[సుధా కళ్యాణి ఆచంట గారు రచించిన ‘మానవత్వం మరువకమ్మా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
పురిటినొప్పులకోర్చి పుడమికి తీసుకొచ్చి
ఆపసోపాలు పెట్టేటి ఆటుపోటులయందు
నేనున్నానని బిడ్డని పొదివిపట్టుకుంటూ
మాధుర్యాన్ని చవి చూపేది కదా అమ్మంటే!
మాట చెల్లలేదని వాదులాడుకుంటూ
సర్దుబాటే ఎరుగని ఆలుమగలింట
మూడుముళ్ళ బంధమే ముళ్ళబాటవుతుంటే
చిన్నబోతున్నవి నేడు పసిప్రాణాలెన్నో!
తప్పటడుగులను సరి చేస్తూ
ఇంతింతై వటుడింతై అని మురిసిపోతూ
బిడ్డల వెంట నీడలా నడిచొచ్చే
స్వార్థమెరుగని దీవెనే కదా కన్న ప్రేమంటే!
ఆశల గుర్రాలకు కళ్ళెమేయలేక
అడ్డదారిలో ఆనందాల భ్రమల వెంట
పరుగులు పెడుతున్న కొందరు అమ్మానాన్నలు
అనుబంధాల చేనును మింగేస్తున్న కంచెలు!
విలువల వలువలను వదిలేసుకుంటూ
పసిబిడ్డల ఉసురును బలి తీసుకుంటుంటే
మరి ఎవరినడగాలి కన్న ప్రేమను వదలద్దని?
మానవత్వం మరువకమ్మా అని!!
