[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన టి.వి.ఎల్. గాయత్రి గారి ‘(మా)నవజీవనం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
శశిధర్, సారికల పెళ్లిరోజు దగ్గర పడింది.
ఫ్రెండ్స్ అందరికీ హోటల్లో గ్రాండ్‌గా పార్టీ ఇద్దామనుకున్నారు. ఇంట్లో అయితే అందరికీ చోటు సరిపోదని ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎగువ మధ్యతరగతి కుటుంబీకులు హోటళ్లలో పార్టీలు అరేంజ్ చేయటం పరిపాటయింది.
పది రోజుల నుండి పెళ్లి రోజు ఏర్పాట్ల గురించి చర్చించుకుంటున్నారు శశిధర్ దంపతులు .ఇద్దరి ఆఫీసుల్లో ఉన్న ముఖ్యమైన బంధువుల్ని, కొలీగ్స్‌ని, ఫ్రెండ్స్‌ని కలిపితే అరవై మంది దాకా తేలారు. అప్పటికి దూరపు బంధువుల్ని కొందరిని వదిలేశారు.
‘ఆ రోజు ఏ చీర కట్టుకోవాలి?.. ఏ నగలు పెట్టుకోవాలి?’ అని ఒకటే సతమతమవుతోంది సారిక. శశిధర్‌కు ఖరీదైన సూటు ఒకటి ముందే కొనిపెట్టింది. మగపిల్లలిద్దరికీ షేర్వాణీలు కొన్నది.
“మీరు కూడా కొత్తపట్టుచీర కట్టుకొని నగలు పెట్టుకోండి అత్తయ్యా! మామయ్యగారు కూడా మంచి సూటు వేసుకుంటే బాగుంటుంది. ఆరోజు కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి కదా! మనం ఒకసారి నల్లి సిల్క్స్‌కి వెళ్ళొద్దాము!” అంది సారిక.
కోడలి వంక నిరాసక్తంగా చూసింది పావని.
“బీరువాలో చాలా చీరలు మూలుగుతున్నాయి! మీ మామయ్య గారివి కూడా పట్టుపంచెలు చాలానే ఉన్నాయి! అవి కట్టుకుంటాములే! ఇప్పుడు అంత డబ్బు పెట్టి కొత్తబట్టలు కొనటం ఎందుకూ?” అంది.
సారికకు అత్తగారి తత్వం బోధపడదు.
సారిక చదువు అయిపోగానే మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది. సరదాగా ఒక నాలుగేళ్లు ఉద్యోగం చేస్తూ ఉంటే శశిధర్‌తో పెళ్లి.. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు.. ఎలాగూ ఇంట్లో ఉండే అత్తగారు, మామగారు పిల్లల్ని చూసుకుంటారు! శశిధర్‌కు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరు ఉద్యోగస్థులవడం వలన ఏదైనా కొనుక్కోవాలంటే క్షణాల్లో పని! లగ్జరీ కారు, ఖరీదైన కాలనీలో విల్లా.. బాగానే ఉంది జీవితం!
పావని, ఆమె భర్త కేశవ ఇద్దరూ లెక్చరర్స్. విజయవాడలోని పాయకాపురంలో మధ్యతరగతి కాలనీలో చిన్న ఇల్లు. ఆడపడుచుల పురుళ్ళు.. అత్తగారు, మామగారు.. రోగాలూ.. రొప్పులూ.. పిల్లల చదువులు.. వచ్చేపోయే బంధువులు.. ఇలా బాధ్యతలతో క్షణం ఖాళీ ఉండదు. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ, జాగ్రత్తగా రోజురోజూ డబ్బులెక్కలు చూసుకునే వాళ్ళు.
పిల్లల పుట్టిన రోజులకి, తమ పెళ్లిరోజుకు పెద్ద ఆర్భాటం లేదు. కొత్త బట్టలు కొనేది పావని కానీ అవి చాలా సామాన్యమైనవి. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడానికి భార్యాభర్తలిద్దరికీ భయమే! ఎప్పుడు ఏ అవసరం వచ్చి పడుతుందోనని పొదుపుగా జాగ్రత్తగా ఉండేవాళ్ళు.
ప్రత్యేకమైన రోజుల్లో, సెలవు రోజుల్లో పొద్దున్నే లేచి తయారై దుర్గ గుడికి వెళ్లి వచ్చేవాళ్ళు.
సాయంత్రాలు మాత్రం పిల్లలతో శైలజా థియేటర్ ఎదురుగా ఉన్న రామకృష్ణ మఠానికి వెళ్లి కాసేపు కూర్చొని కొద్దిగా డబ్బులు విరాళంగా ఇచ్చేవాళ్ళు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు పర్వదినాల్లో కొంతైనా దానం ధర్మం చేయాలని కోరిక ఉండేది పావనికి. అందుకే ప్రతిరోజూ ఒక పది రూపాయలు దేవుడి దగ్గర డిబ్బీలో వేసి దాచేది. అవి దానానికి, ధర్మానికి అని పెట్టుకునేది. ఆ డబ్బులు ఎంత అవసరం వచ్చినా తాకేది కాదు! పిల్లలకు కూడా ఆ విషయం తెలుసు!.. కాలం గడిచింది! పిల్లలు పెద్దవాళ్ళయ్యారు..
శశిధర్ హైదరాబాదులో స్థిరపడ్డాడు. చిన్నదైన శివాని బెంగళూరులో స్థిరపడింది. రిటైర్ అయ్యాక పాయకాపురంలో ఉన్న ఇల్లు కొంచెం పెద్దది చేశాడు కేశవ. పైన ఇంకో రెండు గదులు వేసి అద్దెకిచ్చాడు. అప్పుడప్పుడూ విజయవాడ వెళ్లినప్పుడు తమకు ఉండటానికి కావాలని కింద పోర్షన్ అట్టే పెట్టుకున్నారు కేశవ దంపతులు. హైదరాబాద్ వచ్చి కొడుకు శశిధర్ దగ్గర ఉంటున్నారు. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తే పిల్లల్ని, ఇంటిని చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
హైదరాబాద్ వచ్చినా కూడా పావని తన దానధర్మాలు మానేది కాదు. తమకొచ్చే పెన్షన్ డబ్బులతో నిజంగా సేవ చేసే స్వచ్ఛందసంస్థలకు కొద్దిగా డబ్బులు దానం చేసేది. ఎండాకాలం వస్తే ఏప్రిల్, మే నెలల్లో దగ్గర్లో బిల్డింగులు కట్టే చోటుకు వెళ్లి కూలీలకు మజ్జిగ ప్యాకెట్స్ పంచి వచ్చేవాళ్ళు కేశవ పావనీలు. వానాకాలం వస్తే ఒక పాతిక మంది కూలీలకు గొడుగులు పంచిపెట్టటం, ఇక చలికాలంలో పాతిక మంది కూలీలకు కప్పుకోవటానికి రగ్గులు కొనిపెట్టటం అలవాటు చేసుకున్నారు భార్యాభర్తలిద్దరూ.
“ఎండలో ఆ ప్యాకెట్లు పట్టుకొని కూలీలకు పంచిరావటమెందుకమ్మా! హాయిగా ఏసీలో ఉండండి! అయినా ఈ రోజుల్లో కూలీ వాళ్లకు కూడా జీతాలు బాగానే వస్తున్నాయి! పోనీ ఒకవేళ పేదరికంలో వాళ్ళంతా బ్రతుకుతున్నారనుకున్నా మీరు ఓ పదిమందికో, పాతిక మందికో పంచినంత మాత్రాన వాళ్ళ దరిద్రం తీరుతుందా!” అనేవాడు శశిధర్.
“పాపం! వాళ్ళు ఎండలో పని చేస్తున్నార్రా! మజ్జిగ ఇస్తే కాస్త దాహం తీరుతుందని! అయినా ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొడుతోంది! కాస్త తిరిగి వస్తే ఇద్దరికీ బాగుంటుంది! ఏదో పేదవాళ్లకు మన శక్తికొద్దీ!.. ఉడుతాభక్తి!..” అనేది పావని.
‘ఏమిటో! అత్తగారికి చాదస్తం!’ అనుకునేది సారిక.
పావనికి పిల్లల జీవనశైలిని చూస్తే బాధ కలుగుతూ ఉంటోంది. తామిద్దరూ పొదుపుగా జీవితం గడిపి, కాస్తో కూస్తో దానం ధర్మం చేస్తుంటే పిల్లలు మాత్రం విపరీతంగా వృథా ఖర్చు పెట్టడంలో ఆనందాన్ని పొందుతున్నారు. ఇలా దుబారా చేస్తుంటే మనసులో బాధ కలుగుతూ ఉండేది పావనికి.
“అంత దుబారా ఖర్చు ఎందుకురా! పోనీ పేదవాళ్లరెవరికన్నా ఇస్తే కాస్త పుణ్యం పురుషార్థం!” అని పిల్లలతో చెప్పినా వాళ్లలో మార్పు రాలేదు సరికదా ఆమెను విసుక్కోవడం మొదలుపెట్టారు.
పిల్లలు పెట్టే అనవసరపు ఖర్చు గురించి భర్త దగ్గర వాపోయేది పావని.
“ఆ చిన్నపిల్లల డ్రస్సులు చూడండి! ఒక్కొక్కటి మూడు వేలు.. నాలుగు వేలు! ఆరునెలలు తిరిగేసరికి పిల్లలు పొడుగవుతారు!.. ఎందుకూ పనికిరావు! ఇంటిలో కుక్కలు కుప్పలుగా పేరుకుపోతాయి!.. కోడలు వాటిని తీసి బయట పారేస్తూ ఉంటుంది.. ఖరీదు పెట్టి కొనటం ఎందుకు? మళ్ళీ పారేయటం ఎందుకు?.. పెరిగే పిల్లలకు తక్కువ ఖరీదువి కొంటే సరిపోతుంది కదా! నేను చెప్తే వినిపించుకోవడం లేదు!” అని పావని చెప్పినప్పుడల్లా పావనినే మందలించేవాడు కేశవ.
“మనం పెద్దవాళ్ళం అయ్యాం పావనీ! తోచీతోచకుండా పనికిమాలిన సలహాలు చెప్పకు! ఊరికే పిల్లల విషయాల్లో కల్పించుకొని మన గౌరవం పోగొట్టుకోవడం ఎందుకు? వాళ్లు మన మాట వినలేదని మనశ్శాంతి లేకుండా చేసుకోవడం ఎందుకు? చిన్న చిన్న విషయాలు కదా పట్టించుకోకు!” అని భార్యకు గట్టిగానే చెప్పేవాడు కేశవ.
అప్పటికి ఊరుకున్నా పిల్లల ఆర్భాటపు ఖర్చు చూసి బాధపడేది పావని.
ఒక్కోసారి అందరూ కలిసి హోటలుకు వెళ్తే బిల్లు ఆరు వేలకు తక్కువ కాదు.. తినడం కంటే పారేసేది ఎక్కువ!
“ఇంత ఖరీదైన రెస్టారెంటుకు ఎందుకురా?.. కాస్త తక్కువ దానికే వెళదాము!” అనేది కొడుకుతో పావని.
“చిన్నప్పుడు మనం ఏ సరదాలు లేకుండా బ్రతికాం కదమ్మా! ఇప్పుడన్నా కాస్త హాయిగా ఉండడం నేర్చుకో! మనకి ఇప్పుడు ఏం తక్కువయింది? మేము సంపాదిస్తున్నాము! దర్జాగా ఉండమ్మా!.. మిమ్మల్ని సుఖపెట్టాలనే కదా మా తాపత్రయం!” అనేవాడు శశిధర్ నవ్వుతూ.
‘పిల్లలకు తమ మీద ప్రేమ ఉంది. బాగానే చూసుకుంటున్నారు.. కానీ ఏదో వెలితి మనసులో సుళ్ళు తిరుగుతూ ఉంటోంది. ఒక సంవత్సరానికి పిల్లలు పెట్టే దుబారా ఖర్చుతో ఒక సామాన్యమైన కుటుంబంలోని ఆడపిల్లకు సులభంగా పెళ్లి చేయొచ్చు!’ అనుకునేది పావని.
మళ్లీ అంతలోనే ‘పిల్లలు హాయిగా ఉంటే తను ఎందుకు సంతోషంగా లేదు?..ఎందుకు అసంతృప్తి పడుతోంది?.. తన ఆలోచనావిధానం సరిగ్గా లేదేమో!’ అనుకుంటూ ఉండేది.
సారిక, శశిధరుల పెళ్లిరోజు వేడుక ఆర్భాటంగా జరిగింది. హోటల్లో భోజనాలు, రిటన్ గిఫ్ట్స్, ఫోటోలు, వీడియోలు అంతా కలిపి రెండు లక్షలు దాటింది.
***
శ్రావణమాసం వచ్చింది.
విజయవాడలో ఉండే పావని తమ్ముడు భాస్కర్ కూతురు పెళ్లి.
తన ఇంట్లో మొదటి కార్యం.. అక్కను, బావను, పిల్లల్ని మరీ మరీ పిలిచాడు భాస్కర్.
బెంగళూరు నుంచి శివాని పెళ్లి టైమ్‌కు వచ్చి వెళ్తానంది.
శశిధర్ తల్లిదండ్రులను తీసుకొని విజయవాడ చేరాడు. భాస్కర్ ఇంట్లో బంధువుల తొక్కిడి అని పాయకాపురంలో తమ ఇంట్లో దిగారు పావని వాళ్ళందరూ.
పెళ్లిరోజు వాన మొదలైంది. వానలోనే పెళ్లి జరిగింది.
రాత్రి అప్పగింతలు.. రాత్రికి పెళ్లి వాళ్ళు వెళ్లిపోయారు..
ఆ రాత్రి శివాని కూడా ఫ్యామిలీతో బెంగుళూరు వెళ్లిపోయింది.
పావని వాళ్ళు వచ్చి ఆ రాత్రికి తమ ఇంట్లో ఉన్నారు. రెండోరోజు ప్రయాణం.
తెల్లవారేటప్పటికి తుఫాను గురించి హెచ్చరికలు వినిపిస్తున్నాయి. బస్సులు తిరగటం లేదు. పిల్లలతో ఈ వానలో ప్రయాణం కష్టమని ట్రైన్ టిక్కెట్లు కాన్సిల్ చేశాడు శశిధర్. మామూలుగా బంగాళాఖాతంలో తుఫాన్లు ఎక్కువ. ఏదో రెండుమూడు రోజులకు తగ్గుతుంది.. వాన తగ్గాక హైదరాబాద్ వెళ్లొచ్చు అనుకుంటూ ఇంట్లోనే సరదాగా కాలక్షేపం చేస్తున్నారందరూ.. ఎప్పుడూ విజయవాడకు అంత వరద ఉధృతంగా రాలేదు. ఆ రోజు సాయంత్రనికి ఊరు దిబ్బంధం అయిపోయింది.
ట్యాంకులో నీళ్లు పట్టి వాటర్ క్యాన్లు నాలుగైదు తెచ్చి పెట్టుకున్నారు. దొరికినంత వరకు పాల ప్యాకెట్లు, నిత్యవసర వస్తువులు, కూరలు తెచ్చి పెట్టారు. ఒక గంటకల్లా కరెంటు పోయింది. రెండు గంటల్లో వరద ఉగ్రరూపం దాల్చింది. లోపలికి తన్నుకొని నీళ్లు వస్తున్నాయి. భయమేసిందందరికి.
“అమ్మా! స్టవ్, కాస్త సామాన్లు తీసుకొని పైకి వెళ్దాము!” అంటూ శశిధర్ గబాగబా బట్టల బ్యాగులు సర్దేశాడు. అరగంటలో పైకి చేరారందరూ.
పైన అద్దెకున్న వాళ్ళది చిన్న కుటుంబం. భార్యాభర్త, వాళ్ళకు మూడేళ్ల బాబు. వీళ్ళు కూడా వాళ్ళతోపాటే అక్కడే ఇరుక్కున్నారు
భయానకమైన వరద!.. బీభత్సంగా వాన!.. భగవంతుడిని ప్రార్థిస్తూ కూర్చుంది పావని. ఆ మరునాటికి కూడా వరద ఉధృతి తగ్గలేదు!.. ఏం చేయాలో పాలు పోవడంలేదు. మేడ మీద నుంచి చూస్తే చుట్టూ నీళ్లు తప్ప ఏమీ కనిపించడం లేదు.. పాయకాపురం దాదాపుగా మునిగిపోయింది! ఇంట్లో త్రాగటానికి నీళ్లు కొద్దిగానే ఉన్నాయి. పైన మిద్దె ఏ నిమిషమైనా కూలేట్లుగా ఉంది. వంటిట్లో కిటికీ ఊడిపోయింది. బియ్యం, పప్పులు తడిసి, నీళ్ళల్లో తేలుతున్నాయి. హాల్లో కూర్చున్నారందరూ! సారిక వెక్కివెక్కి ఏడుస్తోంది.. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. శశిధర్, కేశవలు జీవం కోల్పోయినట్లు చూస్తూ ఉన్నారు.. మాట్లాడటానికి కూడా ఎవ్వరిలోనూ శక్తిలేదు.. అద్దెకున్నవాళ్ళు తమ బిడ్డను పట్టుకొని నిస్తేజంగా జారగిలపడి ఉన్నారు.. ఒక పక్క చలి.. మరో పక్క హోరున గాలివాన.. నిమిషమొక యుగంలా గడుస్తోంది. మధ్యాహ్నం అయింది. హాల్లోకి కూడా నీళ్లు వస్తున్నాయి..
అంతలో అధికారులు పడవల్లో తిరుగుతూ వస్తున్నారు.. వెనకాల ట్రాక్టర్లు వస్తున్నాయి. మైకు పట్టుకొని అరుస్తూ పైన మిద్దెల మీద ఉన్న మనుషులని వాలంటీర్లు కిందకు దించి ట్రాక్టర్లలోకి ఎక్కిస్తున్నారు.
‘ముందు ప్రాణాలు నిలిస్తే చాలు!’ అనుకుంటూ కట్టుబట్టలతో ట్రాక్టర్లలో కూర్చుంటున్నారు చుట్టుపక్కలవాళ్ళు.
కేశవ ఫ్యామిలీని, అద్దెకున్నవాళ్ళనీ కూడా ట్రాక్టర్లో కూర్చోబెట్టారు వాలంటీర్లు.
అంతా జలమయం! బిక్కుబిక్కుమంటూ ట్రాక్టర్లలో ఇరుక్కుని కూర్చున్నారందరూ.
అధికారులు తీసుకొచ్చిన పునరావాస కేంద్రానికి వచ్చారు. అందరూ అక్కడ తమలాంటి వాళ్లే! చాలామంది ఉన్నారు! పేద గొప్ప తేడా లేదు! అన్నీ పోగొట్టుకొని బికారుల్లాగా భయం భయంగా ముడుచుకొని కూర్చుని ఉన్నారు.
అక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలకు చెందిన వాళ్ళు వచ్చిన వాళ్లకు ఆహారాన్ని ప్లేట్లల్లో వడ్డిస్తున్నారు.. ప్రాణాలు లేచి వచ్చాయి పిల్లలకు.. వాళ్ళు ఇచ్చిన భోజనాన్ని ఆవురావురుమంటూ ఎగబడి తింటున్నారు చిన్నపిల్లలు.
‘ఇంట్లో ముద్దుగా పెడితే ఒక్కో ముద్ద తినడానికి మారాం చేసే పిల్లలు భిక్షగాళ్లలాగా ఎగబడి తింటున్నారు! తమకు ఎటువంటి దుస్థితి వచ్చింది? ఎంత దీనులమైపోయాము!’ అనుకుంటూ శశిధర్ బెంగగా చూస్తూ నిలుచున్నాడు.
చిన్నపిల్లల్ని పట్టుకొని ఒక మూల కూర్చుంది పావని. పొట్టలోంచి వణుకు పుడుతోంది! చలిగాలి రివ్వున వీస్తోంది!..
ఇంతలో పావని దగ్గరగా వచ్చాడు ఒక నలభైఏళ్ల వ్యక్తి.
“అమ్మగారూ! అమ్మగారూ!”
తలెత్తి చూసింది పావని. అతడు చందు.. రామకృష్ణ మఠంలో ఉండే వంటవాడు. పావనికి బాగా పరిచయం ఉన్నవాడు.
“మన ఊరికి ఇంత ఘోర విపత్తు వచ్చి పడింది చందూ! ఎప్పుడూ ఇంత వరద చూడలేదు!” అంటూ భోరుమంది పావని.
“అవునమ్మా! పాయకాపురం, సింగ్ నగర్, రామవరప్పాడు, కండ్రిక అన్నీ మునిగిపోయాయి! ఎలాగో మనుషుల్ని తరలిస్తున్నారు! వచ్చే వాళ్లకు వండి పెడుతున్నాము! మీరు ఆ పక్కగా కూర్చోండమ్మా!.. మేము పొడి బట్టలు కూడా తెచ్చాము! అవి తెచ్చి ఇస్తాను! కాస్త చలి తగ్గుతుంది!” అంటూ పావనీ వాళ్ళందరినీ ఒక పక్కగా తీసుకెళ్లాడు చందు.
ఆ పక్క హాల్లో బట్టలు ఉన్నాయి. అవి అందరికీ పంచుతున్నారు వాలంటీర్లు. ఆ బట్టలు తీసుకొని ఒక మూల చోటు చూసుకొని పిల్లల్ని పడుకోబెట్టుకొని పడుకున్నారందరూ.
రెండో రోజుకి అధికారులు కార్లు ఏర్పాటు చేస్తే ముందు గుడివాడ చేరారు. గుడివాడలో ఫోన్ చార్జింగ్ పెట్టుకుని తమ్ముడికి ఫోన్ చేసింది పావని.
“అక్కా! మీరు ఎట్లా ఉన్నారోనని భయపడి పోయాను!” అంటూ ఏడ్చాడు భాస్కర్.
భాస్కర్ వాళ్ళుండేది సూర్యారావుపేటలో. అక్కడికి వరద ప్రభావం అంతగా లేదు.
ఊళ్లో ఉన్న మిగిలిన బంధువులందరూ క్షేమంగా ఉన్నారని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు పావని, కేశవులు.
తర్వాత రెండు రోజులకు మెల్లగా హైదరాబాద్ చేరారు. హైదరాబాదులో కూడా వాన. రోడ్లన్నీ జలమయం. ఎలాగో కష్టపడి ఇల్లు చేరారు.
ఇంటికి రాంగానే ఒక్కసారిగా అందరికీ జ్వరాలు చుట్టపెట్టాయి.
సారిక జరిగిందే తలుచుకొని భయపడుతూనే ఉంది. పిల్లలయితే అప్పుడప్పుడు నిద్రలో లేచి ఉలిక్కిపడి ఏడుస్తున్నారు.. అందరూ సర్దుకునేసరికి దాదాపు ఇరవై రోజులు పట్టింది.
వినాయకచవితికి కాస్త లేచి తిరిగారు. ఏదో పండగ అయిందనిపించారు.
దసరా పండగ వస్తోంది. ప్రతి సంవత్సరం దసరా పండక్కి సారిక బొమ్మలకొలువు పెడుతుంది.
చాలా ఆర్భాటంగా డెకరేషన్ చేసేది. పేరంటాళ్లను పిలవడం, రిటర్న్ గిఫ్ట్స్, పట్టుబట్టలు ఇలా జరిగే పండగ.. ఈసారి ఆ ఊసే ఎత్తలేదు సారిక.
‘ఆఫీసులో పని ఒత్తిడేమో!’ అనుకుంది పావని.
నవరాత్రులు మొదలవటానికి ఇంకా రెండు రోజులు ఉందనగా తల్లిదండ్రులు గదిలోకి వచ్చాడు శశిధర్.
“పండగకి ఏర్పాట్లు ఇంకా మొదలుపెట్టలేదేమిటి?” అని అడిగింది పావని.
“పండగ సింపుల్‌గా చేసుకుందామమ్మా! మధ్యాహ్నం రామకృష్ణ మఠానికి వెళ్లి వచ్చాము! చిన్నప్పుడు మనం వెళ్లేవాళ్ళం కదా! అలాగ!.. నేను, సారిక ఇంతకాలం ఏదో వ్యామోహంలో పడిపోయాము!.. ఆర్భాటంగా, హంగుగా, డబ్బు వెదజల్లుతూ.. ఖర్చు పెట్టుకుంటూ.. అదే అసలైన బ్రతుకు అనుకుంటూ బేసిక్ విలువలు మర్చిపోయాము!..
ఆ రోజు వరదలో వాళ్ళు మనకు పెట్టిన అన్నం మా ఇద్దరి కళ్ళు తెరిపించింది! ఎవరో దయామయులు చేస్తున్న సాయం మన ప్రాణాలను నిలబెట్టింది!.. విలువలతో బ్రతకటం అంటే ఏమిటో తెలిపింది!.. చిన్నప్పుడు నువ్వు చేసిన దానం ఈ రోజు మనకు ఆసరా ఇచ్చింది.. ఏదో పుణ్యం మన వెంట నడిచింది!.. మాకు తెలిసొచ్చింది!.. ఇక నుండి మీరు నడిచిన దారిలోనే మేము కూడా నడుస్తాము! మమ్మల్ని క్షమించమ్మా!.. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోలేదు!.. ఇంక డబ్బు దుబారా చెయ్యము!.. రెగ్యులర్‌గా స్వచ్ఛంద సంస్థలకు వెళుతూ, దానం ధర్మం చేస్తూ ఉన్నంతలో వాలంటీర్లగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉందామనుకున్నాము! అందుకే రామకృష్ణమఠానికి వెళ్లి వచ్చాము!..” శశిధర్ కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.. అతడి కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా రాలుతున్నాయి..
కొడుకుని భుజం పట్టుకొని దగ్గరకు తీసుకున్నాడు కేశవ్. కొడుకు తల నిమురుతూ కూర్చుంది పావని.
సారిక పిల్లలను తీసుకొని గదిలోకి వచ్చింది.
మంచం మీదకెక్కి తాతయ్య మెడచుట్టూ చేతులు వేశాడు పెద్దవాడు. బామ్మ ఒడిలోకి చేరాడు చిన్నవాడు.
“బామ్మా! నేను కూడా చాలా పని చేస్తాను! వాన వస్తే అందరికీ అన్నం పెడతా! దుప్పట్లు తెచ్చి ఇస్తా!” అన్నాడు చిన్నవాడు ముద్దుగా. మనవళ్ళని దగ్గరికి తీసికొని ముద్దులు పెట్టుకుంది పావని.
ఇప్పుడు ఆ ఇంటిలోకి నిజంగా పండగ వచ్చింది. నవజీవన వికాసానికి నాంది పలికింది. సంతోషంతో ఉప్పొంగిపోయింది పావని హృదయం.