[డా. ప్రభాకర్ జైనీ గారు రచించిన ‘మాతోటి అడివి గూడ నవ్వింది’ అనే నవలికని ధారావాహికగా ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]
[అన్న పంపిన వీడియోలు చూసి ధైర్యం తెచ్చుకుంటుంది నాయిక. కాలం గడిచే కొద్దీ ఆ దుర్ఘటననకి మర్చిపోడానికి ప్రయత్నిస్తుంది. అన్న పంపిన సాహిత్యం చదివి తన దృక్కోణాన్ని మార్చుకుంటుంది. ఆధ్యాత్మికతని అలవర్చుకుంటుంది. కాలం నది వంటిదేననీ, నదిలోని జలరాశి ఒక నిర్దిష్టమైన స్థలాన్ని ఒకసారి దాటిందంటే, అంతే, మళ్ళీ ఆ స్థలానికి, ఆ జలరాశి రాలేదనీ; కాలం కూడా అంతేననీ ఓ మహానుభావుడు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. నెల రోజుల తర్వాత ఆమె అక్కకి ప్రసవమై కొడుకు పుడతాడు. అక్క అత్తమ్మ వచ్చి, మంచి రోజు చూసి కోడలితో పాటు, ఆమె చెల్లెల్ని కూడా పంపించమని చెప్పి వెళ్లిపోతుంది. అమ్మ అస్సలు ఒప్పుకోదు. భర్త సంశయం వ్యక్తం చేసినా, పెద్ద కూతురుని తానే వెళ్ళి దింపుతుంది. పది రోజుల తర్వాత తిరిగి వచ్చి, అక్కడంతా బానే ఉందని చెప్తుంది. నాయికని దగ్గరకి తీసుకుని నువ్వేం చేద్దామనుకుంటున్నావో అది చెయ్యి, నేను నీకు అండగా ఉంటా అని చెప్తుంది. మామూలుగా అయితే తాను డాక్టర్ చదవాలనుకున్నాననీ, కానీ ఇప్పుడు చదువు మీద మనసులేదని చెప్తూ ఏడుస్తుంది నాయిక. కొన్ని రోజులు గడుస్తాయి. అన్న పంపుతున్న వీడియోలు, సాహిత్యంతో ఆమెలో మార్పు వస్తుంది. ప్రయివేటుగా డిగ్రీకి కడుతుంది. ఒక రోజు ఆమె అన్న హైదరాబాద్ నుంచి కారు తీసుకుని వస్తాడు. కొడుకు కార్లో రావడం చూసి తల్లి ముచ్చట పడుతుంది. కొన్నావా అని అడిగితే, కొంటాను. నీకు చూపించేందుకు తెచ్చా, నీకు నచ్చితే పట్నం వెళ్ళగానే కొంటానంటాడు కొడుకు. ఆ రాత్రి అందరూ కూర్చుని మాట్లాడుకుంటారు. తనతో పాటు అమ్మని, నాన్నని, చెల్లిని హైదరాబాద్ వచ్చేయమంటాడు కొడుకు. తల్లిదండ్రులు రామంటారు. చెల్లిని తీసుకెళ్ళమంటారు. మొదట వద్దంటుంది. అమ్మ నచ్చజెప్పిన మీదట అన్నతో కారులో బయల్దేరుతుంది. ఇక చదవండి.]
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ల ఉన్న మల్టీప్లెక్స్ భవనంలకి కారును తిప్పి మెయిన్ గేటు ముందు ఆపి, ‘వాలే’ బాయ్ కి కారు కీస్ ఇచ్చుకుంట,
“తమ్మీ! జెర భద్రంగ పార్క్ చెయ్యి!” అంటూ యాభై రూపాయల నోటు ఇచ్చింది శాంతి.
ఆ అబ్బాయి సంతోషంగ తలూపిండు. సాధారణంగ కారు ఓనర్లు ఎవ్వరూ పదీ, ఇరవై కన్న ఎక్కువ ఇవ్వరు. అది గూడ కారును పార్కింగ్ లాట్ నుండి తీసుకు వచ్చిన తర్వాత ఇస్తరు. కనీ, గీ మేడమ్ ఎప్పుడు వచ్చినా సరే వొచ్చినప్పుడు యాభై, పోయేటప్పుడు యాభై రూపాయలు ఇస్తది కాబట్టి, ఆమె వాల్లందరికీ బాగ ఎరికెనే. అందుకే ఆమె కారును, పార్కింగ్ లాటుల దగ్గరగ పార్క్ చేసి తొందరగ తీసుకొస్తరు. వీలైతే కార్‌ను తుడిచి తీసుకొస్తరు కూడ.
శాంతి గీ కిటుకులన్నీ వాళ్ళ నాన్నను గమనించుకుంట నేర్చుకున్నదట. మనం నడుస్తున్న దారులల్ల పూలు పూయిస్తూ పోవాలే అని చిన్నప్పుడే అర్థం చేసుకున్నది. వంద రూపాయలు తనకో లెక్కగాదు. కనీ, అక్కడ, ఎదుటి వ్యక్తి తనను గుర్తించిండనడానికి చిహ్నంగ నవ్విన ఒక చిరునవ్వు ఆమెకు చాన ఉల్లాసాన్ని కలిగిస్తది. ఆ మల్టీప్లెక్సుల తనకో మిత్రుడు దొరికిండని భావిస్తది.
ఆ తతంగాన్నంత నేను నిరాసక్తంగనే అయిన, గమనిస్తనే ఉన్న. శాంతి ప్రవర్తన మొదట్ల నాకు చాలా వింతగనె అనిపించింది. నన్ను అమితంగ అభిమానిస్తున్నది. తను ఒక అక్క అయినట్టు, నేనొక చిన్న పిల్లనయినట్టు గారాబం చేస్తున్నది.
గీ నెలరోజులుగ నేను చూస్తనే ఉన్న గాబట్టి గీ విషయాలన్ని నాకు తెల్సినయి! మేము హైదరాబాదుకు వొచ్చిన రోజున జరిగిన ముచ్చట నాకు గుర్తుకొచ్చింది.
***
మేము హైదరాబాదు ఫ్లాటుకు చేరిన గంటలనే శాంతి, మా అన్న ఉంటున్న ఫ్లాటుకు వొచ్చింది. వొచ్చుడు వొచ్చుడే మా అన్నను కావలించుకున్నది. నేను నోరెళ్ళబెట్టి చూస్తాంటే, నా నోరు మూసి,
‘నీక్కూడ ఇస్తలే!’ అంటూ నన్ను కూడ గట్టిగ, పక్కటెముకలు ఇరిగెటట్టు కావలించుకున్నది. నేను,
“వామ్మో!” అని మనసులనే మూలిగిన.
“ఏందే! బాగున్నవానే? నన్ను జూసి పరేషానయితాన్నవ్ గద? చెప్త చెప్త, అన్నీ చెప్త..” అంటూ నన్ను ముద్దు పెట్టుకుని,
“అబ్బ! సారంగపూర్ అడివిల పండిన సీతాలక్కాయ లెక్కున్నవే!” అని అన్నది.
నేను గందరగోళంల పడిపోయిన. ఎవరీమే? ఎందుకిట్ల మీద మీద పడ్తాంది? ముద్దులు పెడ్తాంది. ‘రావే’, ‘పోవే’ అంటాంది అనుకోని వింతగ చూస్తాంటే, మా అన్న,
“అమ్మడూ! గీమె ‘శాంతి’ అని నా కొలీగ్. మా ఓనరు గారి బిడ్డ. మనమొచ్చిన కారు గీమెదే! కొంచెం స్క్రూ లూజ్.. ఏమనుకోకు.” అని నవ్వుకుంట పరిచయం చేస్తాంటె, శాంతి మా అన్న మీదకు తన హ్యాండ్ బ్యాగు విసిరేసి,
“ఏయ్! లూజు గీజంటివో.. గుద్దుత!” అంటూ కడుపుల గుద్దబోతున్నట్టుగ ఫోజు పెట్టింది.
నాకైతే, ‘నా అన్నకు ఈమె గింత క్లోజా?’ అని గప్పుడు అనుమానం గూడ వొచ్చింది.
తర్వాత్తర్వాత నాకు కొంచెం కొంచెం అర్థమయ్యింది. వాల్లిద్దరు ప్రేమించుకుంటున్నరని పసిగట్టిన. కనీ, అమాయకంగ ఉండేటి మా అన్నని ప్రేమల పడేసిందంటె, గీమే మా తెలివైందన్నట్టే. అసలు నోట్లె నాలిక లేనట్టు ఉండెటోడు. ఆడోల్లతోని మాట్లాడేటందుకే సిగ్గుతోటి గజగజ వణుక్తడు. గసువంటిది, ‘వామ్మో’ గింత గ్రంథసాంగుడయిండన్న మాట మా అన్న. అమ్మకు వెంటనే ‘గీ విషయం చెప్పాలే’ అనుకున్న.
గంట సేపు కూసోని రకరకాల ముచ్చట్లు చెప్పింది. గామె మాటలకు మా అన్నయితే, ఒకటే నవ్వుడు. నాకయితే ఏం అర్థం కాలే. సగం ఇంగ్లీషులనే మాట్లాడుకున్నరు.
కనీ, నా మనసుల పేలుతున్న అగ్నిపర్వతాల ప్రభావంతోటి వాల్లను చూస్తాంటె నాకు మొదట్ల అసూయ కలిగింది గని తర్వాత మా అన్న మీద ప్రేమ ఉప్పొంగింది. మనసంతా నిమ్మలమైంది. గప్పుడు చూస్తె, గామె, శాంతి మా అన్నల జోడీ బాగున్నది. చిలకాగోరింకల్లెక్కున్నరు. శాంతిని పరీక్షగ చూసిన. మల్లెపువ్వంత సుకుమారంగున్నది. అబ్బ ఎంత తెల్లగున్నదో! దాదాపు మా అన్నంత ఎత్తున్నది. జడ నాగుపాము లెక్కున్నది. నెమలికంఠం రంగు చుడీదారుల సినిమా యాక్టర్ లెక్కనున్నది. నన్ను కావలించుకున్నప్పుడు చూసిన గద, మంచి సన్నజాజి పూల వాసన వచ్చింది. ఒళ్ళు ‘సుకుమా..రంగ ఉన్నది. కళ గల్ల ముఖం. ఆమె నా వొదినయితే బాగుండని గప్పుడనిపించింది. గట్ల అనిపించగనె, గామె మీద కూడ ప్రేమ పుట్టుకొచ్చింది. గిసువంటి కోడలొస్తె, మా అమ్మకెంత పావురమయితదోనని అనుకున్న.
నాకు మల్ల ముద్దుపెట్టి పోకుంట,
“అమ్మడూ! మీ అన్న నిన్ను ‘అమ్మడూ’ అనే కద పిలుస్తడు. నాగ్గూడ ఇప్పట్నుంచి నువ్వు అమ్మడివే. నాకు నీ బాధ తెలుసు. దానికి నా దగ్గర మందు కూడ ఉన్నది. చూస్తవు గద, నిన్నెట్ల తయారుచేస్తనో! మీ అన్న నాకు ఫుల్ పర్మిషన్ ఇచ్చిండు. ఇగ నువ్వు ధైర్యంగ ఉండు. బై రా!” అని చెప్పి హడావుడిగ, ఒక మలయమారుతం లెక్క వొచ్చి, సుడిగాలి లెక్క మాయమయింది.
నేను మా అన్న వైపు చూసిన.
“అమ్మడూ! కొత్తల కంపెనీల ఎట్ల పనిచెయ్యాల్నో, ఏం పనిచేయాల్నో సమజ్ కాకపోతుండె. గప్పుడు శాంతి నాకు బాగ సాయం చేసింది. మనసుకు దగ్గరైంది. నీకు జరిగిన ఆ సంఘటన తర్వాత నేను తిరిగి ఇక్కడికి వొచ్చిన గని, ఆ తర్వాత వారం దినాల పాటు విచారంగ, ఏడ్సుకుంటనే ఉన్న. గప్పుడు శాంతి బలవంతం చేస్తే నీ సంగతి చెప్పిన. గట్ల ఆమె నన్ను ఓదారుస్తాంటే, మా మధ్య ప్రేమ పెరిగింది. మిమ్మల్ని, ముఖ్యంగ నిన్ను తీస్కరమ్మని తనే పంపింది. అమ్మా బాపు ఆ ఊరు వదిలిరారని నాకు ముందే తెల్సు. అయినా వొస్తె బాగుంటదని వాల్లను గూడ రమ్మన్న. నీ బాధను అర్థం చేస్కునేటందుకు నీ తోటి ఆడపిల్లయితెనే బాగుంటదని నాగ్గూడ అనిపించింది. శాంతి మంచి పిల్ల. కోటీశ్వరులు వాల్లు. మరి నాలో ఏం నచ్చిందోగని, పల్లెటూరోన్ని నన్ను ప్రేమించింది. తనతోటి దోస్తీగ ఉండు. నిన్ను ఆమె చేతుల్ల పెడుతున్న. నీకు మంచి భవిష్యత్తు ఉండాలన్నదే నా కోరిక అమ్మడూ!” అని అన్నడు మా అన్న కండ్లల్ల నీల్లు నింపుకుంట. నేను అన్న భుజాల మీద వాలిపోయిన. అన్న కన్నీల్లు తుడిచి, సరేనన్నట్టుగ నవ్విన.
ఇగ గా రోజు నుంచి శాంతి రోజు మా ఇంటికి వొచ్చుడు సురువు చేసింది. చానా సార్లు మా అన్న ఆఫీసుకు పోయినంకనే వొచ్చేటిది. తనతో పాటు రెండు మూడు పుస్తకాలు తెచ్చేది. ఒకటి నాకిచ్చి,
“అమ్మడూ! నేనొక గంట ఆఫీసు పని చేస్కుంట. ఇంతల నువ్వు గా పుస్తకం చదువుకుంట ఉండు. వర్క్ ఫ్రం హోం అంటె గిదే! తర్వాత మనం బయటికి పోయి ఐస్‌క్రీమ్ తిందాం. ఓకే!” అంటూ ల్యాప్ టాప్ తీసి పని చేసుకునుడు మొదలుపెట్టింది. నేను గా పుస్తకం తెరిచి చూసిన. ఇంగ్లీషులున్నది. నాకొచ్చిందే ఏబీసీడీల ఇంగ్లీష్. ఇగ గా పుస్తకాలేమర్థమైతయి?
గంట తర్వాత,
“ఛలో అమ్మడూ! మంచి సినిమా చూపిస్త దా!” అన్నది. నేను అమాయకంగ,
“మరి ఐస్‌క్రీమ్?” అన్న.
“అబ్బో మా అమ్మడుకు మాటలు గూడ వొస్తయన్నమాట! అది గూడ తినిపిస్త. క్రీమ్ స్టోన్ అని ఐస్‌క్రీమ్ షాపు జీవీకే మాల్ల ఉన్నది. అక్కడ సీతాఫల్ ఐస్‌క్రీం నాకు చాల ఇష్టం. నీకే ఫ్లేవర్ ఇష్టం?”
నేను తల అడ్డంగ ఊపిన.
“అయితే ఇవ్వాల్ల సీతాఫల్ ఐస్‌క్రీమ్ తిందాం. గది నీకు నచ్చపోతే గది గూడ నేనే తింటే. నీకు వేరేది ఇప్పిస్త!” అన్నది లేచి ఒళ్ళు విరుచుకుంట.
గట్ల, గా భంగిమల శాంతిని చూస్తాంటే మస్తుగున్నది.
“ఏందే గట్ల చూస్తాన్నవ్? రేప్ చేస్తవా ఏంది కొంపదీసి?” అన్నది అల్లరిగ.
‘రేప్’ అన్న మాట వినపడంగనే, నా కల్లల్ల నీల్లు తిరిగినయ్.
“అయ్యో! అమ్మడూ! సారీ సారీ! నేను వేరే ఉద్దేశ్యంతోటి నిన్ను బాధ పెట్టాలని అనలేదే! నన్ను క్షమించు. కని ఏడ్వకు. నీ కాల్లు మొక్కుత.” అని నన్ను కావలించుకున్నది.
నేను వెంటనే తేరుకుని, ‘ఏం ఫర్వలేదన్నట్టుగ’ తలకాయ ఊపిన.
గందుకే, నేనున్న భౌతిక, మానసిక పరిస్థితులల్ల, శాంతి చూపేటి ప్రేమ నాకు కొంత హాయిగనే ఉన్నది. దానికి తోడు, వెలుగుజిలుగుల హైదరాబాదు నగరపు రాత్రులు, కండ్లు మిరుమిట్లు గొలిపే భవంతులు, అందమైన స్త్రీలు, చూడచక్కని విలువైన దుస్తులు ధరించి స్వేచ్ఛగ తిరుగుడు చూస్తాంటే, ఆ కొన్ని క్షణాలు నన్ను నేనే మరిచిపోయి, మైమరచిపోయి, చూస్కుంట నిలబడి పోయేదాన్ని. అలా మనసుల నిండుకున్న బాధ మెల్లెమెల్లెగ మాయమయిపోతున్నయని గ్రహించిన. ఒక్క క్షణం పాటు, నేను కూడ, వారిలెక్క గలగల నవ్వుకుంట, చకచక నడుచుకుంట జీవించే రోజు నా బతుకుల గూడ వస్తదేమోనన్న ఆలోచన కూడా వస్తాంది. ఇప్పటికే, శాంతి నాకు రెండు మూడు మంచి ఖరీదైన డ్రెస్సులు, షూస్, వాచి, హ్యాండ్ బ్యాగులు కొన్నది. నేను వారించినా వినకుండ.
“మీ అన్నే పైసలు ఇచ్చిండులే!” అని బలవంత పెట్టింది.
ఆ రోజు కూడా, మా అన్నకు, ఆఫీసులో పని ఉండడంతోటి మేమిద్దరమే సినిమా చూసెటందుకు వచ్చినం.
***
నేను ఆలోచనల్లో నుండి బయటపడి శాంతి చెయ్యి పట్టుకుని మల్టీప్లెక్స్ లోపటికి అడుగు పెట్టిన. గంతే!
మల్టీప్లెక్స్‌ల ఉన్న గా సినిమా థియేటర్ నాకు బాగ నచ్చింది. ఆ లైటింగ్, పాదాల కింద గిలిగింతలు పెడుతున్నసువంటి మెత్తటి కార్పెట్, స్పాంజిలెక్క ఉన్న రిక్లయినర్ సీట్లల్ల పండుకోని సినిమా చూస్తాంటె ఒక సంతోషకరమైన అనుభూతి కలిగింది నాకు.
మా ఊర్లె సినిమా చూడడమంటే ఒక్క నరకం గాదు. చిరిగిపోయిన, కంపు కొట్టే సీట్లు, నల్లులు, దోమలు, ఉచ్చల కంపు. అయినా, అక్కడ కూడ నేను సినిమాలు ఎంజాయ్ చేసిన. కనీ, మల్టీప్లెక్స్‌ల సినిమా చూస్తాంటె నేనే ఒక హీరోయిన్నేమోనన్నంత గొప్ప ఫీలింగ్ కలిగింది నాకు.
‘ఈ పట్నంల ఉండెటోల్లది రాజభోగమే సుమా!’ అని అనుకున్న మనసుల. కనీ, హైదరాబాదు నగరంల కూడ, దాదాపు 80% మంది ప్రజలకు, గివి, గీ మల్టిప్లెక్సుల సినిమా చూసే అదృష్టం అందని ద్రాక్ష పండ్లేనని నాకు తెల్వదు.
స్క్రీను మీద సినిమాను డాల్బీ సౌండుల, 4 కే రిజల్యూషన్ ల చూస్తాంటే ఆ హీరోయిన్లు అద్భుత సౌందర్య రాశుల్లెక్క; ఆ హీరో వీరాధివీరుడిగ అనిపించిన్రు. ఇంత మనోహరమైన అనుభవం నాకెప్పుడూ కలగలేదు. ఊర్లె సినిమా చూసినప్పుడు కేవలం సినిమా కథ మాత్రం తెలిసేటిది గనీ, ఒక అపురూపమైన కళాఖండంగ అనిపించకపోయేట్ది. కని గిప్పుడు మాత్రం రసరమ్యలోకంల లీనమై సినిమాల మునిగిపోయిన.
***
సినిమా అయిపోయేటాలకు ఒక వింతలోకంల విహరించిన ఫీలింగ్ కలిగింది నాకు. సంతోషంగ, శాంతి చేయి పట్టుకుని ఊపితె, శాంతి ఆశ్చర్యంగ చూస్తాంటే,
“థ్యాంక్యూ అక్కా!” అని నేను ఆనందంగ అన్న.
“సినిమా నచ్చిందానే?” అని శాంతి అడిగింది.
“కాదు. గీ సాయంత్రం మొత్తం నచ్చింది, నీతో సహా!” అన్న నేను మనస్ఫూర్తిగ.
“హమ్మయ్య! నెల రోజులయినంకనయిన, నీ నోట గీ మాట వచ్చింది. ఇంగనైన నన్ను పిలిచే వరస మార్చవే!” అన్నది శాంతి చిలిపిగ.
“అంటే?” అని, శాంతి మాటల భావం నాకర్థమైంది గనీ అయినా గూడ ఏం తెల్వనట్టు అమాయకంగ ప్రశ్నించిన.
“మొద్దు అమ్మడూ! ‘వొదినా’ అని పిలవమంటున్న?” అంటూ నా తలకాయ మీద మెల్లెగా మొట్టికాయ యేసింది.
నాకు ముందు అర్థం కానట్టు నటించి, తర్వాత అర్థమయినట్టు,
“అమ్మ వొదినా? మా బుద్ధావతారానికే లైనేసినవా? అసలు మా అన్నకైన చెప్పినవా? ఒప్పుకున్నడా?” అని ఆశ్చర్యంగ, ఒకింత ఉత్కంఠగ అడిగిన.
“ఇంకా చెప్పలేదే!” అని అన్నది నవ్వుకుంట.
నేను నడుస్తున్నదాన్నల్ల ఆగి, శాంతిని చూసి నవ్వుకుంట, కావలించుకుని, గావురంగ,
“నువ్వట్ల ఆప్యాయంగా ‘రావే, పోవే’ అని పిలుస్తాంటె ఎంత బాగున్నదో తెల్సా? నేనున్న పరిస్థితులల్ల నన్ను ఎవ్వరు పలకరించరని, ఆదరించరని, అసహ్యించుకుంటరని దిగులుగ, భయంభయంగ బతుకుతున్నదానికి ప్రేమ భిక్ష పెట్టినవు వొదినా నువ్వు! మా అమ్మనో, మా అక్కనో పిలిచినట్టు, గుండెల్ల ప్రేమ నింపుకుని నువ్వు ఈ నెల రోజులు నన్ను ట్రీట్ చేస్తాంటె, నేనే గిల్టీగ కుంచించుకుపోతాన్న. ఏ రోజుకారోజు నీతోటి మనసు విప్పి మాట్లాడాల్నని, నీకు థ్యాంక్స్ చెప్పాల్నని అనుకున్న గని ధైర్యం చాలలే. నువ్వు నన్ను ఎట్ల పిలిచిన ఫర్వాలేదు వొదినా!” అన్న ఉద్వేగంగ.
ఇంకో మూడ్నెల్లు హైదరాబాదుల అన్నా, వొదినల దగ్గర వాల్ల ముద్దుల అమ్మడుగ గడిపిన. ఇంతల మా బాపుకు, పెయిల బాగలేదని, జగిత్యాల దవాఖానకు తీసుకొచ్చిన్రని ఫోన్ వొచ్చేటిసరికి, అన్నా నేను కార్ల బయల్దేరినం. వొచ్చెటప్పుడు, ఎప్పడూ గలగల గోదావరి లెక్క హుషారుగ ఉండే శాంతి గూడ నన్ను కావలించుకుని కండ్ల నీల్లు పెట్టుకున్నది.
“అమ్మడూ! ధైర్యంగ ఉండు. నీకు మేమంత ఉన్నము. ఎంత చిన్న కష్టమొచ్చినా చెప్పు. మీ బాపుకు ఏంగాలే! చిన్న గ్యాస్ ట్రబుల్. నేను జగిత్యాల డాక్టరుతోటి మాట్లాడిన. సరేన! నీకెప్పుడు రావాలనిపిస్తె అప్పుడు రా! నీ కోసం నేను ఎదురు చూస్తుంటనని మర్చిపోకు. మీ అన్నను మాత్రం తొందరగ పంపు.” అని నన్ను ముద్దు పెట్టుకున్నది.
***
జగిత్యాలకు చేరినంక మా బాపును డిశ్చార్జి చేసి మా ఊరికి తీస్కపోయినం. మా అన్న ఆ రాత్రికి ఉండి పొద్దున్నే పట్నం పోయిండు.
హైదరాబాదు నుండి వచ్చిన తర్వాత, నా లోపటి మార్పును మా అమ్మ గమనించి సంతోషించింది.
నేను నిర్భయంగ, బియ్యే పుస్తకాలు ముందలేసుకుని చదువుకుంట ఉన్న. మొదటి ఏడాది పరీక్షలు కాంగనే, ఒక ఏడాది తర్వాత మా నాయన నాకొక పెండ్లి సంబంధం తెచ్చినప్పుడు,
“పెండ్లా? నాకా?” అని నేను విస్తుపోయిన.
నా ప్రశ్నలకు మా నాయన నన్ను దిగులుగ, లోకంల ఉన్న విషాదాన్నంత తన ముకంలోకి తెచ్చుకుని, దీనంగ చూసిండు. తర్వాత ఆశగ నా వంక చూస్కుంట,
“అవును బిడ్డా!” అన్నడు. నేను మా అమ్మ దిక్కు చూసిన కండ్లల్ల నీల్లు నింపుకుని. మా అమ్మ మౌనంగ నిస్తేజంగ నా వంక చూస్కుంట నిలబడ్డది. మా అమ్మకు నా మనసేందో తెలుసు. నాకు బాగ చదువుకునుడు ఇష్టమని తనకు తెలుసు. అందుకు నన్ను ప్రోత్సహించేటిది కూడ. ఇప్పటికె మా అన్న హైదరాబాదుల ఉద్యోగం చేస్తున్నడని మా అమ్మ మస్తు గర్విస్తది. నేను డాక్టరు కోర్సు చదువుతనంటే, మా ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా, సరేనన్నది. ‘సీటయితే రానీయ్ బిడ్డా, నిన్ను నేను షెరీక్ చేయిస్త గద’ అని ఎంతో నిబ్బరంగ చెప్పెటిది.
అటువంటిది, నా కలలు, నా మీద మా అమ్మ పెట్టుకున్న ఆశలన్ని నిట్టనిలువున కాలిపోతుంటె, ఎటూ చెప్పలేక , నోట్లె చీర చెంగు కుక్కుకుని ఏడ్చుకుంట అక్కడ్నే కూలబడ్డది.
కనీ, ఆ ఒక్క క్షణం నా మనసు బాధతోని మూలిగింది. గీ వయస్సుల వాళ్ళకు నా వల్ల అంతులేని వేదన కలిగింది. అందులో నా తప్పు లేకున్న కూడ, నేనే బాధితురాలినయిన కూడ, నా వల్లనే గీ పరిస్థితి దాపురించిందని నా మనసుల నేను అనుకుంటున్నట్టుగనె, వాల్లు కూడా అనుకుంటున్నరేమో?
వాళ్ళను ఇంక బాధ పెట్టడం సమంజసం కాదని నా మనసుల అనుకున్న. నన్ను నేను బలిపీఠం ఎక్కించుకోనయిన సరే వాండ్లకు కొంత మనశ్శాంతి కలిగించాల్నని అనుకున్న. నా భారం తొలిగిపోతనే, వాండ్లు సంతోషంగ ఉంటరనిపించింది. నేను ఇరవై నాలుగ్గంటలు వాండ్ల కండ్ల ముందు తిరుగుతాంటె, ప్రతీ క్షణం వాండ్లకు జరిగిన సంఘటన గుర్తొచ్చి, వాండ్లను తూట్లు పొడుస్తున్నట్టయితాందేమో? నేను కండ్ల ముందు కనపడక పోతే, కనీసం వాండ్లయిన ప్రశాంతంగ బ్రతుకుతరు కద అని నాకా క్షణంల అనిపించింది.
అసలు, మామూలు పరిస్థితులల్ల అయితే, నేను మెడిసిన్ చదువుకునేందుకు వేరే పరాయి ఊరికి పోతె, మా అన్నకు పెండ్లి చేద్దామని అనుకున్నరు. మనుమలు, మనుమరాండ్ల తోటి వాండ్ల ముద్దూమురిపాల తోటి వాళ్ళ వార్థక్య జీవితం గడిస్తె చాలనుకున్నరు.
కనీ, మధ్యల నేనే గుదిబండగ మారి, నిత్యాగ్నిహోత్రం లెక్క వాండ్లను దహించి వేస్తున్ననేమోననిపించడం తోటి, మా బాపు పెండ్లి ముచ్చట చెప్పంగనె నేను కాదన లేదు. మా వాండ్లకు ఎదురు చెప్పదల్చుకోలే.
(ఇంకా ఉంది)
డా. ప్రభాకర్ జైనీ ప్రసిద్ధ రచయిత. వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమీషనర్‌గా పదవీ విరమణ చేశారు. నంది అవార్డు గ్రహీత. సినీ దర్శకులు. ఇప్పటికి 31 నవలలు రచించారు. ఫోన్: 7989825420
