[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘మా ఊరి బస్సు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మా ఊరి బస్సు
అదొక నేల మీది విమానం
మా ఊరికి బస్సు వస్తే చాలు
ఒక ఆత్మీయుని రాకలాగుంటుంది
ఆప్యాయపూరిత ఆనందాన్నిస్తుంది
నిరీక్షణలో గడిపిన క్షణాలన్ని
ఒక్కసారే మటుమాయమవుతాయి
దాని రాకడ కొంచెం ఆలస్యమైతే
తల్లికోడి కనిపించకపోతే
పిల్లలన్ని తల్లడిల్లినట్లే
క్షణంలో కలకలం రేగుతుంది
అందులో కూర్చోని పయనిస్తుంటే
తల్లికోడి తన రెక్కలక్రింద దాగిన
పిల్లల్ని గద్ద వాటు నుంచి రక్షించినట్లే
సంపూర్ణ సురక్షితాన్నిస్తుంది
ఎవరిని దింపేయదు
వేరెవరిని చంకనేసుకోదు
చికాకు పడదు చీదరించుకోదు
కోపగించుకోదు అసహ్యించుకోదు
నిత్యం తన దినచర్యలో
అందర్ని అక్కున చేర్చుకొని
మానవత్వానికి జీవం పోస్తుంది