Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మానస సంతానం!!

[సముద్రాల హరికృష్ణ గారి ‘మానస సంతానం!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

“ఎన్నైనా చెప్పు, నేను మన విశాలాక్షికి పెళ్ళి చెయ్యను గాక చెయ్యను”, పరంధామయ్య పెద్ద గొంతుతో అంటున్నారు, వరండాలో చేటలో బియ్యం చెరుక్కుంటున్న భార్య పార్వతమ్మతో!

“చెయ్యక?!, నీతోనే ఉంటే, ఆ పిల్ల బతుకేం గాను రేప్పొద్దున! విడ్డూరం మాటలు కాకపోతేనూ”- కళ్ళజోడు సర్దుకుంటూ చేట కోపంతో కింద పెట్టిన అరవైయేళ్ళ పార్వతమ్మ జవాబు అది, డెభ్భై ఈ మధ్యే దాటిన తన భర్తతో!

ఈ మాటల యుద్ధం వారికి మామూలే, వారానికో రెండు సార్లైనా!! పిల్లలు లేని వారిద్దరికీ అది తెలిసి కల్పించుకునే కాలక్షేపమో, కలకాలం పూజలు చేసినా ఓ నలుసు కలగకపోవటం వలన ఏర్పడ్డ మనసుల్లోని బాధో –  చెప్పటం కష్టమే బయట వారికి!

వారికి అది అంత సహజంగా తన్నుకు వచ్చేసేది గుండెల్లోంచి, లేని తమ సంతాన భద్రత గురించి!

ఇరుగు పొరుగులో కొంతమందికి ఇది అసహజమనీ అనిపించేది,ఆ వింత అనురాగం అర్థంకాక!

***

పొలం, ధాన్యం, డబ్బూ దస్కానికి ఏ మాత్రం లోటులేని వయోవరిష్టులైన దంపతులు, పరంధామయ్యా, పార్వతమ్మ! పెద్ద ఆవరణలో రెండంతస్తుల ఇల్లు, ఇంటి వెనకాలా, ముందూ ప్రేమగా పెంచి చూసుకుంటున్న మొక్కలూ, చెట్లూ! అంతా ఆహ్లాదమే వారి జీవితాల్లో, ఒక్క ఈ పిల్లలు లేరనే వెలితి తప్ప!

అది ఇంక తీరనిదని వారికీ తెలిసిన విషయమే! అందుకే తమకు కలగని పిల్లల గురించిన తగువులూ, వాదాలూ వారి మధ్య!

***

“సరే అట్లాగైతే ఒక రాజీ మార్గం ఉంది నా దగ్గర!”, అన్నారు పరంధామయ్య, తన వాదం కొనసాగిస్తూ!

“ఏమిటదీ?! చెప్పండి, అదీ చూద్దాం”, ఆమె ప్రశ్నా, ఎత్తిపొడుపూ!

“అడగలేదు కాబట్టి చెప్పలేదు, ఇప్పు డడిగావు కాబట్టి ఇదిగో చెపుతున్నాను, శ్రధ్ధగా ఆలకించు – మా విశాలాక్షి పెళ్ళికి నా కండిషను” అని ఆయన కొనసాగింపు.

“ఇంత ఉపోద్ఘాతం ఎందుకో, సూటిగా చెప్తే సరిపోదూ?! ఇట్లాగే నాన్చారంటే, కండిషన్ సంగతెట్లా ఉన్నా, పిల్ల తండ్రి తరహా నచ్చలేదని వాళ్ళు వెనక్కి వెళ్ళే ప్రమాదముంది జాగ్రత్త!”, ఆమె కొంటె హెచ్చరిక!

“సరే విను, ఆ అబ్బాయే మనింటికి ఇల్లరికం వచ్చే పక్షంలో నేను పెళ్ళికి సిద్ధం! అదే అదే, ‘నేను’ అంటే నాకు కాదులే, మా అమ్మాయి పెళ్ళి చేయటానికి నేను సిధ్ధం అని నా అర్థం!” పరంధామయ్య జవాబు!

“వాళ్ళెందుకు ఒప్పుకుంటారూ?! చిన్నతనం అనుకోరూ!?” సందేహంతో ఆమె!

“అనుకుంటే వాళ్ళ ఖర్మ! లక్ష్మి లాంటి పిల్లను వాళ్ళే చేజార్చుకుంటున్నారని అర్థం! మా అమ్మాయి కలకాలం నాతోనే, మా యింట్లోనే హాయిగా.. సుఖంగా..!” మురిసిపోతూ ఆయన!

“అవునవును, సుఖంగానే, మనం చిరంజీవులం కదూ, నిజమే! ఆపండిక మీ గాలిలో మేడలు! కాస్త భూమ్మీదకు వచ్చి మాట్లాడుదురూ!” పార్వతమ్మ మాటల్లోని నిజం బుర్రకు షాకు లాగా తట్టి, పరంధామయ్య కొద్ది సేపు పూర్తిగా మౌనంగా ఉండిపోయారు.

“నిజమే, విశాలాక్షికి ఏదో రకంగా పెళ్ళి కుదర్చాల్సిందే, ఇంక ఆలస్యం చేయకూడదు”, అని నిర్ణయం జరిగిపోతుంది, ఆ మౌనంలో!

అయిదు నిమిషాలు భర్త వంకే చూస్తూ ఉండిపోయి, ఆమె కూడా లేచి వెళ్ళిపోయింది, ఒక చిరునవ్వుతో!

పాపం, ఆయనకు ఎంత ప్రేమ ఆడపిల్లలంటే.. తీరని కోరికే ఈ జన్మకిక.. అని మనసులో అనుకుంటూ.

***

ఇక ఆమె వైపూ ఒక కథ ఉంది – అయితే అది తన పిల్లవాడి గురించి.

ఆమె ఎంతో ఇష్టంతో, అంతకన్నా ఎక్కువ శ్రీకృష్ణుడి మీది భక్తితో, వాడికి పెట్టుకున్న పేరు మురళీకృష్ణ!

ఆమెకు కలగని కొడుకు! కానీ తనకు ఉన్నాడనే భావించే కొడుకు.

ఆమె ఆలోచనలన్నీ వాడి చుట్టే, భర్తతో గొడవలన్నీ వాడి ఆలనాపాలనా మీదే!

***

ఒకసారి పరంధామయ్య ఇంటి వెనక  తోటలో బీరపాదు సరి చేస్తుంటే, ఆమె పరుగుపరుగున వచ్చి, “ఒకసారి వస్తారా, లోపలికి”, అన్నది.

“చూస్తున్నావుగా.. చేతిలో పని అవనీ” ఆయన సమాధానం కాస్త విసుగ్గా!

“కాదు ఇప్పుడే రావాలి”, అని ఆమె పట్టుబట్టడంతో, లోపలికి వెళ్ళి చూస్తే – పెద్ద జంబుఖానా, దాని మీద చాపలూ, దాని మీద ఓ పాతిక దాకా చీరెలూ పెట్టి ఉన్నాయి. కొన్ని తెరిచి, రాశులుగా అట్లాగే ఉంచి, మధ్యలోనే తన కోసం ఆత్రంగా వచ్చినట్టుంది ఆమె, అని ఆయన గ్రహించారు!

“ఊఁ చెప్పు! ఏమిటీ ఈ చీరెల కొట్టూ”, అన్నారాయన వాలు కుర్చీలోకి జారుకుంటూ!

“అహఁ, ఏవీఁ లేదు, దేవీనవరాత్రు లొస్తున్నాయి కదా, ఒక్కొక్క రోజు ఏ ఏ చీరెలు కట్టాలా – పొద్దున మామూలుది ఒకటి, సాయంత్రం పేరంటానికి కాస్త డాబుగా ఉండేది ఒకటీ, ఏది కట్టుకోవాలో ఎంతకీ తేలడం లేదు, కాస్త చెపుదురూ!?”, ఇదీ ఆమె వేడికోలు!

“నాకేం తెలుస్తుందీ ఈ చీరెల వ్యవహారం, నువ్వు చూసుకోవాల్సిందే ఇదంతా!” అని ఆయన తప్పించుకోబోతే, ఆవిడ వదలదేఁ!

“బ్బాబ్బాబు, కాస్త చూసిపెడుదురూ”, అని బతిమాలి బామాలి, ఏది దేనికి మ్యాచింగో సరి చూసుకుంటూ, ఆయన చేత “బాగుంటుంది”, అనిపించుకుంటూ, పూర్తి చేసింది ఆ చీరెల “ఇంటర్వ్యూ!”.

వాసిని బట్టి ఆ చాపల మీది రాశిలో కొన్ని ఎంపికైనాయి. అవన్నీ మడిచి లోపల సర్దుకుని, మళ్ళీ వచ్చి కూర్చున్నది పార్వతమ్మ, తన భర్త ఎదురుగా!

“ఆఁ చెప్పండి ఇప్పుడు ఈ సారి కొలువు ఎట్లా అమరుద్దామో! బ్రహ్మాండంగా ఉండాలి సుమా, కొత్త రకంగా!” అన్నదామె ఉత్సాహంగా!

“బ్రహ్మాండమూ, కొత్తదనమూ అన్నీ నీకూ, ఆ కృష్ణుడితోనేగా! పేరుకు దేవీ నవరాత్రులు, చేసేది మురళీకృష్ణుడి పూజా, అలంకారమూనూ! చిత్రం కాకపోతే ఏవిఁటీ, ఇదే కాదూ నీ బొమ్మల కొలువులో కొత్తదనం” అన్నారాయన, తెలిసిన విషయమేగా, ఏది చెప్పినా నువ్వు చేసేది మాత్రం ఇంతేగా, అన్న ధోరణిలో!

ఆమె రోషంగా, “ఏం ఎందుకు చేయకూడదూ, మాకున్న ఒక్కడికీ, మా మురళీకృష్ణుడికీ, అలంకారాలూ, పూజలూ!? మీరు జపించరూ అస్తమానమూ, మీ అమ్మాయి విశాలాక్షి నామం?! ఇదీ అంతే, సర్దుకోవాలి, తప్పదు మరి”, అన్నది ఆయన మౌనంగా వింటూండగా!

ఊహల్లో మాత్రమే ఉన్న వారి కొడుకు, మురళీకృష్ణ! ఆమెకు మరీ ముఖ్యంగా ప్రాణం, ఆ పేరన్నా, ఆ దేవుడన్నా!

“సరే కానివ్వు, ప్రతిసారీ లాగే! ఒక పెద్ద దుర్గాదేవి మండపమూ, చుట్టూ కొలువంతా కృష్ణుడి బొమ్మలే, వివిధ సన్నివేశాలలో ఆ కృష్ణుడి లీలలు చెప్పేవి అమరుద్దాంలే!” అన్నారాయన చివరకు, ఆమెను ఓదార్చే పద్ధతిలో!

ఇద్దరూ కాస్సేపు మౌనంగా కూర్చుండిపోయారు.

లేనిదానికీ, ఇంక దక్కని దానికీ ఏమిటీ హడావిడంతా అనేనేమో వారి భావన ఆ క్షణంలో! అయినా అంతలోనే సర్దుకున్నారు ఇద్దరూ.

ఆ విషాదమూ, ఆ లోటూ తమను లొంగతీసుకోకూడదని తీర్మానించుకున్నారు వారు కొన్ని ఏళ్ళ క్రితమే!

దత్తత తీసుకోమనే సలహా ఇచ్చిన వాళ్ళూ లేకపోలేదు, కానీ ఆ పద్ధతి వారిద్దరికీ అంతగా నచ్చింది కాదు ఎందుకో!

ఆ తల్లిదండ్రుల హక్కు కాజేయకూడదనో, సహజ సంబంధమైతేనే ఉత్తమం అనో – ఏది ఏమైనా ఆ ప్రయత్నం వారు ఎప్పుడూ అంత సీరియస్‌గా చేసినది లేదు.

“నాకు పోయిన సారి దసరా సంఘటనే గుర్తుకొస్తోంది”, అన్నారాయన కాస్సేపు ఆగి, పరుచుకున్న మౌనాన్ని భంగం చేస్తూ!

“ఏవిఁటదీ?” ఆమె ప్రశ్న!

“ఏవిఁటా?! మురళీకృష్ణుడి చల్దారగింపుల రోజున భోజనం పెట్టావా నాకు?! గొల్ల పిల్లలతో పాటు నాకూ ఆ రోజు పెరుగన్నమేగా?!”

“అయ్యో క్షమించండి. నేనూ ఎంతో బాధపడ్డాను. అమర్చీ, మార్చీ, అమర్చీ మార్చీ – ఒక కొలిక్కి తెచ్చేటప్పటికీ ఆ పూట బొమ్మల కొలువు తల ప్రాణం తోకకు వచ్చేసింది. ఇక వంట చేసే ఓపిక లేక, ఆ ప్రసాదమే భోజనం అయిపోయింది మీకా రోజున” అన్నదామె నొచ్చుకుంటున్నట్టు!

“సరేలే అయిపోయి సంవత్సరం అయితూంటే ఇప్పుడెందుకూ దాన్ని గూర్చిన వంత?! నంజుకోవడానికి నిమ్మకాయ ఊరగాయ ముక్కన్నా ఇచ్చావు, అదే ఆ నాటికి నా తృప్తి!”, ఆయన ఓదార్పు!

“నేనూ అదే కదండీ తీసుకున్నది”, అన్నదామె, ఆ రోజు జరిగిన ఆలస్యం తలచుకుంటూ!

“సరేలే వదిలెయ్యి, అదో సరదా సంఘటన, అంతే!”, అన్నారాయన ఆమెను ఊరడిస్తున్పట్టు!

ఆ ఏడు కూడా ఘనంగా శరన్నవరాత్రులు జరుపుకున్నారు, బొమ్మల కొలువు తీర్చిదిద్దారు.

కాలనీలో అందరినీ పేరంటానికి పిలిచి విజయదశమి రోజు అందరికి చిన్నపాటి కళాఖండమొకటి బహుమతి కూడా ఇచ్చి పంపారు.

ముద్దులొలికే చిన్నపాటి నందనందన విగ్రహం!

తృప్తిగా జరిగిపోయిన, ఆ పండగ రోజులకి ఇద్దరూ చాలా సంతోషించారు కూడా!

***

ఓ  నెల రోజుల తరువాత, పార్వతమ్మ కాస్త దిగాలుగా ఉండటం నాలుగు రోజుల నుంచీ చూస్తున్న పరంధామయ్య గారు, “రేపు ఒక చోటికి వెళ్ళుతున్నాము, పదింటి కల్లా సిద్ధంగా ఉండాలి మరి, సిద్ధమేనా”, అన్నారు ఆమెతో!

“సరే మీరెక్కడికంటే అక్కడికి, వస్తాను, మరీ విసుగ్గా కూడా ఉంటోంది ఇంట్లోనే కూర్చుని” అన్నదామె, నిర్లిప్తంగా!

“అలా అన్నావ్, బాగుంది”, అన్నారాయన,

రేపు ఎట్లాగైనా ఆ రెండు పనులు పూర్తి చేయాలని మనసులో అనుకుంటూ!

***

అది ఒక అనాథాశ్రమం.

దంపతులిద్దరూ పొద్దున్నే గుడి కెళ్ళి, అర్చన చేయించి, ఆ ఆశ్రమానికి వెళ్ళారు.

అంతకుముందే పరంధామయ్య గారు ఫోనులో మాట్లాడి ఉండటంతో, ఆ ఆశ్రమం నడిపే జగన్నాథరావు గారు సిద్ధంగా ఉన్నారు వీరు వెళ్ళే సమయానికి.

రాబోయే దీపావళికి అక్కడ ఉండే వంద మంది పిల్లలకూ రెండు జతల బట్టలు తాము కుట్టించి ఇస్తామని జగన్నాథరావు గారికి చెప్పారు, పరంధామయ్యగారు.

గుడి నుంచి ఆశ్రమానికి టాక్సీలో వస్తున్నప్పుడు చెప్పారు భార్య పార్వతమ్మకు, ఈ విషయం ఇట్లా ముందే మాట్లాడి ఉంచాననీ, అందుకే నిన్న బ్యాంకుకు వెళ్ళి సరిపడా డబ్బు డ్రా చేశాననీ!

వినగానే, ఒకరికి, అందునా ఎవరు లేని పిల్లలకు సహాయం చేయబోతున్నామని తెలిసి పార్వతమ్మ చాలా సంతోషించింది.

భర్త వంక ఆప్యాయతతో గౌరవంతో ఒకసారి చూసింది తృప్తిగా.

అన్నాళ్ళు దిగాలుగా ఉన్న ఆమె మానసిక స్థితి ఈ మాట వినడంతో మొత్తం మారి ఉత్సాహం నిండినట్లయింది.

పరంధామయ్య గారు, “అప్పుడేనా, ఇంకో పని కూడా చేయబోతున్నాం, కాస్త ఓపిక చేసుకో, నీకూ బాగా నచ్చేదేలే ఆ పని కూడా”, అన్నారు.

“ఏంటో చెప్పండి” అన్నది ఆమె!

“ముందు ఇది కానిద్దాం, అప్పుడు చెప్తాను దాని వివరాలు, సరేనా”, అన్నారు అననుయించే స్వరంతో పరంధామయ్య గారు, భార్య మూడ్ ఎట్లాగైనా పాజిటివ్‍గా మళ్ళించాలని!

ఆమె కూడా ఆనందంగా “సరే”, అన్నది.

అంతకు ముందే బ్యాంకులో డ్రా చేసిన  లక్ష రూపాయలు ఆయనకు ఇచ్చారు పరంధామయ్య గారు. ఆయన అది తీసుకుని ఒక రశీదు ఇచ్చారు.

“ధన్యవాదాలు చెపుతున్నాను. పాపం ఎవ్వరూ లేని పిల్లలు, సంతోషిస్తారు, ఈ దీపావళికి కొత్త బట్టలు చూసుకునీ, మీ పేరు చెప్పుకునీ”, అన్నారు ఆయన!

“మా పేర్లు మటుకు తెలియాల్సిన అవసరం లేదండీ, వాళ్ళను చిన్నబుచ్చవద్దు, ఎవరో మాకు జాలితో సహాయం చేశారన్న ఆలోచన రానివ్వ వద్దు, వారికి. దయచేసి, నా అభ్యర్థన ఇది” అన్నారు పరంధామయ్య కాస్త ఉద్వేగంగా!

“అయ్యో ఎంతమాట, మీరెట్లా చెపితే అట్లాగే చేద్దాం, దాత ఫలానా అని ఎక్కడా చెప్పము లెండి” అన్నారు జగన్నాథరావు!

“రెండు రోజులు ముందే కబురు చేస్తాను టైమూ, అదీ! కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు, ఈ పిల్లల్లో కొంతమంది! మీరు ఇద్దరూ తప్పకుండా వచ్చి – అమ్మా తమరు కూడా, – చూసి ఆశీర్వదించాలి పిల్లలను!”, అన్నాడాయన గౌరవం ఉట్టిపడుతుండగా!

“అట్లాగే ఆరోగ్యం బాగుంటే తప్పకుండా వస్తాం లెండి”, అన్నారు పరంధామయ్య గారు.

ఇద్దరు ఆయన వద్ద సెలవు తీసుకొని టాక్సీలో పది కిమీ  దూరంలో ఉన్న వాగ్దేవీ బాలబాలికోన్నత పాఠశాలకు బయల్దేరారు.

మళ్ళీ కారులోనే చేయబోయే పని గురించి చెప్పారు ఆయన భార్యకు.

“ఇది చాలా మంచి పనండీ, ఎంత గొప్ప ఆలోచన వచ్చింది మీకు” అన్నది ఆమె కూడా  సంతోషంగా!

మాటల్లోనే స్కూలు ప్రాంగణం చేరుకున్నారు వృధ్ధ దంపతులు, ఒక మంచి పని చేయబోతున్నామన్న ఆనందంతో!

***

ఆ పాఠశాల ఒక స్వాతంత్ర్య సమర యోధుడు స్థాపించింది. ఆయన వారసుడు, విద్యాధికుడు, సేవాదృక్పథం ఉన్న వివేకానందమూర్తి నడుపుతున్నాడు ఆ పాఠశాల నిప్పుడు. సుమారు ఐదువందల మంది చదువుకుంటున్న కో ఎడ్యుకేషన్ స్కూలు అది. నాణ్యమైన బోధనకు ఆ ఊళ్ళో మంచి పేరున్న పాఠశాల!

వీరు చేరగానే స్వయంగా వివేకానంద మూర్తి గారే వచ్చి సాదరంగా లోపలికి తీసుకెళ్ళారు దంపతులను.

ఇద్దరికీ ఆయన పద్ధతీ మాటా వ్యవహారం బాగా నచ్చింది, తొలి పరిచయం లోనే.

‘పాత్రత ఉన్న చేతికే సహాయం అందిస్తున్నాములే’, అనుకున్నారు పరంధామయ్య గారు.

ఆ బడి వాతావరణమూ,శుభ్రతా, చెట్టు చేమలకూ, ఆటలకూ వదిలిన జాగా, ఇతర సదుపాయాలు అన్నీ చూపించాడు ఆయన. ఆక్కడి క్రమశిక్షణ, చూసిన వారికి ఇట్టే తెలిసిపోయేట్టు ఉన్నది ఆ వాతావరణం.

తన తాతగారు ఒక మహదాశయంగా పెట్టిన దాన్ని తమ కుటుంబమూ బంధువులూ కొంత స్వంత ఖర్చు పెట్టుకుని బడి నడిపిస్తున్నట్టు చెప్పాడు ఆయన.

వీరిద్దరూ చాలా గౌరవభావంతో ఆయనతో సంభాషించారు, వారి కుటుంబం పట్ల పెరిగిన మంచి అభిప్రాయంతో.

అంతా విని మెల్లిగా తన మనసులోని మాట చెప్పటం ఆరంభించారు పరంధామయ్య;

“మేము ఏదైనా చిన్న సహాయం చేద్దామనుకుంటున్నమండీ. మేమూ పెద్దవాళ్ళమై పోయాము, పిల్లలు లేరు మాకు! ఏదో భగవంతుడి దయ వల్ల ఇంత ఇచ్చే స్థితిలోనే ఉన్నాము. కనుక మీరిందాక అన్న లైబ్రరీ, కంప్యూటర్ల ఖర్చు మేము పెట్టుకుంటామండీ. మీరు వివరం చెప్తే నేను ఆ పైకం మీ స్కూలు అకౌంటులో వేస్తాను. ఇంకో విషయం, కొంతమందికి సగం ఫీజు మాఫీ ఇస్తామని చెప్పారు ఇందాక, కొంత ఆర్థిక ఇబ్బందులున్న పిల్లలకు. వారిలో ఓ పదిమంది వివరాలు నాకు ఇవ్వండి, నేను నెలనెలా వారి తరఫున ఫీజు కట్టే ఏర్పాటు చేస్తాను మా బ్యాంకు ద్వారా. మీరిచ్చేది ఎటూ, ఇంకొంతమందికి చేరే అవకాశమూ ఏర్పడుతుంది దీని ద్వారా!

చివరిగా ఒక్క మాట – చెప్పానుగా మాకు పిల్లలు లేరని. కానీ ఓ రెండు పేర్లు అనుకుంటూ ఉంటాము తరుచూ, మాకు పిల్లలు ఉన్నట్లైతే ఆ పేర్లే పెట్టేవాళ్ళం బహుశా! అబ్బాయి అయితే, ఆమె పక్షం – పేరు మురళీకృష్ణ!

అమ్మాయి అయితే, నా పక్షం – పేరు విశాలాక్షి! మీరేం కన్ఫ్యూజ్ కావద్దు, ఇది కేవలం మా ఊహల్లోనే! మాలో మేము పిలుచుకోవటానికి పెట్టుకొన్నవి – మా ఫేవరెట్ పేర్లు అనుకోండి, ఒక రకంగా ఇప్పటి పధ్ధతిలో చెప్పాలంటే!” ఇది చెబుతూంటే ఆయన గొంతు కొంచెం గద్గదికం కావటమూ, పక్కనే ఉన్న ఆయన భార్య చీరకొంగుతో కళ్ళనీళ్ళు తుడుచుకోవటమూ, వివేకానంద గారు గమనించకపోలేదు.

నిజానికి వింటూన్న ఆయనకే ఎంతో బాధ కలిగింది కూడా, అయ్యో ఎంత అలమటించారో పిల్లల కోసం, అని!

పరంధామయ్య గారు ఒక్క నిమిషం ఆగి, గొంతు సవరించుకుని, చెప్పటం ఆరంభించారు – “అయితే మూర్తి గారూ, ఇప్పుడు నా, అనగా మా ఇద్దరి ప్రొపోజల్ ఏవిఁటంటే, మీ బళ్ళో, 8,9,10 తరగతుల్లో చదువుతూ, ఆ సంవత్సరం చివర్లో జరిగే ఫైనల్ పరీక్షలో ఫస్టు ర్యాంకు వచ్చిన పిల్లలకు ఈ మా ఇద్దరి పిల్లలమీద పెట్టబోతున్న బంగారుపతకమూ, 5000/- రూపాయల నగదు బహుమతీ ఇవ్వాలన్నది. అబ్బాయిలకు మురళీకృష్ణ గోల్డ్ మెడల్ అనీ, అమ్మాయిలకు విశాలాక్షీ గోల్డ్ మెడల్ అనీ మీరు ఆరంభించాలని మా విన్నపం. దానికి తగిన డబ్బు మేము అందజేస్తాము”- ముగించారు పరంధామయ్య గారు.

అంతా మౌనంగా విన్న పార్వతమ్మ మొహం చేటంత అయింది, తమకు కలగని పిల్లల పేర్ల మీద బడి పిల్లలకు బహుమతులు దక్కబోతున్నాయని తెలిసి.

ఆమె ఆనందంతో భర్త వంక ఒక ఆదర భావంతో చూసింది, ఎంత చక్కటి, పదిమందికీ ఉపయోగపడే ఏర్పాటు చేస్తున్నారన్నట్లు!

తరువాత అనుకున్నట్టే స్కూలు యాజమాన్యం ఆ ఏర్పాట్లు చేశారు, ఈ దంపతులు ఆ పైకం అనుకున్న ప్రకారమే, అన్నిటికీ విరాళంగా ఇవ్వటమూ జరిగిపోయినై, వారికి కొండంత తృప్తి మిగులుస్తూ!

***

వారిద్దరిలో కొత్త జీవనోత్సాహం ప్రవేశించినట్లు అనుభూతి చెందారు, ఈ సహాయాలు చేసిన తరువాత!

అది ఒకరికి సహాయం చేసినప్పుడు కలిగే మానసికమై తృప్తి అని కూడా గ్రహించారు.

అదే ఊపులో తెలిసినవారు ఏర్పాటు చేస్తే, అంతకు ముందు చూడని పుణ్యక్షేత్రాలు కూడా వెళ్ళివచ్చారు.

వెళ్ళే ముందు పార్వతమ్మ కాస్త సందేహిస్తూ, “నేను రాగలనంటారా, ఆ కాశీ విశ్వేశ్వరుడు అనుమతిస్తాడా”, అని అన్నది కూడా.

“ఓసి పిచ్చిదానా! ఆయన అనుజ్ఞ ఉన్నది కాబట్టే ఇప్పటికైనా ఈ ఆలోచన వచ్చింది. తీసుకెళ్ళిన వాడిది కాదూ బాధ్యత, జాగ్రత్తగా మళ్ళీ ఇంట్లో దిగబెట్టటం! కనుక క్షేమంగా వెళ్ళి పుణ్యలాభంతో వస్తాములే, ఏం ఫర్వాలేదు, ఆ కావలసిన బట్టలూ,నీ సరంజామా వాటి సంగతి చూసుకో ఇక! ఆట్టే సమయం లేదు, ఇంకో వారమే మన ప్రయాణానికి” అని ఆమెను ఉత్సహపరిచి తీసుకెళ్ళారు.

***

అన్నీ క్షేత్రాలూ  క్షుణ్ణంగా చూసి వచ్చిన వారికిప్పుడు, విశాలాక్షి పెళ్ళి కానీ, మురళీకృష్ణ విషయం కానీ చర్చా విషయం కాదు.

ఎప్పుడు మనసు పిల్లలు మీదకి మళ్ళినా, ఇద్దరూ ఒక మాట అనుకుని, వివేకానంద గారికి ఫోను చేసి ట్యాక్సీలో వెళ్ళి పిల్లలను చూస్తూ ఓ గంట కూచుని వస్తారు, వీరు సహాయం చేస్తున్న ఆ స్కూల్లో.

అంతే, ఆ గంటలో ఎంతో ఉల్లాసం, ఉత్సాహం పుంజుకుని ఇల్లు చేరుకుంటారు.

“ఎంతమంది విశాలాక్షులూ, మురళీకృష్ణులో చూడు పార్వతీ ఇప్పుడు మనకు”, అని ఆయన అనటం; ఆమె కన్నీళ్ళను ఆపుకుంటూ, “అవునండీ నిజమే”, అనటం కూడా పరిపాటి అయిపోయింది వారి మధ్య ఇటీవల!

బాధలోనే ఆనందాన్నీ, ఆనందం లోనే బాధనూ పెట్టటమే పైవాడి అద్భుతమైన కళేమో అనిపించే విధంగా!

వివేకానంద గారు వీరు వచ్చి వెళ్ళుతున్నప్పుడల్లా మనసులో అనుకునేది, ఒక్కటే మాట: ‘నమస్కారం పెట్టవలసిన పుణ్యదంపతులు. పాపం ఒక్క పిల్లో, పిల్లవాడో వీరికి ఉంటే ఎంత బాగుండేది’ అని!

***

అన్నట్టు, వారి చర్చా విషయాలు ప్రస్తుతం పిల్లలు కాదు; వారు చూసి వచ్చిన ఏ ప్రదేశం ఎంత బాగుందీ అనీ, వచ్చే ఏడాది ఇంకా ఏఏ ప్రాంతాలూ, క్షేత్రాలు చూడాలా అని!

వారికి ఆ జ్ఞాపకాలతో, ఆ ప్లాన్లతోనే హాయిగా గడిచి పోతోంది కాలం ఇప్పుడు!

ప్రతి ఏటా స్కూల్లో ఇచ్చే గోల్డ్ మెడల్స్‌తో వారి పిల్లలు విశాలాక్షీ, మురళీకృష్ణలు ఇద్దరూ ఇప్పుడు ఘనకీర్తి నార్జించేస్తున్నారుగా!

అందుకని, వారికిక ఏ దిగులూ లేదని, పరంధామయ్యా, పార్వతమ్మా గట్టిగా నమ్మటం మొదలుపెట్టారు!

ఏ తల్లితండ్రులకైనా కావలసినదీ, వారు కోరుకునేదీ – పిల్లలకూ,వారి ద్వారా తమకూ మంచి పేరు రావాలనేగా!

***

వినేవారికి వినోదమేమో కానీ, నిజానికి ఇదంతా వారి గుండెల్లో గూడు కట్టుకుపోయిన విషాదమే! అది అట్లా పీటముడి పడిపోయింది. క్రమంగా, ఓ కరగని పాషాణపు ముడి అయిపోయింది! విప్పటం వారి వల్ల కాలేదు.

విప్పకల్గిన పైవాడు ఉలకలేదూ, పలకలేదూ వారి నోములకు, వ్రతాలకూ, పూజలకూ! అందుకే ఇద్దరుగానే మిగిలిపోయారు, ఒకరికొకరై!

ఆ మైత్రి లోనే కయ్యాలూ, నెయ్యాలూ అన్నీ! ఆ పుట్టని వారి కోసం లేని తగువులూ, తెచ్చిపెట్టుకున్న తంపులూ, మాటల యుధ్ధాలూ! చివరికి ఈ రకమైన సర్దిచెప్పుకోవటాలూ!

సుమారు యాభై యేళ్ళ దాంపత్య బంధం! అర్ధ శతాబ్దం – ఒకరితో ఒకరు!

ఆ ప్రేమ, ఆ సాహచర్యమూ ఒకరిపై ఒకరికి అధికారంగా మారిపోయిన వైనం, ఆ అధికారంలోనే మళ్ళీ పొంగిపొర్లే ఆప్యాయతలు, అనురాగాలూ!

వాటి అరటి పిలకలే, ఆ తగువులూ, వాగ్వాదాలూ – కదళీవనం లాంటి వారి కాపురంలో!

పుట్టని పిల్లల మీద ప్రేమలు ఒలకబోసి, ఆ ప్రేమను చుట్టూ ఉన్న అందరి పిల్లల మీద ప్రసరింపజేసిన పరంధామయ్య, పార్వతమ్మా – అపురూపమైన తల్లిదండ్రులు!!

మురళీకృష్ణ, విశాలాక్షీ వారి ‘మానస సంతానం’ అనవచ్చేమో!

Exit mobile version