Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మా అన్న మీనన్ మలయాళీ కాదు..!!

ఆగష్టు 1, 2021 తేదీ ప్రసిద్ధ రచయిత శ్రీ కె. కె. మీనన్ గారి వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.

శ్రీ కె.కె.మీనన్

మంచివాళ్ళు, మంచి రచయితలూ, పుణ్యకార్యాలు చేసేవాళ్ళూ అందరూ వారి గురించి, వారు చేసిన పనుల గురించి ప్రచారానికి పెద్దగా ఆసక్తి చూపించరు. ఇంకా చెప్పాలంటే ఇష్టపడరు కూడా. నిశ్శబ్దంగా వారు చేయదలచుకున్న పని చేసుకుంటూ పోతారంతే! ప్రశంసల కోసం అసలు ఎదురు చూడరు. ఎవరైనా ఆ పని చేసినా అసలు ఒప్పుకోరు. వారి మనస్తత్వం అంతే, వారి జీవన శైలి ఇలాగే ఉంటుంది. అందుకే సమాజంలో ఎన్ని మంచి పనులు చేసినా చాలామందికి వారి గురించి సరైన సమాచారం తెలియదు. వారి గురించి ఆ నోటా.. ఈ నోటా వినేసమయానికి వారు మన మధ్య వుండరు. అలాంటి వారిలో నాకు అతి దగ్గరగా తెలిసిన మా పెద్దన్నయ్య స్వర్గీయ కె.కె. మీనన్ పెద్ద ఉదాహరణ. దీనికి తోడు ఆయన పేరు కూడా చాలా మందికి తికమక పెట్టి ఆయనను మలయాళీ చేసింది. ఆయన తెలుగువాడిగా చాలామందికి తెలియక పోవడం ఆశ్చర్యమే కాదు, కించిత్ బాధ కూడా కలుగుతుంది.

నాటి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి పేర్వారం జగన్నాథం గారి హయాంలో మీనన్ గారికి కీర్తి పురస్కారం ప్రకటించినప్పుడు, సన్మాన సభలో సి. నారాయణ రెడ్డి గారి లాంటి వారే, “ఎవరీ మీనన్?” అన్నారంటే, దీనిని బట్టి మీనన్ గారి ప్రొఫైల్ ఏ స్థాయిలో ఉండేదో తెలుసుకోవచ్చు. ఎందుకంటే అప్పటికే ఆయన కొన్ని నవలలు, పాఠకాదరణ పొందిన కథలు ఎన్నో రాసి వున్నారు.

హైస్కూల్ రోజులనుండి కథలు రాయడం ప్రారంభించిన మీనన్ గారు 1942లో ‘దిండి’ (తూర్పుగోదావరి జిల్లాలోని నాటి రాజోలు తాలూకా, నేటి మల్కీపురం మండలం) గ్రామంలో కానేటి తాతయ్య – వెంకమ్మ దంపతులకు జ్యేష్ఠ కుమారుడిగా జన్మించారు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, ఆయన తల్లిదండ్రులకు జ్యేష్ఠ కుమారుడైనా, పెద్దమ్మకు దత్తకుమారుడిగా (గోనమండ జేమ్స్, సత్తెమ్మ దంపతులు) వెళ్లడంతో, చాలామంది ఆయన పుట్టింది రామరాజులంక అని పొరబడ్తుంటారు. మొదటి సంతానాన్ని అలా దత్తత ఎందుకు ఇచ్చారో ఇప్పటికీ తెలియని పరిస్థితి.

లేకలేక పుట్టిన సంతానం కనుక ఆయనకు కృష్ణమూర్తి (పైగా ఇంట్లో అంతా నాస్తిక వాతావరణం) అని పేరు పెట్టారట. అప్పట్లో ఆ ప్రాంతం అంతా కమ్యూనిస్టుల ప్రభావం నిండి వున్నది. మా నాయన తాతయ్య గారు కూడా గొప్ప కమ్యూనిస్టు కార్యకర్త (రాజమండ్రి మొదటి పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కానేటి మోహన రావు గారు మాకు సమీప బంధువు, అన్నయ్య వరుస). అప్పట్లో కేరళలోని ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు కృష్ణ మీనన్ ఉండేవారట. ఆయన పేరే మా అన్నయ్యకు పెట్టడం వల్ల కానేటి కృష్ణమూర్తి కాస్తా కానేటి కృష్ణ మీనన్‌గా రూపాంతరం చెందింది. అదీ ఆయన పేరు లోని అసలు కథ. మీనన్ గారు తెలుగు విశ్వవిద్యాలయంలో కీర్తి పురస్కారం (1993) అందుకుంటున్న సమయంలో ప్రేక్షకుల్లో నా పక్కనే వున్న ఒకాయన “ వీళ్ళకి తెలుగు రచయితలే కనపడలేదా, మలయాళీ రచయితకు ఈ అవార్డు ఇస్తున్నారు?” అన్నాడు. అలా ఉండేది మీనన్ గారి పరిస్థితి.

బాకీ బతుకులు ఆవిష్కరణ సభలో రచయిత మీనన్ గారిని సన్మానిస్తున్న శ్రీ ఆరుద్ర. పక్కన శ్రీ వాకాటి పాండురంగారావు గారు

మీనన్ గారు హై స్కూల్ జీవితం అంతా రాజోలులోనే జరిగింది. తర్వాత బి.ఏ. వరకూ పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలోని ‘వెస్ట్ గోదావరి భీమవరం కాలేజీ’లో చదువుకున్నారు. విద్యార్థి నాయకుడిగా పలువురి ప్రశంశలు పొందారు.

తర్వాత నాగపూర్ విశ్వవిద్యాలయంలో, ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాపొందారు. ఐ.ఏ.ఎస్. కోసం ప్రయత్నం చేశారు కానీ అది ఫలించని కారణంగా, ఆ ప్రయత్నాలు మానుకుని హైదరాబాద్ లోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా చేరిపోయారు. అక్కడి నుండి ఆయన సాహితీ ప్రస్థానం కనీసం కొంతమందికైనా తెలియడం మొదలు పెట్టింది. తెలుగు వారు, తెలుగు రచయితలు కలసి ఏ.జి. ఆఫీసులో ‘రంజని’ అని ఒక సాహిత్య సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో అది ఒక ప్రామాణికమైన సాహిత్య సంస్థగా పేరుపొందింది. అలా అప్పుడు ‘రంజని’కి అధ్యక్షులుగా వున్న ప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఇసుకపల్లి దక్షిణామూర్తిగారు మీనన్ గారికి మంచి ప్రోత్సాహం ఇవ్వడమే గాక ‘రంజని’కి ఉపాధ్యక్షుడిని చేశారు. అలా మంచి సాహిత్య సభలు ఏర్పాటు చేయడం, కథారచయితలను ప్రోత్సాహించడం, కథల పోటీలు పెట్టడం రంజని సాహిత్య సంస్థ చేస్తూ ఉండేది.

మీనన్ గారు కథలు నవలలు రాయడం అప్పుడే ప్రారంభం అయింది. మీనన్ గారి హయాంలో ‘రజిత రంజని’ అనే వ్యాస సంపుటి వెలుగు చూసి బహు పాఠకాదరణ పొందింది. రంజినికి అధ్యక్షుడిగా మీనన్ గారి సేవలు ఇప్పటికి చెప్పుకుంటుంటారు. రంజని మీనన్ గారికి అందించిన మిత్రుడు, సాహిత్యకారుడు, చిత్రకారుడు శ్రీ శీలా వీర్రాజు గారు. మీనన్ గారికి అనేక రంగాలలో చాలా మంది మిత్రులు ఉన్నప్పటికీ శ్రీ శీలా వీర్రాజు గారినే తన ఏకైక మిత్రుడిగా మీనన్ గారు బాహాటంగా ప్రకటించారు. వీరిద్దరి మైత్రి చాలా గొప్పది. వివరించడానికి పదాలు చాలనిది. ఇద్దరూ సున్నితమైన మనస్కులు కావడం దీనికి ప్రధాన కారణం కావచ్చు.

మీనన్ గారి మొదటి నవల

ఈ రచయితకు తెలిసి మొదట వచ్చిన మీనన్ గారు కలం నుండి వెలువడిన పుస్తక రూపం దాల్చిన మొదటి నవల ‘బాకీ బతుకులు’. దీనిని మొదట స్వాతి మంత్లీలో శ్రీ వేమూరి బలరాం గారు ప్రచురించారు. ఆ తర్వాత విశాలాంధ్ర ప్రచురణ సంస్థ నవలగా ప్రచురించడము; ప్రముఖ కవి, రచయిత సినీమా పాటల రచయిత శ్రీ ఆరుద్ర చిక్కడపల్లి గ్రంధాలయంలో ఆవిష్కరించడమూ జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలోని వలస స్త్రీ కార్మికుల వెతలు, గాథలూ ఈ నవలలో సహజంగా (ముఖ్యంగా – ఊడ్పులు, కోతల సమయం) చిత్రించబడ్డాయి. మీనన్ గారు ఈ నవలను నాటి కమ్యూనిస్టు నాయకుడు, తన శ్రేయోభిలాషి గౌ. కనుమూరి రంగరాజు గారికి అంకితం ఇచ్చారు. ఎందుకో గానీ ఈ నవల సినీమా వారి దృష్టికి పోలేదు కాని, చక్కని దృశ్యకావ్యంగా మలచదగ్గ నవల ఇది.

మీనన్ గారు చాలా కథలు రాశారు,కానీ కొన్ని కథలు మాత్రమే పుస్తకరూపం దాల్చాయి. అవి ‘ఇది స్త్రీకింగ్ కాదు’, ‘పులికూడు’ ఇంకా అనేక అనువాద కథలు వున్నాయి.

మీనన్ గారి మొదటి కథా సంపుటి

‘ఇది స్త్రీకింగ్ కాదు’ (1979) కథల పుస్తకానికి అనేక ప్రత్యేకతలు వున్నాయి. కథలన్నీ ప్రత్యేకమైనవి, ఈ కథాసంపుటికి ముఖ చిత్రం బాపు వేశారు. ఈ పుస్తకానికి ముందుమాట శ్రీ కాళీపట్నం రామారావు గారు రాశారు. అట్టవెనుక రచయిత మీనన్ గారి బొమ్మ, లోపలి కథలకు బొమ్మలు శ్రీ చంద్ర వేశారు. ‘ఇది స్త్రీకింగ్ కాదు..’ అనే కథను శ్రీ భీంసేన్ నిర్మల్ హిందీ భాషలోకి అనువదించారు.

మీనన్ గారి రెండవ కథల సంపుటి

‘పులికూడు’ (1996) పుస్తకానికి ముఖ చిత్రం మీనన్ గారి ప్రాణ స్నేహితులు ప్రముఖ చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు గారు వేసి వారిద్దరి మైత్రిని సుస్థిరం చేసుకున్నారు. ముందుమాట కూడా  కథా సంపుటికి వీర్రాజు గారే రాశారు.

అప్పట్లో ఆంధ్రప్రభ వారపత్రికలో సంచలనం సృష్టించిన వైజ్ఞానిక సీరియల్ నవల ‘క్రతువు’. సరోగసీ మీద వచ్చిన ఈ నవల నాటి ఆంధ్రప్రభ వార పత్రిక సంపాదకులు శ్రీ వాకాటి పాండురంగారావు గారికి బాగా నచ్చిందని మీనన్ గారు చెబుతుండేవారు. టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి పాఠకుల్లో అంతగా అవగాహన లేని రోజుల్లో వెలుగు చూసిన నవల ఇది. మీనన్ గారికి మంచి పేరు తెచ్చిన నవల ఇది. మీనన్ గారు ఈ నవల కోసం నాటి బ్రిటీష్ లైబ్రరీలో (సెక్రెటరియేట్‌కు ఎదురుగా) నెలల తరబడీ రిఫెరెన్సు పుస్తకాలు చదివిన విషయం ఈ రచయితకు తెలుసును. ఈ రచయిత అభ్యర్ధన మేరకు నాటి ఆకాశవాణి (హైదరాబాద్) సీనియర్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ శ్రీమతి సరోజా నిర్మల గారు మీనన్ గారి నవల ‘క్రతువు’ను నాటకీకరణం చేయించి సీరియల్‌గా ఆకాశవాణిలో ప్రసారం చేశారు. నాటకీకరణ చేసిందీ మామూలు వ్యక్తి కాదు. ఈ రచయితకూ మీనన్ గారికీ మంచి మిత్రుడాయన. ఆయనే ప్రముఖ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి గారు. ఈ ఇద్దరికీ ఈ రచయిత ఎప్పుడూ రుణపడి వుంటాడు. ప్రముఖ అనువాదకులు శ్రీ జి. పరమేశ్వర్ గారు (2014) క్రతువు నవలను హిందీలోకి అనువదించారు.

మీనన్ గారి రెండవ నవల

 

క్రతువు – రేడియో నాటకం విషయంలో కొసమెరుపు ఏమిటంటే దానికి సంబందించిన రెమ్యునరేషన్ తాలూకు చెక్కు అందుకునేవరకు మీనన్ గారికి ఈ విషయం తెలియకపోవడం. రచయిత నుండి అభ్యంతరం ఉండదనే గట్టి నమ్మకం ఆకాశవాణి వారికి ఉండడం విశేషం. రంగుల నీడ అనే నవలను మీనన్ గారు ప్రఖ్యాత నవల రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారితో కలిసి రచించారు. ఇది కాక ప్రతిధ్వని, రాగతరంగాలు వంటి నవలలు రాశారు కానీ అవి పుస్తక రూపం దాల్చలేదు. ఇంతమాత్రమే కాకుండా మీనన్ గారు రేడియో కోసం కథలు రాశారు. కుటుంబ సంక్షేమంకు సంబంధించి ప్రత్యేకంగా జీడిగుంట రామచంద్ర మూర్తిగారు మీనన్ గారి చేత రేడియోకు కథలు రాయించే వారు. ఏ.జి. ఆఫీసునుండి పదవీ విరమణ చేసిన తర్వాత మీనన్ గారు రచనా వ్యాసంగం కుంటుపడింది. ఎందుకు రాయడం లేదని ఎవరైనా అడిగితే “ ఇప్పుడు యువ రచయితలు బాగా రాస్తున్నారు. మా లాంటివాళ్లు ఇక రాయక పోతేనే మంచిది” అనేవారు. కుటుంబ సమస్యలు కూడా తోడై ఆయన నిశ్శబ్దమై పోయారు, క్రమంగా ఆయన కలం ఆగిపోయింది.

మీనన్ గారి క్రతువు హిందీ అనువాదం

మీనన్ గారు హైదరాబాద్ లోని, నానల్ నగర్ దగ్గర, కాకతీయ నగర్ లో స్థిరపడ్డారు. వారి శ్రీమతి హైదరాబాద్ వాటర్ వర్క్స్ విభాగంలో సివిల్ ఇంజనీరుగా పదవీ విరమణ చేశారు. వారికి ఇద్దరు సంతానం. అమ్మాయి డా. అపర్ణ, కంటి వైద్య నిపుణురాలు, కుమారుడు బాల వంశీకృష్ణ ఇంజనీరు. కొంతకాలం విదేశాల్లో పనిచేసి ఇప్పుడు హైదరాబాద్ లో స్థిరపడినాడు.

కె. కె. మీనన్ దంపతులు

కొడుకు, కోడలు, మనవడితో శ్రీ మీనన్ దంపతులు

అక్కా తమ్ముళ్లు ఇద్దరూ,వేరువేరు చోట ఇల్లుకట్టుకుని స్థిరపడినవారు. మీనన్ గారి వారసత్వ సంపదగా సాహిత్యాన్ని ఇద్దరూ అందుకోలేకపోయినారు. అందుచేతనే మీనన్ గారు సేకరించిన పుస్తకాలన్నీ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి విరాళంగా ఇవ్వబడ్డాయి. ఒక రకంగా ఇది మంచి పనే! ఎందరికో ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించిన మీనన్ గారు కోలుకోలేంతగా అనారోగ్యానికి గురయ్యారు. దీనికితోడు కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆయన చివరి రోజులు వృద్ధాశ్రమంలో గడపవలసి వచ్చింది. వృద్ధాశ్రమంలో మీనన్ గారిని ఎక్కువసార్లు కలుసుకుని ఆయనతో గడిపింది శ్రీ శీలా వీర్రాజు గారే!

రచయిత కుమారుడు రాహుల్ తో మీనన్ గారు

పెద్ద చెల్లెలు మహానీయమ్మ,,రచయిత, పెద్ద తమ్ముడు డా. మధుసూదన్, పిన్ని కొడుకు ఆశీర్వాదంతో మీనన్ గారు

మీనన్ గారికి ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు వున్నారు. ప్రస్తుతం ఇద్దరు తమ్ముళ్లు మాత్రం మిగిలివున్నారు. ఈ వ్యాస రచయిత మీనన్ గారికి చిన్ని తమ్ముడు. తమ్ముడికి పునర్జన్మ ప్రసాదించిన మహానుభావుడు ఆయన. మీనన్ గారికి తమ్ముడిని కావడం నా అదృష్టమే! అంతటి పుణ్యమూర్తి ఇక సెలవంటూ ఆగష్టు 1,2012లో కనిపించని అనంతలోకాలకు తరలిపోయారు. వందేళ్ల తెలుగు కథా చరిత్రలో మీనన్ గారు కూడా భాగస్వామి కావడం ‘ తెలుగు కథ’ చేసుకున్న పుణ్యమే!

Exit mobile version