[డా. ప్రభాకర్ జైనీ గారు రచించిన ‘మాతోటి అడివి గూడ నవ్వింది’ అనే నవలికని ధారావాహికగా ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]
[హైదరాబాద్ చేరిన నాయికకి, తన నేస్తం, ప్రేయసి శాంతిని పరిచయం చేస్తాడు నాయిక అన్న. కొద్ది రోజులకే శాంతి మంచి దోస్తయిపోతుంది నాయికకి. ఆమెని వదినా అని పిలవడం ప్రారంభిస్తుంది. శాంతి తన ప్రవర్తన ద్వారా, ఇతర పద్ధతుల ద్వారా సమాజంలో ఎలా బ్రతకాలో, ధైర్యంగా తలెత్తుకు ఎలా తిరగాలో నేర్పిస్తుంది. మూడు నెలలు గడిచాకా, తండ్రికి అనారోగ్యమని తెలిసి, పుట్టింటికి బయల్దేరుతుంది. జగిత్యాలలో ఆసుపత్రిలో కొన్నాళ్ళు ఉండి, కోలుకుని ఇల్లు చేరుతాడాయన. హైదరాబాదు నుంచి వచ్చిన చిన్న కూతురులో మార్పులని గమనించి తల్లి సంతోషిస్తుంది. నాయిక ప్రైవేటుగా బి.ఎ. చదవాడినికి సిద్ధమవుతుంది. ఈలోపు తండ్రి ఆమెకు ఓ పెళ్ళి సంబంధం తెస్తాడు. మొదట వద్దనుకుంటుంది. కానీ ఎన్నాళ్ళు తల్లిదండ్రులకి దుఃఖం కలిగిస్తూ ఇక్కడ ఉండాలని అని ఆలోచించి సరేనంటుంది. ఇక చదవండి.]
పిల్లగాని వాల్లది మా ఊరికి అవతల అంటె తెలంగాణా బార్డరు దాటినంక మహారాష్ట్రల ఉన్న ఒక చిన్న పట్టణం. గట్ల మహారాష్ట్ర, తెలంగాణల కుటుంబాల మధ్య ఇచ్చి పుచ్చుకుని పెండ్లిల్లు చేసుకునుడు సర్వసాధారణమే ఇక్కడ.
రాష్ట్రాల మధ్య సరిహద్దుల గీతలు కేవలం చిత్రపటాలల్లనే ఉంటయి. కనీ, మనుషులంత కలిసే ఉంటరు. ఆచార వ్యవహారాలు గూడ దాదాపుగ ఒకే లెక్క ఉంటయి.
గా పెండ్లి పిలగాడు కాలేజీల లెక్చరర్‌గ పని చేస్తున్నడట. మా అన్నతోటే కలిసి హైదరాబాదుల చదువుకున్నడంట. సంబంధం గురించి చెప్పంగనే మా అన్న కూడా వొచ్చి,
“అబ్బాయి చానా మంచోడు, ఆదర్శ భావాలు ఉన్నోడు” అని చెప్పిండు.
“వొదినకు చెప్పినవా?” అని అన్నను అడిగిన.
“శాంతి అస్సలు ఒప్పుకుంటలేదు. కనీ ‘నాకు గిదే మంచిదనిపిస్తాంది’ అంటే అలిగింది. నా తోటి మాట్లాడ్త లేదు. నా తోటి రాలేదు. నీకు ఫోన్ చేస్తనన్నది.” అన్నడు, బాధగ.
నాకు కండ్లల్ల నీల్లు తిరిగినయి. శాంతి వొదినె నా పక్కనుంటే, నాకు మస్తు ధైర్యంగ ఉంటుండె.
పెండ్లిచూపులు, మా ఊర్లె మనుషులకు తెల్వకుండ, జగిత్యాలల జరిపినం. అప్పటికే ‘సొంతిట్ల కాకుండ జగిత్యాలల పెండ్లి చూపులు ఎందుకు జరుపుతాన్రని?’ అడిగిన్రు వాండ్లు. గా దానికి మా బాపు,
“మా ఇంటి పక్క వాల్లింట్ల పెద్ద మనిషి పొద్దుగాల్నే చనిపోయిండు. ఇంక పీనిగె గూడ తీయలే. శుభమాని..” అంటూ నసిగిండు. అది నిజం కూడా. కనీ, మాకు గది, గిట్ల కలిసొచ్చింది.
కానీ, వాల్లున్నంత సేపటి దాక, మా గుండెలల్ల భయం, మనిషి శరీరంలకు ప్రవేశించిన విషం లెక్క, జరజరా పాకుతున్నట్టుగనె ఉన్నది. అన్ని విషయాలు, ఇచ్చుకొనుడు పుచ్చుకొనుడు గురించి మాట్లాడుకుంటాంటే, నేను మా అన్నను పిలిచి,
“గా సంగతి ఇప్పుడే చెప్దామన్నా! లేకపోతే తర్వాత ఇంకెవరి వల్లనన్న తెలిస్తే చానా కష్టం గద? మన అక్క మొగుడు ఒక్కడు చాలు నా సంసారాన్ని నాశనం చేసేటందుకు!” అని అన్నా.
దాంతోటి మా అన్నకు మస్తు కోపం వచ్చింది.
“పిచ్చా నీకు?” అని కోప్పడ్డడు.
“మరి తర్వాత తెలిస్తే ఎట్లనన్నా?” అన్న నా అనుమానాన్ని, భయాన్ని మా అన్న, మా అమ్మా బాపులు కూడ, ఎవ్వరూ పట్టించుకోలే.
మా వంశాచారం ప్రకారం పెండ్లి ‘ధర్మపురి’ దేవస్థానంల జరుగుతదని మా నాన్న చెప్పంగనే, వాండ్లు, ‘సరే’ అని, అయ్యగారితోటి మంచి ముహుర్తం పెట్టించి మతలబు చెప్పమన్నరు.
నా మనసైతే ఒక పక్క కాబోయేటి భర్తను మోసం చేస్తున్ననేమొననే బాదతోటి లంగరు వేసినట్టు కృంగిపోతున్నది. ఇంకొక పక్క, గీ పరిణామంతోటి నాక్కూడ కొంత సంతోషంగ ఉన్నది. పెండ్లి కొడుకు గూడ బాగున్నడు. పైకెల్లి లెక్చెరరు గూడ. మా అన్న అన్నట్టు నిజంగ ఆదర్శభావాలు ఉన్నోడైతే, నేను పై చదువులు చదువుకోవచ్చు గూడ.
ధర్మపురి దేవస్థానంల, నరసింహస్వామి సాక్షిగ మా పెండ్లి జరిగింది. మా అక్కోల్లను పిలవలేదు. శాంతి వొదినకు మా మీద ఇంకా కోపం పోలేదు. పెండ్లికి రానని చెప్పి నాకు నాలుగు బంగారు గాజులు పంపించింది. గంత సుకుమారంగా ఉండేటి శాంతిల గింత మొండి పట్టుదల ఉంటదని నేననుకోలే. పెండ్లి కొంత రహస్యంగనే చేసినము. తర్వాత మా ఊరోల్లకు మా బాపు మంచి దావత్ ఇచ్చిండు.
మా మూడు రాత్రులు మా అత్తగారింట్ల జరిగినయి. అది వాండ్ల ఆచారమంట. గా శోభనం నాడు మాత్రం, మా అత్తగారింట్ల బాత్రూముల కూర్చోని నేను మస్తుగ ఏడ్చిన. అమాయకుడైన నా భర్తను, మా అత్తమామలను మోసం చేస్తున్నందుకు నా గుండె చెరువయింది. ‘పాపిష్టిదాన్ని. పవిత్రమైన కార్యాన్ని అపవిత్రమైన నా శరీరంతోటి చేస్తున్నందుకు నాకు దుఃఖం ఆగలే. కనీ, మా అమ్మ, అన్న నేను గా విషయం గురించి నేను నోరు తెరవకూడదని ఒట్టేయించుకున్నరు. ఇంగ నేనేం జెయ్యాలె?’
గట్ల మా అక్కా వాండ్లకు తెల్వకుంటనే నా వివాహపు తంతు ముగిసింది. నన్ను కాపురానికి పంపేటప్పుడు మా అమ్మకు దుఃఖం ఆగలేదు. బిడ్డను కాపురానికి పంపేటప్పుడు ప్రతీ తల్లీ దుఃఖిస్తనే ఉంటది. కానీ, నా విషయంలో మా అమ్మ దుఃఖం వెనుకాల అనేక అగాథాలున్నయి. అనేక భయాలున్నయి. నా సంసారం – సేఫ్టీ పిన్ను తీసి పట్టుకున్న బాంబులాంటిదని – ఎప్పుడైన ఫట్‌మని పేలే ప్రమాదం ఉన్నదని, మా అమ్మానాన్నలకు, నాకూ, మా అన్నకు కూడ తెలుసు. అయినా, భగవంతుని మీద భారం వేసి, సాహసం చేసినం.
***
మనిషి కష్టాల వలయంల చిక్కుకున్నప్పుడు కాలం భారంగ గడుస్తది. జారుడుబండను కింది నుంచి పైకి ఎక్కుతున్నట్టుగ అతి కష్టంగ గడుస్తది. పెండ్లికి ముందు రొండేండ్ల వరకు నాకు గట్లనే గడిచింది. పెండ్లైన తర్వాత, జారుడుబండ బల్ల పై నుండి కిందికి జారుతున్నట్టుగ, కాలం ఉరుకుడు మొదలు పెట్టింది.
పెండ్లైన మూడు నెలలకు నేను నీల్లు పోసుకున్న. అతి పవిత్రమైన సంగమంతో నా గర్భకోశం పునీతమయినట్టనిపించింది. నా గతపు పాపపు ఛాయలన్ని తుడిచిపెట్క పోయినట్టనిపించింది. మనసంత హాయిగ, ప్రశాంతంగ, ఆనందంగ ఉన్నది నాకు. నేను గూడ అందరి ఆడపిల్లల వంటి దాన్నే అనిపించింది. ఐదో నెలల, మా అత్తగారింట్ల నాకు సీమంతం జరపాలని నిర్ణయించిన్రు.
***
ఎట్లనో పసిగట్టి నా సీమంతానికి మా అక్క అత్త, పిలవని పేరంటం లెక్క, చెడగొట్టు వాన లెక్క, వొచ్చింది. వొచ్చుడు వొచ్చుడే,
“మీరంత గిట్ల రహస్యంగ సీమంతం చేసుకునుడేంది? మీరు మీరు చేసుకుంటే అయిపోతదా? దగ్గరి బంధవులకు గూడ చెప్పకుండ, దొంగల్లెక్క, మొదటి కాన్పు అత్తగారింట్ల చేసుకుంటరా? గిదెక్కడి పద్ధతి! పెండ్లిగ్గూడ మమ్మల్నెవర్ని పిల్వకుండ ధర్మాపురం గుల్లె చేసుకుంటిరి. ఎందుకిట్ల చేస్తాన్రు. అసలు మీ అత్తామామలేరి? వాల్లతోనే తేల్చుకుంట? ఇంటి ఇయ్యపురాలిని నన్నూ, ఇంటల్లుణ్ణి, నా కొడుకును పిల్వకుంట, గీ లంగ పనులేంది? మీ అమ్మా అయ్యలు ఏం దాస్తాన్రు? ఎవరి దగ్గర్నుండి దాస్తాన్రు?” అని అనుకుంట చేతులు తిప్పుకుంట, షామియానా కింద నిలబడి చుట్టూత కూసోని ఉన్న వాల్లందరి దృష్టిని ఆకర్షించుకునేటందుకు గట్టిగట్టిగ అరుస్తాంటే, సీమంతానికి వచ్చిన మా అత్తగారి తరఫు చుట్టాలంత ఆశ్చర్యంగ చూస్తాంటె, నా పై ప్రాణాలైతే పైనే పోయినయి. గీమె చేసే లొల్లికి లోపల ఉన్న మిగిలిన చుట్టాలు గూడ ఒక్కరొక్కరు పందిరి వైపు వస్తాంటె నా గుండెలు పీచుపీచుమన్నయి.
మా ఆయన బాపనాయనను తీస్కొచ్చేటందుకు బయటకు పోయిండు. మా అత్త మామలు ఇంటెన్క వంట పనులల్ల మునిగి ఉన్నరు.
గీమె చేసేటి లొల్లికి వాండ్లు బయటకు వస్తరేమోనని, మా అందరి ప్రాణాలు పైపైనే పోయినయి.
కాలవాహిని అలల ప్రవాహంల ఒక ‘x’ క్షణం కరిగిపోయిందంటె, ఆ ‘x’ క్షణం మల్లా మన జీవితంలకు రాదని మా గురువు గారు చెప్పిన్రు. కనీ, ఆయన చెప్పనిదేమిటంటే, కాలం గడిచిపోతుంది. కానీ, ఆ ‘x’ క్షణంల మనకు కలిగిన అనుభవాలు మాత్రం జీవితాంతం మనను వెన్నంటే ఉండి, శూలాల్లెక్క గుచ్చుకుంటనే ఉంటయని చెప్పడం మర్చిపోయిండు. నా జీవితంల, నేను ఆ దరిద్రపు ‘x’ క్షణపు అనుభవాలను ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నననుకుంటే, మళ్ళీ ఈ మందర, మా అక్క అత్త, గత జీవితంల ఆ ‘x’ క్షణంల జరిగిన దుర్ఘటన తాలూకు బాధామయ అనుభూతులకు మనిషి రూపం దాల్చినట్టు, మా ముందు, ప్రత్యక్షమైంది.
నేనైతే చిగురుటాకులెక్క వణికిపోయిన. నా జీవితం, దాన్తో పాటు, నా గర్భంల పెరుగుతున్న పసిబిడ్డ జీవితం కూడ సర్వనాశనం అయిపోతదని అనిపించేటాలకు ఒళ్ళంత చెమటలు పట్టినయి. మరు క్షణంల నేను స్పృహ తప్పిన.
***
నాకు స్పృహ వచ్చేటాలకు, మా అమ్మా, మా అక్క అత్తా నవ్వుకుంట ముచ్చట్లు పెట్టుకుంట కనిపించిన్రు. మా అమ్మ మెడల, గంట క్రితం వరకు ఉన్న చంద్రహారం గొలుసు, గిప్పుడు మా అక్క అత్త మెడల, మెరుసుకుంట కనిపించింది.
నేను అనుమానంగ చూస్తాంటే, మా అమ్మ కళ్ళతోటే సైగ చేసింది. నేను మారుమాట్లాడకుండ తలదించుకున్న. మా అమ్మ మరెన్ని కత్తుల బోనుల గుండ పయనించాల్నోనని నా లోపట దుఃఖం పెల్లుబికింది. నా కన్నీటి ధారల తోటి, నా ముందున్న తలంబ్రాల పళ్ళెంలోని ఒడిబియ్యం తడిచి ముద్దయినయి.
సీమంతం అయిపోయినంక గూడ నన్ను చూసిపోతననే నెపంతోటి మా అక్క అత్త ప్రతీ రెండు నెల్లకొక సారి వచ్చి వారం రోజులపాటు తిష్ఠ వేసుడు మొదలు పెట్టింది. తిరిగి పోయేటప్పుడు నన్ను పీడించో, బెదిరించో వెయ్యో రెండు వేలో పట్టించేది. ‘మా ఊళ్ళో దొరకవని బియ్యం, పప్పులు, ఉప్పులు, కూరగాయలూ’ మూటలు కట్టి మోస్కపోయేట్ది.
ఒకటి రెండు సార్లు మా అత్తమ్మ వాళ్ళు ఆమెకు చుట్టమామె అని మర్యాదలు చేసిన కూడ, మల్లోసారి వచ్చినప్పుడు, మా అత్తమ్మ ఖరాఖండిగ, గామెతోటి,
“మా ఇంటికి నువ్వు గిట్ల వచ్చుడేంది? నువ్వు నాకు వియ్యపురాలువు కాదు గద? నువ్వు గీడికి ఎందుకు వస్తున్నట్టు? మీకేమైన మాట్లాడేది ఉంటే మీ వియ్యపురాలి ఇంటికి పో! మీరు గిట్ల ఎప్పట్కి మా ఇంటికి వస్తాంటే మా చుట్టాలంత గుసగుసలాడుకుంటున్నరు. మా ఇంటికి ఇంకోసారి రాకు. ఇప్పుడు ఇస్తారి లేపి వెళ్ళిపో! ఏదైనా ప్రభోజనం ఉంటే మేమే పిలుస్తం! గప్పుడు బాజాప్తా రాండ్రి!” అని నిర్మొహమాటంగ, గట్టిగానే, చెప్పింది.
దాంతో దిమ్మ తిరిగిన, మా అక్క అత్త నన్ను రహస్యంగా పక్కకు పిలిచి,
“ఓ పోరీ! నువ్వు గా ఘనకార్యం చేసినవ్ గద! గా వీడియో నా దగ్గర గూడ ఉన్నది. చూస్తవా?” అంటూ ఫోన్ తీయబోతుంటె, నేను మ్రాన్పడిపోయిన.
అయిపోయింది. నేననుకున్నట్టే, నా జీవితం కుప్పకూలిపోతాంది. దాని కొడుకు చేసిన పాపిష్టి పనికి వాన్ని నరికి పోగులు పెట్టవలసిన తల్లి, గదే వీడియోను పట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయడానికే వస్తున్నదని నాకు తెలియదు. సీమంతం నాడు మా అమ్మ, లొల్లి చేయొద్దని బతిమిలాడి నాల్గు తులాల చంద్రహారం గొలుసు ఇచ్చెటాలకు, అది, మనిషి రక్తం రుచి మరిగిన పులి లెక్క, నన్నూ, మా అమ్మను గూడ బ్లాక్మెయిల్ చేస్తున్నదన్న మాట. నేను కేవలం మాటలు చెప్పి నా కాపురం కూలుస్తందనుకున్న గనీ, దీని దగ్గర గూడ గా వీడియో కాపీ ఉన్నదని, ఆ దరిద్రుడు, తను నికృష్టపు పని చేసిందే కాకుండ, గా వీడియోను తల్లికి గూడ ఇచ్చిండంటే, అసలు వీళ్ళు మనుషులేనా అనిపించింది.
నేను మా అక్క అత్త కాళ్ళు పట్టుకుని,
“అత్తా! ఎందుకిట్ల నన్ను చిత్రహింస చేస్తున్నరు? మీకేం గావాలే? మీకిది న్యాయంగ ఉన్నదా? సచ్చిన పామును ఇంకా సంపుడెందుకు?” అని భోరున ఏడ్చిన.
అది, నన్ను పైకి లేపుకుంట,
“గవన్ని నాకు తెల్వదు. ఇగో గీ నీ చేతి బంగారు గాజులు బాగున్నయ్! ఎప్పటి నుంచో చేయించుకోవాలనుకుంటున్న.” అన్నది. గా గాజులు శాంతి వొదినె పంపినయి. అదృష్టం కొద్ది గా నాల్గు గాజులల్ల రొండే చేతులకు వేసుకున్న. మిగిలిన రొండు మా అత్తమ్మకు తొడిగిన.
నేను నా చేతులకున్న రెండు బంగారు గాజులు తీసి ఆమె చేతులల్ల పెట్టి,
“అత్తా! ఇగ మా ఇంటికి రాకు. నా జీవితాన్ని, సాటి ఆడదానివై ఉండి, నాశనం చేయాలని చూడకు. ఇంగ పో! “ అని ఆమెను పెరట్ల ఉన్న దర్వాజా నుండి బయిటికి పంపించిన.
“అయ్యో! నీకు కొడుకు పుట్టినంక సూసెటందుకు, గింత దగ్గరి సుట్టాలమై కూడ రావద్దా ఏంది? నాకు మంచి కట్నం పెట్టవా ఏంది?” అని అనుకుంట జల్దీ జల్దీ నడుచుకుంట పోయింది.
నాకిక ఓపిక లేదు. గీ శత్రువులతోటి యుద్ధం చేయలేను. నిండు చూలాలిని కద మానసికంగ శారీరకంగ, బాగ అలిసిపోయిన. గింత మంచి కుటుంబంలకు కోడలుగ వచ్చినందుకు, వారి ఇంటికి ఒక వంశోద్ధారకుణ్ణి కని, ఇచ్చి, ఆ పురిట్లనే, నా ప్రాణాలు తీస్కపొమ్మని దేవుడికి మొక్కుకున్న..
***
నిజానికి నా మీద సామూహిక అత్యాచారం జరిగినప్పుడే ఆత్మహత్య చేస్కోని ఉంటె, గిప్పుడు నాకీ మానసిక క్షోభ తప్పుతుండె. గప్పుడేమో, నా బలవన్మరణం వల్ల మా అక్కకు హిస్టీరియా వస్తదని, అమ్మాబాపులకు తీవ్ర మనో వేదన మిగులుస్తనేమోనని, ఆ ప్రయత్నం విరమించుకున్న. తర్వాత పెండ్లి అన్నప్పుడయిన, భయపడిన గనీ పానం తీస్కోలే! అప్పుడన్న, ముందుచూపుతోటి భవిష్యత్తుల సమస్యలొస్తయని ఊహించి ఆత్మహత్య చేసుకోవల్సి ఉండే. గనీ, వయసుల చిన్న పిల్లను గద, గా పెండ్లి పిలగాన్ని చూసినంక గాయనతోటి జీవితం పంచుకోవాల్నని, సంసార సుఖం అనుభవించాల్నననే కోరిక బలంగ కలిగింది. పోనీ, తర్వాత మా అక్క అత్త, నా వీడియో తన దగ్గర ఉందన్నప్పుడైన, చచ్చిపోవాల్సి ఉండే. కనీ, నా కడుపుల పెరుగుతున్న మా అత్తింటి వంశాకురాన్ని చంపే హక్కు నాకెక్కడిది అని అప్పుడు గూడ ఆత్మహత్యాయత్నం విరమించుకున్న.
కనీ, అసలు నాకే అప్పుడప్పుడనిపిస్తది – నేను ఏదో ఒక వంక పెట్టుకోని ఆత్మహత్యను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్ననేమోనని, అసలు నాకు ఆత్మహత్య చేస్కొనేటందుకు ధైర్యమే లేదేమోనని.
***
నా జీవితంల అత్యంత సంతోషకరమైన రోజు, నాకు కన్నయ్య పుట్టిన రోజే. పుట్టిన నక్షత్రం బాగలేదని పంతులు తోటి బొంకించి, కన్నయ్యకు పుట్టిన రోజు ఫంక్షన్ చేయలే. ఫంక్షన్ చేస్తే, ఎట్లనో గట్ల తెలుసుకుని, గా మందర వొచ్చి లొల్లి చేస్తే భరించే ఓపిక నాకు లేదు. అది గనుక వొస్తే దాన్ని నరుకుడే అనుకున్న.
అప్పుడు నా మనసంత కలతలతోటి నిండి పోతది. ఇంతల పాలు తాగుతున్న నా కన్నయ్య నిద్రల ఏం కలగన్నడో గని, వాని బుగ్గల మీద నవ్వుల మొలకలు మొలకెత్తినయి.
అసువంటప్పుడే, ‘అసలు నేనెందుకు చచ్చపోవాలె. మహా అంటే ఏమయితది. మా ఆయన, మా అత్తామామలు వాండ్ల ఇంటి నుండి నన్ను ఎల్లగొడతరు. గంతే కద? లోకం కోడై కూస్తది. గంతే కద? మా ఊర్లె ఉన్న గలీజు గాండ్లు నన్ను చూసి నవ్వుతరు. గంతే కద? నా కొడుకుని చూసి బనాయిస్తరు. గంతే కద? నేను వాన్ని తీస్కొని హైదరాబాదుకు పోత. అక్కడ నాకు మా అన్న లేడా? కష్టంల ఉన్నప్పుడు మా వొదినె శాంతి నన్ను రమ్మన్నది గద. అక్కడ ఎవరికి ఎవరో! పక్కోని గురించి ఎవ్వరు పట్టించుకోరు. గంతే కదా? నా వీడియో రిలీజ్ అయితది. ‘అది నాది కాదని మార్ఫింగ్ వీడియో అని సైబర్ క్రైమ్ సెల్లుల, మా అక్క మొగుని మీద కంప్లైంట్ చేసి బొక్కల తోయిస్త శాంతి తోటి చెప్పి. బస్ ఖేల్ కతమ్. దుకాణం బంద్! గంతే కద? నా కన్నయ్య, నేనూ హాయిగ బతుకుతం.’ అని అనుకునే సరికి నాకు కొండంత ధైర్యం వచ్చింది, ముద్దులు మూటలు గట్టినట్టున్న నా కొడుకుని చూసిన తర్వాత. వాడే ఇప్పుడు నా బహిఃప్రాణం.
(ఇంకా ఉంది)
డా. ప్రభాకర్ జైనీ ప్రసిద్ధ రచయిత. వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమీషనర్‌గా పదవీ విరమణ చేశారు. నంది అవార్డు గ్రహీత. సినీ దర్శకులు. ఇప్పటికి 31 నవలలు రచించారు. ఫోన్: 7989825420
