Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మాతోటి అడివి గూడ నవ్వింది-6

[డా. ప్రభాకర్ జైనీ గారు రచించిన ‘మాతోటి అడివి గూడ నవ్వింది’ అనే నవలికని ధారావాహికగా ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]

[నాయికకి ఓ సంబంధం వస్తుంది. వాళ్ళ అన్నతో కాలేజీలో చదివిన కుర్రాడే. ప్రస్తుతం లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అందరు ఆమోదిస్తారు. అయితే, నాయికకి అప్పుడే పెళ్ళి చేయడం శాంతికి ఇష్టం ఉండదు. అబ్బాయి మంచివాడని అన్న కూడా చెప్పడంతో, జగిత్యాలలో పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు. పెళ్ళికి ముందే తనపై జరిగిన అత్యాచారం గురించి అతనికి చెప్పేస్తే మంచిదని, తర్వాత వేరేవాళ్ళ ద్వారా తెలిస్తే, సంసారం నాశనమవుతుందని నాయిక అన్నతో అంటే, అతను తిడతాడు. తల్లీ తండ్రీ కూడా ఆ విషయం పట్టించుకోరు. మగపెళ్ళివారికి పిల్ల నచ్చుతుంది. అనుకున్న ముహూర్తానికి ‘ధర్మపురి’ దేవస్థానంలో వివాహం జరిగిపోతుంది. అక్కకి, వాళ్ళ కుటుంబానికి చెప్పకుండా కార్యక్రమం నడిపిస్తారు. పెళ్ళయిన మూడ్నెల్లకు నాయిక గర్భం దాలుస్తుంది. అందరు సంతోషిస్తారు. సీమంతం రోజున నాయిక అక్క అత్తమ్మ వచ్చి గొడవ చేస్తుంది. నీ వీడియోలు నా దగ్గరున్నాయని రహస్యంగా నాయికని బెదిరిస్తుంది. నాయిక అమ్మ తన మెడలోని చంద్రహారాన్ని వియ్యపురాలికిచ్చి ఆమె నోరు మూయిస్తుంది. సీమంతం అయిపోయాకా కూడా నాయిక అక్క అత్తమ్మ మాటిమాటికి వచ్చి నాయికని బెదిరిస్తూంటుంది. అందినకాడికి నగో నట్రో పట్టుకుపోతుంది. ఒకసారి నాయిక అత్తగారు ఆమెని గట్టిగా హెచ్చరించి, ఇలా తరచూ రావడానికి నా కోడలితో నీకేం సంబంధం అని, ఏదైనా వేడుక ఉంటే మేమే పిలుస్తాం, అప్పుడొచ్చి భోజనాలు తినిపొండి అని గట్టిగా చెప్తుంది. నాయికకి పండంటి కొడుకు పుడతాడు. వాడ్ని చూసి ఆమె ధైర్యం తెచ్చుకుంటుంది. ఇకపై తనను ఎవరు బెదిరించినా ఏం చేయాలో నిర్ణయించుకుంటుంది. ఇక చదవండి.]

నాకీ ధైర్యం హైదరాబాద్ల ఉన్న మూడు నెలలల్ల, శాంతి తోటి గడిపిన టైముల, తన ప్రవర్తన, తన చలాకీతనం, తను చూపించిన కొత్త ప్రపంచం, నాలాంటోల్లు దేనికి భయపడకుండా, ఒక సంగం పెట్టుకోని, మానభంగానికి గురయిన మహిళల సమస్యలు చర్చించడం చూసి, నా లోపట నిరాశానిస్పృహలు పోయి, ఒక భరోసా కలిగింది. తనే నాకాదర్శం. అందుకే తర్వాత పెండ్లికి ఒప్పుకున్న. కనీ, అప్పుడప్పుడు బలహీన క్షణంల భయమైతది. పెండ్లి చేస్కోని తప్పు చేసిన్నేమోనని విచారపడ్తాంట. మా అక్క అత్త గానీ, దాని మొగుడు గానీ కనబడితె గుండెల్ల గుబులయితది. కనీ, వెంటనే శాంతిని గుర్తు చేసుకుంట. ‘బీ బ్రేవ్! నీ జీవితాన్ని నువ్వు సంపూర్ణంగా, ఆనందంగా జీవించు!’ అని వీడ్కోలు చెపుతున్నప్పుడు, శాంతి అన్న మాటలు మననం చేస్కుంట. మా అన్న, శాంతిని పెండ్లి చేసుకునే రోజు కోసం ఆనందంగ ఎదురుచూస్తుంట.

నా లాంటి దురదృష్ట స్త్రీని పాప విముక్తిరాలిని చేసి, ‘తల్లి’ అనే మహోన్నత స్థానం మీద నిలిపిన నా కొడుకు, నా కన్నయ్య వాడు. వాడు పుట్టిన తర్వాత నేను అంతకు ముందు ఆత్మహత్య చేసుకోకపోవుడు ఎంత మంచిదయిందో, నేను ఎంతటి ఆనందాన్ని ఆస్వాదిస్తున్ననో చెప్పలేను. వాడి కోసం ఎంత మందితోటైన, ఎదురొడ్డి పోరాడుత!

గిదంత ఎందుకంటె, నన్ను, నాకు పుట్టిన కొడుకును చూసేటందుకు గా రోజు మా అత్తగారింటికి, నా అక్క మొగుడు గూడ దాపురించిండు. ముందటి అర్రల కూసున్నడు.

మన పురాణాలల్ల చెప్పినట్టుగ రాహు కేతువులు సూర్యుణ్ణి మింగితే మనకు చంద్రగ్రహణం; చంద్రుణ్ణి మింగితే మనకు సూర్యగ్రహణం ఏర్పడతాయని మనం విశ్వసిస్తం.

ఇప్పుటి వరకు నా జీవితంలకు కేతువులెక్క మా అక్క అత్త ప్రవేశించి నన్ను మింగేటందుకు ప్రయత్నించింది. ఇగ ఇప్పుడు రాహువులెక్క మా అక్క మొగుడు ప్రవేశించిండు నన్ను కబళించేటందుకు.

కానీ, కబళించబడడానికి నేను సిద్ధంగ లేను. నా ఒంటి మీద వాడి నీడను పడనియ్య. వాడిని నా కన్నయ్యను తాకను గూడ తాకనియ్యను. సామదానభేదదండోపాయాలనన్నింటినీ ప్రయోగిస్త! ప్రపంచంతోటి ఒంటరి పోరాటానికైన సిద్ధమే! వాన్ని నరికైనా సరే నన్నూ, నా కొడుకును కాపాడుకుంట.

***

వాడు వొచ్చుడు వొచ్చుడే, ఎంతో దగ్గరి చుట్టమైనట్టు,

“వావ్! మరదలు పిల్లా! నీ కొడుకు మస్తుగున్నడు. ఎవరి పోలికలొచ్చినయి?” అని వెకిలిగా పళ్ళికిలించుకుంట నవ్వుకుంట బాబును ముట్టుకోబోతాంటే, నేను చటుక్కున కన్నయ్యను ఎత్తుకుని వానికి దూరంగా జరిగిన.

వాడు నన్ను చూస్కుంట వెకిలిగా నవ్వుకుంట, “అయ్యో! నీ కొడుకేమన్న అరిగిపోతడా నేను ముట్టుకుంటె? అవ్ గని నువ్వుగూడ మస్తుగున్నవ్! పెండ్లైనంక అందంగ తయారయినవ్! ఇంగ బాలెంతరాలివి కాబట్టి మెరిసిపోతున్నవ్!” అన్నడు, నన్ను కసిగ చూస్కుంట.

“ఇప్పుడే స్నానం పోసి పడుకోబెట్టిన. పరాయోడి చేయి పడితే నిద్ర లేచి ఏడుస్తడు.” అన్న కరుకుగ.

“అబ్బ! ఇక్కడ పరాయోల్లు ఎవరు? వాడు పుట్టక ముందే మనకు తొడ సంబంధం ఉండనే ఉండే? గంత సుకుమారుడా నీ కొడుకు? ఇంతకు ఎవరి పోలికో చెప్పలేదు? నా పోలికైతే రాలేదు గద!” అన్నాడు ఇల్లంత దద్దరిల్లేటట్టు నవ్వుకుంట.

‘గీ దరిద్రునికి బుద్ధి అసలే లేదు. కనీ కనీసం బుర్ర కూడా లేనటన్నది. దాదాపు రెండేండ్ల క్రితం రేప్ జరిగితే నెల క్రితం పుట్టిన నా కొడుకుకు గీ దరిద్రుని పోలికలు ఎట్లొస్తాయనుకుంటున్నడో ఏమో?’ అని నా గుండె రగిలిపోతాంది. కుతకుత ఉడుకుతాంది. వాడెందుకు వచ్చిండా అన్న సందేహం నన్ను పట్టి పీడిస్తాంటె, వాడు,

“మీ ఆయనను పిలువు. ఒక విషయం మాట్లాడేదుంది.” అన్నడు.

నేను భయ విహ్వలనయిన.

“మా ఆయనతోటి నీకేం పని?” అని అన్న బింకంగ.

“అగో! మొగోల్లమన్నాక లక్ష తొంభైయారు పనులుంటయి. కొన్ని చూపించాలె. ఫోన్ చేసి మీ ఆయనను రమ్మను కాలేజి నుంచి. లేకుంటే మీ అత్తమామలతోటి నేనే మాట్లాడాల్నా?” అన్నాడు నర్మగర్భంగ.

నాకు ముచ్చెమటలు పోసినయి. వీడి పీడను ఎట్లాగైన వదిలించుకోవాల్నని, మనసు చంపుకుని,

“బావా! నా జీవితాన్ని సర్వనాశనం చేసినవ్! అయిన గనీ మేమేం అనలే! తలొంచుకుని పరువు కోసం గుట్టుగ బతుకుతున్నం. మీ నుండి దూరంగ వచ్చి ఇక్కడ ప్రశాంతంగ కాపురం చేసుకుంటున్న. నీకు నేనేం అన్యాయం చేసిన. నా బతుకుల నిప్పులు పోస్తే నీకేమొస్తది? దయచేసి నన్ను వొదిలిపెట్టి నువ్వు ఎల్లిపో! బావా మా అక్క ముఖం చూసి, నీ పిల్లల ముఖం చూసి, నా కొడుకు ముఖం చూసి నన్నొదిలి పెట్టు. నీ కాల్మొక్త.” అంటూ నా కొంగు పరిచి, నా కన్నయ్యను వాడి కాళ్ళ ముందు పండుకోబెట్టి, నేను కూడా వాని పాదాలకు మొక్కి వేడుకున్న. వాడు దూరంగ జరిగి,

“అది గాదు మరదలు పిల్లా! నేను గిసువంటి సెంటిమెంటల్ డైలాగులకు పడ. బాలెంతరాలితోటి సెక్స్ మస్తుగుంటది. ఒక్కసారి ఛాన్సియ్యి. పని కాంగనే ఎంటనే ఎల్లిపోత!” అన్నాడు నన్ను కామంతోటి, చొంగ కార్చుకుంట, చూస్కుంట.

నేను లేచి నిలబడి, దూరంగ జరిగి,

“ఛీ నువ్వసలు మనిషివేనారా? లేక రాయివా? పసిపిల్లగాడిని పాదాల ముందు పెట్టి వేడుకున్నంక గూడ నీ మనసు కరగలేదంటె నువ్వు నరరూప రాక్షసుడివన్న మాట?” అన్న ఏడ్చుకుంట.

ఇంతల మా అత్తమ్మ ఛాయ్ గ్లాసు పట్టుకోని బయటకొచ్చి,

“ఎవరితోనే గింత గట్టిగ మాట్లాడుతున్నవ్? నిద్రంతా చెడగొట్టినవ్? గీనెవరు?” అన్నది దూరంగా నిలబడి ఉన్న వాడి వంక చూస్కుంట. వాడు వెంటనే తేరుకుని,

“నమస్తే చిన్నమ్మా! నేను మీ కోడలి అక్క మొగున్ని. బాబుకు వారం కింద ఇరవై ఒక్కటి ఫంక్షన్ చేసిన్రట గద? నేను గప్పుడు రాలేకపోయిన. ఈ ఊరికి, గిప్పుడు మా ఫ్రెండుకి పెండ్లి సంబంధం చూసేటందుకు వచ్చినం. గట్లనే మా మరదలిని, బాబును చూసి పోదమని వచ్చిన.” అంటూ నా చేతులల్ల ఉన్న బాబు చేతికి ఐదు వందల నోటు ముట్టించి, వెంటనే తీసి మా అత్తకు ఇచ్చుకుంట,

“పిలగాని చేతిల నోటు నలిగిపోతది. ఇంటికి పెద్ద మీరు. మాలచ్మి లెక్క ఉన్నరు. గీ నోటు మీ దగ్గర ఉంటెనే న్యాయం.” అని గా నోటు మా అత్తమ్మకు ఇచ్చిండు. మా అత్త ఐదువందల నోటుని చూసి సంబరపడి పోయి, తన చేతుల ఉన్న ఛాయ్ గ్లాసు వానికి ఇచ్చి,

“కూసో, కూసో పిలగా! పలారం తీసుకొస్త!” అంటూ నోటును బొడ్లోని చీరెలో దోపుకుంటూ లోపటికి నడిచింది. ఆమె అటు పోంగనే,

“ఏమంటవ్? మీ అత్తకు వీడియో చూపించాల్నా? నాతోటి హోటలుకు వస్తవా?” అన్నడు గుసగుసగ. ఇక వీడి ఆగడాలు భరించే ఓపిక లేదు. అందుకే, నేను గూడ మొండికేసిన. నేను ముందే అన్నింటికి సిద్ధపడి ఉన్న గాబట్టి,

“నేను రాను. నువ్వేం చేసుకుంటవో చేస్కో! నువ్వు వీడియో ఎవ్వనికైన చూపించుకో! సోషల్ మీడియాల వీడియో పెట్టిన మరుక్షణంల, నేను సైబర్ క్రైమ్‌ల నీ మీద కంప్లైంట్ ఇస్త. షీ టీమ్సును పిలుస్త. నువ్వు నా ఫోటోలను మార్ఫింగ్ చేసి నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నవని చెప్త. నిన్ను బొక్కలేయించి, ఏ కీలుకా కీలు యిరగ్గొట్టియ్యకుంటె, అడుగురా బాడ్కవ్!” అని భద్రకాళి లెక్క ఉరిమిన.

నేను అడ్డం తిరిగి ఉల్టా మాట్లాడేటాలకు, వాడు ఒక్క క్షణం ఉలిక్కిపడి,

“మరి.. మరి.. ఇంత దూరంవొచ్చి ఉత్తగనే పోవాల్నా? ఏం లేకుండనే పోవాల్నా? ఓ యాభై వేలు ఉంటే చూడు. మల్ల నీ జోలికి రాను.” అన్నడు.

“నా దగ్గర గన్ని పైసలెక్కడుంటయ్?” అని నేనంగనే, వాడి చూపు నా మెడలోని గొలుసు మీద పడింది.

నేను వాడి పీడ వదిలితే చాలుననుకుని, చకచక నా మెడలో ఉన్న చిన్న గొలుసు తీసి, వాడి మీదికి విసిరేసిన. వాడు దాన్ని కుర్చీల నుంచి ఎగిరి అందుకుని, ప్యాంటు జేబులో కుక్కుకుని, కుర్చీల నంగనాచి లెక్క కూచున్నడు.

గా గొలుసు మా అమ్మ ఇరవై ఒకటి పండుగ చేసినప్పుడు, మనుమడికని తెచ్చింది. వాడికి గుచ్చుకుంటదని, నేను నా మెడల వేసుకున్న. ‘ఇంగ గా గొలుసు ఎప్పటికీ నాకు గానీ, నా కొడుకుకు గానీ గుచ్చుకోదు. కని వాడి పాపిష్టి చూపులు నాకు గుచ్చుకోకుంటె గంతే సాలు’ అని అనుకున్న.

‘గొలుసు పోతే పోనీ, వీని పీడ ఇంతటితోటి వదిల్తే చాలు.’ అనుకున్న. ఇంతల మా అత్తమ్మ పలారం తప్కు పట్టుకొచ్చింది.

పలారం తిని, ఛాయ్ తాగి వాడు పోతాంటె, చీరె కుచ్చిల్లల్ల దాచిన ఐదువందల నోటు మహిమ తోటి, మనసుల లడ్డూలు మెదుల్తాంటే,

“ఇటువైపు మల్ల గనుక వొస్తే, మా ఇంటికి తప్పక రా బిడ్డా! మనమేం పరాయోల్లం కాదు గద? మీ అమ్మ గూడ రెండు మూడు సార్లు వచ్చిపోయింది. మనం మనం చుట్టాలం. రాకపోకలు ఉంటెనే చుట్టరికాలు నిలుస్తయి. ఈసారి మా ఇంట్ల ఇస్తారాకు లేపాలే!” అంటూ ఆ పెంటగాణ్ణి, భోజనానికి రమ్మని ఆహ్వానిస్తాంటే, నా పై ప్రాణాలు పైనే పోయినయి.

వాడు కుటిలంగ నవ్వుకుంట, నా వైపు చూస్కుంట,

“గట్లనే చిన్నమ్మ! ఈ సారి వొచ్చెటప్పుడు నీకు మంచి పోచంపల్లి పట్టు చీరె పట్టుకొస్త!”

అంటూ ఈల వేసుకుంట బయటకు నడిచిండు.

***

మా అత్తమ్మనే స్వయంగ రమ్మని చెప్పడంతోటి, వాడు ఇంగ విచ్చలవిడిగ మా ఇంటికి వచ్చుడు మొదలు పెట్టిండు.

సరిగ్గ టైం జూస్కోని, మా ఆయన కాలేజీకి పోంగనే, తీతువు పిట్ట లెక్క వచ్చేటోడు, చూసెటోల్లకు అనుమానం కలిగేటట్టు. కని, మా అత్తమ్మ ఇంట్లనే ఉంటది కాబట్టి ఇరుగుపొరుగుకు అనుమానం రాలే. కనీ మా అత్తమ్మ వాన్ని ఆప్యాయంగ పలకరించి వానికి, ఛాయ్ పానీ ఇచ్చి, కావలసిన సపర్యలు చేసేట్ది. వాడు కూడా సిగ్గు లేకుండ,

“నీ చేతి వంట అమృతం చిన్నమ్మా! మా అమ్మ గూడ నీ లెక్క చేయదు. వచ్చే వారం మంచి రొయ్యలు పట్టుకొస్త. ఫ్రై చేసుకుంటే మస్తుగుంటది. ఇగ నువ్వు గనుక నీ చేతుల్తోటి వొండితే, సొర్గం దిగాలె పో!” అంటూ మాటలతో ఆమెను మునగ చెట్టు ఎక్కించెటోడు.

***

కనీ, మా అత్త చాలా తెలివిగల్లది. మొదటిసారి ఐదువందల నోటు చేతిల పడేటాల్లకు, వాణ్ణి నమ్మింది. కానీ, వాడి వెకిలి చేష్టలు, డంబాచారం, సొల్లు వాగుడును రెండోసారి వచ్చినప్పుడె పసిగట్టింది.

మా అత్తమ్మ నిజానికి మంచి మనిషి. ఒకటి రెండు సార్లు వాడొచ్చినప్పుడల్ల నేను గజగజ వణికిపోతాంటె విచిత్రంగ చూసింది. నేను అంటీ ముట్టనట్టుండడం పసిగట్టింది. నా ముఖం మ్లానమయిపోతుండడం, నేను వాన్ని తప్పించుకోని తిరగడం కూడ గమనించింది. వాడు, ఆమె వెనుకకు తిరగంగనే, నా వైపు చూసి సైగలు చేయడం, నాతోటి మాట్లాడేటందుకు ప్రయత్నించడం, నేను దూర దూరంగ వెళ్ళిపోతాంటె కూడ ఆమె గమనించేట్ది. వాన్ని నా కొడుకుని ముట్టుకోనియ్యకుండ, నా కొడుకు మీద వాని చూపు, వాని స్పర్శ కూడ పడకుండ చేసేటందుకు నేను పడుతున్న కష్టాలను, నేను చెబ్తున్న కారణాలను గూడ పసిగట్టింది.

సాధారణంగ పుట్టింటి తరపు చుట్టాలొస్తె, కోడండ్లు సంతోషంగ ఉంటరు. కని నేను గట్ల లేకపోవడం ఆమెను ఆశ్చర్యంల ముంచేటిది.

చిన్న చిన్న విషయాలల్లనే, బయటోల్లు ముఖ్యంగ మొగోల్లు గుర్తు పట్టలేని కొన్ని విషయాలను ఆడోల్లు పసిగట్టగలుగుతరు. వాడు వచ్చిపోయిన రెండు మూడు రోజుల వరకు నేనైతే మనిషిని కాలేక పోయేదాన్ని. నా కన్నయ్య పాలకు ఏడుస్తున్న గూడ పట్టించుకోక పోవడం గమనించి నన్ను గదమాయించేది. మా వారు కూడ నన్ను ‘ఎందుకట్ల ఉన్నవ్?’ అని అడుగుతాంటే, మా అత్తమ్మనే, ‘దానికి పెయ్యి బాగలేదు’ అని సర్ది చెప్పేట్ది.

‘నేనేమో మరణశిక్ష విధించిన తర్వాత, ఉరి తీసే తేదీ దగ్గర పడుతున్నప్పటి రోజులల్ల గా ఖైదీ మానసిక స్థితి ఎట్లుంటదో నేను గూడ గటువంటి వైరాగ్య స్థితిల ఉన్న. వీడు ఎప్పటికి గిట్లనే మా అత్తగారింటికి వొస్తాంటె, ఎప్పుడో ఒకప్పుడు మాట తూలక మానడు. గప్పుడు నా బతుకు బజారుపాలు కాక తప్పదు. కని, నేను అప్పటి వరకు ఈ నిప్పుల కుంపటిని మోయలేనమ్మ. దినదిన గండం లెక్క బతకలేనమ్మ. వాడు ఎప్పుడు చెప్తడా అని ఎదురు చూస్కుంట క్షణక్షణం చచ్చుకుంట.. బతకలేనమ్మ! గందుకే వాడు చెప్పేదాక ఆగుడేందుకు? ఏదో మంచి రోజు చూస్కోని, దేవుని గూట్లె దీపం బెట్టి, మొక్కుకోని, నా కన్వయ్యను ఎత్తుకోని, మా అత్తమ్మకు మొత్తం చెప్పేస్త.’

గిట్లనుకున్నంక మనసు నిమ్మలమైంది.

***

వాడు ఒకరోజు వచ్చి, బాగ మెక్కి, సాయంత్రానికి పోయిండు. ఏవేవో ముచ్చట్లు చెప్పిండు. ఈ మధ్య నెలకు రెండు మూడు సార్లు వస్తున్నడు. వాడొచ్చిండంటే చాలు, నా వెన్నుపాముల భయం జరజర పాకుతది. నా ఒంట్లె నుండి, ఎవరో తోడేసినట్టు, నా ముకం పాలిపోయేటిది.

ఆ తర్వాత మరునాటి పొద్దున్నే మా ఆయన కాలేజికి, మా మామ దుకాణానికి పోయిన తర్వాత, మేం గూడ టిఫిన్ చేసి, బాబుకి స్నానం చేసి పడుకోబెట్టిన తర్వాత, విశ్రాంతిగ కూర్చున్నప్పుడు, మా అత్తమ్మ నన్ను దగ్గరకు తీసుకుని,

“ఏంది బిడ్డా? ముఖమంత చిన్నబోయినట్టున్నది.” అని నా చెంపలు నిమురుకుంట అడిగింది.

గట్ల చెంపలు నిముర్తాంటే, మా అమ్మే గుర్తుకొచ్చింది. కండ్లల్ల నీల్లు తిరిగినయి.

‘గిట్లయితే, నా రహస్యం ఎక్కువ రోజులు దాగదని నా గుండెలు పీచుపీచుమంటున్నయి. వాడి మాటలు మా వాళ్ళు నమ్మితె, వాడు నన్ను నరకయాతనకు గురి చేస్తడు.’

అని నా మనసుల మనసుంట లేదు. గా విషయమే మా అత్తమ్మ పసిగట్టే, నన్ను గట్ల అడిగిందనిపించింది నాకు.

‘నేనేం జెయ్యాలే? అత్త మంచిదే గానీ, ఆ మంచితనానికి కొలమానం ఏంది? పెండ్లికి ముందట్నే నేను సామూహిక మానభంగానికి గురి అయినననే విషయం దాచి పెట్టి పెండ్లి చేసుకున్ననని తెలిసినంక గూడ మన్నించేటంత మంచితనం ఆమెలో ఉంటదా? నేను గా దరిద్రపు ముచ్చట చెబ్తే, మా అత్తగారింట్ల గిదే నా ఆఖరి రోజు అయితదా?’ అని నేను ఆలోచనలతోని సతమతమయితాంటె,

“ఏందే మాట్లాడవ్?” అని గదమాయించింది.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version