[శ్రీలంకలో జరిపిన తమ పర్యటన అనుభవాలు, అనుభూతులు వివరిస్తున్నారు శ్రీ తూనుగుంట్ల రాజేంద్ర.]
మాకు పర్యటనలంటే ఆసక్తి. వీలు కుదిరినప్పుడల్లా పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తూంటాము. నా సతీమణి ఇందిర ఎప్పటినుండో ఎక్కడికైనా వెళ్ళివద్దామని అడుగుతోంది. వియత్నాం, శ్రీలంక, ఎవరెస్ట్ బేస్ కాంప్‌లు ఈ లిస్ట్‌లో ముందుగా ఉన్నాయి. రకరకాల కారణాలతో వెనకబడుతూ వచ్చినయ్యి ఈ యాత్రలు.
కొద్ది నెలలుగా నేను కూడా వెళ్ళాలనే పట్టుదలగా ఉన్నాను. ఈ అక్టోబరులో ఇంటి రిపేరు పనులు పూర్తి అయిన తర్వాత నవంబరు మొదటి వారంలో తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాము. ఎవరెస్టు బేస్ కాంప్ వెళ్ళేందుకు చాలా తయారుకావాలి, అందులోనూ వచ్చేది చలికాలం కావడంతో దాన్ని కొంచెం వెనక్కు జరిపి ముందుగా వియత్నాం కాని, శ్రీలంక కానీ వెళ్దామని అనుకున్నాము. మేము ఎప్పుడూ వాడే Pickyourtrail వాళ్ళను ఒక ఐదు రోజుల వియత్నాం trip ను, ఒక ఐదు రోజుల శ్రీలంక trip ను ప్లాన్ చేసి ఇవ్వమని అడిగాను. వాళ్ళు వారికి తోచినట్లు పంపారు. వాళ్ళు పంపిన వియత్నాం ప్లాన్ అంత బాగా అనిపించలేదు. అదీకాక వియత్నాంలో ఏ ఏ ప్రాంతాలు చూడాలి అనేది కూడా డిసైడ్ చేసుకోలేకపోయాము. అందువల్ల శ్రీలంక వైపే మొగ్గు చూపాము. కేవలం pickyourtrail మాత్రమే కాక ఇందిర మరొక tour operatorను online లో వెతికి వాళ్ళనుండి కూడా plan తీసుకుంది.
చివరకు రెండు ట్రావెల్ ఏజెన్సీలనుండి సుమారు ఒకేలాగ ఖర్చు వచ్చినందువల్ల ఎప్పుడూ వెళ్ళుతున్న PYT వాళ్ళతోనే ప్రయాణం నిశ్చయించాము. 21 నవంబరు హైదరాబాదులో బయలుదేరి 26 నవంబరు తిరిగి వచ్చేందుకు ప్లాన్ చేశాము. ఈ ప్లాన్ ప్రకారం వారు మాకు విమాన టిక్కెట్టులు, 4 స్టార్ హోటలులు, కారును డ్రైవరుతో సహా అన్ని రోజులకు ఇస్తున్నారు. కారు డ్రైవరు లోకల్ గైడుగా కూడా సహాయం చేస్తాడు. హోటళ్ళలో బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ ఈ ప్లానులో ఉన్నాయి. మధ్యాహ్న భోజనం, ఇంకేమైనా బైట తినే, కొనే వస్తువులు, దర్శనీయ ప్రదేశాలలో ఎంట్రీ టికెట్లు మేము వేరుగా పెట్టుకోవాలి. PYT వాళ్ళ ప్లాన్ ప్రకారం కొలంబో, కేండీ, నువారా ఎలియా, బెంటోటా వెళ్ళాలి. అయితే నేను బెంటోటా తీసివేసి శ్రీలంక పురాతన రాజధాని అయిన అనూరాధపురాలో 2రోజులు కలిపాను. అలాగే మా పిన్ని సూచన ప్రకారం ఒకపూట త్రింకోమలిలోని శక్తిపీఠం కూడా చూడాలని అనుకున్నాము.
నవంబరు 12కి డబ్బు మొత్తం ఇచ్చేసి booking పూర్తి చేశాము. కొలంబోలో మిరేజి హోటలు, అనూరాధపురలో రాజరత హోటలు, కేండీలో ఎర్ల్స్ రీజెంట్ కేండీ ఇంకా నువారా ఎలియాలో అరాలియా రెడ్ హోటలులో ఉండేందుకు PYT వాళ్ళు బుక్ చేశారు.
~
శ్రీలంక
ఈ దేశాన్ని గురించి నేను చిన్నప్పటినుండి విన్నాను. సుమారు క్రీ పూ 500 కంటే ముందు ఈ దేశాన్ని ఎవరు పాలించారో పెద్దగా తెలియదు.. ఆ తర్వాత వంగదేశము నుండి విజయుడనే రాజకుమారుడు తన పరివారంతో ఓడలపై ఈ దేశానికి చేరి తన రాజ్యాన్ని స్థాపించాడని బౌద్ధ భిక్షువులు పాలీభాషలో రాసిన మహావంశమనే శ్రీలంక రాజుల చరిత్రలో చెప్పబడింది. తప్పకుండా సుమారు క్రి.పూ.500 నుండి ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలు, వ్యవసాయం మొదలైన విషయాల్లో గొప్ప మార్పులు జరిగినట్లు చరిత్రకారుల పరిశోధనల్లో తెలుస్తోంది. ఆ విధంగానే సింహళ భాష కూడా సంస్కృత భాష నుండి వచ్చినదిగా తెలుస్తోంది.
అశోకుని కుమారుడైన మహేంద్రుడు, కుమార్తె సంఘమిత్ర బౌద్ధ మతాన్ని శ్రీలంకకు తీసుకు వచ్చారని ఈ గ్రంథంలో చెప్పబడింది. ఆ తర్వాత మన ఆంధ్రుడైన నాగార్జునుడు ప్రవచించిన మహాయాన బౌద్ధం ఇక్కడ ప్రజలు ఎక్కువగా పాటిస్తున్నారు.
తమిళ సంగం సాహిత్యంలో ఈ ద్వీపాన్ని ఈలం అని పిలిచారు. సుమారు క్రీ పూ 250లో పాలించిన దేవానాంపియ తిస్సా కాలంలో బౌద్ధం ఈ రాజ్యంలో కాలూనింది. ఆ తర్వాత వలగాంబ, విజయబాహు, పరాక్రమ బాహు మొదలైన గొప్ప మహారాజులు ఈ దేశాన్ని పాలించి అనేక గొప్ప విజయాలు సాధించారు.
దక్షిణ భారత రాజ్యాలయిన చోళ, చేర, పాండ్య, పల్లవ రాజ్యాలు, విజయ నగర రాజ్యం కూడా ఇక్కడ వాణిజ్య వ్యాపారాలు, సంబంధ బాంధవ్యాలు నడిపాయి. పురాతన కాలం నుండి ఈ ద్వీపాన్ని రకరకాల పేర్లతో పిలిచారు. తామ్రపర్ణి, సింహళ ద్వీపం, సిలోన్ పేర్లతో పిలవబడి 1948 నుండి స్వతంత్ర దేశమై 1954 నుండి శ్రీలంకగా అధికారికంగా పిలవబడుతోంది.
ఈ దేశాన్ని స్వాతంత్రం వచ్చిన మొదట సేనానాయకేలు, తర్వాత బండారునాయకేలు, జయవర్ధనే, రాజపక్సేలు ఇతర నాయకులు పాలించారు. ఈ మధ్యనే జరిగిన ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడుగా అనూర కుమార సేనానాయకే ఎన్నిక అయ్యారు.
2019లో కరోనా సమయంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిని IMF, భారతదేశం, మరి ఇతర మిత్రుల సహాయంతో కోలుకున్నది.
కేండీ పరిసర ప్రాంతాల్లో కొద్ది మంది తెలుగువారు వందల సంవత్సరాలుగా తమ తెలుగు సంస్కృతిని భాషను నిలుపుకుంటూ ఉన్నారని విన్నాను. ఈ ప్రయాణంలో, అవకాశముంటే, వారిని కూడా కలవాలని అనుకున్నాను.
అనూరాధపురా, దంబుల్లాలో, కేండీ పరిసరాల్లోని బౌద్ధ ఆరామాలను, వారి చరిత్ర, అలాగే సీతామాత మందిరం, శక్తి పీఠం మొదలైనవి కూడా ఆస్వాదించాలని మనసు ఉవ్విళ్ళూరింది.
రావణ లంక ఈ ద్వీపం కావచ్చునో లేదో కానీ, ఇక్కడ చాలా ప్రాంతాల్లో రామాయణ సంబంధమైన ఆలయాలు ఉన్నవి. ఎన్ని చూడగలనో అనుకుంటున్నాను.
~
21 నవంబరు 2024
మొత్తానికి శ్రీలంక వెళ్ళేరోజు వచ్చేసింది. ముందురోజు రాత్రి బట్టలు సద్దుకొని పడుకొన్నాం. పొద్దునేలేచి నా అలవాటు ప్రకారం 10.5 కిలోమీటర్లు పరిగెత్తి ఇంటికి వచ్చి స్నానంచేసి తయారైపోయాను. మా శ్రీమతి కూడా తన పనులు పూర్తిచేసుకుని సిద్ధమయిపోయింది.
రాపిడోలో కాబ్ బుక్ చేసుకుని 9.30 కల్లా విమానాశ్రయం చేరాము. పగటిపూట కావడంతో అంతర్జాతీయ ప్రయాణాలు ఎక్కువ లేవు. త్వరగానే check-in, customs వగైరాలు పూర్తిచేసుకుని లాంజ్‍లో కూర్చున్నాము. 11.00 గంటల తర్వాత మా గేటు వద్దకు చేరి విమానం ఎక్కాము. సరిగ్గా 12 గంటలకు విమానం బయలుదేరి 1.50 కి కొలంబో చేరింది.
ప్రస్తుతం భారతీయులకు శ్రీలంకలో వీసా అక్కరలేదు. ఇమ్మిగ్రేషన్ వారి దగ్గర మన పాసుపోర్టు, return ticket చూపించితే వారు స్టాంప్ వేసి పంపించేస్తున్నారు. ఆ తర్వాత మా సామాను తీసుకుని బయటికి వెళ్ళగానే మా వాహన సచివుడు (driver) నందన్ మా కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. మన రూపాయలు 1000 మాత్రం శ్రీలంక రూపాయలుగా మార్చుకుని వూరిలోకి బయలుదేరాము.
నందన్ మాతో మాట్లాడుతూ కారు ముందుకు తీసుకువెళ్ళాడు. రెండు రోజుల ముందే వారి కొత్త పార్లమెంటు సభ్యులు ఎన్నిక అయ్యారు. ప్రజలందరు కొత్త అధ్యక్షుడైన అనూర కుమార దిస్సనాయకె గారితో ఆయన పార్టీ అయిన ఎన్ పి పి వారితో చాలా సంతోషంగా ఉన్నట్లు అలాగే వారిమీద చాలా నమ్మకం పెట్టుకున్నట్లు చెప్పాడు. కొలంబో విమానాశ్రయం వూరినుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 10 సంవత్సరాల క్రితం కట్టిన ఎక్స్‌ప్రెస్ రోడ్డు మీద వేగంగా సుమారు 35 నిమిషాల్లో ఊరికి చేరిపోయాము. కొలంబోలో ఒక్క రాత్రి మాత్రమే ఉంటున్నాము కాబట్టి మేము సమయం వృథా చేయకుండా ముందుగా చూడవలసిన ప్రదేశాలు చూసి ఆ తర్వాతే మా బస చేరుకోవాలని నిశ్చయించాము. కొలంబోనగరం సుమారు 23 లక్షల జనాభాతో శ్రీలంకలో అతి పెద్ద నగరం. మన దేశంలోని పెద్ద నగరాలతో పోల్చిచూస్తే ఇది చిన్న నగరమే.
మొదటిగా లోటస్ టవర్ చూశాము. శ్రీలంకలోనే అతి ఎత్తైన భవనం ఇది. ప్రపంచంలో ఇంతకంటే పెద్ద భవనాలను చూసిన మాకు ఇది అంత గొప్పగా అనిపించలేదు. నందన్ కూడా అక్కడ ఎక్కువ సమయం ఉండకుండా ముందుకు వెళ్దామనడంతో త్వరగా సాగిపోయాము. ఆ తర్వాత కోట, WTC, పార్లమెంటు భవనం మొదలైనవి కారులోనుండే చూసి గంగారామయ మహావిహారాయ చేరాము.
కొలంబోలో అతి ముఖ్యమైన బుద్ధ మందిరం ఇది. ఈ దేవాలయము 19వ శతాబ్దంలో కట్టారు. ఇందులో బుద్ధ దేవాలయము, చైత్యము, బోధివృక్షము, బౌద్ధభిక్షువుల సమావేశ మందిరము, బుద్ధుని దంత పేటికయొక్క నమూనా, సంగ్రహాలయము, గ్రంథాలయము, ఇక ఇతర బౌద్ధమత సంబంధ ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడే బ్రహ్మ, విష్ణు, వినాయక, మురుగన్ (కుమారస్వామి) మందిరాలు కూడా ఉన్నాయి. బ్రహ్మ, విష్ణువులు బుద్ధునికి పూజ చేస్తున్న బొమ్మ కూడా చూశాము. బౌద్ధమతంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కుడా దేవుళ్ళే అని అయితే వారు బుద్ధుని కంటే చిన్న దేవుళ్ళు అని ఎవరో అనగా విన్నాను.
ఆ తర్వాత ఇండిపెండెన్స్ స్క్వేరుకు వెళ్ళాము. ఇక్కడ ఇండిపెండెన్స్ మాన్యుమెంట్ చాలా అందంగా కట్టారు. ఇక్కడే శ్రీలంక స్వాతంత్రం బ్రిటీషువారు 1948 ఫిబ్రవరి 4న ప్రకటించారు. ఇక్కడ శ్రీలంక మొదటి ప్రధాని అయిన స్టీఫెన్ సేనానాయకే గారి విగ్రహం నిలువెత్తున చూడసొంపుగా ఉన్నది. మాన్యుమెంట్ లోపల గోడలమీద బౌద్ధకథలు చక్కగా చెక్కబడి బాగున్నాయి.
ఆ తర్వాత విహారమహాదేవి పార్క్ బైటనుండి చూశాము. ఈ పార్కు చాలా పెద్ద పార్కు అయినా గొప్పగా ఏమీ అనిపించలేదు. ఆ తర్వాత అవుకానా బుద్ధ విగ్రహం యొక్క ప్రతిరూపాన్ని(replica) చూసి ఒక శ్రీలంక మెమొంటోలు అమ్మే దుకాణం వద్ద ఆగి మా హోటలు అయిన మిరేజికి చేరాము. నందన్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. మేము కొద్దిసేపు హోటలులో రెస్ట్ తీసుకుని చుట్టు పక్కల చూడడానికి బయలుదేరాము. హోటల్ సముద్రపు ఒడ్డున ఉన్నది.
సన్నగా జల్లు పడుతుండడంతో హోటల్ రెసెప్షన్ వాళ్ళను అడిగితే అక్కడ వాళ్ళు స్వంతం కోసం తెచ్చుకున్న గొడుగులు ఇచ్చారు. ఇక్కడే కాదు, అన్ని చోట్లా అందరూ అడగగానే సహాయకరంగా ఉన్నారు.
నడుస్తూ సుమారు 200 మీటర్ల దూరంలోఉన్న వెల్లవట్టె బీచ్‌కు వెళ్ళాము. అక్కడ కొద్దిసేపు ఉండి పక్కనే ఉన్న వెల్లవట్టె రైల్వేస్టేషన్‌కు వెళ్ళాము. శ్రీలంకన్ రైల్వేలు పూర్తిగా Broad Gauge లోనే ఉన్నాయి. విద్యుదీకరణ ఇంకా జరగలేదు, అయితే అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విన్నాను. వెల్లవట్టె నుండి ఒక లోకల్ ట్రైన్ తీసుకుని ప్రయాణం చేసి చూడాలని అనిపించింది. అక్కడనుండి 2 స్టేషన్ల వరకు టికెట్ తీసుకుని, ట్రైన్ ఎక్కాము. ట్రైన్ సాయంత్రం ఆఫీసులనుండి ఇళ్ళకు వెళ్ళే ప్రయాణీకులతో కిటకిటలాడిపోతోంది. అతికష్టం మీద ఎక్కి వేళ్ళాడుతూ 2 స్టేషన్ల అవతల మౌంట్ లవనియా స్టేషన్లో దిగాము. అక్కడ మళ్ళీ టికెట్ తీసుకుని తర్వాతి ట్రైన్లో తిరిగి వచ్చాం. తిరిగి వచ్చేప్పుడు ట్రైన్ చాలా ఖాళీగా ఉన్నది. ఈ విధంగా శ్రీలంకలో Local Transportలో అందులోనూ ట్రైన్లో ప్రయాణంకూడా అనుభవించగలిగాము.
అక్కడ రోడ్డుమీద తమిళ రెస్టారెంటులు చాలా కనిపించాయి. కొలొంబో నగరం 12 భాగాలుగా విభజించబడింది. మేమున్న కొలొంబో-6 ప్రాంతంలో శ్రీలంక తమిళులు ఎక్కువ అని నందన్ మాతో తర్వాత చెప్పాడు.
హోటలుకు తిరిగివచ్చి భోజనం చేశాము. వాళ్ళ బఫేలో భారతీయ వంటలే ఎక్కువ ఉన్నయ్యి. శ్రీలంక ప్రాంతీయ వంటలు తినాలని అనుకున్న మాకు నిరాశ తప్పలేదు.
తర్వాత మరికొన్ని రూపాయలు శ్రీలంక రూపాయలలోకి మార్చుకోవాలని హోటల్ వాళ్ళని అడిగితే దగ్గరలోని మెయిన్ రోడ్డుకు వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళితే చాలావరకు తమిళుల దుకాణాలు, తమిళులు కనిపించారు. అక్కడే మరి కొన్ని రూపాయలు మార్చుకుని హోటలుకు తిరిగివచ్చాము.
ఇంక ఆ రాత్రికి విశ్రాంతి తీసుకుని నిద్రపోయాము. ఈ విధంగా మాకు శ్రీలంకలో మొదటి రోజు సంతృప్తికరంగానే గడిచింది.
22 నవంబరు 2024
ఈ రోజు శ్రీలంకలో మాకు రెండో రోజు. పొద్దునే అలవాటు ప్రకారం నాలుగున్నరకే నిద్రలేచాను. ఇక డైరీ రాస్తూ, laptopలో ఏవేవో చూస్తూ చాలాసేపు కాలం గడిపాను. ఇందిర ఆరు గంటలకు లేచిన తర్వాత ఇద్దరం కొద్దిసేపు బీచ్ వైపు నడక చేసి తిరిగివచ్చాం. అప్పటికి ఏడున్నర అవడంతో అల్పాహారం చేసి రూమ్‌కు వచ్చాము. ఇక తయారై మా డ్రైవర్ కోసం ఎదురుచూశాం.
అతను రాగానే రూమ్ ఖాళీ చేసి సుమారు 9.30 కు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు సుమారు 200 కిమీ దూరంలో ఉన్నఅనూరాధపురా చేరాం. రాష్ట్రీయ రహదారులైనా శ్రీ లంకలో అన్నీ 2 Lanes మాత్రమే ఉండటం వల్ల చాలా ఎక్కువ సమయం పట్టింది. దారిలో కూడా చాలాసార్లు గట్టిగా వాన పడుతూ ఆగుతూ ఉంది.
అనూరాధపురా శ్రీలంకకు సుమారు క్రీ పూ 500 నుండి క్రీ శకం 993 వరకు రాజధానిగా ఉన్నది. చోళుల దండయాత్రలో దెబ్బతిని మెల్లగా శిథిలమైపోయింది. తిరిగి బ్రిటిష్ వారు 19వ శతాబ్దంలో ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టి అనేక చారిత్రక స్తూపాలను వెలికి తీశారు. మా యాత్రలో మేము ముఖ్యంగా చూడాలని అనుకున్న ప్రదేశం ఇది.
అనూరాధపురాలో Walkers Restaurante లో భోజనం చేసి ముందుగా రువాన్వెలి మహా శేయ లేక మహా స్తూప అనే మహా స్తూపానికి వెళ్ళాం. ఇది శ్రీలంకలో బౌద్ధులకు అతిముఖ్యమైన తీర్థయాత్రా ప్రదేశము. ఈ దేశ ప్రజలు అనేకసార్లు ఇక్కడకు వచ్చి పూజించి వెళ్తుంటారు. ఆ తర్వాత అశోకుని కుమారుడైన మహేంద్రుడు తెచ్చి నాటినట్లు చెబుతున్న బోధివృక్షాన్ని చూశాము. అతడు బుద్ధగయలోని బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధివృక్షం నుండి ఒక కొమ్మ తీసుకువచ్చి ఇక్కడ నాటినదే ఈవృక్షం అని నమ్ముతారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయస్సు కలిగిన వట వృక్షంగా దీనిని చెబుతారు.
ఆపైన తూపారామయ, అభయగిరి, లంకారామయ స్తూపాలను, కుట్టం పొకునా జంట రాజ జలాశయాలను, ఇంకా మిగిలిఉన్న అనేక శిథిలాలను చూసి సాయంత్రం 5.30 గంటలకు మా రాజరత హోటలుకు చేరాము. ఏడున్నర తర్వాత రాత్రి భోజనం, కొద్ది నడక చేసి మా రూముకు చేరాము. అదేమిటో ఇక్కడ రాత్రి ఎనిమిదిలోపలే అందరూ ఇళ్ళకు చేరి విశ్రాంతి తీసుకుంటారులా ఉన్నది. రోడ్లు అన్నీ అప్పటికే చాలావరకు నిర్మానుష్యంగా అయిపోయాయి. రేపు పొద్దున త్రింకోమలిలోని శక్తిపీఠం చూడడానికి వెళ్ళాళని అనుకున్నాము.
23 నవంబరు 2024
ఈరోజు పొద్దునే లేచి ఇద్దరం కొంచెం ఎక్కువ దూరం నడిచి వచ్చాము. ఆ తర్వాత హోటల్లో అల్పాహారం తీసుకున్నాము. ఈ హోటల్లో భోజనంగాని అల్పాహారంగానీ బాగున్నాయి. శ్రీలంకలో ఇడియాప్పం ఎక్కువగా అల్పాహారంలో తింటారులా ఉన్నది. అలాగే కిరిబాత్ అనే కొబ్బరిపాలు, బియ్యంతో చేసే వంటకం కూడా చాలా బాగుంది. ఇవి కాక శ్రీలంక అల్పాహారంలో దోశలు, బ్రెడ్ ఎక్కువగా తింటారట.
8.30 కు బయలుదేరి సుమారు 10.30 గంటలకు త్రింకోమలి చేరాము. దారిలో వాహన సంచారము చాలా తక్కువగా ఉన్నది. ఈ ప్రాంతం ఒకప్పుడు LTTE వారి చేతిలో ఉండేదని, రాత్రిపూట ప్రయాణం చేయడానికి వీలుండేది కాదని చెప్పాడు నందన్. పగటి పూట కూడా వారి టోల్ గేట్లు దారిలో చాలా చోట్ల ఉండి అందరిని చాలా జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే పంపేవారని చెప్పాడు.
త్రింకోమలి అసలుపేరు తిరుక్కోనమలై, తెలుగులో చెప్పాలంటే శ్రీ కోనేశ్వర కొండ. బ్రిటిష్ వారికి ఈ తమిళ పేరు సరిగ్గా పలకడం చేతకాక ట్రింకోమలీ అని అన్నారు. ఈ పట్టణం బహు ప్రాచీనమైనది. క్రీ పూ 600 కాలం నుండే ఈ పట్టణం ఉండేదనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఈ వూరిలో కోనేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి. ఇక్కడే శక్తి పీఠం కూడా ఉన్నట్లు పురాణాల్లో ఉన్నది. ఈ దేవాలయాన్ని దక్షిణ కైలాసం అని కూడా అంటారు. త్రింకోమలి ఒక పెద్ద ఓడరేవుగా కూడా ప్రసిద్ధి.
కోనేశ్వర దేవాలయం ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేది. అనేక పల్లవ, చోళ, పాండ్య రాజులు చాలా దేవాలయాలు ఇక్కడ నిర్మించారట. అయితే పాశ్చాత్యులు వీటిని ధ్వంసం చేసేశారు. ముఖ్యంగా పోర్చుగీసువారు కోనేశ్వర దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసి, ఆ రాళ్ళను తమ కోట నిర్మాణానికి ఉపయోగించారు. ఇక్కడి శిల్పాలు, ప్రాచీన శాసనాలు కొన్ని ఇప్పటికీ లిస్బన్ లోని సంగ్రహాలయంలో ఉన్నాయి. పోర్చుగీసువారు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి ముందు అక్కడి భక్తులు కొందరు దేవతామూర్తులను రహస్యంగా భూస్థాపితం చేశారు. ఆ మూర్తులు 1950లలో ఒక బావి తవ్వుతుండగా దొరికినయ్యి. వాటిని ఊరేగింపుగా తీసుకువచ్చి, తిరిగి గుడిలో ప్రతిష్ఠించారు.
ఇదే దేవాలయంలో శాంకరీదేవి శక్తిపీఠం కూడా ఉన్నది. దక్షయజ్ఞ సమయంలో సతీదేవి యజ్ఞవాటికలో దూకి మరణించిన తర్వాత శివుడు సతీదేవి శరీరాన్ని తన భుజంపై వేసుకుని తిరుగుతున్నపుడు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని 18 ముక్కలు చేశాడంటారు. ఆ 18 ముక్కలు భూమిమీద పడిన ప్రదేశాలనే శక్తిపీఠాలని అంటారు. ఇక్కడ సతీదేవి వూరుభాగం పడిందట. అలాగే ఇక్కడే రావణుడు పార్వతీదేవిని పూజించి ఇక్కడ నిలవమని కోరాడట.
ఇక్కడి పాత గుడిని పోర్చుగీసువారు ధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ విగ్రహాలు బయటపడిన 1950ల్లో కొత్త గుడిని కట్టారు. గుడి సముద్రంలోకి చొచ్చుకుపోయిన భూభాగంలో కొండ శిఖర భాగంలో ఉన్నది. ఇక్కడ బోలెడన్ని జింకలు యాత్రికులకు భయపడకుండా తిరుగుతున్నాయి.
గుడిలో నాలుగైదుచోట్ల నిశ్శబ్దం అని తెలుగులో రాసి ఉన్నది. మిగిలిన అన్ని రాతలు తమిళంలో ఉండి అది ఒక్కటిమాత్రం తెలుగులో ఎందుకు రాశారో మాకు అర్థం కాలేదు.
గుడికి వెళ్ళే దారిలోనే ఫ్రెడెరిక్ ఫోర్ట్ అనే పోర్చుగీసువారు నిర్మించిన కోట కూడా ఉన్నది. ఈకోట పోర్చుగీసువారి తర్వాత డచ్ వారి చేతికి వచ్చినందున దీనిని డచ్ కోట అని కూడా అంటారు. ఆ తర్వాత త్రింకోమలీ బీచ్‌లో కొద్దిసేపు ఉండి వెనక్కు బయలుదేరాము.
తిరిగి వెళుతున్నపుడు అనూరాధపురా దగ్గరలోనే భోజనంచేసి అనూరాధపురా సంగ్రహాలయం(museum)కు వెళ్ళాము. అక్కడ అనేక వస్తువులు, తవ్వకాల్లో లభించినవి, మరి అక్కడి చరిత్ర, నాణాలు, శాసనాలు మొదలైనవి చూశాము. ఆ తర్వాత ఇంకా మిగిలిన జేతవనారామయ, అసురమునియా దేవాలయము, మరి కొన్ని ఇతర ఆరామాలను చూశాము.
ఇంక ఆరోజు పర్యాటనకు శలవు చెప్పి హోటలుకు చేరి విశ్రాంతి తీసుకున్నాము. ఈరోజు రాత్రి కూడా భోజనం తర్వాత నిన్నటికంటే ఎక్కువ దూరం నడిచి తిరిగివచ్చాం.
24 నవంబరు 2024
ఈరోజు పొద్దునే లేచినా, వాన పడుతుండడం వల్ల నడవలేక పోయాను. తయారయి, అల్పాహారం తిని 8.30 గంటలకల్లా కారు ఎక్కాం. 9.30 గంటలకు దంబుల్లా చేరాం.
దంబుల్లా శ్రీలంకకు సుమారు మధ్యభాగంలో ఉన్న పట్టణం. క్రీ పూ 1వ శతాబ్దంలో వలగాంబా మహారాజుకు ఇక్కడ గుహల్లో తపస్సు చేసుకుంటున్న బౌద్ధ భిక్షువులు ఆశ్రయం ఇచ్చారు. మహారాజు తన సింహాసనం తిరిగి పొందిన తర్వాత ఇక్కడ గుహల్లో అద్భుతమైన బౌద్ధ శిల్పాలు, కథలు చెక్కించారు, బొమ్మలు గీయించారు. ఇక్కడ మొత్తం 153 బుద్ధ విగ్రహాలు వివిధ ప్రకారాలుగా ఉన్నాయి. మహావిష్ణువు, వినాయకుడు విగ్రహాలు కూడా ఉన్నాయి. 11వ, 12వ మరియు 18వ శతాబ్దాల్లో ఇక్కడి బొమ్మలకు తిరిగి రంగులు వేయడం జరిగింది.
కొండమీదికి వెళ్ళడానికి సుమారు 350 రాతిమెట్లు ఎక్కవలసింది. మేము టికెట్లు తీసుకుని సన్నని వానలో అక్కడక్కడా జారుతున్న మెట్లమీద జాగ్రత్తగా వెళ్ళాము. పైకి వెళుతున్నపుడు చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. పైన మొత్తం 6 గుహల్లో ఉన్న శిల్ప సౌందర్యం చెప్పనలవి కాదు. పైకి మొత్తం 3 దారులు ఉన్నాయని తెలిసింది. మేము వెళ్ళినదారినే తిరిగి వెళ్ళాము మా కారు అక్కడే ఉండడం వల్ల.
ఆ తర్వాత స్పైస్ విలేజ్‌కు వెళ్ళాము. శ్రీలంక మొడటినుండి రకరకాల సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి. స్పైస్ విలేజ్‌లో జనక్ అనే గైడ్ మాకు అక్కడ దొరికే అనేక సుగంధ ద్రవ్యాల మొక్కలను, వాటి విశిష్టతనూ చూపించి వివరించి కొండొకొచో రుచి కూడా చేయించాడు. వారి దుకాణంలో కొన్ని సుగంధ ద్రవ్యాలు కొని కేండీ బయలుదేరాము.
కేండీ నగరం శ్రీలంకలో కొలొంబో తర్వాత రెండో ముఖ్య పట్టణం. కేండీ పేరు కండ ఉడ రత అనే సింహళ పేరు నుండి వచ్చింది. కండ ఉడ రత అంటే కొండల మధ్య ఉన్న చదునైన ప్రదేశం. పోర్చుగీసువారు దీనిని కాండియా అని పిలువగా బ్రిటీష్ వారు కేండీ అని ఇంకా చిన్నది చేశారు. కొలొంబోకు ముందు సుమారు 350 సంవత్సరాలు శ్రీలంక రాజధానిగా కేండీ ఉండేది. ఇది బుద్ధుని దంత పేటిక ఉన్న నగరం. స్థానికులు కేండీని మహా నువారా అని నువారా అని పిలుస్తారు. సింహళభాషలో నువారా అంటే నగరం అని అర్థం.
మద్యాహ్నం సుమారు ఒంటిగంటకు కేండీ చేరి అలోయ్ రెస్టారెంట్లో భోజనం చేశాము. దగ్గరలోనే ఉన్న జెమ్ ఫాక్టరీలో రకరకాల రత్నాలు ఎలా భూమినుండి తీసి శుభ్రంచేసి ఆభరణాల కోసం సిద్ధం చేస్తారో చూశాము. శ్రీలంక రకరకాల రత్నాలు, ఇతర మణిమాణిక్యాలకు ప్రసిద్ధి. ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడకు వచ్చి వాటిని కొనుక్కుంటూ ఉంటారు. మేమూ యేమైనా కొందామని అనుకున్నాము కానీ వాటి నాణ్యత ఎలా తెలుసుకోవాలో అర్థం కాక వూరుకున్నాము. సమయం మించిపోవడంతో దంతపేటిక దేవాలయాన్ని ఈరోజు చూడలేకపోయాం.
ఆ తర్వాత బొటానికల్ గార్డెన్ బైటనుండే చూశాము. చెక్క బొమ్మల కేంద్రం చూసి, ఓక్ రే రీజెన్సీ హోటల్లో కేండీ సాంప్రదాయ నృత్యం చూశాం. నృత్యం చాలా బాగా చేశారు. ఆపైన మాబస అయిన ఎర్ల్స్ రీజెంట్ కేండీ హోటల్‌కు చేరి విశ్రాంతి తీసుకున్నాము. రాత్రి భోజనం తర్వాత వాన పడుతుండడంతో నడకకు వెళ్ళలేకపోయాము.
కేండీ పరిసరాల్లోని తెలుగువాళ్ళను కలవగలిగితే బాగుండునని అనుకున్నాను కానీ సమయం లేకపోవడం, ఎవరిని అడిగితే తెలుస్తుందో అర్థం కాక ఊరుకున్నాను. మా గైడు నందన్ కూడా ఏమీ చెప్పలేకపోయాడు.
25 నవంబరు -24
ఈరోజు కూడా పొద్దునే లేచినా వాన పడుతుండడంతో నడకకి వెళ్ళలేదు. అయితే మా హోటల్ పక్కనే ఉన్న మహావెలి గంగానది దృశ్యాలు చూశాము. ముసురుపట్టిన వాతావరణంలో సన్ననివానలో నది మెలికలు తిరుగుతూ ప్రవహిస్తూ అందంగా ఉన్నది. మహావెలి గంగ చిన్ననది అయినా శ్రీలంకలో ఉన్న నదులన్నిటిలోను పెద్దది.
ఈ రోజు పొద్దునే తయారై 8:30 కల్లా బయలుదేరాము. ముందుగా కేండీలోని దంత దేవాలయం అంటే శ్రీ దలద మలిగావా అనే టెంపుల్ ఆఫ్ టూత్ రెలిక్ కు చేరాము. నందన్ ఈదేవాలయంలోపల మేము కొలొంబోలో చూసిన దేవాలయంలాగే ఉంటుందని చెప్పడంతో బైటనే కొద్దిసేపు చూసి బయలుదేరాము. ఇక దారిమొత్తం అందమైన తేయాకు తోటలు చూస్తూ కొండలపై నువారా ఎలియ దారి పట్టాము.
దారిలో ముందుగా వచ్చిన హనుమాన్ దేవాలయము దగ్గర ఆగాము. గుడి చాలా చక్కగా ఉన్నది. అయితే మేము వచ్చిన సమయంలో దేవుని హారతి ఉండడంతో ఒక గంట సేపు మూలవిరాట్టుకు తెర వేసి కప్పేశారు. అందువల్ల మూలవిరాట్టును చూడలేక పోయాము. అక్కడ కొద్దిసేపు ఉండి హనుమాన్ చాలీసా చదివి తిరిగి బయలుదేరాము. ఈ గుడిని చిన్మయ ఫౌండేషన్ వాళ్ళు నడుపుతున్నారు. ఇక్కడ భోజనం చాలా బాగుంటుందని విన్నాను. మేము వచ్చిన సమయం భోజన సమయం కాకపోవడంతో ఇక్కడ తినలేకపోయాము.
ఆ తర్వాత మినీ జలపాతాన్ని, మరి కొన్ని జలపాతాలను వ్యు పాయింట్ నుండి చూశాము. ఇంకొంచెం ముందుకు వెళ్ళి రంబోడా జలపాతం దగ్గర ఆగి కొన్ని ఫొటోలు తీసుకున్నాము. మరికొంత ముందుకు వెళ్ళి దామ్రో వారి తేయాకు కర్మాగారము వద్ద ఆగాం. అక్కడ ఒక గైడు అమ్మాయి గబగబ వాళ్ళు తేయాకు తయారు చేసే ప్రక్రియను చూపించి మమ్మల్ని వాళ్ళ దుకాణం వద్ద వదిలేసింది. దామ్రో కంపెనీ శ్రీలంకలో తేయాకు తయారు చేసే ఒక పెద్ద కంపెనీ. దామ్రో వాళ్ళ ఫర్నిచర్ మరి ఇతర వస్తువులు మన దేశంలో కూడా ప్రసిద్ధి.
ఇక అక్కడనుండి బయలుదేరి నువారా ఎలియా పట్టణం మధ్యగా విక్టోరియా పార్కును గోల్ఫ్ కోర్స్‌ను, గ్రెగొరీ సరస్సునూ చూస్తూ సీతా అమ్మవారి దేవాలయము చేరాము.
ఇక్కడి సీతా అమ్మన్ దేవాలయము చాలా ప్రసిద్ధి చెందింది. రావణుడు సీతను ఉంచిన అశోకవనం ఇదని ప్రజలు నమ్ముతున్నారు. ఆలయం చిన్నగానే ఉన్నది. 200 ఏళ్ళ క్రితం ఇక్కడ కేవలం రాళ్ళతో గుర్తులు పెట్టిఉన్న ప్రదేశాన్ని చూసి ఇక్కడ తేయాకు తోటలలో పనిచేయడానికి వచ్చిన తమిళులు చిన్నగా గుడికట్టి కాలక్రమేణా పెద్దది చేస్తున్నారు. ప్రపంచంలోనే సీతా అమ్మవారికి కట్టిన ఒకే ఒక్క దేవాలయము ఇది. ఇక్కడ అమ్మవారికి, రాములవారికి మరి హనుమంతునికి అర్చన చేశాము. ఆపైన నది దాటి అవతల ఉన్న అశోకవనంలో అమ్మవారు కూర్చున్న ప్రదేశాన్ని హనుమంతుని పెద్ద పాద ముద్రను చూశాము. ఆ తర్వాత రాక్షస స్త్రీల కాపలాలో అమ్మవారు స్నానం చేసినట్లు చెబుతున్న నదిని చూశాము. ఇప్పుడు ఈ నదిని సీతానది అని పిలుస్తున్నారు. కొద్ది దూరంలో రావణ ఎల్లా అని రావణుడు రోజూ స్నానం చేసిన పెద్ద జలపాతం ఉన్నదట. మాకు వెళ్ళడానికి వీలుపడలేదు.
ఈ ఊరు కొండలపై ఉండడంతో స్ట్రాబెర్రీ తోటలు కూడా ఎక్కువ. అందువల్ల ఒక స్ట్రాబెర్రీ తోటకూడా చూసి ఆపైన ఇండియన్ సమ్మర్ అనే రెస్టారెంటులో భోజనం చేశాము. చెఫ్ వచ్చి భోజనం ఎలా ఉన్నదని అడిగి మా సలహాలు తీసుకున్నాడు. ఇక్కడే కాదు మేము భోజనం చేసిన ప్రతి హోటలులోనూ ఇలాగే చెఫ్ వచ్చి మంచిచెడ్డలు అడిగి సలహాలు తీసుకున్నారు. అంతేకాదు, మాకు కావాల్సిన వెజిటేరియన్ వంటలకోసం, పెరుగు కోసం ప్రత్యేకంగా వారికి వీలైనంతవరకు చేసిపెట్టారు.
దేశం మొత్తానికి కావాల్సిన కూరగాయల్లో చాలా భాగం నువారా ఎలియా ప్రాంతంలోనే పండుతాయని విన్నాను.
ఆ తర్వాత గ్రెగొరీ సరస్సు వద్ద కొద్ది సమయం ఉండి మా చివరి బస అయిన అరాలియ రెడ్ హోటలుకు చేరాము. మా సచివుడైన నందన్ అప్పటికే చలి చలి అని అంటున్నాడు. కొంత చల్లగా ఉన్నా మాకైతే మరీ చలిగా అనిపించలేదు. హోటల్ రూం లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని town centerకు బయలుదేరాము. వాన కొద్దిగా వస్తుండడంతో హోటలు వాళ్ళ దగ్గర ఒక గొడుగు కూడా తీసుకుని వెళ్ళాము. ఈ ఊరిలో భారతదేశం నుండి వచ్చిన తమిళులు చాలా ఎక్కువ. కొద్దిసేపు తిరిగి అక్కడ ఒక పెద్ద పోస్ట్ ఆఫీసు కనిపిస్తే అక్కడ ఒక శ్రీలంక పెయింటింగు కొనుక్కుని తిరిగి హోటలు చేరాము. రాత్రి భోజనము చేసి, వాన వస్తుండడముతో హోటలులోనే కొద్దిసేపు నడిచి రూము చేరాము. ఇక అంతటితో విశ్రాంతి తీసుకుని నిద్ర పోయాము.
రేపు 6:30 కల్లా బయలుదేరి విమానాశ్రయం వెళ్ళాలి. అందువల్ల హోటలువారిని మాకోసం breakfast ప్యాక్ చేసి అప్పటికి సిద్ధంగా ఉంచమని చెప్పాము.
26 నవంబరు -24
ఈ రోజు పొద్దునే 4.30 కు లేచి తయారై 6:30 కల్లా బయలుదేరాము. రాత్రి అంతా బాగా వాన పడుతూ ఉంది. కొండలమీద ఉన్నాము, landslides ఉంటవేమో అని భయపడ్డాము. నందన్ కూడా దగ్గర దారి తీసుకోకుండా దూరం ఎక్కువైనా highway తీసుకున్నాడు. నందన్ చేసినపనే సరి అయింది. దారిలో అనేక ప్రదేశాలలో landslides, చెట్టు కొమ్మలు విరిగి పడి ఉన్నాయ్యి కానీ highway కావడంతో అప్పటికే డిపార్టుమెంటువాళ్ళు వాటిని పక్కకు తీసివేశారు. అందువల్ల ఎక్కువ ఇబ్బంది లేకుండానే కొండలు దాటి కేండీ కంటే ముందుగా వచ్చే పెరడేనియా చేరాము. అక్కడ ట్రాఫిక్‌లో కొంతసేపు ఇరుక్కున్నాము. ఇక్కడే తెలిసింది, మన వాళ్ళలాగే ట్రాఫిక్ జామ్ అయితే వీళ్ళు కూడా ఎదురువచ్చే వాళ్ళకుకూడా దారి ఇవ్వకుండా అడ్డం వెళ్ళిపోతారు. తర్వాత రైలు గేటు దగ్గర కూడా అలాగే చూశాను.
అది దాటి పిలిమథాలవా అనే వూరిలో కార్గిల్ సూపర్ మార్కెట్ వద్ద కొద్దిసేపు ఆగాము. అక్కడే మా అల్పాహారం కూడా ముగించి ఇంక ఎక్కడా ఆగకుండా కొలొంబో విమానాశ్రయం 11.30 గంటలకు చేరాము.
త్వరగా చెక్ ఇన్ చేసి లోపలకు వెళ్ళాము. కొలొంబో విమానాశ్రయము మన హైదరాబాదు విమానాశ్రయము కంటే చిన్నదే. కానీ లోపల డ్యూటీ ఫ్రీ, మరి ఇతర దుకాణాలు చాలా ఉన్నయ్యి. అన్నిచోట్ల రేట్లు డాలర్లలో రాశారు, శ్రీలంక రూపాయలలో రాయలేదు. వస్తువుల ధరలు బైటికంటే రెండు మూడు రెట్లు ఉన్నయ్యి. లిక్కర్ రేట్లు మాత్రం అక్కడ డ్యూటీ ఫ్రీలో మన దేశంలోకంటే తక్కువ ఉన్నట్లు హైదరాబాదు వచ్చిన తర్వాత అర్థ మయింది. మేము ఏమీ కొనుక్కోకుండా లాంజ్‌కి వెళ్ళి అక్కడ రెండు గంటలవరకు ఉన్నాము.
ఆ తర్వాత మా గేటులోగుండా విమానం ఎక్కి మధ్యాహ్నం 3గంటలకు బయలుదేరి 4.50కల్లా హైదరాబాదు చేరాము.
ఇంతటితో మా శ్రీలంక ప్రయాణం ముగిసింది.
ముగింపు
గొప్ప చరిత్ర కలిగిన శ్రీలంక దేశాన్ని ఇంతకాలానికి చూడగలిగాను. చిన్న దేశం, సుమారు 2.2 కోట్ల జనాభా ఉన్నది. దేశప్రజలు రూపురేఖలు, వేషభాషలు సుమారుగా మన లాగే ఉన్నా వారి ప్రత్యేక భాష, లిపి, మతం, సంప్రదాయాలు ఉన్నాయి. శుభ్రత మన కంటే చాలా ఎక్కువగా ఉన్నది. రహదారులు మన కంటె చిన్నవైనా గతుకులు బాగా తక్కువ. Traffic Discipline మనకంటె బాగా ఎక్కువ. మనుషులు మర్యాదగా, గౌరవంగా ఉన్నారు. రోడ్డుమీద అయినా షాపుల్లో అయినా ఎక్కడ అయినా తెలియనివి అడిగితే తొందరగా సహాయం చేస్తున్నారు. మనలాగే చాలామందికి ఇంగ్లీషు వస్తుంది.
భోజనం ఖర్చు మన కంటె బాగా తక్కువగా ఉన్నది. పెద్ద రెస్టారెంటుల్లో కూడా మన దగ్గరకంటే చాలా తక్కువే భోజనం ఖరీదు అవుతోంది. ఉదాహరణకు ఇండియన్ సమ్మర్ రెస్టారెంట్ కొంచెం ఘనమైనదైనా మా ఇద్దరికి 3200 Srilankan Rupees అయింది. ఇది మన రూపాయల్లో 1000 కంటే తక్కువ. మేము అక్కడ starter, main course, milk shake తీసుకున్నా అంతే అయింది. మిగిలిన ప్రదేశాల్లో కూడా అలాగే తక్కువ అయింది.
శ్రీలంక సుగంధ ద్రవ్యాలకు, మణిమాణిక్యాలకు బాగా ప్రసిద్ధి. పర్యాటక రంగం చాలా బాగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం భారతీయులకు వీసా అవసరంలేదు. Passport, Return flight ticket చూపిస్తే stamp వేసి లోనికి రానిస్తున్నారు. నవంబరు, డిసెంబరు కాలంలో వానలు ఎక్కువ. మేము ఉన్నన్నిరోజులు ప్రతిరోజూ వాన పడుతూ ఉన్నా ఎక్కువ ఇబ్బంది పడలేదు.
శ్రీలంకలో మేము చూసినవి చాలా కొద్ది ప్రదేశాలు మాత్రమే. ఇంకా అనేక గొప్ప పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ సమయాభావం వల్ల చూడలేకపోయాము. బెంటోటా, గల్లె, సిగిరియ, జాఫ్నా, అనేక అడవి సఫారీలు ఇంకా మరెన్నో చూడదగిన ప్రదేశాలు ఉన్నయ్యి. ఓడమీద వెళ్ళే సరదా ఉన్నవారికి లగ్జరీ క్రూయిస్‌లు ఉన్నాయి. ఇక్కడ కాసినోలు కూడా చాలా పేరు పొందాయి. కొంతమంది మన దేశమునుండి కేవలం కాసినోలో ఆడడానికి మాత్రమే వెళుతున్నారంటే ఆశ్చర్యపోనక్కరలేదు.
వారి వంటలు కూడా సుమారుగా మనలాగే అన్నం కూరలతో ఉంటయ్యి. పెరుగు ఎక్కువ తినరు. అల్పాహారంలో దోశలు, వడలు బాగా కనిపించినయ్యి. ఇడ్లీలు కనిపించలేదు. ఆడవారు ఎక్కువగా పాశ్చాత్య దుస్తులే వేసుకుంటారు. అక్కడక్కడా మామూలు చీరలు, కేండీ సాంప్రదాయ చీరలు ధరించినా అది తక్కువే. చూడీదారులు వేసుకోవడం కూడా తక్కువే అనిపిస్తోంది.
శ్రీలంక టైం జోన్ మన టైం జోన్ ఒకటే. అందువల్ల మనకు టైం మార్చుకోవాల్సిన అవసరం లేదు. జెట్ లాగ్ ఇబ్బంది కూడా లేదు. వాతావరణం పూర్తిగా మనలాగే ఉన్నది. నువారా ఎలియాలో మాత్రం కొండలమీద ఉండడంవల్ల సుమారు ఊటీ లాగా ఉన్నది.
ఇక్కడి ప్లగ్ పాయింట్లు బ్రిటిష్ పద్ధతిలో ఉన్నయ్యి. అందువల్ల మన దేశమునుండి వచ్చేవాళ్ళు అందుకు తగ్గట్లు ప్లగ్ కన్వర్టర్ తెచ్చుకుంటే మంచిది.
ఈ దేశం ఆర్థికంగా టీ, రబ్బరు, మాణిక్యాలు, సుగంధ ద్రవ్యాలు ఇంకా బట్టల తయారీ, మరి పర్యాటక రంగంలో బాగా ఉన్నది. 2019లో ఆర్థిక సంక్షోభం సంభవించినా ఇప్పుడు చాలావరకు కోలుకున్నది.
ఈ దేశ అధ్యక్షుడు చాలా నిరాడంబరమైన వ్యక్తి గానూ వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ విధంగానే అ మొన్ననే జరిగిన చట్ట సభల ఎన్నికలలో అతని వర్గం ఎక్కువ స్థానాలు గెలుచుకున్నది. ఈ దేశంలో మన Bajaj Auto, Tata Commercial Vehicles, Ashok Leyland Bus లు చాలా కనిపిస్తుంటాయి.
Traffic discipline మన కంటే చాలా బాగా ఉన్నది. స్కూటర్ల మీద అందరూ హెల్మెట్లు పెట్టుకుంటున్నారు వెనక కూర్చునేవాళ్ళతో సహా. కొన్నిసార్లు triples కూర్చున్నా ముగ్గురూ హెల్మెట్లు పెట్టుకుంటున్నారు. ఇక్కడ triples కూర్చోవచ్చేమో!
ఇంకా ఎంతో చెప్పాలని ఉన్నది. ఏది ఏమైనా శ్రీలంక అద్భుతమైన ప్రదేశం. అందరూ వెళ్ళదగిన చూడచక్కని దేశం.
తూనుగుంట్ల రాజేంద్ర, ఉమ్మడి గుంటూరు జిల్లా మామిళ్ళపల్లి గ్రామంలో 1966 ఆగస్టు 27న జన్మించారు. భట్టిప్రోలు స్వగ్రామం. ప్రస్తున నివాసం హైదరాబాదు నగరం.
మొదటినుండి సాహిత్యాభిలాషి, చిన్న కథలు, కవితలు రాస్తుంటారు. యాత్రా సాహిత్యం, చరిత్ర యెక్కువగా అభిమానిస్తుంటారు. ‘మా శ్రీలంక యాత్ర’ వారి మొదటి ప్రచురణ. అనేక యాత్రాకథనాలు రాసిన దాసరి అమరేంద్ర గారు ఈ రచనకు స్పూర్తి.