[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో సైన్స్ ఫిక్షన్ కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘మాయా శశిరేఖ’. రచన శ్రీ రాచపూటి రమేష్. ఇది మొదటి భాగం.]
ఆ పెద్దగది మాయల మరాఠీ గుహలా ఉంది. రకరకాల సైజుల్లో ఉన్న టేబుళ్లపై గాజు జాడీలు, వాటిల్లో రకరకాల ద్రవాలు సీసాల్లో ఉన్న రసాయనాలు, ఇంకా టేబుల్ సొరుగుల్లో కెమికల్స్ ఉన్న పాకెట్స్, బాటిళ్లూ ఎన్నో రంగుల్లో కనిపిస్తూ ఉన్నాయి. పద్మవ్యూహంలో ఉన్న అభిమన్యుడిలా వాటి మధ్య నిలబడి, టెస్ట్‌ట్యూబుల్లో రసాయనాలు కలుపుతూ, కొన్నిటిని కొవ్వొత్తి దీపాల్లో వేడి చేస్తూ, తన పనిలో తాను నిమగ్నమై ఉన్నాడు ప్రఖ్యాత సైంటిస్టు మాయా మశ్చీంద్రనాథ్.
మశ్చీంద్ర నాయనమ్మకు మశ్చీంద్రనాథుడిపై భక్తి, నమ్మకం జాస్తి. అందుకే మశ్చీంద్ర పుట్టిన వెంటనే ఆ దేవుడి పేరే తన మనవడికి పెట్టాలని పట్టుబట్టింది. ఆమె మాటలకు తల ఒగ్గక తప్పలేదు మశ్చీంద్ర తండ్రి మహేంద్రకు.
మశ్చీంద్ర చిన్నప్పటి నుండీ చదువులో చురుగ్గా ఉండేవాడు. ఒక పేరు పొందిన యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో పిహెచ్.డి పూర్తి చేశాడు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులూ ఏమీ లేకపోవడంతో తన పూర్తి ధ్యాస చదువుమీద పెట్టాడు. సైన్స్‌పై అతనికి గల జిజ్ఞాసను గమనించి అతని తల్లిదండ్రులు కూడా బాగా చదువుకొని వృద్ధిలోకి రమ్మని అతణ్ణి ప్రోత్సహించారు.
పిహెచ్.డీ పూర్తి చేశాక మశ్చీంద్రకు దేశవిదేశాల నుండి ఎన్నో మంచి ఉద్యోగాలకు ఆఫర్లు వెల్లువెత్తాయి. మాతృదేశం సైన్స్‌లో పురోగమించాలనీ, భారీ వేతనాలతో వచ్చిన విదేశీ ఆఫర్లను కాదని, ప్రభుత్వంతో నడపబడుతున్న ఒక ప్రతిష్ఠాత్మక ప్రయోగశాలలో సైంటిస్ట్‌గా చేరాడు మశ్చీంద్ర. అక్కడ అతని ప్రతిభ నిరూపించుకునేందుకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. బయోకెమిస్ట్రీలో ముఖ్యంగా మానవశరీరంపై హార్మోన్లు, ఎంజైమ్ల ప్రభావంపై మశ్చీంద్ర మూడు దశాబ్దాలకు పైగా కృషి చేశాడు. సబ్జెక్టు పరంగా అంతర్జాతీయ సైన్స్ పత్రికలో ఎన్నో వ్యాసాలు రాశాడు. దేశవిదేశాల్లో జరిగిన ఎన్నో శాస్త్రవేత్తల సదస్సులలో పాల్గొని ఎన్నో పేపర్లు ప్రజెంట్ చేశాడు. దేశవిదేశాల్లోని ఎన్నో సంస్థలూ, యూనివర్సిటీలు అతని ప్రతిభకు మెచ్చి ఎన్నెన్నో అవార్డులు, డాక్టరేట్లూ ప్రధానం చేశాయి.
కానీ రానురానూ, తాను పనిచేసే ప్రయోగశాలలో డబ్బు, రాజకీయాల ప్రభావం అధికంగా చోటు చేసుకోవడం మశ్చీంద్రకు మింగుడు పడలేదు. ఎన్నో సంవత్సరాలు సంస్థకు విశిష్ట సేవలందించిన తనను కాదని, రాజకీయాల జోక్యంతో తన కన్నా బాగా జూనియరైన ఒక వ్యక్తికి తనపై స్థాయి సైంటిస్ట్‌గా ప్రమోషనివ్వడం అతనికి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాలేదు. అందుకే ఇంకా ఐదేళ్ల సర్వీసు మిగిలున్నా ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తాను ఇంతకాలం ఆదా చేసిన డబ్బుతో ఇంటి సెల్లార్‌లో అన్ని హంగులతో ఒక లేబరేటరీ ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ఉన్నతమైన లక్ష్యంతో ప్రణాళికా బద్ధంగా పనిచేస్తూ ఉన్నాడు. వైద్యశాస్త్రంలో సంచలనం కలిగించగల ఒకానొక ఆవిష్కరణను అతిత్వరలో ప్రకటించగలనన్న నమ్మకం మశ్చీంద్రకుంది.
రిటైర్మెంట్ తరువాత ప్రభుత్వం నుండి వచ్చిన బెనిఫిట్స్ అన్నీ బ్యాంకులో ఫిక్సెడ్ డిపాజిట్ చేశాడు మశ్చీంద్ర. ఆ ఎఫ్.డీపై వచ్చే వడ్డీ, అతని పెన్షన్ డబ్బుతో కుటుంబం నడుస్తూ ఉంది. అదీ గాక ఎమ్.టెక్ పూర్తి చేసిన అతడి కొడుకు శశికాంత్ ఆ సరికే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆదాయానికి ఢోకా లేదు. మశ్చీంద్ర కూతురు రేఖ అప్పటికి యూనివర్సిటీలో ఎం.ఎస్సీ చదువుతూ ఉంది. విశాఖ పట్నంలోనే స్వంత ఇల్లు కట్టుకొని స్థిరపడింది ఆ కుటుంబం.
మశ్చీంద్రకు అతని ప్రయోగాల్లో సహాయపడడానికి బయోకెమిస్ట్రీలో ఇటీవలే పిహెచ్.డి పూర్తి చేసిన మనోజ్ తనంతట తానే ముందుకొచ్చాడు. మశ్చీంద్ర గైడెన్స్‌లో తాను ఎన్నో విషయాలు తెలుసుకోగలనని మనోజ్ నమ్మకం. కానీ ఆరు నెలలు తిరక్కుండానే మనోజ్‌కు విదేశాల్లో ఒక మూడు నెలల ప్రాజెక్టు చేయడానికి అవకాశం వచ్చింది. ఫారిన్ వెళ్తూ మశ్చీంద్రకు సహాయపడడానికి తన ఫ్రెండ్, క్లాస్‌మేటైన శివరామ్‌ను పురమాయించి వెళ్లిపోయాడు. శివరామ్ మనోజ్ అంత బ్రిలియంట్ కాదు. కానీ తన వంతుగా ఏదో ఒకరకంగా మశ్చీంద్రకు సహాయ సహకారాలందజేస్తూ ఉన్నాడు.
సెల్లార్ మెట్లు దిగి, సంకోచంగా లేబ్‌లోకి అడుగు పెట్టిన శివరామ్‌కి మశ్చీంద్ర కనబడలేదు. లేబ్‌లోని తన స్పెషల్ ఛాంబర్లో ఆయన ప్రయోగాల్లో మునిగి ఉండవచ్చుననుకున్నాడు శివరాం. ‘అదీ ఒకందుకు మంచిదే, తన ధ్యాసలో తానుండి తన ఆలస్యపు రాకను ఆయన పట్టించుకోక పోవచ్చు’ అనుకున్నాడు.
ముప్పైరెండేళ్లు సమీపిస్తున్నా ఇంకా శివరామ్‌కి పెళ్లి సంబంధం కుదరలేదు. ఎమ్మెస్సీ తరువాత ఎం.ఫిల్, ఆనక పిహెచ్.డీ పూర్తి చేసేసరికి అతనికి ముప్పైఏళ్లు ముంచుకొచ్చాయి. రాత్రీ పగలూ చదువుతూ ఉండడంతో దళసరి కళ్లద్దాలూ, వంశపారంపర్యంగా వచ్చిన బట్టతలతో అతడు చూసేందుకు నలభైఏళ్ల వాడిలాగా ఉంటాడు. అతని తల్లిదండ్రులిద్దరు టీచర్లుగా పనిచేసి రిటైరయ్యారు. శివరామ్‌కు ఇద్దరు అక్కలూ, ఒక చెల్లీ ఉన్నారు. వారందరి పెళ్లిళ్లు చేసేసరికి అతని తల్లిదండ్రులు ఆదా చేసిన సొమ్మంతా కరిగిపోయింది. స్వంత ఇల్లు కూడా కట్టుకోలేదు. మధురవాడలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. శివరామ్‌ను చూసి ఏ అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడం లేదు. అసలే అమ్మాయిల కొరత, ఆపై ముదిరిపోతున్న వయసుతో శివరామ్‌కి పెళ్లిబెంగ పట్టుకొంది.
‘భౌ భౌ’మని అరుపులతో శివరామ్‌పైకి దూసుకొచ్చింది జూలీ, ఆ బొచ్చుకుక్కను ఇదివరకే మశ్చీంద్ర ఇంట్లో చూసి ఉన్నాడు శివరామ్. జూలీ మామూలుగా సాధుస్వభావంతో ఉంటుంది. పైగా పిరికిది. కానీ ఆ కుక్క ఈరోజు అమిత పౌరుషంతో తన మీదికురికే సరికి అసలే కంగారులో ఉన్న శివరామ్ తత్తరపాటుతో తాను తీసుకొచ్చిన కెమికల్స్ టిన్ కిందికి జారవిడిచాడు. పెద్ద శబ్దంతో ఆ టిన్ కింద పడడంతో జూలీ తికమకపడి అరుస్తూ దూరంగా వెళ్లిపోయింది. కానీ ఆ శబ్దానికి తన ఛాంబర్ నుండి బయటకు వచ్చిన మశ్చీంద్ర శివరామ్‌ని చూసి “ఏందయ్యా ఇంత లేటు, ఆ టెన్షనేమి? ఆ చెమట్లేమి? తిన్నగా లేబ్‌లోకి రాలేవూ? నేను చెప్పిన కెమికల్స్ కొనుక్కొచ్చావా?” అని కేకలు పెట్టాడు.
“ఆ, తెచ్చాను సార్” అని కింద పడ్డ టిన్ తీసుకొని శివరాం ఆయన వెనుకే లేబ్‌లోకి నడిచాడు.
“ఆ యాసిడ్ బాటిల్ అందుకో, ఈ ద్రావకాన్ని ముప్పైడిగ్రీలలో వేడి చేయి” ఇలా సూచనలిస్తూ మశ్చీంద్ర తన ప్రయోగాల్లో మునిగిపోయాడు.
‘అమ్మయ్య, గండం గడిచింది’ అని శివరామ్ మశ్చీంద్ర సూచనలను పాటిస్తూ ఆయనకు సహాయ పడసాగాడు. అలా ఒక గంట సేపు గడిచింది.
మశ్చీంద్ర తన ఛాంబర్లోకి నడిచి, తలుపులు వేసుకున్నాడు. ఆ రోజంతా చేసిన ప్రయోగాల వివరాలు, తమ ప్రోగెస్, ఫైండిరగ్స్ అన్నీ ఒక డైరీలో రాయడం ఆయనకలవాటు. ఆ డైరీని తన ఛాంబర్లో ఉన్న ఒక రహస్య అరలో ఆయన దాస్తూ ఉంటాడు.
శివరామ్‌కు మశ్చీంద్ర తమ లక్ష్యం ఏమిటో, ఈ ప్రయోగాల సారాంశం ఏమిటో ఏ మాత్రం చెప్పలేదు. శివరాం కూడా ఆయనను అడగడానికి సాహసించలేదు. ఎలాగూ మరో ఆరు నెలలో మనోజ్ తిరిగొచ్చేస్తాడు, అంతవరకూ మశ్చీంద్రకు సాయపడి, మనోజ్ వచ్చాక మరొక ఉద్యోగం వెతుక్కోవాలని అనుకుంటున్నాడతను.
మశ్చీంద్ర తన ఛాంబర్లోకి వెళ్లి తలుపు వేసుకోవడంతో శివరామ్ ఏం చేయాలో తోచక తన సెల్లో ఒక మేట్రిమోనియల్ సైట్ ఓపెన్ చేసి తనకు నచ్చే పెళ్లికూతుర్ల వివరాలు చూసుకుంటూ ఉన్నాడు. అవి ఎక్కువగా పాతికేళ్లలోపు వాళ్లవే ఉన్నాయి. తన వయసుకు తగిన సంబంధాలు తక్కువే ఉన్నాయి.
ఇంతలో చప్పుడు చేస్తూ మెట్లు దిగి కిందికి వచ్చాడు పనివాడు అల్లిబిల్లి ఆంజనేయులు. ఆంజనేయులు పాతికేళ్ల నుండి ఆ ఇంటి పనివాడు, పార్ట్‌టైం వంటవాడు, తోట మాలి కూడానూ, తెల్లబొక్క, ఖాకీ నిక్కరు, మాసినగడ్డం, పిచ్చిచూపులతో చూసేందుకు వెర్రివెంగళప్పలా అనిపిస్తుంటాడతను.
మశ్చీంద్ర భార్య వర్ధనమ్మ ఇంటిలో ఆంజనేయులు తండ్రి పనివాడుగా ఉండేవాడు. వర్ధనమ్మకు పెళ్లయ్యాక ఆంజనేయులు తండ్రి తన కొడుకును మశ్చీంద్ర ఇంట్లో పనివాడుగా ఉండేందుకు పంపించాడు. పాతికేళ్ల నుండీ నమ్మకంగా ఆ ఇంట్లో పనిచేస్తూ, అందరి అభిమానం చూరగొన్నాడు ఆంజనేయులు.
ఆంజనేయులు ఆ ఇంటికి రాకమునుపు మద్రాసు వెళ్లి రెండేళ్లు సినిమాల్లో నటుడుగా చేరాలని సినీఫీల్డులో ప్రయత్నించాడు. అతడికి సినీ అవకాశాలేమీ రాలేదు కానీ సినీపరిజ్ఞానం మాత్రం బాగా వంటబట్టింది. వీలైనప్పుడల్లా తన పరిజ్ఞానాన్ని ఇతరులపై ప్రయోగిస్తూ ఉంటాడు ఆంజనేయులు వురఫ్ అంజి.
“అమ్మగారు సార్‌ను భోజనానికి రమ్మంటున్నారు” మెట్లు దిగుతూ కేక పెట్టాడు ఆంజనేయులు. కానీ తన ధ్యాసలో తానున్న శివరామ్ అంజి రాకను పట్టించుకోలేదు.
ఆంజనేయులు శివరామ్ దగ్గరకు నడిచి అతడు సెల్లో చూస్తున్నదేమో చూశాడు. తరువాత పెద్ద నవ్వి, “నెత్తి మీదికి నలభైఏళ్లొచ్చినా, ఇంకా పెళ్లికుదరక, పెళ్లి ధ్యాసలో పడికొట్టుకుంటున్నావు. ఇంక నువ్వు ఎక్స్‌పెరిమెంట్లేవి చేస్తావు? ఏమి పొడుస్తావు?” అన్నాడు. అసలే పరధ్యానంలో ఉన్న శివరామ్ అంజి మాటలను పట్టించుకోలేదు.
“1953లో రోహిణీ ఫిలిమ్స్ అధినేత హెచ్చెమ్ రెడ్డి కొత్తవాళ్లతో సినిమా తీయదలచి, పేపర్ ప్రకటన ఇచ్చి, వచ్చిన ఫోట్లోంచి నెల్లూరుకు చెందిన కల్లయ్యను హీరోగా, ఎంపికచేసి సన్నాహాలు ప్రారంభించాడు. కానీ ‘ప్రతిజ్ఞ’ సినిమా ప్రారంభమయ్యే సరికి కాంతారావు హీరో, కల్లయ్య అనే రాజనాల విలనై కూర్చున్నారు. ఆ విధంగా బీయస్సీ సెకండియర్ చదువుతూ, మధ్యలో ఆపేసిన నేను ఆ డిగ్రీ పూర్తి చేసుంటే సైంటిస్ట్‌గానూ, పని ధ్యాస లేని నువ్వు పనివాడుగానూ వుండాల్సిన వాళ్లం. గ్రహాలు బాగా లేక నేను వంటవాడిగా నువ్వు సైంటిస్ట్‌గా అవతారాలెత్తాం. అసలు నిన్ను గాదు, నీకు అవకాశమిచ్చిన మీ గురువుననాలి..” అని అంజి ఇంకా ఏవో లెక్చరివ్వబోతూ ఉంటే గ్లాస్ డోర్స్ తెరచుకొని మశ్చీంద్ర తన ఛాంబర్ నుండి బయటకు వచ్చాడు.
“సార్, అమ్మగారు డిన్నర్‌కు రమ్మంటున్నారు” హఠాత్తుగా మశ్చీంద్ర బయటకు రావడంతో తత్తరపడిన అంజి చెప్పేసి, వేగంగా మెట్లెక్కి వెళ్లిపోయాడు.
“ఓకే శివరామ్, రేపు మార్నింగ్ టెన్‌కొచ్చెయ్యి. ఈ రోజులా ఆలస్యం చెయ్యకు” అని మశ్చీంద్ర న్యాప్‌కిన్‌తో మొహం తుడుచుకొని, మెట్లెక్కి ఇంట్లోకి వెళ్లిపోయాడు. శివరామ్ ఉసూరుమని లేబ్ తాళం వేసి తాళం చెవి ఇంట్లో కీస్టాండ్‌లో తగిలించి తన ఇంటికి వెళ్లిపోయాడు.
***
“మీరు మీ పనిధ్యాసలో పడితే ఇంటి గొడవలేమీ పట్టదు. మిక్సీ పాడైందని మూడు రోజుల నుండి మొత్తుకుంటూ ఉన్నాను. వాషింగ్ మెషిన్ పనిచేయడం లేదు. ఒక రోజు మీ చెత్త ప్రయోగాలు కట్టిపెట్టి అవి రిపేరు చేయించుకొని రమ్మంటే వినరు. మీ గోల మీదే” అని మశ్చీంద్రపై చిందులు తొక్కుతోందతని భార్య వర్ధని.
“వాటిని అంజికిచ్చి రిపేరు చేయించుకుని రమ్మని పంపించకపోయావా?” గోంగూర పచ్చడిని అన్నంలోకి కలుపుకుంటూ అడిగాడు మశ్చీంద్రనాథ్.
“అంజికా, ఇంకా నయం, గాస్‌కెట్ తీసుకురమ్మంటే గ్యాసు పొయ్యి తీసుకొచ్చే రకం. ఈ రోజు ఆ శివరామ్‌నైనా పంపి వాటిని రిపేరు చేసుకొని రమ్మనండి, లేదా ఆ వెధవ ఎక్స్‌పెరిమెంట్లు ఈ రోజుకి కట్టిపెట్టి మీరైనా పోయి రండి” అని ఆయనపై ఉరిమింది వర్ధనమ్మ.
“మాటి మాటికీ నా ఎక్స్‌పెరిమెంట్ల నెందుకు ఆడిపోసుకుంటావు? త్వరలో సైన్సు చరిత్రలో ఒక మైలురాయి లాంటి ఆవిష్కరణ చెయ్యబోతున్నాను. తెలుసా?” గర్వంగా చెప్పాడు మశ్చీంద్రనాథ్ ఎడమచేత్తో తన పిల్లిగడ్డం నిమురుకుంటూ.
“అబ్బో, బడాయి, బంగారంలాంటి ఉద్యోగానికి రిజైన్ చేశారు. లేబ్ ఏర్పాట్లనీ, గొట్టాలనీ, గోలీలనీ వచ్చిన డబ్బంతా బూడిదలో పోశారు. పెళ్లై ఇన్నేళ్లైనా నాకొక కాసుల పేరు లేదు, చంద్రహారమూ లేదు. మీ కొలీగ్ పరబ్రహ్మశాస్త్రి భార్య రుక్మిణిని చూడండి, మొన్న ఒక పెళ్లికి ఒంటి నిండా నగలతో వచ్చింది. నాకు కళ్లు తిరిగిపోయాయి” భర్తపై ఉరుముతూ అన్నది వర్ధనమ్మ.
“అమ్మా, మీరిద్దరూ, ‘వారసత్వంలో గుమ్మడి, నిర్మలమ్మల్లా’ పోట్లాడుకోకుండా, ‘సంసారంలో ఎన్టీఆర్, లక్ష్మీరాజ్యంలలా’ కలిసిమెలసి ఉంటే బాగుంటుంది” నెయ్యిగిన్నె తెస్తూ చెప్పాడు అంజి.
“అమ్మా, నేను రేపు ఈవెనింగ్ మా ఫ్రెండ్ సునీత బర్త్‌డే పార్టీకి వెళ్లాలి. ఓ థౌజండ్ రూపీస్ కావాలి. మంచి గిఫ్ట్ తీసుకొని వెళ్తాను” అప్పుడే వచ్చిన రేఖ ఛేల్లో కూర్చుంటూ చెప్పింది.
“శశినడుగు, మీ అన్నయ్యే నిన్ను ఆ పార్టీకి తీసుకెళ్తాడు, దార్లో ఆ గిఫ్ట్ కొనిస్తాడు” చెప్పింది వర్ధనమ్మ.
“నో, నో, రేపు నాకు మా కంపెనీలో హెవీ వర్క్‌లోడ్ ఉంది. మా టార్గెట్ పూర్తి చేయడానికి రెండు రోజులే ఉన్నాయి. రేపు లేట్‌నైట్ వరకు సిస్టమ్ ముందు కూర్చోవాలి” భోంచేస్తున్న శశికాంత్ చెప్పాడు.
“టార్గెట్టా, పాడా? రేపు ఫ్రైడే కదా, అన్నయ్య వాడి ఫ్రెండ్స్‌తో ఏ పబ్‌లోనో పార్టీ ఫిక్స్ చేసుకొని ఉంటాడు” పచ్చడి వడ్డించుకుంటూ అన్నది రేఖ నవ్వుతూ.
“నో, నో, అదేం కాదు..” అని ఏవో చెప్పబోతున్న శశికాంత్ మాటలను మధ్యలోనే ఖండిస్తూ వర్ధనమ్మ “ఒరే, నువ్వు ఇంకా ఆ పార్టీలనీ, పబ్‌లనీ తిరుగుతూ ఉంటే ఎవ్వరూ నీకు పిల్లనివ్వరు. ఆ శివరామ్ గాడిలా బ్రహ్మచారిలా అఘోరించాలి. తెలుసుకో. అవన్నీ కట్టిబెట్టి బుద్ధిగా ఉద్యోగం చేసుకో” అన్నది.
“శ్రీమంతుడులో పచ్చితాగుబోతైన నాగేశ్వరరావు జమున వల్లే మారుతాడు, అబ్బాయిగారిని ఒక ఇంటి వాడుగా చేస్తే బుద్ధిగా కుదురుకుంటాడు” నవ్వుతూ అన్నాడు అంజి.
“ఒరే అంజి నువ్వు కాసేపు నోరుముయ్యి” కోపంగా చెప్పింది వర్ధనమ్మ.
“అమ్మా, పాపం వెంకట్రావు మామ అన్నిసార్లు వాళ్ళబ్బాయి సుధీర్‌ను రేఖకు చేసుకోమని తిరుగుతూ ఉన్నాడు గదా, ముందు దాని పెళ్లి సంగతి చూడండి. నా పెళ్లికింకా టైముంది” అన్నాడు శశికాంత్.
“ఇప్పుడు నా పెళ్లి గురించి ఎవరూ మాట్లాడ్డం లేదు. నీ పార్టీలు, పబ్బులు గురించి మాట్లాడుతున్నారు. ఇష్యూని సైడ్‌ట్రాక్ చేయాలని చూడకు” కోపంగా చెప్పింది రేఖ.
“సుధీర్‌కేం తక్కువ, ఎమ్‌సిఏ చేసి బెంగూర్‌లో మల్టీ నేషనల్ ఫర్మ్‌లో వర్క్ చేస్తూ ఉన్నాడు. నాకీ సంబంధం ఒకే” అన్నాడు మశ్చీంద్ర.
“నోరు మూసుకొని భోంచేయండి. బతకలేని బడిపంతులు మా అన్నయ్య, ఏడాదిలో రిటైరౌతాడు. ఇంకా సొంతిల్లు కూడా లేదు, మీకు ఒక స్టేటస్సు, గౌరవం ఏమీ అవసరం లేదు. కానీ నాకు హోదా ముఖ్యం” మశ్చీంద్రపై చిందులు తొక్కింది వర్ధనమ్మ.
“సాధనా ఫిలమ్స్ వారి తోబుట్టువులులో ఆస్తిపరురాలైన సావిత్రి ఏమి చూసి బికారి కాంతారావును ప్రేమించి పెళ్లి చేసుకొంది?” ఆంజనేయులు కల్పించుకున్నాడు.
“నువ్వు కాసేపు నోరుముయ్యి” అంజిని కసిరింది వర్ధనమ్మ. ఆంజనేయులు ఆమె పుట్టింటివారు పంపగా వచ్చినవాడు కాబట్టి అన్ని విషయాల్లో కల్పించుకొని మాట్లాడుతూ ఉంటాడు. వర్ధనమ్మ, మశ్చీంద్ర, పిల్లలూ అతణ్ణి గట్టిగా వారించరు. అతడు వారి శ్రేయోభిలాషి అని వారికి తెలుసు.
“సరే, అన్నయ్యకు కుదరకపోతే కారులో వెళ్లు. నేనెలాగూ రేపు సాయంత్రం షాపింగ్ చేసి వద్దామనుకుంటున్నాను. నన్ను జగదాంబ జంక్షన్లో డ్రాప్ చేసి తరువాత దొండపర్తిలో మీ ఫ్రెండ్ వాళ్లింటి దగ్గర డ్రాప్ చేస్తాడు కందస్వామి, మరీ లేటైతే నువ్వు ఆటోలో ఇంటికొచ్చెయి” అన్నది వర్ధనమ్మ.
“అలాగేలే అమ్మా. నేనూ జగదాంబలోనే గిఫ్ట్ కొని పట్టుకెళ్తాను” అన్నది రేఖ.
కందస్వామి పార్ట్‌టైం డ్రైవరు. బయట ఊర్లకు వెళ్ళినప్పుడూ, అవసరమైనప్పుడు వారి కారు డ్రైవ్ చేయడానికి పిలిపిస్తుంటారు.
“ఆ కందస్వామి ఈసారి తాగి డ్యూటీకి వస్తే ఇంక పిలిపించమని చెప్పెయ్యండి” అన్నది వర్ధనమ్మ.
“అలాగే వర్ధనీ, నేను కాసేపు పర్వతరావు కీర్తనలు వింటూ రిలాక్స్ ఔతాను” అని బెడ్‌రూంలోకి వెళ్లిపోయాడు మశ్చీంద్ర.
పర్వతరావు ఆ జిల్లాలో పేరు మోసిన సంగీత విద్వాంసుడు. కర్ణాటక సంగీతంలో అందెవేసిన చేయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఎన్నో కచేరీలు చేసి, ఎన్నో సంస్థల నుండి సన్మానాలు, పురస్కారాలు అందుకొన్నాడు.
రోజుకి పన్నెండు గంటలపాటు లేబ్‌లో నిరంతర పరిశోధనలతో బిజీగా ఉండే మశ్చీంద్ర, మొదటి నుండి కర్ణాటక సంగీతం అందునా త్యాగరాజ కృతులంటే చెవి కోసుకుంటాడు. లేబ్ నుండి వేడెక్కిన మెదడుతో బయటకు వచ్చిన తరువాత పర్వతరావు పాడిన కీర్తనలు, కృతులు వింటూ రిలాక్స్ ఔతుంటాడు. డిగ్రీ చదివే సమయంలో రేఖను కూడా శెలవుల్లో పర్వతరావు దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకోమని పంపించాడు మశ్చీంద్ర. అలా మూడేళ్లపాటూ పర్వతరావు దగ్గర శిష్యరికం చేసి కర్ణాటక సంగీతంలో ప్రవీణురాలైంది రేఖ.
***
“నాకింకో రెండు పెగ్గులు స్కాచ్ చెప్పు” యూనిఫాంలో ఉన్న బేరర్‌తో చెప్పాడు శశికాంత్.
“ఒరే శశీ, నీకిప్పటికే డోసు ఎక్కువైంది. ఈ పొజిషన్లో ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్లేమనుకుంటారు?” శశికాంత్‌ను వారిస్తూ చెప్పాడతని కొలీగ్ జోగారావు.
“జోగులూ, ఈ రోజు ఏదో ఛానెల్లో ఆ పర్వతం గాడి గాత్రకచేరీ వస్తుందట. మా నాన్న ఆ ప్రోగ్రాంలో మునిగిపోయి ఉంటాడు. మా అమ్మా, రేఖ బయట షాపింగ్‌కో, బర్త్‌డే పార్టీకో వెళ్లారు. వాళ్లు తిరిగొచ్చి అలసటగా వారి గదిలో పడుకుంటారు. నా గురించి పట్టించుకోరెవరూ” ధీమాగా అన్నాడు శశికాంత్.
“నీకీ మధ్య ప్రతి ఫ్రైడే మందు ప్రోగ్రాం ఐపోయింది. నా మాట విని వెంటనే పెళ్లి చేసుకో. పెళ్లాం వస్తే బుద్ధిగా పడి ఉంటావు” స్కాచ్ సిప్ చేసి చెప్పాడు జోగారావు.
“ఆలేఖ్య నా ప్రేమని యాక్సెప్ట్ చేసే వరకు ఇంకా తాగుతూనే ఉంటాను. ఒకవేళ ఆమె నా ప్రేమను కాదంటే దేవదాసులా ఈ స్కాచ్ బాటిల్‌తోనే సెటిలౌతాను, కానీ పెళ్లి మాత్రం చేసుకోను” ఖచ్చితంగా చెప్పాడు శశికాంత్.
“మరి ఆలేఖ్యకు తాగుబోతులంటే అసహ్యం కదా” నవ్వుతూ అడిగాడు జోగారావు.
“సరేనోయి జోగులూ, ఆమెను నా ప్రేమను ఒప్పుకోమను, వెంటనే ఈ స్కాచి బాటిల్‌ను వైజాగ్ సముద్రంలో పారేస్తాను” నవ్వుతూనే చెప్పాడు శశికాంత్.
“ఇటువంటి తాగుబోతులను ఆ అమ్మాయి దగ్గరకు కూడా రానివ్వదు, లేటౌతోంది. బిల్లుకట్టెయి, ఇంటికెళ్లాలి” ఆవులిస్తూ చెప్పాడు జోగారావు.
బేరర్‌కు బిల్లు మొత్తంతోబాటూ భారీగా టిప్పు చెల్లించాడు శశికాంత్, బేరర్ మురిసిపోతూ ఆ టిప్పు అందుకున్నాడు. ఈలాంటి రెగులర్ కస్టమర్స్ అందజేసే టిప్పుల కారణంగానే, కాస్తా తక్కువ జీతమైనా, ఆ బార్‌లో పనిచేస్తున్నాడతను.
శశికాంత్, జోగారావు మత్తుగా బయటకు వచ్చారు.
“నా బైక్‌లో నిన్ను నీ రూం దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను” బండి తీస్తూ చెప్పాడు శశికాంత్.
“నో థ్యాంక్స్, నేను ఆటోలో వెళ్తాను. ‘డ్రంకెన్ డ్రైవ్’ కింద ఏ పోలీసో కేసు వేస్తే నీతోబాటు నేనూ కోర్టుకు తిరగాల్సి వస్తుంది” అని వెళ్లిపోయాడు జోగారావు.
శశికాంత్ తన బైక్‌లో కాస్త దూరం వెళ్లగానే బస్టాప్ వద్ద వెయిట్ చేస్తూ ఆలేఖ్య కనిపించింది. ఆమెకు కొద్ది దూరంలో ఆమె స్కూటీ పార్క్ చేసి ఉంది.
ఆమెకు లిఫ్ట్ ఇద్దామా వద్దా అని ఆలోచిస్తూ తన బైక్ స్లో చేశాడు శశికాంత్, తననిటువంటి స్థితిలో చూస్తే ఆమె అసహ్యించుకుంటుందేమో,
“శశికాంత్, శశీ..” ఆలేఖ్యనే తనను పిలవడంతో ఆశ్చర్యపోతూ రోడ్ క్రాస్ చేసి ఆమె ముందు బైక్ ఆపాడు శశి.
“ముఖ్యమైన అసైన్‌మెంట్ ఉండడంతో ఆఫీసులో లేట్ అయింది. బైక్ ఇక్కడికి రాగానే పంచరైంది, ఆటోలో ఈ టైంలో ఎక్కాలంటే భయం. పది నిమిషాల నుండి వెయిట్ చేస్తున్నా బస్ రాలేదు. మా ఇల్లూ మీ కాలనీలోనే కదా, ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యి నన్ను” గబగబ చెప్పింది ఆలేఖ్య.
“ఈ సోదంతా ఎందుకు? బండి ఎక్కు” అన్నాడు శశికాంత్ నవ్వుతూ.
ఆలేఖ్య బైక్ వెనుక సీట్‌లో కూర్చోబోతూ హఠాత్తుగా ఆగింది.
“అదేమిటి? నీ దగ్గర హాస్పిటల్ వాసన వస్తూ వుంది. మళ్లీ తాగొస్తున్నావా?” అన్నది కోపంగా.
శశికాంత్ తత్తరపడ్డాడు. ఏం చెప్పాలో తోచలేదతనికి.
“జోగారావు గాడి బర్త్‌డే అంటే వాడితో బాటు లైట్‌గా తాగానంతే. ఏమీ ఫర్వాలేదు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా, ఎక్కు” అన్నాడు, బండి స్టార్ట్ చేస్తూ.
“నో, నో, గో అవే, నువ్వింకా ఏం మారలేదు” ఎర్రబడ్డ కళ్లతో చెప్పింది ఆలేఖ్య.
“చెప్పేది విను ఆలేఖ్య, ఆ బస్ ఎప్పుడొస్తుందో ఏమో” అన్న శశికాంత్‌ను వెళ్లిపొమ్మని చెప్పి, దూరంగా వెళ్లి నిలుచుకుంది ఆలేఖ్య.
ఇంతకు మునుపొకసారి ఒక సినీథియేటర్ దగ్గర ఆలేఖ్యను అల్లరి చేస్తున్న కొందరు రౌడీ కుర్రాళ్లను చితగొట్టాడు శశికాంత్. దురదృష్టవశాత్తు ఆ సమయంలోనూ అతను స్వల్పంగా తాగి ఉన్నాడు. అప్పటి నుండీ శశికాంత్ తాగుబోతని, గొడవల మనిషని అతణ్ణి దూరంగా పెడుతోంది ఆలేఖ్య. ఇంతలో ఇదొకటి, జరిగింది.
“ఆలేఖ్య, నా మాట విను. ఈ టైంలో ఒంటరిగా ఇక్కడ వెయిట్ చేయడం మంచిది కాదు” ఆమెను బతిమలాడుతున్నట్లు అన్నాడు శశికాంత్.
“దయచేసి వెళ్లిపో శశి. నేను వెళ్లిపోగలను” అని చుట్టూ చూసింది ఆలేఖ్య. దూరంగా ఒక ఆటో వస్తూ కనిపించింది. ఆలేఖ్య ఆ ఆటోను పిలిచి, “లాసన్స్‌బే కాలని” అని బేరమాడకుండా ఎక్కి కూర్చుంది. ఆ ఆటోను ఫాలో ఔతూ వెనుకనే వెళ్ల సాగాడు శశికాంత్. ఆలేఖ్య ఆటో దిగి, ఇంట్లోకి వెళ్లడం చూసి సంతృప్తి చెంది, ఇంటి దారి పట్టాడు.
అతడనుకున్నట్లుగానే అతని తండ్రి టీవీ ఛానెల్‌లో పర్వతరావు సంగీతకచేరిని ఆనంద పరవశంతో చూస్తూ ఉన్నాడు. షాపింగ్ ముగించుకొచ్చిన అతని తల్లి వర్ధనమ్మ కిచెన్‌లో ఉంది. శశికాంత్‌ను చూసి, “శశి, భోంచేస్తావా?” అని కిచెన్‌లోంచే అరిచింది. “బయటే తినేశానమ్మా” అని తన రూంలోకి పిల్లిలా నడిచి తలుపేసుకున్నాడు శశికాంత్.
***
వర్ధనమ్మ షాపింగ్ ముగించుకొని ఇల్లు చేరుకున్నప్పటికీ రేఖ ఇంకా ఇంటికి రాలేదు.
ఆమె ఫ్రెండ్ సునీత బర్త్‌డే ఫంక్షన్ ముగియడానికి బాగా ఆలస్యమైంది. రేఖ సునీతకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఆమె త్వరగా బయల్దేరడానికి సునీత ఆమె తల్లి ఒప్పుకోలేదు.
“మా తమ్ముడు గోపీ, నిన్ను ఇంటి దగ్గర దిగబెడ్తాడులే” అని పార్టీ జరుగుతుండగా సునీత చెప్పింది రేఖకు. కానీ గోపి ఆ ఫంక్షన్‌కు వచ్చిన సునీత పిన్నిని విజయవాడకు వెళ్లే ట్రైనెక్కించడానికి స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంది.
“ఏమీ అనుకోవద్దక్కా, నిన్ను ఆటో ఎక్కించి వస్తాను పద” అని గోపి ఆమెను బయల్దేరదీశాడు. కానీ ఆటో స్టాండులో ఆటోలేవీ ఆ సమయంలో లేవు. అంతలో రేఖ వాళ్లింటివైపు వెళ్లే సిటీబస్ వస్తూ కనిపించింది.
“నేను బస్‌లో వెళ్లిపోతానులే, నువ్వు ఇంటికి వెళ్లిపో” అని రేఖ గోపికి చెప్పేది వినిపించుకోకుండా బస్సు ఎక్కేసింది.
ఆమె ఇంటి సమీపంలో ఉన్న బస్టాప్‌లో బస్ దిగేసరికి రాత్రి పదిగంటలు కావస్తోంది. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది.
అర్ధ ఫర్లాంగు దూరంలోనే ఇల్లు ఉంది. రేఖ చిన్నగా నడుస్తూ ఉంది. సెంటర్ వద్ద ఉన్న టీషాపు ఇంకా తెరిచే ఉంది. దాని ముందు బైక్స్‌లో కుర్చుని ఉన్న కుర్రకారు జోకులేసుకుంటూ జోరుగా మాట్లాడేసుకుంటూ ఉన్నారు. ముఖంపై చిందర వందరగా పడుతున్న పొడవాటి జుట్టుతో రౌడిలా కనిపిస్తున్న వాడొకడు రేఖను చూసి వెకిలిగా నవ్వాడు.
“పాపా, బావున్నావా, ఇంటి దాకా తోడు రమ్మంటావా?” అన్నాడు నవ్వుతూ.
“ఒరే వినోద్, పాపం పాపను భయపెట్టకురా” బక్కపల్చగా ఉన్న ఓ టీషర్ట్ కుర్రాడు కల్పించుకున్నాడు.
“రేఖ చాలా బ్రేవ్ గర్ల్, వీటికంతా భయపడదు” అన్నాడు గిరజాల జుట్టువాడు ఆమెను సమీపిస్తూ.
రేఖ అదుర్తున్న గుండెలతో నడక వేగం పెంచింది. కాలేజీలో ఆ గిరజాలజుట్టు వాడిని ఇదివరకే చాలాసార్లు చూసింది. రేఖ కనపడినపుడల్లా ఏదో ఒక వంకతో వాడామెను ఏడిపిస్తూ ఉంటాడు.
చాలాసార్లు వాడి విషయం తన అన్నయ్య శశికి చెప్పాలనుకుంది రేఖ. కానీ శశికాంత్ దురుసు మనిషి. వాడి ఎముకలు విరగొట్టినా కొట్టగలడు, తన వల్ల అన్నయ్య పోలీసు కేసులో ఇరుక్కోగలడని రేఖ భయం.
వినోద్ మళ్లీ వెకిలిగా ఏదో అనబోతూ రేఖను సమీపించబోయాడు. అంతలో వారికి సమీపంలో ఒక బుల్లెట్ ఆగింది. చిరుగడ్డం, పోనీటెయిల్‌తో ఉన్న ఓ పాతికేళ్ల కుర్రాడు బుల్లెట్ దిగి స్టాండ్ వేసి వినోద్ వంక తీక్షణంగా చూశాడు. క్షణకాలం పాటు వినోద్ తత్తరపడి వెనక్కు తగ్గాడు.
ఇదే అదనుగా రేఖ గబగబా నడిచి ఐదు నిమిషాల్లో ఇల్లు చేరుకుంది.
పోనీటెయిల్‌వాడు తనను తిడ్తాడేమోనని వినోద్ భయపడ్డాడు. కానీ వాడు వినోద్‌ను చూసి చిరునవ్వు నవ్వాడు. కండలు పెంచి, బాడీ బిల్డరులా ఉన్నాడతను.
“ఇప్పుడు వెళ్లిన అమ్మాయీ, వాళ్ల ఇంట్లో వాళ్లూ నీకు తెలుసా?” అడిగాడు వాడు వినోద్‌ను.
“బాగానే తెలుసు” నిర్లక్ష్యంగా చెప్పాడు వినోద్.
“ఐతే రేపు ఈ అడ్రస్‌కు రా. నీకు మంచి గిఫ్ట్ దొరుకుతుంది” వినోద్ చేతికి ఒక విజిటింగ్ కార్డిచ్చి హడావిడిగా వెళ్లిపోయాడు పోనీటెయిల్‌వాడు.
వినోద్ ఆ కార్డును నలిపి దూరంగా పారెయ్యబోయాడు.
అతని సన్నటి ఫ్రెండ్ వినోద్ చేయి పట్టుకొని, “ఏదో గిఫ్ట్ అంటున్నాడుగా, ఒకసారి ఆ అడ్రస్‌కు వెళ్లి రాగూడదూ!” అన్నాడు.
వినోద్ ఆ కార్డు మడచి జేబిలో పెట్టుకున్నాడు.
***
“ప్రేమం సినిమాలో నాగచైతన్యలా ముదిరిన బ్రహ్మచారివి. నీకెవరు పిల్లనిస్తారు?” పెళ్లి గురించి కలలు మాని బుద్ధిగా ఉద్యోగం చేసుకో” పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్న శివరామ్‌ను మందలించాడు అంజి.
“నేనేమి కలలు కనడం లేదు. మా రీసెర్చి గురించి ఆలోచిస్తున్నాను” పౌరుషంగా జవాబిచ్చాడు శివరామ్.
“అబ్బో, రిసెచ్చి, రీసెచ్రీ అని పెద్ద బడాయి. అసలు మీ గురువుగారు దేని గురించి ఈ రిసెర్చి చేస్తున్నాడో చెప్పగలవా?” కన్నుబొమ్మలు ఎగరేసి అడిగాడు అంజి.
శివరామ్ బుర్ర గీక్కున్నాడు. తాను ఉన్నదే టెంపరరీ ఉద్యోగంలో, అందువల్ల మశ్చీంద్ర అడిగిన కెమికల్స్, సొల్యూషన్స్ కలిపి ఇవ్వడం, కుక్కలు, పిల్లులు, ఎలుకల వంటి ప్రాణులకు ఇంజక్షన్లు గురువుగారు చెప్పినట్లుగా ఇవ్వడం, ప్రయోగశాల సర్ది పరకరాలు నీట్‌గా అరేంజ్ చేయడం, ఇలాంటి పనులే శివరామ్ చేస్తున్నాడు. ఎలాగూ మరో రెండు, మూడు నెలల్లో మనోజ్ తిరిగొచ్చేస్తాడు. అంతవరకూ ఎలాగోలా గడిపి, తరువాత తన దారి తాను చూసుకోవాలని శివరామ్ అనుకున్నాడు. అందుకే మశ్చీంద్ర మాస్టారు చేసే ప్రయోగాల గురించి పెద్దగా పట్టించుకోలేదు.
శివరామ్ అంజి అడిగిన ప్రశ్న గురించి కాసేపు ఆలోచించాడు “మశ్చీంద్ర ఆదిత్య 369 సినిమాలోలా టైం మెషిన్ నేమైనా తయారు చేస్తున్నాడా? లేదా 24 సినిమాలోలా కాలాన్ని వెనక్కు తిప్పగల వాచీనేమైనా రూపొందిస్తున్నాడా?”.. ఖచ్చితంగా ఐఉండదు.
మశ్చీంద్ర గారు ఫిజిక్స్‌లో సైంటిస్ట్ కాదు, మైక్రోబయాలజీ, జెనిటిక్స్, అనాటమీ వంటి జీవశాస్త్రాలను క్షుణ్ణంగా చదువుకున్నవాడు.
మానవ శరీరాన్ని ప్రభావితం చేసే రసాయనాల మీదనో లేదా శరీరంలో వివిధ గ్రంథులు స్రవించే హార్మోన్స్ మీదనో ఆయన ప్రయోగాలు ఉండవచ్చు. మరి ఇంకూ ఆయన టార్గెట్ ఏమిటి?
అంతలోనే శివరామ్ తల విదిలించాడు. మశ్చీంద్ర గారి టార్గెట్ ఏమైతే, తనకేంటి? ఆయన దగ్గర తాను కేవలం నెల జీతగాడు మాత్రమే. మరొక నెలా, రెండు నెలలు ఉంటాడు.
మశ్చీంద్ర తాను దేని గురించి ప్రయోగాలు చేస్తూ ఉన్నాడో తనకెప్పుడూ చెప్పలేదు. తానూ అడగలేదు. పోనీ ధైర్యం చేసి అడిగితే..
అమ్మో, ఇంకేమైనా ఉందా? తన మీద కోపం తెచ్చుకొని కేకలేసి ఉద్యోగం ఊడగొడితే.. పోతే పోనీ.. ఈ ఉద్యోగమేమీ శాశ్వతమైనది కాదు. తుమ్మితే ఊడిపోయే ముక్కు.. దీని గురించి తానింత మధనపడడమెందుకు?..
శివరామ్ ఆలోచనలను భగ్నం చేస్తూ బూట్లు టకటకలాడిస్తూ మశ్చీంద్ర అక్కడికి వచ్చేశాడు. వెంటనే శివరామ్ జాగ్రత్తపడి లాబరేటరీ సర్దుతూ ఉన్నట్లుగా ఫోజిచ్చాడు. మశ్చీంద్ర అతణ్ణి చూసి తృప్తిగా చిరునవ్వు నవ్వి తన ఛాంబర్లోకి నడిచాడు.
శివరామ్ కూడా మశ్చీంద్ర ననుసరిస్తూ ఛాంబర్లోకి నడవబోయాడు. అంతలో అతని వేపు పరుగెత్తుకుంటూ వచ్చి అతడి పాదాలను నాకసాగింది జానీ. జానీ, జూలీకి సోదరుడు. ఆ బొచ్చుకుక్క ఇది వరకు వీరావేశంతో రెచ్చిపోతూ శివరామ్ మీదికి దూసుకొచ్చేది. కానీ ఈ రోజు దానికి విరుద్ధంగా శివరామ్‌పై ప్రేమ చూపే సరికి ఆశ్చర్యపోయాడు శివరామ్.
‘సైంటిస్టు గారు తన కుక్కలపై ప్రయోగాలు చేస్తున్నాడా? ఐతే అవి ఏమిటి?’
“ఆ క్లోరోఫాం బాటిల్ ఇలా అందుకో..” మశ్చీంద్ర గదమాయించడంతో ఇహలోకంలోకి వచ్చిన శివరామ్ ఆయనకా సీసా ఇచ్చి తిరిగి ఆలోచనలో పడ్డాడు.
మశ్చీంద్ర తాను రకరకాల జంతువుల నుండి సేకరించిన రక్తం శాంపుల్స్‌ను మైక్రోస్కోప్‌లో చూస్తూ, వాటిని అనలైజ్ చేస్తూ ఉండిపోయాడు. శివరామ్ ఆయనకు సహాయపడుతూ ఆయన చేస్తున్న పనిని గమనిస్తూ ఉండిపోయాడు.
రెండు గంటల తరువాత మశ్చీంద్ర ఛాంబర్ నుండి బయటకు వచ్చి అలసటగా అక్కడే ఉన్న కుషన్ ఛేర్లో కూర్చుని ఇంటర్‌కాంలో అంజీని టీ తెమ్మన్నాడు. ‘మశ్చీంద్ర, శివరామ్ టీ తాగుతూ రిలాక్స్ అయ్యారు కాసేపు. మశ్చీంద్ర మంచి మూడ్లో ఉండగా శివరామ్ ధైర్యం చేసి అడిగాడు.
“సార్, నిన్న మా మిత్రులు కొందరు దేనిమీద నువ్వు ప్రయోగాలు చేస్తున్నావని అడిగారు. నేను వారికి సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాను..” అని నసుగుతూ ఉన్నాడు.
మశ్చీంద్ర చిరునవ్వు నవ్వాడు.
“జీవశాస్త్రంలో సంచలనం సృష్టించే ఒక ఆవిష్కరణ చేయాలని నేను చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఉన్నాను. అది డబ్బు కోసమో, కీర్తి కోసమో కాదు. మనుషులకు, మానవజాతికీ మేలు చేయాలనీ, ఇంకా నా ప్రయోగాలు పూర్తి రూపు సంతరించుకోలేదు. బహుశా మరొక నెల రోజుల్లో నా ప్రయత్నానికి తుదిరూపు వస్తుందేమో, సమయం వచ్చినప్పుడు నేనే దాని గురించి నీకు చెబుతాను” అన్నాడు.
శివరామ్ వినయంగా తల ఊపాడు.
(ఇంకా ఉంది)
