[శ్రీ పోలయ్య కూకట్లపల్లి రచించిన ‘మానవతా ద్వారాలు..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
1.
పిల్లలను దీవించి చూడు..
వారి నవ్వుల్లో దేవాలయ
దీపాలు వెలుగుతాయి..
బంగారు భవిష్యత్తు
పూలతోటలా పరిమళిస్తుంది..
తల్లిదండ్రులను పూజించి చూడు..
వారి ఆశీర్వాదం
అమృత వర్షమై కురుస్తుంది..
జీవిత మార్గం సుగమ
సువర్ణ రేఖలా మారుతుంది..
పెద్దలను గౌరవించి చూడు..
అనుభవం నీకు
దిక్సూచిగా నిలుస్తుంది..
అజ్ఞాన చీకట్లను
జ్ఞాన వెలుగు తొలగిస్తుంది..
2.
ఇరుగుపొరుగును ప్రేమించి చూడు..
మనసుల మధ్య
స్నేహ వంతెనలు కడతాయి..
కలతల గోడలు
కరిగి మమతలు పూస్తాయి..
వృద్ధులను ప్రేమగా పలకరించి చూడు..
కాలం వంగిన ఆత్మల్లో
కృతజ్ఞత పువ్వులు వికసిస్తాయి,
నిశ్శబ్దం కూడా సంగీతంగా మారుతుంది..
అనాథలను ఆదరించి చూడు..
వారి కన్నీటి మబ్బులు
ఆశాకిరణాలుగా మారతాయి..
జీవితం వారికి
కొత్త ఉదయంగా పుడుతుంది..
3.
శత్రువులకు
అమృతహస్తం అందించి చూడు..
వైరం కరిగి మైత్రి వెన్నెల వెలుగౌతుంది..
రగిలే హృదయం
శాంతి మందిరంగా మారుతుంది..
అభాగ్యుల ఆకలి తీర్చి చూడు..
ఒక అన్నపు ముద్దకు
ఆకాశమే తృప్తి పొందుతుంది..
పేదరికం పరాజయ గీతం పాడుతుంది..
బాటసారుల దాహం తీర్చి చూడు..
ఒక నీటి చుక్కలో
జీవన సముద్రం నిండి పోతుంది..
మానవత్వం పరిమళిస్తుంది..
4.
నీడలేని వారికి నీడనిచ్చి చూడు..
నీ దయచెట్టు విశ్వానికి ఆవాసమౌతుంది..
సూర్యుడు కూడా క్షమగా చూస్తాడు..
నిరాశలో కృంగిన వారిని ఓదార్చి చూడు..
నీ మాటే వారికి ఆశాకిరణ మౌతుంది,
చిమ్మ చీకటి చిరునవ్వుగా మారుతుంది..
పరమాత్మను భక్తితో ప్రార్థించి చూడు..
నీ అంతరంగం
ఆకాశమంత విశాలమౌతుంది..
ఆత్మ శాంతిసుధా
సముద్రంలో మునిగిపోతుంది..
నిర్మలమైన నిష్కల్మషమైన
ప్రతి చూపు.. నిత్య సత్య సుందరం..
తెరచిన ప్రతి హృదయం..
మానవత్వానికి ఒక దివ్య దైవ మందిరం.
శ్రీ పోలయ్య కూకట్లపల్లి హైదరాబాద్ వాస్తవ్యులు. ‘కవి రత్న’, ‘సాహిత్య ధీర’, ‘సహస్ర కవి భూషణ్’ బిరుదాంకితులు.
