
నిర్ణయించిన తేదీకన్నా చాలా ఆలస్యంగా ‘లవ్ జిహాద్’ పోటీ ఫలితాలను ప్రకటిస్తున్నాము. ఇందుకు క్షంతవ్యులము. పెద్ద సంఖ్యలో ‘లవ్ జిహాద్’ కవితల పోటీలో పాల్గొని, ఈ పోటీని విజయవంతం చేసిన జాతీయ భావజాల ప్రేరేపిత కవులందరికీ వందనాలు.
‘లవ్ జిహాద్’ అని కవితకు రచనాంశాన్ని ప్రకటించినప్పుడు, కొందరు, పేరు మాత్రమే చూసి, నియమ నిబంధనలను పరిశీలించకుండానే, దుష్ప్రచారం ప్రారంభించారు. వారికి ‘జిహాద్’ అన్న పదం వినగానే పూనకాలు వచ్చేస్తాయి. వారి దృష్టిలో వారి మాటలకు వంతపాడేవారు తప్ప మిగతా అంతా మత చాందసవాదులు. వారే లౌకికవాదలౌక్యాతిలౌక్య రారాజులు. అలాంటి వారికి నమస్కారం పెట్టి, ముద్రలు వేసి పక్కన పెట్టే ప్రమాదం ఉన్నా, పెద్ద సంఖ్యలో కవితలు పంపిన కవులందరికీ బహుకృతజ్ఞతలు, ధన్యవాదాలు!
కవితల పోటీకి వందపైగా కవితలు అందాయి. సగంపైగా కవితలు ఒకే రకమైన భావాలతో ఉన్నాయి. ప్రకటించిన విధంగా దూషణలు, తర్కరహిత హితవులు, శాపనార్ధాలు ఉన్న కవితలను పక్కన పెట్టేశాము. అలాంటి కవితలను సాధారణ ప్రచురణకు కూడా స్వీకరించటం లేదు.
అందిన కవితలలో చక్కని భావ వ్యక్తీకరణ, మంచి ఆలోచనలతో సంయమనం ప్రదర్శిస్తూ, సమస్యను పలు కోణాలలో విశ్లేషిస్తూ, ద్వేష భావనలు దరిదాపులకు కూడా రానీయకుండా, పరిష్కారం సూచించిన పది కవితలను ఎంచుకుని న్యాయనిర్ణేతలు సంచికకు అందించారు. ప్రకటించిన విధంగా, ఈ పదిమంది కవులకు, చెరో రూ. 3000/-, మీరు ఇది చదివేసరికి అంది ఉంటాయి. వచ్చేవారం వెలువడే సంచికలో కవుల పరిచయాలు, సాధారణ ప్రచురణకు స్వీకరించిన కవితల వివరాలు ఉంటాయి.
సంచిక నిర్వహించిన బాలల కథారచన పోటీ ఫలితాలు కూడా వచ్చే ఆదివారం సంచికలో ప్రకటిస్తాము.
త్వరలో సంచిక నిర్వహిస్తున్న మరో కథల పోటీ వివరాలు ప్రచురిస్తాము.
~
లవ్ జిహాద్ కవితల పోటీలో బహుమతి పొందిన కథకుల వివరాలు ఈ క్రింద ఉన్నాయి. విజేతలకు అభినందనలు.
- పవిత్రత లేని ప్రేమ యుద్ధం – డా. మునగా రామ మోహన రావు
- లవ్ జీహద్ – వంశీకృష్ణ పరిమళ
- లవ్ జిహాద్ – డి.వినాయకరావు
- పాడె కట్టాలి – జి.ఎల్.ఎన్.శాస్త్రి.
- ప్రేమ యుద్ధమా ఓడిపో – పెద్ది భరత్
- అక్షర శంఖారావం – వాడపల్లి పూర్ణ కామేశ్వరి
- మానవత్వమే మిన్న – దొంతాభక్తుని రామ నాగేశ్వర రావు
- వల’పుల వలయం – పెండ్యాల గాయత్రి
- కళ్ళు తెరవాల్సిన వేళ – ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి
- కనబడని చెయ్యేదో.. – సంఘమిత్ర (ఎ. సింహగిరి)
~
పోటీలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు. సంచికకు మీ ప్రోత్సాహం సదా ఇలాగే లభించాలని అభ్యర్థిస్తున్నది సంచిక.
