Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మార్పు రావాలి

[సూర్యదీప్తి గారు రచించిన ‘మార్పు రావాలి’ అనే కవితని అందిస్తున్నాము.]

మరణానికి పయనమా..
పయనంలో ధైర్యమా..

ఏకాంతం ఒక యోగం అంటుంది ప్రాచీన భారతీయత
ఒంటరితనం శాపం అని ఆత్మహత్యను ఆశ్రయిస్తుంది
నేటి యువత

సమస్యలోనే పరిష్కారం దాగి ఉంటుంది అంటుంది మేధావుల దార్శనికత
సమస్యను మాత్రమే దర్శిస్తూ అభద్రతలో కూరుకుంటుంది నేటి యువత

జీవితం కష్ట సుఖముల సమాహారం అంటుంది
మానసిక సమర్ధత
జీవితంలో సుఖం తప్ప కష్టానికి చోటివ్వని
నేటి తరం అసమర్ధత..

పుస్తకాల చదువుల్లో ఏకగ్రాత
ర్యాంకుల వేటలో సన్నద్ధత
సమస్త విషయాల్లో పరాధీనత
సమస్యను ఛేదించటంలో ఫలాయనత

లక్షల్లో జీతాలు
కోట్లలో అప్పులు
మిలియన్లలో తిప్పలు
గతుకుల రోడ్డులాంటి జీవితాలు
పడతామేమో అనే భయంతో అర్ధాంతర మరణాలు

నన్ను బెదిరించిదెవరు
నన్ను నియంత్రించేదెవరు అనే ఇగోయిజం
చిన్న వైఫల్యాలకి చావుతప్ప దారిలేదనే నైజం..

అన్నిటికీ చదువు పరిష్కారం కాదు
అనుభవరాహిత్యమైన చదువులు అవసరమే లేదు
ప్రతీ కష్టాన్ని డబ్బులు తీర్చలేవు..
అంతస్తులు ఆత్మఘోషని దూరం చేయలేవు..
సమస్యను సృష్టించుకునేది మనిషి
సమస్యను జయించాల్సింది మనిషి
మరణానికి పయనం మాని
పయనంలో ధైర్యం కనపడాలి
చీకటి నిండిన జీవితంలో వెలుగుల దివ్వెలు నిండాలి

Exit mobile version