[బాలబాలికల కోసం ‘మానవాళికి మహోపకారం చేసిన సర్ రొనాల్డ్ రాస్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
ఒకప్పుడు మశూచి, ప్లేగు, కలరా, మలేరియా వంటి రోగాలు ప్రజల్ని గడగడలాడించేవి. పూర్వం మలేరియాను విషజ్వరంగా పేర్కొనేవారు. ఇటువంటి భయంకర రోగం మలేరియాకు కారణమైన ‘ప్లాస్మోడియం’ క్రిముల్ని కనుకున్నదెవరో తెలుసా? ‘సర్ రొనాల్డ్ రాస్’ అనే భారతీయ శాస్త్రవేత్త. ఆయన ఈ పారాసైటును ఎక్కడ కనుక్కున్నాడనుకుంటున్నారు? మన తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరంలోనే. ఆ వివరాలను తెలుసుకుందామా!
రొనాల్డ్ రాస్ 1857వ సంవత్సరం మే 13వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని అల్మోరాలో జన్మించారు. హైస్కూలు చదువు వరకు భారతదేశంలోనే చదివి వైద్య విద్యను అభ్యసించడానికి 1874లో లండన్ వెళ్ళాడు. 1879వ సంవత్సరానికల్లా మెడిసిన్ పూర్తి అయింది.
1881లో భారత్ తిరిగి వచ్చి ఇండియన్ మెడికల్ సర్వీసులో జాయిన్ అయ్యారు. సికిందరాబాదులో ఉన్న బ్రిటిష్ కంటోన్మెంటులో ఉద్యోగం చేస్తూ, మలేరియాపై పరిశోధనలు జరిపారు. 1902లో ఇంగ్లండులోని స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్‌లో లెక్చరర్‌గా నియమితులయ్యారు.
దోమలు కుట్టడం వలననే మలేరియా జ్వరం వస్తుందని ఒక ఇటాలియన్ శాస్త్రవేత్త 1870లోనే కనుగొన్నారు. అప్పటి వరకు మలేరియాకు కారణం దోమలే అని భావించేవారు. ఆ తరువాత కాలంలో సర్ పాట్రిక్ మాన్ సన్ అనే శాస్త్రవేత్త దోమలు కేవలం మలేరియా పారాసైటును కలిగి ఉండే క్యారియర్స్ మాత్రమే అని కనుగొన్నాడు.
1875లో రొనాల్డ్ రాస్, సర్ పాట్రిక్ మాన్‌సన్ లు మలేరియా వ్యాధి గురించి తీవ్రంగా పరిశోధించారు. చివరకు రొనాల్డ్ రాస్ మలేరియల్ పారాసైటును గుర్తించారు. దోమలు మలేరియా వ్యాధిగ్రస్థుడిని కుట్టినపుడు ప్లాస్మోడియం దోమ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అటువంటి దోమ ఆరోగ్యవంతుడైన మానవుడిని కుట్టడం వలన తిరిగి వ్యాధి మానవునికి సంక్రమిస్తుంది. అయితే అన్ని దోమలూ ఇలా చేయలేవు. కేవలం ఆడ అనాఫిలస్ దోమలు మాత్రమే ఇలా క్యారియర్స్ పనిచేస్తాయి. 1898లో చివరకు మలేరియా పారాసైటును విడదీయగలిగారు. దీనివల్ల మానవాళికి మహోపకారం జరిగింది.
‘రాస్’ 1910లో ‘ది ప్రివెన్షన్ ఆఫ్ మలేరియా’ అనే గ్రంథాన్ని వ్రాశారు. 1911లో బ్రిటిష్ చక్రవర్తి ఆయనకు ‘నైట్ హుడ్’ ఇచ్చి గౌరవించారు. అప్పటి నుంచి ఆయన ‘సర్ రొనాల్డ్ రాస్’ అయ్యారు. 1913 నుండి, 1932లో ఆయన మరణించేదాకా ‘సైన్స్ ప్రోగ్రెస్’ అనే వైజ్ఞానిక పత్రికకు సంపాదకునిగా వ్యవహరించారు. మలేరియా మనుషులకే కాక జంతువులకు, పక్షులకు కూడా రావటాన్ని రొనాల్డ్ రాస్ గమనించారు. మలేరియాకు కారణమైన ‘ప్లాస్మోడియం’ను కనుగొన్నందుకు 1902లో నోబెల్ పురస్కారం ‘రొనాల్డ్ రాస్’ కు లభించింది.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
