[డా. ప్రభాకర్ జైనీ గారు రచించిన ‘మాతోటి అడివి గూడ నవ్వింది’ అనే నవలికని ధారావాహికగా ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]
[భవిష్యత్తు గురించి తాను కన్న కలలన్నీ కల్లలయ్యాయనీ, భవిష్యత్తే లేని విధివంచితని అయ్యానని భావిస్తుంది కథానాయిక. తనని గ్యాంగ్ రేప్ చేయడమే కాక, వీడియోలు తీసి మరీ బెదిరించడం తల్చుకుని కుమిలిపోతుంది. తనది పోలీసుల దగ్గరకి వెళ్ళలేని, ఎవరి సాయమూ తీసుకోలేని పరిస్థితి అని బాధపడుతుంది. విషయం తెల్సి వచ్చిన అన్న, ఆమెను చూసి మౌనంగా బాధపడుతూనే ఉంటాడు. బస్సులో వెనక కూర్చుంటాడు. ఊరు చేరే వరకూ తనలో తాను ఏడుస్తూనే ఉంటాడు. ఏడుస్తున్న నాయికనీ, వాళ్ళమ్మని చూసి బస్‌లో ఎవరో ఏమైందని అడిగితే, తమ వాళ్ళకి బాలోదని, అందుకే దుఃఖం వస్తోందని అక్క చెబుతుంది. జగిత్యాలలో దిగగానే వెంటనే ఊరికి వెళ్ళరు. జగిత్యాల నుంచి వాళ్ళ ఊరికి గంటపడుతుంది. ఆ టైములో వెళ్తే, ఊర్లో అందరూ పనులు పూర్తి చేసుకుని, అరుగుల మీద కూర్చుని ఉంటారు, తమని చూసి అక్కర్లేని ప్రశ్నలు వేస్తారని అనుకుని, బస్టాండులోనే ఐదారు గంటలు కూర్చుని ఆ తరువాత ఇంటికి చేరుతారు. అందరూ ఏడుస్తారు. నాయిక వాళ్ళ అన్న ఏవో మాత్రలు తెచ్చిస్తాడు, కడుపు రాకుండా ముందు జాగ్రత్త కోసం! బాధని దిగమింగి, ఆ మాత్రలు వేసుకుంటుంది. తర్వాత ఆమెకి విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. అన్న హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో కొత్తగా చేరాడు. అతనికి ఎక్కువ రోజులు సెలవు దొరకదు. నాయికకి ధైర్యం చెప్పి బయల్దేరుతాడు. కొన్ని వీడియోల లింక్‍లు పంపుతాననీ, వాటిని చూసి ధైర్యం తెచ్చుకోమని చెప్తాడు. ఇక చదవండి.]
తర్వాత అన్న నాకు పంపిన వీడియోలల్ల, “రేప్‌కు గురయిన అమ్మాయిలు ఆ దుర్ఘటన తాలూకు ఙ్ఞాపకాల నుండి ఎట్ల బయట పడాలి?” అనే అంశం మీద ఆరోగ్య, మానసిక వైద్యుల, నిపుణుల సలహాలు ఉన్నయి.
అవన్నీ చూసెటాలకు నాకు కొండంత బలం వచ్చినట్టయింది.
సాధారణంగ, సామూహిక బలాత్కారానికి గురయిన మహిళను, బాధితురాలిని, తర్వాత తమను గుర్తు పట్టకుండ ఉండేటందుకు, దుండగులు హత్య చేస్తరు. నా విషయంల, అట్ల జరగక పోవడం వల్లనే నేను ప్రాణాలతోటి ఉండి ఈ క్షోభను అనుభవిస్తున్న.. గప్పుడప్పుడు ఒక బలహీన క్షణంల ‘వాల్లు నన్ను చంపేసినా బాగుండేటిది’ అని అనుకునేటి దాన్ని.
ఈ చరాచర ప్రపంచంల, మొత్తం సర్వ సృష్టిల, మానవాళికి భగవంతుడు ప్రసాదించిన దివ్య ఔషధం పేరు ‘కాలం’. ఆ కాలం అనే రసాయనానికి ఉన్న మహత్తరమైన భౌతిక లక్షణం ‘మరుపు’.
కాలం గడిచే కొద్దీ మనిషి బాధలు మరిచిపోతడు. ఏదో విధంగ పయనం సాగిస్తడు. తాము అనుభవించిన సంతోషాలను మూటగట్టి మనోమంజూషల భద్ర పరుచుకుని, మరింత ఉత్సాహంతోటి భవిష్యత్తులకు పయనిస్తడు.
అన్న పంపిన గా వీడియోలు, సాహిత్యం చదువుతాంటే, జీవితం పట్ల నా దృక్కోణమే మెల్లెమెల్లెగ మారుతాంది. కొన్ని మంచి విషయాలు తెలుస్తాంటే, నా శారీరక బాధను మరిచిపోయి, ఆధ్యాత్మిక మార్గం దిశగా ఆలోచనలు సాగుతున్నై.
కాలం కూడా నది వంటిదేనని ఒక మహానుభావుడు చెప్పిండు. నదిలోని జలరాశి ఒక నిర్దిష్టమైన స్థలాన్ని ఒకసారి దాటిందంటే, అంతే, మళ్ళీ ఆ స్థలానికి, ఆ జలరాశి రాలేదు. నదిలోని వేరే జల కణాలు ఆ ప్రాంతాన్ని తాకవచ్చు. కానీ ముందు క్షణంల ఉన్న నీరూ, తర్వాతి క్షణంలో ఉన్న నీరూ ఒకటి కావు. అవన్నీ వేర్వేరే అయిన, అవన్నీ ఆ నదీమతల్లి అంతర్భాగాలే.
అలాగే కాలప్రవాహంల కూడ అంతే, ఈ క్షణం, ఈ క్షణమే! తరువాత ఇంకొకటి రెండవ క్షణం. ఆ రెండూ ఒకటి కావు. ఒక్క ‘క్షణం’ కాలవాహిని అలల వాలున కరిగిపోతే, తిరిగి ఆ ‘క్షణం’ రాదు. మరో కొత్త ‘క్షణం’ దాని స్థానంలకు వస్తది. ఉదాహరణకు, ‘x’ అనే క్షణం మన జీవితకాలంల గడిచిపోతే, మళ్ళీ జీవితాంతం మనం ఎదురు చూసినా ఆ ‘x’ అనే ‘క్షణం’ రాదు. ‘x’ క్షణం తర్వాత ‘y, z’ ‘క్షణాలు’ రావల్సిందే. గందుకె క్షణకాలభంగురం మన జీవితం అన్నరు.
మూడు నెలలల్ల వేదాంతం నాకు బాగ వొంట పట్టింది. చేతిల స్మార్ట్ ఫోన్ ఉంటే, మనకు కావలసిన సబ్జెక్టుకు సంబంధించిన సర్వస్వాన్ని తెలుసుకోవచ్చు. నేనట్లనె మా అన్న పంపిన వీడియోలతో మొదలుపెట్టి మెల్లెమెల్లెగ కొన్ని వేదాంత విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసిన.
నెల రోజుల తర్వాత మా అక్క డెలివరీ అయింది. పండంటి బాబు పుట్టిండు. మా అక్క అత్త వచ్చి చూసింది. కానీ, దాని కొడుకు రాలేదు. ‘మంచి రోజు చూసి, నా కోడలు తోటి దాని చెల్లెల్ని కూడ పంపమని’ చెప్పి పోయింది. అది పోకుంట నన్ను చూసిన విషపు చూపుతోటి, నా శరీరం నిండ వొణుకుడు మొదలైంది.
‘మల్ల నా బతుకు మొదటికే వొచ్చిందా?’ అని మా కుటుంబ సభ్యులమంత తలకాయలు పట్టుకున్నము.
‘గా ఊరికి పోతె వాడు నన్ను బ్రతకనిస్తడ? వేయి తలల పాములెక్క నన్ను ప్రతీ దినమూ కాటేస్తడు. తనొక్కడే కాకుండ, ఇంకెంత మందికి తనను కన్నెబలి ఇస్తడో?
మేము అంత అరాచకం జరిగినంక గూడ మౌనంగా ఉండెటాలకు, వానికి కోరలు మొలిచినయి. ఆ కోరలను నరికి, తగలబెట్టాలి’ అని అనుకున్న.
***
నన్ను మా అక్కతోటి పంపడానికి మా అమ్మ అస్సలు ఒప్పుకోలేదు.
మా బాపు “పెద్ద బిడ్డ కాపురం కూలిపోతదేమోనే?” అంటే, మా అమ్మ రోషంగ చూస్కుంట, “పెద్ద బిడ్డ కాపురం కూలిపోతదని, నా చిన్నబిడ్డను నరకకూపంలకు పంపమంటవానయ్యా? నా బిడ్డను పంపనంటే పంప. కావాల్నంటె, నా పెద్దబిడ్డతోటి నేను పోత! వాడేంజేస్తడో నేను గూడ సూస్త.” అని మా అమ్మ మంకుపట్టు పట్టింది.
మా అమ్మ అక్కను తోలుకోని వాల్ల అత్తగారింటికి పోయింది. వాళ్ళిద్దరు పోయినప్పటినుంచి మా అందరి గుండెలు పీచుపీచుమంటనే ఉన్నయి. కానీ, మేమనుకున్నట్టుగ ఏం జరగలేదు. పది రోజుల తర్వాత మా అమ్మ మా ఊరికి తిరిగి వచ్చింది.
“అంత బాగనే ఉన్నది. దాని మొగుడు కొడుకు పుట్టిండని మస్తు సంతోషంల ఉన్నడు. భగవంతుని దయ వల్ల అంత బాగనే జరిగింది. గా ఒక్క పాపిష్టి సంఘటన జరగకపోతే ఎంత బాగుండు. దరిద్రపోడు. అంత కండ కావురముంటే, ఏ సాని దగ్గరకో పోవాలె. నా బిడ్డ బతుకు నాశనం చేసిండు.” అనుకుంట మల్ల ఏడిచింది.
నన్ను చూస్కుంట, “బిడ్డా! నువ్వేం చేయాలనుకుంటున్నవో చెప్పు. అన్న తానికి హైదరాబాదుకు పోయి సదువుకుంటవా? ఇక్కడ్నే జగిత్యాల కాలేజీల చేర్తవా? జగిత్యాలల చదువుతనంటె, నేను గూడ నీతోనే ఉంట. బీడీలు చుట్టుకుంట గిన్ని పైసలు సంపాయిస్త, నిన్ను కాపాడుకుంట.” అన్నది నా చెంపల మీద రాస్కుంట.
నేను అమ్మ చేతులను అట్లనే నా చెంపల మీద ఆనించుకుని, ఒక్క క్షణం ఆ సుఖం, ఆ హాయిని అనుభవించిన. పాపం మా అమ్మ చిన్నప్పటి నుండీ కష్ట జీవే. బండ చాకిరీ చేసీ చేసీ, అమ్మ చేతుల మీద కాయలు కాసినయి. కనీ, ఆ చేతులే నాకు అమృతహస్తాల లెక్క తోచినయి. అమ్మ అరచేతులు మోటుగనే ఉన్నయేమో గనీ, అమ్మ హృదయం నవనీతం. ఆ చేతుల నుండి నా శరీరంలకు అపార దయా సముద్రంలు ప్రవహిస్తుంటయి.
తెలంగాణా గ్రామీణ ప్రాంత స్త్రీలు రెక్కలు ముక్కలు చేస్కుంట, బీడీలు చుట్టుకుంట, కైకిలకు పోకుంట, పిల్లలను చదివిచ్చుకుంటరు. అదేమి పెద్ద కష్టంగ భావించరు. అది తమ బాధ్యత అని గర్వంగ చెప్పుకుంటరు. ఎక్కనైన అంతేగని మా తెలంగాణా గ్రామీణ కుటుంబ ఆర్థిక వ్యవస్థల, మహిళలదే పెద్దరికం. మా అమ్మ గూడ గంతే!
గివన్ని ఆలోచిస్తాంటె, తన అరచేతుల మీద నా కండ్ల నీల్లు పడడంతోటి, అమ్మ పరేషాన్ అయి,
“ఏమయిందిరా?” అని అడిగింది.
“అమ్మా! నేను బాగా చదువుకోని, డాక్టరయి నిన్ను మహారాణి లెక్క చూసుకోవాలనుకున్న. కానీ, నా బ్రతుకు గిట్ల తగలబడి పోయింది కదమ్మ! నాకు చదువు మీద ఇప్పుడు మనసు లేదమ్మ! ఏం చేయాల్నో ఏందో నాకే తోస్త లేదు. నన్నేం చేయమంటవమ్మ?” అని అడిగిన ఏడ్చుకుంట.
“ఊర్కో బిడ్డా! నీకేం చెయ్యాలనిపిస్తే గదే చెయ్యి. ఏం చెయ్యబుద్ధి కాకపోతే, ఇంట్లనే, ఉత్తగనే ఉండు. కని మనసు కష్టపెట్టుకోకు నా తల్లి!” అని మా అమ్మ అన్నది.
***
కాలం గడుస్తున్నది. రెండు నెలల కాలం గడిచింది. మా అన్న కౌన్సిలింగు వల్ల, నేను విన్న కొన్ని మోటివేషనల్ వీడియోల వల్ల నా దృక్పథంల కొంచెం మార్పు వచ్చింది. ఇప్పుడున్న నేను, ఆ రోజు నా మీద సామూహిక మానభంగం జరిగినప్పుడు భీతహరిణేక్షణలా ఉన్న నేను, కాదు. నాకు లోకం కొంచెం అర్థమయింది. నేను బయట తిరుగుతాంటె, ఒక పందుల గుంపు వచ్చి, నా మీద బురద జల్లి పోతే, నేనేం చేస్త. ఇంటికి పోయి, స్నానం చేసి, ఆ పంకిలాన్ని శుభ్రపరుచుకుంట. నా మీద జరిగిన గా నీచుల దాడి గూడ గంతే. నా ఆత్మ పరిశుద్ధంగ ఉన్నంత కాలం నేను మనాది పడవలసిన అవసరం లేదన్న స్థితప్రఙ్ఞత నాకు వచ్చింది. నా వల్ల నా కుటుంబ సభ్యులెవ్వరు బాధ పడకుండ ఉండాలంటే, మా అమ్మ చెప్పింది చెప్పినట్టు వినాలని నిర్ణయించుకున్న. ప్రైవేటుగ, డిగ్రీకి కట్టిన.
***
ఒక రోజు మా అన్న చెప్పకనే చెయ్యకనే హైదరాబాదు నుండి కారు తీస్కోని మా ఇంటికి వచ్చిండు. అసలు గా కారు మా సందుల పట్టనే లేదు. దూరంగ పెట్టి నడుచుకుంట వచ్చిండు. అన్న యెన్కనే, సినిమాలల్ల చూపిస్తరు చూడు, గటువంటిడ్రెస్, టోపీ పెట్టుకున్న డ్రైవరు వచ్చి, మా అన్న సూట్కేస్ కింద పెట్టి,
“సార్! కారు దగ్గర ఉంట. పిల్లలు కారు పాడు చేస్తరేమో?” అన్నడు వినయంగ.
మా అన్న సరేనన్నట్టు తలకాయ ఊపిండు. డ్రైవరు సెల్యూట్ కొట్టి పోతాంటె మేమంత విస్మయంగ చూసినం.
‘మా అన్నేంది? కారుల వచ్చుడేంది? డ్రైవరు సూట్కేసు మోసుకొచ్చుడేంది? మల్ల పోకుంట సెల్యూట్ కొట్టుడేంది?’ అని నేనూ మా అమ్మ వింతగ చూస్తుండి పోయినం.
మేం తనను కనీసం పలకరించకుండ కార్ను, డ్రైవర్నువింతగ చూసుడు చూసి, మా అన్న,
“ఏందే అమ్మా! ఇంట్లకు కూడ రమ్మంట లేరు. జరగండి.” అంటూ లోపటికి వచ్చిండు.
మా అమ్మ క్షణకాలం, తన బిడ్డ కారు కొన్నడని సంబర పడ్డది. ఆ క్షణంల ఆమెకు, తన కొడుకు కొలువుల జేరి ఏడెనిమిది నెల్లే అయిందనీ; నేనొక పెద్ద సమస్యల ఇరుక్కుని ఉన్ననన్న విషయాలు గుర్తుకు రాలేదు. గందుకె,
“మోటరు కారు కొన్నవారా?” అని ఆశగ అడిగింది. మా అన్న, మా అమ్మ ముఖంల తాండవిస్తున్న ఆనందం చూసి, ఆమెను నిరాశ పరిచేటందుకు మనసొప్పక, ఆమెను దగ్గరకు తీస్కోని,
“కొంటనమ్మ! నీకు చూపించేటందుకు తీస్కొచ్చిన. నీకు నచ్చితే పట్నం పోంగనే కొంట!” అన్నడు.
“మా నాయినే! ఒకసారి బజార్ల మీ బాపు పనిచేసే దుకానం దగ్గరకు పోయి గాయనను ఎక్కించుకోని తీస్కరారాదు? ముసలాయన సంతోషపడ్తడు.” అని మా అమ్మ ఉబ్బితబ్బిబ్బవుకుంట అన్నది. మా బాపును ముసలాయన అన్నందుకు మేమిద్దరం పక్కుమని నవ్వినం. నేనయితే అన్ని మర్సిపోయి, ఆరు నెల్ల తర్వాత మనస్ఫూర్తిగ నవ్విన. గందుకె, మా అన్న గూడ నవ్విండు.
***
గా సాయంత్రం అందరం కూచోని ఛాయ్ తాగేటప్పుడు, “అమ్మా! మనందరం హైద్రాబాదుకు పోదాం. ఇగ గాన్నే ఉందాం. నా జీతంతోటి మనంతరం ఏ ఫికర్ లేకుండ బతుకొచ్చు. నేను ఒక డబుల్ బెడ్రూం ఇల్లు చూసొచ్చిన. ముఖ్యమైనవన్ని తీస్కోని, రేప్పొద్దున బయల్దేరుదాం. అక్కడ అన్ని కొనిపెట్టిన. మీ బట్టలు మాత్రం తీస్కోని రాండి. అవి గూడ అక్కడికి పోయినంక మంచియి కొంట గని. నేను మల్లొచ్చి పనికొచ్చే సామాను హైదరాబాదుకు పంపించి, ఓనరుకు తాళం చేయిలు ఇచ్చి వస్త!” అన్నడు.
మేమంత ఆశ్చర్యపోయినం. మా అమ్మయితే మస్తు ఖుషయింది. మంచంల నుంచి లేచి వచ్చి మా అన్న చెంపలు నిమిరి ముద్దు పెట్టుకున్నది. అమ్మ గంతే! ఎవరి మీదనైన ప్రేమ పుట్టెనాంటె చెంపలు నిమురుతది. మా అన్న మా అమ్మ ఒడిల పండుకోని,
“అమ్మా! ప్లీజ్ పోదామే! మనందరం కలిసి హైదరాబాదుల ఉంటె ఎంత బాగుంటదో ఒక్కసారి నీ మనసుల ఊహించుకోవే?” అన్నడు గారాబంగా. మా అన్న మాటలకు మా అమ్మ ఒప్పుకుంటదన్న నమ్మకంతోటి మా అన్న మబ్బుల్ల తేలిపోతుంటే, మా అమ్మ కండ్లల్ల నీల్లు నింపుకుంట,
“గట్లెట్ల కుదుర్తది బిడ్డా! హైదరాబాదుకు మేమొచ్చి ఏం చేయాలె? మీ బాపుకు దుకానంకు పోకుంటె ఏం తోచదు. ఆదివారం సెలవొస్తనే బేచైన్ బేచైన్ అయితడు. నేను గూడ రోజంత ఇరామంగ ఉంటానురా? గదో గిదో పని చేస్కుంట, బీడీలు చుట్టుకుంట, దోస్తులతోని గడుప్తాంటేనే నాకు మంచిగుంటది. అక్కడికొచ్చి ఏం పని లేక, రికామిగ ఎట్లుంటంరా? గది గాక గిది మీ బాపు, నేను పుట్టిన ఊరు. గీ ఊరంటె మాకు పావురం రా! మాకు పైసలు లేకపోతేందిరా, గిది మా జీవన విధానం. ఇది వదిలి, గీ వయసుల పట్నంకు రాలేముర! మాకు హైదరాబాదుల మొస మర్లదు బిడ్డా! పానమంత ఊరి మీదనే కొట్టుకుంటాంటది. మాకు మనశ్శాంతి ఉండదు. మా వల్ల మీగ్గూడ మనశ్శాంతి ఉండదు. మీరంటే రెక్కలొచ్చిన పక్షులు. కొత్త తరం పడుచు పోరగాండ్లు. దునియానే మీ చేతిల ఉంటది. మేము రాము గనీ, నువ్వే ముసలి అమ్మను, బాపును మరిచిపోకుండ అప్పుడప్పుడు వొస్తుండు. కనీ, రొయ్యల వేపుడు మస్తుగుందిర! మల్లొచ్చినప్పుడు గూడ తినిపియ్యాలె! మీ బాపు చూడు మంచిగ మందు కొట్టి, పండుకున్నడు.” అనుకుంట ఏదేదో మాట్లాడింది. అమ్మకు సంతోషం, దుఃఖం కలగాపులగంగ కలుగుతున్నయి. మల్ల మా అమ్మనే,
“మేం రాం గని, చెల్లెను తీస్కపోరా! కొన్ని రోజులు జాగ మారితే, దాని మనాది కొంచెమన్న తగ్గుతది. రోజంత ఇంట్ల కూచుంటే, దానిగ్గూడ మనసుల మనసుంట లేదు.” అని కొత్త ప్రపోజల్ పెట్టింది.
అన్న నా వంక చూసిండు.
..నిన్న సాయంత్రం అన్న చెప్పిన ముచ్చటకు అమ్మ నన్ను హైదరాబాదుకు తీస్కపొమ్మని చెప్పినప్పట్నుంచి, నా మనసు మనసుల లేదు. ‘గంత పెద్ద పట్నంల నేనొక్కదాన్ని ఎట్లుండాలే?’ అని మా అమ్మతోటి వాదించిన గూడ. దానికి మా అమ్మ,
“బిడ్డా! ‘ఆడబిడ్డ’ అంటేనే, ఆ బిడ్డ ‘ఈడబిడ్డ’ కాదని అర్థం. ఇప్పుడు కాకుంటే, ఇంక నాలుగేండ్లయినంకనన్న, పెండ్లి చేస్కోని పరాయింటికి పోయేటిదానివే కదనే బిడ్డా! అత్తగారిల్లన్న పరాయోల్లది గని, గిప్పుడు నువ్వు పొయ్యేది మీ అన్న ఇంటికే గాదే, భయమెందుకు? అక్కడ నచ్చకపోతే, మనూరికి రారాదు? కొంచెం జాగ మారితే సోచ్ మార్తది, పట్నంల చాన చాన వింతలు, విడ్డూరాలుంటయి. మెల్లెమెల్లెగ అన్న నీకు అన్నీ చూపిస్తడు. కొంచెం నీ మనసు గూడ నిమ్మలమయితది. పోయిరా బిడ్డా!” అని గావురంగ చెప్పడంతోటి నా సంశయాలనన్నింటిని పక్కన బెట్టి, హైదరాబాదుకు పోనీకే నిశ్చయించుకున్న.
తెల్లారంగనే, అన్నతోటి, కార్ల హైదరాబాదుకు పోతాంటెనే, అమ్మ చెప్పినట్టే, నాకు ప్రపంచం మారినట్టే అనిపించింది. చూస్తుండంగనే, ఊర్లు ఊర్లు యెన్కకు ఉరుకుతున్నయ్! పల్లె వెలుగు బస్సులనయితే, మా ఊరి నుండి పది కిలోమీటర్ల దూరంల ఉన్న జగిత్యాలకు రానీకే అర్థగంట పడ్తది. కండక్టర్ టిక్కెట్లు కొట్టేటందుకు, ఊరు దాటంగనే బస్సును ఆప్తడు. దినాం టిక్కెట్ల దగ్గర చెడ లొల్లి అయితది. పైసలు తక్కవున్నయని ఒకరు, మొన్న ఛార్జి తక్కువనే ఉండే, ఇప్పుడెందుకు ఎక్కువయిందని మరొకరు, హాఫ్ టిక్కెట్ల దగ్దర్నైతె రోజూ లొల్లే. అన్ని గండాలు గడిచి, కండక్టర్ ‘రైట్, రైట్’ అనేటాలకు, అందరు ఊపిరి పీల్చుకునేటోల్లు. మల్ల జగిత్యాలల, ‘ఛాయ్ తాగి రమ్మని’ అర్థగంట ఆప్తడు. గిట్లనే ముక్కుకుంట, మాల్గుకుంట కరీంనగరానికి చేరెటాలకే రెండు మూడు గంటలు పడ్తది. గీ కార్లనయితే పది నిముషాలల్ల జగిత్యాలను దాటినం, గంట సేపట్ల కరీంనగరం దాటినం. దేనికి ఆగుడే లేదు. కార్ల సీట్లు కూడ మెత్తగున్నయి. ఏసీ ఉండుడుతోటి, చల్లగ, హాయిగ ప్రయానం సాగింది.
కనీ పట్నం దగ్గర పడ్తున్నందనగనే, విపరీతమైన రష్షు. కారు కదులుడే లేదు. హారన్ల మోతతోటి చెవులు గుఁయ్యిమన్నయి. ఒకటి రెండు మైల్లకే సిగ్నల్స్ పడి బండ్లన్ని ఆగిపోతున్నయి. మా ఊరి నుండి మూడు గంటలల్ల, శివారు ప్రాంతానికొచ్చినం గనీ గాడ్నుంచి మా అన్న ఇంటికి పోయేందుకు రెండు గంటలు పట్టింది. నేను దారి పొడుగూత కన్పిస్తున్న పెద్ద పెద్ద బిల్డింగులను చూసి ‘వామ్మో’ అనుకున్న. హైదరాబాదు చూడాలని ఎప్పట్నుంచో అనుకునే దాన్ని. మా అన్న హైదరాబాదుల ఉద్యోగం సంపాయించిన కొత్తల మస్తు ఖాయిష్ ఉండె. కనీ, దురదృష్టం కొద్ది, నాకు జరిగిన అపచారం తోటి గిప్పుడు గా కోరికలన్ని చచ్చిపోయినయి. నా మనసుల ఆలోచనలను గమనించినట్టున్నది, మా అన్న నా తలకాయను తన భుజం మీద పెట్టుకోని, ఓదార్చిండు.
(ఇంకా ఉంది)
డా. ప్రభాకర్ జైనీ ప్రసిద్ధ రచయిత. వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమీషనర్‌గా పదవీ విరమణ చేశారు. నంది అవార్డు గ్రహీత. సినీ దర్శకులు. ఇప్పటికి 31 నవలలు రచించారు. ఫోన్: 7989825420
