[డా. ప్రభాకర్ జైనీ గారు రచించిన ‘మాతోటి అడివి గూడ నవ్వింది’ అనే నవలికని ధారావాహికగా ధారావాహికగా అందిస్తున్నాము. డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన.]
[ఇకపై తనను బెదిరిస్తే ఏం చేయాలో నిర్ణయించుకున్నాకా, నాయికకు ధైర్యంగా అనిపిస్తుంది. పెళ్లికి ఒప్పుకుంటుంది. మూడ్నెల్లకి గర్భం దాల్చి, తొమ్మిది నెలలు నిండాకా, కొడుకుని కంటుంది. ఓ రోజు ఆమె అక్క మొగుడు వచ్చి, కోరిక తీర్చమని మళ్ళీ బెదిరిస్తాడు. లేకపోతే జరిగినదంతా నాయిక భర్తకి చెప్తానంటాడు. ఇంతలో నాయిక అత్తమ్మ అక్కడికి రావడంతో, ఆమెను పలకరిచి ఆదరం ఒలకబోస్తాడు. అత్తగారు టిఫిన్ తెస్తానని వెళ్ళడంతో మళ్ళీ నాయికని బెదిరిస్తాడు. చేసేదేం లేక మెడలోని బంగారు గొలుసు వాడి చేతిలో పెడ్తుంది. వాడి సంగతి తెలియని అత్తమ్మ వాడికి టిఫిన్ పెట్టి, చాయ్ తాగించి, ఇటువైపు వచ్చినప్పుడల్లా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత వాడు రెండు సార్లు వస్తాడు. అత్తమ్మని ఆప్యాయంగా పలకరిస్తుంటాడు. నాయికని మాత్రం కాటేయడానికి చూస్తుంటాడు. ఇదంతా అత్తమ్మ గమనిస్తుంది. ఇక దాచలేనని భావిస్తుంది నాయిక. ఏదైతే అదవుతుంది. అత్తమ్మకి నిజం చెప్పేయాలనుకుంటుంది. ఓ రోజు నాయిక భర్త కాలేజీకి, మామ దుకాణానికి వెళ్ళాక, నాయికని దగ్గరకి తీసుకుని విషయమేమిటని అడుగుతుంది అత్తమ్మ. నాయికకి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. చెప్పాలా వద్దా అనే సంశయం కలుగుతుంది. ఇక చదవండి.]
నేను ఉలిక్కిపడి, “ఏం లేదత్తమ్మా? కొంచెం తలకాయ నొస్తాంది.” అని తల పట్టుకున్న. కండ్లల్ల నుండి నీల్లు టపటపా రాలినయి.
“ఇగో ఇటు చూడు. మా అమ్మ గాదు? నా ముఖం చూసి చెప్పు.” అంటూ నా తలెత్తి, నా కండ్ల నీల్లు తుడిచింది. ఆమె ప్రేమ చూసి, ‘ఏదైతె అదే అయితగని’ నేను సంగతంత చెప్పి ప్రశాంతంగ, తీర్పు కోసం ఎదురు చూసే ముద్దాయి లెక్క ఆమె ముందు నిలబడదామనిపించింది ఆ క్షణాన. కనీ, ‘ఒక మాట పెదవి దాటితే పృథ్వి దాట్తదని’ మా అమ్మ చెప్పిన విషయం గుర్తుకొచ్చి సంశయించిన. ఈ రహస్యాన్ని కాపాడడానికి మా అమ్మ, మా కుటుంబం ఎన్ని త్యాగాలు చేసిన్రో గుర్తుకొచ్చి, నోరు విప్పలేక పోతున్న.
“బిడ్డా! నువ్వు మా ఇంటి కోడలివి. మా ఇంటి మహాలక్ష్మివి. నువ్వెందుకో మనసు కష్టపెట్టుకుంటున్నవ్? నాకు తెల్వదనుకుంటున్నవా ఏంది? మీ అక్క మొగుడు వొచ్చినప్పుడల్ల నువ్వు పరేషాన్ అయితున్నవ్! సాధారణంగా పుట్టింటోల్లు వొస్తే సంబరంగ ఉంటరు. కనీ, నువ్వేమో వాణ్ణి చూసి, దొంగోణ్ణి చూసినట్టు పారిపోతున్నవ్? ఏంది కత? నువ్వు చెప్తవా? లేక..” అని ఆగింది.
‘లేకపోతే, మా అక్క మొగుడ్ని పిలిచి అడుగుతదేమో?’ నని నాకు వెన్నుల వణుకు పుట్టింది. నేను మా అత్తమ్మ చేతులు పట్టుకుని,
“అత్తమ్మా! నేను పెద్ద పాపమే చేసిన. నన్ను మన్నించు. నేను జరిగింది చెప్త! నువ్వే శిక్ష విధించితె, గది స్వీకరిస్త! ఇంగ భరించే ఓపిక నాగ్గూడ లేదు.” అంటూ ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని, జరిగిన విషయం అంత చెప్పి, తీర్పు కోసం ఎదురు చూస్తుంటే, మా అత్తమ్మ,
“వాని తలపండు పలగా? వాడు మనిషేనానే? గసుంటోన్ని మనింట్లకు ఎందుకు రానిచ్చినవే? వాని తల్లికి కూడ సిగ్గెట్ల లేకుండ పోయిందే. చేసిన పాడు పనికి కొడుకుని నరికి పోగులు పెట్టకుండ, గది గూడ మనింటి మీద పడి తిని పోయింది గాదే! మీ అమ్మ చంద్రహారం గొలుసు, నీ గాజులు కాజేసింది కాదే?” అంటూ నన్ను లేపి కావలించుకుంది. నేను అత్తమ్మను ఇడిపించుకోని,
“అత్తమ్మా! నువ్వే శిక్ష విధించినా నేను సిద్ధమే! నువ్వు నన్ను ఇంట్ల నుంచి ఎల్లగొట్టేట్దుంటె, నా ఒక్కదానికే చెప్పు. నేను రహస్యంగ నా కొడుకుని తీస్కోని, మా అన్న దగ్గరకు హైదరాబాదుకు పోత. లేదూ నువ్వు నన్ను చచ్చిపోమంటే, సంతోషంగ మనూరి చెరువుల పడి ప్రాణాలు విడుస్త. నా కొడుకుని నువ్వే తల్లి లెక్క పెంచి పెద్ద చెయ్యి.” అంటూ గొల్లున ఏడ్చిన.
మా అత్తమ్మ నా చెంప మీద ఒక్క దెబ్బ వేసింది.
నేను బిత్తరపోయిన. ‘అయిపోయింది. నా బ్రతుక్కు చరమగీతం పాడే టైమొచ్చింది.’ అని అనుకున్న. కని ఇంతల్నే, మా అత్త,
“పోరీ! నీకు పిచ్చి గిన పట్టినాదే? నువ్వు చచ్చుడేంది? ఇంట్ల నుంచి పోవుడేంది? నువ్వు నా కోడలివి. నిన్ను నేనెట్ల వొదులుకుంటనే? తప్పు చేసినోణ్ణి వొదిలి, నిన్ను శిక్షించుడేంది? జర ఆగు. ఆలోచిద్దం! కని, గీ విషయం నీ మొగునికి, గదే నా కొడుక్కు మాత్రం చెప్పకు. వాడు ఎంత మంచోడయినా, ఎంత నా కొడుకయినా, వాడు గూడ మొగోడే. గీ మొగోల్లను నమ్మొద్దే! పెండ్లాలంటే వాల్ల సొంత ఆస్తి అనుకుంటరు. వాళ్ళేమో ఎన్ని లంగ పనులైన చేయొచ్చు. గీ విషయంల నీ తప్పు లేకున్న, నిన్నే దోషిగ చూస్తరు. నువ్వు సైలెంటుగుండు. ఇప్పుడు ఇది నీ సమస్య గాదు. నాది. నా ఇంటిది. వాణ్ణి ఉత్తగ వదిలిపెట్టుడెక్కడిది? తగిన శిక్ష పడాలే! నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి.” అన్నది.
ఆ క్షణంల మా అత్తమ్మ, నరరూప రాక్షసులను సంహరించేటందుకు అవతారం ఎత్తిన భద్రకాళీ అమ్మవారి లెక్క గోచరించింది.
***
వారం రోజుల తర్వాత వాడు రాంగనే మా అత్తమ్మ ముఖం నిండ నవ్వులు పులుముకుంట,
“బాగున్నవ బిడ్డా?” అంటూ ఎప్పటికంటె ఎక్కువ సపర్యలు చేసింది. వాడు పోతాంటే,
“వొచ్చే గురువారం ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్నం. నువ్వు తప్పక రావాలే. మా వంశానికి వారసుడొచ్చిండు గాబట్టి జెర పెద్దగ చేస్తున్నం. చుట్టాలను, దోస్తులను పిలిచి బట్టలు పెట్టాలనుకుంటున్నము. నువ్వు గూడ మీ అమ్మను, నీ ఇంటామెను, దోస్తులను తీస్కోని రా! ఈ దఫానయిన, మీ పోచంపల్లి చీరె తెస్తవా లేదా?” అని కారెడ్డం ఆడింది. వాడేం మాట్లాడక పోయేటి సరికి, కొంచెం నిష్టూరంగ,
“పోచంపల్లి చీరె తెస్తనంటివి? పోచంపల్లి పట్టు చీరె ఇంక నేయడం పూర్తి గానట్టుంది.” అని కొంచెం వ్యంగ్యంగ అడిగింది. దానికి వాడు,
“జర పనుల బిజీల పడి, పోచంపల్లికి పోవుడు గాలే చిన్నమ్మా!” అని కుంటి సాకులు చెప్పిండు.
‘వాడు ఉచ్చల చేపలు పట్టే రకం. వానికి వీనికి జుట్లు ముడిపెట్టి పూట గడుపుకునెటోడు. వాడు నీకెప్పుడు చీరె ఎప్పుడు తేవాలే? కనీ, కన్నతల్లికి కంచంల బువ్వ పెట్టనోడు, పినతల్లి చెవులకు బంగారు పోగులు తెస్తనన్నడట, వీనిలాంటోడే.’ అని వాడు పోయినంక నేను మా అత్తతోటి అన్న.
మా అత్త నన్ను దగ్గరకు తీస్కోని,
“మంచి మాటన్నవే! దొంగ ముండా కొడుకు. ఒక్క ఐదొందల నోటు చేతిల పెట్టి, రొయ్యలన్నడు, పీతలన్నడు, పట్టుచీరె అన్నడు బాడ్కావ్ గాడు. సరెగనీ, ఇగ మన ప్లాను మొదలుపెట్టు. ముందుగాల మీ అమ్మను గూడ పిల్సి విషయం చెబ్దాం.” అని వాడు పోంగనే, మా అమ్మకు ఫోన్ చేసి రమ్మన్నది.
రంగం సిద్ధమయింది.
***
అడవంత ప్రశాంతంగ ఉంది. ఒక భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. ఒక తీతువు పిట్ట కూసుకుంట ఎగురుతాంది.
మేం ముగ్గురం గా ముగ్గురి కాల్లు పట్టుకుని, కార్ల నుండి గుంజుకోని వచ్చేటిసరికి మాకు మొస పోసుడు శురువయి, ఊపిరి భారమయింది.
మేం ముగ్గురం ఒక్క క్షణం ఆగి చెమట తుడుచుకుని, ఒకరి ముఖం ఒకరం చూసుకున్నము.
ఇక తప్పదు అన్నట్టుగా నేను తలూపిన.
మరుక్షణంల మేం ముగ్గురం, నేనూ, మా అమ్మా, మా అత్తమ్మా గొడ్డళ్ళను ఎత్తి, కింద పడి ఉన్న ముగ్గురిని, కసి కసిగ నరికినం. వాళ్ళ రక్తం మా ముఖాల మీదకు జివ్వున చిమ్మింది. మల్ల మల్ల నరికినం. ముక్కలు ముక్కలుగ నరికినం.
ముగ్గురం పిచ్చిగ జుట్టు విరబోసుకుంట, ఛాతీమీద కొట్టుకుంట, ఏడ్సుకుంట, నవ్వుకుంట, పిచ్చోల్ల లెక్క ఎగిరినం, డాన్సులు చేసినం. గదొక మృత్యుహేల, గది ప్రళయకాలాన నటరాజ ఉగ్ర తాండవంతోటి సమానం.
***
దూరంగ గిదంత చూస్కుంట భయంగ నిలబడ్డ మనిషిని దగ్గరకు రమ్మని సైగ చేసిన. గాయన దగ్గరకు రాంగనే గాయినకు కట్టిన కట్లు యిప్పుకుంట,
“నీకు బతకాలని ఉన్నదా లేదా? నువ్వు గీ కారు డ్రైవరువా! ఓనరువానే?” అని అడిగిన.
“అమ్మా! నాకు బతకాలని ఉన్నదమ్మా! నాకూ వీళ్ళకూ ఏ సంబంధం లేదు. కిరాయికి రమ్మని బలవంతం చేస్తె వచ్చిన. కిరాయి పైసలు గూడ ఇయ్యలె. డీజెల్ మాత్రం పోయించిన్రు. నేనే ఓనరునమ్మ!” అన్నడు గజగజ వణుక్కుంట.
“అన్నా! మేం చెప్పినట్టు చేస్తె నీ పానాలు మిగుల్తయ్. లేదంటే నీగ్గూడ గిదే గతి పడ్తది. ఇప్పుడు నువ్వేం జేయాల్నంటె..” అంటూ ఏం చెయ్యాల్నో చెప్పిన.
***
డ్రైవర్ ఆ మూడు పీనిగెల ఖండాలను దగ్గరకు చేర్చి, కారుల నుంచి డీజెల్ తీసి గా మూడు పీనిగెల మీద చల్లి, అగ్గిపెట్టె తీసి, ముట్టించిండు. గా మంటలల్లనే, నన్ను నగ్నంగ వీడియో తీసిన గా మొబైల్ ఫోన్లు గూడ బొగ్గుల్లెక్క కాలిపోయినయి.
గా తతంగాన్నంత నేను నా మొబైల్ల షూట్ చేసిన.
తర్వాత దగ్గర్లో ఉన్న బాయి నుండి నీల్లు తెచ్చి ఆ కాలిన శవాల మీద పోసిండు. మంటలు చల్లారిన తర్వాత, గా బూడిదను, ఎముకలను పారతో ఎత్తి బస్తాలల్లకు నింపి, వాటిని కారు డిక్కీలో పెట్టుకున్నడు. అక్కడ ఎటువంటి ఆనవాల్లు లేకుండ నాలుగైదు సార్లు మేం ముగ్గురం కలిసి పరీక్షగ చూసినం. పోలీసులకు ఎటువంటి క్లూస్ దొరకకూడదని, వాల్ల కుక్కలు కూడ పసిగట్టకూడదని, డ్రైవరు తోటి అక్కడంతా కారప్పొడి, పసుపు, డెట్టాల్ చల్లించినం. తర్వాత, నేను డ్రైవరు తోటి,
“అన్నా! మా జాగ్రత్త కోసం గిదంత వీడియో తీసినం. రెండు మూడు నెలలయినంక, అంత సద్దు మణిగినంక, వీడియో డిలిట్ చేస్తం. పోలీసోల్లకు ఏం చెప్పుకుంటవో నీ ఇష్టం. మా పేర్లు బయటికొస్తే మాత్రం, గీ వీడియో పోలీసోల్లకు ఇస్తం. మాకు వేరే దారి లేక వీల్లను గీ విధంగా శిక్షించినం. మొత్తం ప్లాన్ చేసుకున్నం. గీ అడివికి రెండు మూడు సార్లు, మా ఆయన స్కూటర్ మీద వచ్చి చూసిన, ఎందుకంటే, ఇక్కడ్నే వీడు మా అక్క ఇంట్ల నుండి నన్ను ఎత్తుకచ్చి, గీ ముగ్గురు కల్సి నన్ను సామూహికంగ పాడు చేసిన్రు. అందుకే గిక్కడ్నే గీ నీచులను నరికి చంపినం.
గీ రాక్షసుడి కారణంగ, రెండేళ్ళ నుండి కంటి మీద కునుకు లేదు నాకూ మా అమ్మకు. పెండ్లయిన సుఖం లేదు. కొడుకు పుట్టిండన్న ఆనందం లేదు. ప్రతీ క్షణం, ఎప్పుడు ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టు, గీ తల్లీ కొడుకులు మా ఇంటి మీద పడ్తరేమోనని క్షణక్షణం చచ్చుకుంట బ్రతికినం. ఇగ గిప్పుడా భయం లేదు. ఇయ్యాల కంటి నిండ నిద్ర పోతం. మా అత్తమ్మ బంగారు తల్లి కాబట్టి నన్ను తన కడుపున పెట్టుకుని రక్షించింది.
అన్నా! అసలేం జరిగిందో, మేం ముగ్గురు ఆడోల్లం గింత ఘోరం ఎందుకు చేసినమో తెలుసానే” అని నేను జరిగింది చెప్పి,
“నాకు పెండ్లయి అత్తగారింటికి వొచ్చినంక గూడ వీడూ, వీని తల్లి, వీని దోస్తుల పీడ నాకు తప్పలే. ఇప్పటి దాక పది లక్షల దాక గుంజిన్రు. మల్ల ఇయ్యాల వొచ్చి నన్ను పక్కలకి రమ్మంటాన్రు ఈ ముగ్గురు. గిదేం న్యాయం? నువ్వే చెప్పన్నా? గందుకె, గీ రెండేండ్ల నుంచి నరకం అనుభవించిన నాకు ఇగ వశపడలే! రాత్రికి దావత్ ఇస్తమని చెప్పి పిలిచి, అన్నంల మత్తు మందు కలిపి మా అత్తగారింట్ల అందరినీ పండుకోబెట్టి, వీల్లతోటి నేను బయటికి వస్తనని చెప్పి నమ్మించిన. మా అత్త మంచి మనసుతోటి అర్థం చేసుకున్నది. మా అక్కా, దాని పిల్లలు, మా అక్క అత్తా, మావాల్లంత మత్తు మందు కలిపిన బగారా బిర్యానీ తిన్నరు. మేం ముగ్గురం గూడ మత్తు మందు కలిపిన భోజనం తిన్నట్టు నటించినం. కనీ, అసలు విషం కలిపిన బగారా అన్నం గీ ముగ్గురికి పెట్టినం. నీకు పెట్టిన బగారా అన్నంల కొంచెం మత్తు మందు కలిపినం. మొదట్ల నిన్ను గూడ సంపేద్దమనుకున్నం. కనీ, నీకే పాపం తెల్వదని నేనే ఆపిన. గా మత్తులనే నువ్వు కారు గీ సారంగపూర్ అడివిలకు నడుపుకుంట వచ్చినవ్. ఇగ మిగిలిందంత నీ కండ్ల ముందట్నె జరిగింది.
ఇగ గిప్పుడు, ఇంటికి పోయి ఏం తెల్వనట్టు పండుకుంటం. తెల్లారినంక ఫోను గుంజుకోని, మా అక్క అత్తకు గూడ మంచి సత్కారం చేసి పంపుతం. పాపం మా అక్కే, ముండ మోస్తది. అయినా గూడ పర్వాలేదు. దానికి దెబ్బల నరకం తప్పుతది.” అని చెప్పిన.
దానికి గా డ్రైవర్,
“అవునమ్మా! ఈ ముగ్గురు గలీజు గాండ్లే. ఊర్లె వీల్లు ఒంటరిగ దొరికితే, నరుకుదామని మస్తు మంది చూస్తాన్రు.” అన్నడు. నేను డ్రైవరుతోటి,
“మేం చేసిన పని మాకు గర్వంగ తోచింది కాబట్టే మీగ్గూడ గింత వివరంగ చెప్పిన.” అన్న.
అటెంక డ్రైవరుతోటి,
“అన్నా! తెలిసే తెలియకో నువ్వు నాకు తోడబుట్టినోని లెక్క సాయం చేసినవ్! నన్ను మన్నించు. నీకేం కాదు.” అంటూ వంగి గాయిన కాల్లు మొక్కిన. నేను కాల్లు మొక్కేటి సరికి, గాయన బాగ కదిలిపోయిండు.
“ఏ! మీరు మంచి పని చేసిన్రమ్మా. నేను పోత పోత వీల్లకు పిండప్రదానం గూడ చేసి పోత. గదే ఈ సంచులన్ని గోదావరిల కలిపి పోత. నరమానవునికి గూడ తెల్వదు. మీరేం భయపడకండి.” అని కారు స్టార్ట్ చేస్తాంటె, మా అత్తమ్మ పిలిచి, పది వేలు గాయిన చేతిల పెట్టింది.
మేం ముగ్గురం నడుచుకుంట పోతాంటె అప్పుడే ఉదయిస్తున్న సూర్యభగవానుని కిరణాల వెలుగులల్ల మా నీడల పొడుగులు పెరిగి ఆకాశమంత ఎత్తుకు పాకినట్టనిపించింది. మేం ముగ్గురం ఒకరి భుజాల మీద ఒకరి చేతులు వేసుకుని, ధైర్యంగ, బయటకు నడిచినము.
మేం పోతాంటె, డ్రైవర్ మాకు నమస్కరించిండు.
“నా పోచంపల్లి చీరె తేకనే పాయే సచ్చినోడు.” అన్న మా అత్త మాటలు గాలిల వినిపిస్తాంటె, ‘సచ్చినోడు’ అన్న మాటకు వినిపించిన మా కిలకిల నవ్వులకు తోడుగ, గీ అడవి తల్లి గూడ నవ్వి మురిసిపోయినట్టనిపించింది. ఎందుకంటే నన్ను పాడు చేసినప్పుడు నిస్సహాయంగ నిలబడ్డ అడవి తల్లి ఇప్పుడు తలెత్తుకోని గర్వంగ నిలబడ్డట్టనిపించింది.
చరిత్రా, అడివీ – రొండూ – గెలిచినోల్లనే, అంటే మమ్మల్నే, విజేతలనే గుర్తు పెట్టుకుంటది కావొచ్చని నాకనిపించింది. అందుకే, అడివి తల్లి మా నవ్వులల్ల, తను గూడ తన నవ్వు కలిపినట్టనిపించింది.
(సమాప్తం)
డా. ప్రభాకర్ జైనీ ప్రసిద్ధ రచయిత. వాణిజ్య పన్నుల శాఖలో అసిస్టెంట్ కమీషనర్‌గా పదవీ విరమణ చేశారు. నంది అవార్డు గ్రహీత. సినీ దర్శకులు. ఇప్పటికి 31 నవలలు రచించారు. ఫోన్: 7989825420
