Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మార్పు

[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘మార్పు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

మనుష్యులను విడగొడుతూ
సంఘ శాంతిని చెడగొడుతూ
యథేఛ్ఛగా సాగుతున్న
మతాచార మౌఢ్యం
కుల సంప్రదాయ మాలిన్య జాడ్యం
అనాది కాలం నుండీ
లౌకిక భావనను
నిరోధిస్తూనే వున్నది!
లోక కళ్యాణాన్ని
నిషేధిస్తూనే వున్నది!
మార్పు
దోషంలా
స్వ – సమాజ ద్రోహంలా
పరిగణించబడడమే
ఇక్కడి పధ్ధతి!
ఇక్కడి ఆనవాయితీ!

ఉగ్రవాద జాతి
ఉన్మాద వర్తనలు
రక్త పాత కామనలూ
తమ ప్రవర్తనలో
పరివర్తనను ఇష్టించవు!
కాఠిన్యం వాటి చేజారదు
కారుణ్యం దరి చేరదు!
అక్కడి శాసనం
మానవత్వాన్ని బహిష్కరించమంటుంది
అక్కడి అనుష్ఠానం
ధర్మ సూత్రాలను దహించమంటుంది
మార్పు ఎన్నటికీ రాదక్కడ!
ఆ అవకాశం లవలేశమూ లేదక్కడ!

సామ్రాజ్య వాదం
యుధ్ధోన్మాదం
పోషించే పిడివాదం
ప్రపంచ శాంతికి
పరుల ప్రగతికీ
ఏనాడూ
రవ్వంత చోటు కల్పించదు
స్వీయ లబ్దికి
ఏ మాత్రమూ లోటు రానీయదు
దాని వక్ర మనస్తత్త్వం
దాని ఆధిపత్యం
మార్పును నసేమిరా ఆమోదించదు!
అన్యుల ఆనందాన్ని
బొత్తిగా సహించదు!

కొన్ని ప్రవృత్తులలో
మార్పు వస్తుందనుకోవడం
భ్రమ!
కొన్ని ప్రవర్తనలను
మార్చాలని ప్రయత్నించడం
వృథా శ్రమ!

కాల మహిమ వల్ల
ఆది మానవుడు
ఆధునికాకృతిని పొందగలగడంలో గొప్పేముంది?
అతనికి వచ్చిన మెప్పేముంది?

జల ప్రవాహాల ప్రభావం చేత
లోలోని కరకు శిలా ఖండాలు కూడా
నిగనిగలాడే చక్కని రూపాన్ని
సంతరించుకోవూ..?

పవన ప్రసారాల ఫలితంగా
కఠిన పర్వతాలు కూడా
నునుపైన ఆకారాన్ని అందుకోవూ.?

కాల గమన ప్రాబల్యం చేత
శిలాజాలు
శిలా ద్రవాలూ
రూపాన్నే గాక
గుణాలనూ మార్చుకుని
జనులకు మేలు కూర్చుతున్నట్లు
నరుల స్వభావంలో
పదుగురికీ ఉపయోగపడే
పరివర్తన వస్తేనే ఘనం!
మానవత
అతని ఆభూషణమైతేనే ఘనం!

ఏం చేసినా
ఎన్నటికీ మార్పు చెందని
కుక్క తోక వంకర గురించి
ఎలుక తోక వర్ణం గురించీ
సామెతలను ఉదహరించుకుంటూ
సంబరపడే వ్యక్తులిప్పుడు
ఏ నాటికీ ఎంతకూ మారని
తమ దుష్ట బుద్ధులనూ
ఉపమానాలుగా
ఉపయోగించుకోవాలి!
నానుడుల్లా
ప్రయోగించుకోవాలి!

Exit mobile version