Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మానవీయ మేధస్సు

[శ్రీ పొన్నాడ సత్యప్రకాశరావు రచించిన ‘మానవీయ మేధస్సు’ అనే కవితని అందిస్తున్నాము.]

దరంగం ఆట పోటీ (1997)
విశ్వవిజేత కాస్పరోవ్‌ ఇటువైపు
కానీ అందరి చూపులు అటువైపు
ఎందుకంటే ఆవైపున్నది ఓ యంత్రం
ఓడిపోయాడా విశ్వవిజేత
ఆ ‘డీప్‌ బ్లూ’ యంత్రం చేత
*
క్లిష్టమయిన మెదడు శస్త్ర చికిత్స
గాటు కొద్దిగా ప్రక్కకు పడినా
ప్రాణాలు పోక మానునా
అందుకే నిపుణులకు సైతం ఆందోళన
కానీ రోబో సాయంతో పని చులకన
*
అర్జెంట్‌గా యాభైవేలు కావాలి నాన్నా..
కొడుకు అర్థిస్తున్నాడు వీడియో కాల్‌లో
పంపించేసాడు తండ్రి ఆన్‌లైన్‌లో
కానీ షాకయ్యాడు అప్పుడే కొడుకు వస్తే ఆఫ్‌లైన్‌లో.
*
“ఎంతసేపు చూస్తావు మొబైల్‌ని”
స్క్రీన్‌ టైం మీద ఆంక్షలు పెట్టిన తల్లిదండ్రులను
‘ఫట్‌’ మనిపించమని సలహా ఇచ్చిందో ‘ఐచాట్‌’
*
విశ్వ విజేతను ఓడించగల శక్తి
క్లిష్ట శస్త్ర చికిత్సను సులభం చేసే యుక్తి
మోసగాళ్ళ శ్రమను తగ్గించె నైపుణ్యం
ప్రతికూల సలహాలివ్వడానికి వెనుకాడని వైనం
ఈ అటూ ఇటు వ్యవహారాలు కృత్రిమ మేధస్సువి
రైటుకి సంతోషించాలా..
చేటుకి తలదించుకోవాలా..
కృత్రిమ మేధస్సు.. కేవలం
సమాచార భరితం, భావరహితం, గణితం
ప్రోగ్రామర్‌ ఆధీనం.
నిర్ణయం.. సాంకేతికం, కొండొకచో అమానవీయం
మానవ మేధస్సు..
అనుభవసహితం, సృజనాత్మకం, సుగుణం
నిర్ణయం.. సున్నితం, సమంజసం
కానీ.. కానీ.. మానవ మేధస్సుని వాడుతోంది
స్వార్థ ప్రయోజనాలకు, విభజనలకు, విధ్వంసాలకు
దీనికి కృత్రిమ మేధస్సు తోడయితే.. సర్వనాశనం..
కావలసింది కృత్రిమ మేధస్సా, మానవ మేధస్సా, కాదు `
‘మానవీయ’ మేధస్సు..
మానవ తప్పిదాలను తగ్గించగల కృత్రిమ మేధస్సు
మానవీయ మేధస్సు నియంత్రణలో ఉంటే
సర్వం శుభకరం..

Exit mobile version