[డా. ప్రభాకర్ జైనీ గారు రచించిన ‘మాతోటి అడివి గూడ నవ్వింది’ అనే నవలికని ధారావాహికగా ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]
[తమ ఇల్లంతా చీకటిగా, నిశ్శబ్దంగా ఉందని తన కథ చెప్పడం మొదలుపెడుతుంది ఓ యువతి. ఆమె భర్త, కొడుకు, మామగారు దూరంగా నిద్రపోతుంటారు. వాళ్ళు తిన్న బగార రైస్‌లో తక్కువ మోతాదులో మత్తుమందు కలపడంతో, ఒళ్ళు తెలియకుండా నిద్రపోతుంటారు. మండువ లోగిట్లో మరో ఏడుగురు నిద్రపోతుంటారు. అందులో కథానాయిక వాళ్ళ అక్క, ఆమె ఇద్దరు పిల్లలు, అక్క అత్తమ్మ మాత్రం ప్రాణాలతో ఉంటారు. మిగతా ముగ్గురు – అంటే – అక్క భర్త, అతని ఇద్దరు స్నేహితులు చచ్చిపోయారు. ఎందుకంటే వాళ్ళు తిన్న బగార రైస్‌లో మంచి విషం కలిపారు. ఆ శవాల ముందే నాయిక, ఆమె అత్త, అమ్మ కూర్చుని, సమయం రాత్రి పన్నెండు గంటలు అయ్యేందుకు ఎదురూచూస్తుంటారు. ఎందుకంటే పన్నెండింటికి సినిమా రెండో ఆట వదుల్తారు, కాసేపటికి రోడ్లు పూర్తిగా సద్దుమణుగుతాయి. అప్పుడు శవాలని డిస్పోస్ చేయాలని అనుకుంటారు. ఈలోపు నాయిక తన గతం చెబుతుంది. నాలుగేళ్ళ క్రితం అక్క రెండోసారి గర్భం దాలిస్తే, ప్రసవ సమయంలో సాయంగా ఉండడానికి నాయిక వస్తుంది. ఆమె అప్పుడే ఇంటర్మీడియట్ పాసయ్యింది. ఎమ్సెట్ రాయాలనుకుంటుంది. ఈలోపు అక్క నుండి కబురు రావడంతో, అక్క ఊరు వెళ్ళక తప్పదు. ఇంటికి వచ్చిన మరదలిని చూస్తూనే ఆమెతో దురుసుగా ప్రవర్తిస్తాడు. ఒంటిమీద చేయి వేయబోతాడు. తిట్టి, బెదిరిస్తుంది. అక్క ముఖం చూసి ఓర్చుకుంటుంది. రాత్రి రెండు దాటాకా, ఆమె ముక్కుపుటాలకి తియ్యటి వాసన గాఢంగా సోకి, మత్తులోకి జారుకుంటుంది. తెలివి వచ్చేసరికి ఆమె సారంగాపూర్ అడవిలో నగ్నంగా పడి ఉంటుంది. ఒళ్ళంతా రక్తపు మరకలు. అక్కడున్న నులకమంచాన్ని అడ్డంగా పెట్టుకుని కూర్చుంటుంది. కాసేపటి, బావ, వాడి ఇద్దరు స్నేహితులు అక్కడికొస్తారు. తామే ఆమెను అనుభవించినట్టు చెప్తారు. వీడియోలు తీశామని, ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలని, తమకి పొందు కల్పించాలని బెదిరిస్తారు. తర్వాత ఒకరొకరుగా ముగ్గురూ మరోసారి బలాత్కరిస్తారు. వెలుగొచ్చే సమయానికి ఆమెని ఇంటి ముందు పడేసి వాళ్ళు జారుకుంటారు. అక్క చూసి అవాక్కయి బాగా ఏడుస్తుంది. హైదరాబాద్‌లో పని చేస్తున్న తన తమ్ముడికి ఫోన్ చేసి పిలిపిస్తుంది. నాయిక వాళ్ళ అన్న బాగా డీలా పడతాడు. అక్క అమ్మకి ఫోన్ చేసి జరిగినదంతా చెప్తుంది. అఘాయిత్యం చేసినోడు అక్క మొగుడే కాబట్టి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని, వెంటనే ఊరికి రమ్మని, నాయిక అమ్మ నెత్తీ నోరు కొట్టుకుని చెప్తుంది. మర్నాడు పగటి పూట ఎవరి కంట పడకుండా అందరూ ఊరికి బయల్దేరుతారు. ఇక చదవండి.]
భవిష్యత్తు గురించి బంగారు కలలతోటి, ఆకాశంలోని హరివిల్లును అందుకోవాలన్నంత తుళ్ళింతలతోటి, కేరింతలతోటి ఆ ఊరుకి వచ్చిన నేను, కారు టైరు కింద పడి నలిగిపోయి రెక్కలు ముక్కలు ముక్కలయిన సీతాకోక చిలుక లెక్క, జీవితం మీద ఆశలుడిగి, భవిష్యత్తే లేని విధి వంచితురాలిగ తిరుగు ముఖం పట్టిన.
టైరు కింద పడిన సీతాకోకచిలుక, కొస ఊపిరితో ఉండి టైరుకి అంటుకుని, టైరుతో పాటు గిరాగిరా తిరుక్కుంట ఉంటది. నా పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. వాడికి ఒళ్ళు కొవ్వెక్కినప్పుడల్ల, ఫోన్ చేయంగనె, నేను వాడి కోరిక తీర్చవలసి ఉంటది. వాడుగాని, వాడి సోపతోల్లయిన గని ఎప్పుడైన నన్ను, నింపాదిగ, కొండచిలువ జింకపిల్లను – మింగుతున్నట్టుగ – నన్ను పొందవచ్చు. లేకపోతే నా వీడియోలు బహిర్గతం చేస్తరు.
కాబట్టి, నేను పోలీసుల దగ్గరకు పోలేను, ఎవ్వరి సహాయం గూడ తీసుకోలేను.
మా అన్న నన్ను చూసినప్పట్నుండి నిశ్చేష్టుడై, ఒక్క మాట కూడ మాట్లాడకుండ, మౌనం దాల్చిండు. బస్సుల, మా తోటి కాక, వెనుక సీట్ల కూర్చున్నడు. మా ఊరు చేరే వరకు వెక్కి వెక్కి ఏడుస్తనే ఉన్నడు. తనను చూసి మేమిద్దరం గూడ కుళ్ళికుళ్ళి ఏడుస్తాంటే, ఒక తోటి ప్రయాణికురాలు సానుభూతిగ,
“ఏమయిందమ్మ? ఇంట్ల ఎవరికేమైన ప్రమాదం జరిగిందా బిడ్డా?” అని అడిగింది.
“అవునమ్మ! పాపిష్టిదాన్ని నాకే ప్రమాదం జరిగింది. నేను చచ్చిపోయిన. గిప్పుడు మీకు కనిపిస్తున్నది నా శవం.” అని చెప్పాలనుకున్న. కానీ, మా అక్క,
“అవునమ్మ! మా ఇంట్లోల్లకు పెయి బాగలేదు.” అని చెప్పింది.
“ఏం కాదులేమ్మ! భగవంతుని దయ ఉంటే, తగ్గిపోతది. ఏడవకమ్మా, అసలే ఒఠ్ఠి మనిషివి కూడ కాదు. ఏడిస్తే కడుపుల బిడ్డకు మంచిది కాదు.” అని ఆమె ఓదార్చింది.
‘భగవంతుడు అనే వాడు అసలుంటే, ఈ రాక్షస మృగమసుంటోల్లకు నన్ను ఎందుకు బలి ఇచ్చెటోడు? నేనేం పాపం చేసిన? లేడు, దేవుడు లేడు. గీడున్నోళ్ళంత సైతానులే!’ అని గట్టిగా మొత్తుకోవాల్ననిపించింది, నాకు గామె మాటలు విన్న తర్వాత.
కానీ, పాపం మా అక్క.. అదేం పాపం చేసింది? వాడు నా ముందట్నె, నిండు గర్భిణీ అని గూడ చూడకుండ దాని చెంప పగులగొట్టిండు. అటువంటిది ఈ పదేండ్లల్ల మా అక్క ఎంత టార్చర్ అనుభవించిందో? ఎన్ని హింసలకు గురయిందో? గీ పదేండ్లు ఎన్ని గండాలు దాటుకంట గీడి దాక వచ్చిందో! అది అందంగా లేకపోవచ్చు. మందబుద్ధిదే కావచ్చు. కనీ, నా తోడబుట్టినదే కద! దానితోనే సంసారం చేసే కద వాడు రెండో బిడ్డ తండ్రి కాబోతాండు.
అసలు, గిప్పుడు నాకైతె బతకాలన్న ఇంట్రెస్టు కూడ పోయింది. ‘కని, నా ఆత్మహత్య వల్ల నా అక్క కూడా ఏమైనా చేసుకుంటే, మా అన్నా, మా అమ్మానాన్నలు సమాజంల తలెత్తుకోలేక పోతరు. గా మనాదిలనే ఏమైన అఘాయిత్యం చేసుకుంటే..’ అన్న ఆలోచనలతోనే నా మనసు మొద్దుబారిపోయింది. నా శరీరమెప్పుడో చచ్చుపడిపోయింది.
ఇప్పుడు నేనొక జీవచ్ఛవాన్ని.
***
పల్లెటూల్లల్ల చానా జాగ్రత్తగ మెదలవలసి ఉంటది. మన వల్ల ఏదైన పొరపాటు జరిగినప్పుడయితే, ఇంక జెర గుంభనంగ జీవితం గడపాలే. కొన్ని వేల కండ్లు మనను గుచ్చి గుచ్చి చూస్తనే ఉంటయి. బోళాగ కనపడే మనుషులు, వారి అమాయకపు మాటల తీరు, ఒలకబోసేటి ప్రేమలూ అన్నీ బూటకమే. వారిని నమ్మి మన మనసులోని మాట బయటపెడితిమా, తెల్లారేటాలకు అది కార్చిచ్చై, మననే దహించి వేస్తది. మంచైనా అంతే, చెడైనా అంతే. కాకపోతే, మన బతుకు బజారు పాలైనప్పుడు మాత్రం, నిజాయితీగనె ఓదారుస్తరు.
అందుకనె, తెల్లారి, మేము మా ఊరికి డైరెక్టుగ పోలే. మా ఊరు సారంగాపూర్ అడవి దాటిన తర్వాత కొంత సేపటికి వస్తది.
బస్సు సారంగపూర్ అడివి మధ్యల నుండి పోతాంటె, నా హృదయం భగభగ మండింది. నాకు అపచారం జరుగుతాంటె, నిశ్శబ్ద సాక్షిగ నిలబడ్డ గా అడివిని నా హృదయం లెక్కనె భగభగ మండి నాశనమయిపోవాల్నని శపించాలన్నంత కోపం వచ్చింది. కని గిప్పుడు ఏం అనుకోని ఏం లాభం? అయినాగనీ, అడివికి కోపం, దుఃఖం, సంతోషం, నవ్వు, ఏడ్పు ఉంటయా? నా పిచ్చిగని. అడివికి హృదయం ఉండదు. అదొక ప్రాణమున్న నిర్జీవి లెక్క, గంతే! అని అనకున్న.
ముందుగ జగిత్యాలల్నే దిగినం గని ఎంటనే మా ఊరికి పోలే. జగిత్యాల నుంచి మా ఊరికి గంటల పోవచ్చు. గప్పుడే పోతే ఇంటి పనులన్ని పూర్తయితయి కాబట్టి, ఇండ్ల ముందటున్న అరుగుల మీద కూసోని, ఊర్లె ఉన్న అమ్మలక్కలందరు బాతకానీ కొట్టుకుంట ఉంటరు. గా టైముల, రెండ్రోజుల కిందనే మా అక్క పురుడు కోసం వాల్లూరికి పోయిన నేనూ, పురుడు పోసుకోకుండనే మా అక్క, పట్నంల ఉండె మా అన్న కలిసి వచ్చినమంటె, గట్ల వొచ్చిన ముగ్గుర్ని చూస్తే, ఇంగ పుకార్లు కార్చిచ్చోలే చెలరేగుతయి.
గందుకె, చీకటి పడే దాక బస్టాండులనే కూసున్నం. నేనైతే ముఖం మీద ముసుగు వేసుకున్న. ఇక నా జీవితమంత, గిట్లనే ముసుగేసుకోని, దొంగ బతుకు బతకవల్సిందే. మా అక్క గూడ తెలిసినోల్లెవరైన చూస్తరేమోనని చెద్దరు కప్పుకోని పండుకొన్నది. మా అన్నయితే మా ఇద్దరికి దూరంగ బల్ల మీద ముడుచుకుని కూర్చున్నడు. ఒకరికొకరం తెల్వనట్టుగ నటించినం. ‘ఇదేం కర్మరా దేవుడా?’ అనుకున్న కన్నీల్లు తుడుచుకుంట.
మేం ఐదారు గంటల సేపు అక్కన్నే కూర్చుండేటాలకు, అక్కడ పనిచేసెటాయన వొచ్చి, మా వాలకం చూసి,
“ఏంది పొద్దట్నుంచి గీడనే ఉన్నరు. ఏ ఊరికి పోవాలె? బస్సు రాలేదా?” అని గదమాయించిండు. మా అక్క లేచి కూసోని,
“అన్నా! మా ఆయనొస్తనన్నడు. పెద్దాసుపత్రికి వరంగలుకు తీస్కపోతనన్నడు. కాన్పు కష్టమైటట్టున్నదని డాక్టరమ్మనే గాంధీ దవాకానకు చిట్టీ రాసింది. గందుకె, మా ఆయన పైసల కోసం పోయిండు. గాయన కోసమే ఎదురు చూస్తాన్నం. ఆయన రాంగనే పోతమన్నా!” అని తన పొట్టను చూపించుకుంట దీనంగ చెప్పింది. గాయన,
“అయ్యో! గట్లనా! సరే సరే జాగ్రత్త! ఏవఁన్న అవసరముంటే నన్ను పిలువ్ చెల్లే!” అని అనుకుంట పోయిండు.
బస్టాండులనే సమోసాలు తిని, చాయలు తాగి, రాత్రి చీకటి పడినంక, లాస్టు బస్సుకు, మా ఊరికి చేరుకున్నము. ఆటోను మా ఇంటి ముందు వరకు మాట్లాడుకున్నం. ఆటో ఆగంగనే, నేను ఉరుక్కుంట మా ఇంట్లకి పోయిన.
“అయ్యో! గింత రాత్రి పూట నువ్వు పుట్టింటికి వచ్చినవేందిరా! నీ కాన్పు మీ అత్తగారింట్ల అని అనుకున్నరు గద? పెయ్యి పయిలమే గద?” అని మా ఇంటి ముందటి అరుగు మీద కూర్చున్న ముసలామె మా అక్కను చూసి, అడగనే అడిగింది. మా అక్క గామె దగ్గరకు పోయి,
“బాగున్నవ పెద్దమ్మా! మా ఊర్లె నీల్ల కరువచ్చింది. మా ఇంటి బాయి ఎండిపోయింది. తాగెటందుకు గూడ నీల్లు లేక చాన కష్టమైతాంది. కాన్పు అయితే ఇంకా కష్టం కద? అందుకే, ఇక్కడైతే, మీరందరుంటరని, మా తమ్ముడు బలవంతం చేస్తే.. వచ్చిన. మరేం జెయ్యాలే చెప్పు?” అని ఆమె పక్కన కూసోని, కాసేపు ముచ్చట పెట్టి, మస్కా కొట్టి, దాన్ని మంచి చేస్కోని, ఇంట్లకి వచ్చింది.
రొండు గంటలు గడిచినయి. గా రొండు గంటలు మేమంత పోలీస్ స్టేషన్ల ఒకే అర్రల బంధించిన హంతకుల లెక్క ఒకరి ముకాలను ఒకరు చూసుకుంట, నిశ్శబ్దంగ, బయటికి సౌండ్ రాకుండ కుళ్ళికుళ్ళి ఏడ్చినము. ఎందుకంటె, ఏడుస్తున్న చప్పుడు బయటికి వినబడ్తె, మా మీద గూఢచర్యం మొదలయితది. ఇగ ఊరు ఊరంత మా మీద ఒక కన్నేసి ఉంచుతది. నీడ లెక్క వేటాడ్తది. ఇప్పటికే ఒక క్రూరమృగం నన్ను వేటాడ్తెనె నా బతుకిట్లయింది. ఇంగ ఊరు ఊరంత వేటాడితె మా పరువు గంగల కలుస్తది. కులంల పంచాయితీ పెడ్తరు. దండుగలు కట్టాలే. కులంల నుంచి వెలేస్తరు. నాకు జరిగిన దారుణమైన అన్యాయం గురించి ఎవ్వరు మాట్లాడరు గని, నా వల్ల నా కుటుంబం గూడ గా బలిపీఠం మీద నిలబడి శిక్ష అనుబవించాలె. గందుకె, గప్ చుప్ గ, కండ్లు ధారలుగ వర్షిస్తున్న గూడ, చేతులతోటి నోర్లు మూస్కోని, మౌనంగా ఉన్నం. అదెంత నరకమో అనుబవిస్తేనె తెలుస్తది.
అందుకే, రొండు గంటలు అతి భారంగ గడిపినం. గప్పుడు రాత్రి పదకొండయ్యింది. తలుపులు గట్టిగ బిగించినం. కిటికీలు మూసినం. గప్పటికి మా ఊర్లె రెండో ఆట సినిమా వొదిలిపెడ్తరు. మా ఇంటి మీదుంగనే చానా మంది నడుస్తుంటరు.
గందుకనె, గప్పటి దాక ఆగి, ఇగ గప్పుడు అందరం ఒకటే అర్రల కూసోని గొల్లుమన్నం. మా అమ్మనయితె నేల మీదబడి దొర్లుకుంట,
“నా బిడ్డ, పసిదాని బతుకు బుగ్గి పాలు చేసినవ్ కదనే ముదనష్టపు దానా? నీ మొగుడు ముండలా ముఠాకోరని తెలిసి కూడా నీ చెల్లెనెందుకు పిలిపించినవే? మనందరం కలిసి దాన్ని బలిపీఠం ఎక్కించినం కదనే?” అని అనుకుంట శోకాలు పెట్టుకుంట, మా అక్క వీపు మీద దబదబా గుద్దులు గుద్దింది. మా అన్న మా అమ్మను బలవంతంగ ఆపిండు.
వాన నుండి రక్షణ కోసం ఒక చెట్టు కింద నిలబడ్డ కుటుంబం మీదనే పిడుగు పడి విద్యుద్ఘాతానికి గురయినట్టుగ మారింది మా కుటుంబం పరిస్థితి. వాన పడ్తున్నప్పుడు చెట్టు కింద నిలబడొద్దని మా అమ్మకు తెల్వదు. గట్లనె, వయసుల ఉన్న ఆడబిడ్డను, తోబుట్టువు ఇంటిగ్గూడ సరే, ఒంటరిగ పంపగూడదన్న విషయం గూడ మా అమ్మకు తెల్వనట్టున్నది.
ఏమైనా చేద్దమా అంటే మా అక్క కాపురం నాశనమయితది. వాళ్ళు బెదిరించినట్టుగ, వీడియోలు సోషల్ మీడియాల పెడితే, మేమందరం, సకుటుంబంగ, ఉరేసుకోనో, పురుగుల మందు తాగో ఆత్మహత్య చేసుకోవల్సి ఉంటది.
తేలు కుట్టిన దొంగల్లెక్క గప్ చుప్ గ, నోర్మూస్కోని ఉండడం తప్ప ఇంక వేరే దారి లేదని మా మనసులను సముదాయించుకునేటాలకు తెల్లారుజామైంది. మా అమ్మ నన్ను ఒక్క క్షణం వదల లే. నన్ను తన కౌగిట్లకి తీస్కోని ఆ గదిలనే నేల మీదనే పండుకున్నది. మా ఇద్దరి డొక్కలు, దుఃఖం తోటి ఎగిరెగిరి పడ్తాంటె, మా అన్న మా పక్కన పండుకోని సముదాయించిండు. మొన్న రాత్రే కద, నేను అక్క వాల్లింటికి పోనని మంకుపట్టు పడ్తే, మా అమ్మ గిట్లనే కావలించుకోని, సముదాయించి పంపించింది. గీ నలభై ఎనిమిది గంటలల్లనే నా బతుకు గిట్ల బుగ్గి పాలయింది.
మా బాపుకయితే కరెంట్ షాక్ కొట్టినట్టయి, మాట్లాడ్తనే లేడు. మా బాపు మొదటి నుంచి కొంచెం మెతక మనిషి. మా అమ్మనే ఇల్లు నడుపుతది.
ఇగ తెల్లారి పొద్దట్నుంచె మా బ్రతుకు నాటకం షురువయింది. మేము మా ముకాలకు నవ్వులు పులుముకొన్నం. లోపట లోపట దహించుక పోతాన్నా గూడ, అందరితోటి మామూలుగనే ప్రవర్తించడం అలవాటు చేసుకున్నం.
ఒక రోజు రాత్రి పూట మా అక్క కొన్ని గోలీలు, పాల గ్లాసు తెచ్చి ఇచ్చుకుంట,
“తమ్ముడు వాళ్ళ డాక్టరు దోస్తును అడిగి తెచ్చిండు. గివి పాలల్ల కలుపుకుని మింగు చెల్లె! గంట సేపు కదలకుండ పండుకో!” అన్నది.
గవేమిటో నాకర్థమయి కండ్లల్ల నీల్లు తిరిగినయి. నాకు కడుపు రాకుండ ముందు జాగ్రత్త అన్నమాట. ఏ పాపిష్టోని బీజమో నా గర్భంల మొలకెత్తకుండ నాశనం చేసుడన్న మాట.
‘ఛీ! ఎంత దరిద్రమయింది గీ ఆడ జన్మ. గా దరిద్రులు కుతి తీర్చుకుని పోతే, ఆ వెధవల దరిద్రాన్ని నేను మోయాల్సి వస్తదేమోనని భయపడి, మా అన్న ప్రికాషన్ మెడిసిన్ తెచ్చి, తను స్వయంగ నాకు ఇయ్యలేక మా అక్కతోటి పంపించిండు. గీ గోలీలతోటి, ఆ వెధవల విషపు బీజాల శేషాన్ని సమూలంగా నాశనం చేస్తరెమో గనీ, నా నరనరంల రగులుతున్న కంపరాన్ని ఎట్ల వదిలించుకోవాలె? దానికేం మందులు లేవా?’ అని ఎలుగెత్తి అడగాలని ఉంది. ఎవర్ని అడిగినా గనీ, గది నా అరణ్యరోదనే అయితది. గా ప్రశ్నకు ఎవ్వరి దగ్గర సమాధానమే ఉండదు. ఇంట్లోల్లను మల్లొక్కసారి బాద పెట్టుడు తప్పితే, ఒరిగేదేం ఉండదు.
నా బాధను నేనే దిగమింగుకోవాలె. బయటపెడితే, మల్ల ఒక రౌండ్ ఏడుపులు మొదలయితయి. కాన్పు టైం దగ్గర పడుతున్న గీ తరుణంల మా అక్క మానసిక పరిస్థితి దెబ్బతింటే, హిస్టీరియాలకి పోతది. అది అసలు మంచిది కాదు. కాబట్టి కన్నీల్లు తుడుచుకుంట, గా గోలీలు గరళం మింగినట్టు మింగిన.
పావుగంట టైం గడవంగనే, నా కడుపుల ఒకటే పోట్లు. కడుపు నొప్పి భరించ లేకుండ ఉంది. నేను లుంగలు చుట్టుకుంట చాప మీద దొర్లుతనే ఉన్న. కని, ఎవర్ని పిల్వలేదు. నా కడుపుల ఒక భీకర యుద్ధం జరుగుతాంది. ఒక విధ్వంసం జరుగుతాంది. విపరీతమైన శారీరక హింసకు లోనయితాన్న. అయిన గానీ నేను బాధపడలేదు. నా గర్భకోశంల ఉన్న కల్మషాలను, ఒక గాఢమైన యాసిడ్ తోటి కడుగుతున్న, శుభ్రపరుస్తున్న ఒక ప్రక్రియ అనుకుని భరించిన.
గప్పుడే, నాకు నవ్వొచ్చింది కూడ. మా అక్క కడుపుల ఉన్న బిడ్డనేమో ప్రాణప్రదంగ కాపాడేటందుకు నేను వాళ్ళ ఊరికి పోయి, నేనొక పాపాన్ని నా కడుపుల మూట కట్టుకోని వచ్చిన, ఇప్పుడు దాన్ని కడిగి పారేసేటి దుస్థితిల పడ్డ.
మా అన్న కొత్తగ సాఫ్టువేరు కంపెనీల చేరిండు. ఎక్కవ రోజులు సెలవు దొరకదు. అన్నకు నన్నొదిలి పోవాలని లేకుండె. కనీ, మా అమ్మనె, బలవంతం చేసి పంపించింది. ఉన్న గా ఉద్యోగం గూడ ఊడిపోతే, మేం బిచ్చమెత్తుకుని బతకాలే! గివన్ని ఆలోచించే మా అమ్మ, అన్నను పట్నం నౌకరికి పొమ్మని చెప్పింది. అసలే గిప్పుడు మా అక్క పసూతి కర్చులు గూడ మా మీద బడ్డై. గందుకె, రొండ్రోజుల తర్వాత, మా అన్న హైదరాబాదుకు బయల్దేరుకుంట,
“చెల్లే! నువ్వు చదువుకున్న దానివి. నీకు ఈ పల్లెటూరి సంగతి తెలుసు. నువ్వు భయపడ్తివో, ఏదో ఉన్నదని పసిగట్టి, గీ ఊరోల్లు నీ జీవితం నరకం చేస్తరు. కాబట్టి, ధైర్యంగ ఉండు. మనందరం కలిసి ఈ సమస్య నుండి బయటపడే ఉపాయం ఆలోచించుకుందం. అక్క డెలివరీ కాంగనే, నిన్ను నాతోటి హైదరాబాదుకు తీసుక పోత! నేను పట్నం పోయినంక కొన్ని వీడియో లింకులు పంపుత. వాటిని చూడు. నిబ్బరంగ ఉండు. నాక్కూడ, నిన్నొదిలి పోవాలని లేదు. కని, మనింటి ఆర్థిక పరిస్థితి నీకు తెలుసు కద? నేను నీ ముకంలకు చూస్కుంట ఎక్కువ సేపు మాట్లాడలేక పోతాన్న. నిన్ను చూస్తెనే నాకు దుఃఖం ముంచుకొస్తాంది.” అనుకుంట నన్ను దగ్గరకు తీసుకుని, తల మీద ముద్దు పెట్టి, రొండు నిముషాలు అట్లనె ఉండి పోయిండు. అన్న లోపటలోపటనే నిశ్శబ్దంగ ఏడుస్తుంటే, అతని ఛాతీ అదరడం, అన్న ఒడిలో ఉన్న నాకు తెలుస్తాంది. కండ్ల నీళ్ళు తుడుచుకోని అన్న వెళ్ళి పోయిండు. పేదోల్ల బతుకులల్ల అయినవాల్ల విషాదాలను ఓదార్చేటందుకు గూడ టైముండదు. ఆకలి ముందు మనసుల ఉండే భావాలు, ఆత్మీయతలూ అన్నీ బలాదూరే!
(ఇంకా ఉంది)
డా. ప్రభాకర్ జైనీ ప్రసిద్ధ రచయిత. వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమీషనర్‌గా పదవీ విరమణ చేశారు. నంది అవార్డు గ్రహీత. సినీ దర్శకులు. ఇప్పటికి 31 నవలలు రచించారు. ఫోన్: 7989825420
