Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మాయా శశిరేఖ-4

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో సైన్స్ ఫిక్షన్ విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘మాయా శశిరేఖ’. రచన శ్రీ రాచపూటి రమేష్. ఇది 4వ భాగం.]

రెయిన్‌బౌ రెస్టారెంట్లో ఏడవ నంబరు కేబిన్‌లో ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు సుధీర్‌, రేఖ.

యూనిఫాంలోని సర్వర్‌ రెండు కప్పుల్లో బటర్‌ స్కాచ్‌ ఐస్క్రీంని తెచ్చి వారి ముందుంచాడు. రేఖ చకచకా ఐస్క్రీం స్పూన్‌తో తింటూ ఉంటే, సుధీర్‌ స్పూన్‌తో కప్పులో ఐస్క్రీంని కదుపుతూ ఉండిపోయాడు. నిజానికి అతనికి ఐస్క్రీం ఇష్టం లేదు. రేఖ పిలిచిందని ఆ పార్లర్‌కి వచ్చాడు.

“నువ్వు వచ్చింది ఐస్క్రీం తినడానికే అన్నట్లుగా ఉంది. నన్నెందుకు రమ్మన్నావు. విజయనగరంలో పని మానుకొని వైజాగ్‌ వచ్చాను” విసుగ్గా అడిగాడు సుధీర్‌.

“అబ్బో, బోడిపని, అవతల కొంపలంటుకుంటూ ఉంటే” చిరుకోపంతో చెప్పింది రేఖ.

“కొంపలంటుకుంటే ఫైరింజనుకు ఫోన్‌ చేయాలి కానీ, నాకెందుకు చేయడం?”

“ఔనులే, రేపా పర్వతరావు కొడుకుతో నా పెళ్లి జరిగిపోతే నువ్వు ఏ ఫైర్‌ బ్రాండునో వెతుక్కోవాల్సి ఉంటుంది గదా” చెప్పింది రేఖ నిష్ఠూరంగా.

“పర్వతరావా? వాడెవడు పానకంలో పుడకలాగా, ఐనా వాడి కొడుకుతో నీకు పెళ్లి ఫిక్స్‌ చేయడమేమిటి? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీ నాన్నకు?” మండిపడ్డాడు రేఖపై సుధీర్‌.

“మా నాన్న కాదు, ఇది మా అమ్మ నిర్వాకం. ఆ పర్వతరావు నాకు సంగీతంలో గురువు, వాడికి పర్వతమంత ఆస్తి ఉంది. బుద్ధి, జ్ఞానం లేని కొడుకొకడు కూడా ఉన్నాడు. వాడికి నన్ను కట్టబెట్టాలని మా అమ్మ ఉవ్విళ్లూరుతోంది” కోపంగా చెప్పింది రేఖ.

“వాడెంతటి వాడైనా కానీ, నేను అడ్డుకుంటాను. మీ అమ్మను మీ ఇంటికే వచ్చి చెడామడా వాయించమంటావా?” చిందులు తొక్కుతూ అన్నాడు సుధీర్‌.

“నీకంత ధైర్యం ఉంటే ఇంకేం” అంది రేఖ నవ్వుతూ.

“చూస్తూ ఉండు, ఏం చేస్తానో” బేరర్‌ తెచ్చిన బిల్లు చెల్లించి పైకి లేస్తూ చెప్పాడు సుధీర్‌.

***

“ఏది ఏమైనా కానీ, ఈ రోజు మశ్చీంద్ర గారి నడిగి ఆయన ప్రయోగాల సారాంశం ఏమో తెలుసుకోవాలి. అంతేగాక ఆయన లేబ్‌లో రహస్యాలు సంగ్రహించేందుకు కొందరు దుర్మార్గులు పన్నాగాలు పన్నుతున్నారని ఆయన్ను హెచ్చరించాలి. తనదెలాగూ టెంపరరీ ఉద్యోగం, మూడు నెలల్లో ఊడేది నెల రోజుల్లోనే ఊడుతుంది” అని గట్టిగా నిశ్చయించుకున్నాడు శివరామ్‌.

మశ్చీంద్ర ఆ రోజు మంచి హుషారుగా ఉన్నాడు. ఆయన వాలకం చూస్తూ ఉంటే ఆయన ప్రయోగాల్లో ఏవో గొప్ప విజయం సాధించినట్లుగా ఉంది.

తన ఛాంబర్లో రెండు గంటల పాటూ ఏకబిగిన ప్రయోగాలు చేసి బయటకొచ్చిన మశ్చీందద్ర మొఖంలో అలసటతో బాటూ ఆనందం కూడా కనిపిస్తూ ఉంది. అంజిని రెండు స్ట్రాంగ్‌ కాఫీ తీసుకు రమ్మని ఇంటర్‌కంలో చెప్పాడు శివరామ్‌.

“ఆనంద్‌ సినిమా లాంటి మంచికాఫీ. ఇది తాగితే మళ్లీ మళ్లీ తాగాలనిపించేలా చేశాను” అంటూ అంజి ఆ కాఫీని తీసుకొచ్చి వారికిచ్చి వెళ్లిపోయాడు.

మశ్చీంద్ర కాఫీ తాగి కాసేపు అలసటగా కళ్లు మూసుకొని ఉండిపోయాడు. శివరాం ఆయన్ను రిలాక్స్‌ కానిమ్మని నిశబ్దంగా ఉండిపోయాడు.

పదినిమిషాల తరువాత కళ్లు తెరచిన మశ్చీంద్ర శివరామ్‌వైపు చిరునవ్వుతో చూసి, “శివరామ్‌, ఈ రోజు చాలా స్పెషల్‌డే, నా పరిశోధనలు ఒక కొలిక్కి వచ్చాయి” అన్నాడు.

శివరామ్‌ ధైర్యం కూడగట్టుకొని “సార్‌, ఇలా అడగచ్చో లేదో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని గురువుగా, దైవంగా భావించి అడుగుతున్నాను. ఇంతకూ ఈ ఎక్స్‌పెరిమెంట్లన్నీ ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? అసలు మీ ఆశయం ఏమిటి? తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది. మీరు చెప్పాలనుకుంటేనే చెప్పండి. నాలాంటి అర్భకుడికి చెప్పకూడదనుకుంటే అది మీ ఇష్టం” అన్నాడు, చేతులు కట్టుకొని వినయంగా.

మశ్చీంద్ర పెద్దగా నవ్వి, “నేను నిజానికి నా పరివోధనలు ఒక కొలిక్కి వచ్చే వరకూ, వాటి లక్ష్యమూ, ప్రయోజనం గురించి ఎవ్వరికీ చెప్పకూడదనుకున్నాను. కానీ ఈ రోజు చాలా హేపీ మూడ్‌లో ఉన్నాను. నాకెందుకో నా ప్రయత్నాల గురించి నీకు చెప్పాలనిపిస్తోంది.

మనుష్యుల ప్రవర్తనకు కారణమేమిటి? మనకేదైనా సమస్య ఎదురైనప్పుడు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ప్రవర్తిస్తారు. కొందరు సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటే కొందరు పారిపోవాలని ప్రయత్నిస్తారు. అలాగే భావోద్వేగాలు, ఇష్టా ఇష్టాలు ఒక్కొక్క మనిషిలో ఒక్కో రకంగా ఉంటాయి.

మన మెదడు ఉత్పత్తి చేసే హార్మోన్లు మన ప్రవర్తనను నిర్దేశిస్తాయి అని అనాదిగా శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. ఉదాహరణకు ప్రేమ, కామం వంటివి కలగడానికి ఈస్ట్రోజన్‌, ఆవేశం కలగడానికి అడ్రినలిన్‌ హార్మోన్లు కారణంగా పేర్కొంటారు. టెస్టోస్టిరోన్‌ కూడా ఆవేశాన్నీ, కామ ప్రకోపాన్నీ కలిగిస్తుంది. ఈ విషయంలో నేను కొన్ని అడ్వాన్స్‌డ్‌ పరిశోధనలు చేసి మానవుల ప్రవర్తనకు మూలకారణమైన ఒక పదార్థాన్ని గుర్తించి దానికి ‘జైనోమ్‌’ అని నామకరణం చేశాను. మనుష్యుల రక్తంలో కూడా ఆ పదార్థం తాలూకు ట్రేసెస్‌ గుర్తించాను. ముందు ఎలుకలు, కుక్కలపై నా పరిశోధన జరిపి హార్మోన్లను, జైనోన్‌ను ఇంజక్ట్‌ చేయడం వల్ల ఆ మూగజీవుల ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చని గుర్తించాను. బయటివారిపై ప్రయోగాలు చేయడం ఇష్టం లేక, నా కుటుంబ సభ్యుల రక్తాన్ని సేకరించి, వాటి నుండి ‘జైనోమ్‌’ను వేరు చేయగలిగి, ఈ క్యూబికల్స్‌లో భద్రపరచాను” అంటూ చిన్నపెట్టెల్లాంటివి గర్వంగా శివరాంమ్‌కు చూపాడు మశ్చీంద్ర.

“అంటే ఒకరి జైనోమ్‌ను మరొకరికి ఇంజక్ట్‌ చేస్తే వారి ప్రవర్తనా సరళిలో మార్పు వస్తుందంటారా?” ఆశ్చర్యంగా అడిగాడు శివరామ్‌.

“ఔను, కానీ ఇంకా మానవులపై ఈ పరిశోధనలను ప్రయోగించలేదు. అదీగాక ప్రస్తుతం రక్త సంబంధం ఉన్న మనుష్యుల మధ్య మాత్రమే జైనోమ్‌ మార్పిడికి అవకాశం ఉన్నట్లు నేను గ్రహించాను. అంటే అన్నదమ్ముల్లు, అక్క, తమ్ముడు, ఇలా. కొన్నాళ్లకు అలా లేని వారిలో కూడా జైనోన్‌ మార్పిడి ద్వారా ప్రవర్తనలో మార్పుకు స్వీకారం చుట్టవచ్చు” అన్నాడు చిరునవ్వుతో మశ్చీంద్ర.

“నాకింకా అర్థం కావడం లేదు సార్‌, అన్న తాలుకు జైనోన్‌ తమ్ముడికి ఇంజక్ట్‌ చేస్తే తమ్ముడికి అన్న లక్షణాలు వస్తాయా?” ఇంకా సందేహంగా అడిగాడు శివరామ్‌.

“ఔను, ఉదాహరణకు ధర్మరాజును భీముడిలాగా, భీముడిని ధర్మరాజులాగా మార్చవచ్చు” ధీమాగా చెప్పాడు మశ్చీంద్ర.

“మరింకేం సార్‌, మీ పరిశోధనలను హ్యూమన్స్‌పై ప్రయోగించండి. ఐనా మీ వాళ్లకేం చెప్పి వారి నుండి రక్తాన్ని సేకరించారు?” అన్నాడు శివరాం, ఆసక్తిగా.

“రెండు రోజుల నుండి మా వాళ్లు స్వైన్‌ఫ్లూ లాంటి జ్వరంతో బాధపడుతూ ఉన్నారు కదా. వారికి బ్లడ్‌ టెస్ట్‌ చేయించాలని మా ఆవిడ నుండీ, శశి, రేఖల నుండి బ్లడ్‌ శాంపుల్స్‌ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఆ సమయానికి అక్కడికి వచ్చిన మా ఆవిడ వర్ధని వాళ్లన్న వెంకట్రావు నుండి కూడా ఆ శాంపుల్‌ తీసుకున్నాను, తనకూ జ్వరం వస్తుండడంతో వెంకట్రావు బ్లడ్‌ ఇవ్వడానికి సందేహించలేదు. ఆ బ్లడ్‌లోంచి కొంత వేరే బాటిళ్లలోకి మార్చి మిగతా బ్లడ్‌ను లేబ్‌ వాడికిచ్చాను. అన్నట్లు నువ్వు సాయంత్రం వచ్చేటప్పుడు లాబ్‌ నుండి ఆ బ్లడ్‌ రిపోర్ట్‌ తీసుకునిరా” అన్నాడు మశ్చీంద్ర.

“సార్‌, మీరు సాధించింది చరిత్రాత్మకమైన విజయం, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఆ జైనోన్‌ను మీ వాళ్లకింజక్ట్‌ చేసి ఫలితాలను రాబట్టండి” అన్నాడు శివరాం.

“అది నువ్వనుకున్నంత సులభం కాదు” తాపీగా అన్నాడు మశ్చీంద్ర నవ్వి, “ఎందుకు సార్‌?” ఆసక్తిగా అడిగాడు శివరామ్‌.

“నా ప్రయోగాలకు ఇతరులు బలిపశువులు కాకూడదన్న ఉద్దేశంతో వాటి కోసం మా కుటుంబ సభ్యులనే ఎంచుకున్నా. కానీ ఇంకా ధైర్యం చాలడం లేదు. అంతేగాక ఈ జైనోమ్‌ ప్రభావం ప్రస్తుతం అరవై రోజుల వరకే ఉంటుంది” అన్నాడు మశ్చీంద్ర.

“అంటే అరవై రోజుల తరువాత వాళ్లు మామూలు పాత మనుషుల్లా మారిపోతారా?” అడిగాడు శివరామ్‌.

“మామూలుగా మారవచ్చు లేదా హార్మోన్‌ ఇమ్‌బాలెన్స్‌తో పిచ్చివాళ్లుగా మారవచ్చు. అందుకే జైనోన్‌ ప్రభావానికి గురైన వారికి విరుగుడు మందు కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాను. ఆ ప్రయత్నమూ ఒక కొలిక్కి వస్తూ ఉంది. విరుగుడు మందు కనిపెట్టిన వెంటనే ఈ ప్రయోగాన్ని ముందు మా వాళ్లపైనే చేస్తాను” అన్నాడు మశ్చీంద్ర, కాన్ఫిడెంట్‌గా.

శివరామ్‌కు మశ్చీంద్ర ప్రయోగం తాలూకు ఫలితాన్ని వెంటనే చూడాలని ఉంది. ‘ఇతరుల జైనోన్‌ ప్రభావం ఒకరిపై సమసిపోయిన తరువాత అతడు మామూలుగా మారుతాడు కానీ, పిచ్చివాడెందుకౌతాడు? అంతా ఈ పెద్దాయన చాదస్తం కానీ’ అనుకున్నాడు.

“ఈ విషయాలు ఉద్వేగంలో నీకు చెప్పేశాను. వీటిని నువ్వు రహస్యంగా ఉంచాలి. ఈ ప్రయోగాల సారాంశం బయట ఎవ్వరికీ తెలిసినా నీదే బాధ్యత” అని శివరామ్‌ని గట్టిగా హెచ్చరించాడు మశ్చీంద్ర. ఎక్సైట్‌మెంట్లో శివరామ్‌కు లేబ్‌పై ఇతరుల కళ్లు పడ్డాయని మశ్చీంద్రకు చెప్పాలన్న విషయం గుర్తుకు రాలేదు.

***

“శశి, ఎక్కడున్నావు? వెంటనే ఒకసారి కంపెనీ దగ్గరకు రా. నీకొక మంచి అవకాశం” ఆఫీస్‌ అవర్స్‌ తరువాత ఫ్రెండ్స్‌తో కలిసి, కంపెనీ పక్కనే ఉన్న బార్లో బీరు తాగుతున్న శశి తన మిత్రుడు దినేష్‌ ఫోన్లో చెప్పిన మాటలు విని కంగారుపడ్డాడు.

“పావుగంట ముందే ఆఫీసు నుండి బయటకొచ్చాను. అప్పుడంతా నార్మల్‌గానే ఉంది. ఈలోగా ఏమి కొంపమునిగింది? నేను డ్రింకింగ్‌ మూడ్‌లో ఉన్నాను. ఇప్పుడు రాలేను” అని శశికాంత్‌ మిత్రుడిపై మండిపడ్డాడు.

“అదికాదురా, ఆలేఖ్య కేబ్‌ డ్రైవర్‌ రాలేదు. ఆమె కంగారు పడుతూ ఉంది. మీ కాలని పక్కనే కదా వాళ్లుండే కాలనీ, నువ్వింటికెళ్తూ ఆమెను వాళ్లింటి దగ్గర దింపేసి వెళ్లిపోతావని” అన్నాడు దినేష్‌.

“ఆలేఖ్యనా, ఆమె చచ్చినా నాతో రాదు” అన్నాడు శశి.

“నీకా భయం అక్కర్లేదు. ఆటోవాలాలు స్టైక్‌లో ఉన్నారు. ఆటోలేవీ దొరకవు. నాకింకా ఆఫీసులో గంట పనుండి. నేనే నీ పేరు చెప్పాను. ఆమె సరేనంది” అన్నాడు దినేష్‌.

“సరే, ఐతే ఇప్పుడే వస్తున్నాను” అని శశికాంత్‌ ఫ్రెండ్స్‌ను కన్విన్స్‌ చేసి బయలుదేరాడు. ఇంకా ఫస్ట్‌ రౌండ్లోనే ఉన్నాడు కాబట్టి తాను కొద్దిగా తాగి ఉన్నట్లు ఆలేఖ్య పసిగట్టలేదని అనుకున్నాడు.

అతడు బైక్‌ ఆఫీస్‌ బయట పార్క్‌ చేసి, ఫస్ట్‌ఫ్లోర్లోని రిసెప్షన్‌కు చేరుకొనే సరికి అతడి కోసం అసహనంగా వెయిట్‌ చేస్తున్న ఆలేఖ్య, దినేష్‌ కనిపించారు.

“శశి వచ్చేశాడు. ఇంక బయల్దేరు” సోఫోలోంచి పైకి లేస్తూ చెప్పాడు దినేష్‌.

ఆలేఖ్య, శశికాంత్‌తో బాటు నాలుగడుగులు వేసింది. ఇంతలో ఏదో అనుమానం వచ్చినట్లు ఆగి, మళ్లీ వెనుదిరిగింది.

“ఏమైంది ఆలేఖ్యా, పది నిమిషాల్లో నిన్ను ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్లిపోతాను కదా” అన్నాడు శశికాంత్‌ కంగారుగా.

ఆలేఖ్య అతనికి జవాబు చెప్పకుండా “దినేష్‌, నేను గంట వెయిట్‌ చేస్తాను. నువ్వింటికి వెళ్లేటప్పుడు నీతోనే వస్తాను. నాకా వాసన పడదు” అన్నది ఆలేఖ్య కటువుగా. తన ఛాంబర్లోకి వెళ్లిపోతూ.

దినేష్‌ శశికాంత్‌ దగ్గరకు వచ్చి, “నువ్వీ జన్మకు మారవు” అన్నాడు. ఆ రోజు ఫ్రైడే కావడంతో ఫ్రెండ్స్‌తో పార్టీలో ఉన్నాడు శశి.

“ఆమెకు పోలీసు కుక్కలకు మించిన గ్రహణ శక్తి ఉందని నాకేం తెలుసు?” నవ్వుతూ చెప్పాడు శశికాంత్‌.

***

శివరామ్‌ లాబ్‌ నుండి రిపోర్ట్స్‌ తీసుకొని పరాగ్గా రోడ్డుపైన నడుస్తూ ఉన్నాడు. లాబ్‌ నుండి మశ్చీంద్ర ఇల్లు ఎంతో దూరం లేదు. ఒక పావుగంట నడక అంతే.

శివరామ్‌ను రాసుకుంటూ ఒక కారు వేగంగా వెళ్లింది. సమయానికి శివరామ్‌ గమనించి పేవ్‌మెంట్‌ పైకి గెంతాడు. క్షణంలో పెద్ద ప్రమాదం తప్పింది.

కారు మలుపు తిరుగుతూ ఉన్నాడు, డ్రైవింగ్‌ సీట్లో ఉన్న పోనీ టెయిల్‌ వాణ్ణి గమనించాడు శివరామ్‌. ఈసరికి నలుగురైదుగురు పాదచారులు అతడి చుట్టూ చేరి అతణ్ణి పరమార్శిస్తూ ఉన్నారు.

నాగముత్తు తనను లొంగదీసుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో, తనను బెదిరించడానికే ఈ ఎత్తుగడ వేశాడు అని స్పష్టమైంది శివరామ్‌కి.

“ఇక లాభం లేదు. వెంటనే ఏదో ఒకటి చేయాలి” గట్టిగా నిశ్చయించుకున్నాడు శివరామ్‌.

***

“మీ పిచ్చిగానీ, మీ చెల్లెలు వర్ధనమ్మ ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా? ‘ఆస్తులు, అంతస్తులు, తాహతూ, తేడాలు’ అని గొడవ చేసి పారేస్తుంది కానీ చచ్చినా ఈ పెళ్లికి ఒప్పుకోదు” వెంకట్రావు భార్య తాయారు భర్తతో వాదిస్తోంది.

“ఔను, అదే జరిగింది, చిన్నప్పటి నుండీ అనుకున్న సంబంధమే కదా, అని చెల్లెమ్మ దగ్గర ప్రస్తావించాను ఈ రోజు. నువ్వన్నవనీ అనే పంపింది” తాపీగా శెలవిచ్చాడు వెంకట్రావు.

“నేననుకుంటూనే ఉన్నా మీరిలాంటి పిచ్చిపనేదో చేస్తారని, ఐనా మాట్లాడ్డం చేతగాని అమాయకులు, మీరెందుకు ఈ విషయం కదిపి నానామాటలు అనిపించుకోవడం, ఇంత జరిగాక నేనీ పెళ్లికి ఒప్పుకుంటాననుకున్నారా, చచ్చినా ఒప్పుకోను. మూడు నెలల్లో దీని బాబు లాంటి సంబంధం చూసి సుధీర్‌కు పెళ్లి చేస్తాను, చూడండి” ఆవేశంతో ఊగిపోతోంది తాయారు.

“ఒసే తాయారూ, పిల్లలు ఇష్టపడుతున్నారు, పెద్దవాళ్లం మనమే ఏదో సర్దిచెప్పి, పెళ్లి జరిగేలా చూడాలి కానీ, నువ్వే ఇలా అంటే ఎలా?” బాధపడిపోయాడు వెంకట్రావు.

“మీకేం తెలియదు, ఊరుకోండి. మన వాడికేం తక్కువ, చదువా, ఉద్యోగమా, మనల్ని వెతుక్కుంటూ వస్తారు పిల్లల తండ్రులు. మనం ఎవర్నీ బతిమాలనక్కరలేదు. రేపే పెళ్లిళ్ల పేరయ్య మూర్తికి కబురు పెడతాను” ఖండితంగా చెప్పింది తాయారు.

ఆమెతో వాదించడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాడు వెంకట్రావు.

అదే సమయంలో సంగీత సామ్రాట్‌ పర్వతరావు వర్ధనమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నాడు.

“వర్ధనమ్మగారూ, మీతో ఈ విషయం ఎలా మాట్లాడాలో తెలియకుండా ఉంది. మావాడు కన్నబాబు మీ అమ్మాయి రేఖను తప్ప మరొకరిని చేసుకోనని పట్టుబట్టి కూర్చున్నాడు. రెండు రోజుల నుండీ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టడం లేదు. అందుకే అబ్బాయి తండ్రినైనా డైరెక్టుగా మిమ్మల్ని అడిగే ధైర్యం లేక ఇలా ఫోన్లో అడుగుతున్నాను” అని తీయగా మాట్లాడుతున్నాడు పర్వతరావు. “నేనకుంటున్నదే మీ నోట్లోంచి వింటున్నాను” అన్నది వర్ధనమ్మ.

“కానీ మీ అమ్మాయి రేఖ ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా” అన్నాడు పర్వతం.

“అమ్మాయి దేముందండి, గంగిగోవు లాంటిది. మేము చెప్పినట్లు వింటుంది. మీతో వియ్యమందడం మాకూ ఇష్టమే. మంచి రోజు చూసుకొని ఈ విషయం మాట్లాడ్డానికి నేనూ, మా వారు మీ ఇంటికొస్తాం” తాను వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా సంబర పడిపోయింది వర్ధనమ్మ.

“చాలు, మీ మాటలు నాకు పన్నీటి జల్లులా ఉన్నాయి. ఇక మా వాడిని ఎంగిలి పడమంటాను” అప్పుడే ఫుల్లుగా భోంచేసి, బ్రేవుమంటున్న కన్నబాబును చూస్తూ అన్నాడు పర్వతరావు తృప్తిగా, “ఎలుక బోనులో పడింది” అనుకున్నాడు మనసులో.

***

శివరామ్‌ నేరుగా సెల్లార్‌లోని లేబ్‌కు వచ్చాడు. మశ్చీంద్ర ఒక బొచ్చుకుక్కకేదో ఇంజక్షన్‌ ఇస్తున్నాడు. శివరామ్‌ను చూడగానే “లేబ్‌లోంచి టెస్ట్‌ రిజల్ట్స్‌ తెచ్చావా? ఏదీ, ఇలా ఇవ్వు” అని శివరామ్‌ చేతిలోని రిపోర్ట్‌ తీసుకొని చూసి, “స్వైన్‌ఫ్లూ లక్షణాలేవీ కనబడ్డం లేదు, టైఫాయిడ్‌ సిమ్టమ్స్‌ అందరిలో కొద్దిగా ఉన్నాయి. ఇంజక్షన్‌ పడితే సరిపోతుంది. వేసుకోకున్నా ఫరవాలేదు” అన్నాడు రిపోర్ట్‌ షెల్ప్‌లో పెడుతూ, “మెడికల్‌ షాప్‌లో అడిగి, టైఫాయిడ్‌కు ఇంజక్షన్‌ తెచ్చానండి” అన్నాడు శివరామ్‌.

“ఐతే ఇంకేం, పైకెళ్లి వాళ్లకందరికీ ఆ ప్రివెంటివ్‌ ఇంజక్షన్‌ ఇవ్వు. నాకు ఛాంబర్లో ఒక రెండు గంటలు పని ఉంది. నన్ను డిస్ట్రబ్‌ చేయకు” అని తన ఛాంబర్లోకి వెళ్లిపోయాడు మశ్చీంద్ర.

శివరామ్‌కు హఠాత్తుగా ఎక్కడలేని తెగింపు వచ్చింది. “ఇదే మంచి అవకాశం, మశ్చీంద్ర గారి ప్రయోగాన్ని ఈ రోజే అమలు చేస్తాను నేనే. తరువాత ఏమైనా కానీ” అని సేఫ్‌లోని క్యూబికల్స్‌ను తీసుకొని మెట్లెక్కి ఇంట్లోకి వెళ్లాడు శివరామ్‌. అతడు వెళ్లేసరికి హాల్లో వర్ధనమ్మ, శశికాంత్‌, రేఖ సోఫాలలో కూర్చుని ఇంటికి వచ్చిన వెంకట్రావుతో మాట్లాడుతూ ఉన్నారు.

“చెల్లెమ్మా, నా మాట విను. మా ఆవిడ సుధీర్‌కు వేరే సంబంధాలు చూస్తోంది. ఆమె పట్టుదల సంగతి నీకు తెలుసుగా, ఎవరు చెప్పినా వినదు. అంతవరకు రానీయకూడదని నేను చివరి ప్రయత్నంగా నీ దగ్గరకు వచ్చాను” అంటున్నాడు వెంకట్రావు.

“చూస్తే చూడనీ, నా నిర్ణయం నీకు మొన్ననే చెప్పానుగా అన్నయ్య, నిన్ననే రేఖ పెళ్లి విషయం వేరే వాళ్లతో మాట్లాడాను. ఆ సంబంధం ఆల్మోస్ట్‌ ఫిక్స్‌ ఐపోయింది” ఖచ్చితంగా చెప్పింది వర్దనమ్మ.

“అమ్మగారు మాటిస్తే, ఇంట్లో అందరికీ అది శిలాశాసనం లాంటిదే అనుకోండి” అందరికీ కాఫీలు తెచ్చి ఇస్తూ చెప్పాడు అంజి.

వారి మాటలను విసుగ్గా వింటూ కూర్చుని ఉన్నారు శశి, రేఖలిద్దరూ. వారి దృష్టి టీవీలో వస్తున్న వన్డే క్రికెట్‌ మ్యాచ్‌వైపు ఉన్నా, మనసంతా తమ తల్లీ, మామయ్యల మధ్య జరుగుతున్న సంభాషణపైనే ఉంది. తల్లికి ఎదురు మాట్లాడడానికి మాత్రం వారిద్దరికీ ధైర్యం లేదు.

ఇంతలో క్యూబికల్స్‌ ఉన్న లెదర్‌బేగ్‌తో అక్కడికి వచ్చాడు శివరామ్‌.

“ఏమయ్యా, పెళ్లికాని ప్రసాదూ, పానకంలో పుడకలాగా నువ్వెందుకిక్కడ?” అన్నాడు అంజి, అందరూ ఆ మాటలకు గట్టిగా నవ్వారు.

శివరామ్‌కు మండిపోయింది. ఐనా సర్దుకొని “మీకందరికీ టైఫాయిడ్‌ సింప్టమ్స్‌ ఉన్నాయని రిపోర్టు వచ్చింది. కాబట్టి మీకు ఇంజక్షన్లు ఇవ్వమని సారు చెప్పారు” అన్నాడు.

“సరే, ఇచ్చి త్వరగా ఇక్కడ నుండి బయలుదేరు” టీవీ మీద నుండి దృష్టి మరల్చకుండా చెప్పాడు శశికాంత్‌.

వాగ్వివాదంలో ఉన్న వర్ధనమ్మ, వెంకట్రావులు గానీ, టీవీ నుండి దృష్టి మరల్చని శశికాంత్‌, రేఖలు కానీ శివరామ్‌ క్యూబికల్స్‌ నుండి సిరంజిలోకి మందు నింపడం గమనించలేదు. శివరామ్‌ జాగ్రత్తగా శశికాంత్‌ జైనోమ్‌ రేఖకూ, రేఖ జైనోమ్‌ శశికాంత్‌కు, వెంకట్రావు జైనోమ్‌ వర్ధనమ్మకు, వర్ధనమ్మ జైనోమ్‌ వెంకట్రావుకు ఇంజక్ట్‌ చేశాడు. కొత్త జైనోమ్‌ ప్రబావం మనిషిలో పన్నెండు గంటల తరువాత తెలుస్తుందని మశ్చీంద్ర చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు.

“నీ పని ముగిసిందిగా ఇక బయల్దేరు. లేబ్‌లో పని మీద దృష్టి పెట్టు” కటువుగా చెప్పాడు అంజి.

శివరామ్‌ ఖాళీ క్యూబికల్స్‌ను బ్యాగ్‌లో సర్దుకొని లేచి, లేబ్‌లోకి నడిచాడు. ‘ఇక రాబోయే 24 గంటలలో ఏం జరుగుతుందో చూడాలి’ అని ఎక్సైటింగా అనుకున్నాడు.

శివరామ్‌ లేబ్‌లోకి వచ్చిన మరొక గంటకు గానీ మశ్చీంద్ర తన స్పెషల్‌ చాంబర్‌ నుండి బయటకు రాలేదు. వచ్చిన వెంటనే డైరీలో ఏదో నోట్‌ చేసుకొని, ఏదో పని చేసుకుంటూ ఉండిపోయాడు. శివరామ్‌ ఉనికిని కూడా పట్టించుకోలేదు.

***

“ఆ శివరామ్‌ గాడు మనకు హేండిచ్చాడు గదా, వాడి సంగతి ఏం చేశావు.” కొడుకు వీరమణిని కోపంగా అడిగాడు నాగముత్తు.

“కొద్దిలో తప్పించుకున్నాడు. కారుతో తొక్కించి చంపాలనుకున్నాను. ఈసారి తప్పించుకోలేడు” కోపంగా చెప్పాడు వీరమణి.

“వాడి ద్వారా ఆ డైరీ సంపాదించలేమని తెలిసిపోయింది. ఒక పక్క నట్వర్‌ సింగ్‌ ఈ విషయంలో తొందర పెడుతూ ఉన్నాడు. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదు. ఏదో ఒకటి తొందరగా చేయాలి” సాలోచనగా చెప్పాడు నాగముత్తు.

“బయట వాళ్లను నమ్ముకుంటే లాభం లేదు. నేనే వెళ్తాను. ఆ మశ్చీంద్ర తన ఛాంబర్లో తన పాటికి తాను పని చేసుకుంటూ ఉంటాడు. లేబ్‌లో వెతికి, ఆ డైరీ సైలంట్‌గా తీసుకొస్తా. ఒకవేళ ఎవరైనా అడ్డొచ్చినా, వాళ్లను చావగొట్టైనా ఆ డైరీ తీసుకొస్తాను” ఆవేశంగా అన్నాడు వీరమణి.

“జాగ్రత్త. ఆ లేబ్‌లో సీసీకెమెరాలు ఉండవచ్చు. చేతులకు గ్లౌస్‌, ముఖానికి మంకీకేప్‌ వాడు. ఎక్కడా నీ ఆనవాళ్లు దొరక్కుండా చూసుకో. ఆ డైరీ మాత్రం నాకు రెండు రోజుల్లో తెచ్చి ఇవ్వాలి” అన్నాడు నాగముత్తు. వీరమణి ‘అలాగేలే’ అని తలవూపి, బయటకు వెళ్లిపోయాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version