[డా. చెంగల్వ రామలక్ష్మి గారు రచించిన ‘లోపల గదిలో..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఏలూరులో ఒక సాహితీ సంస్థ వారు తిలక్ కవిత్వం మీద ప్రసంగం చేయటానికి నన్ను ఆహ్వానించారు. వెంటనే ఒప్పుకున్నాను. ఏలూరు అనగానే రాధక్క గుర్తుకు వచ్చింది. రెండేళ్ల నుంచి బావగారు పూర్తిగా మంచం లోనే ఉన్నారు. ఆయన సేవలతో అక్క బైట ప్రపంచం లోకి రావటమే మానేసింది. ఎప్పటినుంచో ‘ఒక్కసారి రావే, ఎవరూ రావట్లేదు. జీవితం విసుగ్గా ఉంది’ అంటోంది. ఉపన్యాసం అయ్యాక రాధక్క ఇంటికి వెళ్లి, మర్నాడు సాయంత్రం వద్దామని అనుకున్నాను. సభ వర్కింగ్ డే రోజునే ఉంది.
నాకు ఇద్దరు ఆడపిల్లలు. పెళ్లిళ్లయి కాపురాలు చేసుకుంటున్నారు. మావారు ఆరునెలల్లో రిటైర్ అవబోతున్న ప్రభుత్వ ఉద్యోగి. ఆఫీసులో స్నేహితుల మీద విరహంతో సెలవలు చాలా మిగిలిపోయినా ఒక్కరోజు కూడా మానకుండా వెళుతున్నారు. ఏలూరు వస్తారా అని అడిగితే రానని ఖచ్చితంగా చెప్పేసారు. నేనూ కాలేజీలో చేస్తున్నాను. ఎప్పుడూ సెలవలు పెట్టను. అందుకే రెండు రోజులు సెలవు చెప్పేసాను.
నాకంటే ముందు నా మనసు ఏలూరు వైపు పరుగులు తీస్తోంది. రాధక్క భర్తతో పడుతున్న ఇబ్బందులు చెపుతూనే ‘ఏం చేస్తాం’ అంటూ నవ్వుతూ తేల్చేస్తుంది. ఎప్పుడూ తన పరిస్థితిని తిట్టుకోవటం, కళ్ల నీళ్లు పెట్టుకోవటం నేను చూళ్ళేదు. ఈ సారి నా దృష్టి అంతా సాహిత్య సభ మీద కంటే రాధక్క ఇంటికి వెళ్ళటం మీదే ఉంది.
రేపే ప్రయాణం! రాత్రే అన్నీ సర్దేసుకున్నాను. ఇక్కడ నుంచి ఏలూరుకు మూడు గంటలు ప్రయాణం. నేరుగా సభ జరిగే చోటుకు వచ్చేస్తానని నిర్వాహకులకు చెప్పాను. అక్కకి కూడా సభ అయ్యాక ఇంటికి వస్తానని, వాళ్ళు భోజనం ఏర్పాటు చేస్తున్నారని, తినేసి వస్తానని చెప్పాను.
సభ బాగా జరిగింది. ఇలా అప్పుడప్పుడు సభలలో కలిసే పాత పరిచయస్థులు, రచయిత మిత్రులు కొందరు కలిసారు. సాహిత్య చర్చలు బాగా జరిగాయి. ఒకరిద్దరు తమ ఇంటికి రమ్మన్నారు. మా అక్క దగ్గరకు వెళ్లాలని సున్నితంగా తోసి పుచ్చాను.
నాకు తోబుట్టువులు ఎవరూ లేరు. రాధక్క మా పెద్దనాన్న కూతురు. చిన్నప్పటి నుంచి సొంత అక్క చెల్లెళ్ళ లాగానే ఉంటున్నాం.
అక్క వాళ్లిల్లు సభ జరిగిన చోటుకు దూరమే! నేనీ మధ్య వెళ్లి కూడా చాలా కాలమైంది. అక్క పెట్టిన గూగుల్ మ్యాప్ సాయంతో వెళ్ళాను. అక్క తలుపు తీసి నవ్వుతూ ఆహ్వానించింది. కాని, ఆ నవ్వు వెనక ముఖంలో అలసట, నిస్పృహ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
“బావగారు ఎలా ఉన్నారు అక్కా?” అన్నాను లోపలికి వచ్చి కూర్చుంటూ.
“ఎలా ఉన్నారని చెప్పను రాజీ! అన్నీ మంచం లోనే! చేయలేక చచ్చిపోతున్నాననుకో! ఆ రోగం బాధతో ఏమీ చేయలేక కోపంతో నా మీద అరుస్తారు. ఎంతకని భరించగలను! సహనం చచ్చిపోతోందనుకో!” కళ్ళు తుడుచుకుంది.
నాకు టీ పెట్టేలోపల బావగారు రెండుసార్లు పిలిచారు. “నేను పెట్టుకుని తాగుతాలే. నువ్వు వెళ్ళు”, అన్నాను.
“నేనిక్కడ ఎవరితోనో మాట్లాడేస్తున్నానని అనుమానం ఆయనకి! ఎవరొస్తారు రోజూ! కూరగాయలు తెచ్చే అబ్బాయి, పాల పాకెట్లు వేసే కుర్రాడు తప్ప! పిల్లలు అప్పుడప్పుడు వచ్చి చూసి పోతుంటారు. అప్పుడు కొంచెం సందడి. రోజంతా ఆ ఏ.సి. గదిలో లైటు వెలుతురులో కూర్చుంటే నాకు చిరాగ్గా ఉంటుంది. పనవదు. ఇంతేలే. ఇంక ఎంత చెప్పుకున్నా”, అంది నవ్వేస్తూ.
“అక్కా! ఎవరినైనా కేర్‌టేకర్‌ని పెట్టకపోయావా? డైపర్లు మార్చటం, ఒళ్ళు తుడవటం ఇలాంటివన్నీ అసలు నువ్వు ఎలా చెయ్యగలుగుతున్నావు?”, అన్నాను.
“అదీ అయింది. ఇద్దరు ముగ్గురు వచ్చారు. వాళ్ళు బాగానే చేసారు. వాళ్ళ తప్పేం లేదు. ఈయనే వాళ్ళని నిలవనివ్వలేదు. వాళ్ళని ఇష్టమొచ్చినట్లు అరిచి, తిట్టి పంపించేశారు. ‘నాకు చేయటం నీకంత కష్టంగా ఉందా? మంచం మీద నుంచి లేవలేనని అంత చులకనా? నేను చస్తే సుఖంగా ఉందువుగానిలే. నీ ఇష్టం వచ్చినట్లు తిరుగుదువు గానిలే’, అంటూ ఏమేమో అంటారు. ఏం చేయను?” అంది అక్క.
నాలుగింటికి అక్క ఆయన గదిలోకి తీసుకువెళ్ళింది. బాగానే పలకరించారు. నా ఉపన్యాసం గురించి మాట్లాడారు. మా పిల్లలని, మా వారిని అడిగారు. రెండేళ్ల క్రితం పక్షవాతం వచ్చి బావగారు మంచానికే పరిమితం అయ్యారు. హాస్పిటల్ లో ఉండే లాంటి మంచంలో పడుకున్నారు. ఆయన రోజంతా ట్యూబ్ లైట్ వెలుగులోనే ఉండాలి. ఆ గదిలో వెలుతురు లేదు. పగలు, రాత్రి తేడా తెలియట్లేదు. ఆయన పడుకున్న మంచం పక్కనే అక్క పడుకునే దివాన్ కాట్ ఉంది. దాని మీద కూర్చునే ఆయనతో కాసేపు మాట్లాడి వచ్చేసాను.
వంటిల్లు ఎదురుగానే ఆయన గది. మధ్యలో డైనింగ్ టేబుల్. ఆ గది పక్కన ఇంకో గది. దాని ఎదురుగా చిన్న హాలు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. ఐదు నిముషాలకోసారి పిలుస్తూనే ఉన్నారు. ఆ పిలుపు అక్కకే వినిపిస్తుంది. వెంటనే వెళ్ళిపోతుంది. వెళ్లకపోతే అరుపులు, కేకలు. ఆయన బాగుండి, లేచి తిరుగుతున్నప్పుడు కూడా అధికారం బాగా చలాయించేవారు అక్క మీద.
ఒక్కోసారి అక్క విసుక్కుంటోంది. “ఏంటయ్యా చంపుకు తింటున్నావు. ఏ.సి. తగ్గిస్తే పెంచమంటావు! పెంచితే చలి అంటావు! దుప్పటి కప్పితే తీసేయమంటావు! తీస్తే కప్పమంటావు! పిలుస్తూనే ఉన్నావు. పనేం చేసుకోవక్కర్లేదా నేను!” అక్క అరుస్తోంది.
పక్కన బెడ్ రూంలో వాడని సామాన్లు, మంచాలు గందరగోళంగా ఉంది. నేను హాల్లోనే పడుకుంటానన్నాను. అక్కతో రాత్రయినా మాట్లాడాలి కాసేపు అనుకున్నాను. కాని, తను ఆ గదిలోనే ఉండాలి. ఆయనకు నిద్ర పట్టదుట. పిలుస్తూనే వుంటారు. ఒక్కరినీ వదిలి రాలేదు.
ఆ అర్ధరాత్రి అక్క తలుపు తీసేసి గట్టిగా అరుస్తుంటే మెలకువ వచ్చింది నాకు.
“ఛీ, ఛీ, వదులు. 80ఏళ్ళు వస్తున్నా, మంచం మీద నుంచి లేవలేక పోతున్నా కోరికలు చావటం లేదు. నువ్విలాగే హింసిస్తే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, పిల్లలే చూసుకుంటారు నీ సంగతి. నా కర్మ!” అంటూ బైటకి వచ్చేసింది. నేను కూర్చునే వున్నాను. నన్ను అభావంగా చూసి, నా ఎదురుగా తల పట్టుకు కూర్చుంది.
“ఇంకా ఈ స్థితిలో, ఈ వయసులో ఇది కూడానా అక్కా!” అన్నాను ఒకింత ఆశ్చర్యం, ఒకింత బాధతో.
“కాళ్ళ దగ్గర దుప్పటి సర్దమనో, కాళ్ళ కింద దిండు జరిగిపోయింది సరిగా పెట్టమనో పిలవటం, తీరా మంచం దగ్గరకు వెళితే ఇదే గొడవ! పైకి అందరూ నేను ఆయనకు సేవలు చేయలేక అలిసిపోతున్నాననే అనుకుంటారు. ఈ నరకం గురించి ఎవరికి తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? నువ్వు నా తోబుట్టువుల కంటే ఎక్కువ కాబట్టి ఇవాళ తలుపు తీసుకు వచ్చేసాను. ఇక్కడెవరైనా ఉంటే లోపల ఆ బలవంతపు హింస భరించక తప్పదు”, అంది.
అక్క సమస్యకు పరిష్కారం ఏముంది? పిల్లలు వచ్చినా ఏం చేయగలరు?
స్త్రీల జీవితాలలోని ఈ రహస్య కోణాన్ని గురించి ఎవరూ మాట్లాడుకోలేరు. తోటి ఉద్యోగినులు కూడా తమ మగవారి పెత్తనాన్ని, అధికారాన్ని చెప్పుకుంటారు; లోపల గదిలో బలవంతపు సంసారాన్ని గురించి చెప్పుకోరు కదా!
మర్నాడు మధ్యాహ్నం భోజనం చేసి బరువెక్కిన హృదయంతో ఇంటికి బయలుదేరాను. అక్క కళ్ళనీళ్లు పెట్టుకుంది నేను వచ్చేస్తోంటే. ఆ ఇంట్లో వాళ్లిద్దరే! మానసికంగా అక్క ఒంటరే!
