Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మాయా శశిరేఖ-6

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో సైన్స్ ఫిక్షన్ విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘మాయా శశిరేఖ’. రచన శ్రీ రాచపూటి రమేష్. ఇది 6వ భాగం.]

“చించేస్తాను, పొడిచేస్తొను అని ఏదేదో వాగావు. వాడవతల పండగలు, పార్టీలూ అని తెగ సెలబ్రేట్‌ చేసుకుంటూ ఉన్నాడు. వాడి కూతురికి కూడా పెళ్లి చేస్తూ ఉన్నాడట” కొడుకు వీరమణిపై కస్సుబుస్సు లాడాడు నాగముత్తు.

“వేటాడే ముందు పులి కూడా నిశబ్దంగానే ఉంటుంది డాడీ, ఆ మశ్చీంద్ర ఇంటిని గమనించమని పనీ పాటలేని ఓ బేవార్సుగాడిని పురమాయించాను. సమయం చూసి వాడు నాకు ఫోన్‌ చేస్తాడు. అదును చూసి మాటు వేసి, దెబ్బ తీస్తాను” ధీమాగా చెప్పాడు వీరమణి.

***

“ఒరే, అంజి, బయట ఎవరో భిక్షగాళ్లు తిరుగుతూ ఉన్నట్లున్నారు, వాళ్లను పంపించి రా” అంజిని పురమాయించింది వర్ధనమ్మ.

“అలాగేనమ్మా”, అని బయటకు వెళ్ళాడు. “మిస్సమ్మలో రేలంగిలాగా ‘ధర్మం చెయ్‌బాబూ’ అని జోలె పట్టుకొని తిరిగేవాళ్లు ఎక్కువైపోయారు, ఎవరయ్యా మీరు? మీకిక్కడ తైలమేమీ దొరకదు, పదండి, పదండి” అని బయట ఉన్న వారిని తరబోయిన అంజి వీళ్లనెక్కడో చూసినట్లుందని ఆగిపోయాడు.

“మేము భిక్షగాళ్లం కాదు, మీ అతిథులం” అన్నారు వచ్చినవాళ్లు.

“రాకోయీ, అనుకోని అతిథి అని కృష్ణశాస్త్రి ఊరికే అనలేదు. వేలాపాళా లేకుండా అతిథులేమిటి?” అని మండిపడ్డాడు అంజి.

“మమ్మల్ని పర్వతరావు గారు పంపించారు. ఒకసారి ఆయన సెల్‌కు ఫోన్‌ చేసిస్తాం, మీ అమ్మగారిని మాట్లాడమను” అని జోగులు సెల్‌ఫోన్‌ తీసి పర్వతరావు నెంబరుకు ఫోన్‌ చేసి అంజి చేతికిచ్చాడు.

వర్ధనమ్మ ఫోన్లో మాట్లాడిరది.

“అమ్మా, మరేమీ అనుకోవద్దు. వచ్చిన వాళ్లిద్దరూ నా మేనల్లుళ్లు, మా ఇంట్లోనే ఉంటున్నారు. మా గెస్ట్‌రూంలో హఠాత్తుగా కొన్ని రిపేర్లు వచ్చాయి. ఈ రోజూ, రేపూ, మీ ఇంట్లోనే ఉంటారు, కాదనకండి” అన్నాడు పర్వతరావు ఫోన్లో.

“అలాగే అన్నయ్య గారూ, మీరంతగా చెప్పాలా? అంజీ వాళ్లను లోనికి పిలిచి గెస్ట్‌ రూం చూపించు” అంది వర్ధనమ్మ.

“అలాగేనమ్మా” అని గొనుక్కుంటూ వాళ్లను మేడమీద ఉన్న గెస్ట్‌ రూంలోకి తీసుకెళ్లాడు అంజి.

అంజి అటు వెళ్లగానే జోగులు గంగులుకు షేక్‌హాండిచ్చి, “కోటలో పాగా వేశాం, ఎలాగైనా ఈరోజు రేఖ ఒంటరిగా ఉన్నప్పుడు మన కన్నబాబు గురించి గొప్పగా చెప్పి వాడితో పెళ్లికామెనొప్పించాలి. అప్పుడే మనల్ని మామయ్య మెచ్చుకొని ఏడాదైనా ఇంట్లో ఉంచుకుంటాడు” అన్నాడు.

***

కంపెనీలో పని ముగించుకొని బయల్దేరబోతూ ఉన్న శశికాంత్‌ హడావిడిగా తనతో ఏదో పనున్నట్లు వస్తున్న ఆలేఖ్యను చూసి ఆగాడు.

“ఏమిటి ఆలేఖ్య, ఎందుకంత డల్‌గా ఉన్నావు?” అన్నాడు.

“ఇంటి నుండి ఫోన్‌ వచ్చింది, మా అమ్మగారికి సీరియస్‌గా ఉందట. శ్రీకాకుళం జిల్లా, గరివిడి దగ్గర మావూరు. గరివిడిలో హాస్పిటల్లో చేరుస్తున్నారట. నేను వెంటనే వెళ్లాలక్కడికి. ఐతే ఈ టైంలో అక్కడికి వెళ్లడానికి బస్సులు కానీ, ట్రైన్లు కానీ దొరకవు” అంది, ఆలేఖ్య దిగులుగా.

“హెచ్‌ఆర్‌ దగ్గర పర్మిషన్‌ తీసుకొని ఇప్పుడే వస్తాను” అని శశికాంత్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ వద్దకు వెళ్లి పరిస్థితి వివరించి, మరుసటి రోజుకు శలవు తీసుకొని ఆలేఖ్యతో బాటూ బయలుదేరాడు. ఇంటికి ఫోన్‌ చేసి తాను ఫ్రెండు వాళ్ల ఊరు వెళ్తున్నట్లు చెప్పాడు. శశికాంత్‌ కారులో ఇద్దరూ గరివిడికి బయలుదేరారు.

***

రేఖకు చాలా సంతోషంగా ఉంది. తల్లి సుధీర్‌తో తన పెళ్లికి ఒప్పుకుంది. అంతా ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్లుగా ఉంది. హఠాత్తుగా అమ్మలో ఇంత మార్పు ఎలా వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. రాత్రి తొమ్మిది గంటలు దాటింది సమయం.

హఠాత్తుగా రేఖ మెదడులో ఒక ఉద్వేగం కదలాడింది. ఆమెకు ఈ సంతోష సమయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలనిపించింది. అన్నయ్య ఊర్లో లేడు. వాడి బీరువాలో ఏ వైనో, విస్కీనో ఉంటుంది. తాగుతూ కాసేపు ఉల్లాసంగా గడపాలనిపించింది, రేఖకు. ఎందుకో ఎన్నడూ లేని కోరిక తనలో కలుగుతోంది అనుకుంది.

‘ఛ, ఎప్పుడూ లేనిదీ తనలో ఈ పాడు ఆలోచనలేమిటి’ అని కంట్రోల్‌ చేసుకోవాలని ఆమె బెడ్‌పైన పడుకొని చాలా సేపు ఆలోచించింది. కానీ ఆ ఉద్వేగాన్ని ఆపడం ఆమె తరం కాలేదు. తలుపు తీసి చూసింది, ‘నాన్న లాబ్‌లో ఏ రాత్రి ఒంటిగంట వరకో ఒక్కడే పనిచేసుకుంటూ ఉంటాడు. కింద అంజి గురక వినిపిస్తూంది. అమ్మ రాత్రి తొమ్మిది గంటలకంతా స్లీపింగ్‌ పిల్‌ వేసుకొని పడుకుంటుంది. ఆమెను లేపడం బ్రహ్మతరం కాదు’ అనుకొని పిల్లిలా నడిచి వెళ్లి శశికాంత్‌ గది తెరచి లోనికి వెళ్లి, బీరువా తెరచి చూసింది. ఒక లాకర్‌లో వైన్‌ బాటిలు ఉంది. అది తీసుకొని చప్పుడు కాకుండా మళ్లీ గదిలో కొచ్చింది. ఆమె షెల్ఫ్‌లో ఎప్పుడూ రోస్టెడ్‌ కాజూ, చిప్స్‌ పేకెట్లు ఉంటుంటాయి. టీ పాయ్‌పై వైన్‌ బాటిల్‌, తినుబండారాలు ఉంచి, సీసా మూత తీసి కొంత చప్పరించింది. చేదుగానూ, వెగటుగానూ అనిపించింది. ధైర్యం తెచ్చుకొని మరికొంత తాగేసరికి ఉత్సాహంగా ఉంది. టీవీలో మ్యూజిక్‌ ఛానెల్‌ పెట్టుకొని ఎంజాయ్‌ చేస్తూ వైన్‌ తాగసాగింది రేఖ.

అదే సమయంలో అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె గదిని సమీపించారు జోగులూ, గంగులు. వారింతసేపూ గదిలో రేఖతో ఏం మాట్లాడాలో రిహార్సల్స్‌ వేసుకుంటూ ఉన్నారు. పదిసార్లు డిస్కస్‌ చేసుకొని ఎవరు ఏం మాట్లాడాలో నిర్ణయించుకొని, చప్పుడు చేయకుండా పిల్లుల్లా నడుస్తూ ఆమె గదిని సమీపించారు.

“ముందు కిటికీలోంచి చూద్దాం, ఆమె ఏ మూడ్‌లో ఉందో” అని విండోలోంచి చూసిన జోగులు కొయ్యబారిపోయాడు.

“ఏమైందిరా నీకు,” అని గంగులు కూడా విండోలోంచి చూసి, “అన్నా, ఇది మామూలు ఆడది కాదు, భద్రకాళిలా రౌడీలను ఉతికి పారేయడమే కాదు, సాయంత్రమైతే మందు కొట్టనిదే నిద్ర పోయేట్లు లేదు, ఇప్పుడు పలకరించామా, తాగిన మత్తులో మనిద్దరినీ దుమ్ము దులుపుతుంది. బతికుంటే బలుసాకు తినచ్చు, పద వెళ్దాం” అని జోగులును చెయ్యి పట్టుకొని బయలుదేరదీశాడు. ఇద్దరూ నిశబ్దంగా నడిచి, తమ గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని పడుకున్నారు.

***

“అంజీ, ఈ రోజు శుక్రవారం కదా, నేనూ, రేఖా అమ్మవారి గుడికెళ్లి అర్చన చేయించి వస్తాం” పట్టు చీరలో ముస్తాబైన వర్ధనమ్మ కిటికీలు తుడుస్తూ ఉన్న అంజికి చెప్పింది.

“సరేనమ్మా, నేను ఇంటికి కాపలాగా ఇక్కడే ఉంటాను” అన్నాడు అంజి.

“నీకు ఉదయం చెప్పింది అప్పుడే మరచిపోయావా, రేపు నేను, మీ అయ్యగారు విజయనగరంలో మా అన్నయ్య వాళ్లింటికి వెళ్లాలి. నువ్వు దొండపర్తిలో కృష్ణ స్వీట్స్‌ షాపుకెళ్లి నెయ్యి పూతరేకులు, కాజుపకోడా తీసుకురావాలి. అలాగే సిరిపురం జంక్షన్లో ఆపిల్సూ, బత్తాయిలూ తెమ్మని చెప్పాను గదా” నవ్వుతూ చెప్పింది వర్ధనమ్మ.

“అలాగేనమ్మా, అయ్యగారు లాబ్‌లో పని చేసుకుంటూ ఉన్నారు గదా, ఇంటికి తాళం వేసి వెళ్తాను” అన్నాడు అంజి వర్ధనమ్మ ఇచ్చిన డబ్బులు తీసుకొని.

ఆలేఖ్యను తీసుకొని గరివిడికి వెళ్లిన శశికాంత్‌ ఇంకా రాలేదు. ఆలేఖ్య తల్లికి ట్రీట్‌మెంట్‌ జరుగుతూ ఉంటే ఆమెకు తోడుగా అక్కడే ఉండిపోయాడు. సాయంత్రానికి ఆలేఖ్య తల్లి పరిస్థితి కొంత మెరుగైంది, దాంతో శశికాంత్‌ని ‘ఇక బయలుదేరి వైజాగ్‌ వెళ్లిపొమ్మని’ చెప్పింది ఆలేఖ్య. ఆమెకు తోడుగా ఆలేఖ్య కజిన్‌ వివేక్‌ రావడంతో, శశికాంత్‌ ఆమె దగ్గర శలవు తీసుకొని వైజాగ్‌ బయలుదేరాడు. శశికాంత్‌ తన తల్లి ట్రీట్‌మెంట్‌ కోసం పడ్డ ఆరాటం చూసి ఆలేఖ్యకు అతనిపై సదభిప్రాయం కలిగింది.

***

చేరన్‌ ఒక పనీ, పాటా లేకుండా తిరిగే పాతికేళ్ల కుర్రవాడు. అప్పుడప్పుడు బార్‌లో వీరమణి మిత్రులతో కలిసి తాగుతూ ఉన్నప్పుడు పరిచయమయ్యాడు. వాడిని చేరదీసి వీరమణి తాను రోజూ వంద రూపాయలు వాడి ఖర్చుల నిమిత్తం ఇస్తానని చెప్పి, మశ్చీంద్ర ఇంటిని గమనించమన్నాడు. నాలుగు రోజుల నుండి చేరన్‌ మశ్చీంద్ర ఇంటి సమీపంలో ఉన్న టీ షాపులోనో, దగ్గరలోని సెలూన్‌లోనో కూర్చుని మశ్చీంద్ర ఇంటిలోకి వచ్చే పోయేవారి కదలికలను గమనించటమే పనిగా పెట్టుకున్నాడు.

చేరన్‌ ఆ ఇంటి పనిమనిషి నడిగి శశికాంత్‌ ఊర్లో లేడని తెలుసుకున్నాడు. కార్లో వర్ధనమ్మ, రేఖ బయటకు వెళ్లిపోవడం, ఆ వెంటనే అంజి కూడా సంచి పుచ్చుకొని బయటకు వెళ్లడం చూశాడు. ఎగిరి గంతేసి వీరమణికి ఫోన్‌ చేసి ఇంట్లో మశ్చీంద్ర ఒక్కడే లేబ్‌లో పని చేసుకుంటూ ఉన్నాడని చెప్పాలనుకున్నాడు. ఇంతలో పానకంలో పుడకలా శివరామ్‌ ఇంటి గేటు తీసుకొని లేబ్‌లోనికి వెళ్లడం చూశాడు చేరన్‌.

ఏమైతే అయిందని టీ కొట్టు నుండి దూరంగా నడిచి, వీరమణికి ఫోన్‌ చేసి ఇంట్లో మశ్చీంద్ర, శివరామ్‌ ఇద్దరే ఉన్నారని చెప్పాడు. “సరే, ఆ ఇంటి మీదే కన్నేసి ఉండు. నేను వస్తున్నాను” అన్నాడు వీరమణి, సిద్ధం చేసుకొన్న స్టీల్‌రాడ్‌ అందుకొంటూ.

***

“శివరామ్‌, చరిత్రను సృష్టించబోతున్నాము. జైనోమ్‌ ప్రభావం నుండి మనిషిని విముక్తుడిని చేసే విరుగుడు ఇంజక్షన్‌ను కూడా అతి త్వరలో ఆవిష్కరించబోతున్నాను.

నేను పని చేసిన లాబ్‌ డైరెక్టర్‌ శరత్‌ ఇందాకే ఫోన్‌ చేసి, ఇంకో ఇరవై రోజుల్లో వైజాగ్లో ఒక ఇంటర్నేషనల్‌ సెమినార్‌ జరగబోతూ ఉందనీ, అందులో నేనొక పేపర్‌ ప్రజెంట్‌ చేయాలనీ కోరారు. ఆ సెమినార్‌కు ప్రపంచ వ్యాప్తిగా ప్రఖ్యాతి గాంచిన జీవశాస్త్ర శాస్త్రవేత్తలూ, భారతదేశంలోని ప్రముఖ సైంటిస్టులూ వస్తారు. ఆ సెమినార్లో నేను నా పరిశోధనల గురించి ప్రపంచానికి తెలియజేయాలనుకుంటూ ఉన్నాను” అని గర్వంగా చెప్పాడు మశ్చీంద్ర.

“కంగ్రాచ్యులేషన్స్‌ సర్‌” అని ఆయనను మనసారా అభినందించాడు శివరామ్‌.

మరొక అరగంట మశ్చీంద్ర తన ఛాంబర్లో రకరకాల ప్రయోగాలు చేస్తూ గడిపాడు. చివరకు “శివరామ్‌ అర్జెంటుగా ఈ కెమికల్స్‌ తీసుకొని రా” అని శివరామ్‌కు ఒక లిస్ట్‌ ఇచ్చాడు. శివరామ్‌ ఆ రసాయనాలు తెచ్చేందుకు బయటకు వెళ్లాడు. అతడటు వెళ్లగానే ఆ ఇంటికి కొద్ది దూరంలో కాపు కాసిన చేరన్‌ ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని వీరమణికి చేరవేశాడు.

***

“ఛ, సమయానికి నా దోస్తులెవరూ అందుబాటులో లేరు. ఇద్దరు ఊర్లో లేరు, మరో ఇద్దరు ఊరి ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్నారు. ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది” అని వీరమణి ఒక్కడే బయలుదేరాడు, మశ్చీంద్ర ఇంటికి. ఆటోలో ప్రయాణించి ఇంటికి కాస్త దూరంలో దిగాడు.

శివరామ్‌ ఇంకా తిరిగి రాలేదని రూఢీ చేసుకొని, వీరమణి, ఒక్కడే మశ్చీంద్ర ఇంట్లోకి వెళ్లాడు. చేరన్‌ని ఇంటి బయట కాపు కాయమన్నాడు. మంకీకాప్‌ అతన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ముఖంపైకి లాక్కున్నాడు, వీరమణి.

శివరామ్‌ వెళ్లేటప్పుడు డోర్‌ లాక్‌ చేసుకొని వెళ్లాడు. అది ఆటోమేటిక్‌ డోర్‌, బయట నుండీ, లోపల నుండి తీయడానికి వీలుగా ఉండే తలుపు అది. వీరమణి తన బేగ్‌లోంచి కొన్ని డూప్లికేట్‌ కీస్‌ తీసి ఆ తాళంతో కుస్తీ పట్టసాగాడు.

***

“యురేకా” అని అరిచి ఆనందోత్సాహాలలో మునిగిపోయాడు మశ్చీంద్ర. తాను ఇంతకాలం పరిశోధిస్తూ వచ్చిన విరుగుడు మందును ఎట్టకేలకు కనుగొన్నాడు. ‘ఇది ఒక చారిత్రాత్మకమైన విజయం. సైన్స్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గది. ఈ ఆవిష్కరణ ప్రపంచ సైన్స్‌ పటంలో భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలదు’ అన ఆనందంగా అనుకొన్నాడు.

శివరామ్‌ తెచ్చే కెమికల్స్‌ అవసరం లేకుండానే తానీ యాంటీడోట్‌ను కనుకున్నాడు. కొద్ది క్షణాలు ఆనందంగా కళ్లు మూసుకుని రిలాక్స్‌ అవుతూ ఉండిపోయాడు. తరువాత లేచి తాను కనుగొన్న యాంటీడోట్‌ (విరుగుడు మందు)ను ఒక రహస్య ప్రదేశంలో దాచి, లాకర్లోంచి తన డైరీ తీసి, తాను కనుగొన్న కొత్త ఆవిష్కరణ గురించి రాయబోయాడు. అంతలో కిర్రుమంటూ లేబ్‌ డోర్‌ తెరుచుకుంది.

“వచ్చావా శివరామ్‌, త్వరగా రా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి” అని డైరీ రాస్తూ ఉన్న మశ్చీంద్ర సమాధానం రాకపోయేసరికి తల ఎత్తి మంకీకేప్‌లోని వ్యక్తి వంక ఆశ్చర్యంగా చూశాడు. వీరమణి తాము వెతుకుతూ ఉన్న డైరీ కళ్ల ఎదురుగా కనిపించేసరికి ఆనందోత్సాహాలతో ఉక్కిరిబిక్కిరౌతూ ఆ డైరీని దౌర్జన్యంగా మశ్చీంద్ర చేతిలోంచి లాక్కోబోయాడు. మశ్చీంద్ర డైరీ వీరమణి చేతికందకుండా జాగ్రత్తపడుతూ, వాడి మంకీకేప్‌ తొలగించడానికి ప్రయత్నించసాగాడు. కానీ బలిష్ఠుడైన వీరమణి బలం ముందు మశ్చీంద్ర బలం ఎంత మాత్రం కొరగాకుండా ఉంది.

***

ఇంటికి తాళం వేసి ఉండడం, లేబ్‌ తలుపు తెరచి ఉండడం, అక్కడ నుండి ఏదో కలకలం, కేకలు వినిపించడంతో అప్పుడే గరివిడి నుండి వచ్చి గేటు బయట కారు పార్కు చేసిన శశికాంత్‌ ఆశ్చర్యపోయాడు.

గబగబా లేబ్‌లోనికి నడిచి వెళ్లాడు. తండ్రి ఎవరో ఆగంతకుడితో పెనుగులాడుతూ ఉండడం గమనించాడు. ఆవేశంతో ముందుకు కదలబోయిన శశికాంత్‌ ఆగిపోయాడు. ఎన్నడూ లేనిది తననేదో పిరికితనం, బేలతనం ఆవహించినట్లైంది. ఒక్క క్షణం అచేతనుడయ్యాడు. జైనోమ్‌ ప్రభావంతో కలిగిన మార్పు అది.

ఇంతలో వీరమణి మశ్చీంద్ర చేతిలోంచి డైరీ లాక్కొని, మశ్చీంద్రను దూరంగా తోసివేసి తాను తెచ్చుకున్న స్టీల్‌ రాడ్‌తో అతని తలపై ఒక్కటిచ్చాడు. మశ్చీంద్ర ‘అమ్మా’ అని బాధగా అరచి, రక్తమోడుతున్న తలను పట్టుకొని కుప్పకూలిపోయాడు.

వీరమణి డైరీ తీసుకొని, మశ్చీంద్రను శాశ్వతంగా అంతం చేయాలని రాడ్‌ను మరొకసారి పైకెత్తాడు. ఇంతలో ‘రేయ్‌’ అన్న అరుపు విని భయభ్రాంతుడయ్యాడు. రాడ్‌ను దూరంగా పడేసి మణి పరుగెత్తబోయాడు. శశికాంత్‌ అతడిని గట్టిగా పట్టుకొని, కదలకుండా చేశాడు. ఆ పెనుగులాటలో వీరమణి జేబులోని పర్సు జారిపడింది. కానీ వీరమణి పశుబలంతో శశికాంత్‌ను దూరంగా నెట్టి లాబ్‌ బయటకు పరుగెత్తాడు. ఇంతలో ‘అమ్మా’ అని బాధగా మూలుగుతూ ఉన్న తండ్రిని చూసి, శశికాంత్‌ ఆయన దగ్గరకు పరుగెత్తాడు. వీరమణి హడావిడిగా బయటకు వచ్చి, ఆ సరికే చేరన్‌ సిద్ధంగా స్టార్ట్‌ చేసి ఉంచిన బైకెక్కి పారిపోయాడు.

అప్పుడే అక్కడకు చేరుకున్న శివరామ్‌ సాయంతో శశికాంత్‌ తండ్రిని తన కారులో దగ్గర్లోని హిమాలయా నర్సింగ్‌ హోంకు తరలించాడు. డాక్టర్లు మశ్చీంద్రను అడ్మిట్‌ చేసుకొని ఎమెర్జన్సీ కేసుగా ట్రీట్మెంటు స్టార్ట్‌ చేశారు.

***

“ఇదిగో నువ్వడిగిన డైరీ, మీరు నాకిస్తానన్న మిగతా నలభైఐదు లక్షలూ ఇవ్వండి. ఈ డైరీలో మశ్చీంద్ర గారి పరిశోధనల గురించి సారాంశం మొత్తం ఉంది” నట్వర్‌ సింగ్‌ చేతికి డైరీ ఇచ్చి చెప్పాడు నాగముత్తు.

నట్వర్‌ సింగ్‌ కాసేపు ఆ డైరీని పరిశీలించాడు. తరువాత దాన్ని టీపాయ్‌పై నిర్లక్ష్యంగా పడేస్తూ “ఏడ్చినట్లే ఉంది” అన్నాడు.

“ఏమిటి నువ్వనేది? మశ్చీంద్ర తన పరిశోధనల గురించి మొత్తం వివరాలు ఆ డైరీలో రాశాడు. ఆ విషయం నాకు తెలుసు. నన్ను మోసం చేయాలని ప్రయత్నించకు” కోపంగా అన్నాడు వీరముత్తు.

నట్వర్‌ సింగ్‌ నవ్వి, “నీ కొడుకు డైరీ తెచ్చిచ్చాడన్న ఆనందంతో హడావిడిగా ఇక్కడకు పరుగెత్తుకొని వచ్చావు. కానీ ఆ డైరీ కనీసం చదివావా? అందులో ముఖ్యమైన కెమికల్స్‌ పేర్లూ, ఫార్ములాలూ కోడ్సు రూపంలో ఉన్నాయి. ఆ కోడ్సేమిటో మాకెలా తెలుస్తుంది? కెయిన్స్‌ ఈ డైరీ తీసుకొని, బాలెన్సు సొమ్ము మీకివ్వడానికి ఎంత మాత్రం ఒప్పుకోడు. అనవసరంగా నన్నిక్కడికి రప్పించావు” అన్నాడు.

రూం బయట వేచి ఉన్నాడు వీరమణి.

నాగముత్తు, వీరమణి కూడబలుక్కున్నారు. “ఈ కోడ్సు సమాచారం మొత్తం మశ్చీంద్ర అసిస్టెంటు శివరామ్‌ అనే వాడికి తెలుసు. వాడిని కిడ్నాప్‌ చేసి తీసుకొస్తాం. ప్రాణాలు తీస్తామని బెదిరిస్తే వాడే ఈ కోడ్ల సమాచారం మొత్తం మనకందిస్తాడు” అన్నాడు వీరమణి, నాగముత్తుతో.

“అలాగే, మిమ్మల్ని మళ్లీ కలుస్తాం నట్వర్‌ జీ” అని నాగముత్తు నట్వర్‌ సింగ్‌కు షేక్‌హేండిచ్చి, కొడుకుతోబాటు అతను బస చేసి ఉన్న హోటల్‌ గదిలోంచి బయటకు వచ్చాడు. ఇంతలో వీరమణి సెల్‌ మోగింది. అవతల అతని ఫ్రెండ్‌ చేరన్‌ లైన్లో ఉన్నాడు.

“అన్నా, కొంప మునిగింది. నీ పర్సు మశ్చీంద్ర ఇంట్లో పోగొట్టుకున్నావు. దాంట్లో నీ డ్రైవింగ్‌ లైసెన్సు, ఎటిఎం కార్డూ ఉన్నాయి. వాటి ఆధారంగా శశికాంత్‌ నువ్వే ఈ దాడి చేసినట్లు పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చాడు. పోలీసులు నీ కోసం మీ ఇంటి దగ్గర కాపు కాశారు. నువ్విప్పుడు ఇంటికి వెళ్లడం ప్రమాదం” ఫోన్లో చెప్పాడు చేరన్‌.

వీరమణికి మతిపోయినట్లైంది. తడబడుతూ చేరన్‌ చెప్పిన విషయాన్ని తండ్రికి చెప్పాడు.

“మరేం కంగారు పడకు, పోలీస్‌ స్టేషన్లో మనకు తెలిసిన సీఐ రామ్మోహన్‌ ఉన్నాడు. దర్యాప్తు డిలే చేయమని అతనికి చెప్తాను. యాభై లక్షలు మన చేతికందగానే మనం ఇక్కడ నుండి ఉడాయించి ఏ ఉత్తరాదిలోనో కొంతకాలం గడిపి వస్తాం. ఈ లోగా కేసు దర్యాప్తు చల్లబడుతుంది” అన్నాడు నాగముత్తు.

“సరే, ఇప్పుడు ఇంటికి వెళ్లడం ప్రమాదం. నగరం పొలిమేరల్లోని కొత్త వలసలో నా ఫ్రెండ్‌ మురుగన్‌ ఇల్లు ఉంది. కొన్ని రోజులు అక్కడ తలదాచుకుందాం” అన్నాడు వీరముత్తు కారు స్టార్ట్‌ చేస్తూ.

(ఇంకా ఉంది)

Exit mobile version