[శ్రీమతి శ్రావణి జన్నాభట్ల రచించిన ‘మామూలే’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“ఇదివరకు లాగా లేదు. అరే తనకున్న జాబ్ టెన్షన్ అంతా నా మీద చూపిస్తే ఎలా? ఈవెన్ ఐ యామ్ ఏ వర్కింగ్ ఉమెన్. అదనే కాదు ప్రతిదానికి ఏదో ఒక మిస్ అండర్స్టాండింగ్ వస్తూనే ఉంది. ఏ విషయంలోనూ ఇద్దరి అభిప్రాయాలు కలవట్లేదు. లెట్ ఇట్ అండ్ హియర్. చాలా చాలా ట్రై చేసాను నాన్న. బట్ ఇంక నావల్ల కాదు”.
“ఏం మాట్లాడుతున్నావ్ అద్విక. ఒక రిలేషన్‌ని బ్రేక్ చేసుకోవడం కొద్ది నిమిషాల పని. కానీ దానివల్ల ముందు ముందు లైఫ్‌లో ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలుసా? అర్జున్‌తో నేను మాట్లాడుతాను. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు” కూతురు కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలనే తండ్రి తాపత్రయం అతని మాటల్లో కనిపిస్తోంది.
“నాన్నా! మీరు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో డివర్స్ అనేది చాలా మామూలు విషయం”.
“ఇంక చాలు ఆపు. అరే ఎంత మంచివాడతను. అసలు ఏమైందని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందామనుకుంటున్నావు చెప్పు?” ఎంతో ఆవేశంగా ఉంది తల్లి నీరజ గొంతు.
“8 మంత్స్ బ్యాక్ అతనికి జాబ్ పోయిందని చెప్పాగా. ఆ పరిస్థితి అతన్ని బాగా డిస్టర్బ్ చేసింది. అప్పటినుంచి అతనిలో చాలా మార్పు వచ్చింది. మా ఆఫీసులో జరిగిన పార్టీ ఫోటోలు చూపిస్తే అవి చూసి ఏదేదో పిచ్చిగా అనుమానంగా మాట్లాడుతున్నాడు.”
చెప్పలేక సోఫాలో కూర్చుని కన్నీళ్లను ఆపుకుంటోంది అద్విక. నీరజ కూతురు పక్కన కూర్చుని ఆమెను ఓదార్చడానికి భుజం మీద చేయి వేసి గట్టిగా పట్టుకుంది.
“నేను అట్లాంటిది ఏమీ లేదు అన్నా నా మాట వినిపించుకోవట్లేదు. ప్రతి చిన్న విషయానికి అనుమానమే. అరే నా ఆలోచనలను, అభిప్రాయాలను కొంచమైనా గౌరవించాలి కదా. ఆ ఇంట్లో నాకు ఏమాత్రం ఫ్రీడం లేదు” కోపంగా మారాయి ఆమె కన్నీళ్లు..
“నేను ఎంత సఫర్ అవుతున్నానో మీకు అర్థం కావట్లేదు అమ్మా. దట్స్ ఓకే. బట్ నేను తీసుకున్న డెసిషన్ అయితే తప్పు కానే కాదు” అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది.
నాలుగేళ్ల క్రితం భర్తతో పడట్లేదు ఇక కలిసి ఉండలేము అని కూతురు అద్విక చెప్పిన మాటలు గుర్తొచ్చాయి తండ్రి జగన్నాథ్‌కి.
***
“ఏవండీ! పూలదండలు, పూలజడ ఇంకా కావాల్సిన విడిపూలు అన్నీ టైం కల్లా అక్కడికి తెచ్చిస్తాడో లేదో కనుక్కున్నారా?” అంటూ జగన్నాథ్‌ని అడుగుతోంది భార్య నీరజ.
ఏమీ సమాధానం చెప్పకుండా ఎక్కడో ఆలోచిస్తున్న జగన్నాథ్‌ని చూసిన నీరజ..
“ఏమీ ఆలోచిస్తున్నారండి?”
“ఒకప్పుడు దానికి ఇష్టం లేదని, ఇబ్బందులు పడుతోందని దాని కష్టం చూడలేక అది అడిగినట్టే విడాకులకు ఒప్పుకున్నాము. ఇప్పుడొచ్చి అతను ఎవరితోనో ఏడాదిగా కలిసి ఉంటున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగిందని రెండో పెళ్లి చేయడానికి రెడీ అయ్యాం. ఈ రోజుల్లో పిల్లలు చెప్పిందే మనం వినాల్సి వస్తోంది. మన గౌరవం, పరువు గురించి వాళ్ళు ఏమీ ఆలోచించట్లేదు. ఈ జనరేషన్‌కి రెండో పెళ్లి అనేది చాలా మామూలు విషయం అయిపోయింది”.
“ఊరుకోండి. ఏం చేస్తాం. ఒకప్పుడు అది ఎంత సఫర్ అయిందో మనతో చెప్పింది కదా. ఇప్పటికైనా దాని లైఫ్ బాగుండాలని ఆశీర్వదిద్దాం” అంటూ ఓదారుస్తూ మాట్లాడుతోంది నీరజ.
కూతురు గదిలోకి వెళ్ళిన తల్లి నీరజ షాపింగ్ కి వెళ్లడానికి తయారవుతున్న అద్విక దగ్గరకు వచ్చి..
“ఇదంతా బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే కదా? మళ్లీ రెండు మూడు ఏళ్ల తర్వాత వచ్చి నా వల్ల కాదు అంటే.. ఆల్రెడీ పరువు అంతా పోయింది” గదిలో ఏదో సర్దుతూ మాట్లాడుతోంది నీరజ.
“వాట్ డు యు మీన్ అమ్మ? నేనేమన్నా కావాలని చేశానా? ప్లీజ్ దయచేసి ఇప్పుడు ఆ బ్యాడ్ మెమరీస్ అన్నీ గుర్తు చేయద్దు. ఈవెన్ నాకు కూడా టెన్షన్ గానే ఉంది. అరే! పరువు అది ఇదని కాదు. నా లైఫ్ బాగుండడం నాకు ముఖ్యం”.
కూతురు మాట్లాడే మాటలకి ఏమీ అనలేక తిరిగి గదిలో నుంచి బయటికి వెళ్లిపోయింది నీరజ.
***
ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకుని మరీ షాపింగ్‌కి తీసుకు వెళ్ళాడు హరీష్.
ఒక పెద్ద వెడ్డింగ్ కలెక్షన్స్ ఉండే షాప్‌కి వెళ్లి ఆమెకు నచ్చిన పట్టుచీరలు, అతనికి కావాల్సిన షేర్వానీ అన్ని కొనుక్కొని పక్కనే ఉన్న షాపింగ్ మాల్ లోని ఫుడ్ కోర్టుకి వెళ్లి కూర్చున్నారు.
“ఎందుకంత టెన్షన్‌గా ఉన్నావు?” అద్వికని చూసి అడుగుతున్నాడు హరీష్.
వేడి వేడి కాఫీని సిప్ చేస్తూ “కమాన్ ఇంతకు ముందంతా వేరు. ఇట్ వస్ యాన్ అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు నీకు నాకు సంవత్సరం నుండి పరిచయం ఉంది. ఇద్దరం కలిసే ఉంటున్నాం కూడా”.
“ఐ నో. అమ్మానాన్న ఇద్దరు నావల్ల చాలా డిసప్పాయింట్ అయ్యారు. అయినా నేనేం తప్పు చేశాననీ?” మిల్క్ షేక్ లో స్ట్రాని తిప్పుతూ మాట్లాడుతోంది అద్విక.
“వాళ్లకి మనకి జనరేషన్ గ్యాప్ ఉంది. సో దే కాంట్ అడర్‌స్టాండ్ అవర్ థాట్స్. మెల్లగా అన్ని అవే సర్దుకుంటాయిలే” అంటూ ఆమె మనసును తేలిక పరచడానికి ప్రయత్నిస్తున్నాడు హరీష్.
“చిన్నప్పటినుంచి నాకేది కావాలంటే అది కొనిపెట్టేవాళ్లు. నేను ఏది చదువుకుంటానంటే అదే చదివించారు. ఆ గౌరవంతోటే వాళ్ళు చూపించిన అబ్బాయినే చేసుకున్నాను. అఫ్‌కోర్స్ మొదట్లో అంతా బానే ఉంది. కానీ తర్వాత ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు” బాధగా ఉంది ఆమె గొంతు.
“ఇదంతా నువ్వు నాకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐ నో ఎవ్రీథింగ్. సరేగాని ఇంకా విషయం వదిలేసి పెళ్లికి మీ చుట్టాల్లో ఎవరెవరు వస్తున్నారు చెప్పు?” అని మనసులోని బాధను తగ్గించడానికి మాట మార్చాడు హరీష్.
“మా మేనమామ ఇంకా పెదనాన్న, బాబాయ్ వాళ్ళు ఇంకా కొంతమంది కజిన్స్ వస్తున్నారు”.
“కూల్. మా అన్నయ్య అయితే కరెక్ట్‌గా పెళ్లిరోజు మార్నింగ్ వస్తున్నా అన్నాడు. ఇన్ఫాక్ట్ తనకి కూడా వన్ ఇయర్ నుంచి ఇట్లాంటి రిలేషన్‌లో ఉన్నానని కోపంగా ఉంది. ఇంకా ఏదో బాగోదు కదా అని తను ఒక్కడే వస్తున్నాడు. ఫ్యామిలీని కూడా తీసుకురావట్లేదు. నిన్న నైట్ నువ్వు చెప్పినట్టే ఈ మంత్ ఎండింగ్‌కి టికెట్స్ బుక్ చేసేసాను. సో ట్రావెల్ కి కావాల్సిన సామాన్లు కూడా సర్దుకుంటూ ఉండు.”
“అలాగే” అంది నవ్వుతూ అద్విక.
***
పెళ్లిరోజు రానే వచ్చింది. వచ్చిన చుట్టాలు, అతిథులందరికీ వీళ్ళకి ఇది రెండో పెళ్లేనా అనే అనుమానం వస్తోంది. నచ్చి పిలుచుకున్న కొద్దిమందితో ఎంతో వైభవంగా జరుపుకున్నారు వాళ్ళ పెళ్లిని.
తిరిగి అమెరికాకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు హరీష్, అద్విక. వెళ్లే ముందర తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడడానికి వాళ్ళ గదిలోకి వచ్చింది అద్విక.
“కాసేపట్లో బయలుదేరతాం నాన్నా. కావాల్సిన సామాన్లన్నీ సర్దుకున్నాను”.
“మంచిది. జాగ్రత్తగా వెళ్లి రండి” ముభావంగా ఉంది తండ్రి మాట.
“ఐ బిలీవ్ దట్ హరీష్ ఈస్ మై బెస్ట్ పార్టనర్. ఎండ్ అఫ్ కోర్స్ తన లైఫ్‌లో కూడా ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయింది. ఆ విషయాలన్నీ మేము ఒకరికొకరం మాట్లాడుకుని అర్థం చేసుకున్నాం. సో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. రాదు కూడా. ఐ నో మీకు ఇదంతా ఇబ్బంది కలిగించుండొచ్చు. కానీ కొన్ని రోజులు అయ్యాక చూడండి మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు” అంటూ ఎంతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడింది.
కూతురు ఇంత మాట్లాడుతున్నా జగన్నాథ్ నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. మాట్లాడాదలుచుకోలేదు.
ఇంకా ఇంతకన్నా వాళ్లకి అర్థమయ్యేలా చెప్పడం కష్టం అనిపించి కార్ ఎక్కడం కోసం ఇంటి బయటికి వెళ్లింది. ఇద్దరూ కలిసి అనుకున్నట్టుగానే అమెరికాకి వెళ్లిపోయారు.
***
గడిచే కాలంతో పాటే కూతురు వల్ల కలిగిన బాధను, కోపాన్ని వదిలేసి ఇంతకుముందు లాగే మామూలుగా ఉంటున్నారు అద్విక తల్లిదండ్రులు.
అలా రెండేళ్ల తర్వాత తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది అద్విక హరీష్‌తో కలిసి.
“అక్కడ ఉద్యోగాలు ఏ సమస్య లేకుండా బాగానే ఉన్నాయా బాబు?” అంటూ మామూలుగానే మాట్లాడుతున్నాడు జగన్నాథ్ అల్లుడుతో.
“ఆ అంతా బానే ఉందండి” అంటూ నవ్వుతూ సమాధానమిచ్చి గదిలోకి వెళ్ళాడు హరీష్.
“ఏమిటి ఇందాక నుంచి ఫోన్ కి అతుక్కు పోయావు ఏం చేస్తున్నావేంటి?” అంటూ కూతురి పక్కనే వచ్చి కూర్చుంది నీరజ.
“ఏం లేదు ఏవో పాత ఆఫీస్ ఫోటోలు ఉంటే అవి చూస్తున్నా”.
పక్కనే ఉండడంతో నీరజకి ఫోన్లోని ఫోటోలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఆమెకు ఏదో చూసినట్టుగా అనిపించింది.
“ఒకసారి వెనకాల ఫోటో చూపించు” అని అనుమానంగా అడిగింది నీరజ.
“ఓ ఈ ఫోటో నా”.
“ఈ ఫోటోలో హరీష్ ఉన్నాడు ఏంటి? మీ ఇద్దరూ ఒకప్పుడు ఒకే ఆఫీసా?”
“అవును 7 ఇయర్స్ బ్యాక్” తడుముకోకుండా గబుక్కున సమాధానమిచ్చేసింది అద్విక.
“అంటే.. నీ విడాకులు కాకముందే?” అనుమానం వచ్చింది నీరజకి.
“అప్పట్లో మేమిద్దరం జస్ట్ పరిచయస్థులం మాత్రమే” నీరజ అనుమానానికి జవాబిచ్చింది.
వెంటనే భర్త జగన్నాథ్ ముఖాన్ని చూసింది నీరజ. అక్కడ నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయాడు జగన్నాథ్. అతని వెనకాలే లోపలికి వచ్చిన నీరజ..
“ఏమిటండీ ఏడేళ్లు క్రితమే పరిచయం ఉంది అంటుంది! అప్పటికి దానికి ఇంకా విడాకులు కూడా కాలేదు కదా?”
“ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు.”
జగన్నాథ్ అన్న మాటకి షాక్ అయింది నీరజ.
“అవును అప్పట్లో అది విడాకులు అంటూ గొడవ చేస్తుంటే నేను అర్జున్‌ని కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరికీ ఏ విషయంలోనూ పడట్లేదని, అద్విక ఎప్పుడు చూసిన పార్టీలు అంటూ బయటకు వెళ్లి మితిమీరి ప్రవర్తిస్తోంది అని ఫోటోలు చూపించాడు”.
“అలా కాదు ఆఫీసులో మామూలుగానే ఏవో పార్టీలో అవి ఉంటుంటాయి కదా మీకు తెలియనిది ఏముంది చెప్పండి అన్నాను. ఆఫీసులో పార్టీలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కానీ దానివల్ల ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పులు నేను మీకు చెప్పలేకపోతున్నాను అన్నాడు”.
“మరి ఈ విషయం నాకు అప్పట్లోనే ఎందుకు చెప్పలేదు?” ఆవేశంగా అడుగుతోంది నీరజ.
“పిల్లల్ని కని క్రమశిక్షణగా పెంచడం మన బాధ్యత. ఆ తర్వాత ప్రస్తుత కాలం ప్రభావంతో వాళ్ళు ఎలా మారుతున్నారనేది మన చేతుల్లో లేదు. అతనే నిజంగా అనుమానించాడో లేదా ఇదే మితిమీరి ప్రవర్తించిందో నిజం ఏమిటో వాళ్ళిద్దరికే తెలియాలి. ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు” అంటూ వెళ్లి పడుకున్నాడు జగన్నాథ్.
“నాకు తెలిసి నా కూతురు అలాంటి తప్పులు చెయ్యదు” అంటూ మనసులోనే బాధపడింది నీరజ.
