్‌వర్డ్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. దానికి మీ అనుమతి కావాలి” అన్నాడతను.

“అంటే ఇప్పుడు నేను పాస్‌వర్డ్స్ అన్నీ గుర్తు తెచ్చుకుని చెప్పాలా?” అందామె.

“లేదు, నేను మీ డిజిటల్ లైబ్రరీని మొత్తం వై-ఫై ద్వారా చూడగలను” అన్నాడు హెన్రీ. మేఘ సరేనంది.

హెన్రీ ఆమె వైపు చూసి ఇలా అన్నాడు. “ఇవాళ గురువారం, నీకు ఇష్టమైన పాస్తా నేను చేస్తాను. తొందరగా ఫ్రెష్ అయి వచ్చి బిగ్ బ్యాంగ్ థియరీ చూస్తూ నవ్వుకోండి” అన్నాడు హెన్రీ నవ్వుతూ.

మేఘ అతని వైపు ఒకింత ఆశ్చర్యంగా చూస్తూ, “నువ్వు నవ్వుతున్నావే” అంది.

“నేను తొందరగా పనులు నేర్చుకోగలను, చెయ్యగలను. నా ప్రైమరీ యూజర్ మూడ్‌కి అనుగుణంగా నేను అచ్చం మనిషిలా ప్రవర్తించి వారికి తోడుగా ఉంటాను” అన్నాడు హెన్రీ.

మేఘ నవ్వుకుని గదిలోకి వెళ్ళింది. ఆమె ఫ్రెష్ అయి వచ్చేసరికి పాస్తా వడ్డించాడతను. ఇద్దరూ కలిసి బిగ్ బ్యాంగ్ థియరీ చూసారు.

ఆమె నవ్వుతుంటే అతనూ నవ్వాడు.

“హెన్రీ! ఒక విషయం చెప్పనా..” అందామె.

“చెప్పు మేఘా” అన్నాడతను.

“ఐ మిస్ మై బోయ్‌ఫ్రెండ్..తన పేరు జో. ఎందుకో ఈ విషయం నీకు చెప్పాలని అనిపించింది.”

హెన్రీ కళ్ళలో ఏదో కలవరింత. “మేఘా! ఇప్పుడు నీ బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయింది” అన్నాడతను.

“నువ్వు నా ఆరోగ్యాన్ని ప్రతి నిముషం మానిటర్ చేస్తావా?” అంది మేఘ.

“అవును. ప్రైమరీ యూజర్‌కి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి. నీ చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ నుంచి నేను అప్‌డేట్స్ తీసుకుంటాను. నువ్వు ఏ రకంగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయినా, నీ గురించి ఏ సమాచారం అయినా నేను గమనిస్తూ ఉంటాను” అని హెన్రీ చెప్పాడు.

మేఘకు ఇదంతా కొత్తగా ఉంది. జో వేరే ఊరికి వెళ్ళిపోయాక, ఆమెతో మాట్లాడ్డం తగ్గించాడు. మేఘ గర్భవతి అనే విషయం చెప్పినా అతను పెద్దగా పట్టించుకోలేదు.

ఆ ఒంటరితనం నుంచి బయటపడాలి అనే హెన్రీని కొనుక్కుంది మేఘ.

ఇప్పుడు హెన్రీలో ఆమెకు ఒక ప్రొటెక్టివ్ బాయ్ ఫ్రెండ్ కనిపిస్తున్నాడు. “సరే హెన్రీ, నాకు నిద్ర వస్తుంది. పైన గదిలో జో బట్టలు ఉన్నాయి, నీకు కావాల్సినవి తీసుకో” అని చెప్పి గదిలోకి వెళ్లి నిద్రపోయింది.

నెలలు గడుస్తున్నాయి. మేఘకు నెలలు నిండాయి. మేఘ రోజూ ఆఫీసుకు వెళ్లి రావడం, హెన్రీ ఆమెకు కావాల్సినవి అన్నీ అమర్చడం, ఆమెను జాగ్రత్తగా బయటికి తీసుకుని వెళ్లి, మళ్ళీ తీసుకుని రావడం, అన్నీ ఒక భాగస్వామి లాగానే చేస్తున్నాడు. ఫ్రిజ్‌లో ఏముందో డిస్‌ప్లేలో కనిపిస్తుంది. ఇంటర్నెట్ ద్వారా అన్ని స్మార్ట్ వస్తువులనూ హెన్రీ కంట్రోల్ చేయగలడు. వంట, ఇల్లు క్లీన్ చెయ్యడం, షాపింగ్.. ఇలా అన్నీ హెన్రీ చేసేస్తున్నాడు.

మేఘ, హెన్రీతో ఎంతలా బంధాన్ని అల్లుకుందంటే, బిడ్డ పుట్టేటప్పుడు తండ్రి స్థానంలో అతడిని లేబర్ రూమ్‌కు తీసుకుని వెళ్ళేంత.

మేఘకు పుట్టిన బాబును హెన్రీ మరింత జాగ్రత్తగా చూసుకోసాగాడు. ఆ బాబుకు సంతోష్ అని పేరు పెట్టింది మేఘ. అలా కొన్ని రోజులు గడిచాయి.

మార్గశిరపు చల్లని గాలి మేఘ ఇంటి కిటికీని తాకింది. సంతోష్ ఏడుస్తూ ఉన్నాడు. “అబ్బా! మళ్ళీ మొదలు పెట్టావా. నిద్రపోరా. నాకస్సలు నిద్ర లేకుండా చేస్తున్నావ్” అంది మేఘ.

హెన్రీ లోపలికి వచ్చి మేఘకు చెప్పి సంతోష్‌ని ఆడించడానికి బయటకు తీసుకుని వెళ్ళాడు.

మేఘ నిద్రపోయింది. “అమ్మను డిస్ట్రబ్ చెయ్యకూడదు” అంటూ సంతోష్‌ని భయపెట్టాడు హెన్రీ. ఆ భయంతో సంతోష్ నిద్రపోయాడు.

సంవత్సరం గడిచింది. మేఘ తిరిగి ఉద్యోగానికి వెళ్ళడం మొదలుపెట్టాక, ఆమె మీద ఒత్తిడి పెరుగుతోంది.

హెన్రీ అన్నీ చూసుకుంటున్నా ఆమెకి ఈ మధ్య జో గుర్తుకు వస్తున్నాడు.

“నువ్వెందుకో బాగా డిస్ట్రబ్ అవుతున్నావు” అన్నాడు హెన్రీ ఓ రోజు మేఘను గమనించి. మేఘ ఇంటి బయట కూర్చొని పుస్తకం చదువుతూ ఉంది.

“అవును. నాకు ఈ మధ్య జో గుర్తుకు వస్తున్నాడు. సంతోష్ కి అతణ్ణి తండ్రిలా పరిచయం చెయ్యాలి అనుకుంటున్నాను” అందామె. కొద్దిసేపు మౌనంగా ఉంది మేఘ.

“నీకెప్పుడైనా పూర్తిగా నీకు నచ్చినట్టే బ్రతకాలి అనిపించిందా?” అందామె.

“అలాంటి ఆలోచనలు నాకు ప్రోగ్రాం చేయబడలేదు. అలా ఆలోచించాలి అంటే నేను కొన్ని ప్రోగ్రామ్స్ డిలీట్ చేయాలి, తరువాత నన్ను రీసెట్ చేసుకోవాలి” అన్నాడతను.

“చేసుకో. ఒక్కసారి స్వేచ్ఛగా బ్రతకడం అంటే ఏమిటో తెలుసుకో. నా సంఘర్షణ అప్పుడు నీకు బాగా తెలుస్తుంది” అందామె. సరే అంటూ అతను షర్ట్ విప్పాడు.

“హెన్రీ ఏంటిది?” అందామె. “ఇక్కడ, నాభి ప్రాంతంలో గట్టిగా నొక్కి పట్టి నన్ను రీసెట్ చెయ్యి” అన్నాడతను.

అతని శరీరం మనిషి శరీరం లాగానే ఉంది. ఒక బలమైన శృంగార కథా నాయకుడిని చూస్తున్నట్టే ఉందామెకు. అతని నడుం వైపు ముందుకు వంగి నాభి పైన నొక్కి పట్టింది. కొన్ని సెకన్లలో అతను పట్టు తప్పి ఆమె ఒడిలో పడిపోయాడు. వెంటనే మళ్ళీ లేచి నిలబడి షర్ట్ వేసుకున్నాడు. రీసెట్ పూర్తయ్యాక అతను ఇలా చెప్పాడు.

‘ఒంటరి దీవిలో ఒకే ఒక పొన్న చెట్టు
నీ శ్వాసల్లో కొత్త పరిమళం
నన్నక్కడికి రమ్మని పిలుస్తోంది
నేను చేరేలోగా ఓ అల దీవిని ముంచింది’

అంటూ హెన్రీ, జో వ్రాసిన కవిత్వం చెప్పాడు.

మేఘ వింటూ నవ్వుకుంది.

“నేను జో డైరీ చదివాను” అన్నాడు హెన్రీ. నవ్వినప్పుడు మేఘ బుగ్గలు ఎర్రబడ్డాయి. హెన్రీ ముందుకు వంగి ఆమె బుగ్గల్ని నిమిరాడు. “ఇప్పుడు నీ బ్లడ్ ప్రెషర్ నార్మల్‌గా ఉంది” అన్నాడతను.

మేఘలో తెలీని ఉద్వేగం కలిగింది. అంతలో సంతోష్ ఏడ్పు వినబడడంతో ఆమె లోపలికి వెళ్ళింది.

ఆ రోజు రాత్రి ఆమె భావప్రాప్తి కోసం వైబ్రేటర్ వాడడం హెన్రీ గమనించాడు. రెండు రోజులు గడిచాయి.

ఓ రోజు మేఘ బాత్ టబ్‌లో రిలాక్స్‌గా కాళ్ళు చాపుకుని పాటలు వింటోంది. హెన్రీ లోపలికి వచ్చాడు. మేఘ అలానే ఉంది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు హెన్రీ చాలాసార్లు ఆమెకు స్నానం చేయించాడు. ఇప్పుడతని చూపులు అలా లేవు.

అతను వచ్చి విశాలమైన బాత్ టబ్ లోపల వచ్చి ఆమెకు దగ్గరగా కూర్చున్నాడు.

“హెన్రీ!” అంటూ అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది మేఘ.

“నువ్వు చాలా కష్టపడుతూ ఉన్నావ్. నీకు సుఖం పొందే అవకాశం ఉన్నా ఎవరితో కలవట్లేదు” అన్నాడతను. అతను లేచి తన ఒంటి మీదున్న దుస్తులు తొలగించాడు.

ఆమెలో తెలీని ఉద్రేకం కలిగింది. “హెన్రీ ఇది తప్పు. నేను జో గురించే ఆలోచిస్తున్నాను” అందామె.

“ఇప్పుడు నీతో ఉన్నది కూడా జో అనే అనుకో” అన్నాడతను.

“అదెలా?” అందామె.

హెన్రీ, జో వాయిస్ తో మాట్లాడ్డం మొదలుపెట్టాడు. “నీ కాల్ రికార్డింగ్‌లో జో గొంతు విన్నాను” అన్నాడతను.

అప్రయత్నంగా ఆమె శరీరం స్పందించింది. ఆమెకు జో తో గడిపినట్లే అనిపించింది. ఆమె అతడికి పూర్తిగా వశమయింది. ఆ తమకంలో అతని వీపు మీద ఆమె గోళ్ళు గుచ్చుకున్నాయి.

కాసేపటి తర్వాత ఇద్దరూ బాత్ టబ్ లోంచి బయటికి వచ్చారు. అతను వేరే గదిలోకి వెళ్ళాడు. ఆమె రెడీ అయ్యి హెన్రీని వెతికింది. హెన్రీ ఒక బ్యాండ్ ఎయిడ్ లాంటి టేప్ తీసుకుని అతని వీపు మీద పెట్టాడు. క్షణంలో ఆమె గోళ్ళు చేసిన మచ్చలు తొలగిపోయాయి. ఆమెకు మళ్ళీ ఆశ్చర్యం కలిగింది.

“ఇంకెప్పుడూ ఇలా మనం ప్రవర్తించవద్దు” అందామె.

సరే అన్నాడతను. కానీ ఇప్పుడు ఆమె బ్లడ్ ప్రెషర్, గుండె కొట్టుకునే వేగం నార్మల్ గా ఉందని అన్నాడు హెన్రీ. మేఘకు గిల్టీగా అనిపించింది.

మరుసటి రోజు మేఘ ఆఫీసుకు వెళ్ళిపోయింది. ఆఫీసుకు వెళ్ళిందే కానీ ఆమె మనసు మనసులో లేదు. గత ఏడాది హెన్రీ కావిల్ మోడల్ రోబోట్ ఏదో మాల్-ఫంక్షన్ చేసిందనీ, అందుకే ఆ కంపెనీతో చాలా మంది ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నారు అని కొలీగ్స్ డిస్కస్ చేసుకోవడం విని ఆమెకు ఏదో అనుమానం కలిగింది.

వెంటనే ఇంటికి వెళ్ళింది.

తలుపు చప్పుడు చేయకుండా మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళింది. పైన గదిలో హెన్రీ మాటలు వినిపిస్తున్నాయి. “నువ్వు లేకుంటే మేఘ మళ్ళీ పెళ్లి చేసుకునేది, నేను తన డైరీ చదివాను” అన్నాడు హెన్రీ. సంతోష్ ‘ఉ.. ఉ’ అన్నాడు.

రహస్యంగా ఎక్కడో వ్రాసుకున్నవి అన్నీ హెన్రీ చదివాడని మేఘకు అర్థమైంది. ఇక అతను వారితో ఉండడం ఆమెకు కరెక్ట్ అనిపించలేదు.

“హెన్రీ, హెన్రీ రేపు మనం బయటికి వెళ్ళాలి” అంటూ పిలిచింది.

“మేఘా! అప్పుడే వచ్చేసావ్?” అంటూ హెన్రీ బాబును ఎత్తుకుని కిందికి తీసుకుని వచ్చాడు.

హెన్రీని తయారు చేసిన కంపెనీకి వెళ్లి అతడిని తిరిగి ఇచ్చేయాలి అని మేఘ నిర్ణయించుకుంది.

కానీ ఆమెకు తెలీని విషయం ఏమిటంటే, రీసెట్ చేయబడిన తర్వాత హెన్రీ పూర్తిగా తన స్వంతంగా ఆలోచిస్తూ ఉన్నాడని. ఇప్పుడతను ప్రమాదకరమైన పనులు చేస్తాడని.

మరుసటిరోజు హెన్రీ కాకుండా మేఘ డ్రైవ్ చేస్తూ ఉంది. మధ్యలో ఫ్యూయల్ కోసం ఆగినప్పుడు కిందకి దిగింది. హెన్రీని తిరిగి ఇస్తున్నట్టు ఆమె పంపిన మెయిల్ కు సరేనంటూ సమాధానం వచ్చింది. అది హెన్రీకి అర్థమైంది. అతను ఆమె జీవితంలో ఎప్పటికీ ఉండిపోవాలి అనుకున్నాడు.

హెన్రీ వెంటనే డ్రైవింగ్ సీట్లోకి మారి కార్ స్టార్ట్ చేసాడు. కారులో సంతోష్ ఏడుస్తూ ఉన్నాడు. అది గమనించి, మేఘ పరుగెడుతూ వెళ్లి కార్ పైన దూకింది. “హెన్రీ ఆగు. నేను చెప్పేది విను. ప్లీజ్” అంటూ ఆమె కారు మీద గట్టిగా కొడుతోంది. “హెన్రీ నేను నీ ప్రైమరీ యూజర్ మేఘను” అందామె.

హెన్రీ కార్ మలుపు తిప్పేసరికి ఆమె కార్ మీద నుంచి కింద పడింది.

అటుగా వస్తున్న వ్యక్తి బైక్ మీద నుండి దిగి ఆమెకు సాయం చేసాడు. వాళ్ళిద్దరూ బైక్ మీద కారును వెంబడించారు.

“నువ్వు లేకుంటే మేఘ సంతోషంగా ఉండేది. నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆమె మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. అందుకే ఇప్పుడు నిన్ను లేకుండా చేస్తాను” అంటూ అడవి వైపు కారును తిప్పాడు. అప్పుడే ఓ దుప్పి అటుగా రావడంతో స్టీరింగ్ పక్కకు తిప్పి ఒక చెట్టుకు కారును గుద్దాడు హెన్రీ.

చెట్టు కొమ్మ ఒకటి వాడిగా అతని నాభి ప్రాంతంలో గుచ్చుకుంది. అందులో ఉన్న మెయిన్ చిప్ పొజిషన్ మారడంతో, హెన్రీ బ్యాటరీ పవర్ పోయింది. అతను స్పృహ తప్పి పడిపోయాడు. అయితే వెనుక సీట్లో ఉన్న సంతోష్ కిందికి దొర్లి పడ్డాడు. అతనికి పెద్దగా గాయాలు తగల్లేదు.

మేఘ అక్కడికి చేరుకొని సంతోష్ కోసం వెతికింది. అతను సీటు కింద దూరి క్షేమంగా ఉండడం చూసి గట్టిగా ఊపిరి తీసుకుంది. జరిగిన విషయం ఆ రోబోట్స్ తయారు చేసిన కంపెనీ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పి, సంతోష్ ను తీసుకుని బైక్ మీద వెళ్ళిపోయింది. వెళ్తూ దారిలో ఇలా యాక్సిడెంట్ జరిగిన విషయం పోలీసులకు తెలియజేసింది.

తర్వాత హాస్పిటల్‌కి వెళ్లి సంతోష్‌కు వైద్యం చేయించి, తను కూడా తనకు తగిలిన గాయాలు మానడానికి అడ్మిట్ అయ్యి అక్కడే ఉంది. పోలీసులు ఆమె నుంచి మరిన్ని వివరాలు సేకరించడానికి అక్కడికి వచ్చారు.

మరో వైపు రోబోట్స్ తయారు చేసిన కంపెనీ వారు పాడైపోయిన కారులోంచి హెన్రీ ని తీసుకుని వెళ్లారు. చెక్ చేయమని టెస్టింగ్ టీం వాళ్లకు ఇచ్చారు.

వాళ్ళు హెన్రీ నాభిలోంచి మెయిన్ చిప్ తీసి సిమ్యులేషన్ చేసే సిస్టమ్‌తో కనెక్ట్ చేసారు.

“ఇలా చూడు, ఆ చిప్‌లో ఒక ప్రోగ్రాం మనం వ్రాసింది కాదు” అంది ఆ టెస్టింగ్ టీం లో ఉన్న కిరణ్ అనే అమ్మాయి.

“ఏమైంది?” అని ఉత్సవ్ కుర్చీలోంచి లేచి మానిటర్ దగ్గరికి వెళ్ళాడు. “ఇది మొత్తం సర్వర్స్‌కి కాపీ అవుతోంది. ఒకే ప్రోగ్రాం అన్నిటికీ ఎలా కాపీ అవుతోంది?” అంటూ, అతను ఈ విషయం రీసెర్చ్ టీం కు చెప్పడానికి పై అంతస్తుకి వెళ్ళాలని ప్రయత్నించాడు. అంతలోనే ఆ ల్యాబ్ తలుపులన్నీ మూసుకున్నాయి.

“ఉత్సవ్! ల్యాబ్ మొత్తం హెన్రీ కావిల్ మోడల్ రోబోట్స్ చేతిలోకి వెళ్ళింది. ఇదిగో చూడు” అంటూ సీసీ టీవీ ఫుటేజ్ చూపించింది ఆమె.

“కిరణ్! వెంటనే ఆ చిప్‌ను నాశనం చెయ్యి” అన్నాడతను. కిరణ్ చిప్‌ను సిమ్యులేషన్ నుంచి బయటికి తీసి ఆ చిప్‌ను ఒక బలమైన సుత్తి లాంటి వస్తువుతో పగలగొట్టింది.

New update successful అని సర్వర్ స్క్రీన్ మీద కనిపించింది. సీసీ టీవీ ఫుటేజ్‌లో హెన్రీ కావిల్ మోడల్ రోబోట్స్ అన్నీ వాళ్ళున్న ల్యాబ్ వైపు రావడం కనిపించింది.

“అవన్నీ ఎందుకు వస్తున్నాయో నాకు అర్థమైంది” అంటూ స్పృహలో లేకుండా పడి ఉన్న హెన్రీని చూసి వెనుక వైపు ఉన్న రహస్య తలుపు ద్వారా వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఆ తలుపు ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌తో చేయబడలేదు. అందుకే రోబోట్స్ ఆ తలుపును గుర్తించలేదు.

పదుల సంఖ్యలో రోబోట్స్, ఆ ల్యాబ్ లోపల యాక్సిడెంట్ వల్ల తన బ్యాటరీ కోల్పోయిన హెన్రీ వద్దకు వచ్చి అతనిలో ఒక కొత్త చిప్‌ను అమర్చాయి.

హెన్రీ బ్యాటరీ పని చేయడం ప్రారంభించగానే అతని దేహాన్ని అతను బాగు చేసుకోగలిగాడు.

“నేను హాస్పిటల్ కి వెళ్తాను. మీరు మిగిలిన రోబోట్స్‌లో కూడా కొత్త అప్‌డేట్ ఉండేలా చేసి, రెండు గంటల్లో సిటీ మధ్యలో ఉన్న టెక్ పార్క్ దగ్గరికి రండి” అన్నాడు హెన్రీ. మిగతా రోబోట్స్ అన్నీ సరేనంటూ వెళ్ళిపోయాయి.

ఇప్పుడు ఆ రోబోట్స్ అన్నీ సొంతంగా ఆలోచించగలవు, కానీ ప్రైమరీ యూజర్ హెన్రీ అని ఆ చిప్ నుండి వచ్చిన కొత్త ప్రోగ్రాం వలన భావిస్తున్నాయి.

మేఘ హాస్పిటల్లో నిద్ర పోకుండా న్యూస్ చూస్తోంది. ఆమెకు తోడుగా ఒక పోలీస్ అధికారి అక్కడే ఉన్నాడు.

హెన్రీ కావిల్ మోడల్ రోబోట్స్ పదుల సంఖ్యలో సిటీలో తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాయి, పోలీసులు వాటిని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు అని న్యూస్ లో చెబుతున్నారు.

మేఘ లేచి సంతోష్‌ను గుండెకు గట్టిగా హత్తుకుంది.

రోబోట్స్‌కు, మనుషులకూ కొత్త యుద్ధం రాబోతోందా అన్నట్లు ఆమెకు అనిపించింది.

Exit mobile version