లవ్ జిహాద్ కవితల పోటీలో బహుమతి పొందిన కవుల వివరాలు, కవిత పేరుని బట్టి అకారాది క్రమంలో అందిస్తున్నాము. విజేతలకు అభినందనలు. కవితలు కూడా ఇదే క్రమంలో ప్రచురితమవుతాయి.
| అక్షర శంఖారావం | వాడపల్లి పూర్ణ కామేశ్వరి |
| కనబడని చెయ్యేదో.. | సంఘమిత్ర (ఎ. సింహగిరి) |
| కళ్ళు తెరవాల్సిన వేళ | ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి |
| పవిత్రత లేని ప్రేమ యుద్ధం | డా. మునగా రామ మోహన రావు |
| పాడె కట్టాలి | జి.ఎల్.ఎన్. శాస్త్రి |
| ప్రేమ యుద్ధమా ఓడిపో | పెద్ది భరత్ |
| మానవత్వమే మిన్న | దొంతాభక్తుని రామ నాగేశ్వర రావు |
| లవ్ జిహాద్ | డి.వినాయకరావు |
| లవ్ జీహద్ | వంశీకృష్ణ పరిమళ |
| ‘వల’పుల వలయం | పెండ్యాల గాయత్రి |
~
వాడపల్లి పూర్ణ కామేశ్వరి:
2003 నుండి దక్షిణ రైల్వే కార్యాలయం చెన్నైలో నిర్వహించే హిందీ భాషా వ్యాస రచనల పోటీలు, పుస్తక సమీక్ష పోటీలలో పాల్గొని అనేక పురస్కారాలు పొందడం జరిగింది. ఆంగ్లంలో కూడా చిన్నా పెద్దా వ్యాసాలు, కథలు వ్రాయడం ప్రవృత్తైంది. మాతృభాషలో వ్రాయాలనే ఆసక్తితో, 2020 తరువాత తెలుగులో వ్రాయడం ప్రారంభించి స్వల్పకాలంలోనే వీరి కథలు ప్రచురణకు ఎంపికవ్వడం, బహుమతులు గెలవడంతో సాహితీ ప్రయాణం అలుపెరుగనిదిగా సాగింది.
2021 నుండి అనేక కథలకు బహుమతులు పొందడం, మరెన్నో కథలు ప్రచురణకు ఎంపికవ్వడం జరిగింది. ఇంత వరకూ నూరుకు పైగా కథలు ప్రచురితమైయ్యాయి. లేఖిని సరసిజ, తపస్వి, తెలుగు తల్లి-కెనెడా, కథా మంజరి, విశాలాక్షి, సహరి, కథా వేదిక, రవళి, సాహో, ఉషా, సుమతి, నెచ్చెలి, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, పాలపిట్ట, సంచిక, సాహితీ కిరణం, జాగృతి మొదలగు సంస్థలు నిర్వహించిన పోటీలలో అనేక బహుమతులు పొదడం జరిగింది.
ఐదు నవలలు, మూడు నవలికలు పోటీల్లో ఎంపికై ప్రచురితమైయ్యాయి. మన తెలుగు కథలు.కామ్ లో వెబ్ సీరీస్ గా ఒక నవల ప్రచురితమవ్వగా, తపస్వి మనోహరం నిర్వహించిన పోటీల్లో వీరి నవలకు ప్రథమ బహుమతి లభించింది.
అనేక కవితలు, వ్యాసాలు, గజళ్ళూ కూడా వీరి కలం నుండి జాలువారి పత్రికల్లో ప్రచురితమైయ్యాయి.
సామాజిక ధృక్పథం కలిగిన మరెన్నో రచనలు చేస్తూ, సాహితీ పయనాన్ని కొనసాగించాలన్నదే వీరి అభిలాష.
సింహగిరి పి.ఎ.:
నేటి సమాజాన్ని ప్రతిబింబిస్తూ, పాఠకులలో మంచి ఆలోచనలను రేకెత్తించేలా, స్ఫూర్తిదాయకంగా నిలిచేలా రచనలు చేయాలనేది వీరి ప్రధాన అభిలాష.
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కామర్స్‌లో డిగ్రీ, ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉత్పాదక మండలి నుండి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పిజి డిప్లొమా పట్టా పొందారు.
ప్రస్తుతం శ్రీ అడపా రామకృష్ణ గారి సారథ్యంలో ప్రతిష్ఠాత్మకమైన విశాఖ రచయితల సంఘం సంయుక్త కార్యదర్శిగా క్రియాశీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
‘సంఘమిత్ర’, ‘సింహగిరి’ అనే కలం పేర్లతో వివిధ ప్రముఖ దిన, వార, మాస పత్రికలలో మరియు సాహిత్య సంకలనాలలో వీరి కథలు, కవితలు, వ్యాసాలు విస్తృతంగా ప్రసారమయ్యాయి. వీరి ముద్రిత గ్రంథాలు: అంతర్దర్శనం (కథాసంపుటి), మునగపూల జల్లు (కథాసంపుటి), మజిలీ (నవల).
వీరు తెలుగు సాహిత్య దిగ్గజాల రచనల పట్ల అమితమైన ఆసక్తిని కలిగి ఉన్నారు. ముఖ్యంగా కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి భాషా శైలి, బుచ్చిబాబు గారి ఏకాంత సాహితీ సేవ, మరియు దేవులపల్లి కృష్ణశాస్త్రి, తిలక్ గార్ల భావుకత వీరిని ఎంతగానో ప్రభావితం చేశాయి.
ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి:
M.Com, PGD IRPM విద్యార్హతలు కలిగిన వీరు, సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే సొసైటీలో ఆఫీసు సూపరింటెండెంట్‌గా సుదీర్ఘ సేవలు అందించి, 2023లో విఆర్ఎస్ (VRS) తీసుకున్నారు.
కథలు, కవితలు, నాటకాలు, రేడియో-టీవీ ధారావాహికల రచన మరియు నటన రంగాలలో వీరు విశేష ముద్ర వేశారు.
ఈటీవీలో ప్రజాదరణ పొందిన ‘అలౌకిక’ (2003-2006) ధారావాహికకు మాటలు అందించారు. జెమిని టీవీలో పలు సింగిల్ ఎపిసోడ్లకు రచన చేశారు.
దూరదర్శన్ కోసం ‘మా ఊరు’, ‘ఒక్కక్షణం’ వంటి ధారావాహికలకు, పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాన రచన చేశారు. ఆకాశవాణి, యువవాణి, వివిధభారతి కేంద్రాల ద్వారా వీరి నాటికలు, గేయాలు, కవితలు విస్తృతంగా ప్రసారమయ్యాయి.
కార్మిక శాఖ కోసం బాలకార్మిక నిర్మూలనపై ‘చిన్ని చేతులు’ టెలిఫిల్మ్, స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి బాలల చిత్రం ‘ఉషోదయం’కు కథ, మాటలు అందించారు.
వీరు రచించి, వ్యాఖ్యానం చేసిన 8 భక్తి గీతాల ఆడియో సీడీలు విడుదలయ్యాయి.
2015లో రాజమండ్రి నంది అవార్డుల పోటీలలో వీరు రచించిన ‘పడగనీడ’ నాటకం ప్రదర్శితమైంది.
స్టేజ్, రేడియో, టీవీ మాధ్యమాల్లో పలు నాటకాలలో పాత్రలు పోషించడంతో పాటు సమర్థవంతమైన వ్యాఖ్యాతగా రాణించారు.
పత్రికలు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా వీరి రచనలు బాహుళ్యంలోకి వెళ్ళాయి. వివిధ పోటీలలో వీరు అందుకున్న ముఖ్య బహుమతులు:2023: కవితల పోటీలలో రెండు బహుమతులు సాధించారు.2024: ముల్కనూర్ సాహితీ పీఠం – నమస్తే తెలంగాణ జాతీయ పోటీలో ‘సహజం’ కథకు, బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్ – విశాఖ సంస్కృతి పోటీలో ‘ఛాయాచిత్రం’ కథకు బహుమతులు లభించాయి.
అమెరికా తెలుగు జ్యోతి అంతర్జాల పత్రిక పోటీలో ‘అక్షరాలని ప్రేమిస్తున్నాను’ కవితకు బహుమతి.
కథామంజరి జాతీయ పోటీలో ‘స్పర్శ’, ముల్కనూర్ సాహితీ పీఠం పోటీలో ‘వీసా’, వినాయక చవితి పోటీలో ‘హైటెక్ చవితి’ కథలకు బహుమతులు.విశ్వసాహితీ కళావేదిక పోటీలో ‘అక్షరార్చన’, సంచిక లవ్ జిహాద్ పోటీలో ‘కళ్ళు తెరవాల్సిన వేళ’ కవితలకు అవార్డులు దక్కాయి. సమాజంలో ఏ సంఘటన జరిగినా మనసు స్పందించి కథగానో, కవితగానో మలిచే ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి గారు, భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైన రచనలు చేయాలనే తపనతో తన సాహిత్య ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
డా. మునగా రామ మోహన రావు:
వృత్తిపరంగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన వీరు, సామాజిక శ్రేయస్సుకై మరియు సాహిత్య సంస్కృతుల వికాసానికై విశేష కృషి చేస్తున్నారు.
ఎం.ఎస్సి, ఎం.బి.ఏ, ఎం.కామ్, ఎం.ఏ పట్టాలతో పాటు కార్పొరేట్ ఫైనాన్స్‌లో పీహెచ్డీ, నాలెడ్జ్ మేనేజ్మెంట్లో డి.లిట్ సాధించారు. హార్వర్డ్, ఎం.ఐ.టి వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుండి సర్టిఫికేషన్లు పొందారు.
సి.ఎస్.ఐ.ఆర్ రీసెర్చ్ ఫెలోగా, ఐ.ఎఫ్.ఎమ్.ఆర్ మరియు లోయోలా విద్యా సంస్థలలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు.
మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో స్వదేశీ, విదేశీ బహుళజాతి సంస్థలలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అత్యున్నత బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు.
సికింద్రాబాద్‌లో సుమారు మూడు కోట్ల రూపాయల తన స్వార్జితంతో 2,000 మంది నిరుపేద బాలికల విద్యావకాశాల కోసం అధునాతన భవంతిని నిర్మించి దానం చేశారు.
వీరి నిరంతర సేవలను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆ కళాశాలకు “డా. మునగా రామ మోహన రావు ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల” గా నామకరణం చేసి గౌరవించింది. విద్యా, ఆధ్యాత్మిక రంగాలలో వీరు నిరంతరం సేవలందిస్తున్నారు.
సాహిత్యంతో పాటు సాంప్రదాయ తంజావూరు చిత్రకళలో వీరు సిద్ధహస్తులు. వీరి తాత్విక రచన ‘మర్మజ్ఞవిలాసం’ సాహిత్య అకాడమీ పరిశీలనలో ఉంది. ప్రకృతి, మానవ సంబంధాలు, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ‘అంతర్యానం’ వీరి తొలి తెలుగు వచన కవితా సంపుటి.
వీరి ఆంగ్ల కవితా ప్రతిభకు గాను పనోరమా ఇంటర్నేషనల్ లిటరరీ అవార్డు (2026,) ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఎథిక్స్ ఫెలోషిప్ లభించాయి.
గోవిందవర్జుల లక్ష్మీ నారాయణ శాస్త్రి (జి.ఎల్.ఎన్. శాస్త్రి):
M.Com, B.Ed విద్యార్హతలు కలిగిన వీరు గత 25 సంవత్సరాలుగా సాహిత్య రంగంలో కొనసాగుతూ, గత దశాబ్ద కాలంగా తన రచనలను పుస్తక రూపంలో అందిస్తున్నారు. వీరు సరేశ్వర శర్మ, పర్వతవర్ధని దంపతుల కుమారుడు; వీరి భార్య విజయ వాణి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.
తొలి రచన: మిసెస్ ఎ.వి.ఎన్. కళాశాల వార్షిక పత్రికలో ప్రచురితమైంది. వీరు రచించిన ‘సంపంగి పూలు’ ఇ-బుక్ కవితా సంపుటిని తెలుగు భాషాసంఘం అధ్యక్షులు శ్రీ పోట్లూరి హరికృష్ణ ఆవిష్కరించారు. 2024 ఉగాది సందర్భంగా ‘స్పర్శ’ కవితా సంకలనాన్ని విడుదల చేశారు. యాదాద్రి, రైతు ఘోష, నవ్యఆంధ్రా వంటి పలు సామూహిక సంకలనాలలో వీరి కవితలు ప్రచురితమయ్యాయి.
దాదాపు 1000 కవితలు, 100 నాటికలు అముద్రిత రూపంలో ఉన్నాయి.
వీరి సాహిత్య ప్రతిభకు గాను అనేక అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్ర స్థాయి పురస్కారాలు దక్కాయి. మల్లినాథ సూరి కళాపీఠం (ఏడుపాయలు) వారిచే ‘కవి సామ్రాట్’, ఉదయసాహితి (హుస్నాబాద్) వారిచే ‘కవితాభూషణ’ బిరుదులు పొందారు. 2024లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రత్యేక పురస్కారం (రూ. 5000 నగదు), పూర్వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా ‘గురజాడ పురస్కారం’ అందుకున్నారు. కెనడా డే ఉత్తమ కవితా పురస్కారాలను (2018, 2019, 2020, 2023, 2024, 2025) పలుమార్లు గెలుచుకున్నారు. తానా (TANA) కవితా పోటీల్లో కన్సోలేషన్ బహుమతి సాధించారు.
వరల్డ్ రైటర్స్ ఫోరం వారి ‘తెలుగు కీర్తి’ జాతీయ పురస్కారం (2025), పోతుకూచి సాంబశివరావు స్మారక పోటీ ప్రథమ బహుమతి (2016), సంచిక డాట్ కామ్ ఉత్తమ కవితా పురస్కారం (2026) సహా ఫేస్బుక్ కవితా సమూహాలలో (శ్రీశ్రీ, సాహితీ వనం) పలుమార్లు ఉత్తమ కవిగా నిలిచారు.
సాహిత్య, సామాజిక రంగాలలో వీరు క్రింది బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు: శ్రీశ్రీ కళావేదిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా మరియు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు .
అరసం (అభ్యుదయ రచయితల సంఘం) అనకాపల్లి జిల్లా అధ్యక్షులు, స్పందన ఈదా ఫౌండేషన్ ఇంటర్నేషనల్ జిల్లా అధ్యక్షులు, అనకాపల్లి ఫిల్మ్ సొసైటీ జాయింట్ సెక్రటరీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ట్రెజరర్.
దయానంద్ ఆంగ్ల వేదిక పాఠశాల స్కౌట్ ఇంచార్జిగా కరోనా సమయంలో ఆసుపత్రులలో సేవలందించారు మరియు అవగాహన ర్యాలీలు నిర్వహించారు.
పెద్ది భరత్
వీరు శ్రీశ్రీ కళావేదిక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ సాహిత్య పరిషత్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరియు సాహితీ సంరక్షణ సమితి ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
నేలతల్లి గొంతుక (2023): ముద్రితమై ఆవిష్కరించబడిన కవితా సంపుటి. తెలంగాణ సారస్వత పరిషత్తు ముద్రించిన ‘మంచిర్యాల జిల్లా సమగ్ర చరిత్ర’లో శతక సాహిత్య వికాసంపై పరిశోధనా వ్యాసం ప్రచురితం.
సంకలనాలు: వివిధ ప్రముఖ సాహిత్య సంస్థల పుస్తకాల్లో దాదాపు 20 వరకు పద్య, వచన కవితలు ముద్రితం.
విహారయాత్ర (స్వీయ అనుభవం), భారతీ సమార్చన (పద్య సంపుటి), 27 హాస్య సాంఘిక లఘునాటికలు, మట్టి మరిమళం (నానీలు), నాగలి గోస (దీర్ఘకవిత) వంటివి అముద్రిత రచనలు.
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పదుల సంఖ్యలో బహుమతులు అందుకున్న భరత్ గారి ప్రధాన బిరుదులు: కవివల్లభ జ్యోతి రత్న (2017), కళాత్మ బిరుదు (2020), తెలంగాణ గాన కోకిల (2025).
తానా (TANA) ప్రపంచ కవితా పోటీల ఉత్తమ కవితా పురస్కారం (2022), తెలుగు వెలుగు కరోనా పోటీల్లో ప్రథమ బహుమతి (2020), తెలుగు కీర్తి పురస్కారం (2025), అక్షర తేజం అవార్డు (2025) వంటివి ప్రముఖ అవార్డులు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నుండి భాషా సాంస్కృతిక శాఖ గుర్తింపు పొందిన కవి, వ్యాఖ్యాత.
డా. సి.నారాయణరెడ్డి (2011), కసిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్.శివారెడ్డి, అంపశయ్య నవీన్, శతావధాని శ్రీపట్వర్థన్ వంటి ప్రముఖుల చేతుల మీదుగా సన్మానాలు పొందారు.
వివిధ సందర్భాల్లో జిల్లా కలెక్టర్ల నుండి నగదు పురస్కారాలు, మంత్రులు కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ లచే ఉగాది పురస్కారాలు మరియు సత్కారాలు పొందారు.
శ్రీశ్రీ కళావేదిక 24 గంటల రికార్డు కార్యక్రమంలో 12 గంటల పాటు నిరంతర వ్యాఖ్యానం చేసి 3 రికార్డుల పురస్కారాలు సాధించారు. శతావధానంలో పృచ్ఛకుడిగా కూడా వ్యవహరించారు.
తెలుగు పద్య రక్షణకై ‘పద్యాల తోరణం’ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు శతక పద్యాలు నేర్పుతున్నారు. స్వంతంగా కాళోజీ జయంతి, తెలుగు భాషా దినోత్సవాలు, బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తూ, విద్యార్థుల చేత కథలు, కవితలు రాయించి సంకలనాలు ముద్రిస్తున్నారు. పుస్తక పఠనం, అంతర్జాల రచనలు, సాహిత్య చర్చలు మరియు నాటక రచన వీరి ప్రధాన అభిరుచులు.
డి. రామ నాగేశ్వర రావు
విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు.
రచనలు:
ముద్రితములు:
- ఆదిలక్ష్మీ శతకము
- రామ నాగేశ్వర శతకము.
అముద్రితములు:
- అమ్మభాష (ఖండ కావ్యం)
- T. R శతకము.
హాబీలు:
పద్యాలు, రేడియో సమస్యా పూరణలు, వ్యాసాలు, కవితలు, పాటలు, పేరడీ పాటలు, ఉద్యోగ విరమణ సన్మాన పత్రాలు, నవ వధూవరులకు ఆశీర్వాదపూర్వక పద్యాలు వ్రాయుట, నాటికల్లో నటన, అష్టావధానాది సాహిత్య కార్యక్రమములలో పాల్గొనుట.
నివాసం: భీమవరం, ప. గో. జిల్లా. సెల్: 9949726904.
డి. వినాయక రావు:
1963 ఆగస్టు 4న లోకేశ్వరంలో జన్మించిన వీరు, ప్రస్తుతం భైంసా నివాసిగా ఉంటూ సాహిత్య మరియు విద్యా రంగాల్లో విశేష సేవలందిస్తున్నారు. వీరు కీ.శే. యశోదాబాయి, కీ.శే. శ్రీనివాసరావు దంపతుల కుమారుడు. వీరి భార్య శ్రీమతి వీణారాణి; ఈ దంపతులకు రాకేష్, రోహిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
వీరు ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ మరియు ఉపాధ్యాయ శిక్షణలో మాస్టర్స్ పూర్తి చేశారు.
భైంసాలోని వివిధ ప్రైవేట్ ఆంగ్ల పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడిగా 30 సంవత్సరాల పాటు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల (భైంసా)లో ఆంగ్లోపన్యాసకుడిగా 5 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించారు.
పుస్తక పఠనం, పద్య-గద్య కవితలు రాయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్న వీరు సాంప్రదాయ పద్య సాహిత్యంలో, ముఖ్యంగా శతక ప్రక్రియలో విశేషమైన కృషి చేశారు. వీరి కలం నుండి జాలువారిన ప్రముఖ ముద్రిత శతకాలు మరియు భక్తి రచనలు – పండరీశ శతకము, వినాయక శతకము, శ్రీ దుర్గ వైభవ శతకము, షిరిడి సాయిబాబా శతకము, కదిలి పాప హరేశ్వర శతకము, శ్రీరామ పద్యమంజరి.
పేరు: వంశీ కృష్ణ MG
కలం పేరు: వంశీ కృష్ణ పరిమళ
నివాసం: హైదరాబాద్
వృత్తి: సినిమా రచయితగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 2 ఫీచర్ ఫిల్మ్స్‌కి 3 పాటలు, యూట్యూబ్ ఛానల్స్‌కి 16 పాటలు రాసారు. 4 షార్ట్ ఫిల్మ్స్‌కి రచన, దర్శకత్వం చేసారు. ‘ఓ పిల్లగా లగ్గం కుదిరిందా’ అనే నవల కూడా రాసారు.
పెండ్యాల గాయత్రి:
సామాజిక శ్రేయస్సే లక్ష్యంగా కలం పట్టిన వీరిప్పటివరకు.. 100 కి పైగా కవితలు, 60 వరకు కథలు, 9 శ్రవ్య, దృశ్య నాటికలు, రెండు నవలలు, కొన్ని పాటలు, గజళ్ళు రచించారు. వీరి రచనలు వివిధ పత్రికలలో, ఆకాశవాణిలో వెలువడడమే కాకుండా అనేక పోటీలలో బహుమతులు పురస్కారాలు అందుకున్నాయి. గిడుగు రామ్మూర్తి పురస్కారం, జిల్లాస్థాయి ఉగాది పురస్కారము, వివిధ సాహితీ సంస్థలు అందించిన ప్రతిభా పురస్కారాలు వీరు అందుకోవడం జరిగింది.
వీరి మొదటి పుస్తకం ‘కథలు కనే కళ్ళు’ (కథల సంపుటి) సినారె ట్రస్ట్ వారు అచ్చువేసి అందించిన పుస్తక బహుమతి కాగా, రెండవ పుస్తకం ‘దివ్యపథం’ నవల. దివ్యాంగుల జీవితాలకు, సభ్యసమాజానికీ అభేదం చెపుతూ వ్రాయబడిన దివ్యపథం నవల, ఇటీవలి కాలంలో వెలువడిన వైవిధ్యమైన రచనగా విమర్శకుల మన్ననలందుకుంది. భారతీయ సమాజ, సాంస్కృతిక నేపథ్యంతో సాగే వీరి రెండవ నవల “మా‘నవ’సేన” ఒక ప్రతిష్ఠాత్మక నవలల పోటీ పరిశీలనలో ఉంది.

