[డా. ప్రభాకర్ జైనీ గారు రచించిన ‘మాతోటి అడివి గూడ నవ్వింది’ అనే నవలికని ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]
మా ఇల్లంత చీకట్ల, నిశ్శబ్దంగ ఉన్నది. మా ఊపిరి చప్పుడు మాకే ఇనిపిస్తాంది. గదంత చూస్తాంటె శ్మశాన నిశ్శబ్దం లెక్క ఉన్నది. నిజమే గద? శ్మశానంలనే గద పీనిగెలుండేది. నా భర్త, నా చిన్నారి కన్నయ్య, నా మామ వాల్ల అర్రల గాఢంగ నిద్ర పోతాన్రు. ఎందుకంటె, వాండ్లు రాత్రి తిన్న బగార అన్నంల మేమే కొంచెం మత్తు మందు కలిపినం. మా ముందట్నే ఇంకో ఏడుగురు, మండువ లోగిట్ల పండుకోని ఉన్నరు. అంటే అండ్ల నలుగురే – మా అక్క, దాని ఇద్దరు పిల్లలు, మా అక్క అత్త – పానాలతోటి ఉన్నరు. వాండ్లకు గూడ బగారా అన్నంల మత్తు మందు కొంచెం ఎక్కువనె కలిపినం. మిగిలిన ముగ్గురెవరంటె, మా అక్క మొగుడు, వాని ఇద్దరు దోస్తులు. వాల్లు తినే బగారా అన్నంల మాత్రం, మంచి విషం కలిపినం. దాన్నే వాండ్లు పందుల్లెక్క తినుకుంట, మందు తాగుకుంట మజా చేసిన్రు. గంట గడవక ముందుగాల్నె చచ్చి, పీనిగెలయ్యిన్రు. గా ముండకొడుకులకు సచ్చి పీనిగెలయినమన్న సోయి గూడ లేదు.
గా పీనిగెల ముందట, రాబందుల్లెక్క నేనూ, మా అమ్మ, మా అత్తమ్మ కూసోని పన్నెండయ్యేటందుకు ఎదురు చూస్తాన్నం. ఎందుకంటె, పన్నెండింటికి రొండో ఆట సినిమా వదుల్తరు. జనం చానా మంది మా ఇంటి ముందట్నుంచె తిరుగుతాంటరు. ఒక్క అద్దగంటల అంత సద్దుమణుగుతది. గప్పుడు.. గప్పుడే..
గిదంత చదువుతాంటె, గీ ఆడోల్లేంది, బగార అన్నంల గీ మత్తు మందులు పెట్టుడేంది, విషం కలిపి సంపుడేంది? వీల్లసలు మనుషులేన? లేక నరరూప రాక్షసులా అని అనుకుంటాన్రు కద?
నేను నా కత చెప్త వినండి. విన్న తర్వాత మీరు గూడ మేం చేసిన పని కరెక్టేనని అంటరు. మనం జనరల్గ చెడ్డోల్ల గురించి చెప్పేటందుకు, ‘నీచులు, నికృష్టులు, పాపాత్ములు’ అని అంటుంటం కద? కనీ, నేను చెప్పేటి నా కత విన్న తర్వాత మీరే, ‘ఏ! గీ దుర్మార్గులకు గీ పేరు సాలదు. గీ అమాయకురాలి ఉసురు పోసుకున్న గీ నరరూప రాక్షసులకు డిక్షనరీల గూడ ఏ పేరుండదు. గా వాండ్లు పురుగులు పడి సావాల్సిందే!’ అని తప్పక అంటరు సూడుండ్రి.
నా పేరు.. అయినా మీకు నా పేరెందుకు గనీ, గిప్పుడు తినే బగార అన్నంల విషం కలిపి ముగ్గురిని చంపిన కద? చంపినందుకు నాకైతే ఏ బాధ లేదు. నేను పశ్చాత్తాపం కూడ పడ్త లేను. నా నాలుగేండ్ల అంతులేని వ్యథకు తెర పడిందనే సంతోషంలనే ఉన్న.
***
నేను ఇంటర్మీడియట్ పరీక్ష రిజల్టు వచ్చి పాసయిన రోజున మస్తు ఉప్పొంగి పోయిన. ఎందుకంటే, మాది ఒక చిన్న పల్లెటూరు. రోజూ దగ్గరల ఉన్న జగిత్యాల పట్టణంల ఉండే కాలేజీకి పోయి చదువుకునేటోల్లం మా ఊరి వాల్లమంత. నేను కష్టపడి ఇంటర్మీడియట్ పాసయి, ఎమ్సెట్ పరీక్షకు చదవుకోవాలని నా ఆశయం. కనీ, ఇంట్ల నన్ను ఏ కోచింగుకు పంపే ఆర్థిక పరిస్థితి లేదు. మా స్నేహితుల దగ్గర నుంచి ఎమ్సెట్కు సంబంధించిన పుస్తకాలు తెచ్చుకుని చదువుకునే దాన్ని. మెడిసినుల సీటు కోసం నా ప్రయత్నం. మా ఇంట్లో వాళ్ళకు నన్ను మెడిసిన్ చదివించేంతటి స్తోమత లేదు కనీ, మెరిటులో నాకు మెడిసిన్ల సీటు వస్తే ఎవరైన నన్ను ఆదుకుంటరని నా నమ్మకం.
ఇంతల, కడుపుతోటి ఉన్న మా అక్కకు ఆరోగ్యం బాగలేదని, నాకెట్లాగ పరీక్షలు అయిపోయినయి కాబట్టి కొన్ని రోజులు నన్ను పంపితే తనకు చేదోడు వాదోడుగ ఉంటదని, మా అక్క వర్తమానం పంపింది. గా వార్త వినంగనే నా గుండెల్ల రాయి పడ్డట్టయింది.
మా వాళ్ళతోటి నేనెంత మొరపెట్టుకున్న వినకుండా, అక్కడ కూడ ఇంట్లనే ఉండి చదువుకోవచ్చు కదా అని, నన్ను మా అక్క అత్తగారి ఊరికి పంపించిన్రు. జగిత్యాల దాటంగనె ఉన్న సారంగపూర్ అడివి దాటి పది మైల్లు పోంగనె, వాళ్ళ ఊరొస్తది. మా ఊరి నుంచి ముప్ఫై, ముప్ఫై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటదనుకోరాదండి. సారంగపూర్ అడవికి ఇటు కొనకు మేముంటె, అటు కొనకు వాళ్ళుంటరు.
***
మా అక్క నాకన్నా పదేండ్లు పెద్దది, దానికి పెండ్లయి పదేండ్లయింది. ఒక కొడుకు. ఇప్పుడు మల్ల గర్భవతి. నెలలు నిండడంతోటి సహాయం కోసం నన్ను పిలిపించుకుంటున్నది.
నాక్కూడ మనసుల మా అక్కకు సాయం చేయాల్ననే ఉన్న గూడ, అక్కడ వాల్లింట్ల ఉండెటి మనుషుల పద్ధతీపాడు నాకు నచ్చదు. మాది ఆర్థికంగ చితికిపోయిన కుటుంబం కావడంతోటి, మా అక్క పెండ్లి చేసుడు మాకు చానా కష్టమయింది. మగ పెండ్లి కుటుంబాలోండ్లు కోరినన్ని కట్నాలూ కానుకలూ యియ్యలేని మా పరిస్థితి కారణంగ చానా రోజులు మా అక్కకు పెండ్లి కాలే. మా పల్లెటూల్లెల్ల పరిస్థితి వింతగ ఉంటది. అందరూ అక్కా, బావా, మాఁవా, తమ్ముడూ అని పిలుస్తనే ఉంటరు గని ఎదుటి వాండ్ల జీవితాలల్ల నిప్పులు గుమ్మరిస్తారు. ప్రేమ ఒలకబోస్తనే ఉంటరు గని విషపు మాటలతోటి నరకం చూపిస్తరు. మా అక్కకు తొందరగ, అంటే ఈడేరిన ఐదారేండ్లకు కూడ పెండ్లి కాలే. గందుకె, ఇరుగు పొరుగు అమ్మలక్కలు మా అక్కను సూటిపోటి మాటలతోటి పొడుస్తాంటే, అది భయపడిపోయి, హిస్టీరియా వచ్చిన్దాని లెక్క, పిచ్చి పట్టినట్టు ఒర్లేది. ఇంట్లోని సామాన్లన్నింటిని బజార్లకు విసిరి కొట్టేడిది. దానికి పిచ్చి పట్టిందని అందరు గుసగుసలాడుకునేటోల్లు.
అగో, గటువంటి సమయంల మా అక్కకు ఓ సంబంధం వచ్చింది. పిలగాడు చూసేటందుకు ఏం బాగ లేడు. పిలగాని తల్లెయితే, జుట్టు యిరబోస్కోని, బిచ్చపుదాని లెక్కనే అధ్వాన్నంగ ఉన్నది. వాల్లకేం ఆస్తిపాస్తులు లేవు. పిలగానికి నిలకడైన నౌకరీ గూడ లేదు గని రెండు మూడెకరాల పొలం ఉన్నట్టుంది.
మాకు వేరే గత్యంతరం లేదు. వాల్లకు మరో దిక్కు లేనట్టుంది.
మా ఇంట్ల ఉన్న ఆ రెండు మూడు గంటల్లనే, పిల్లగాడు కోస్తున్న కోతలను చూసి, కోతలరాయుడని అనుకున్నము. ఏదో గంతకు తగ్గ బొంత అని తూతూమంత్రంగా పెండ్లి కానిచ్చేసినం. మొదటి సంవత్సరం నిండేటి సరికి పుట్టింటికి కాన్పుకు వచ్చింది మా అక్క. ఇప్పుడు రెండో కాన్పు అత్తవారింట్లనే చేయడం ఆచారం కాబట్టి, తను అక్కడే ఉండి, తనకు చేతనయితలేదు కాబట్టి తనకు సేవలు చేసేటందుకు నన్ను పిలిపించుకున్నది. దాని పెండ్లి సమయానికి నాకు పదేండ్లు. అప్పడు మా ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగ ఉండేటిది. ఇప్పుడు మా అన్న సిటీల చిన్న ఉద్యోగం చేస్తుండటంతోటి మా ఆర్థిక బాధలు, అప్పులు తీరినయి. కొంచెం హాయిగనే బ్రతుకుతున్నము.
నేను మా అక్క వాల్ల ఇంటికి పోయేటాల్లకు, ఇంట్ల మా అక్క ఒక్కత్తే ఉన్నది. వాళ్ళ అత్త ఏదో ఊరికి పోయిందని మా అక్క చెప్తే నేను ఆశ్చర్యపోయిన. నాకు మస్తు కోపం వచ్చింది. డెలివరీకి దగ్గర పడుతున్న కోడలిని వొదిలేసి ఎక్కడికి పోయిందీ గీ ముసలి ముండ అనుకున్న.
ఆ రాత్రికి మా అక్క మొగుడు బాగ తాగి తూలుకుంట ఇంటికి వచ్చిండు. నన్ను చూడంగనే వాడి కండ్లు మెరిసినయి. వాడు చనువుగ నా భుజాల మీద చేతులు ఏస్కుంట,
“ఏం మరదలు పిల్లా? బంగినిపల్లి మామిడి పండులెక్క బాగా కండపట్టి నిగనిగలాడుతున్నవులే!” అంటూ మీదమీదకీ రాబోతాంటే సారా వాసన గుప్పుమన్నది, నాకు కంపరం పుట్టి, దూరంగ జరిగిన.
“ఏందే! నా మరదలు పిల్లకు కోపం వచ్చిందా ఏందీ? అంత ఫ్రెష్షానే నువ్వు? కాలేజీల ఎవడూ ఇంకా చిలక కొట్టుడు కొట్టలేదానే? నాకు తెల్వదానే మీ కాలేజీ పోరిల యవ్వారం?” అన్నడు తూలుకుంట.
“ఏయ్! మాటలు మర్యాదగ రానీయ్! పిచ్చిపిచ్చిగ ఒర్లితే, నేనిప్పుడే మా ఊరికి పోత! ఏమనుకుంటున్నవో?” అని గట్టిగ, కోపంగ అన్న. వాడన్న మాటలకు నా మనసు కుతకుత ఉడికిపోయింది.
గింత మాట అన్నంక, ఇంగ వాణ్ణి ‘బావా’ అని పిలవడం కూడా నాకు ఇష్టం లేదు.
“అబ్బో..! సరే సరే!” అనుకుంట, అక్కడే గుంజను ఆసరా కోసం పట్టుకుని నిలబడ్డ మా అక్క చెంప మీద ఫెడిల్మని కొట్టి, “అన్నం పెట్టకుండా చోద్యం చూస్తున్నావే దొంగ లం..” అని అరిచిండు. దాంతో నేనూ, అక్కా గజగజ వణికిపోయినము.
ఇటువంటి త్రాష్ఠుడు ఉన్న ఇంట్ల నేనెట్ల ఉండాలే? నా మనసెందుకనో ప్రమాదం శంకించింది. వాడి సూపులూ, వాలకం, నన్ను చూస్కుంట వాడు చేసే వెకిలి సైగలు నాకు కంపరం పుట్టించినయి. వాడి దురుద్దేశం నాకు అర్థం అయింది. పెండ్లం చెల్లెలంటె, మరదలంటె వాడి సొంత ఆస్తి లెక్క భావిస్తాండు. గంతే కాకుండ, ‘అక్క మొగుడే దిక్కు’ అంటూ కొన్ని దరిద్రపు సామెతలు చెప్తాండు. పదేండ్లు వాన్తోటి సంసారం చేసి, మా అక్క ఎంత నరకం అనుభవించిందో గని, ఇప్పుడు కృంగి కృశించి, తొమ్మిది నెలల పొట్టతోటి ఉన్న మా అక్క కంటె, యవ్వనంల ఉన్న నేను వాడి కండ్లకు ఇంపుగ కనిపించినట్టుంది. నన్ను నమిలి మింగెయ్యాలని వాడు ఆ కొద్ది సమయంలనే నిర్ణయించుకున్నట్టున్నది.
లేక ఇదేమైనా ప్రీ ప్లాన్డ్ వ్యవహారమా ఏంది? నన్ను రమ్మని పిలవడం, వాడి తల్లి ఊరికి పోవడం, ఒంటరిగా మేమిద్దరం వాడికి చిక్కడం ఏదైనా కుట్రలో భాగమా? అవన్నీ తలుచుకునే సరికి, మేమిద్దరం ఆడవాళ్ళం, వాని బోనుల చిక్కినట్టుగ, నాకు భయం పట్టుకుంది. గందుకే, ఎంత జల్దీగ వీలైతే అంత జల్దీగ, కాదు కాదు వీలైతే మా అక్కను గూడ తీసుకుని రేపే మా ఊరు వెళ్ళిపోవాల్నని, అక్కడ్నే డెలివరీ చేయించాలని నిశ్చయించుకున్న. బోడి ఆచారాలని కూసుంటే, నా జీవితం కుక్కలు చింపిన యిస్తరి లెక్క అయితనిపించింది. అయినా, ఆ రాత్రి భయంతోని నాకు కంటి మీద కునుకు పట్టలేదు. ఒంటి నిండ చెద్దరు కప్పుకుని కుర్చీలనే కూర్చున్న.
ఆ దరిద్రుడి చేతిల దెబ్బ తిన్న మా అక్క, తిండి తినకుండనే, వెక్కివెక్కి ఏడ్చుకుంట, నేల మీదనే పండుకోని నిద్రపోయింది.
రాత్రి రెండయినట్టుంది. నేను మాగన్నుగా ఉన్నప్పుడు ఒక తియ్యటి సువాసన నా ముక్కు పుటాలకు సోకినట్టయ్యింది. నేను అట్లనే గాఢమైన మత్తులకు జారుకున్న. తెలివొచ్చి చూసేటాలకు నేను గా ఊరికి ఆనుకోనే ఉన్న సారంగాపూర్ అడవిల పడి ఉన్న. చుట్టూ అడవిని చూసి నా పై ప్రాణం పైన్నే పోయి, ఉలిక్కిపడి లేచి కూర్చున్న. చూస్కుంటె, నా ఒంటి మీద ఒక్క నూలుపోగు గూడ లేదు. నాకు నేనే సిగ్గుతోటి చచ్చిపోయిన. ఒళ్ళంతా రక్తపు మరకలు. ఒక మహా యంత్రంల నా శరీరాన్ని పెట్టి, తిప్పి, పిప్పి తీసినట్టుగ ఒళ్ళంత ఒకటే నొప్పులు. నోరు పిడచ కట్టుకపోయింది. నా శరీరానికి ఏం జరిగిందో నాకు అర్థమయింది. నేను మానభంగానికి గురయిననని నాకు తెలిసి, కుళ్ళికుళ్ళి ఏడ్చిన. నేను ఎక్కడున్ననో నాకే తెల్వదు. అసలు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన దుర్మార్గుడెవడో.. బహుశా, నా అక్క మొగుడే అయ్యి ఉంటడేమోననే అనుమానం నాకు రాకపోలేదు. ఇప్పుడు ఒంటి మీద బట్టలు గూడ లేకుండ బయటికి ఎట్ల పోవాల్నో అర్థం కాలే.
అక్కడున్న నులక మంచాన్నే అడ్డంగ నిలబెట్టి దాని మాటున కూర్చున్న. ‘ఎవరైన వచ్చి చూస్తే నా పరిస్థితి, పరువు ఏం గాను?’ అన్న ఆలోచనతోటి వొణికిపోయిన.
పది నిముషాలు గడిచినంక, నా అక్క మొగుడు, వాన్తో పాటు మరో ఇద్దరు వచ్చిన్రు. వాడు రాంగనే,
“ఏం మరదలు పిల్లా? మన ఫస్ట్ నైట్ ఎట్లున్నది? కనీ, ప్రపంచంల ముగ్గురితోటి ఫస్ట్ నైట్ జరుపుకున్న రికార్డు నీకే దక్కుతదే! మా ఫ్రెండ్స్ మస్తు ఖుష్ అయ్యిన్రు తెల్సానే? మంచి రంజుగ, మార్వాడోని హోటల్ల కలకంద లెక్క మస్తు తియ్యగున్నయే నీ పెదాలు. దయ్యం లెక్కున్న గా నా పెండ్లాంకి నీకు అస్సలు పోలికనే లేదే!” అంటూ వెకిలిగా నవ్వుకుంట నా దగ్గరికొచ్చి,
“ఏందే! నిన్న బాగ నకరాల్ చేసినవ్! నేను ముట్టుకుంటేనే మాసిపోతనన్నట్టుగ రుబాబ్ చేసినవ్! మీ ఊరికి పోతనని బెదిరించినవు గదనే? ఏదీ, గిప్పుడు పోవే చూద్దాం! నీ శరీరంతోటి రాత్రంత మేమందరం మస్తు ఆటలాడుకున్నం. నువ్వు ఇచ్చిన సుఖం, మా జీవితాలల్ల మర్చిపోలేమే! అందుకే, అందరం వీడియోలు తీసి, ఇగో, గీ ఫోన్లల్ల, భద్రంగ దాచి పెట్టుకున్నం.
మాతోటి మంచిగుంటె, ఎప్పుడు పిలిస్తె అప్పుడు, ఏడికి పిలిస్తె ఆడికి నువ్వు రావాలె, మమ్మల్ని ఖుషీ చెయ్యాలె. గప్పుడే, గా వీడియోలు బయటికి రావు. లేకపోతే, తెల్లారేటాలకు, మొత్తం సోషల్ మీడియాల ఫేమస్ అయిపోతవు. రోడ్డు మీద తిరగలేవు. కాబట్టి మేం పిలిచినప్పుడల్ల నువ్వు మంచిగ తయారయి, సంతోషంగ రావాలే. మా కోరిక తీర్చాలె. మాతో బాగుంటే, నిన్ను బాగా చూసుకుంటరు, నగలూ, చీరెలూ.. నువ్వు కోరుకున్నయన్ని యిస్తరు మా ఫ్రెండ్స్! ఏమంటవ్?” అన్నడు.
నా పై ప్రాణాలు పైనే పోయినయి. మెడిసిన్ చదవాలనుకున్న నా కల, పేకమేడ లెక్క నా కండ్ల ముందట్నే కూలిపోతున్నట్టయింది. నా భవిష్యత్తు అంధకారబంధురమై పోయిందని కుమిలి కుమిలి, పొగిలి పొగిలి ఏడ్చిన.
నేను ఏడుస్తాంటె, గా పాపాత్ముల కండ్లల్ల పైశాచికానందం కనపడింది. నాకు నీరసంతోటి శోష వొచ్చేటట్టుండటంతోటి, వాడు నా మీదకు విసిరేసిన పొట్లంలోని ఇడ్లీని ఆబగ తింటాంటే, గా ముగ్గురు సర్కస్ల జంతువును చూసి నవ్వినట్టు నన్ను చూసి నవ్విన్రు.
గా దరిద్రులు నా శరీరం మీద చేసిన దాడితోటే కుళ్ళిపోతున్న నేను వాడన్న మాటలతోటి వేటగానికి చిక్కిన లేడిపిల్ల లెక్క వణికిపోయిన. నా దరిద్రం కొద్ది, గా పాపిష్టోళ్ళు పడేసిన ఇడ్లీతోనే కడుపు నింపుకున్న నా మీద నాకే అసహ్యంగనిపించింది. నేను నా భవిష్యత్తును తలుచుకుంట ఏడుస్తాంటే, ఆ ముగ్గురు మరొకసారి నా శరీరంతోటి విచ్చలవిడిగ ఆడుకున్నరు. ఒకడు నా మీద పడితే, మిగిలిన వాళ్ళు వీడియోలు రికార్డు చేసిన్రు. నేను బలహీనంగ, నిస్సహాయంగ, గా దాడి నా శరీరం మీద కాదన్నట్టుగ, జీవచ్ఛవం లెక్క పడి ఉన్న.
***
ఆ రోజు పగటేలకు నన్ను మా అక్క వాండ్ల ఇంటి ముందట పడేసి, వాడు పారిపోయిండు. నన్ను చూసిన మా అక్క అవాక్కయ్యింది, భోరుమని ఏడ్చింది. వెంటనే హైదరాబాదుల సాఫ్ట్వేర్ కంపెనీల పనిచేసే, నా అన్నకి ఫోన్ చేసింది. రాత్రికి తను రాంగనే, గ్యాంగ్ రేప్‌కు గురయిన నన్ను చూసి కుళ్ళికుళ్ళి ఏడ్చిండు.
ఇప్పుడిప్పుడే మా జీవితాలు గాడిన పడుతున్నయనుకుంటున్న తరుణంల నా జీవితం గిట్ల నాశనమయినందుకు మా అన్న బాగ డీలా పడ్డడు. నిశ్చేష్టుడై, మౌన రుషి లెక్క విచారంగ కూలబడిపోయిండు. మా అమ్మకు అక్కే ఫోన్ చేసి, జరిగిన దారుణం గురించి చెప్పింది. నా మీద అఘాయిత్యం చేసినోడు, మా అక్క మొగుడే కాబట్టి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్తదని, వెంటనే, మా ఊరికి రమ్మని, మా అమ్మ నెత్తీ నోరు కొట్టుకుంట చెప్పింది.
మేమందరమూ, మర్నాటి పగటి సమయాన సర్వం కోల్పోయిన కాందిశీకుల్లెక్క, ఎవరి కంట కనపడకుండ మా ఊరికి బయల్దేరినం.
(ఇంకా ఉంది)
డా. ప్రభాకర్ జైనీ ప్రసిద్ధ రచయిత. వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమీషనర్‌గా పదవీ విరమణ చేశారు. నంది అవార్డు గ్రహీత. సినీ దర్శకులు. ఇప్పటికి 31 నవలలు రచించారు. ఫోన్: 7989825420
