[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో సైన్స్ ఫిక్షన్ కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘మాయా శశిరేఖ’. రచన శ్రీ రాచపూటి రమేష్. ఇది రెండవ భాగం.]
విజిటింగ్ కార్డులోని అడ్రస్‌ను ఒకసారి సరిచూసుకొని, ఆ ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు వినోద్.
‘పోనీ టెయిల్ కుర్రవాడు ఏదో గిఫ్ట్ ఇస్తానన్నాడు తనకు. ఎందుకు? మశ్చీంద్ర ఇంట్లో వారి సమాచారం వాడికెందుకు? తెలుసుకొని ఏం చేస్తాడు?’ అనుకున్నాడు.
తలుపు భళ్లున తెరుచుకొంది. పోనీటెయిల్ వాడు తలుపు సందులోంచి చూసి వినోద్‌ను లోనికి రానిచ్చాడు.
ఒక సైడ్ రూంలోకి వినోద్‌ను తీసుకువెళ్లి కూర్చోమని పోనీటెయిల్ వాడు అతనితో చేయి కలిపి, “నా పేరు వీరమణి. మా డాడీ నాగముత్తుగారిని పిలుస్తానుండండి” అని ఇంటిలోనికి వెళ్లాడు. ఈలోగా పనివాడు వినోద్‌కు ఒక కప్పులో టీ తీసుకు వచ్చి ఇచ్చాడు.
వినోద్ టీ తాగడం పూర్తయ్యేసరికి, ఒక ఆజానుబాహుడైన వ్యక్తి లోనికి వచ్చాడు. వినోద్ ఆయనకు నమస్కరించబోయేంతలో ఆయన వినోద్‌ను కూర్చోమని సైగ చేసి కుషన్ సీట్లో కూర్చున్నాడు. సఫారీ సూట్లోని ఆ పిల్లిగడ్డం వ్యక్తిని చూసి ఏదో తెలియని భయం కలిగింది వినోద్‌కు.
నాగముత్తు వినోద్ వంక తీక్షణంగా ఒక క్షణం పాటూ చూసి, అతడేం చేస్తూ ఉంటాడో కనుకొన్నాడు. వినోద్ నిరుద్యోగి అని, అతడి తండ్రి ఏదో కంపెనీలో వాచ్‌మెన్‌గా పని చేస్తూ ఉన్నాడనీ, అతనికి డబ్బు చాలా అవసరమని తెలుసుకున్నాడు నాగముత్తు.
“డిగ్రీ చదువుతూ ఉన్నానంటున్నావు. పుస్తకాలకూ, ఫీజులకూ నీకు చాలా డబ్బు అవసరం పడుతుందేమో” అని సందేహం వెలిబుచ్చాడు నాగముత్తు గడ్డం నిమురుకుంటూ.
“ఔను సార్” ఆశగా అన్నాడు వినోద్.
“నాకొక పనిచేసి పెట్టు. నీకు వెయ్యి రూపాయలిస్తాను” కొద్దిగా ముందుకు వంగి అన్నాడు నాగముత్తు. వీరమణి వరండాలోకి వెళ్లి సిగరెట్ వెలిగించాడు.
“మశ్చీంద్ర ఇంట్లో పనివాళ్లు, నౌకర్లు ఎవరుంటారో నాకు తెలుసుకొని చెప్పు” అన్నాడు నాగముత్తు.
“నాకు తెలుసు సార్. ఆంజనేయులనే పనివాడు ఇంటా బయటా పనులు చేస్తూ ఉంటాడు. మరొక ఆడమనిషి ఇంట్లో పని చేసిపెడ్తూ ఉంటుంది. మశ్చీంద్ర కొక అసిస్టెంట్ కూడా ఉన్నాడు. వీరు కాక అప్పుడప్పుడూ వాళ్ల ఇంటి కొచ్చే కందస్వామి అనే అసిస్టెంట్ కూడా ఉన్నాడు. పార్ట్‌టైమ్ కారు డ్రైవరు వాడు. వాడు నాకు బాగా తెలుసు” ఆత్రంగా అన్నాడు వినోద్.
అప్పుడప్పుడూ వినోద్ వెళ్లే బారుకు కందస్వామి కూడా వచ్చి తాగుతూ ఉంటాడు. ఆ విధంగా అతడు వినోద్‌కు తెలుసు.
“ఆ కందస్వామిని నా దగ్గరకు తీసుకొనిరా. వాడితో మాట్లాడాలి. ఆ వెంటనే నీకు వెయ్యి రూపాయలందజేస్తాను” చిరునవ్వుతో అన్నాడు నాగముత్తు.
“అలాగే సార్, రెండు రోజుల్లో తీసుకొస్తాను” అని ఆయన దగ్గర శెలవు తీసుకొని బయల్దేరాడు వినోద్.
కందస్వామి రోజూ తనకు నాలుగు రోడ్ల సెంటర్లో టీకొట్టు వద్ద కనబడుతూనే ఉంటాడు. వాడికొక బీరుబాటిల్ కొనిస్తానని ఆశపెడితే తాను ఎక్కడికి రమ్మన్నా ఆనందంగా వస్తాడు అనుకున్నాడు వినోద్ రోడ్డుపై ఈల వేసుకొని నడుస్తూ.
***
“ఇదిగో చెల్లెమ్మా, మా రామాంజనేయ నాటక సమాజం, అనకాపల్లి వారు ఈ రోజు సాయంత్రం కళాభారతిలో ‘గయోపాఖ్యానం’ పద్య నాటకం ప్రదర్శిస్తూ ఉన్నారు. నువ్వూ, బావగారు తప్పక రావాలి” కళ్లజోడు సర్దుకుంటూ చెప్పాడు వెంకట్రావు.
“నీకెంతసేపు నాటకాలూ, పద్యాలు, వేషాలూ.. ఇలాంటి వేలంవెర్రే కానీ వదినకేమైనా నగా, నట్రా చేయిస్తామని లేదు. ముప్పైఏళ్ల బట్టీ ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఇంతవరకూ కనీసం స్వంత ఇల్లు కూడా లేదు” అని గొణుకున్నట్లుగా అన్నది వర్ధనమ్మ.
“నీకెంతసేపు నగా, నట్రా, భూమి, పుట్రా.. ఈ ఆలోచనలు తప్ప కళలూ, సాహిత్యం.. ఇలాంటి మంచి అభిరుచులు చిన్నప్పటి నుండీ అబ్బలేదు కదా వర్ధనీ” అని వెంకట్రావు వాపోయాడు.
“ఆ కళలూ.. చింతకాయా అనే ఇల్లూ, వాకిలీ లేకుండా మూడేళ్లకొకసారి బదిలీ ఔతూ ఉత్తరాంధ్రలో పల్లెలన్నీ చుట్టేశావు. ఇలా తాడు, బొంగరం లేకుండా ఉంటే రేపు నీ కొడుకు సుధీర్‌కు పిల్లనెవరిస్తారు?” అని రుసరుసలాడిరది వర్ధనమ్మ.
“అదేంటి చెల్లెమ్మా, సుధీర్ మళ్లీ అమ్మాయిని వెతుక్కోవడమేమిటి? మేకపిల్లను చంకలో పెట్టుకొని ఊరంతా వెతికి వచ్చాడట వెనుకటికొకడు. మీ అమ్మాయి, మా ముద్దుల మేనకోడలు రేఖ రెడీగా ఉంది కదా..” భయపడుతూనే మనసులోని విషయం బయట పెట్టాడు వెంకట్రావు.
వర్ధనమ్మ నాగుపాములా బుస్సున లేచింది. “మరొకసారి ఆ మాటంటే ఊరుకోనురే, అన్నయ్యని కూడా చూడకుండా ఇంటి నుండి బయటకు గెంటేస్తాను. సెంటు భూమి, లక్ష బ్యాంకు బాలెన్సు కూడా లేని బడిపంతులివి. గయ్యాళి పెళ్లాన్ని అదుపులో పెట్టుకోలేని సన్నాసివి. నీ స్టేటస్సేమిటి? నా హోదా ఏమిటి? మరొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే ఊరుకోను” అని వెంకట్రావుపై రెచ్చిపోయింది.
“వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కదా, పైగా మా సుధీర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా మంచి జీతం సంపాదిస్తున్నాడు. పైగా రేపో, మాపో కంపెనీ ప్రాజెక్టు కోసం ఏ అమెరికానో వెళ్లనున్నాడు..” భయపడుతూనే అన్నాడు వెంకట్రావు.
“ఇక ఆ టాపిక్ కట్టిపెట్టనన్నానా, మరోసారి ఈ విషయంపై ఇంటికొస్తే మర్యాద దక్కదు. వాళ్ల బోడి ఇష్టం ఎవరిక్కావాలి? అంతా నా ఇష్టమే” అని హూంకరించింది వర్ధనమ్మ, సూర్యకాంతం లెవల్లో “ఈ విషయం మాట్లాడుదామని రాలేదు. మా డ్రామా ట్రూపు వాళ్లతో కలిసి నాటకం వేయడానికి వచ్చి, వాళ్ల దగ్గర ఒక గంట పర్మిషన్ తీసుకొని వచ్చాను నిన్ను చూసి పోదామనంతే. ఇంతకూ నువ్వూ, బావగారు మా నాటకానికొస్తున్నారా లేదా?” సోఫాలోంచి పైకి లేస్తూ అడిగాడు వెంకట్రావు.
“ఆయనేమో ఆదిత్య 369లో టినూ ఆనంద్ వంటి గొప్ప సైంటిస్టు, ఆవిడేమో గుండమ్మ కథలో సూర్యకాంతంలా హోదా కోసం పాకులాడే మనిషి. నాటకాలకూ, వీధి భాగోతాలకూ రాదు. కావాలంటే నేను వస్తాను. నాటకానికి తీసుకెళ్లండి” అంటూట్రేలో కాఫీ తీసుకొచ్చాడు అంజి.
“అలాగేలే, అంజీ, నువ్వైనా రా నాతో, ఆటోలో వెళ్లొస్తాం” అన్నాడు వెంకట్రావు కాఫీ కప్పు అందుకుంటూ.
“చాల్చాల్లే వీడు, వీడి అధిక ప్రసంగమునూ.. సూపర్ మార్కెట్ నుండి తేవల్సిన సరుకులు చాలా ఉన్నాయి. అవి తెచ్చి తగలడు” కోపంగా అన్నది వర్ధనమ్మ.
ఇంతలో రేఖ హఢావిడిగా ఇంట్లోకి వచ్చి, “మామయ్యా, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? అత్తయ్య ఎలా ఉంది? సుధీర్ ఫోన్ చేస్తున్నాడా?” అని వెంకట్రావు మామయ్యను చూసి సంబరపడుతూ అడిగింది.
“బాగానే ఉన్నానమ్మా, కళాభారతిలో నాటకం వేయడానికి వచ్చానీ వూరికి” అన్నాడు వెంకట్రావు.
“డ్రామానా? వెరీగుడ్, నాకు డ్రామాలంటే చాలా ఇష్టం. నేనూ వస్తాను” అని అన్నది రేఖ.
“ఏమీ అవసరం లేదు, నీ ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. బాగా చదివి తగలడు. రిలాక్స్ కావాలంటే సంగీతం ప్రాక్టీస్ చేసుకో” అని రుసరుస లాడిరది వర్ధనమ్మ. రేఖ కోపంగా ఇంట్లోకి నడిచింది.
“ఇక నేను వెళ్లొస్తాను” అని వెంకట్రావు ఇంటి బయటకు నడిచి, అంజి తీసుకొచ్చిన ఆటోలో నాటకం జరిగే చోటుకి వెళ్లిపోయాడు.
***
నాగముత్తు యోగముద్రలో ఉన్న మునీశ్వరుడిలా తీవ్రమైన ఆలోచనలో ఉన్నాడు. ఇంటి ముందున్న గార్డెన్‌లోని మల్లెపందిరి వద్ద తాను ప్రత్యేకగా ఏర్పాటు చేసుకొన్న పూరిపాకలో ఓ కేన్‌ఛెయిర్లో కూర్చుని స్కాచ్ విస్కీ సిప్ చేస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. అతడి ముందున్న టేబుల్‌పై విస్కీ బాటిల్, సోడా, గ్లాసులు, రోస్టెడ్ కాజు ఉన్నాయి. అప్పుడప్పుడు స్కాచ్ గుటక వేస్తూ జీడిపప్పునములుతూ ఉన్నాడు.
తాను పని చేస్తున్న లేబ్‌లోనే మశ్చీంద్ర కూడా పనిచేసేవాడు. స్టోర్ ఇన్‌ఛార్జిగా కూడా ఉన్న సైంటిస్ట్ నాగముత్తు రహస్యంగా కొన్ని కెమికల్స్‌ను సర్జికల్ స్టోర్లకు అమ్ముకోవడం, కొనుగోళ్లలో అక్రమాలు చేయడం వంటి విషయాలపై మశ్చీంద్ర ఆధారాలు సేకరించి పైఅధికారులకు ఫిర్యాదు చేయడంతో నాగముత్తు ఉద్యోగం ఊడింది. అప్పటి నుండీ మశ్చీంద్రపై పగతో రగిలిపోతున్నాడు నాగముత్తు.
ఉద్యోగం వూడాక, నాగముత్తు తన ఇంటి వద్దనే ఒక ప్రయోగశాల ఏర్పాటు చేసుకొని ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. కానీ అతడు మశ్చీంద్ర అంత మేధావి కాకపోవడంతో ప్రయోగాలలో పెద్దగా పురోభివృద్ధి లేదు. అతడి కొడుకు వీరమణి, కూడా చదువులో పెద్దగా రాణించలేదు. డిగ్రీ ఫెయిలై రౌడియిజం చలాయిస్తూ, ఊర్లో తన మిత్రులను వెంట వేసుకొని తిరుగుతూ ఉంటాడు. నాగముత్తుకు పూర్వీకుల నుండి సంక్రమించిన రెండు ఇళ్లపై అద్దెలు వస్తూ ఉన్నాయి. వాటితో బాటూ అతనికొచ్చే పెన్షన్‌తో ఓ మోస్తరుగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు.
నాగముత్తు ఆలోచనలను భగ్నం చేస్తూ వీరమణి, పాకలోకి వచ్చాడు. అతడితో బాటూ వినోద్, మరొక బట్టతల వ్యక్తి కూడా లోనికి వచ్చారు.
“డాడీ, మశ్చీంద్ర డ్రైవరు కందస్వామిని వినోద్ తీసుకొనివచ్చాడు” అన్నాడు వీరమణి.
ముందురోజు కందస్వామిని కలిసి అతడికి మంచి మందు పార్టీ ఇస్తానని ఆశపెట్టి అక్కడికి తీసుకు వచ్చాడు వినోద్.
“వెరీ గుడ్, వినోద్” అని అతడికొక వెయ్యిరూపాయలు అందజేసి, అక్కడ నుండి పంపివేశాడు నాగముత్తు.
నాగముత్తు సన్నగా, రివటలా ఉన్న బట్టతల వ్యక్తి వంక పరిశీలనగా చూశాడు.
“నువ్వు మశ్చీంద్ర వద్ద డ్రైవరుగా పనిచేస్తూ ఉన్నావా?” గాజు గ్లాసులోని ద్రవాన్ని ఒక గుటక వేసి అడిగాడు.
“ఔను సార్, పార్ట్ టైం డ్రైవరుగా పని చేస్తూ ఉన్నాను” వినయంగా చెప్పాడు కందస్వామి.
“సరే, నీకొక పని చెప్తాను, అది చేస్తే ఐదువేలు నీ స్వంతమౌతుంది” కందస్వామి కళ్లలోకి చూస్తూ అన్నాడు నాగముత్తు.
కందస్వామి కళ్లు మెరిసాయి.
“అలాగే సార్, ఏమిటిది?” అని అడిగాడు.
“ఈసారి మశ్చీంద్ర ఇంటికి వెళ్లినప్పుడు సెల్లార్‌లో ఉన్న అతని లేబ్‌కు వెళ్లు. అక్కడ ఏ అలమారాలోనో మశ్చీంద్ర రాసిన డైరీ ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చి నాకివ్వు. నీ డబ్బు నీవు తీసుకొనిపో, దట్సాల్, సింపుల్” అని నవ్వాడు నాగముత్తు.
“అలాగే సార్, ప్రయత్నం చేస్తాను” అన్నాడు కందస్వామి చేతులు కట్టుకొని.
“ప్రయత్నం కాదు, తప్పక తీసుకొని రావాలి” అన్నాడు నాగముత్తు.
“అట్లే సార్, తెస్తాను” అని నాగముత్తుకు నమస్కరించి పాకలోపల నుండి బయటకు నడిచాడు కందస్వామి, ఆనందంగా.
***
“ఒరే కన్నా, డిగ్రీ కంప్లీట్ చేసి ఐదేళ్లయింది. ఇట్లా పనీ పాటా లేకుండా తిరుగుతూ ఉంటే నీకు పిల్లనెవరిస్తారు? నీ పెళ్లిని చూసి కన్నుమూయాలని మీ నాయనమ్మ తహతహలాడుతూ ఉంది. ఆమె కోరిక నెరవేరేదెప్పుడు?” హార్మోనియం ముందు కూర్చుని పర్వతరావు కొడుకు కన్నబాబుపై చిందులు తొక్కుతూ ఉన్నాడు.
పర్వతరావుకు పెద్దలు సంపాదించిన లంకంత ఆస్తి, ఇంకా వైజాగ్‌లో ఎన్నో ఇళ్లు, స్థలాలు, అనకాపల్లి వద్ద కొబ్బరితోట, పొలాలూ ఉన్నాయి. అందువల్ల ఆయనకు ఆదాయం గురించి చింత లేదు. పైగా సంగీతకచేరీలూ చేస్తూ చాలా సంపాదిస్తూ ఉన్నాడు. తన కొడుకు కన్నబాబు గురించే ఆయన చింత. తన ఏకైక పుత్రుడు అటు ఉద్యోగమూ, ఇటు వ్యాపారమూ చూసుకోకుండా పనీ, పాటా లేకుండా తిరుగుతూ ఉన్నాడనే ఆయన బాధ. కొడుకుతో జగదాంబ జంక్షన్‌లో ఒక ఫర్నీచర్ షాప్ పెట్టించాలని కొంత కాలంగా ప్రయత్నిస్తూ ఉన్నాడడాయన. ఒక షాపు చూసి బేరం కూడా మాట్లాడాడు. కానీ కన్నబాబు ఆ వ్యాపారంపై ఆసక్తి చూపడం లేదు.
“ఆ పెళ్లి గురించి నాయనమ్మను చింత మానుకోమని చెప్పు, నాకు సరిపోయే అమ్మాయిని వెతుక్కున్నాను నేను” అన్నాడు కన్నబాబు.
“ఎవర్రా ఆ అమ్మాయి?” ఆశ్చర్యంగా అడిగాడు పర్వతరావు.
“ఇంకెవరు, నీ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చే రేఖ. ఆమె తల్లిదండ్రులు కూడా నీ కీర్తనలంటే పడి చస్తారు” అన్నాడు కన్నబాబు చిరునవ్వుతో.
“మశ్చీంద్ర గారమ్మాయి రేఖనా? ఆ అమ్మాయి నిన్నెందుకు ప్రేమిస్తుందిరా మతిలేని వెధవ? చారుకౌశిరాగం లాంటి కుందనపు బొమ్మ ఆమె ఎక్కడ? గాడిద సకిలింపు లాంటి ఓండ్ర వెధవ్వి నువ్వెక్కడ?” అని కన్నబాబుపై మండిపడ్డాడు పర్వతరావు.
“ఆమె ఖచ్చితంగా నన్ను ఓకే చేయదు నాన్నా, నువ్వే ఏదో మాయో, మంత్రమో వేసి ఆమే నన్ను ప్రేమించేలా చేయాలి ప్లీజ్” అని తండ్రిని ప్రాధేయపడ్డాడు కన్నబాబు.
“మాయలూ, మంత్రాలు వేయడానికి నేనేమైనా నీ కంటికి మాయల ఫకీరులా కనిపిస్తున్నానా ఏబ్రాసి వెధవ?” అని కన్నబాబుపై రుసరుసలాడుతూ మండిపడ్డాడు పర్వతరావు.
“మంత్రాలు వేయనవసరం లేదు. నన్నొక మంచి మ్యూజిషియన్‌గా ఆమెకు పరిచయం చేయి.”
“ఏమిటేమిటి? హిందోళానికి, రిషభానికి తేడా తెలియని అజ్ఞానివి, మడ్డి వెధవ్వి, నువ్వు సంగీత విద్వాంసుడవంటే నమ్మేసేంత అమాయకురాలు కాదొరే రేఖా” అని చిర్రుబుర్రులాడాడు పర్వతరావు.
“మిగిలిన వాళ్లు చెప్తే నమ్మదు. కానీ నువ్వు చెప్తే ఖచ్చితంగా నమ్ముతుంది” అని నమ్మబలికాడు కన్నబాబు.
“నేను చెప్పానే అనుకో, నా మాటలు నమ్మడానికి రేఖ ఏమంత అమాయకురాలా? ఖచ్చితంగా తాను నీ పాట వింటానని పట్టుబడ్తుంది” అన్నాడు పర్వతం.
“అదేంటి డాడీ! ఇంతపెద్ద సంగీత విద్వాంసుడివి, నీ కన్నకొడుకునే సంగీతంలో నీ వారసుడిగా ప్రకటిస్తే ఎవరు అనుమానపడతారు? నేనొక గొప్ప మ్యుజీషియన్‌నని, సంగీత సముద్రంలో ఓలలాడుతున్నానని నువ్వు చెప్తే రేఖ ఎగిరిగంతేసి నన్ను ప్రేమిస్తుంది” అన్నాడు కన్నబాబు చిరునవ్వుతో.
“ఇదంతా జరిగే పనేనా?” అనుమానంగా కొడుకునడిగాడు పర్వతరావు.
“అదంతా నేను చూసుకుంటాను. నీకెందుకు? నన్ను ఒక ఇంటివాణ్ణి చేయడానికి ఈ మాత్రం రిస్కు తీసుకోవా నాన్నా” అని దీనంగా అన్నాడు కన్నబాబు.
పర్వతరావు ఆలోచనలో పడ్డాడు.
అందాల రాశి, గాన సరస్వతి పైగా సుగుణాల పోగైన రేఖ తన ఇంటి కోడలు కావడానికి ఆ మాత్రం చేస్తే తప్పు లేదనిపించింది.
“సరేరా, నీ మాట నేనెందుకు కాదనాలి? ఐతే ఒక షరతు” అన్నాడు కఠినంగా.
“రేపటి నుండీ నువ్వు దీక్షగా సంగీతాన్ని అభ్యసించాలి. నాకున్న ఖాళీ సమయంలో నీకు సంగీతం నేర్పుతాను” అన్నాడు పర్వతరావు.
“అలాగే నాన్నగారూ, మీ దగ్గరే పరమనిష్ఠగా సంగీతం నేర్చుకుంటాను. సంగీతంలో తండ్రిని మించిన కొడుకు ననిపిస్తాను” అని గర్వంగా చెప్పాడు కన్నబాబు.
***
తన సెల్‌ఫోన్లో డిస్‌ప్లే ఔతున్న కొత్త నంబరు వంక వింతగా చూశాడు నాగముత్తు.
తనకున్న ఫ్రెండ్స్ తక్కువ, ఎవరు తనకు ఫోన్ చేసుంటారనే ఆలోచనలో పడ్డాడు. కాసేపు తటపటాయించిన తరువాత ఫోన్ తీశాడు. ‘హలో’ అని అవతలి వ్యక్తి బొంగరు స్వరంతో అన్నాడు.
“నా పేరు నట్వర్‌సింగ్, ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలి” బొంగరు గొంతుతో చెప్పింది, ఆ స్వరం.
“సరే, మా ఇంటికొచ్చి మాట్లాడండి” అన్నాడు నాగముత్తు యథాలాపంగా.
“ఇంటిక్కాదు. సాయంత్రం నాలుగింటికి దొండపర్తిలోని బ్లూడ్రాగన్ రెస్టారెంట్‌కు రాగలరా?” అడిగాడు నట్వర్‌సింగ్.
“నాకు టైం లేదు, నేనెక్కడికీ రాలేను” అని విసుగ్గా అన్నాడు నాగముత్తు.
“ఐతే మీ ఇష్టం. కానీ మా ఆఫర్ ఒప్పుకోకపోతే మీరు కొన్ని లక్షలు కోల్పోతారు” చిన్నగా నవ్వి చెప్పాడు బొంగరు గొంతు వ్యక్తి.
నాగముత్తు ఆలోచనలో పడ్డాడు. “ఈ బొంగరు గొంతు సింగు తనతో జోక్ చేయడం లేదు కదా, వీడి నెంతవరకూ నమ్మచ్చు” అనుకున్నాడు.
తానిప్పుడు ఎన్నో ఆర్థిక సమస్యల్లో ఉన్నాడు. ఉద్యోగం లేదు, జీతం లేదు, పెన్షన్ సొమ్ముతో భారంగా జీవిస్తూ ఉన్నాడు. అంత సొమ్ము అప్పనంగా వస్తూ ఉంటే ఎందుకు కాదనాలి?
“మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. నేను మరొకరిని వెతుక్కుంటాను” అన్నాడు నట్వర్‌సింగ్.
“ఇంతకూ మీరు నాకిచ్చే ఆఫర్ ఏమిటి? కాస్త అర్థమయ్యేట్లుగా చెప్పండి” విసుగ్గా అన్నాడు నాగముత్తు.
“అది మీరు నన్ను ఆ చైనీస్ రెస్టారెంట్లో కలిసినపుడు చెబుతాను. మీరు నా ఆఫర్ విన్న తరువాత నచ్చకపోతే ఫ్రాంక్‌గా చెప్పవచ్చు” అన్నాడు సింగ్.
“ఒకే, ఐతే నాలుగింటికి కాదు, సాయంత్రం ఏడింటికి కలుద్దాం” అన్నాడు ముత్తు.
“అలాగే కానివ్వండి. మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను” అని కాల్ కట్ చేశాడు నట్వర్ సింగ్.
***
“ఆలేఖ్య, నువ్వు, సుచరిత కలసి ఓ ప్రాజెక్ట్ రూపొందించాలని ఇదివరకే చెప్పాను కదా. దాని గురించి మాట్లాడుదామని పిలిచాను” సఫారీ సూట్లో ఉన్న బాస్ మల్హోత్రా, తన దళసరి కళ్లద్దాళ్లోంచి ఆల్యే వంక చూస్తూ చెప్పాడు.
“అవును సార్, ఆ ప్రాజెక్ట్ ప్రిలిమినరీ స్టేజ్ గురించి ఇంతకుమునుపే నేను, సుచరిత చర్చించుకున్నాం” చిన్నగా నవ్వి బాస్‌తో వినయంగా చెప్పింది ఆలేఖ్య.
“కానీ రెండు రోజుల నుండీ సుచరిత ఆఫీసుకు రావడం లేదు. ఫోన్ చేసినా, మెయిల్ ఇచ్చిన రిప్లై లేదు” అని కూడా అంది.
“ఇందాకే సుచరిత నాకు ఫోన్ చేసింది. హఠాత్తుగా ఆమె మేరేజ్ కుదిరిందట. పదిహేను రోజుల్లోనే పెళ్లి ఉందట. తాను నెల రోజులు లీవు పెడ్తున్నానని చెప్పింది. పెళ్లి హడావిడిలో నీకు చెప్పడం కుదిరుండదు” అన్నాడు మల్హోత్ర నవ్వుతు.
“వండర్‌ఫుల్ న్యూస్ సార్, సుచిని చేసుకోబోతున్న అదృష్టవంతుడెవరో?” తనలో తాను అనుకుంటున్నట్లుగా చెప్పింది ఆలేఖ్య.
“అతనూ నీకు తెలుసు. మీ కొలీగే, చంద్రశేఖర్ అని మన కంపెనీలోనే పని చేస్తూ ఉన్నాడు” అన్నాడు బాస్.
“ఈజిట్! ఐతే నేను చూసే ఉంటానతణ్ణి” తమ కంపెనీలోని రెండు వందలపై చిలుకు ఉద్యోగులను గుర్తు తెచ్చుకుంటూ చెప్పింది ఆలేఖ్య.
“ఇక్కడే చిన్న సమస్య వచ్చింది. ఆ శేఖర్‌కూ, మీ మరో కొలీగ్ శశికాంత్‌కూ కలసి మీకిచ్చినట్లుగానే మరో ప్రాజెక్ట్ ఇచ్చాను. పెళ్లి కారణంగా ఆ ప్రాజెక్ట్‌ను శేఖర్ చేయలేకపోతున్నాడు. అతనూ మూడు వారాలు శలవు పెట్టాడు. ఈ ప్రాజెక్టు నువ్వూ, శశికాంత్ కలసి చేయరాదా?” అన్నాడు మల్హోత్ర.
అప్పుడే ఏదో పని మీద బాస్ గదిలోకి వచ్చిన శశికాంత్ ఆ మాటలు విని ‘ఆలేఖ్య ఏం చెబుతుందా’ అని ఆసక్తిగా చూశాడు.
“ఈ శశికాంత్‌తోనా? నోవే, అలా కుదరదు సార్. కావాలంటే మరెవరినైనా సెలక్ట్ చేయండి” అని గ్లాస్ డోర్స్ తెరచుకొని గబగబా బాస్ గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది ఆలేఖ్య.
శశికాంత్ మల్హోత్ర మొఖం చూడలేక ఆయన ఛాంబర్ నుండి బయటకు నడిచి తన సీట్లో కూర్చున్నాడు.
‘బాస్ చెప్పినట్లు ఆ ప్రాజెక్టు తానూ, ఆలేఖ్య కల్సి చేసి ఉంటే తామిద్దరికీ సయోధ్య ఏర్పడి ఉండేదేమో!
తానెంత దగ్గర కావాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆలేఖ్య అంత దూరం జరుగుతూ ఉంది.
ఆమెకు తాగుబోతులంటే అసహ్యం. తాగినస్థితిలో తానామెకు రెండు, మూడుసార్లు కనబడ్డాడు. అంతేగాక ఆమె దృష్టిలో రౌడీ వెధవనయ్యాడు, అది తన దురదృష్టం’ అనుకున్నాడు బాధగా శశికాంత్.
***
దొండపర్తి జంక్షన్‌లో బ్లూడ్రాగన్ చైనీస్ రెస్టారెంట్‌ను కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు నాగముత్తుకు. పార్కింగ్ లాట్‌లో కారును పార్క్ చేసి ఆ రెస్టారెంట్‌లోకి నడిచాడు. ఒకవైపు జనరల్ హాల్ ఉంది. అక్కడ కూర్చుని కొందరు కస్టమర్స్ చైనీస్ వంటకాలు తింటూ ఉన్నారు. మరో పక్క వరుసగా చెక్క డోర్స్ బిగించి ఉన్న ఎనిమిది ఏసీ కేబిన్స్ ఉన్నాయి.
పది నిమిషాల ముందే నట్వర్‌సింగ్ నాగముత్తుకు ఫోన్ చేసి తాను ఏడో నెంబరు కాబిన్‌లో వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పాడు. చెక్క తలుపుపై చిన్నగా తట్టి ఏదో నెంబర్ కాబిన్‌లోకి ప్రవేశించాడు ముత్తు.
టర్బన్ ధరించిన ఒక ఆజానుబాహుడైన సిక్కు వ్యక్తీ, అతని పక్క ఛేర్లో కూర్చుని ఉన్న ఒక పిల్లి కళ్ల విదేశీయుడు ఉన్నారక్కడ. నాగముత్తును చూడగానే సిక్కు వ్యక్తి పైకి లేచి, చిరునవ్వుతో కరచాలనం చేసి ‘ఐయామ్ నట్వర్‌సింగ్’ అన్నాడు.
నాగముత్తు విదేశీయుడి వంక ప్రశ్నార్థకంగా చూశాడు.
“ఇతను కెయిన్స్ అని అమెరికా దేశస్థుడు. ఓ ముఖ్యమైన పనిమీది ఇండియా వచ్చాడు” అని కెయిన్స్‌ను ముత్తుకు పరిచయం చేశాడు నట్వర్. నాగముత్తు కెయిన్స్‌కు షేక్‌హాండ్ ఇచ్చి ఛేర్లో కూర్చున్నాడు.
నట్వర్‌సింగ్ బెల్ నొక్కగానే యూనిఫాంలోని ఓ సర్వర్‌లోనికి ప్రవేశించి ఆ టేబుల్ వద్ద నిలబడ్డాడు. “మీరు ఆర్డర్ చేయండి” అన్నాడు. నాగముత్తు, నట్వర్‌సింగ్ రుమాలీ రోటి, ప్రాన్స్ ఫ్రై విత్ పెప్పర్ ఆర్డర్ చేశాడు.
నట్వర్‌సింగ్ తాను లూదియానలో హాసరీ వ్యాపారము, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేసుకుంటా ఉంటానని చెప్పి కాసేపు తన వ్యాపారం గురించి చెప్పాడు. కెయిన్స్‌ను అమెరికాలోని ఓహయో రాష్ట్రంలో ఓ ఫార్మా కంపెనీలో బిజినెస్ మేనేజర్‌గా పరిచయం చేశాడు. కెయిన్స్ తమ వ్యాపారం తీవ్ర నష్టాలు చవిచూస్తూందని, కొత్త ప్రాడక్ట్స్ మార్కెట్‌కు పరిచయం చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నామని చెప్పాడు.
“మీరు గొప్ప జీవశాస్త్రవేత్త అని విన్నాము. మీ గురించి తెలుసుకోవచ్చా?” అని అడిగాడు నట్వర్‌సింగ్.
“నిజమే, నా డిపార్ట్‌మెంట్లో మశ్చీంద్ర అనే వెధవ, మరికొందరు చేసిన దుష్టరాజకీయాల వల్ల నేను రాజీనామా చేయాల్సి వచ్చింది” అని వాపోయాడు నాగముత్తు.
ఈలోగా సర్వర్ పింగానీ ప్లేట్లలో రోటీలు, ప్రాన్స్ ఫ్రై తీసుకు వచ్చి సర్వ్ చేశాడు. కాసేపు నిశబ్దంగా తింటూ ఉండిపోయారు వారు. టిఫిన్ చేశాక నట్వర్ ఫ్రూట్‌జూస్ చెప్తానంటే వద్దన్నాడు నాగముత్తు.
నట్వర్‌సింగ్ బిల్లు చెల్లించాక బేరర్ వెళ్లిపోయాడు.
“ఇంతకూ నన్నెందుకు పిలిపించారిక్కడికి?” నాగముత్తు అసహనంగా అడిగాడు.
“చెప్తాను, మీరిదివరకే అన్నట్లు మశ్చీంద్ర అనే సైంటిస్టు ఈ ఊర్లో ఉన్నాడని తెలిసింది. జీవశాస్త్ర, వైద్యరంగాల్లో సంచలనాలు సృష్టించే కొన్ని పరిశోధనలు అతను చేస్తూ ఉన్నట్లు మాకు తెలిసింది.
మాకు ఆ పరిశోధనల వివరాలు కావాలి. ఇది వరకు మీరూ, మశ్చీంద్ర ఒకే లాబ్‌లో పనిచేసే వారని మీరు చెప్పారు. కాబట్టి మీకు ఆ మశ్చీంద్ర పరిచయం ఉండే ఉంటుంది. కాబట్టి మీకు ఆ పరిశోధనల వివరాలు రాబట్టడం తేలిక.
పైగా మీరే మశ్చీంద్ర ఒట్టి వెధవ అన్నారు కదా, అటువంటివాడి నుండి ఆ వివరాలు బెదిరించో, భయపెట్టో, దొంగలించో రాబట్టడం పెద్ద తప్పు కాదనుకుంటాను.
మీరు ఆ పని చేసిపెడితే మీరు కోరిన సొమ్ము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అన్నాడు నట్వర్‌సింగ్.
నాగముత్తు కాసేపు అప్రతిభుడయ్యాడు. ‘మశ్చీంద్ర పరిశోధనల గురించి వీరికెలా తెలిసిందా’ అనుకున్నాడు. అతని అనుమానం గ్రహించినట్లుగా నాగముత్తుతో “మా వేగులు మాకుంటారు, వైద్య రంగంలో పరిణామాలన్నీ మావాళ్లకు తెలిసిపోతూ ఉంటాయి” అన్నాడు కెయిన్స్.
నాగముత్తు కాసేపు ఆలోచించాడు. తన ఉద్యోగం ఊడగొట్టి మశ్చీంద్రపై ప్రతీకారం తీర్చుకోవడానికి తనకిది మంచి అవకాశం అనుకున్నాడు.
“సరే ఆపని చేసి పెట్తే నాకెంత ముట్ట చెప్పాలనుకుంటున్నారు మీరు?” అనుమానంగా అడిగాడు నాగముత్తు. నట్వర్‌సింగ్, కెయిన్స్ కాసేపు చిన్నగా గుసగుసలాడుకుని “పదిలక్షలు ఓకేనా?” అన్నారు.
నాగముత్తు పైకి లేస్తూ “మీరు చెప్తున్నది చాలా రిస్క్‌తో కూడుకున్న పని. కోటి రూపాయలకు తక్కువ రుసుముకు ఇటువంటి పని చేయలేను నేను. శెలవు” అని వెల్లబోయాడు.
నట్వర్‌సింగ్ పైకిలేచి నాగముత్తును పట్టుకొని ఛేయిర్లో కూర్చోబెట్టి, కెయిన్స్‌తో కాసేపు కూడబలుక్కుని “యాభైలక్షలు మించి ఇవ్వలేం. మీకిష్టమైతే చేయండి. లేదా మేమూ వేరే వాళ్లను సంప్రదిస్తాం” అన్నాడు.
నాగముత్తు కాసేపు ఆలోచించి, ఆఫర్ జారిపోతూ ఉందనుకొని “సరే, ఐతే అడ్వాన్స్ విషయం ఏమిటి?” అన్నాడు.
నట్వర్‌సింగ్ ఓ బ్రీఫ్‌కేస్ నాగముత్తు ముందుకు తోసి, “ఇందులో ఐదు లక్షలు ఉన్నాయి” అన్నాడు. నాగముత్తు, డబ్బు లెక్కబెట్టుకొని సంతృప్తి చెంది, ఆ నోట్ల కట్టలను తనతో తెచ్చిన లెదర్ బేగ్‌లో ఉంచాడు.
“సరే మీతో మేము ఫోన్లో టచ్‌లో ఉంటాం. తొందరగా మీ పని కానివ్వండి” అన్నాడు నట్వర్‌సింగ్.
నాగముత్తు వారితో కరచాలనం చేసి బయటకు నడిచాడు. ‘మశ్చీంద్ర నుండి పకడ్బందీగా అతని రిసెర్చ్ వివరాలు సంగ్రహించే వ్యూహం రచించాలి’ అని మనసులో అనుకున్నాడు. ఇదివరకు తాను ఆ పనికి డ్రైవరు కందస్వామిని పురమాయించడం మంచిపనైంది’ అనిపించిందతనికి.
(ఇంకా ఉంది)
