[శ్రీ బడుగు భాస్కర్ జోగేష్ రచించిన ‘లిదియా పూలు సలామీ అఖాతం’ అనే కవితాసంపుటిని పరిచయం చేస్తున్నారు అవధానుల మణిబాబు.]
2010లో “పెద్దగా చదివిందీలేదు రాస్తుందీ లేదు.. రాసిన ఈ కాసిన్ని పదాల్నీ పేరుస్తున్నానంతే” అని మొహమాటంగా ముందుమాట వ్రాసుకుని 62 కవితలతో “దుఃఖ్ఖాoతి” పేరిట ఒక కవితాసంపుటి తెచ్చారు భాస్కర్ జోగేష్. ఆ తర్వాత ఋతువుకొకటి మించకూడదు అనుకున్నారో ఏమోగానీ, ఈ పదిహేనేళ్ళలో మరో తొంభై కవితలు వ్రాసి మనకోసం “లిదియాపూలు సలామీ అఖాతం” శీర్షికతో మరో పుస్తకంగా అందజేశారు. ఎంతో సామాజిక, రాజకీయ స్పృహ, భావ శబలత, శబ్దశక్తి, వినూత్న అభివ్యక్తి ఉన్న ఈయన ఇంత తక్కువ వ్రాయడానికి కారణం ఏమిటి? అని అడుగుదామనుకుంటే ఆ అవసరం లేకుండా ఓ చిన్నమాటగా “కనులు విచ్చుకునే కొద్దీ అక్షరాలు ముకుళించాయి” అని సంజాయిషీ ఇచ్చుకున్నారో కవితలో.
జోగేష్ కవిత్వాన్ని చదువుకున్నాక, ఒక్కమాటలో చెప్పమంటే ఈ పుస్తకంలో “అన్నా చెల్లెళ్ళ గట్టు” కవితలో ఆయన వ్రాసిన పంక్తి ఒకటి గుర్తొస్తుంది – “అంతర్గత అర్థమేదో అవగతమవుతుంది అంతరాళంలో”. ఈ మాటను ఈ కవి ప్రతికవిత ముందూ ఒకసారి అనుకోవాలి. మన ఉరుకుల పరుగుల తరంగాలన్నీ అతడి కవిత్వమనే ప్రశాంత నీలిమలో సంగమిస్తాయ్. తెల్లని వెలుగు, నల్లని చీకటి అనే విభజనలన్నీ చెంగావి సంజెలో సంలీనం చెందుతాయి. అంతరంగాన అంతర్వేదనలన్నీ అంతమవుతాయి. లక్ష్యం వైపు ప్రవహించి ప్రవహించి కోరి కోరి ఉప్పునీటిలో కలిసే ఒక అసమంజస జీవన కాంక్ష ఈయన కవిత్వం నిండా పరుచుకుని ఉంటుంది.
***
దుఃఖదాయని అనే కవితలో – “ఎవరి ఎదలోపలి పొరల అంతర లాంతరు వెలుగుల లోంచి ఉబికుబికి కన్నీటి కాంతి అయిందో” – ఈ పంక్తి దగ్గర ఎంత సేపో ఆగిపోయాను. ఎన్ని పొరలు విప్పుకోవాలి, ఈ వాక్యం అర్థం చేసుకునేందుకు. ఆధునిక వచన కవిత్వంలో అసలు సంగతి దాచి దానిపైన పొరలు పొరలుగా ప్రతీకలను పేర్చి రాయడం అరుదైన సంగతేమీ కాదు. కానీ ఆ ఆవరణల నిర్మాణంలో జోగేష్ కి ఒక ప్రత్యేకత ఉంది – ఈ పొరలు అతడు చెప్పే విషయానికి multiple layers of cushioning లేదా wrapping కాదు. ప్రతి పొరా కవి చెప్పదలచుకున్న విషయంలో అంతర్భాగం. ఆన్-లైన్ లో ఒక వస్తువు కొంటే, అది బయటకురావాలంటే ఒక అట్టపెట్టి, ఒక ప్లాస్టిక్ కవర్, ఒక బబుల్ కవర్ ఇవన్నీ తొలగిస్తేనే బయట పడుతుంది. కానీ జోగేష్ తన కవితలో వస్తువును దాచిన ఆవరణలు ఇలాంటివి కాదు. ఒక ఉల్లిపాయలో ప్రతి పొరా దాని అంతర్భాగం అయినట్లు. అలాగే, అరటిపువ్వులో ఒక్కో డొప్పనూ తొలగించే కొద్దీ మరిన్ని పిల్లేళ్ళు దొరికినట్లు – అలాంటి నిర్మాణం ఈయనది.
మనం తృప్తిపడినా కవి తృప్తి చెందడు. అందుకే పై కవితలో, ఆ ఎదలోపలి “పొరల అంతరాలలో” ఒక “లాంతరు”ను, దాని వెలుగులో కన్నీటికాంతిని దర్శించాడు. కన్నీటిని కాంతితో అనుసంధానం చెయ్యడం జోగేష్ ప్రత్యేకత. ఎందుకంటే, గతంలో కాంతిని దు:ఖంతో కలిపి దు:ఖాంతి చేసినవాడు. సాధారణంగా మనం సకారాత్మక అంశాలను వెలుగుతోను, నకారాత్మక అంశాలను చీకటితోనూ పోలుస్తాం. కానీ ఈయనది మనం అనుకునే దు:ఖం కాదు, అందుకే ఈయన చీకట్లు మనం అనుకునే వెలుగు రాహిత్యం కాదు. ఈ వేదన ఒక అన్వేషకుని కాంక్ష వంటిది. కొన్నిసార్లు, విశ్వనాథ చెప్పిన ‘జీవుని వేదన’ వంటిది. “ఓలేటి వెంకట రామశాస్త్రి” గారు “ఉపాయనము”లో ‘హృదయ పాత్రమ్ములో ఏమి ఉన్నదొగాని తొణకుచున్నది నిన్ను తలచినపుడు’ అంటారు. అలా ఏదో తలచుకున్నపుడు ఆర్ద్రమయమైన గుండె తాలూకు ఉద్వేగ స్థితి. బౌద్ధంలో కూడా – దుఃఖాన్ని అణచుకోవడానికి బదులుగా దానిని కరుణతో ఎదుర్కోవాలని ప్రోత్సహించారు. We have to understand its connection to attachment and the cycle of life and death. అని చెబుతారు.
ఇలాంటి విరోధాభాసలు ఎన్నెన్నో. ఈ కవిత చివరిలోనే “జీవితమో దుఃఖదాయక వర ప్రదాయిని” అంటారు.
***
ఒక కుటుంబపు మూడు తరాల చరిత్రను చెప్పేస్తారు “పుస్తకాల గది” కవితలో.
“కలగక కలిగిన తన ఏకైక శిశువుకు
తొమ్మిది గదులు గుదిగుచ్చాడు ఆ గారాల తండ్రి”
“దశాబ్దానంతరం
అమ్మ కుడిపాదం మోపాక
ఎనమండుగురమే అయ్యాం.
అత్త ఇంటికి కొందరు, అత్తారింటికి కొందరు
యాభై ఏళ్లకు గానీ తొమ్మండుగురం కాలేకపోయాం.
అవును గానీ
ఆ నిరక్షరాస్య నిత్య శ్రామికుడు
నా పుస్తకాల గదిని ఎలా కలగని ఉంటాడు?”
కవితంతా హాయిగా అర్థం అవుతుంది. కానీ, ఇక్కడ కేవలం ప్రశ్న “నా పుస్తకాల గదిని ఎలా కలగని ఉంటాడు? అని మాత్రమే” కాదు. జాషువా శిశువులో –
“ఏమి పనిమీద భూమికి నేగినాడొ
నుడువ నేర్పిన పిమ్మట నడుగవలయు
ఏండ్లు గడిచిన ముందు ముందేమొ కాని
ఇప్పటికి మాత్ర మే పాప మెరుగడితడు” అంటారు.
అలా, చిన్ననాడు ఆడించి ముద్దాడి ఉండి ఉంటారు గానీ, పెరిగి పెద్దై, ఆ తొమ్మిది గదులు గుదిగుచ్చిన తనకు కవితలో చోటిచ్చి కావ్యగౌరవం ఇస్తాడని, ధాన్యపు గాదెలుగా వాడిన గదులను పుస్తకాల బీరువాలతో నింపుతాడని అనుకుని ఉండరు, నిరక్షరాస్య నిత్య శ్రామికుడైన వారి తాతగారు.
జోగేష్ కు తాతయ్య అంటే ఇష్టం, నాన్నంటే మరీ ఇష్టం. ఈ విషయం ఆయన కవిత్వం చదివితే తెలుస్తుంది. కానీ కాసేపు ఆయనతో మాట్లాడితే అతడికి మనుషులంటేనే ఇష్టమని అర్థమవుతుంది. ఆ ఇష్టాన్ని, కృతజ్ఞతను ప్రకటించడానికి “తలుస్తున్నాను” అనే శీర్షికతో 96మంది కవి మిత్రులను, బంధువర్గంలోని, స్నేహితులవి దాదాపు వందకు పైగా పేర్లు ఈ పుస్తకం చివర్లో తలచుకున్నారు. అది చదువుతున్నపుడు నాకు, 2013లో ముంబైలో సచిన్ ఫేర్వెల్ స్పీచ్ లా అనిపించింది.
***
కొందరి కవిత్వాన్ని కళ్ళతో చదువుకుని మళ్ళీ కళ్ళు మూసుకుని మననం చేసుకుంటే ఆ దృశ్యం మనకు కనబడుతుంది.
“వెన్నెలొక్కటే కురుస్తుంది నీ కనులపైనా నా గుండెల్లోనూ
ఒకే వర్షం కురుస్తుంది నా కనుల్లోనూ నీ గుండెల పైనా”
ఒకసారి ఊహించుకోండి. అది స్త్రీ పురుషులే కానక్కర లేదు. ఒకరి కనులపైన కురుసిన వెన్నెల జారి మరొకరి గుండెల్లో చేరింది అంటే, ఆ కనుల కింద ఉన్న హృదయం దగ్గర రెండవ వారి శిరస్సు ఉందని అర్థం. అలాగే రెండవ పాదం. అంటే, వెన్నెలైనా, వర్షమైనా ఒకరికొకరు తోడుగా ఉన్నారని అర్థం.
***
వ్రాయాలంటే ఎంతో చదవాలి అని తెలిసినవాడికి, వ్రాసేటప్పుడు శబ్దాలకు లోటు ఉండదు. అందుకే ఒక స్వర్ణకారుడు ఆభరణంలో రాళ్ళను పొదిగినట్లు పదాలను సరిగ్గా సరిపోయేలా అలా కూర్చోబెడతారు. “అంత: శరీరాన ప్రకాశిత స్వర్ణరశ్మి” అంటారు “మూన్ లైట్ మూడ్స్” కవితలో. మనమైతే దానిని మనస్సు అనో, హృదయం అనో లేదా ఆత్మ అనో అనేస్తాం. కానీ అయన అంత: శరీరం అన్నారు. తిలక్ అంటాడు కదా, “అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చెయ్యాలి” అలాంటి మాట ఇది. ఆ కవిత చివర్లో చిత్రలిపుల వాకిళ్ళు అంటారు. ఈ పదం అయన signature. మొదటి పుస్తకంలోని కవిత ‘చిత్రలిపి’ అని ముగ్గు మీద కవిత.
“నును చెమ్మల కళ్ళాపి వాకిట వికసించే అనాది లేఖన సృజన.
కొబ్బరి చిప్పలో నిరాకారపు పాల మిళిత మేఘ ధూళి.
బిందుజ కళ” – ఇవన్నీ అప్పట్లో (జోగేష్ మొదటి పుస్తకం నాటికి) నేను మోహపడ్డ వాక్యాలు.
***
మరో విశేషం – ప్రదేశాలు, పరిసరాలు కవితలుగా మారడం. గత కవితా సంపుటిలో “కోటిపల్లి రేవు” గురించి వ్రాసిన జోగేష్ కి ఈ పుస్తకంలో నేదునూరు, పేరూరు, క్షణముక్తేశ్వరం – ఇవన్నీ కవితలయ్యాయి. మన ఊర్ల పేర్లన్నీ ఆలోచిస్తే గొప్ప ప్రత్యేకత ఉంటుంది, చరిత్ర పరంగా. సాధారణంగా ఒక ప్రత్యేకత ఉంటే దానికి సంబంధించిన పేరు వచ్చేస్తుంది. అలాంటిది ‘పేరూరు’ అనే ఊరికి ఏ విశేషమైన పేరూ లేదే అని కవి వాపోతాడు. కారణం ఆ ఊరిలో ఒకవైపు నేదునూరు నుండి జైనుల చతుర్పూర్వలు; ఆదుర్రు నుండి త్రిపిఠకాలు; ముంగండ నుండి నాల్గు వేదాలు, అమ్మతల్లి గ్రామదేవత – ఇన్ని అండదండలు ఉండగా ప్రత్యేకమైన పేరు లేదీమీ? అని బాధపడతాడు. ఈ రోజుల్లో అసలు మన పేరుకే అర్థం ఆలోచించని రోజుల్లో కవి కాబట్టి ఊరు పేరు గురించి ఆలోచించాడు. నేను పెద్దలు ఆవంత్స సోమసుందర్ గారిని కలసినపుడు మీ అసలు ఊరు ఏది అన్నారు. ‘సమనస’ అన్నాను. ఆయన ఎంత గొప్ప పేరు అన్నారు? నేను అందులో అంత గొప్పేమి ఉందిసార్! అన్నాను. సమనస. అన్నీ లఘువులు అన్నారు. మరి విలస, నడకుదురు, కరకుదురు ఇవన్నీ సర్వ లఘువులే కదా అన్నాను. నీ మొహం అన్నీ తలకట్టే చూడు అన్నారు. అపుడుగానీ, నేను పుట్టిన ఊరు పేరు గొప్పతనం నాకు తెలియరాలేదు.
***
ఇక కవితను ముగింపు దాకా పట్టుగా నడిపించడం ఈ కవికి అలవోకగా అబ్బిన కళ. ‘శుభలేఖ’ కవిత శీర్షిక, ఎత్తుగడ చదివి మోసపోతాం. నేను చదువుతూ ఇది – జీవిత భాగస్వామితో సమాగమ అనంతరం ఒక ఆత్మీయమైన కృతజ్ఞతా భావనతో కవి చూస్తున్నాడు, అనుకున్నాను. చివర్లో “శుభలేఖను కాలేకపోయిన ప్రేమలేఖను” అని చదవగానే కోనసీమ యాసలో “ఓరి సంపెహావురా బావు” అనుకున్నాను. ఇది విఫలప్రేమ అని, అటునుండి మళ్ళీ చదువుకుంటే ముడివిడిపోయింది. ఇందులో ఓ చోట “వలచీ, వర్షించి, నిరీక్షించిన” – మూడు దశలు ఒక వాక్యంలో చెప్పేశాడు. చివర్లో “ఆ నిర్లిప్త చూపుల అగ్నికీలల్లో దహనమౌతాను” – ఇది, పశ్చాత్తాపం.
***
ఊరు లేని పేరు కవిత విషయానికి వద్దాం. నాలుగు దిక్కులలోని సరిహద్దులు చెబుతూ తూర్పున తొత్తరమూడి, పశ్చిమాన అయినవిల్లి, దక్షిణాన నేమినాథునూరు అని; ఉత్తరాన వృద్ధ గౌతమి అని మాత్రం అనకుండా, ఏనాటిదో ఉత్తరాన వృద్ద గౌతమి అంటారు. నదీ తీరంలో మానవ నాగరికత వేల ఏళ్ళ తర్వాత మొదలవుతుంది. ఇది మనందరికీ తెలిసిన సంగతే కావచ్చు. కానీ కవిత వ్రాసే క్షణంలోని మన:స్థితిలో ఇలాంటివి ఎరుకలో వుంచుకోవడం అంత తేలిక కాదని నేననుకుంటాను. అంటే, Perfect to the minute details.
ఇక శ్లేష, ధ్వని వీలైనంత దొరుకుతుంది. ఓ చోట ‘సాధువుల గుండెలు పీల్చే గంజాయి పొగలా..’ ఇక్కడ వారి గుండెలు గంజాయి పీలుస్తున్నయా? లేక గంజాయి వారి గుండెలు పీలుస్తున్నదా?
ఈ కవిత చివరకు – “కడకు కడతేరి పోవటమేనని; గడిచిన ఘడియలన్నీ నిర్నిమిత్త నిమిషాలని, క్షణికమైన క్షణాలని క్షమించే ఊరు మాత్రం లేని ఆ పేరొకటి – క్షణ ముక్తేశ్వరం”. ఈ కవిత ఎంత బావుంది అంటే, ఆ ఊరి గ్రామ కచేరీసావిట్లోనో, గ్రంథాలయంలోనో ‘క్షేత్ర మహత్యం’ లా వ్రాయించి ఉంచదగ్గ పంక్తులివి.
***
ఈ సృష్టిలో కొత్తగా ఏదీ పుట్టదనీ, తనలో ఉన్నదే మరో రూపంగా పరివర్తన చెంది అందజేయబడుతుందని మనకు తెలుసు.
వసంతాన్ని వర్ణిస్తూ – “చిగుర్చుతుంది వసంతం; గతించిన గతకాలాల నుంచి కొమ్మల్లో దాగిన హరిత పత్రాలను” అంటాడు. ఈ చిగురు కొమ్మనించి అంకురించింది అని కాక, అంతవరకూ కొమ్మలో దాగి ఉంది అంటాడు. బోటనీ వాళ్ళు ఒప్పుకోరు కానీ నిజంగా అలా అనడం బావుంది. అంటే ఒక నైరాశ్యం నిండినపుడు చేతన నింపుకోవడానికి, కొత్త చిగురులు వేయడానికి చుట్టూ వెతకనక్కర లేదు. ఎవరినీ యాచన చేయనక్కర లేదు. ఆ చేతన నీలోంచే చేది తీసుకొమ్మని కవి భావన.
***
డిఫెన్స్ మెకానిజం లో ప్రయత్నపూర్వక విస్మృతి గురించి చెబుతారు. కానీ కవులకు అది సాధ్యం కాదేమో! సోమసుందర్ – “మెదడు గదిలో పురాస్మృతి అనే వృద్దురాలు రంగు రంగుల దారాలు కలగల్పి పేనుతూ కదురు త్రిప్పుతూ పురెక్కిస్తోంది కుదురుగా, కొన్ని రంగులు చిక్కులు విడటం లేదు కొన్ని రంగులు చెక్కు చెదరటం లేదు” అంటారు. ఇక్కడ పురాస్మృతి అంటే గత అనుభవాలు, రంగు రంగుల అంటే వైవిధ్యం, దారం – అవిరళత్వం; కవి అనేవాడికి నిరంతరం జరిగే అంతర్గత చర్య ఇది. జోగేష్ ప్రేమకవితలు చదివినపుడు పై మాటలు పదేపదే స్ఫురిస్తాయి. కవితల్లో భగ్న ప్రేమికుడు ఈయనా? లేదా వీరి స్నేహితులా? అది అనుభవమా? పరిశీలనా? లేదా భావకవుల్లా వీరికి ఊహా ప్రేయసి ఉందా? ఏదైనా పాఠకుడికి అవసరం లేదు. ఐతే, ఆ ప్రేమ ఎలాంటిది? అదిమాత్రం తెలుసుకోవాలి. “ప్రియురాలు ఇల్లు” కవితలో చెప్పినట్లు అది -– “అలవికాని అనుబంధపు అమలిన ఆరాధన”. ఈ అమలిన పదం దగ్గర ఇన్ని కవితలలో తలచుకున్న ప్రేమంతా ఎంత స్వచ్ఛమైందో మనకు తేటతెల్లమవుతుంది. ఐతే, ఆ తలపోతలు మాత్రం జీవితకాలం వెంటాడతాయ్.
“నెరుస్తోంది – లిల్లీ పూలంటి నీ లేతవేళ్ళు తడిమిన నూత్న యవ్వనపు నూనూగు మీసం” అంటాడు. మరోచోట, “నొప్పించావు ఒప్పించి మరీ – వర్ష రాత్రినెలా దాటవేయను” – సాధారణంగా నొప్పించి అయినా ఒప్పించాలి అంటాం కానీ ఈయన నొప్పించావు ఒప్పించి మరీ అంటారు. సరే, ఏదో జరిగింది. కానీ విరహాన్ని భరించలేక ఈ వర్షరాత్రినెలా దాటవేయను? అని ముగిస్తారు. ఏమైనా, “దాగని దాపట్టలేని మరలని మరువని కనుల కాంతుల్ని కలగంటున్నాను ఈనాటికీ” అని ఇక దాచలేక మనముందు అక్షరాలుగా పరిచేస్తారు.
సంక్రాంతి కవిత నిజంగా కళ్ళనీళ్ళు పెట్టించింది. సంక్రాంతి లో మనం చూసే ప్రతి వేడుకనూ తన భగ్న ప్రేమతో సమన్వయం చేస్తాడు.
హృదయం చేజేతులా రాజేసుకున్న భోగిమంట – ఇష్ట సృష్టిత పిడకలదండ వేసి రగుల్చుకుంటాను.
శిశు సృజనానంతర
మారిన మీ దేహాకృతిలోన
మాయమైన మృదుల మన:ఫలకంపై ఎన్నడో చెరిగిన నేనును వెతుక్కుంటాను.
మీ పుట్టింటి వాకిళ్ళ పండగ నాడేసిన చేతుల కలనేతల రంగవల్లిలో
మీరు కలపక వదిలిన చుక్కను మీ కనుల లోచూపుల్ని కలుపుకు కలుసుకుంటాను.
పసుపు బొట్లు పెట్టి ధరించిన నూతన వస్త్రాల మాటున
ఎన్నడూ పాడుపడని పాత హృదయంతో
అలంకృత గూడెడ్లబండిలో ఊరేగిన
నిష్పక్వ భావనల ప్రభల పేర్లను ఎన్నటికీ పూరించలేను.
ప్రతిపదం, ప్రతి పాదం బోలెడు సేపు వ్యాఖ్యానించుకోవలసినవే. నూత్న యవ్వనపు నూనూగు మీసం వయసులో ఆలోచనలను “నిష్పక్వ భావనలు” అనడం ఇపుడు పరిపక్వత పొందిన కవి నైపుణ్యం.
“అవర్ణావరణం” మరో అద్భుత కవిత. “కాల వృక్షం నీలో కొమ్మలెన్ని తొడిగిందో ఆ లేత చివురు మోమే మిగిలి ఉంది నాలో”. నిజమే, ఎన్నేళ్ళ తర్వాత చూసినా ఆ తొలినాటి రూపు కనిపిస్తూనే వుంటుంది. అందుకే 30 ఏళ్ల క్రితం ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ లో శారీరక ఆకృతుల్లో ఎంత మార్పు వచ్చినా మన మనసుకు నచ్చిన వారిని వెంటనే పోల్చుకుంటాం. ఐతే, వర్తమానంలో ప్రతి సన్నివేశంలోనూ గతాన్ని తలచుకుని బాధపడుతుంటే కవి శిఖామణి మాటలు గుర్తొస్తాయి – “ఒక్కోసారి ఏమీ చేతకాదు వుత్త గుర్తు తెచ్చుకోవడం తప్ప. కన్నీరు పెట్టుకోడానికి ఏదో బలమైన కారణం ఉండాలి, అందుకే నన్ను నేను ద్రవింపజేసుకుంటాను”. ఈ కవులంతా ఇంతే అన్నమాట.
***
మనం అనుకున్నట్టే, ఊహించినట్టే వాక్యం కనబడితే అది జోగేష్ కవిత్వం కాదు. ఈ పంక్తులు చదవండి –
“పెద్దలు చెబుతారు రేపటి యవ్వనాలను వలచి బుల్లి బుల్లి మాటలు
పిన్నలు చెప్తారు గత బాల్యాలను పిలిచి పెద్ద పెద్ద మాటలు”.
నాలుగైదు సార్లు చదువుకున్నాను. అపుడు అర్థం అయింది. మనం ఎవరితో మాట్లాడుతున్నామో వారిలాగే మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. అందుకే పిల్లలతో మాట్లాడేటపుడు మనం పిల్లలలాగే ముద్దు ముద్దుగా నంగి నంగిగా మాట్లాడతాం. అందుకే ఇక్కడ రేపటి యవ్వనాలు అంటే బాలలు వారితో పెద్దలు బుల్లి బుల్లి మాటలు చెబుతున్నారు. అలాగే గత బాల్యాలు అంటే పెద్దవాళ్ళు. పిల్లలు వారిని పిలిచి పెద్ద మాటలు చెబుతున్నారు.
***
సీత శోకాన్ని చాలా మంది వ్రాశారు, ఇప్పటికే. మిగతా కవిత విషయం మాట పక్కనుంచితే,
“కనుల్లోని కన్నీటిని కడిగే
సరయూ సలిలముంది
కానీ అగ్ని పరీక్షలను ఆర్పే
నీరేమీ లేదిక్కడ.
ఆ అశోకవనాన పురాతన శోకమదే
పురాణ పురాతన దేశాన
ద్వీపాన ద్వీప కల్పానా”
“అండాదండా ఉండాలని కోదండారాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే నిను కొండా కోనల కొదిలేశాడా?” స్థాయి వాక్యం ఇది.
ఇలా ఎంతసేపైనా ఎన్ని సంగతులైనా చెప్పుకోవచ్చు. “నేను నా చిరునామాకే పోస్టు చేసుకున్న ఉత్తరం కవిత్వం. తరాలుగా పూయలేక పోయిన పురాతన వృక్షపు నవజాత పుష్పం నా కవిత్వం” అని వ్రాసుకున్నారు జోగేష్. ఐతేనేం! ఒక్కో ఉత్తరాన్ని ఆయన చిరునామాకే పంపుకున్నా, ఆ ఉత్తరాలన్నిటినీ బొత్తిగా మనకు ఈ సంపుటిగా అందించినందుకు, ఒక పురాతన వృక్షపు నవజాత పుష్ప సురభిళాన్ని ఆఘ్రాణిoచే అవకాశం ఇచ్చినందుకూ ధన్యవాదాలు.
***
రచన: బడుగు భాస్కర్ జోగేష్
ప్రచురణ: ఈయాసూజో ప్రచురణలు
పేజీలు: 14+133
వెల: ₹ 150/-
ప్రతులకు:
బడుగు ఈశ్వరమ్మ గారు
(Rtd) పోస్ట్ మాస్టర్
వెలువలపల్లి (పోస్ట్)
అయినవిల్లి(మండలం)
డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా 533211
ఫోన్: 9866602325
అవధానుల మణిబాబు కవి, విశ్లేషకులు, వ్యాసకర్త.
1982 జనవరి 29న పుట్టిన మణిబాబు ఎమ్మెస్సీ (రసాయన శాస్త్రం), బి.ఇడి., పూర్తి చేశారు. 2004 నుంచీ రహదారులు మరియు భవనముల శాఖలో పనిచేస్తున్నారు. కాకినాడలో నివాసం.
బాటే తన బ్రతుకంతా.. (కవితా సంపుటి, 2013), అన్నవి.. అనుకొన్నవి.. (సాహిత్య వ్యాసాలు, 2015), అందినంత చందమామ (డా. ఆవంత్స సోమసుందర్ సాహిత్యంపై సమీక్షా వ్యాసాల సంపుటి, 2016), స్ఫురణ.. స్మరణ.. (సాహిత్య వ్యాసాలు, 2017), నాన్న.. పాప.. (కవితా సంపుటి, 2018), నేనిలా.. తానలా.. (దీర్ఘ కవిత, 2019), పరమమ్ (మధునాపంతుల పరమయ్యగారి సాహిత్యజీవితంపై దీర్ఘవ్యాసం, 2020), లోనారసి (సాహిత్య వ్యాసాలు, 2022), నింగికి దూరంగా… నేలకు దగ్గరగా (కవితా సంపుటి, 2023), ‘మధుశ్రీలు చదివాకా’ వంటి పుస్తకాలు ప్రచురించారు. ‘అచ్యుతమీ రామకథ’ వీరి తాజా పుస్తకం.
సోమసుందర్ లిటరరీ ట్రస్ట్ (పిఠాపురం) పురస్కారం, అద్దేపల్లి రామ్మోహనరావు కవితా పురస్కారం (విజయవాడ), సోమనాథ కళాపీఠం (పాలకుర్తి, తెలంగాణ) పురస్కారం, డా. ఎన్. రామచంద్ర జాతీయ విమర్శ పురస్కారం (ప్రొద్దుటూరు), దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం (బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్), ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ – విశిష్ట సాహిత్య పురస్కారం (2024), శిఖామణి యువ పురస్కారం-2025; కీ.శే. నాగభైరవ కోటేశ్వరరావు స్మారక పురస్కారం-2025 అందుకున్నారు.

