[టి.వి.యెల్. గాయత్రి గారి ‘మా జాతి ఉనికి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
ఆ రోజు హాస్పిటల్‌కు వెళ్ళటానికి తయారవుతున్నా. మా పనిమనిషి గీత వచ్చింది.
“పని చేసి వెళ్ళు! ఫ్రిజ్‌లో పాలున్నాయి. కాచిపెట్టు!..” అంటూ పనులు పురామాయిస్తున్నాను.
ఈ రోజేమిటో నా వెనకాలే మాట్లాడకుండా నిల్చుంది గీత.
“ఏమిటి?”
“అమ్మగారూ!..” నసుగుతోంది.
“ఏమిటి? డబ్బులేమన్నా కావాలా” అసలే హాస్పిటలుకు వెళ్లే తొందర్లో ఉన్నాను.
“కాదమ్మా! మా అక్క కూతురుకు బాగాలేదు. మీరు చూస్తారేమోనని..” తలవంచుకొని చెప్పింది.
“అంతే కదా! పాపను తీసికొని హాస్పిటలుకు రా!” అన్నాను హ్యాండ్ బ్యాగ్ తీసికొంటూ.
ఆలాగే నిల్చుని ఉంది గీత. ఈ రోజు తన వైఖరి కొంచెం తేడాగా ఉంది.
“ఏమిటి పిల్లకు జ్వరమా? విరేచనాలు కూడా ఉన్నాయా?”
జవాబు లేదు. ఇంకా నేల చూపులు చూస్తూ ఉంది. అసలే టైమ్ అయిపోతూ ఉంది.
“సరే! హాస్పిటలుకు తీసుకురా!” అంటూ పరుగులాంటి నడకతో కారు దగ్గరికి వచ్చాను.
హాస్పిటలుకు వచ్చి పడ్డానంటే క్షణం తీరిక ఉండదు.
ఒక వైపు ఓపికి వచ్చిన పెషేంట్సును చూస్తూ డెలివరీ కొచ్చిన కేసులు కూడా చూస్తున్నాను. ఈ పూట నాలుగు కేసులు. మూడు నార్మల్ డెలివరీలు. ఒకటి మాత్రమే సిజేరియన్. లంచ్‌కి వెళ్దామనుకుంటుంటే మరొక కేసు వచ్చింది. నర్సుకు అప్పచెప్పి వస్తుంటే గీత, వాళ్ళ అక్క రాధ కనిపించారు. వాళ్ళిద్దరి వెనకాల రాధ కూతురు అనుష్క.
“ఇప్పుడొచ్చావా? సరే పద!” అంటూ రూమ్ లోకి దారి తీశాను.
ఏదో వైరల్ ఫీవర్ అయ్యుంటుంది.
“ఏమిటి చెప్పు!” అన్నాను.
ఇద్దరి నుండి జవాబు లేదు. పిల్ల కళ్ళల్లో భయం కనిపిస్తోంది. పాపకు పద్నాలుగేళ్లుంటాయి.
“ఏమిటి పాపా!”
మాటపలుకు లేకుండా చూస్తోంది. పిల్ల సన్నగా నల్లగా ఉంది.
గీత వైపు చూశాను.
ఎవ్వరూ మాట్లాడక పోతే ఎలా తెలుస్తుంది? చికాకుగా ఉంది. ఈ నాన్చుడు ఏమిటి?
“ఏమిటో చెప్పండి!” అన్నాను అసహనంగా.
“పిల్లకు నెలసరి సరిగ్గా రావటం లేదమ్మా!” అంది గీత.
“అదేం పెద్ద సమస్యా? ఈ కల్తీ కాలంలో ఏదీ సరిగ్గా ఉండదు!..” అంటూ టెస్ట్ చేశాను. నాకు అనుమానం వచ్చింది.
“ఉండు!”అంటూ నర్సును పిలిచి ప్రాథమికంగా టెస్టులు చేశాను. నా అనుమానం నిజమే! పిల్ల గర్భవతి. ఐదోనెల అవ్వాలి. స్కానింగ్‌లో బేబీ కనిపిస్తోంది.
“ఎలా జరిగిందో చెప్పు!” అన్నాను అనునయంగా.
“మా.. మా.. స్కూలు మాస్టారు..” అంటూ ఆగిపోయింది.
నైన్త్ క్లాసు చదువుతున్న పేద పిల్లని కాస్త కాస్త డబ్బులిచ్చి లోబరుచుకొన్నాడు.
“ముందు పోలీసులకు చెబుదాం!”
అదిరి పడ్డారు ఇద్దరాడవాళ్ళు.
“వద్దమ్మా! వద్దు! మా బస్తీలో అల్లరయి పోతాం! పిల్ల దాని జీవితం నాశనమవుతుంది. ఏదో ఇండీషనిచ్చి తీసెయ్యండి! పీడ వదిలించుకొంటాం! చదువు వద్దు.. చట్టుబండలు వద్దు.. మా లాగా ఏదో పని చేసుకొని బతుకుద్ది!”
చీర కొంగు నోట్లో దోపుకొని ఏడవసాగింది రాధ.
“వాడిని పోలీసులకు పట్టించకపోతే ఇంకా నలుగురిని పాడు చేస్తాడు. పిల్లకేం భయం లేదు. నా ఫ్రెండ్ వాళ్ళాయన పోలీసు డిపార్ట్మెంటులో పెద్ద ఆఫీసర్. పాప పేరు బయటికి రాదు. ధైర్యంగా ఉండండి!” నచ్చచెప్పసాగాను.
“వద్దమ్మా! వద్దు! మా మగవాళ్లకు తెలిస్తే చంపేస్తారు.. ఎవరికీ తెలియకూడదని మీ దగ్గరికి తీసికొచ్చాం!..” అంటూ ప్రాధేయపడ్డారు.
ఆకలన్నది మర్చిపోయాను. దాదాపు గంట సేపు కూర్చుని ధైర్యం చెప్పాను.
చివరకు ఒప్పుకున్నారు.
నా ఫ్రెండ్ డాక్టర్ జ్యోతికి ఫోన్ చేసి విషయం చెప్పాను.
తర్వాత మొదలైంది ఎంక్వయిరీ.
మొదట స్కూలు ప్రిన్సిపాల్ కాదు కూడదంది. తమ స్కూల్లో ఇలాంటి వాళ్ళు లేరంది. టీచర్లందరు దేవుళ్ళంది. అసలు పోలీసులను స్కూలు లోపలికి రానివ్వలేదు. తరువాత చేతులెత్తేసింది.
అతడి పేరు భాస్కర్.
మొదట ఒప్పుకోలేదు. పోలీసువాళ్ళు వాళ్ళ పద్దతిలో అడిగే సరికి ఒప్పుకున్నాడు.
ఇంక మీడియా వాళ్ళు. చూపించి చూపించి పండగ చేసుకుంటున్నారు. ఇది జరుగుతున్నంత కాలం అనుష్కను, రాధను హాస్పిటలులోనే ఉంచేశాను. అక్కడయితే టి.వీ. ఉండదు. ఇంటికి పంపిస్తే పిల్ల టి.వీ. చూస్తూ డిస్ట్రబ్ అవుతుందని. మాటి మాటికీ జీవితం నాశనం అయిందని పిల్ల ముందు ఏడవొద్దని రాధకు గట్టిగా చెప్పాను.
రోజూ కాసేపు కూర్చుని పిల్లకు ధైర్యం చెబుతున్నాను.
పది రోజులు గడిచాయి. రిమాండ్‌లో ఉన్న నిందితుడు భాస్కర్ ఆత్మహత్య చేసుకున్నాడట. నేరానికి శిక్ష కూడా పడిపోయింది. పోలీసులను ఎవ్వరూ పెద్దగా ప్రశ్నలు వెయ్యలేదు. ఈ మధ్య ఇలా జరుగుతోంది. ఆ మధ్య చెరువులో దూకి ఒక వృద్ధుడైన దుర్మార్గుడు ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త ఒకటి విన్నాము.
నేను హాస్పిటలుకు వెళ్ళాను.
ఇప్పుడు ప్రశ్న అనుష్క గురించి, దానికి పుట్టబోయే బిడ్డ గురించి.
కాలం గడిచింది. కాన్పయింది. ఆడపిల్ల. చేతుల్లోకి తీసుకున్నాను. బలహీనంగా ఉంది చిన్నపాప.
“ఆ పుట్టేదేదో మగపిల్లాడయితే బాగుండేది!” గొణుక్కొంటోంది రాధ.
ఈ మనుషుల్లో ఎప్పటికి మార్పు వస్తుంది?
చిన్నబిడ్డను చూసుకుంటూ రాధ ఆయగా హాస్పిటలులోనే పనిచేస్తోంది.
అనుష్కను మళ్ళీ స్కూలుకు పంపించటానికి రాధ, గీతలతో పెద్ద యుద్ధమే చెయ్యాల్సి వచ్చింది. వేరే స్కూలులో చేర్పించాను.
ఇప్పుడు టెన్త్ క్లాసు.
“శ్రద్ధగా చదువుకో!భవిష్యత్తు గురించి బెంగ పడకు!”
తలూపింది అనుష్క.
ఆ పిల్లలో వయసుకు మించిన గాంభీర్యం. అవును మరి!చిన్న వయసులోనే ఎతో పెద్ద దెబ్బ తిన్న పిల్ల. ఈ మృగారణ్యంలో ప్రతి నిమిషం ప్రాణభయంతో బ్రతకడమే! ఇంటి పక్కవాళ్ళు, వెనుక వాళ్లు.. పరిచయస్తులు,.. పెద్ద వాళ్ళు.. చిన్నవాళ్లు.. స్నేహితులు..ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందో తెలియదు. ఎవర్నీ నమ్మలేని పరిస్థితి.
ఇలాటి పరిస్థితుల్లో బ్రతకటానికి ప్రత్యేకమైన శిక్షణను తీసికోవాలి. అప్రమత్తత అవసరం.
ఆ రోజు పేషెంట్లను చూస్తున్నాను. టెన్త్ క్లాసు రిజల్ట్స్ వచ్చాయి.
అనుష్క నవ్వుతూ చూపించింది. స్కూలు ఫస్ట్ వచ్చింది.
ఆ అమ్మాయి కళ్ళల్లో ఆత్మవిశ్వాసం. ఈ ఆటవిక సమాజంలో మృగాలను ఎదుర్కొనే ధైర్యం.
అంతటితో అయిపోలేదు. ఐదేళ్లు గడిచాయి. అనుష్క కూతురు స్కూలుకు వెళుతోంది. చిన్న పాప పేరు అహల్య. ఈ చిన్నారిని జాగ్రత్తగా పెంచుకోవాలి. అవగాహన కలిగించాలి. కూతురుకు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ ఏమిటో నేర్పిస్తోంది అనుష్క.
బి.ఎ. పూర్తి చేసింది అనుష్క.
“పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగం కోసం ట్రై చేస్తానమ్మా!” అంది అనుష్క.
“నువ్వు తెలివైన పిల్లవు! ఇంకొంచెం పెద్ద టార్గెట్ పెట్టుకో!”అన్నాను.
“నాకు ఐఎఎస్ కానీ ఐపిఎస్ కానీ చెయ్యగలిగే సామర్థ్యం ఉందా? ఒక వేళ ఫెయిల్ అయితే?”
“ప్రయత్నం చెయ్యి! ఫలితం గురించి ఆలోచించకు! నీ వెనుక మేమున్నాము కదా!”
అనుష్క కళ్ళు తళతళలాడాయి.
ఎమ్మేలో చేరి ఐఎఎస్ కోచింగ్ తీసుకొంటోంది.
రెండూ అయ్యాయి. మెయిన్స్‌లో ఆంత్రోపాలజీ తీసుకొంది. కష్టపడి చదివింది కానీ మెయిన్స్‌లో పోయింది. నిరాశపడింది పిల్ల.
“వద్దమ్మా! నాకు రాదు! మామూలు జాబ్ చూస్తాను!” అంది.
“ట్రై! ట్రై! ట్రై! సాలీడు కథ గుర్తుకు తెచ్చుకో! నాలుగు ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ అయిన వాళ్ళున్నారు. లక్ష్యాన్ని వదిలేయకూడదు!” అన్నాను కాస్త గట్టిగా.
“ఎంతకాలం మీరు పెట్టుకుంటారు? సారు ఏమనుకుంటారు? పరాన్నజీవిలాగా మిమ్మల్ని పీక్కు తింటూ ఉండటం భావ్యం కాదు!”
“సారు ఏమీ అనుకోరు! నువ్వు నా గురించి ఆలోచించకు! తర్వాత పైసా పైసా నీ దగ్గర వసూలు చేస్తానులే!” అన్నాను నవ్వుతూ.
అనుష్క గెలుపు నా గెలుపులాగా అయింది. నాదేనా? అనుష్క విజయం సాధిస్తే అది స్త్రీ జాతికే విజయం కదూ!
కఠినమైన చదువు. క్రమశిక్షణతో కూడిన శ్రమ. ఈ సారి అనుష్క కోసం దేవుడిని మొక్కుకున్నాను.
“మీ అమ్మ చూడండి! మీ చదువుల కోసం ఎప్పుడన్నా దిగులు పడిందా? ఈ రోజు ఆ పిల్ల కోసం మెట్టు మెట్టుకూ మొక్కుకుంటూ ఎక్కుతోంది!” అంటూ మా అయన ఎగతాళి చేస్తుంటే మా కొడుకు కోడలు నవ్వుతున్నారు. ఇక మనవళ్లయితే సరేసరి. కోతుల్లాగా కిచకిచలాడుతున్నారు.
“నిజమే! మన ఇళ్లల్లో చదువుకే ప్రాధాన్యత ఇస్తాము! ఆ పిల్లకు అలాంటి వాతావరణం లేదు. పైగా దెబ్బతిన్న పిల్ల! ఏదో చెయ్యి అందించాలని తాపత్రయం!” అన్నాను.
“ఊరికే అన్నాను సుధా!ఎలా ప్రిపేర్ అవుతోందోనని మా కందరికీ ఆసక్తిగా ఉంది. ఇది రెండో సారి! చూద్దాం! దేవుడు కూడా సహాయం చెయ్యాలి!” అన్నారు మా అయన.
నేను ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. అన్నీ దాటుకొని అనుష్క ఐఎఎస్ అయింది. మొదటి పోస్టింగ్ కర్ణాటకలో. ఆంత్రోపాలజీ మెయిన్స్ కాబట్టి అనుష్కను గవర్నమెంట్ ట్రైబల్ ఏరియాకు వేసింది.
“అహల్యను, అమ్మను ఇక్కడే ఉంచు! చిన్నదాని చదువుకు ఆటంకం ఉండదు.” అన్నాను.
పిల్లను వదలలేక వదలలేక వెళ్ళింది అనుష్క.
“నువ్వు అనుకున్నది సాధించావు సుధా! ముందుగా నీకు చెప్పాలి కంగ్రాట్స్!” అన్నారు మా అయన.
“అప్పుడేనా? అనుష్కకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి! తాను కూడా మన పిల్లల్లాగ పిల్లాపాపలతో మంచిగా సెటిల్ అవ్వాలి.” అన్నాను.
అప్పుడే నేను మా జాతి మొత్తం తల ఎత్తుకొని తిరగ్గలం.
ఎన్నెన్ని అవమానాలు.. ఎన్నెన్ని అత్యాచారాలు.. ఎన్నెన్ని దాష్టికాలు.. చేసినా సరే అదేమిటో మా స్త్రీ జాతి అన్నింటినీ తట్టుకొని తన ఉనికిని చాటుతోంది.
(సమాప్తం)
