[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో సైన్స్ ఫిక్షన్ విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘మాయా శశిరేఖ’. రచన శ్రీ రాచపూటి రమేష్. ఇది మూడవ భాగం.]
రేఖ సంగీతం క్లాసుకని ఇంటి నుండి బయటకు వచ్చింది. సమీపంలోని కూడలిలో ఆటోలు దొరుకుతాయి. కానీ ఆ కూడలికి వెళ్లే దారిలోనే కొందరు ఆకతాయిలు టీ కొట్టు వద్ద నిలబడి వచ్చీ పోయే అమ్మాయిలను కామెంట్ చేస్తూ శునకానందం పొందుతు ఉంటారు.
ఆ టీ కొట్టు దాటుతూ ఉండగా రేఖ గుండెలు గుబగుబ లాడాయి. దానికి తగ్గట్టే ఆ టీ కొట్టు దగ్గర నిలబడి సిగిరెట్టు కాలుస్తూ ఫ్రెండ్స్‌తో గప్ఫాలు కొడుతూ ఉన్న వినోద్ కంటబడిందామె. వెంటనే వినోద్ వెకిలిగా నవ్వుతూ “గాన సరస్వతి కచేరీ చేయడానికి బయలుదేరింది. గాడిదలు ఓండ్ర పెట్టడానికి రెడీగా ఉన్నాయి” అన్నాడు. రేఖకు ఒళ్లు మండుకొచ్చింది.
అప్పుడే అటుగా వెళ్తున్న ఒక ఆటో ఆమె కంటబడింది. ఆటోను పిలిచి, పర్వతరావు ఇంటి వరకు బేరం చేసి, “గాడిదలు రెడీగా ఉన్నాయని మిమ్మల్ని చూస్తూనే తెలిసిపోతూ ఉంది” అని ఆటో ఎక్కి కూర్చుంది. ఆటో శరవేగంతో తుర్రుమంది. రోషంతో వినోద్ మొఖం ఎర్రబడింది. తమను గాడిదలన్నదానికి, ఈసారి ఆమె కనబడితే పెద్దగా అరచి అల్లరి చేయాలని నిశ్చయించుకున్నాడతను.
రేఖ పర్వతరావు గారింటిలోపలికి అడుగు పెట్టే సరికి, లోపల నుండి “నగుమోము కనలేని..” అని శ్రావ్యమైన కీర్తన వినిపిస్తూ ఉంది. పర్వతరావు హాల్లో హార్మోనియం ముందు కూర్చుని గమకాలు పలికిస్తూ ఉన్నాడు.
“ఎవరంకుల్, లోపలి గదిలో అంత మధురంగా పాడుతూ ఉన్నారు?” అడిగింది రేఖ.
“ఇంకెవరమ్మా, నా సుపుత్రుడు కన్నబాబు. ఏడేళ్లు నీలకంఠ శాస్త్రి దగ్గర కఠోర దీక్షతో సంగీతం నేర్చుకున్నాడు. మొన్ననే ఇంటికి వచ్చి, సాధన చేసుకుంటూ ఉన్నాడు” అన్నాడు పర్వతరావు.
“అరే, ఎప్పుడు చూడలేదు నేను, ఇక్కడకు పిలవండంకుల్” అన్నది రేఖ సంభ్రమాశ్చర్యాలతో.
“కీర్తన పూర్తవగానే పిలుస్తాను. నువ్వు నిన్న చెప్పిన పాఠం సాధన చేస్తూ ఉండు. నేనిప్పుడే వస్తాను” అని లోపలకు వెళ్లాడు పర్వతరావు.
ఇంటి లోపలిగదిలో టేప్‌రికార్డర్‌లో పాట వస్తూ ఉంది. అక్కడే ఉండి సెల్‌ఫోన్‌లో చాటింగ్ చేస్తూ ఉన్న కన్నబాబు తండ్రి రాకను గమనించి తత్తరపడుతూ లేచాడు.
“ఒరే సుపుత్రా, నిన్ను రేఖ చూడాలంటోంది. ఒకసారి హాల్లోకి రా” అన్నాడు పర్వతరావు.
వెంటనే కన్నబాబు తలదువ్వుకొని, అరంగుళం మేరకు పౌడరు దట్టించి రెడీ ఐపోయాడు.
“ఆమె ముందు కారుకూతలు కూయకుండా వీలైనంత తక్కువ మాట్లాడు” అని కొడుక్కు సలహా ఇచ్చాడు పర్వతరావు.
కన్నబాబు రాచఠీవి ఒలకబోస్తూ తండ్రి వెనుక నడిచాడు.
రేఖ కన్నబాబును చూసి నమస్కరించింది. కన్నబాబు సిగ్గుపడుతూ ఆమెకు ప్రతినమస్కారం చేశాడు.
“మీ అబ్బాయి ఇంత గొప్ప సంగీత విద్వాంసుడని నాకింత వరకూ తెలియదు. నా కోసం ఒకసారి ‘ఎందరో మహానుభావులు’ కీర్తన పాడమనండంకుల్” అంది రేఖ.
కన్నబాబు గొంతులో పచ్చి వెలక్కాయపడినట్లైంది. పర్వత రావు కూడా కాసేపు తడుముకొని “మా వాడికి దేవతార్చనకు టైమైంది. ఆరు నూరైనా, మా వాడు సమయానికి సంధ్యావందనం చేసి పూజచేస్తాడు. ఇంకోసారి పాడుతాడు లేమ్మా” అన్నాడు.
“సరేలేండి అంకుల్, మన క్లాస్ మొదలుపెట్టండి” అంది రేఖ.
కన్నబాబు బతుకుజీవుడా అని ఇంట్లోకి నడిచాడు.
***
కందస్వామి గేటు తెరచి ఉన్న ఆ ఇంటివైపు చూశాడు.
సాయంత్రం ఆరుగంటలు దాటింది. అప్పుడే సైంటిస్ట్ మశ్చీంద్ర, అతని భార్య వర్ధని, పర్వతరావు టౌన్‌హాల్లో చేస్తున్న సంగీత కచేరీకి కార్లో వెళ్లిపోయారు. సిటీలోనే కాబట్టి మశ్చీంద్ర కారు తానే డ్రైవ్ చేస్తాడు.
కాలేజీ, ఆఫీసు నుండి ఇంకా రేఖ, శశికాంత్ రాలేదు. రేఖ సాయంత్రం పదింటిలోపు, శశి రాత్రి తొమ్మిదింటి లోపు రారని తెలుసు కందస్వామికి.
పనివాడు అంజి ఇంతకు మునుపే కూరగాయల బుట్ట తీసుకొని మార్కెట్‌కు వెళ్లాడు. బహుశా ఇంటికి తాళం వేసి ఉండవచ్చు. ఎవరి తాళం చెవులు వారి వద్ద ఉంటాయి.
లాబ్‌లో ఒంటరిగా పని చేసుకుంటూ ఉన్న శివరామ్ ఇప్పుడే లాబ్‌కి గొళ్లెం పెట్టి టీ తాగడం కోసం ఆ వీధి చివర ఉన్న కార్నర్ కేఫ్‌కు వెళ్లాడు. అతడింకో పావు గంట ఇంటివైపు రాడని తెలుసు కందస్వామికి.
నిశబ్దంగా గేటు తెరచుకొని లోనికి వెళ్లాడు స్వామి. అతడనుకన్నట్లుగానే ఇంటి తలుపుకు తాళం కప్ప వేలాడుతూ ఉంది.. మెట్లు దిగి సెల్లార్‌లోకి నడిచాడు, జంకు గొంకు లేకుండా స్వామి.
లాబ్ తలుపుకు తాళం వేయలేదు. గొళ్లెం మాత్రం పెట్టి ఉంది. గొళ్ళెం తెరచుకొని ప్రయోగశాలలోనికి నడిచాడు కందస్వామి. ఒక టేబుల్‌పై రకరకాల ప్రయోగనాళికలు, గాజు సీసాలు, జాడీలు, కెమికల్స్ ఉన్నాయి. చేస్తున్న ప్రయోగం మధ్యలో వదలి వేసి టీ తాగడానికి వెళ్లినట్లున్నాడు, శివరామ్.
మశ్చీంద్ర ఛాంబరుకు తాళం వేసి ఉంది. తాళం చెవి కోసం దగ్గరలోని టేబుల్ సొరుగులు, షెల్ఫ్‌లు వెతికాడు స్వామి. అదెక్కడా కనబడలేదు. నిరాశతో ఆ ప్రయత్నం విరమిస్తుండగా ఒక కోటు స్టాండుకు తగిలించి ఉన్న కోటు అతని కంటబడింది. ఆ కోటు జేబు వెతికితే ఒక స్టీలు తాళం చెవుల గుత్తి అతనికి దొరికింది. ఆ తాళం చెవుల గుత్తిలోని ఒక్కొక్క తాళం చెవితో ఛాంబరు తాళం తెరవడానికి ప్రయత్నించసాగాడు కందస్వామి. కొద్ది క్షణాల్లో ఆ తలుపు తెరుచుకొంది. ఛాంబరు లోనికి అడుగుపెట్టి చుట్టూ పరికించి చూశాడు.
అక్కడా టేబుళ్లపై రకరకాల పరిశోధనా సామగ్రి అమర్చబడి ఉంది. వాటిని పట్టించుకోకుండా బుక్ రేక్ వంక చూశాడు. రకరకాలైన శాస్త్ర సంబంధిత గ్రంథాలు అక్కడున్నాయి. వాటి మధ్య మశ్చీంద్ర డైరీ అతనికి కనబడలేదు. టేబుల్ సొరుగులు లాక్ చేసి ఉన్నాయి. గోడలలో ఏదైనా రహస్య అరలున్నాయేమో వెతకడం ప్రారంభించాడు. గోడను ఒక అంచు నుండి మరొక అంచు వరకూ తడుముతూ వచ్చాడు. ఒక చోట గోడ అతనికి బోలుగా తోచింది. అక్కడ అమర్చబడి ఉన్న పలక వెనుక ఏదో సీక్రెట్ లాకర్ ఉండవచ్చునని అతనికి అనుమానం కలిగింది. ఆ లాకర్‌ను తెరచేందుకు ఆ గదిలోనే ఏదైనా ఏర్పాటు ఉంటుందని అతడికి తోచింది.
ఇంతలో మెట్ల మీద నుండి ఎవరో కిందికి దిగుతూ ఉన్నట్లు బూట్ల శబ్దం వినవచ్చింది కందస్వామికి. వెంటనే ఆ ఛాంబర్ నుండి బయటకు వచ్చి గబగబా తాళం వేసి, తాళం చెవి కోటు జేబులో వేశేశాడు.
“ఎవరక్కడ, వెనక్కు తిరగండి” శశికాంత్ గొంతు కరుగ్గా వినిపించింది. కందస్వామి హడలిపోతూ చిన్నగా వెనుతిరిగాడు. అతణ్ణి చూసీ చూడగానే శశికాంత్ ఉగ్రరూపంతో ఆవేశంతో ఊగిపోతూ కందస్వామి చెంప పగలగొట్టి, “ఒరే రాస్కెల్ రావద్దంటే ఎందుకు మళ్లీ దాపురించావిక్కడికి?” అని కోపంగా అరిచాడు.
కందస్వామి వణికిపోతూ “అయ్యా, మీరు, అయ్యగారు నన్ను పంపించేశాక, నేను పనికోసం చాలా తిరిగాను, ఎక్కడా నాకు పని దొరకలేదు. నేను తాగుడు మానేశాను. గుళ్లోకు వెళ్లి ఒట్టు పెట్టుకొని మరీ మానేశాను. మీరు దయతలిస్తే, నేను మళ్లీ మీ దగ్గర పనిలో చేరుతాను” అన్నాడు.
శశికాంత్‌కు కందస్వామి మాటలకు కోపం ముంచుకొచ్చింది.
“ఒరే తాగుబోతు వెధవ, నిన్ను మళ్లీ ఈ గడప తొక్కవద్దని తరిమేశాము కదా, మళ్లీ అన్ని మరచిపోయి, మా ఇంటికే తగలడ్డావు. నీకు బుద్ధి లేదూ? అసలు ఇల్లు తాళం వేసుంటే సరాసరి కిందికొచ్చేయడమేనా” అని అరిచాడు.
“సార్, మామూలుగా మీరెవ్వరూ లేకపోయినా నాన్న గారొక్కరే లేబ్‌లో పని చేసుకుంటూ ఉంటారు కదా, ఆయనను కలిసి మాట్లాడి వెళ్దామని ఇక్కడకు వచ్చాను” గజగజా వణికిపోతూ చెప్పాడు కందస్వామి.
“నిన్నింక పనిలో పెట్టుకోవడం కుదరదు. మళ్లీ ఈ వైపు కనిపించావంటే కాళ్లు విరగ్గొట్తాను” అన్నాడు శశి. ‘అలాగే సార్’ అని అక్కడ నుండి బయలుదేరాడు కందస్వామి. అతడు మెట్లు ఎక్కుతూ ఉండగా టీ తాగి తిరిగొస్తున్న శివరామ్ అతనికి ఎదురయ్యాడు. “ఆ వెధవని మెడపట్టుకొని బయటకు గెంటు” అని అతడి వెనుకే వస్తున్నాడు శశికాంత్, శివరామ్‌ను చూసి, “నువ్వు లేకపోతే లేబ్‌కు తాళం వెయ్యాలి. గడియ వేసుకొని వెళ్లిపోవడమేనా?” అని కోపంగా అడిగాడు శశి. “సారీ సార్, పొరబాటయ్యింది” అని వినయంగా చెప్పాడు శశికాంత్‌తో శివరామ్. శశి తన దగ్గరున్న డూప్లికేట్ కీతో తాళం తెరచి ఇంట్లోకి వెళ్లిపోయాడు.
శివరామ్‌కు కందస్వామి వాలకం అనుమానం కలిగించింది. తమ లేబ్‌లో జీవశాస్త్రానికి సంబంధించిన చాలా రహస్యమైన అంశాలున్నాయి. వాటి కోసం ఎవరెవరో ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. తాళం వేసి వెళ్లక పోవడం తనదే పొరబాటు.
వీలైనంత వరకు మశ్చీంద్ర గారిని అడిగి ఆయన పరిశోధనల లక్ష్యం, పద్ధతులు తెలుసుకొంటే మేలు, “శత్రువులు ఆయనకేదైన కీడు తలపెట్టవచ్చు లేదా కిడ్నాప్ చేయవచ్చు, అలాంటప్పుడు పరిశోధనలు కొనసాగించడానికి తనకు కొన్ని విషయాలైనా తెలిసి ఉండడం అవసరం” అనుకున్నాడు శివరామ్.
***
ఆ రోజు సుధీర్ బర్త్‌డే. పొద్దున ఏడు గంటలకు నిద్ర లేచిన రేఖ బావకు బర్త్‌డే విషెస్ చెప్పడానికి ఫోన్ చేసింది. అవతల ఎంగేజ్డ్ టోన్ వస్తోంది. ఐదు నిమిషాల తరువాత ఆమెకు లైన్ దొరికింది.
సుధీర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పి, “ఏమిటి ఈరోజు పొద్దున్నే అయ్యగారు ఎవరితోనో బిజీగా మాట్లాడుతున్నారు” అడిగింది రేఖ. “‘సునీత’ అని మా క్లాస్‌మేట్‌లే, నా పుట్టినరోజుని ఫోన్ చేసింది. కాలేజి రోజులను గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నాము” అన్నాడు సుధీర్. పుట్టిన రోజుకు తల్లిదండ్రులు పిలిస్తే స్వస్థలం వచ్చాడతను.
“అమ్మో, ఆడపిల్లలతో మాట్లాడాలంటేనే ఆమడ దూరం పరుగెత్తే నువ్వు ఆ నీతో, సునీతతో అంతసేపు మాట్లాడుతుటూ ఉన్నవంటే అనుమానించాల్సిందే. ఇక నిన్ను ఒంటరిగా వదిలెయ్యడం డేంజర్, సాయంత్రం ఏడింటికి రెయిన్‌బో ఐస్‌క్రీం షాప్ వద్ద కలుద్దాం, నీతో మాట్లాడాలి” అన్నది రేఖ.
“ఈ రోజు నీ కోసం విజయనగరం నుండి వైజాగ్ రావడానికి కష్టం. నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి” అన్నాడు సుధీర్.
“ఐతే నన్ను మరచిపో” అని విసురుగా ఫోన్ కట్ చేసింది.
సుధీర్ నాలుగు రోజులు శలవుపెట్టి బెంగుళూరు నుండి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. ‘రేఖ ఇలా పిలిచిందంటే ఏదో ఉండే ఉంటుంది’ అనుకున్నాడు.
***
“నా పేరు నాగముత్తు. నీతో కొంచెం మాట్లాడాలి” పార్కు బెంచీలో వాకింగ్ చేశాక కూర్చుని రెస్ట్ తీసుకుంటున్న శివరాం తన పక్కనే కూర్చుని ఉన్న అపరిచిత వ్యక్తి పలకరించడంతో అతని వంక చూశాడు.
రోజూ ఉదయం ఆరు గంటలకే నిద్ర లేచి, పార్కులో ఓ అర్ధగంట సేపు వాకింగ్ చేసి, సిమెంటు బెంచీపై పది నిమిషాలు కూర్చుని రిలాక్సై ఇంటికి వెళ్లిపోతూ ఉంటాడు శివరాం. ఈ రోజు వాకింగ్ చేస్తూ ఉంటే, తన వెనుకే ఎవరో వస్తున్నట్లు అనుమానం కలిగింది. ఎవరో పెద్ద మనిషి వాకింగ్ చేస్తున్నాడులే అనుకున్నాడు కానీ ఇలా తనను అనుసరిస్తూ ఉన్నాడని అనుకోలేదు.
“చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు” అన్నాడు శివరామ్.
“నువ్వు మశ్చీంద్ర గారి వద్ద అసిస్టెంటుగా పనిచేస్తున్నావని తెలిసింది” గాలం విసుర్తున్నట్లుగా అన్నాడు నాగముత్తు.
“ఔను, ఐతే ఏం?” ఈసారి శివరాం నాగముత్తు వెనుకగా ఉన్న వేపచెట్టువైపు చూశాడు. చెట్టు వెనుకగా దాక్కొని ఉన్న కందస్వామి అతడి దృష్టి నుండి తప్పించుకోలేదు. కందస్వామి ఈ నాగముత్తుకు తనను చూపించాడని శివరామ్‌కు అర్థమైపోయింది.
“నీకా సరైన ఉద్యోగం లేదు, మరో మూడు నెలల్లో మశ్చీంద్ర వద్ద నువ్వు చేసే ఉద్యోగమూ ఊడిపోతుంది. ఇప్పుడే వీలైనంతగా సంపాదించుకోవాలి” శివరామ్ హితవు కోరేవాడిలా చెప్పాడు నాగముత్తు.
“పాయింటుకి రండి” టైం చూసుకొంటూ విసుగ్గా చెప్పాడు శివరామ్.
“నా మాట విని, నాకో చిన్న సాయం చేస్తే, నీకో లక్ష రూపాయలు ముట్టచెప్తాను” రహస్యం చెప్తున్న వాడిలా చిన్నగా అన్నాడు నాగముత్తు.
శివరామ్‌కు మతిపోయినట్లైంది.
“లక్షరూపాయలా? ఏం సాయం చేయాలి?” అన్నాడు.
“ఆ మశ్చీంద్ర నీచుడు. నీతో గాడిద చాకిరీ చేయించుకొని నెలకు ఏ ఐదారువేలో నీకు ముట్టచెప్తాడు. వాడి దగ్గర ఒక డైరీ ఉంటుంది. ఏ లాకర్లోనో దాచుతాడు దాన్ని. అది నాకు కావాలి, ఆ డైరీ నాకు తెచ్చిచ్చి, నీ లక్షా నువ్వు తీసుకొని పోవచ్చు” అన్నాడు నాగముత్తు చిరునవ్వుతో.
శివరామ్ కోపంగా నాగముత్తు వంక చూశాడు. “అదే మీరు నా నుండి కోరే సాయమైతే, ఏమాత్రం వీలు పడదు. మీరిక బయల్దేరవచ్చు” అన్నాడు పైకి లేస్తూ.
“ఆగు, తొందరపడకు, బాగా ఆలోచించుకొని చెప్పు” శివరామ్ చేయి పట్టుకొని ఊపుతూ అన్నాడు నాగముత్తు.
శివరామ్ ఆయన పట్టు విడిపించుకొని వేగంగా అక్కడ నుండి బయలుదేరాడు. ‘మశ్చీంద్ర గారికి జాగ్రత్తలు చెప్పి లాబ్‌కు సెక్యూరిటీ పెంచాలి, కొన్ని దుష్టశక్తులు కళ్లు లాబ్‌పై పడ్డాయి’ అనుకున్నాడు.
(ఇంకా ఉంది)
